Jump to content

దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/బందరు నుండి వీడ్కోలు

వికీసోర్స్ నుండి

వ్రాయుట వారికి విహితమగు నియమపద్ధతి నతిక్రమించియున్నను డిప్యూటీమాజస్ట్రేటు పండిత నాగేశ్వరరావుగారు ఆప్లీడర్లువ్రాసినట్లు "నిరంకుశముగను, ద్రోహబుద్ధితోడను ప్రవర్తించినా"డనుట నిశ్చయము గాన ఇట్టి సందర్భములో ప్లీడర్లపై ఎట్టి చర్యను జరుపనవసరములేదు. వారిపై మాజస్ట్రేటు వేసిన ఉత్తరువును రద్దుపరచితి"మనిరి. మరియు ఆసామికి చోరీనేరముక్రింద వేసినశిక్ష రద్దుపరచి, ప్లీడర్లమీద న్యాయవాది చట్టముక్రింద విచారణ చేయనక్కరలేదు అని తీర్పుచెప్పిరి.


బందరు నుండి వీడ్కోలు

ఈ నాగేశ్వరరావుగారితో సంబంధించిన వ్యవహారమునకు ముందే నామిత్రులు చన్నాప్రగడ భానుమూర్తిగారును, నేనును ఒకయింటిలోనే కాపుర ముండుట తటస్థించెను. ఈ కారణమున మామైత్రి గాడమాయెను. మాఆడవారికి, వారి ఆడవారికిగూడ స్నేహమయ్యెను. వల్లూరి సూర్యనారాయణరావుగారును ఆ సమీపముననే కాపురముండిరిగాన వారి కుటుంబముతోగూడ మావాండ్లకు మైత్రికుదిరెను. వేసవిసెలవులలో నాకును భానుమూర్తిగారికిగూడ తీరికయే. ప్రతిదినము ఉదయమున ఆయన యింటిపెరటిలో పాదులు త్రవ్వి, అరటిమొక్కలును, పూల మొక్కలును నాటి, నీళ్లుపోసి పెంచుచుండెడివారు. గొడ్డలితో కట్టెలు చీల్చుచుండెడివారు. చెట్లెక్కి దిగుచుండెడివారు. స్వత: బలిష్ఠకాయులు గాన అట్టి వ్యాయామము వారు చేయగలిగి యుండిరి. నేను అంతటి బలువగు వ్యాయామముచేయలేక అరటి మొక్కలువేసి, బావినుండి నీళ్లు తోడి పోయుచుంటిని. అక్కడి బావులు వరలబావు లగుటచే నీళ్లుతోడుట సుకరముగా నుండెను.

మేమిట్లు వ్యాయామములు చేయుచు, జీవితాదర్శములను గూర్చి సంభాషణలు సలుపుకొనుచు నుండెడివారము. సెలవుదినములలో పల్లెగ్రామములకు బోయి మనదేశపు బూర్వౌన్నత్యముచు, ఇప్పటి దుస్థితులనుగూర్చి ప్రజలను ప్రబోధించుట యుచిత మని యెంచి, యొకదినము బయలుదేరి, బందరు తాలూకా పడమటిగ్రామములలోగుండా గుడివాడతాలూకాలోని కొన్నిగ్రామములుగూడ సంచారముచేసి, కొన్నిదినములకు ఇల్లుచేరితిమి. ఈ గ్రామములలో ఏ సత్రములోనో బసచేయుచు మా భోజనపదార్థములు మేమే కొనితెచ్చి వంటచేసికొని తినుచుంటిమి. భానుమూర్తిగారే వంటచేయుచుండిరి. ఎవ్వరైన పిలిచినయెడల అచ్చటను అప్పుడప్పుడు భుజించుచుంటిమి. మా యుపన్యాసములలో పూర్వమున మనదేశమున నుండెడి శాస్త్రపరిజ్ఞానము, సత్యశీలము, ఔదార్యాది గుణసంపత్తి, గ్రామ కట్టుబాటులు, ఆర్థికసంపత్తి, వృత్తులు, దూరదేశములతో వర్తకవ్యాపారములు, శిల్పనైపుణ్యమును వర్ణించి, ఇప్పటి దాస్యము, విద్యావిహీనత, అజ్ఞానము, దారిద్ర్యము మొదలగు విషయములనుగూర్చి వివరించుచుండ స్త్రీపురుషులు మిక్కిలి శ్రద్ధాళువులై వినుచుండిరి. వారి కుతూహలమును చూచి మాకును ఉత్సాహముగ నుండెను. మేము భోజనముచేసిన బ్రాహ్మణగృహములు శుచిత్వము, దేవపూజ మొదలగు సదాచారములచే సంపన్నములుగ నుండెను. వేదాధ్యయనపరత్వము గాని, శాస్త్రపరిజ్ఞానముగాని ఎచ్చటను మాకు గానుపించలేదు. సామాన్యశ్రౌతస్మార్తకర్మపరులును, పూర్వాచారపరులు మాత్రము కనబడుచుండిరి. ఇందు స్త్రీలు విద్యావ్యాసంగము లేనివా రయ్యు గృహకృత్య నిర్వహణమున నిపుణులుగనే యుండిరి. ముఖ్యముగ కొన్ని బ్రాహ్మణగృహములలో వితంతులైన యువతులు చేయుసేవయు, వారి వైరాగ్యమును శ్లాఘ్యముగ నుండెను.

ఇట్లెందరో వైధవ్యమును పొందిన యువతులు పుట్టినింటనో అత్తవారింటనో నిర్బంధముగ సేవాపరత్వముచే జీవితము గడపుచుండిరిగదాయని సంతాపము చెందితిమి. వారిలో బుద్ధి పూర్వముగ విరక్తలై సేవాపర లగువారు అరుదుగానుందురని యూహించితిమి. అట్టివారికి విద్యనేర్పుటకు విద్యాశాలలును, శరణాలయములును, దేశమున స్థాపించుట యవసరమని తలంచితిమి. మేము చేసిన ఉపన్యాసములధోరణి వినినపిమ్మట భానుమూర్తిగారి ఇంటిలోని ఆడవారు ప్రభుత్వాధికారులవలన ఏమి యొత్తిడికలుగునో యని భయముచెందిరని నాకు దెలియవచ్చినది. మరల సంచారము సల్పుట మాత్రము కలుగలేదు.

ఇంతలో కృష్ణాజిల్లాలోనుండి కృష్ణానదికి దక్షిణభాగమున నున్న గుంటూరుభాగమును విడదీసి, నెల్లూరుజిల్లాలో చేరియున్న వంగోలుతాలూకాను కలిపి, ప్రత్యేకజిల్లాగా చేయుట తటస్థించెను. ఆ జిల్లాకు గుంటూరు ముఖ్యపట్టణమై అందు కలెక్టరుకచ్చేరి, జిల్లాకోర్టు నేర్పడెను. అంతట నా జన్మస్థానమగు గుంటూరులోనే నా వృత్తిని గడపవలెనని తలచితిని. భానుమూర్తి గారి నెడబాయవలసివచ్చెను. ఇరువురము ఒకనాడు ముచ్చటించుకొనుచు మన జీవితము లెప్పుడును కుటుంబపోషణకార్యములందే వినియోగించుటయా, లేక మరి ఏదైన పరోపకారముచే ధన్యతజెందుటయా యనిచర్చించుకొంటిమి. కుటుంబార్థము కొంత సొమ్ము నిలవచేయుటకై పదిసంవత్సరము లీ నృత్తులందే గడిపి, ఆ గడువు ముగిసినతోడనే వృత్తివిసర్జనముచేసి అప్పటికి యుక్తమని తోచిన దేశసేవాకార్యమునందు ఉభయులము కలిసి పనిచేయవలెనని తీరుమానించుకొంటిమి. నామిత్రుడు హనుమంతరావు బందరులోనే స్థిరవాసముచేయు నుద్దేశముతో ఊరివెలుపల విశాలావరణ గల పాతబంగళా నొకదానిని పదమూడువేలకు గొని అందు ప్రవేశింపవలె నను సన్నాహములో నుండెను. ఆయనకు చల్లపల్లి జమీందారుగారి దివాను శ్రీ కోపల్లె కృష్ణారావుపంతులుగారి అభిమానమువలన చల్లపల్లివారి ఫైలు లభించుననియు, పబ్లిక్‌ప్రాసిక్యూటరు పనికిగూడ ప్రయత్నముచేయవలెననియు ఉద్దేశము గలిగెను. ఈ ప్రయత్నములగూర్చి హనుమంతరావు నాతో ముచ్చటించలేదు. ఇతరులవలనమాత్రమే నేను వింటిని. అదిగాక మేము కలిసి పనిచేయుచుండగనే చల్లపల్లివారికేసులు కొన్ని తాను పుచ్చుకొని పనిచేసెను. ఆ కేసులవృత్తాంతముగాని ఫీజుగాని నాకు దెలుపలేదు. ఆ మొత్తములు జాయింటులెక్కలో జమపడలేదు. కొంతవరకు నా కీవిషయము తెలిసినను సాటి మర్ధ్వులైన కృష్ణరావుగారి అభిమానముచే లభించిన పనియగుటవలన ఆ కేసులలో వచ్చిన ఫీజులో నాకు భాగము రాకపోవుట సహజమేయని సమాధాన పరచుకొంటిని. ఇదిగాక కొలదికాలములో గుంటూరునకు పోదలచిన నేను ఈవిషయమై వివాదముపెట్టుకొనుట సరికాదనియు తలచితిని. నాకంటె హనుమంతరావు తెలివిగలవాడనుట నిశ్చయమే. నేనును జాగ్రత్తగనే పనిచేయుచు కక్షిదారులయు న్యాయమూర్తులయు అభిమానమును కొంత సంపాదించుకొంటిని. ఏది యెట్లున్నను మా ఇర్వుర చిరకాలస్నేహబంధము మహాభాగ్యముగ నేను తలంచి దానికి భంగముకలుగు మాటలుగాని చర్యలుగాని జరుపకుండ ప్రవర్తించుచుంటిని. మేము జాయింటుగా పనిచేయుకాలములో నేను పరగ్రామమున నుండవలసివచ్చినపుడుసహితము ఆయన యొక్కడే పనిచేసి ఆర్జించినసొమ్ములో నేను సగభాగము తీసికొన్నను ఆక్షేపించలేదు. ఆయన బాపట్లలో డిస్ట్రిక్టుమునసబుపని ఒకమాసమో రెండుమాసములో చూచుచున్నపుడు నే నొక్కడనే పనిచేసినప్పుడు వచ్చిన ఫీజులో ఆయనభాగము తీసికొనెను. నేను సాంఘికములు, రాజకీయములునగు కార్యములలో నెక్కువ ప్రవేశించుచుంటిని. హనుమంతరావు అనివార్యమైనపుడు తప్ప అట్టి పనులలో జోక్యముకల్గించుకొనువాడు గాడు. అట్లయ్యు నా ఈ అన్యవ్యాపృతి నాయన ఆక్షేపించియుండలేదు.

నేను అధ్యక్షుడుగ, వక్తగ నుండిన సభలలో ఆంగ్లేయభాషలోనే ప్రసగించుచుంటిని. ఉత్సాహము హెచ్చుగా నున్నపుడు ఇంగ్లీషులోఉపన్యాసము పలువుర నాకర్షించునట్లు చేయగలిగినను సామాన్యముగ నా ప్రసంగము లంత సౌష్టవముగ, హృద్యముగ నుండెడివికావు. నాతో సమానులును నాకంటె కొంత వెనుక బడినవారు నుండెడిసభలో కొంత పటుత్వముగ భాషణచేయు చుంటిని గాని నాకంటె పెద్దలున్న సభలలో సభాకంపము నన్నుబాధించుచుండెను. పిమ్మటికాలములో కాంగ్రెస్‌సభలలో ఇట్టి మనోదౌర్బల్యముచేతనే ఇంగ్లీషునం దుపన్యసించుట మానవలసివచ్చెను. నేను కాంగ్రెస్‌నాయకులలో తగినంత ప్రాధాన్యము వహించకపోవుటకును ఇది యొక గొప్పకారణము. ఒక కాంగ్రెసు మహాసభలో తెంపుచేసి భాషణచేయవలెనని యూహించుకొని ఏదో తీరుమానమునుగూర్చి మాట్లాడుటకునాపేరు ఈయబోగా శ్రీ చక్తవర్తుల రాజగోపాలాచార్యులుగారు అంత మహాసభలో మన మాటలు వినబడవు గనుక అందుకు ప్రయత్నించవలదని నాకు సలహా నిచ్చెను. అప్పటినుండి ఆప్రయత్నమే మానివేసితిని. విషయనిర్ణయసభలోమాత్రము అపుడపుడు మాట్లాడుచుంటిని. అఖిలభారతకాంగ్రెసుకార్యనిర్వాహకసభలో సభ్యుడుగా నున్నపుడుగాని అధ్యక్షుడుగా నున్నపుడుగాని నేను చాల మితభాషినని పేరుపొందితిని. ఇందుకు పైన చెప్పిన సభాకంపమే కారణము.

బందరులో నున్న పదునొకండు సంవత్సరములకాలము చక్కగనే గడచిపోయినది. కుటుంబములో పిల్లలను కోల్పోయిన దు:ఖముతప్ప తక్కినవిషయములలో నుత్సాహముతో నా యౌవనమునందు ప్రధానమైన ఘట్టము గడచిపోయినది. అచ్చటి స్నేహితులతో కలసిమెలసి ప్రవర్తించుటవలన కలిగిన యనుభవములు పిమ్మటికాలములో చాల నుపయుక్తముగ పరిణమించిన వనుటకు సందియములేదు. అప్పుడచ్చట ఆంగ్లేయవిద్యాధికులలో ముఖ్యముగా యువకులగు న్యాయవాదులలో దేశహితైక కార్యములందు అభిమానము, సాంఘికరాజకీయములందు చొరవయు నెక్కువగ నుండెను. నీతిబద్ధమైన జీవితాదర్శములు వారిహృదయముల నాకర్షించుచుండెను. ఈ పరిస్థితికి వెంకటరత్నంనాయుడుగారి జీవితమును, నీతిబోధయు ముఖ్యకారణములై యుండెను. సంఘములో నొక వ్యక్తి యేనియు నీతివర్తనుడైనచో దాని ప్రభావ మూరక పోదనుట కిదియే తార్కాణము.

కాబట్టి నేను గుంటూరున నా వృత్తి కార్యము వ్యవహరింప వచ్చునాటికి నా యౌవనము కొంతగడచెను. జీవితాదర్శమునుగూర్చి కొంతనిశ్చయమేర్పడెను. పదిసంవత్సరములతో నా వృత్తికి స్వస్తిచెప్పి ఏదైన దేశహితకార్యమును చేపట్టవలయునను కృతనిశ్చయముతో వచ్చితినిగాని సంపాదనచేసి సౌఖ్యముపొందవలె నను ఆశయముతో రాలేదు. అట్లని సంపాద్య విషయమున వైరాగ్యమును కలుగలేదు. న్యాయముగ సంపాదన చేయవలయు నను కాంక్ష పూర్తిగనే యుండెను. కనుకనే గుంటూరుజిల్లాకోర్టులో పబ్లికుప్రాసిక్యూటరుపని సంపాదింపవలెనని ఆశించితిని. ఆ పనినిమిత్తము బందరుజిల్లాజడ్జిగారి సహాయము కోరతలంచి కోర్టులో వారి ప్రైవేటుగది కేగితిని. నాకును ఆజడ్జిగారికిని కొలదిరోజుల క్రితమే పైనచెప్పిన సంఘర్షణ జరిగియుండెను. గాన కొంత సంశయించుచునే లోపలి కేగి వారిసహాయ మర్థించితిని. సిఫారసు ఉత్తరము కావలెనా యని దయతోడను శాంతముతోడను నన్ను వారు ప్రశ్నించిరి. సిఫారసు అక్కరలేదుగాని యోగ్యతాపత్రము వ్రాసి యిండని కోరితిని. సిఫారసుకోరుట వంచనము, ఆత్మగౌరవభంగము నని తలంచితిని. ఆయనకు నన్నుగూర్చిన అనుభవము ఉన్నదున్నట్లు వ్రాయవచ్చును గనుక యోగ్యతాపత్రము కోరుటయే యుక్తమని తలంచితిని. జడ్జిగారు మరునాడు ఉదయము తన బంగాళాకు రావలసినదని చెప్పిరి. బెజవాడకు కాలువమీద పోవుటకు పడవ నొకదాని నేర్పాటుచేసుకొని నా సామానులు భద్రముగ నెక్కించుట కేర్పాటులు చేసుకొని నామిత్రుడు హనుమంతరావు వద్దను, సోదరన్యాయవాదులవద్దను సెలవుపుచ్చుకొంటిని. శ్రీ జంధ్యాలగౌరినాధశాస్త్రిగారు తమగుంటూరుజిల్లా కక్షిదారుల రికార్డును నాకు దయతో నిచ్చివేసి, పార్టీలకుగూడ ఉత్తరములు వ్రాసి, నాకు వకాల్తనామా వారిచే నిప్పించిరి. తమ కెదురు పక్షముననుండి వాదించినకేసులలో నేను తృప్తికరముగ పనిచేసి యుంటిననియు, సాక్ష్యమును క్రాసుప్రశ్నలు వేయుటలో హనుమంతరావుకంటె నిపుణత్వము జూపితిననియు, గుంటూరులో త్వరలో వృద్ధికిరాగలననియు పలికి నన్ను ఉత్సాహవచనములతో బహూకరించి వీడ్కొలిపెను. శ్రీ పురాణము వెంకటప్పయ్య పంతులుగారు అక్కడి న్యాయవాదులలో మిక్కిలి పేరుపొందినవారు. ఆయనవద్ద సెలవుగైకొనబోగా "మీయొద్ద స్వతంత్ర కార్యాచరణశక్తియు, ధైర్యమును, ఉత్సాహము నున్నవి. కాన ముందుకాలమందు పేరుప్రతిష్ఠ లెక్కువగా పొందగల"రని నన్ను దీవించి తమయొద్ద నున్న గుంటూరుకక్షిదారుల అప్పీళ్ళు రికార్డులు నొకటిరెందు నా కిచ్చిపంపిరి. మునసబుకోర్టుప్లీడర్లలో నాకు బ్రియమిత్రులు సాధువర్తనులును, సత్యప్రియులు నగు శ్రీ కట్టమూడి చిదంబరరావుపంతులుగారిని వదలివచ్చుట కష్టముగనుండెను. స్నేహపాత్రులైన కొండూరి లక్ష్మీనారా యణగారి నుండియు సెలవుపుచ్చుకొంటిని. నా ముఖ్యమిత్రుడు హనుమంతరావుతోడి చెలిమిమాత్రము గ్రామములువేరైనను శాశ్వతముగ నుండగలదను ధైర్యముచే గాబోలు ఆయనను విడచుట కష్టముగ తోచలేదు.

మరునాడు యోగ్యతాపత్రమునిమిత్తము ఎనిమిదిగంటలకు జడ్జిగారి బంగాళాకు పోతిని. ప్రయాణపుటేర్పాటులలో నుండుటచే కొన్ని నిముషము లాలస్యముగ చేరితిని. అంతకు ముందే ఆయన క్లబ్బుకు పోయెనట. కొంచెము వేచియుండి ఇంకను ఆలస్యము చేయునెడల ప్రయాణము సకాలములో సాగదని తలంచి మరలిపోవుటకు పదియడుగులు వేయునప్పటికి మరియొకదారిని జడ్జిగారు వచ్చుచుండుట కనపడెను. అంతట నేను బంగళామెట్లయొద్దకు వచ్చునప్పటికి త్వరత్వరగ ఆయన మెట్లెక్కి లోని కేగెను. నన్ను చూచియు నిలువకుండ పోయినందున ప్రయోజన ముండదని తలంచి ఇంటికి పోవలెననుకొనుచుండగనే ఉత్తరమును చేతబట్టుకొని మెట్లుదిగివచ్చి నాకు ఉత్తరము నిచ్చి నాచేయి పట్టుకొని యాడించుచు "ఇచ్చట నడిపినట్లే వృత్తిని శ్లాఘ్యముగ నడపి జయమందుము" అని హితవచనములు బలికెను. నేను కృతజ్ఞాత తెలిపి వీడ్కొంటిని.


____________