దివ్యదేశ వైభవ ప్రకాశికా/తిరుమణిక్కూడమ్
37. తిరుమణిక్కూడమ్ 37 (తిరునాంగూర్ తిరుపతి)
శ్లో. దివ్యేమణిక్కూడ పురేస్థితస్సన్ చంద్రాబ్జినీ స్వర్ణ విమాన రమ్యే|
ఆలింగ్యదేవీం తిరుమామకళ్ పృథాం శ్రీమాన్ మణిక్కూడ ప్రభుర్విరాజతే||
శ్లో. గరుడేంద్ర తపోలబ్ద శక్ర దిజ్ముఖ సుందర:|
పరకాల వచో హర్య శిఖరే ముదిరాయతే||
వివ: మణిక్కూడ నాయకన్-తిరుమామగళ్ తాయార్-చంద్ర పుష్కరిణి-స్వర్ణ విమానము-తూర్పు ముఖము-నిలుచున్న సేవ-గరుత్మంతునకు చంద్రునకు ప్రత్యక్షము-తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.
మార్గము: తిరునాంగూర్ నుండి 1 కి.మీ తూర్పున గలదు. వసతులు లేవు.
పా. తూమ్బుడై ప్పనై క్కైవేழమ్ తుయర్ కెడుత్తరుళి; మన్ను
కామ్బుడై కున్ఱమేన్ది క్కడు మழை కాత్త వెన్దై;
పూమ్బునల్ పొన్నిముత్తుమ్ పుగన్దు పొన్ వరణ్డ;ఎజ్గుమ్
తేమ్బొழிల్ కమழு నాజ్గూర్ తిరుమణి క్కూడత్తావే.
తిరుమంగై ఆళ్వార్-పెరియ తిరుమొழி 4-5-1
ప్రపన్నుడు
మంచిమాటఒకనాడు కొందఱు భక్తులు తిరుపతి యాత్రకు పోవుచుండిరి. దారిలో వారు ఒక అరణ్యమున నదిలో స్నానము చేయు చుండిరి. వారిలో ఒక ప్రపన్నుని పాముకరిచెను. తక్కిన భక్తులు వాని చుట్టును చేరి "ఏది! పాము ఎచ్చట కరిచెను?" అని ప్రశ్నింపసాగిరి. దానికా ప్రపన్నుడు "అదిగో! ఆచెట్టును కరిచినది" అని సమధానమిచ్చెను. అది విని భక్తులందరు సిగ్గుపడి తొలగిరి.
క్రమముగా వారందరు తిరుమలచేరి "అనంతాళ్వాను" వారిని సేవించిరి. మార్గములో ప్రపన్నుని పాము కరిచిన వార్తయు వారికి తెలిసెను. వారు ఆప్రపన్నుని చూచి "పాము విషము పోవుటకై మీరేల చికిత్స చేయించుకొనలేదు?" అని అడిగిరి. అందులకు ఆ ప్రపన్నుడిట్లు సమాధానమిచ్చెను.
"కరచిన పాము బలము గలదైనచో విరజానదిలో తీర్థమాడి పరమపదనాథుని సేవించెదను. కరవబడిన పాము (ఆయుర్దాయము) బలమైనదైనచో స్వామి పుష్కరిణిలో తీర్థమాడి శ్రీనివాసుని సేవించెదను."
ఆ సమాధానము విని అనంతాళ్వాన్ మిక్కిలి సంతోషించిరి.