దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/గుంటూరు నివాసము
గుంటూరు నివాసము
అప్పటికి గుంటూరులో నాకు ముఖ్యస్నేహితుడు న్యాపతి హనుమంతరావు అగ్రహారములో కోపల్లెవారి మేడను ముందుగనే కుదిర్చియుంచినందున సామాను లన్నియు నచ్చట చేర్చి, పాతగుంటూరులో మానాయనగారును తమ్ములు నివసించుచున్న పురాతనగృహమునకు చేరితిమి. అచ్చట నొకటి రెండు రోజు లుండి, అగ్రహారములో కాపురముచేయ ప్రారంభించితిమి. గుంటూరులో జిల్లాకోర్టు 1905 సంవత్సరము ఆగష్టులో ప్రారంభింపబడెను. నేను గుంటూరు చేరునప్పటికి పబ్లిక్ ప్రాసిక్యూటరుపని శ్రీ కామరాజు మన్నరుకృష్ణరావుగారికిచ్చివేయబడెను. నేను ఆపనినిమిత్తము వచ్చెదనని నిరీక్షించినట్లును నేను రానందున, మరియొకరి కీయవలసివచ్చినట్టును జిల్లాకోర్టుసిరస్తాదారు నాతో చెప్పిరి. అచటి జడ్జి పర్సీవల్ రైస్. వీరు బందరు జిల్లాకోర్టుజడ్జిగాకూడ నుండిరి. వారును నేను వచ్చెదనేమో యని యోచనచేసియుండవచ్చును. శ్రీమన్నారు కృష్ణరావుగారు ఫస్టుగ్రేడుప్లీడరైనను వంగోలుమునసబుకోర్టులో న్యాయవాదిగా పనిచేయుచు అక్కడ మునిసిపల్ ఛైరుమన్‌గా నుండి ప్రాముఖ్యమువహించెను. వంగోలులో పశువులసంత నేటేట జరుపుచు జిల్లాకలెక్టరులు, బోర్డుమెంబర్లు, గవర్నమెంటు సెక్రటరీలు మొదలగువారి ప్రాపకము సంపాదించెను. వారే చాలకాలము పబ్లికుప్రాసిక్యూటరుగ నుండి దివానుబహద్దరుబిరుదమును సంపాదించి గవర్నమెంటుపక్షపాతి అనిపించుకొనిరి. కాని అసహయోద్యమకాలములో మేము బాధలు పొందుచుండు నప్పుడు సానుభూతి చూపుచు నన్ను కొంత ప్రస్తుతిచేయు చుండెను.
బందరుకోర్టునుండి నేనును శ్రీ ఏకా లక్ష్మీనరసింహము పంతులుగారు మాత్రమే వచ్చితిమి. తెనాలి మునసబుకోర్టు నుండి గోవిందరాజు శ్రీనివాసరావుపంతులుగారును, వంగోలు మునసబుకోర్టునుంచి శ్రీ కొంపల్లి కోటిలింగముపంతులుగారును, శ్రీ గొల్లపూడి రామనాధయ్యగారునువచ్చి, ఈ జిల్లాకోర్టులో న్యాయవాదులుగా చేరిరి. వీరందరిలో నేనే సీనియరును. అనగా జిల్లాకోర్టులో నా కెక్కువ అనభవము కల దన్నమాట. బందరుజిల్లాకోర్టునుంచి ట్రాన్సుఫరుకాబడిన అప్పీళ్లు, అసలువ్యాజ్యములలో హెచ్చుభాగము నేను వకాల్తు పొందిన వగుటచే కోర్టులో హెచ్చుపని నాచేతులలోనే యుండెను. నా నేర్పు కక్షిదారులకు బోధపడుట కెక్కువ అవకాశము కల్గెను. ఆ కేసులు పూర్తిగ పరిష్కారమైనపిదపగూడ నాకుపని పూర్తిగనే లభించుచుండెను. కొలదిసంవత్సరములలో వ్యాజ్యములయు అపీళ్లయు సంఖ్య హెచ్చినకొలది తక్కిన న్యాయవాదులకుగూడ పని హెచ్చెను. అందులో గోవిందరాజు శ్రీనివాసరావుగారి వాదనాసామర్ధ్యము హెచ్చుగ ప్రకటితమగుచుండెను. కొంపల్లి కోటిలింగముగారును ఆయనతో కొంచె మెచ్చుసరి దీటుగ నేర్పరితనము వెల్లడించుచుండెను. శ్రీ గొల్లపూడి రామనాధయ్యగారు నానాట ఉపాయముగ కేసులు రాబట్టుకొనగల్గెను. టౌటులను వినియోగించుకొని వారిద్వారా కేసులు సంపాదించుకొను దురాచారము నానాట ప్రబలుచుండెను. ఇందువలన కొంతవరకు నాకును పని తగ్గుట తటస్థించెను. టౌటులను ప్రోత్సహించుట అవినీతి యని మనస్సున బాధపడుచుంటిని. ఈ ఆచారము వృత్తిపై కొంత అసహ్యమును అయిష్టమును గూడ కల్పించెను. ఈ ఆచారము నెంత నిరసించువాడనైనను కేసు గెలిచినతర్వాతనో, విచారణ పూర్తియైనపిమ్మటనో కక్షిదారుతో వచ్చిన టౌట్లు నాయొద్దకువచ్చి ప్రాధేయపడినపుడు ఏదో కొద్దిగా ఇచ్చుట సంభవించు చుండెను. అట్టి సహాయము ముం దేదైన కేసు తెచ్చి మరల పొందవచ్చునని ప్రోత్సహించుటయే యనుట స్పష్టమే. నా కట్టి యుద్దేశములేదు గాని ఆమాత్రమునకైన లోబడి నాజీవితమున నొక కళంకము ఏర్పరచుకొంటి నని ఖేదము నొందుచుంటిని. చేసినతప్పులు చెప్పిన పోవునందురు గాని దానివలన కలుగు మన:పరితాపము జీవితాంతమువరకును పోవునది కాదనియే తోచుచున్నది. సంపాదించిన ద్రవ్యము కొంత వెనుక వేసుకొని వృద్ధిచేయవలెనను ఆశ నాకు పొడమెను. కాని వచ్చినఫీజు లెక్క శ్రద్ధతో పరీక్షించు అభ్యాసము నాకు లేదయ్యెను. గుమస్తా చెప్పిన లెక్కనే నమ్ముచుంటిని. లభించిన సొమ్ములో నుంచి అడిగినవారికి వడ్డీ కిచ్చి ప్రామిసరీనోట్లను, తాకట్టు పత్రములును వ్రాయించుకొనుచుంటిని. మా తండ్రిగారు చేయుచున్న పద్ధతియే నాకును పట్టుబడినది. అది నాకు తప్పుగా తోచలేదు. వాడుకలో నున్న రూపాయివడ్డీనే పుచ్చుకొనుచుంటిని. బిడుగోలుషరతులు పెట్టి కాంపౌండువడ్డీ కిచ్చు పద్ధతి నేను అవలంబించలేదు. దావాలు వేయకుండనే నాసొమ్మును రాబట్టుకొనుచుంటిని. ముస్లిము లొకరికి రు 3000 అప్పిచ్చితిని. వడ్డీతో నది ఆరువే లైనందున ఆమొత్తము చెల్లించలేక వారికి ఈయూరిలో నున్న పదునేడు యకరములమెట్ట పొలమును, ఫిరంగిపురములో పదియకరముల పొలమునునాకు దఖలువ్రాసి రిజిష్టరుచేసి యిచ్చిరి. ఈపొలములో కొంతభాగము వారి తల్లులది, చెల్లెండ్రది యగుటచే వారికిని కొంత సొమ్మిచ్చి ప్రత్యేకముగ దస్తావేజులు రిజిష్టరు చేయించుకొంటిని. వారు ఈభూములు నాకు అమ్ముటచే జీవనాధారము లేక మిక్కిలి బాధచెందిరి. అప్పుడప్పుడు నాయొద్దకు వచ్చి సహాయము కోరుచుండిరి. ఏదియో స్వల్పముగ సాయముచేయుచుంటినిగాని వారు కష్టములపాలైనా రను బాధమాత్రము బాధించుచుండెను. కాని వారు జాగ్రత్తగ ప్రవర్తించుచు మితవ్యయములు చేయకుంటయు, సకాలముననే పలుమార్లు చెప్పినను బాకీ చెల్లింపకుంటయు వారిదే తప్పు అని సమాధానపరచుకొంటిని. వీరితో జరిపిన వ్యాపారము ఇప్పటికి నా మనోవ్యధ కొక కారణముగనే యున్నది.
నేను అగ్రహారములో ప్రత్యేకముగ కాపురము పెట్టిన పిమ్మట అప్పుడప్పుడు పాతగుంటూరు పోయి మాతండ్రిగారిని తమ్ములుమొదలగువారిని చూచివచ్చుచుంటిని. పూర్వార్జితమగు 15 యకరముల గుంటూరి మెట్టయీనాముభూమిగాక ఆసమీపముననే ఏడుయకరముల మెట్టశేరీభూమియును మరి నాలుగెకరముల శేరీమెట్టయును, వేజెండ్లగ్రామములో పదియకరముల మెట్టఈనాముభూమియును మాతండ్రిగారు సంపాదించిరి. వేజెండ్లభూమిని కవులుకిచ్చి మక్తా వసూలుచేసుకొనుచు, నేను బందరులో నున్నపుడు వేసవిసెలవులలో కొంతకాలము గుంటూరులో నాసంసారముతో ఉండిపోవుచుంటినే గాని ఈఅయివేజునుండి నేనేమియు తీసికొనియుండలేదు. మా తండ్రిగారికి నేను ఏమియు ఇచ్చియుండను లేదు. బందరులో నాసంపాదన నాకుటుంబవ్యయములకును ప్రయాణములు మొదలగువానికిని, ఇన్సూరెన్సు పాలిసీక్రింద చెల్లించుటకును సరిపోవుచుండెనేగాని హెచ్చుగా నిల్వయుండలేదు. మాతండ్రిగారేమైన తమకు పంపుమనికోరినను పంపలేకుంటిని. నాకుగాని నా భార్యకుగాని పొదుపుచేతగాదని మానాయనగారు చెప్పుచుండెడివారు. అది చాలవరకు నిజమే. గుంటూరు వచ్చిన పిమ్మట జాయింటు లేక ఒక్కడనే వ్యవహరించుటచే కొంత హెచ్చుగా ఆదాయము లభించినది.
తండ్రిగారు కుటుంబభారము వహించుచుండుటయు తమ్ములు ఏ జోక్యము పుచ్చుకొనక తిని కూర్చుండుటయు నామనస్సుకు కొంత కించ కల్పించుచుండెను. ఒకనాడు మధ్యాహ్నము కోర్టులో నాపనిపూర్తియైనపిమ్మట పాతగుంటూరుకు మావాండ్రను చూచిరావలె నను కోర్కె పుట్టి పోతిని. పోవునప్పటికి మాతమ్ములు మొదలగువారు భోజనములు చేసి నిదురించుచుండిరి. వంటయింటిలో మాతండ్రిగారుభోజనము చేయుచుండిరి. అప్పటికి మూడుగంటలై నందున ఇంత ఆలస్యముగ భోజనముచేయుచున్నా రేమని ప్రశ్నించితిని. వారు మారుపలుకకుండిరి. ఇంత ప్రొద్దుపోయిన దేమని మామేనత్తగారి నడిగితిని. "ఏమని చెప్పను, ఎంత పెద్దవాడైనను ఆయనబాధ తప్పించెడివారెవ్వరును లేరు, పొలములో ధాన్యము కైలు చేయించుటకు ప్రొద్దుటనే పోయి ఇప్పుడే వచ్చె"నని ఆమె కండ్ల నీరుగార్చుచు చెప్పెను. నాకు దు:ఖము పట్టరాకుండెను. మా తమ్ములమీద కోపమును అధికమయ్యెను. అందరు తిని, పోతరించి యధేచ్ఛగ ప్రవర్తించుటేగాని పెద్దలైన తండ్రిగారి కష్టము గనిపెట్టకపోవుట అన్యాయమని గట్టిగ పలికి పిమ్మట మానాయనగారితో నిట్లంటిని. "ఇంకను మీ రిట్టి కష్టములు పడుట నేను సహింపలేను. రేపటినుంచి మీరు పెద్దలు ఉభయులును నాయొద్దకు వచ్చి నాపోషణలో నుండి, నాచేత సేవగొనుచుండవలెను. ఆప్రకారము మీరు చేయనియెడల నేను నావృత్తినైన మానుకొని ఇక్కడనే ఉండెదను. మీరు రేపు నాయొద్దకు రానియెడల మరల రేపు తప్పక వచ్చెదను. నాశపధమును నేను తప్ప"నని నాదు:ఖార్తిని వెలిబుచ్చితిని. వారు మారుపలకక ఊరకుండిరి. నేను మీరు తప్పక రావలయునని మరి రెండుమారులు స్పష్టముగ చెప్పి సాయంకాలమునకు అగ్రహారమునకు చేరితిని. మరునా డుదయమున మాతండ్రిగారు మాత్రము నాయొద్దకు వచ్చిరి. మా మేనత్తగారు రాలేదు. అప్పటినుండి మాతండ్రిగారు ప్రతిదినము ఉదయమున స్నానసంధ్యాదికములు తీర్చుకొని నా భోజనవేళకువచ్చి నాతో గూడ భోజనముచేయుచుండిరి. మధ్యాహ్నము కొంతవడి విశ్రమించి, చల్లబడినపిదప పాతగుంటూరు నడచిపోయి మరల సాయంకాలము ప్రొద్దు గ్రుకునప్పటికి అగ్రహారము వచ్చి, భోజనమైనపిమ్మట అప్పుడు మాయింటిలో నున్న దూరపు బంధువు మద్దులూరి చెన్నకృష్ణమ్మగారిని తోడుతీసుకొని చీకటిలోనైనను కాలినడకనే పాతగుంటూరు పోవుచుండిరి. చెన్నకృష్ణమ్మగారుమాత్రము ఉదయముననే తిరిగి వచ్చుచుండెను. ఈ చెన్నకృష్ణమ్మగారు మా అత్తవారింటిలో కొంతకాలము మగదిక్కుగా నుండిరి. మేము బందరులో నుండగా మాతోడనే యుండి, వంటమొదలగుపనులలో పాల్గొనుచు మాకు మిక్కిలి సహకారిగానుండెను. కొన్నిసంవత్సరములు హైదరాబాదులో తమ్మునియొద్ద నుండెనుగాని అచ్చట తనకు సుఖముగ జరుగక కాబోలు మరల నాయొద్దకే వచ్చిచేరెను. ఈయన వంటలో కడునేర్పరి. అత్యంతభోజనప్రియుడు, బలశాలి. దూరమునుండి గుండిగతో నీళ్ళు నెత్తిపై నిడుకొని వచ్చెడివాడు. తనకు తగినట్లు భోజనముకుదిరినయెడల దానితో సంతుష్టిచెందెడివాడు. కాని, ఆయనను సామాన్యులు భరింపజాలరు. ఆయనకు షడ్రసోపేతముగను సంతుష్టిగను భోజనవసతి జరిగెడిచోటనే గాని మరొకచో నుండజాలడు. ఆయన చనిపోవువరకు మా యింటనే ఇరువదిసంవత్సరములకాలము మమ్ములను కనిపెట్టుకొనియుండెను. ఆయన ఇంచుక స్థూలశరీరి. వైష్ణవనామములు ముఖమునమాత్రమేగాక రెక్కలమీదను ఎదురురొమ్ముమీదను నిండుగ ధరించుచుండెను. శ్రీవైష్ణవుడని, హెచ్చుగా వైష్ణవ ప్రతిపత్తిగలవాడని తెలియనివా రనుకొనుచుండిరి. దేవతార్చన మంత్రములు, మంత్రపుష్పమును వల్లించుటేగాని ఇతర విద్యాగంధ మాయన కావంతయు లేదు. వ్రాయను చదువనుగూడ అంతగా తెలియదు. వ్యవహారజ్ఞానమైనను శూన్యమే. అంతటివాడు గనుకనే మాయింట అంతకాల ముండుట తటస్థించెను. ఇంటికి కావలసిన బజారువస్తువు లాయనయే తెచ్చుచు చుండెడివాడు. ఆయన చేసినదే బేరముగాన అందువలన నష్టముగనే యుండెను. మరియెవ్వరును లేనందున ఆయనవల్లనే నడుపుకొన వలసివచ్చెను.
స్వదేశోద్యమం
మాపరిస్థితు లిట్లుండగా ఈమధ్యకాలములో దేశమున గొప్ప రాజకీయసంచలనము సంప్రాప్తమయ్యెను. బంగాళారాష్ట్ర విభజనవలన బంగాళములోనేగాక ఆసేతుహిమాచలము ప్రభుత్వమునెడ విరక్తి ప్రబలిపోయెను. కాంగ్రెసుమహాసభలో ఈవిభజనను ఖండించుటేగాక విదేశవస్తువులను బహిష్కరించి దేశములో నుత్పన్నమైన వస్తువులనేమాత్రమే స్వీకరించవలెనను తీవ్రదీక్ష వహించవలెనని కాంగ్రెసునాయకులు దేశమం దంతట నుపన్యాసముల గావించుచుండిరి. స్వదేశిఉద్యమము భారతదేశమం దంతట సాగుటవలన విదేశవస్త్రముల అమ్మకము పడిపోయెను. సీమలో పాటకజనుల జీవనోపాయమునకు భంగము కలిగెను. బొంబాయి, అహమ్మదాబాదు మిల్లులలో నేయబడిన వస్త్రములు వాడుకలోనికి వచ్చెను. చేమగ్గములవారికిగూడ పనులు హెచ్చెను. కత్తులు, చాకులు, గాజుసామాన్లు సబ్బులు మొదలగునవి మనదేశములోనే తయారుచేయుటకు కర్మాగార