దశావతారచరిత్రము/7. శ్రీరామావతారకథ

వికీసోర్స్ నుండి

7. శ్రీరామావతారకథ

సప్తమాశ్వాసము



యుతధామ దిశాక్షౌ
మాయత సితకీర్తిధామ మగదలకులధౌ
రేయ భుజావిక్రమ గౌ
రేయ సుధీ గేయ సత్యకృష్ణామాత్యా.

1


తే.

అవధరింపుము జనమేజయక్షితీశ, శేఖరున కిట్టులను వ్యాసశిష్యమౌని
ధరణినాయక రామావతార మిఁకను, దెలియఁ జెప్పెద వినుమని తెలుపఁదొడఁగె.

2


సీ.

హారిబింబరమావిహారకేళీశ్రాంతి హారికేతనమనోహారిరథము
గంధనాగధుతాభ్రగంధవతీజాత గంధప్రసూనసగంధపదము
వాహనైకగతిప్రవాహ పాంసులగంధవాహధూసరితాంబువాహఘటము
వీరరసోన్నిద్రవీరభద్ర హసద్గవీరమాహవ మహావీరభటము


తే.

ధర్మపరధర్మసాధర్మ్యభర్మవిశ్వ, కర్మనిర్మితశర్మదనర్మహర్మ్య
నిర్మలాభోర్మిదృశిధాతుకర్మితాచ్యు, తాభ్రమధ్యాపురం బయోధ్యాపురంబు.

3


క.

ఆపుర మేలున్ దశరథ, భూపాలకుఁ డాజివిజయభుజభుజగమహా
చాపాహితరోపాహృత, కోపావృతవిమతనృపతికులపాలకుఁ డై.

4


చ.

అతఁ డొకనాఁడు నిండుకొలువై చెలువై బలవైరి కెంతయుం
బ్రతియగు ఠీవి మీఱఁగఁ బరాకు పరాకు పరాకటంచు వం
దితతులుసారెమ్రొక్కు ధరణీతరుణీపరిణీవరాళి ను
న్నతరుచిఁ దెల్పఁ గానకలనాలలనాకలనాదము ల్వినన్.

5


సీ.

విశ్వంభరాభారవిధురకుంభీనసప్రతిసృష్టి యెవ్వాని బ్రహ్మయష్టి
గాఢాంధకారనిర్గంధనక్షమసరోజపకరం బెవ్వానిజవసరంబు
ఘటజాతగౌరవోత్కటహర్షితార్థవిగ్రహచండి యెవ్వానిమహితకుండి
కనకగర్భాసాధ్యకౌశికేష్టనిధానతోషితం బెవ్వానిభాషితంబు


తే.

కమలసంభవ కమలేశ కమలభృత్క, లాకలాపాది సురలోకలోకభయద
కలశదత్తాక్షి యెవ్వాని జలరుహాక్షి, యట్టిఘనుఁడు వసిష్ఠసంయమధనుండు.

6

క.

చనుదెంచిన నెదురుగఁ జని, వినయంబునఁ దోడి తెచ్చి విభుఁడు సువర్ణా
సనమున నునిచి సపర్యలు, నొనరిచి యిట్లనియె నతిమృదూక్తులు మెఱయన్.

7


మ.

అనఘాత్మా యనపత్యతాదురిత మత్తాళీంద్ర మస్మన్మనో
వనజాతానిశజాతమోదరససేవం జొక్క నేసౌఖ్యముం
గనలేనైతి సమగ్రభోగముల నింకం దన్మిలిందంబు గ్ర
క్కన వారింపుము భూరిసంతతి యొసంగం జాలఁ బ్రార్థించెదన్.

8


తే.

అనిన సమ్మతి ఋశ్యశృంగాదిమౌని, పతులఁ గూడి యరుంధతీప్రాణనాథుఁ
డశ్వమేధంబు సేయించి యధిపుచేతఁ, బుత్రకామేష్టి వేల్పింపఁ బూనునపుడు.

9


సీ.

శచిముద్దుమోమునఁ జక్కగాఁ దిలకంబు దిద్దిదిద్దక వచ్చె దేవభర్త
కులశైలతనయచెక్కులయందు మకరిక ల్వ్రాసివ్రాయక వచ్చె వామదేవుఁ
దొడికంబుగా వాణినిడువాలుకీల్జడ యల్లియల్లక వచ్చె నబ్జభవుఁడు
కలిమిపూఁబోఁడిగుబ్బల కమ్మకస్తూరి పూసిపూయక వచ్చె వాసుదేవుఁ


తే.

డన్యదివిజులు దామున్నయట్లు వచ్చి, రింతయును దామసములేక ఋశ్యశృంగ
మౌనిమంత్రబలాహూయమాను లగుచు, నహహ కొనియాడఁ దరమె యయ్యనఘుమహిమ.

10


మ.

హవిరర్థాగతదేవతావిరహరుష్యన్నిర్జరీభేదన
ప్రవణానంగసమాహృతప్రసవసర్వస్వామృతాహారలో
కననీదోహదధూమమో యన వపాగంధస్ఫురద్ధోమధూ
మవితానంబు నభోంతరాళపదవిం బర్వెన్ ఘనశ్యామమై.

11


క.

ఆయెడ శిఖిభవపురుషుఁడు, పాయసభాజన మొసంగె బహువిధమంత్రో
పాయసభాజనకౢప్తనృ, పాయసభొజనము లలర నవనీపతికిన్.

12


సీ.

దశరథమేదినీధవుఁడు పాయస మగ్రసతికిఁ గౌసల్యకు సగ మొసంగి
పిమ్మటఁ గైకేయ ప్రియురాలు గావున కడమ యియ్యఁదలంచి కైకకన్న
బ్రాయంబుచేఁ బెద్దపత్ని నుదాసింపఁ బాడిగా దంచును బరకపాలు
మాత్రం బొసంగి సుమిత్రకుఁ గైకకుఁ బాతికెపా లిచ్చి పరకపాలు


తే.

మరలి యెల్ల సుమిత్రకె మమత నొసఁగె, మునుపుఁ గొంచెమె యిచ్చితి ననుచు నెంచి
యంతఁ గాంతలు దత్పాయసాంశములను, మెసవి యారూఢగర్భలై యెసఁగుటయును.

13


సీ.

హరువుగా మృగనాభి యలఁదితే కుచచూచుకంబుల నైల్యంబు గదియనేల
విడియంపుకపురంపువెలిడాలు గ్రమ్మెనే పసిఁడిచెక్కులు వెల్లబాఱనేల

కటికుచంబుల నీర్ష్య గాంచెనే నేఁడైన బలువుఁజూపె నదేమొ యలఁతినడుము
పరమాన్నరుచి గ్రోలఁ బరపదార్థములందు నరుచి పుట్టెనొ పల్చనయ్యెఁ దనువు


తే.

పనులు దఱచయ్యెనే యింత బడలనేల, రేలు వేఁగింతురే పగలేల నిద్ర
యనుచు దశరథుఁ డతిమోద మెనయు నర్మ, వచనములఁ దేల్చె దౌహృదవతుల సతుల.

14


ఉ.

మేటిగఁ జైత్రశుద్ధనవమీబుధవారపునర్వసూడుక
ర్కాటకలగ్నవేళ గురురాజులు గూడ గ్రహంబు లుచ్చతం
బాటిల నైదుఁ గోసలనృపాలసుతామణిగర్భవారిధిం
గోటిశశాంకతేజముఁ జిగుర్కొన విష్ణుఁడు పుట్టె రాముఁడై.

15


తే.

అచ్యుతాంశార్ధమున రాముఁ డవతరింప, హరిచతుర్థాంశమునఁ గైక భరతుఁ గనియె
నలసుమిత్రకు వెనుకఁ బాయసము గొనియు, నాథునుద్దేశమే ప్రధానంబు గాఁగ.

16


క.

గుణవతి సుమిత్ర సుజన, ప్రణతుల హరి పరకపరకపా లొసఁగఁగ ల
క్ష్మణశత్రుఘ్నుల శుభల, క్ష్మణుల న్ముజ్జగమువారుఁ గడుహర్షింపన్.

17


సీ.

దివి పిక్కటిల మ్రోయు దివ్యదుందుభుల సంరావంబు లభ్రగర్జనలు గాఁగ
నటియించు నప్సరఃకుటిలాలకలమేనిమెఱుఁగులు తొలుకరిమెఱుఁగులుగను
దిలకించు వైమానికులచిత్రభూషణాంబరకాంతి యింద్రచాపంబు గాఁగ
మలయాచలాయాతమందమారుతములు తతశీతవాతపోతములు గాఁగ


తే.

జనముదశ్రుప్రవాహము ల్సందడింప, మునిజనానందకందము ల్మొలకలొత్త
రావణగ్రీష్మతప్తధరాతలంబు, శైత్య మొందంగఁ బుష్పవర్షములు గురిసె.

18


వ.

అంత.

19


క.

సరభసగమనఝళంఝళ, చరణమణీనూపురములు సగ మెఱిఁగింపం
దరుణులు దెలిపిరి యంతః, పురవనితలు సుతులఁ గనుట భూపాలునకున్.

20


మ.

ఘనసంతోషము మీఱఁగా దశరథక్ష్మాపాలచంద్రుండు వే
చని కాంచెం బురుటింటిలోపలను గౌసల్యాంకభాగంబునం
గనియై నిల్చెనొ సర్వలోకముల శృంగారం బనా మీఱురా
ముని గల్యాణగుణాభిరాముని జగన్మోహప్రభాధామునిన్.

21


తే.

దశరథుఁడు రాముఁడై పుట్టె ధరణిలోన, నాత్మయే పుత్రుఁడై పుట్టు ననఁగ వినమె
యట్టియాత్మావలోకనం బవనిపతికి, సమ్మదముఁ జేయు టేమియాశ్చర్య మపుడు.

22


క.

పుత్రోత్సవ మొనరించెన్, ధాత్రీపతి రత్నధాన్యధనముల విశ్వా
మిత్రుఁడు దనలోఁ దలఁచెం, జైత్రంబుగ నుత్సవంబు సలుపఁగ నంతన్.

23

తే.

నామకరణాదికము లుపనయన మవని, రమణుఁ డొనరింపఁ గ్రమమున రాముఁ డనుజ
సహితముగ వంశగురుచెంత సకలవిద్య, లభ్యసించి ప్రవీణుఁడై యధివసించె.


క.

అట నొక్కనాఁడు కౌశిక, జటివరుఁ డరుదెంచి సవనసంరక్షణమున్
ఘటియింప రాము వేఁడినఁ, గటకటపడు దశరథేంద్రుఁ గని గురుఁ డనియెన్.

25


సీ.

ధరణి నేకాతపత్రంబుగాఁ బాలించె బ్రహ్మఋషీ, శ్వరపదముఁ గాంచె
మేనకాధరసుధాపానంబునకుఁ జొక్కె రంభను దిట్టెఁ జట్రాయి గాఁగ
నలుకశక్త్యాదిపుత్త్రుల మన్నిఁ గొనిపించెఁ బశువగుద్విజపుత్రుఁ బ్రతుకఁజేసె
గురుశాపహతుఁ ద్రిశంకుని దివంబున నిల్పెఁ బీడించెఁ దత్పుత్రుఁ బెక్కుగతుల


తే.

వేదమాతను గాయత్రి వెలయఁజేసె, వివిధశస్త్రాస్త్రము లెఱింగె విశదముగను
విన విచిత్రము గాధిపుత్రుని చరిత్ర, మనఘగుణగణ్య దశరథజనవరేణ్య.

26


క.

సుతుఁ బంపు మితనివెంటం, గ్రతురక్షణమునకు శుభము గలుగు నటన్నన్
క్షితిపతి కుతుకంబున రఘు, పతిఁ బిలువఁగ నూడిగములఁ బనుపఁగ వారున్.

27


సీ.

సిగకు నందక వెన్కఁ జెరలాడుకురులతో లాగియౌ మట్టికుళ్లాయి దనరఁ
జిన్నారినొసటిక్రొంజెమట యూడిగములు వలిపెంపుఁజల్వపావడలఁ దుడువ
నునువెడందయురంబునను జీనిసరిపెణ ల్మిన్నజన్నిదముతో మేలఁ గొనఁగ
బెడఁగుచెంగావిచల్లడముపై బిగియించికట్టినక్రొంబట్టుదట్టి దనర


తే.

సంజకెంజాయ దగునీలజలద మనఁగ, మెఱుఁగు టెఱమట్టిజిగితోడి మేను మెఱయఁ
జిగిలినాకరంబునఁ జెలువు గులుక, గరిడి వెలువడివచ్చు రాఘవునిఁ గాంచి.

28


చ.

వినయము మీఱఁ జేరి రఘువీర పరాకు నృపాలమౌళి చ
య్యనఁ బిలుమన్న వచ్చితి మటన్న విశేషము లేమి కొల్వులో
ననుచు రఘూద్వహుం డతిరయంబున లక్ష్మణుకేలుదండతో
మినుకుఁగడానివ్రాఁతపని మేలరిగె ల్పయిపై నటింపఁగన్.

29


సీ.

శిర సెత్త మునివ్రేలివరుస గన్పులుగల్గు బలుకొమ్ముమగఱాల పనులపైఁడి
సింహలలాటంబు జీవదంతంబులగొడియలు గడవన్నె గొప్పగిండ్లుఁ
బచ్చసూర్యపుటంపుఁబన్నాగమును మేలిపట్టెచట్టంబు కెంబట్టుపటము
సన్నజీనామాలిజాళువాపిడికుచ్చు ముసనాబుకుచ్చులు పసిఁడిసరిగె


తే.

కుట్టుతాపెతబటువులు కొద్దిసులువు, పట్టయొరఁగును గుంకుమపఱపుచలువ
పైఠినీచేలకప్పుఁజొప్పడుకుమార, యందలం బెక్కె శ్రీరఘువందనుండు.

30

క.

అడుగుందమ్ముల రజముం, దుడిచె న్శిబికావహుండు తోడనె యొకడ
ప్పుడు వడిగ మైత్రినొందుచు, నడకువ సౌమిత్రి నడచె నగ్రజువెంటన్.

31


సీ.

నగరువాకిటనె యందలము డిగ్గి బుజాన వలెవాటు వైచిన జిలుగుఁజేల
కటితటంబునఁ జుట్టి గండూష మొనరించి భయభక్తు లమర లోపలికి నరిగి
యొడ్డోలగంబయి యున్నతండ్రినిఁ జేరి జనపతి కౌశికముని యితండు
నతి సేయు రామ యన్నను బ్రేమ మొక్కిన “శీఘ్రమేవ వివాహసిద్ధిరస్తు”


తే.

అనుచు రాముని దీవించి మునివరేణ్యుఁ, డెత్తి యక్కునఁ జేర్చుక యేకపీఠ
సీమ వసియింప రామ కౌశికులవారి, వాఁడ వైతివె యని నృపవర్యుఁ డనిన.

32


తే.

మునులపాలిటివాఁడె రాముఁడు నృపాల, నిజమె పల్కితి వనుచు భూభుజుఁడు వనుప
రామలక్ష్మణు లిరువురుఁ బ్రేమ వెంట, రా మునీశ్వరుఁ డాశ్రమసీమ కరుగ.

33


మ.

తల హొంబట్టుకులాయలుం దళుకునిద్దాయొంట్లుఁ గస్తూరిప
ట్టెలుఁ గర్పూరపు నమము ల్దగటుదట్టీచల్లడల్ ఖడ్గము
ల్మొలవంకు ల్విలునమ్ములుం గవదొన ల్ముంగొంగుబంగారుదు
వ్వలువ ల్చెల్వుగ రామలక్ష్మణులు విశ్వామిత్రుతో వచ్చుచోన్.

34


సీ.

అటు నిక్కి చూచిన నమరావతీపురి వీథివారలు వెఱ వేఁకిపడఁగ
నిటు బార సాఁప దిగీశానపురవాసు లళుకొంది సందుగొందులకుఁ బాఱ
నటు ద్రొక్కి నడచిన నణఁగుభూమిభరంబు భరియింప ఫణిరాజు పడగలెత్త
నిటు గేరి నవ్విన నింద్రాగ్నియమముఖ్యదివిజు లంగుళములు సెవులఁ జొనుపఁ


తే.

గఱకుఁగోఱలు మిడిగ్రుడ్లుఁ జుఱుకుఁజూపు, వ్రేలుఁజన్నులుఁ దెఱనోరు వికృతముగను
గదియు తాటకిఁ గూల్చె రాఘవుఁడు జటిలు, మాట జవదాఁట కట వనమార్గమునను.

35


వ.

ఇవ్విధంబున.

36


ఉ.

తావచియించుమాట జవదాఁటక తాటక నొక్కకోలచే
గ్రావమగల్చువజ్రికడకం బడనేసిన రాము మెచ్చుచున్
దేవనియుక్తుఁడై యొసఁగె దివ్యతరంబయి మించు నస్త్రశ
స్త్రావళి నెల్లఁ గౌశికుఁ డుదారునకున్ రఘువీరమౌళికిన్.

37


ఉ.

కాచె రఘుప్రవీరుఁ డటఁ గౌశికయాగము సత్క్రియాగము
న్నీచవిచారులై దను గణింపక విఘ్నము సేయవచ్చు మా
రీచుఁ బయోధిఁ గూలిచి హరించె సుబాహుని బాహుశక్తి దో
షాచరసేనలం దునిమె సర్వమునీంద్రులు సన్నుతింపఁగన్.

38

తే.

గాధిసుతుఁ డంత శ్రీరాముఁ గౌఁగిలించి, యాది నమరుల కొసఁగితి వమృత మిప్పు
డాహవాంతంబున విరోధికీహవాంత, మునను మాకు ఘటించితి వనరుహాక్ష.

39


చ.

క్రతుఫలదాయి నీ కిఁక ధరాతనయామధురాధరాధరా
మృతము ఘటింపఁజేసెదము మెచ్చుగఁ బోవలె రమ్ము మైథిల
క్షీతిపతిజన్నముం గనఁగ సీతవిలాసము సన్నుతింప భా
రతిపతి నేరఁడన్నఁ గలరా యిల రామకు నీడుజో డిలన్.

40


మ.

పువునవ్వు న్మెయితావి విచ్చుసుధచేఁ బొంగారుబంగారుక
మ్మివగం బూనును మేను గౌను నగుఁదా మిన్నంటి వె న్నంటియా
కువలె న్వన్నెలువన్నుఁజన్ను లరిరంగు న్మించుఁగొమ్మించులన్
హవణించుం గనుమిన్న లెన్నఁ దరమా యాబోఁటి నాబోఁటికిన్.

41


క.

వెన్నెలవన్నెలకు న్నెల, వన్నెలతదరస్మితంబు లందము జేజే
కన్నెల చిన్నెల వన్నెల, క్రొన్నెల నెన్నుదురు మహిజ కొలఁదియె పొగడన్.

42


క.

అని వర్ణించుచు మిథిలకుఁ, జనుచో బహువిధకథాప్రసంగంబులచే
తను దొలఁగించుచు పథసం, జనితపదశ్రాంతి యల్ల జనఁజన నెదుటన్.

43


సీ.

వికచపద్మకుడుంగవిహరమాణరథాంగసహచరచ్చక్రాంగచటులభృంగ
గాహమానపతంగకరతప్తమాతంగమదగంధిలతరంగమయశుభాంగ
తీరజాతలవంగనారంగతరుసంగకలనినాదవిహంగకలుషభంగ
బహుళశ్రమోత్సంగ పథికహర్షణచంగ సురభిశీతకురంగ వరతురంగ


తే.

నురగశయనపదాంగజార్యుత్తమాంగ, జీవితోత్తుంగ జననస్థితిప్రసంగ
కనకగిరిశృంగ నిర్దళద్ఘనమృదంగ, ఘనరవజలానుషంగ నాకాశగంగ.

44


మ.

కని శ్రీరామవిభుండు కౌశికునిచే గంగామహత్త్వంబు విం
చును బల్మాఱు భగీరథక్షితిపతిన్ స్తోత్రంబు గావించి మ
జ్జనముఖ్యక్రియ లాచరించి యటఁ గౌశాంబీపురీరాజపూ
జనము ల్గైకొని మైథిలోపవనవీక్షం జొక్కి తానిట్లనున్.

45


క.

విమలాత్మక యేమునియా, శ్రమ మిది వికచప్రసూనసత్ఫలపాళీ
రమణీయ మయ్యు జనసం, గమవర్జిత మౌట కేమి కారణ మొక్కో.

46


క.

అన విని రామునిఁ గని రా, ముని యిట్లను రామ గౌతమునియాశ్రమ మి
వ్వని నెవ్వనిఁ గనకుండుట, వినుపించెద వినుము పూర్వవృత్తాంతంబున్.

47


చ.

మునుపు రమామనోహరుఁడు మోహినియై భ్రమయింపఁగాఁ ద్రిలో
చనుఁడు సురాసుర ల్మిగులఁజప్పఁగ నెంచిరి నాదుసృష్టిఁ గ

ల్గినమధురాధరామణులఁ గేవల మే నిక నంతకన్నఁ జ
క్కనివనిత న్సృజింతు నని కంజభవుం దధికప్రయత్నుఁడై.

48


సీ.

జలజవికాసంబుఁ జంద్రరమ్యత్వంబు ముకురంబుతేట నెమ్మొగము సేసి
కలికిబేడిసబెళ్కుకలువరేకందంబు ఖంజనదీప్తిఁ గన్గవ రచించి
తలిరుపల్చదనంబుఁ జళుకుకెంపుమెఱుంగు నమృతంబు రుచి నధరము ఘటించి
కనకకుంభచ్ఛాయ గట్టుగట్టితనంబు బంతిసోయగము గుబ్బల నమర్చి


తే.

మించుమించును సంపెంగమించుతావి, తరుణశైరీషకుసుమమార్దవము భాసు
రాంగకము చేసి నిర్మించె నఖిలలోక, మోహనముగ నహల్యయ న్మోహనాంగి.

49


సీ.

లక్ష్య్యాదికులసతు ల్పతులఁ బాయ రొకప్పు డలకాంతఁ జూతురో యనుభయమున
నజుకొల్వునకు సారె కరుదేరుసనకాదు లతిచంచలము చిత్త మంచు నెంచి
తక్కినరాజర్షు లెక్కువమక్కువఁ జిక్కి చొక్కుదురు వీక్షించినంత
నేకల్పమునఁ గాన మెటులు సృజించితి వని నుతింతురు కూర్మి హరియు హరుఁడు


తే.

గరుడగంధర్వసాధ్యాదిఖచరు లైన, దినముఁ బదిమార్లు వత్తు రవ్వనితఁ జూడ
నొకఁడుఁ దన కిమ్మటని వేఁడ డువిద కేను, దగనటంచును దగదె యమ్మగువఁ బొగడ.

50


క.

అఁట నొకనాఁడు సుధాశన, కటకేంద్రుఁడు బ్రహ్మఁ గొల్వఁగాఁ జని యచటం
గుటిలాలక యొయ్యారము, తటకాపడి చూచెఁ జూపుతమి దీరంగన్.

51


సీ.

కిసలయాధర కప్పుగీల్గొప్పుఁ బరికింప మోహాంధకారంబు ముంచుకొనియెఁ
గలకంఠి బెళుకువాల్గనుదోయి పరికింప స్వాంత మంతంతకుఁ జంచలించె
మోహనాంగి మెఱుంగుమోవి విలోకింప ననురాగవల్లిక ల్గొనలుసాఁగె
వనజాయతాక్షి లేనునుగౌను దిలకింప ధృతికిఁ బ్రాపించె నదృశ్యలీల


తే.

యర్హ మనవచ్చు నొకదారి నది బలారి, కువిదలావణ్యవారాశి నోలలాడ
నతనుతాపంబు జనియించు టరిది గాని, యిటులు మోహితుఁ డగుచు సురేంద్రుఁ డపుడు.

52


సీ.

కలికిగుబ్బలఁ బోలఁగా నిమ్మపండులు దొరలకుఁ జేకాన్కతరము లయ్యెఁ
జిలుకలకొల్కి చెక్కులడాలు గులుకఁగాఁ దళుకుటద్దము సూడఁ దగినదయ్యె
నొసపరిమిసిమి నెన్నొసలిపస ల్గాంచ మొలకక్రొన్నెలజను ల్మ్రొక్క నయ్యెఁ
దరుణికమ్మనిమేనితావి గ్రమ్మఁగఁ బూవుటెత్తులు శిరసావహింప నయ్యె


తే.

మగువ నిఁకఁ బెండ్లియాడఁగాఁ దగినధన్యుఁ, డఖిలలోకైకమూర్ధన్యుఁ డగుట యరుదె
యంచుఁ దమిమించఁ బదరి యాచంచలాక్షి, నిమ్మనుచు వేఁడ నగి బ్రహ్మ యీయ ననిన.

53

ఉ.

గుండియ జల్లనంగ నెదగుందుచుఁ గొండొకధైర్య మూది యా
ఖండలుఁ డబ్జజుండు మది గాంచక నీగతి నాడెఁగాక యీ
యండజరాజయాన కెనయౌ పురుషుండు మదన్యుఁ డీజగ
న్మండలి నెవ్వడంచు బిగుమానముతోఁ బురి కేఁగె నంతటన్.

54


తే.

నైష్ఠికబ్రహ్మచర్యంబునను దవంబు, సలుపు గౌతమునకుఁ బరిచర్య సేయ
నజుఁ డహల్యను నియమించె నతని ధైర్య, కంచుకము చించ నించువిల్కాఁడు పొంచె.

55


మ.

కులుకుంగుబ్బలు మోవితేనె జిలుక న్గ్రొందళ్కు మేన్మించులం
దొలఁక న్మాటకుఁ జిల్క మాఱువలుకన్ దోర్మూలము ల్గుందనం
బొలుకం జూపుల గండుమీలు బెలుక న్హోమాదులం దెల్ల దొ
య్యలి నిచ్చ ల్పరిచర్య సేయ నళుకం దమ్మౌని పూవింటికిన్.

56


క.

శతధృతి యట గౌతమముని, పతియతిధృతిగతికి లేదు ప్రతి యని సతిఁగా
శతపత్రనేత్ర నొసఁగిన, నతఁడున్ గార్హస్థ్యసౌఖ్య మందుచు చెలఁగెన్.

57


క.

పడఁతుక మునిఁ జేరుటఁ గని, జడిసి మనోజాతవిశిఖజాలమునకు లో
పడి యడలుచు ననిమిషపతి, మిడికెం గడునెడఁద మిట్టి మీనై పడుచున్.

58


చ.

ముదమున నేను వేఁడుకొన మోహ మెఱింగి యొసంగ కయ్యయో
ముదిముది దప్పి యీభువనమోహిని నేమని మౌని కిచ్చె నీ
విధి కిఁక నేమి సేయుదు వివేకము సాల దొకింత యెట్లుగా
బ్రదికెనొ యిన్నినాళ్లు నిజపట్టము గట్టుక సృష్టికర్తయై.

59


సీ.

కలవారి కొసఁగడు వలయుకుమారుల నతిరిక్తునకుఁ బెక్కుసుతులఁ గూర్చు
స్వల్పాయువులఁ జేయు సకలగుణాఢ్యుల వ్యర్థజీవి కొసంగు వర్షశతము
కష్టలోభి కొసంగు ఘనతరైశ్వర్యంబు నెఱదాత కొనగూర్చు నెఱయలేమి
దీర్ఘరోగినిఁ జేయు దివిరిసంపన్నుని యారోగ్య మొసఁగు క్షుధాతురునకు


తే.

నజున కెయ్యది సువివేక మటులుగాన, నాకు నొసఁగక కానలో నాకునలము
మెసవుతపసికి నొసఁగె నిక్కుసుమగంధి, నేమి సేయుదు ననుచు సురేశ్వరుండు.

60


క.

నేలామంచముఁ బట్టక, చాలా జాలిం దపించె శతమఖుఁడు నిజ
త్రైలోక్యరాజలక్ష్మీ, పాలనమును వదలి మరుఁడు పాతకుఁడు సుమీ.

61


వ.

అనిన మందహాసకందళితవదనారవిందుం డగుచు సుమిత్రానందనుం డిట్లనియె.

62


క.

ఏమో యని యుంటిమి సు, త్రాముని గుట్టెల్లఁ దెలిసెఁ గ్రతుభుజులకుఁ
నేమని పట్టము గట్టెనొ, తామరసభవుండు వానితర మెఱుఁగఁడుగా.

63


తే.

అనిన లక్ష్మణ వారి నే మనఁగవచ్చు
దేవతలు సేయుపనులకుఁ దెగడఁదగునె

యనుచు శ్రీరామచంద్రుఁ డోమునివరేణ్య, యవలికథ యానతిమ్మన్న నతఁడు పలికె.

64


క.

పరుల కొకనిందఁ గల్గినఁ, బరికింపవు గుణమెకాని పాటింపఁగ నీ
సరిదొరలు గలరె జగముల, వరసద్గుణధామ రామవనదశ్యామా.

65


తే.

నీగుణంబులు పొగడ నేనెంతవాఁడ, వినుము మీఁదటికథ యిట్లు విబుధవర్యుఁ
డతనుపండితశాస్త్రవిద్యావిశేష, నిగ్రహస్థానగతుఁడు నై నెఱయఁ బొగిలి.

66


చ.

పొరుగిరు గాశ్రమంబులకుఁ బోవ నొకానొకవేళ వచ్చు దృ
క్చరణునియాశ్రమంబునకు సంయమి సేమము వేఁడి దేవతా
తరుసుమమాల్య మిచ్చు జడదారుల కేలని యాతఁ డంతలోఁ
దరుణి కొసంగఁ దన్వి దలదాల్పఁ గృతార్థుగ నెంచు దన్మదిన్.

67


క.

సురవరుఁ డందఱముందఱఁ, దరుణీమణి నట్టె చూచుఁ దప్పక కామా
తురులను భయమును లజ్జయుఁ, బొరయవన న్వినమె రామభూపాలమణీ.

68


మ.

ఎలనాఁగా శుభమౌనె ముజ్జగము మీ రేలంగ మావంటివా
రలకు న్సేమమె కాక యేమి యవు నీ ప్రాణేశుఁ డెందేఁగె వ
న్యలకుం బోయెను బోదుమే యతఁడు రా నాతిథ్యముం గాంచి పొం
డు లతాంగీమణి నీ వొసంగు మని వేఁడు న్వజ్రి యొక్కొక్కెడన్.

69


శా.

దేవాధీశ్వురుఁ డాశ్రమంబునకు నేతేరంగ నాతిథ్యముం
గావించు న్మునియున్నవేళ మధుపర్కం బిచ్చి యచ్చో నహ
ల్యావామాక్షి సుధాధరంబు గను నాహ్లాదంబుతో నింద్రుఁ డా
భావం బెంచి తలంగు మాఱ్మొగముతోఁ బద్మాక్షి లేనవ్వులన్.

70


చ.

సురపతి నట్టె చూచుఁ దను జూచినయంతనె చూపు ద్రిప్పు వే
మరు గనుసన్న సేయుఁ గని మాఱ్మొగమౌఁ గన నట్ల దీనుఁడై
కరమున మ్రొక్కు మ్రొక్కునెడఁ గ్రమ్మఱఁ గేల్గవ మోడ్చుచు న్నిజా
ధర మరపంట నొక్కఁ గని తన్వి నుచుక్కను నొంటిపాటునన్.

71


వ.

ఇవ్విధంబున విబుధనాథుం డహల్యావిలాసవిభ్రమంబులఁ దగిలి తదాశ్రమంబు
నకు వచ్చుచుం బోవుచునున్నయెడ.

72


సీ.

మట్టెఱుంగక యాకు మడుపు లొందుట యొద్దఁ బవళింపఁ బ్రక్కకుఁ దివియకుంట
కౌఁగిలించిన బ్రబ్బుగాఁ గౌగిలించుట యురక చెక్కున మోము లుంచుకొనుట
వలసివల్లములుగా వాతెఱయానుట యలవోకగా గుబ్బ లంటుటయును
సరసోక్తులకు సదుత్తర మీయకుండుట చూపు లేకయె రిత్తచూచుటయును


తే.

బలిమి దానయి పైకొన్న పారవశ్య, మొంది చొక్కమిఁ గనుగొని యుస్సు ఱనుచు
శచి వగలఁ గుందు నాథుఁ డేజలజముఖికొ, మేలువాఁ డయ్యెనని రహఃకేళికలను.

73

మ.

కొలువౌ డిగ్గున గద్దె డిగ్గు వని కేఁగు న్మర్లు గేహంబులోఁ
దలిరుంబాన్పునమర్లునం బొరలు సౌధం బెక్కు మందాకినిం
దిలకించుం జను నిల్చుచోట నిలఁ డెంతే కంతుసంతాపవి
హ్వలుఁడై చిత్తగతాంగనానయనకాల్యాధిష్ఠమార్గంబునన్.

74


చ.

వనితరొ నేటికైన దయవచ్చెనె యెంతటి నిర్దయాత్మవే
పనివడి నీకుఁగాఁ బడిన పాటులు దేవుఁ డెఱుంగు నింక నే
లను గతతోయబంధ మబలా యని కౌఁగిటఁ జేర్చు భ్రాంతి దోఁ
చిన నవలా[1]నిజాలవగఁజెందెడు నాతని మోహ మెట్టిదో.

75


వ.

ఇవ్విధంబున కంతుదురంతలతాంతకుంతతంతన్యమానసంతాపసంతప్తస్వాంతుఁ డ
గుచు శచీకాంతుం డొక్కనాఁ డేకాంతంబున విశ్వకర్మనందని యగుమనో
రంజనిఁ బిలిచి నిజాభిప్రాయంబు దేటపడం బలికి యెటులనైన యీకార్యంబు
సఫలంబు సేయుమని ప్రియంబు సెప్పిన నప్పద్మనయనయు నప్పుడ కదలి గౌత
మాశ్రమంబున నొక్కపూఁదోఁటలో దేవపూజకుఁ గుసుమంబులు గోయుచున్న
యహల్యం గనుంగొని యయ్యంగన భువనమోహనశృంగారాదిగుణంబులకు
నచ్చెరువడి మెచ్చుచుం జేరంజనిఁ యహల్య కిట్లనియె.

76


చ.

అలికులవేణి వెవ్వతె వహల్యవొ కావలె కాకయున్న నీ
చెలువము గల్గునే కడమచెల్వల కన్న నహల్య మెచ్చఁగా
వలయునె బోటి యేటిచెలువంబు తపోధనకాంత కింద్రునిం
గలసి రమింపఁజాలు శచిగౌరవ మెన్నుము నేర్పు గల్గినన్.

77


వ.

అని పలికిన చిలుకలకొలికి సారస్యంబు గలిగినట్లైనం జెలంగి యచ్చెలువ యిట్లనియె.

78


ఉ.

ఇంతిరొ నీదుభాగ్య మిపు డెంతని సన్నుతి సేయుదాన వి
శ్రాంతదిగంతకాంతులు శిఖామణి కాంతులఁ గూడ మోడ్పుకే
లెంతయుఁ దాల్తు రెవ్వని యహీనకటాక్షముఁ గోరి యాశచీ
కాంతుఁడు గాచినాఁడు కుతుకంబున నీదుకటాక్షవీక్షకున్.

79


చ.

రమణిరొ యద్రిపత్త్రములు రాలఁగజేసిన దూఱువోవ నీ
కొమరుమిటారిగబ్బిచనుగొండల పత్త్రముల న్రచింపఁగాఁ
బ్రమదము నొందినాఁడు సురరాజ్యధురంధరుఁ డట్టివానియ
త్నము ఫలియింపఁజేయుము కనందగు నీకును గోరుకోరికల్.

80


వ.

అనిన లజ్జావనతముఖియై శశిముఖి సఖీమణి కిట్లనియె.

81


శా.

ఔనౌనే వెలయాలనా యిటులు నీవాడన్ బలా చాలుఁ బో
పో నవ్వే రెవరైన విన్ననిట నేర్పు ల్సూపఁగా వచ్చితో

నానాథుం డిది విన్న యంతఁ దనకు న్నాకు న్మహాహాని రా
దా నావంటికులాంగనామణికి న్యాయం బౌనె యీమార్గముల్.

82


మ.

తగవౌనే తనవంటివాఁడు పరకాంతంగార సామాన్యుఁడే
మగువా తాను శతాశ్వమేధి త్రిజగన్మాన్యుండు నేఁ జెల్ల యీ
వగ వర్తించిన యాగభాగములఁ బిల్వంజూతురే బ్రాహ్మణు
ల్నగరే తోడిసుర ల్మహాఋషులచెంతన్ గౌరవం బబ్బునే.

83


వ.

అనిన విని నవ్వి యవ్విలాసిని యిట్లనియె.

84


చ.

వయసునఁ గంటి కింపయినవాని రమించుట ధర్మ మింతి క
ట్లయె మగవాఁడు చక్కనిమిటారికిఁ దక్కి రమింపఁగావలె
న్నయ మిది న్యాయశాస్త్రముల నమ్మకు మొజ్జలు పుచ్చకాయ యా
నయవిదుఁడౌ గురుండు మదనత్వర నగ్రజుభార్య గూడఁడే.

85


ఉ.

వేడుక లెస్సఁగా ననుభవించుట యొక్కటి తక్కెఁగానియం
దేడది ధర్మశాస్త్రగతు లెక్కడిపుణ్యము లేడ పాపముల్
సూడవు గాక నీవు బలసూదనువీఁడు సుపర్వు లన్యులం
గూడియెకాక నందనులఁ గూరిమిపత్నులయందుఁ గాంచిరే.

86


ఉ.

వింతలె నిన్నువంటి యవివేకిను లెందఱు లేరు వారినే
వంతుకు దేను నామనసు వచ్చినజాణయె కర్త తార యే
కాంతునిపజ్జ మాని వగకాఁడగు చంద్రునిఁ దక్క నేలఁదా
నెంతయుఁగాక నేమి దనయిచ్చఁ గరంగిన సౌఖ్య మబ్బునే.

87


చ.

అలుగుటొ యల్గినప్పుడె భయంబున నంఘ్రుల వ్రాలి వేఁడుటో
కలయఁగఁ బల్కుటో బలిమిఁ గౌఁగిటఁ జేరిచి మోవి నొక్కుటో
చలము మిటారిచూ పొనొర జంకెనయో ముడిబొమ్మొ తక్కుచె
య్వులు గలవో తపస్విరతియున్ రతియే వెతగాక కామినీ.

88


తే.

ఉవిద నినుఁ జూచినప్పటినుండి నా కి, దియె విచారంబు కటకటా దేవుఁ డిట్టి
చక్కనిమిటారి నేమని జడున కిచ్చె, నని తలంకుదు నైన నేమాయె వినుము.

89


శా.

దోషారంభము సంభ్రమం బొసఁగ నాథున్ సాధుమేషాసము
న్మేషాప్తిం గికురించి యొంటిఁ జని యన్వేషించు నజ్జారు నా
శ్లేషింపంగల సౌఖ్య మిందుముఖికిన్ లేదెందుఁ బద్మాననా
"యోషా జార మివ ప్రియం” బనెడి శ్రుత్యుక్తి న్విచారింపవే.

90


సీ.

అంగన పతిఁగాని యన్యపురుషుఁ జెంద ధర్మువు గాదని తలఁచితేని '
చంద్రగంధర్వకృశాను లన్యులు గారె వారు దేవతలన్న వారికెల్ల
నేలికయైన దేవేంద్రుఁడు గొంచెమా యది శ్రుతిచోదిత మంటివేని
నలినారి శుద్ధగంధర్వుండు శుభవాణి యఖిలపావనత హుతాశి యొసఁగ

తే.

వనరుహాక్షులు పరమపావనులు వారి, కెడయు వ్యభిచారదోషంబు ఋతువువలన
నని మనుస్మృతి దలపఁగా వినవె యెందు, నిందు వలవనిసందియ మేల విడువు.

91


క.

అది యటు లుండె న్వినుమా, మదవతి నీమీఁదఁ గలుగు మక్కువ వలన
న్మదనాస్త్రములకుఁ జిక్కిన, త్రిదశేంద్రుని వెతలుగొన్ని దెలిపెద నీకున్.

92


సీ.

కలకంఠకంఠి నీగబ్బిగుబ్బ లటంచు మేలిపూబంతులు కేల నలముఁ
జిలుకలకొలికి నీచిన్నవాతెఱ యంచుఁ బాళితోఁ జిగురాకుఁ బంట నొక్కుఁ
గలికి నీతళుకుఁజెక్కు లటంచు లవళీదలముల ముద్దాడు మేలంబు దనర
నొప్పులకుప్పనీయుదుటుపెందొడ లంచుఁ గదళికాతరుల నఖంబు లుంచు


తే.

నందనవిహారవేళ సంక్రందనుండు, మదనకనకాస్త్రవిస్మృతోన్మాదుఁ డగుచుఁ
జూచి రంభాదికాంతలు చోద్య మందఁ, గల్లఁ గా దిది నీయాన కరటియాన.

93


సీ.

నునుబాలకాయయొంటులు జాతినిద్దంపునీలంపుఁబోగులు నీటుసూప
వలకేల బూనిన తెలిచాయ నూరుదారలవాలు గఱిచిల్వచెల్వుఁ దెల్ప
నెమ్మేన నలఁదిన కమ్మగంధపుఁబూత కస్తూరికాకాంతి గడలుకొనఁగ
గళమునం దగుకల్పకప్రసూనసరంబు నీలోత్పలంబులనీటు సూప


తే.

నిగ్గులీనెడు తలఁపు మానికపుగద్దెఁ, దొగలపగదాయ ఱాలీల రగులుకొనఁగ
సెగ వసముగాక దిగధిపుల్వగలఁ బొగుల, వజ్రి కొలువుండు మదనసంజ్వరమువలన.

94


తే.

ఇంతమన్మథసంతాప మేల వచ్చె, శక్రుఁ డెక్కడఁ జూచె నాచక్కఁదనము
ననుచు నడిగినఁ దెలిపెద విను మదేభ, కుంభజృంభితవక్షోజకుంభయుగళ.

95


సీ.

కమలసంభవువీటఁ గాంచె ని న్వేడుక నది మొద ల్మనసు నీయందె తగిలె
నెన్నఁడు నీవు న న్నెద నుంతువో యంచు నీచక్కఁదనము వర్ణించు నెపుడుఁ
గంటికి నిద్దుర గానఁడు రేపగ ల్చిగురుకైదువుకానిచేతఁ జిక్కె
నమృతంబుపై సైత మరుచి జనించెను నిను గూర్చుమని వేఁడుకొనును సఖులఁ


తే.

గాకవసగాక పడు బయ ల్గౌఁగిలించు, మూర్ఛపాలగు నీమీఁదిమోహమున సు
రేశుఁ డేకాదశావస్థ నిటులు చెందె, నింకనైనను దయఁజూడవే లతాంగి.

96


తే.

అనినఁ జిఱునవ్వు నవ్వి యయ్యంబుజాక్షి, వేల్పురాయఁడు నీవల వెఱ్ఱివాఁడు
గాక యెవ్వరిసొమ్ముకుఁ గాంక్ష సేసి, యింతవలవంతఁ గుందెడు నింతి యనిన.

97


సీ.

మంచిపున్నమచందమామఁ జూడనె కాని వేడుకతోడ ముద్దాడవశమె
యూరక చూచి నోరూరుటింతియె కాని యందనిమ్రానిపం డ్లందవశమె

తళుకుతళ్కని మించుతొలుకారుమించుఁ గాంచనెకాని కౌఁగిలించంగవశమె
కనకాద్రిశృంగము ల్గనుఁగొననేకాని సులభంబుగాఁ బట్టిచూడ వశమె


తే.

యటులు పరకాంత నగుమొగం బధరబింబ, మంగవల్లియుఁ జనుదోయి యలరుఁబోఁడి
కోరుటయెకాక యేల చేకూరుఁ దనకు, వలవనిదురాశ యేటికి వలదు పొమ్ము.

98


ఉ.

చీమ చిటుక్కుమన్న వెతఁ జెందెడిచిత్తముతోడ జారతో
నేమిసుఖంబు గాంచు విటుఁ డేటికి యీభ్రమ వట్టిపాప మిం
తే మఱియేమి లేదు వెఱతెర్వులఁ బోవుట గాదటంచునో
కామిని నేఁడు నామనవిగా వినిపింపు నిలింపభర్తకున్.

99


తే.

అమ్మనేఁ జెల్ల యెంతప్రొద్దాయెఁ జూడు, మగువ మాటలసందడి మఱచియుంటిఁ
బోయివచ్చెద నని కొన్నిపూలు గొనుచు, బాలికామణి తనపర్ణశాల కరుగ.

100


క.

అనిమిషపతి దూతికయును, దనరాకల కెదురుచూచు ధరణీధరభే
దను జేరఁ జనిన నతఁడును, గనుఁగొని మోదమున నొంటిగా నిట్లనియెన్.

101


శా.

నీరేజానన పోయివచ్పితివె కంటే పూర్ణచంద్రాననం
గారా మొప్పఁగ మాటలాడెనె పొసంగం గేళిసంకేతవమే
యోరం జూపెను నేఁడొ ఱేపొ చెపుమా యుల్లంబు రంజిల్ల నా
పై రాగం బొకయింతయుండు మును నేభావించుతచ్చేష్టలన్.

102


చ.

తెలియఁగలేకయున్న భవదీయవచోరచనాచమత్కృతిం
గలుగకపోవుటెట్లు కలకంఠికి నాపయి మోహమంచు వే
ల్పులదొర యప్పుఁడే మృగవిలోచన దక్కినయట్లు పల్కఁగాఁ
బలికె లతాంగి లేనగవుపల్కులఁ గప్రపుపల్కు లొల్కఁగన్.

103


తే.

వనిత చక్కనివాని నెవ్వానిఁ గనినఁ, జెమ్మగిలకుండ దాచోటు చెప్పనేల
నిన్నుఁ జూచునహల్యకు నెనరు లేదె, హృదయ మియ్యదు పతిభీతి యింతె గాక.

104


చ.

అనుటయు నుస్సురంచు విబుధాధిపుఁ డింకిట నేమి సేయుదు
న్వనితను గూర్చునంచు నెదనమ్మిన నిచ్చెలి యిట్లు చేసె గ్రొ
న్ననవిలుకానిముల్కి యెదనాటి కలంపఁగ నోర్వఁజాల ని
త్తనువుఁ ద్యజింతు నన్నను విధాత యమర్త్యునిఁగా సృజించెఁగా.

105


తే.

అకట కలనైన నప్పొలంతుకఁ గలయుదుఁ, గాకయని యెంచ నిద్దుర లేకయుండఁ
జేసినాఁ డొంట రెంటను జెఱచినాఁడె, యెల్లవంకలఁ జెఱచెఁగా యింద్రు నజుఁడు.

106


వ.

అని చింతించుచు నిలింపపాలకుండు శంపాలతాంగిం బంపి నిరనుకంపంచంపక
గంధిగంధననందనవనకుసుమవిశిఖశిఖిశిఖాసంతాపితసంతప్తహృదయుం డగుచు
నొక్కరుండును సురతరంగిణి కరిగి వనవిహారంబునం బ్రొద్దు గడపుచున్నయెడ.

107

సీ.

గౌతముం డఱకాలఁ గన్ను చూపె నటంచు హరిపదంబునఁ జూపు నక్షు లనఁగ
నవనికిఁ దివియుచో ననురాగమున గాంచ మొనయు సతీపతీముఖము లనఁగఁ
బ్రతిబింబబహుళతఁ బరికింపఁగా వ్రేలఁబట్టిన రత్నదర్పణము లనఁగ
సమయాంబువాహి యంసమున మించు కడానిక్రొమ్మించుకావడికుండ లనఁగఁ


తే.

బూర్వపశ్చిమపర్వతంబుల దనర్చె, శశిదివాకరబింబము ల్సాయమునను
జాఱె రవి యంతఁ జంద్రుఁడు మీఱె దివిని, బండువెన్నెల నిండె భూమండలమున.

108


క.

తెరువరి యెండకు నోర్వక, సరగున నొకయెడను జేరఁ జనఁదవవైశ్వా
నరుఁ డడరినవడు వేర్పడ, సురపతి సురసురను స్రుక్కె క్షోణిగతుండై.

109


తే.

ఒకయుపాయంబు చింతించి యుత్సహించి, యాశ్రమంబున కేతెంచి యక్షపాదు
నుటజమునఁ బొంచె నించువిల్లూనుమించు, చించి చెండాడఁ బవిపాణి వంచనమున.

110


క.

ఆనాఁటినిశి నహల్యా, మానిని పతిపదము లొత్తి మక్కువమీఱం
గా నొద్దఁ బవ్వళించిన, నానాతిమనం బెఱింగి యాతఁడు నగుచున్.

111


శా.

ఇంతీ పర్వము నేఁ డటన్న నవులే యేమైనఁ దా నేమి పో
యంతేకాక మఱేమి యందులకు మి మ్మర్థించినానే బళా
యెంతే కంటికి నిద్ర దొట్టుకొనిరా నీ చెంత గోరంతని
ద్రింతుం గాకని పండినా ననుచు నీరేజాక్షి లేనవ్వునన్.

112


ఉ.

మాఱుమొగంబు పెట్టుకొని మారునివేదన తాళలేక వే
మారుఁ గటాక్షవీక్షసుకుమారతనుం బ్రియుఁ జూచుకొం చయో
కోరినవేళ నాయకునికూటమి గల్గి సుఖించువార లే
మేరను నోఁచిరో యనుచు మించినచింత నొకింత గూర్కగన్.

113


ఉ.

ఆయెడ కోడియై మఘవుఁ డంబుజబాణున కోడి కొక్కరొ
క్కో యని కూయ వేగెనని గొబ్బున గౌతమమౌని యేటికిం
బోయినఁ దాను గౌతమునిపోలికె వేషము పూని దేవతా
నాయకుఁ డేఁగుదేర లలనామణి వాకిటనుండి చూడఁగన్.

114


తే.

వెలదిచూపులు దేవతావిభునిమీఁద, నెరసి నీలోత్పలంబులనీటు సూపి
యవియె సూచించె భావిసహస్రలోచ, నముల బెడఁగు సుదృక్కులక్రమము మెఱయ.

115


వ.

అంత.

116


ఉ.

వల్లభ యింతలో మరలివచ్చితి రేమని విస్మయంబుతోఁ
బల్లవపాణి పల్క సురపాలకుఁ డుల్లము పల్లవింప నో
హల్లకగంధి నీచెలువ మట్టె తలంచిన ప్రేమ మించెనే
కొల్లలు గాఁగ నిన్ రతులఁ గూడఁగ వచ్చితి రమ్ము నావుఁడన్.

117

ఉ.

ప్రేమయు గద్గదస్వరము భీతియుఁ గంపముఁ దొట్రుపాటు నా
నామధురోక్తి గల్గు కుహనామునిఁ దప్పక యట్టె చూచి సు
త్రామునిఁగా నెఱింగి యవురా యని కాముని మెచ్చి యాముని
గ్రామణి ణి యిట్లనియెఁ బ్రౌఢవచోరచనాచమత్కృతిన్.

118


ఉ.

మేనకనో తిలోత్తమనొ మెచ్చగ రంభనొ చంద్రరేఖనో
నే నొకచారురూపవతినో క్షితిదేవవరేణ్య యేల నా
పై నిటువంటిప్రేమమును బర్వ మటంటిరి పర్వమయ్యెనే
సూనశరాసుచేత దయఁజూడఁడుగా యతఁ డెంతపెద్దలన్.

119


వ.

అని చాతుర్యంబుగాఁ బల్కు జలజాతముఖికిఁ గైతవ గౌతమముని పురు
హూతుం డిట్లనియె.

120


సీ.

రంభ నీమృదులోరుజృంభణం బొకయింతఁ గనుఁగొన్న లో మెత్త గాకయున్నె
శశిరేఖ నీఫాలసౌందర్య మొకయింత భావింప నొకవంకఁ బోవకున్నె
హరిణి నీకన్దోయియంద మొకించుక గాంచినచోఁ బూరి గఱవకున్నె
యూర్వసి నీవేణియొప్పిదం బొకయింత తిలకింపఁ జాయలు దేరకున్నె


తే.

యితరకాంతల నెన్నఁగా నేల వారి, రోసియేకాదె నినుఁ గోరె వాసవుండు
మున్ను నాపుణ్యఫల మన ని న్నొసంగె, నలువఋణ మేమిటను దీర్తుఁ గలువకంటి.

121


ఉ.

మాటల జాగుసేయకుము మన్మథవేదనఁ దాళఁజాల నో
పాటలగంధి నీదుకుచపాలికఁ జేర్పుము తెల్లవాఱిన
న్వాటముగా దటంచు సురవల్లభుఁ డంగనకే ల్దెమల్చుచుం
బైఁటఁ దొలంగఁ జన్నుగవపైఁ బడి కౌఁగిట కాసచేయుచున్.

122


చ.

నిలువునకుం జెమర్చె రమణీమణి మోహమొ కాక భీతియో
తెలియగఁ గూడ దప్పు డలదేవవిభుండును గంప మొందె మి
క్కిలి యొడఁబాటులేని పరకీయకరంబుఁ దెమల్పఁ గౌఁగిటం
గలయఁగ దొడ్డసాహనము గాదె బలారికిఁ జెల్లె నయ్యెడన్.

123


క.

ఇటులు బలాత్కారంబునఁ, దటుకునఁ బైఁబడిన దేవతాపతి కెడగా
నటు నిలిచి కుటిలకుంతల, యిటు లనియె న్మోహభీతు లెదఁ బెనఁగొనఁగన్.

124


చ.

ఇదె తెలవాఱవచ్చెఁ గదవే యిదె సంధ్యకు వేళగాదె స
మ్మదమున నిత్యకర్మవిధి మానకదీర్పుదు రాత్రివేళ మీ
మది సరిపోవురీతి నను మన్ననచేసెద రింతెకాక నీ
యదవద మేరగా దని మృగాక్షి గృహాంతరసీమ కేఁగఁగన్.

125


చ.

వెంటనె యంటి పద్మముఖివేణి కరంబున నంటి నిల్పి నీ
కంటికి నింపుగా నెనరు గైకొనకేగెదు చౌకచేసి నీ

వంటి కులాంగనామణికి వర్తనమే యిది యేమి చేయునో
దంటగదా మరుండు దురితం బగు వేఱొకటైన భామినీ.

126


క.

అన విని నవ్వుచు జవ్వని, విను నాయక నూతినీళ్లు వెల్లువఁబోనే
వెనుక నగుఁగాక పొమ్మన, వినక యతఁడు మల్లువెనుక విసువక యతఁడున్.

127


చ.

పెనఁగి లతాంగివేణి విడిపించుక జంకెన వాఁడిచూపుతోఁ
గనుఁగొని నీవు నాపతివె కావు నిశాటుఁడ వింతెకాక యా
తని మునివేష మూనితివి తప్పక దెల్పుము నాదుభర్త కీ
ఘన మగుప్రేమ గాన నిఁకఁ గల్లలు వల్క శపింతు నంచనన్.

128


క.

గడగడ యొడలు వడంక, న్బడఁతుకయడుగులను వ్రాలి పడఁతీ నే నిం
ద్రుఁడ నీ వెటువలెఁ జేసినఁ, గడుమంచిది మదనుచేత గాసిలుకంటెన్.

129


చ.

అనవుఁడు నింద్రుఁ డంతఘనుఁ డంఘ్రులపైఁ బడి యింత వేఁడఁగా
వినమి గడుం గొఱంత యని వేడుక మీఱఁగ లేవనెత్తి యో
యనిమిషనాథ నీకుఁ దగవా ననుబోఁటికి మ్రొక్క నంచుఁ దా
స్తనలికుచంబు లొ త్తె స్మరశాతశరవ్రణపీడ వీడఁగన్.

130


చ.

గమకపుగుబ్బచన్ను లెదఁ గాడఁగ నింద్రునిఁ గౌఁగిలించుచోఁ
దమిని నహల్య దొంటిసుకృతంబునఁ గల్గెడుఁ గాక నింద్రభో
గము సమకూరునే యితరకాంతల కంచును మేనువొంగ భా
వమునఁ దలంచె నాఁటి శ్రుతివాక్యము వాసవదూతి మెచ్చుచున్.

131


ఉ.

కామినిగౌఁగిటం దగిలి కాయము గీయ మెఱుంగఁ డయ్యె సు
త్రాముఁడు గొంతసేపునకు దత్కుచచూచుకభేదనంబుచే
నేమె యొకింతమై దెలిసి యింపునఁ జెక్కిలి ముద్దుగొంచు నె
మ్మోమున మోముఁ జేర్చి జిగిమోవికి మెల్లనె యాస సేయఁగన్.

132


క.

ఔరా మోహ మటంచును, నారీమణి మోము ద్రిప్పి నాకాధీశు
న్గూరిమినిఁ జెట్టవట్టుక, చేరువఁ దనశయ్యఁ జేరి చిత్తం బలరన్.

133


సీ.

పంట నొక్కనటంచు బాస చేసినఁగాని తేనెలూరెడి మోవి యాననీయ
గోట నొక్కనటంచుఁ జాటి పల్కినఁగాని బటువుగుబ్బలు కేలఁ బట్టనీయ
నాదు సేయనటంచు నమ్మికిచ్చినఁగాని మినుకుఁజెక్కిలి ముద్దు గొనఁగనీయ
నగడు సేయనటంచు నాన పెట్టినఁ గాని హాళితో రతికేళిఁ దేలనీయ


తే.

వినుము నెఱజాణ నీచక్కదనము సూచి, వలచి యొప్పినయప్పుడే వారవనిత
గాను మగనాలఁ గాన నీక్రమముఁ దెలిసి, యిందు కొడఁబడి న న్నేలుమీ సురేంద్ర.

134


తే.

అనుచు నొడఁబాటు గావించె నాది నింద్రుఁ, డింతియే కాని వెనుక యథేప్సితముగ
నఖరదంతక్షతాదుల నడఁచెఁగాక, తెలియమంచన గుఱికట్లు నిలుచు టెట్లు.

135


మ.

అసకృచ్చుంబనము ల్ముహుర్ముహుదుదారాశ్లేషము ల్శశ్వదు
చ్ఛ్వసితవ్యావృతము ల్పునఃపున రుదంచద్దంతసంలక్షిత
వ్యసనావిష్కృతసీత్కృతంబులు మనాగ్వర్ధిష్ణుదీనోక్తులై
యెసఁగెం గౌతమగేహినీదివిజలోకేశానసంభోగముల్.

136


సీ.

మోవి యానుచుఁ బంటమొన నొక్కి విడుమంచు సీత్కృతితోఁ గోటఁ జెక్కు మీటు
వలిగుబ్బ లంటుచు నెలవంక లుంచినఁ గోపించి కీల్జడఁ గొట్టి విసరు
రతికూజితంబు ప్రార్థన సేయుచును బాదముల వ్రాఁలఁ గిన్కతోఁ దొలఁగఁజేయు
మమతఁ బైకొన జుబుకముఁ బట్టి వేఁడినఁ దలకు సిగ్గునఁ గేలు దట్టివైచుఁ


తే.

జెవిని జిఱుబూతు లాడవచ్చిన నదల్చు, వలదు మెల్లన యని రతి త్వర నడంచు
జాలు విడరా యటంచుఁ గెంగేల మ్రొక్కు, జలజలోచన నూతనసంగమమున.

137


తే.

ఎంత కామాతురుఁడొ కాని యింద్రుఁ డహహ, యలసి తొయ్యలిగబ్బిగుబ్బలను వ్రాలి
గడియ సాలదె యిట్టిభోగంబు వెనుక, నేమియైనను మేలంచు నెంచె మదిని.

138


చ.

చెలువ రతాంతవేళ బలుసిగ్గున నంగము దాఁచికొంచు దు
వ్వలువ గ్రహించి కట్టికొన వల్లభుఁ డొయ్యఁ జెఱంగు పట్టి యో
కలికిరొ యింతసేపుఁ బొడగాననిసి గ్గిపు డెట్టు వచ్చె నే
కెలసము దీరె నంచుఁ గనుగట్టితొ ముంగడ నుంచు వ్రీడకున్.

139


ఉ.

పొంకమె యిట్టులైన నటు పొమ్మను లజ్జ నదేల యంటివా
యింకొకసారియైన రమియింపక నాతమి దీరదన్న నే
ణాంకముఖీలలామ యమరాధిప నీతమి దీఱకున్న నీ
విం కిట నేమి సేయఁగల వీతమి దీఱె నటంచు నవ్వుచున్.

140


తే.

చెల్ల పనులకుఁ బోవలెఁ జేల విడువు, మతఁడు రావేళ యయ్యె నటంచుఁ బెనఁగఁ
జేల విడుమంటి వటువలెఁ జేయువాఁడ, భామ పదరకు తెలవాఱ జాము గలదు.

141


క.

అనవుడు నేటికి బ్రమసెదు, విన వృద్ధశ్రవుఁడ వౌట వినవో యేలా
వినవైతి కోడి గూసెం, దనరవమై మరునిధర్మధార యనంగన్.

142


ఉ.

నావుడు నవ్వి యవ్విబుధనాథుఁడు నే భ్రమఁ జెంద నొక్కనాఁ
డీవిభుఁ డీవునుం భ్రమయుఁ డింతియె యెట్లనఁ గైతవంబున
న్నీవిభురూపుఁ బూనుగతి నే మును గుక్కుటమై నిశీధిని
న్నీవిభు నంపితి న్నదికి నేరుపు మెచ్చవుగా విలాసినీ.

143


క.

అన వెఱఁగందుచు నింద్రునిఁ, గనుఁగొని నాతోడు నీకుఁ గల్లయొ నిజమో
వినిపింపు మిదియు నిజమై, నను వలసినవేడ్కఁ గనమె నానాగతులన్.

144


తే.

అనిన నిజమౌను నీయాన హంసయాన, కల్లగా దన వల్లభుఁ గాంచి యలరి
మేలు నెఱజాణ యెటులైన మెచ్చవచ్చు, ననుచుఁ జెయిలోనఁ జెయి వేసి వనిత నగిన.

145


ఉ.

ఇంతిరొ వట్టిమెచ్చు లివి యేటికి నీవి యొసంగు మంచుఁ దా
నెంతయు నేర్పుతోఁ బెనఁగ నింద్రుఁడ నీ కిఁక నేమి యిచ్చెదం
గాంతుఁడ రెండుచక్రములు గావలెనన్న నొసంగుదాన నా
కింతియెె కాక వేఱొకటి యెయ్యది యీవని నంచు నవ్వుచున్.

146


తే.

అంత నరవిరిమజ్జనం బాచరించి, నవముగా మేన హరిచందనం బలంది
విరులు కొప్పునఁ దుఱిమి యవ్వెలఁది విభుఁడు, తారసిలి రప్పుడు పునారతంబునకును.

147


సీ.

పతి కప్పురపుఁదావి బాగాలు గైకొన్న మదిరాక్షి సగమాకుమడుపు లొసఁగె
నెనరుతోఁ గాంతుఁ డొయ్యనఁ గౌఁగిలించినఁ గొమ్మ గుబ్బల ఱొమ్ము గ్రుమ్మి క్రమ్మె
బ్రాణనాథుఁడు మోవిపైఁ గంటు చేసిన నలివేణి పారవశ్యమునఁ జొక్కె
విభుఁడు నిల్కడఁ గేకివిధమున రొదగుల్క లోలాక్షి చెవియొగ్గి యాలకించె


తే.

మోహనాంగుఁడు నునుపోఁకముడి సడల్పఁ, దరుణి జతయయ్యెఁ జిత్రబంధంబులకునుఁ
గూర్మి వల్లభుఁ డొకకొంతఁ గూడి యలయఁ, గుసుమకోమలి దాను పైకొని రమించె.

148


ఉ.

ఎన్నఁడు నేర్చెనో తెలియదే జగదేకమనోహరాంగి యా
చిన్నె లదేమి దెల్ప విటశేఖరుఁ డూరక చూచుచుండె నా
చన్నులకుల్కు లాసగముజాఱెడివేనలి యాయొయార మా
కన్నులబెళ్కు లాకదళిక ల్గనుపొంకము లావిలాసముల్.

149


తే.

అతివ యీగతి నుపరతి నలసి సొలసి, యప్పళించుక వ్రాలె నాయకుని యెదను
సరి బెనంగుట గన్గొని శంబరారి, చెలఁగి యిరువుర నొక్కటి చేసె ననఁగ.

150


చ.

అరవిరికల్వక్రొవ్విరులయందము నొందిన కన్నులు న్సుధా
కరకళలం ద్రవించు శశికాంతముఁ బోలిన చెక్కుటద్దము
ల్సరభసదక్షిణానిలము చాటునఁ గ్రమ్మెడు కమ్మయూరువుల్
గరువపుటెండ సోలులతకైవడి వ్రాలు నిజాంగముం దగన్.

151


చ.

ఎదపయి వ్రాలియున్న తరళేక్షణ నిధ్దపునిండుకౌఁగిటం
ద్రిదశవరేణ్యుఁడు న్సమరతిక్రియఁ జొక్కియు మున్నుమున్నుగా
మదవతి మోవిపానకము మాటికిఁ గ్రోలుచు సేదదేలె
దత్సుదతియు నట్ల దేరికొనెఁ జుంబితశంబధరోష్ఠబింబ యై.

152


వ.

అంత.

153


చ.

కమలదళాక్షి దువ్వలువఁ గైకొని లేచి కటీతటంబునం
గొమరుగఁ గట్టిగట్టిగను గ్రొమ్ముడిఁ బెట్టి మిటారిగుబ్బలం
జిమచిమగుల్కు గోటికొనజీరలకు న్విడికెంపు కెంపుమీ
ఱుమెఱుఁగుమోవిపైఁ జుఱుచుఱుక్కను కెంపులకుం దలంకఁగన్.

154


మ.

ప్రమదా నే నిఁకఁ బోయివచ్చెదను నాపై నీకృపావేశ ముం
చుము నీవాఁడ నటంచు దేవపతి యస్తోకస్పృహామందమం
దముగా వేఁడిన గుండెజల్లుమనఁ గాంతారత్న మొక్కింత దై
న్యముతో నక్కున మోవిఁ జేర్చి నినుఁ బాయ న్నేర్తునే వల్లభా.

155


ఉ.

నీపయి నాకు నాపయిని నీకును గూరిమి గల్గఁ జూచియుం
బాపపుదైవ మిట్టు లెడఁబాయఁగఁ జేసెను దొంటిపుట్టువం
దేవగఁ జేసినామొ విధి కేమిటి కీగతతోయబంధము
ల్నాపయిఁ బ్రేమ యుంచు సురనాయక మర్వక న న్నొకప్పుడున్.

156


తే.

అనిన నామీఁద నింతమోహంబు గలిగె, నేని నావెంట రమ్ము మత్తేభగమన
యెంతపనియైన నే నిర్వహింతు నంత, సడ్డసేయను జుమ్ము ముజ్జగమువారి.

157


ఉ.

నావుడు నింత యేల సురనాయక నన్నిటఁ దక్కనిచ్చునే
నావిభుఁ డట్టులైన నుడునాయకుఁ జేరిన తారరీతి మా
కావిధ మింతె కాక కలదా యొకయింత ప్రయోజనంబు నా
భావమునందుఁ దోఁచిన యుపాయము చెప్పెద నాలకింపుమా.

158


సీ.

దేవపూజకు విరు ల్దెచ్చెదనంచును వనికాంతరములకు వచ్చునపుడు
నివ్వరిధాన్యము ల్నెమకంగఁ గేదారపరిసరంబులయందుఁ దిరుగునపుడుఁ
గడువేడ్క నన్నోదకంబులఁ గొని తేర దూరతటాకంబు సేరునపుడుఁ
జెఱగుమాసె నటంచుఁ జెప్పి యూరకయైన నొంటిగాఁ గడయింట నుండునపుడు


తే.

వచ్చి నాముచ్చట ల్దీర్చు మెచ్చుగాను, నిచ్చ తచ్చనగాదు వియచ్చరేంద్ర
యనుచు నక్కునఁ జేర్చి మోహమునఁ జెక్కు, ముద్దుగొని పంపె నింద్రు నమ్మోహనాంగి.

159


ఉ.

అంపినయప్పు డమ్మఘవుఁ డవ్వలఁ బోవఁగలేక ప్రేమతోఁ
జంపకగ్రంధి గబ్బివలిచన్నులపయ్యె కఁదఁ జక్కఁజేర్చుచున్
సొంపునఁ జెక్కులుం బుణుకుచు న్మధురాధర పోయివత్తునే
యంపితివా యటంచు నిలయంబట వెల్వడి యెట్టకేలకున్.

160


చ.

ముని యెదురౌనొ యంచు సురముఖ్యుఁడు భీతిని బోవునంతలో
ననఘుని గౌతముం గనియె నక్షపదుండును వేషధారినిం

ద్రునిగ నెఱింగి యిట్టులను రోషసముజ్జ్వలితాత్ముఁ డౌటఁ జెం
దిన యఱకాలిమంట నడునెత్తికి నెక్క ఝటాఝటంబునన్.

161


క.

ముష్కరహితవృత్తినిఁ బర, పుష్కరపత్త్రాక్షిఁ బట్టి భోగించుటచే
ముష్కరహితుఁడవు గమ్మని, నిష్కరుణ శపించి మౌని నిలయముఁ జేరన్.

162


తే.

తరుణి దా నేమి యెఱుఁగనిదానిరీతి, నేతఁ గనుగొని కాళ్ళకు నీళ్లు దేఁగ
నలుక నమ్ముని యోసి దురాత్మురాల, యంట నర్హంబె నీచేతియంబు లిఁకను.

163


ఉ.

కల్లరివేష మూని యతికాముకుఁడై సురరాజు వేఁడుచో
నుల్లము ఱాయిఁ జేసికొని యూరకయుండక నీవు లోనుఁగా
జెల్లునె యిట్టిదుష్కృతముచే రఘురాముపదాప్తిదాఁక మే
నెల్లను ఱాయి గాఁగ వసియింపుము నిర్జన మివ్వనంబునన్.

164


క.

అని శపియించి హిమాద్రికి, జనియెన్ గౌతముఁడు జంభశాసను మేషాం
డునిఁ జేసి రశ్వినీసుతు, లనుపమదివ్యౌషధముల నమరులు మెచ్చన్.

165


భుజంగప్రయాతము.

బలారాతిరూపంబు భావించె గానం, బలా రాతిరూపంబెఁ బ్రాపించెఁ గానం
శిలాహారినారి న్నిషేధింపు మింక, న్శిలాహారిరూపంబు శేషాఘ మింకన్.

166


క.

అని ముని భవతారకనా, ముని రాముని నల్లగౌతమునివనికిం దో
డ్కొనివచ్చునెడను దత్పద, వనజరజం బింత వాయువశమున సోఁకన్.

167


క.

వనరాశి జనించిన శ్రీ, వనజాక్షియొ యెదురుకొనిన వనదేవతయో
వనవనదావళిమించో, యని యెంచఁగ ఱాయి చెలువయై చెలు వగుచున్.

168


సీ.

మును దలమున్కయౌ మోహాంధకారంబు వెనుకదీసినరీతి వేణిఁ దనర
శాపరూపదినాంతచంద్రోదయములీల మొలకనవ్వులముద్దుమోము మెఱయ
బహుకాలపరచితోపలత యంటినమాడ్కి కఠినవక్షోజయుగ్మంబు గులుకఁ
దనదృశ్యభావంబు దవిలిపోవనిఠీవిఁ గడుసన్నమైనలేఁగౌవును వడఁక


తే.

క్షితిని లోహంబులను బైఁడిసేయు స్పర్శ, వేదివలె రామపాదారవిందరజము
పూని శిలఁ బైఁడి సేసె నామేను మించఁ, గాంతయై మించె గౌతమకాంత యపుడు.

169


క.

తనమునుపటివృత్తాంతము, మునిపతి వీరలకుఁ దెల్పుమునుపే యనుచున్
ఘనలజ్ఞానతముఖియౌ, వనితకు రఘునందనుండు వందన మిడియెన్.

170


తే.

పెండ్లికొడుకవు గమ్మని ప్రేమ మౌని, రామ దీవించి శ్రీరఘురామవిభుని
పూజఁగావించుచున్న నద్భుతము గాఁగ, గౌతముఁడు వచ్చి యారాముఁ గాంచి పొగడె.

171

ఖడ్గబంధము

క.

సౌరధరధీర రఘువర, పారదదరనీరజారిభవకీర్తిరమా
మారీచమదవిరామా, నీరదనిభధామ రామ నృపతిలలామా.

172


ఉ.

శ్రీరఘురామ నిన్ను నుతి సేయఁగ నెంతటివాఁడ నేను నీ
పేరు దలంచినంత నతిభీకరదుష్కృతము ల్దొలంగు నీ
చారుపదాబ్జసంగతిని సంభవయౌట పవిత్రగాదె భా
గీరథిలీల నీభ్రమరకేశిని యంచు నహల్యఁ జేకొనన్.

173


మ.

దివి వర్షించెఁ బ్రసూనవర్ష మపు డందె ల్మ్రోయ నాడె న్సువా
సివధూబృందము దివ్యదుందుభులు మ్రోసెన్ ధింధిమిధ్వానమై
యివతాళించె సుగంధగంధవహ మెంతే రామపాదాబ్జప
ల్లవసంజాతపరాగచాతురి సహల్యాగౌతము ల్గూడఁగన్.

174


తే.

అంత సంతుష్టచిత్తుఁడై యక్షపాదుఁ, డధిప మాకందమయ్యె నీయంఘ్రిపద్మ
మనుచుఁ బొగడుచుఁ గాంత, దోకొనుచుఁ జనియెఁ, గౌశికుండును జనుచు రాఘవుల కనియె.

175


మ.

కనుఁగొంటే మిథిలాపురంబు ధరణీకన్యాపదాంభోజమో
హనమంజీరఝళంఝళత్ప్రబలనాదాకృష్ణమందాకినీ
కనకాంభోరుహకర్ణికాంతరచరత్కాదంబికామేడ్రితా
యనఖండాభ్రగకేళిసౌధమయి చెల్వయ్యెన్ రఘుగ్రామణీ.

176


తే.

అస్తమయవేళఁ బురమున కరుగనేల, నేటి కీకేళివనిలోన నిల్చి ఱేపు
పోవ మేలగు నని మౌనిపుంగవుండు, రాఘవులతో వనాభ్యంతరమున కరిగి.

177


సీ.

గుబ్బకస్తూరికుంకుమ యంటినది కొమ్మ గోరంట కౌఁగిట గ్రుచ్చెనేమొ
యంఘ్రిలాక్షారసం బంటియున్నది లతాతన్వి యశోకంబుఁ దన్నెనేమొ
మధువాసనలు గుల్కె మంజుళకేసరం బువిద పుక్కిటిరసం బుమిసెనేమొ
యసమయంబునఁ బూచినది సహకారంబు భామాలలామ చేపట్టేనేమొ


తే.

రామ కనుఁగొంటె కేళికారామసీమ, సహజవాత్సల్యమున భూమిజాతసీత
ప్రోది సేసినభూరుహంబులు సురేంద్రు, తరుల నవ్వుచు నున్నవి విరులసిరుల.

178


క.

అని సీతాకేళీవనిఁ, గనుగొని మువ్వురును సాంధ్యకరణీయంబుల్
వొనరిచి క్రొన్ననతలిమము, లను వసియించిరి కుతూహలంబున నంతన్.

179


సీ.

శ్రీరామునకుఁ బెండ్లి ఱేపని వరుణున కెఱుఁగింపఁ జనుమాడ్కి నినుఁడు గ్రుంకె
హెూమాగ్నిశిఖ లిట్టు లుల్లసిల్లు నటన్నకైవడి సాంధ్యరాగములు మెరసె
మొనయుదంపతులకు మోహ మీవైఖరి యనుమాడ్కిఁ జీకటు లలమె దిశలఁ
దలఁబ్రాలు ముత్యము ల్దలపించునంచును గనుపట్టె దివిని నక్షత్రగణము

తే.

తెరమఱుఁగు వాసి యీలీలఁదీరు సూపు, సీతమొగ మను క్రమమున శీతకరుఁడు
దోఁచె నచ్చెల్వ దృష్ట్లనాఁ దొగలు సెలఁగె, నిండె నీనవ్వు లనఁగ వెన్నెలలు గంటె.

180


క.

అని పలికి ప్రొద్దువోయెన్, జనవర నిద్రింపు మనుచు సంయమివర్యుం
డనుజుండును శయనింపఁగఁ, దనకంటికి నిదుర రాక తద్దయుఁ బ్రేమన్.

181


ఉ.

కన్నులఁ జూడకున్న మహికన్యక తాదృశకౌశికోక్తులం
గన్నులఁ గట్టినట్లయినఁ గన్నులవింటివజీరు నిద్దపుం
గ్రొన్ననవాఁడితూపు లెదఁ గ్రుచ్చుక వెన్నున దుస్సి పాఱఁగా
విన్నదనంబు దోఁప రఘువీరుఁడు మోహముచేఁ దలంకుచున్.

182


ఉ.

ఎప్పుడు తెల్లవాఱు నిఁక నెప్పుడు మైథిలిరాజుఁ గాంతు నే
నెప్పుడు చంద్రమౌళిధను వెక్కిడుదుం ధరణీకుమారి నే
నెప్పుడు చెట్టవట్టుదు నభీష్టము లెప్పుడు గాంతునంచుఁ దా
నెప్పుడు నెంచుఁగాని యెనయింపఁ డొకప్పుడు నిద్రకంటికిన్.

183


వ.

ఇత్తెఱంగున సీతాకాంతనుం దలంచి యంతయు నంతరంగంబునఁ జింతించు రఘు
కాంతుం డొక్కింత నిదురింప నంత వందిజనులచెలు వంది ద్విజబృందంబులు కల
కలధ్వనుల మేల్కొని యర్ఘ్యప్రదానంబున నరవిందసఖునకు మందేహజయంబు
నొందించి విదేహరాజపురంబునకుఁ జనునెడ విరహచ్ఛిదేహవిదేహశరవ్యూహ
కీలితదేహుండగు రఘూద్వహునకుం గౌశికుం డిట్లనియె.

184


మ.

అదె కన్గొంటివె వజ్రసాల మదె ఖేయవ్యాజపాథోధి య
ల్లదె వైదేహనృపాలశేఖరమహోద్యద్రత్నసౌధాగ్ర మ
ల్లదె రథ్యాగృహకేతుజాతమదవేశ్యాభర్మహర్యాలి య
ల్లదె యత్యుత్తమవాజిశాల యని యాయాదిక్కులం జూపుచున్.

185


సీ.

ఆరెకట్టికవార లందంద కుంతము ల్గొని ముందుగాఁగ ఢీకొల్పుచుండ
హరిదంతదంతిజయంబును సూచించు కరణిని డవిణెమలహరులు మొఱయ
ధర బూను మనుచుఁ బాదముఁ బట్టి విడువని చిలువఱేఁ డన వెండిగొలుసు దనర
గంధాంధమధుపసంఘంబులు మాత్రమె కాని సరసఁ జేరక భీతి జనము దొలఁగఁ


తే.

జాల మదమున మావంతు గాలుమీఱి, వచ్చుదంతావళముఁ గంటె వసుమతీశ
కేలు మొగుచుచు నున్న దీవేళ నీకుఁ, బుడమికన్నియ నడలకు జడిసి కాదె.

186


క.

అని దాని కోసరిల్లుచు, మనుజేంద్రకుమారుతీరు మౌనుల మేమౌ
టను దాని కోసరిల్లుట, సనునె కదా యనుచు సరససల్లాపములన్.

187


సీ.

నగరివిద్వాంసు లందలములు డిగ నూరకందలం బెక్కి పొం డని నుడువుచు
నల్లంతఁ గనినంతేఁ బల్లకీల్ డిగ్గి భూవల్లభు ల్మ్రొక్క దీవన లొసఁగుచుఁ
గేవలభక్తితో లేవవణిక్కులఁ గ్రేవలనఁటఁ గటాక్షించికొనుచు
రాముసౌందర్యంబు ప్రేమఁ జూచుచు వచ్చు కామినీజనులఁ గ్రేఁగంటఁ గనుచు

తే.

వేడ్క గాధేయుఁ డేతేర విని విధేయుఁ, డగుచు మిథిలాధినాథుండు నగరు వెడలి
యమితగజవాజిభటసంకులముగ నెదురు, కొని సపర్య లొసంగి తోకొనుచు వచ్చి.

188


మ.

జనకక్ష్మాపతి కొల్వుకూటమున విశ్వామిత్రు శ్రీరామచం
ద్రుని సౌమిత్రి యథోచితాసనములందు న్నిల్పి పీఠస్థుఁడై
మునిజంభారి ఫలించె నామఘ మఖంబు ల్దూరమైపోయెఁ బా
వనమయ్యెం గులముం గులంబు ననుచు న్వాక్ప్రౌఢి వర్ణింపఁగన్.

189


తే.

జనకచిత్తంబు శ్రీరామచంద్రుఁ దగిలి, కనియె బ్రహ్మానుసంధానమునను గాంచఁ
దవిలి నానంద మపుడు ప్రత్యక్షమైన, సగుణ మట్టిప్రమోద మెసంగు టరుదె.

190


వ.

ఈచందంబున రఘునందను శతకోటికందర్పసౌందర్యుని దర్శించి యమందానం
దంబు నొంది జనకజగతీసంక్రందనుం డిట్లని వితర్కించె.

191


సీ.

సృష్టికిం బ్రతిసృష్టి చేసెనంచును వింటి మీమునీంద్రునిఁ దొల్లి యిపుడు నిచట
నొకట నింద్రోపేంద్రులకుఁ బ్రతినిర్మించెనో లేక సూర్యచంద్రులకుఁ బ్రతియొ
మన్మథునకుఁ బ్రతిమన్మథులో యటు గాకున్న రాజలోకంబునందుఁ
గలుగునే యింత చక్కఁదనంబు పురుషులమనసు హరించె స్త్రీజనము లెంత


తే.

యందు నీయగ్రజుని చెల్వ మరిఁది పొగడ, నితనికిఁ గుమారి నొసఁగి నాయింట నుంచి
కొనెడి భాగ్యంబు దొరకునొకో య టేల, గలుగు దుష్టప్రతిజ్ఞుఁడఁ గాన నేను.

192


శా.

ఏలా చేసితి దుష్ప్రతిజ్ఞ యిఁకఁ జండీశానకోదండ మీ
బాలుం డెక్కిఁడఁజాలకుండిన వృథా పంపింపఁగా నేర్తునే
చాలింపం దగునే ప్రతిజ్ఞ నగరే పాలకు ల్వచ్చె నాం
దోళం బే నిఁక నెట్టిచందమునఁ దీర్తుం ధర్మసందేహమున్.

193


తే.

అని మహాహ్లాదమున విదేహాధినేత, వీర లెవ్వారలో సుకుమారమూర్తు
లనిన దశరథరాజనందనులు వీరు, ధనువుఁ జూడంగ వచ్చినా రనియె మౌని.

194


క.

అనవుఁడు పరమాద్భుతమున, జనకుఁడు దశరథున కిట్టిసంతానము గ
ల్గెనె యిష్టి సఫలమయ్యెనె, కనుఁగొంటిమి నాఁటి యత్నగౌరవ మెల్లన్.

195


ఉ.

శ్రీశుఁడు క్షీరవార్ధి వసియించుట మాని మహిన్ మహీశుఁడై
యీశశరాస మెక్కిడిన నెక్కిడెఁగాక మనుష్యమాతృ లీ
యాశలఁ జెంద నేటికి సురాధిపముఖ్యులచేత నైనఁ గా
దీశిశువు ల్గనుంగొనఁగ నేమిఫలంబు తపోధనాధిపా.

196

చ.

అనవుడు నిక్కమౌను మనుజాధిప నీవనుమాట యైన యీ
జనవరనందను ల్గనఁగ సంతసమందినవారుఁ జూడనీ
ధనువులు వీరిముచ్చట వితావితసేయకు మన్న మౌని మీ
మన సనుచు న్విదేహనృపమౌళి యనేకులఁ బంప వారలున్.

197


చ.

మమత సురాసురు ల్దొలుత మందరభూమిధరంబుఁ దెచ్చుచం
దమున మహేశచాపసముదంచితపేటికఁ దెచ్చియుంచినం
బ్రమదము పూని మౌని రఘురామ కనుంగొను మీశరాసముం
దెమలుప నేర్తువే యనిన ధీరుఁడు శ్రీరఘువీరుఁ డయ్యెడన్.

198


సీ.

తనవిల్లునమ్ములుఁ దమ్మునిచే నిచ్చి మేరుగిరీంద్రంబుమీఁదనుండి
దుమికెడి కొదమసింగముమాడ్కి మణిపీఁఠి డిగి నగుముద్దునెమ్మొగముతోడ
జాఱెడిసిగ కేలఁ జక్క నొక్కుచునుఁ జెక్కులను గట్టాణిచౌకళి నటింప
వలెవాటు నెఱనీటు వలిపెచందురుకావి చేలచెఱంగులు నేలజీర


తే.

దివ్యభూషణకాంతులు తేజరిల్ల, సీత నెచ్చెలు లాడాడఁ జేరిచూడ
నఖిలరాజన్యు లచ్చెరువంద దివిని, సొంపు మీఱి నిలింపులు గుంపుగొనఁగ.

199


తే.

సకలలోకైకమోహనచారురూప, సంపద లెసంగ శ్రీరామచంద్రుఁ డపుడు
గంధమంధరసింధురగమనలీలఁ, జెలువుమీఱంగ నల్లనఁ జేరనరిగి.

200


క.

మందసముత్సాహుల కిఁక, మందుసుమీ యసమసంగ మనుజులు హరువి
ల్మందసముఁ దెఱచిచూచె, న్మందసముద్రేకహరకుమారుఁడు గడిమిన్.

201


సీ.

ప్రత్యక్షమై మించుభర్మశైలముఁ బోలి బహునుపర్వాఢ్యమై పరిఢవిలుచు
దృగ్గోచరం బైన దృక్కర్ణవతిఁ బోలి జ్యావహనోచితసార మగుచు
సాక్షాత్కరించిన శైవధర్మముఁ బోలి ద్రిపురనిర్వాహణనిపుణ మగుచు
నెదుటఁ దోఁచిన నిర్జరేంద్రచాపముఁ బోలి బహువర్షసూచకప్రబల మగుచుఁ


తే.

గనకమయచిత్రకాండప్రకాండ మగుచు, బద్ధమణిఘంటికాకోటిభాగ మగుచు
సర్వభూభృద్భయదవజ్రసార మగుచు, నద్భుతంబైన శంభుశరాసనంబు.

202


క.

కనుఁగొని శ్రీరఘువీరుఁడు, వినతానందనుఁడు సర్పవిభుఁ బట్టెడుమా
డ్కిని కుంభీంద్రము రంభా, వనిజముఁ బెకలించుప్రాభవం బలరారన్.

203


సీ.

లీలఁ గెంగేలఁ గీలించి లేనగవుతో ధరణీశ తాతలతరమునాఁటి
పాతపంచారంబు పసలేదు పేటెత్తె నిది వృథాస్థూల మిందేది బలము
అని మింటికొప్పు గల్గినవాని బలువింటికొప్పున జానకికొప్పుమీఁదఁ
గేలుంచువేడుకఁ గీలించి యటువంచి ధర్మంబు సుగుణయుక్తంబు చేసి


తే.

ఠీవిఁ గళ్యాణవార్తఁ జాటించు ఠేవ, నారి మొఱయించి తెగనిండ నారి దిగిచి
లస్తకస్తలవిన్యస్తహస్త మింత, సళ్ళ ఫెళఫెళఫెళమంచు విల్లు విఱిగె.

204

సీ.

ఎదఁజొక్కి నిదురవోయెడికుంభకర్ణుండు బబ్బరింపుచు లేచి ప్రాకులాడెఁ
గల్పాంతదీర్ఘనిర్ఘాతశంక జనింప నేం డ్లెన్నికొనియె వాణీశ్వరుండు
భయచంచలితవామపాణిహఠాశ్లేష మబ్బెదం భూతవామాంగకునకు
దానును ద్రిపురారిధను వౌటనో మేరుగిరి ప్రతిధ్వనులచే మొఱలు వెట్టె


తే.

జనకకౌశికరామలక్ష్మణులు దక్క, దక్కుగలవారు మూర్ఛిల్లి తగఁ దెలిసిరి
తత్త్రిలోచనచండకోదండదళన, నినద మబ్జభవాండంబు నిండునపుడు.

205


క.

ఒకరిని బట్టం బదుగురు, సకు లాశుభవార్తఁ దెల్ప జానకి లజ్జన్
మొక మింత వంచి యాకౌ, తుకమునకుం దెలిసి యొసఁగెఁ దోరపుసొమ్ముల్.

206


తే.

అంత జనకానుమతిని స్వయంవరోత్స, వమునకై నెచ్చెలులు పంటవలఁతిపట్టిఁ
జందనాలేపరత్నభూషాప్రసూన, చీనిచీనాంబరములఁ గైచేసి రపుడు.

207


సీ.

కడువేడ్క నుబ్బు జక్కవగుబ్బచనుదోయి బిగిజంటఱవికెలోఁ బిక్కటిల్ల
జిలిబిలిపంచదారలు గుల్కు బొమ్మంచు మోవిపైఁ జిఱునవ్వు ముద్దుగురియఁ
నునుఱెప్ప వాల్చి క్రేఁగంటఁ గన్గొనుచూపు మారునారసముతో మాఱుమలయ
జఘనభారంబున జడియు నెన్నెడఁ బాదకటకము ల్ఘలుఘల్లుఘల్లు మనఁగఁ


తే.

గేలఁ జెంగల్వపూదండ గీలుకొల్పి, సిగ్గు నొయ్యారమును మీఱఁ జెలులు వేన
వేలు దనవెంటఁ గొల్చిరా విభవమునను, జనకకన్యక చనుదెంచె జనకుసభకు.

208


ఉ.

ఆజనకేంద్రకన్యరుచిరాంగవిలాసముఁ జూచునంతలో
లేఁజిగురాకు నిద్దపుగలీపుననుంచిన తమ్మిరేకుఖం
డా జళిపించి మారుఁడు తటాలునఁ బేరెదఁ జూచి వైవఁగా
రాజనృపాలశేఖరుఁడు రామనృపాలుఁడు సొక్కి నెమ్మదిన్.

209


తే.

కంటిమో వింటిమో యిటువంటివాలుఁ, గంటి ధరయందె కాదు వేఁగంటి నగరి
గలుగు తెఱగంటి తెలిగంటిగముల నైన, నెటులు సృజియించె ధాత యీయిందుముఖిని.

210


ఉ.

పూపమిటారిచన్నుఁగవ పోఁకల వీకలఁ జౌక సేయు నౌ
రా పలుచాలు మేలుమగరాలసరాల నిరాకరించు నా
హా పగడంపువాతెఱయొయారము చిల్కపటానిపాదుషా
తూవుల కోపుసూవుఁ జెలితోరపుఁజూపులయేపు బాపురే.

211


క.

కన్నె రతనంపుమిన్నా, మిన్నా నడు మనఁటియాకు మేకొను వెన్నా
వెన్నా పలుకులు పొక్కిలి, పొన్నా పొన్నా మెఱుంగుఁబోఁడికి నదిరా.

212


సీ.

వనజాక్షి కటితటం బనుమహీభాగంబు బటువుగుబ్బలపేరి పర్వతములు
హరిమధ్యమధ్యమ మనునంబరంబును మెఱుఁగుముంగురు లనుమేఘములును

సఖియమో మనుపూర్ణచంద్రమండలమును రదపఙ్క్తిపేరి తారాగణంబు
కలకంఠినగ వనుగంగాప్రవాహంబు బెళుకువాల్చూపులపేరి యమున


తే.

సృష్టి చేసెనొ యజునిపై నీర్ష్య మరుఁడు, దాను పద్మోద్భవుఁడు గానఁ గానిచోట
బ్రహ్మసృష్టిని యిటువంటి భామ గలదె, మదనుమాయయే కాని యీమంజువాణి.

213


మ.

అలకవ్యాజముచేతఁ బైకొనెడి నౌరౌరా కురు ల్చీఁకటు
ల్వలెనంచు న్ముఖచంద్రుం డంప నుడుజాలంబంత సీమంతపుం
గళుకుంబాపటపేరఁ ద్రొక్కికొని రాఁగా వీఁగి పాదాంబుజం
బుల వ్రాలెం జెలివేణి ప్రోవఁదగదే మూర్ధన్యసంతానమున్.

214


శా.

నాసామౌక్తికరోహిణీరమణి కాంతావక్త్రచంద్రాధరం
బాసింపం గనుఁగొన్న తారకలకుం బ్రాపింప లజ్జాభరం
బాసన్నశ్రుతికుండలస్ఫురితముక్తాభిఖ్యతారాళితో
సాసాదింపఁగఁ జేరెఁ గానియెడ నేలా యోరఁగాఁ జూడఁగన్.

215


తే.

కమ్మవిలుచెంచుఱేనిచిక్కమునఁ దగులు, కొదమజక్కవపిట్టల యుదుటుఁ దెగడి
జిలుగుపైఠాణిఱవికెలోఁ గులుకు గబ్బి, గుబ్బచనుదోయి యాముద్దుగుమ్మ కవుర.

216


చ.

అని తనుఁ జూచుచున్న జనకాత్మజ నెమ్మది లజ్జ ప్రేమయుం
బెనఁగొన నాలుగేనుమణిపీఠికమెట్టిక లెక్కి రాజనం
దనుగళసీమఁ జెంగలువదండ యమర్చెను వర్ష మంబుదం
బునఁ దిర మొందఁ గ్రొమ్మెఱుఁగు బూనుగతి న్నిజరాగ మేర్పఁడన్.

217


తే.

శ్రీరఘూత్తముఁ డిత్తఱిసీతకేలు, పట్టి తొడమీఁదఁ గూర్చుండఁబెట్టుకొనెడి
యంతమోహంబుతో నుండె నవనికన్య, యంత నంతఃపురంబున కరిగె నరుగ.

218


చ.

ఇతఁడు మనుష్యమాత్రుఁడని యెంచితిఁ గాని యెఱుంగనైతి శ్రీ
పతియని యామహీతనయ పద్మనివాసిని యౌట నిక్క మీ
గతి రవిచంద్రవంశములు గౌరవమొంద జనించినారలో
వ్రతికులనేత నీ వెఱుఁగవా సకలజ్ఞుఁడ వెన్ని చూడఁగన్.

219


తే.

అని జనకనేత దశరథజనవరేణ్య, రాఘవులపెండ్లికిని సాగి రమ్మటంచు
నుత్తరము వ్రాయఁబంచి నియోగిఁ బనుపఁ, బరిఢవము మీఱ నతఁడు నప్పురికి నరిగి.

220


తే.

అవసరంబులవారిచే నధిపునకును, దనదురాక నెఱింగించి మునుపుగాను
వారు దోడ్కొనిపోవ భూవరబలారి, కడుగర లొసంగి పొడగని యొద్దనుండి.

221


క.

జనకనృపు నుత్తరం బని, జనపతికిం దెల్పి రాయసము వ్రాయు నియో
గిని బిలిచి యొసఁగె నతఁడును, జనపతికనుసన్న నదియు సరభసఫణితిన్.

222


సీ.

శ్రీమతుజనకధాత్రీతలనాథుండు దశరథమేదినీధవసురేంద్రు
చాలుమానుసులకు సంప్రీతిఁ బుత్తెంచిన ప్రయోజనము దమనందనుండు

రఘువీరుఁ డిలఁగల్గు రాజన్యు లెవ్వరు నెక్కిడనోపని యీశుచాప
మెక్కిడి విఱిచిన నెంతయు హర్షించి సీత నొసంగ నెంచితిమి మేము


తే.

తనయులును దాము రావలెననుచుఁ జాలు, మానుసులు దశరథరాజమౌళితోడ
దెలిపెడిది యనుపక్కణ గలిగినట్టి, యుత్తరంబును వినుపింప నుత్సహించి.

223


తే.

తనదు సారిగఁ దెల్పు ప్రధానమణికిఁ, గనకపటభూషణము లిచ్చి గౌరవమున
మంచిదే కద జనకసంబంధ మనుచు, బంధువులతోడ యోజించి పైన మగుచు.

224


సీ.

గోరథంబుల నెక్కి కులగురుఁ డాదియౌ తాపసోత్తములు నందంద నడువ
భద్రేభములమీఁద భరతశత్రుఘ్నులు సరిగాఁగ నుభయపార్శ్వముల నడువఁ
గౌసల్య మొదలైనగఱితల ముచ్చుపన్నాగంపుపల్లకీ ల్ముందు నడువఁ
వెనుక డెబ్బదిరెండువినియోగములవారు నాప్తులు నృపులు నందంద నడువఁ


తే.

జిమటపని మీసముల కప్పుఁ జెంపకురులు, నెదను గస్తూరిపట్టెలు నుదుటితిలక
మలర వెలువడె దళథుఁ డౌర ముసలి, సొగ సనుచు వారకామిను ల్సూచి నగఁగ.

225


తే.

ఎదురుగా వచ్చి జనకనరేంద్రు డంత, యేనుఁగులమీఁద సంధించి మానవేంద్రుఁ
బురికిఁ దోడ్తెచ్చి తనసహోదరునివీడు, విడిది గావించి యులుప నెక్కుడుగ నొసఁగె.

226


తే.

కౌశికుఁడు రేయి రామలక్ష్మణులఁ దోడి, కొనుచు వచ్చిన హర్షించి కుశికసుతునిఁ
బొగడి తనయుల యాశ్లేషమునను దనిసె, బంతితేరులపంటవలంతిమగఁడు.

227


సీ.

మఱునాఁడు జనకునిమంత్రులు పిలువరాఁ గొలువు సింగారమై కలిమి మెఱయ
దశరథరాజు నందనులతో నగరికిఁ జనుదేర నెఱిఁగి హజారమునకె
యెదురుగా జనకరాజేంద్రుఁడు సనుదెంచి కేలుమోడ్చిన తోడఁ గేలుమోడ్చె
గేలును గేలును గీలించి సనుదెంచి మునివరు లున్నుగాఁ గనకపీఠ


తే.

ములను వసియింపఁ దదుభయకులనృపాల, కులవసిష్ఠశతానందకులు గణింప
నింత యొప్పునె సంబంధ మిది యటంచు, నెల్లవారును మది సంతసిల్లి రపుడు.

228


తే.

మనుకులోత్తమ సీత రామున కొసంగి, లక్ష్మణకుమారకున కూర్మిళాకుమారి
చే నొసంగెద నని జనకేంద్రుఁ డనిన, నెద దశస్యందనునిమోద మినుమడించె.

229


తే.

తోడుతోడుత భరతశత్రుఘ్నులకును, నీకుశధ్వజతనయల నిమ్మటంచుఁ
గౌశికుఁడు పల్క జనకుఁ డౌఁ గాక యనఁగ, నల దశస్యందనుముదంబు నలుమడించె.

230


వ.

ఇవ్విధంబున రామలక్ష్మణభరతశత్రుఘ్నులకుం గ్రమంబునఁ సీతోర్మిళామాళవీ
శ్రుతకీర్తుల నొసంగ నిశ్చయించి జనకభూపాలుండు గురుముఖంబున మఱునాఁటి
వైవాహికలగ్నంబు శుభప్రదం బని వచించిన నట్ల యౌఁ గాక యని సంతుష్టాం
తరంగుఁడై కొడుకులతో విడిదికిం జని మఱునాఁడు ప్రాతఃకాలంబునఁ దనూభ
వులకు శుభంబుగా గోదానాదిదానంబు లొనరించుచుండె నప్పుడు.

231

సీ.

పట్టెవర్ధనములపైఁ బట్టెఁడక్షత ల్బంగారుప్రోఁగులు నుంగరములుఁ
బైగప్పుకొన్నట్టిపట్టుపచ్చడములు వెలిచాయగల శిరోవేష్టనములు
గన్నెరువన్నెనీర్కావిదోవతులును శిష్యులతోడను జెలువుమీఱ
మాకు వేదము వచ్చు మాకు శాస్త్రము వచ్చు మాకు స్మృతు ల్వచ్చు మాకు శ్రౌత


తే.

మంతయును వచ్చుఁ దారతమ్యంబుఁ దెలిపి, యధిపుచే దాన మిప్పింపుఁ డనుచు నృపతి
విడిది కేఁగు వసిష్ఠుల వెంటఁబడిరి, తొలఁగ ద్రొబ్బఁగ రాక విద్వాంసు లపుడు.

232


తే.

ధీరు లయ్యు స్వతస్సిద్ధదీనవృత్తి, వేఁడి రింతయెకాని యవ్విభుఁడు దాన
వేళ వీథుల వీథుల వెదకి తెచ్చి, విప్రుల కొసంగె దానము ల్వేనవేలు.

233


సీ.

ఏమిదానంబు మీ కిచ్చిరో జాబాలి స్వర్ణధేనువు గాదె వామదేవ
ఘటనూతికి హిరణ్యగర్భ మిచ్చి రదేమి యతఁడు సేసినపుణ్య మట్లు గలిగెఁ
దగ వసిష్ఠుఁడు తారతమ్యంబు లెఱుగఁడె యెక్క డాసందడి యెఱుఁగు టెట్లు
మీ కేమి యిచ్చిరో మేము దానముఁ బట్టమంటిమి మీ రింతయధికు లౌట


తే.

లెఱుఁగ కంటిమి లేదంచు నీర్ష్య దోఁపఁ, బలికికొంచును దానము ల్పట్టినట్టి
బ్రాహ్మణులు ధనమణులు గంపలను భృత్య, వరులు కొనితేర నిండ్లకు నరిగి రపుడు.

234


తే.

అంత నిక్కడ జనకజనాధినాథు, పంపునను సీత మొదలైన పద్మముఖుల
నలువురను బెండ్లికూఁతులఁ జలుపఁ జెలువ, లుదిరి బంగరుపీఁటలు నుంచి రపుడు.

235


తే.

అల యరుంధతి దీవించి యక్షతములు, నుదుటఁ బెట్టినఁ గనుపట్టె సుదతిమోము
ప్రణయకుపితాత్మ రోహిణి పాదలాక్షఁ, దొరసి చెలువందు పూర్ణచంద్రుం డనంగ.

236


క.

తలయంటె నొకతె సీతా, కలకంఠికిఁ గలితరత్నకంకణరణనా
కులదళికులములతోఁ గర, జలరుహమధ్యమునఁ జికురజాలము వొదలన్.

237


క.

కమలాస్త్రుఁడు కెంజిగురుం, జముదాళిని కమ్మతేనె చమిరెడిభంగిన్
రమణీమణి యొక్కతె సీ, తమెఱుఁగునెమ్మేన గంధతైలం బిడియెన్.

238


క.

జలరుహగంధికిఁ గుంకుమ, నలుఁగిడియెన్ బోటియొకతె నఖముల సోఁక
న్గిలిగింతగొనెడి వలిగు, బ్బలపయ్యెదచెఱుగుమాటఁ బకపక నగుచున్.

239


తే.

తళుకుతళుకన మించు కుందనపుబొమ్మఁ, బటిక నార్చువిధంబునఁ బ్రౌఢ యొకతె
మంచిగంధంపుటటకలి నించి మేనఁ, జంద్రవదనకుఁ బన్నీట జలకమార్చె.

240


తే.

సరసి నడయాడు రాజహంసంబుపక్ష, వలసమునఁ గప్పుకైవాలవల్లి యనఁగఁ
జలువపావడవల గొన్న చెలువకురులు, సరసమై మించెఁ దడి యొత్తుసమయమునను.


తే.

వలిపెపైఠాణిచలువదువ్వలువలోన, సరిగెచెంగావిపావడ సగ్గు లీనెఁ
జంచలేక్షణ మేన వ్యాపించినట్టి, తలిరువిల్కానికీర్తిప్రతాపము లను.


తే.

మేదినీసుత చెవిసొర మిగిలియున్న, దశరథకుమారగుణసముదాయ మనఁగఁ
దనరె ముత్యాలకమ్మలు తరణికులుఁ డ, నంతకల్యాణగుణశాలి యనఁగ వినమె.

243

క.

నవమణిమయభూషణముల, నవనిజఁ గైచేసి రప్పు డతివలు మిగులం
దొవరాయల్లుని కెంజిగి, చివురాకుంబాకు చికిలిచేసినమాటిన్.

244


తే.

జగము గెలువఁగ నొకయమ్మె చాలుననుచుఁ, గడమనాల్గమ్ములను రాజకన్యలుగను
రతిపతి సృజించె రఘుకుమారకుల గెలువ, ననఁగ సీతాదికన్యక ల్దనరి రపుడు.

245


సీ.

వలకారియంచ గావలెఁ గాకయున్నచో నధరంబు చరణంబు లరుణ మగునె
కలికిరాచిలుక గావలెఁ గాకయున్నచో ననవిల్తుని వహించుకొనఁగఁ గలదె
కళుకురత్నంబు గావలెఁ గాకయున్నచోఁ గన్నభూసతి రత్నగర్భ యగునె
తొలుకాఱుమెఱుఁగు గావలెఁ గాకయున్నచోఁ జంచలాలోకము ల్సంఘటిలునె


తే.

కంతుబాణంబు గావలెఁ గాకయున్న, భువనమోహనశృంగారపూజ్య యగునె
యనుచుఁ బొగడంగ సకలలోకైకమాన్య, యయ్యును నమాన్యయై మించె నవనికన్య.

246


వ.

అంత జనకమహీకాంతానుమతంబున వివాహముహూర్తంబు సమీపంబయ్యె
నని పురోహితులు పిలువ వచ్చిన.

247


సీ.

ఒరపుగా విరజాజిసరులతో సిగవైచి లాగియా బురుసాకులాయి బెట్టి
గీరికప్రంపుచిక్కెంటనామము దీర్చి శ్రీచూర్ణరేఖ రంజిల్లఁజేసి
మురువుగా హురుమంజిమురువుతో వీనుల కట్టాణి గొప్పచౌకట్లు దాల్చి
మణిహారముల కుంకుమపుపూఁత దెలియంగ రంగైనముత్యాలయంగి దొడిగి


తే.

పెద్దపీతాంబరము గండపెండరంపు, కటకకటిసూత్రకేయూరకంకణాది
దివ్యభూషణజాలంబుఁ దేజరిల్ల, రాముఁ డభినవశృంగారధాముఁ డయ్యె.

248


తే.

చెలులు గైచేసి రటువలెఁ జెలువుమీఱఁ, దోనలక్ష్మణభరతశత్రుఘ్నులకును
నృపసుతచతుష్టయంబు సుదృగ్జనైక, మోహనంబయి తగెఁ జతుర్వ్యూహగరిమ.

249


వ.

ఇత్తెఱంగున రఘుపుంగవుండు దమ్ములుం దానును గల్యాణోచితకల్యాణమణి
మయకల్యాణప్రసూనప్రముఖప్రసూనమాలికాకనకాంబరాదిచతుర్విధశృంగా
రంబు లంగీకరించి మునిపతంగమంగళాశీర్వచనపురస్సరంబుగా గృహాంగ
ణంబు వెలువడి చతుర్దంశంబులు హరిదంతదంతిసత్త్వంబులుం గుందదంత
ప్రభాంగంబులు నగుదంతావళచతుష్టయంబు నెక్కి కరంబుల నంకుశంబు
లంకించి తదగ్రంబులం జూళికల సోఁకించుచు వచ్చునప్పుడు.

250


సీ.

పార్శ్వభాగంబులఁ బట్టిన పదివేలపగలువత్తులుఁ బట్టపగలు సేయఁ
దగిలింపఁ జిఱ్ఱన నెగయు నాకాశబాణంబు లంబరవిమానముల దాఁట

దురుసుగా వెడలెడి బిఱుసులపూవులు భూనభోంతరములఁ బొదివికొనఁగ
నందం దమర్చిన యట్టివిచిత్రంబు బాణవిద్య సురాళి భ్రమయఁజేయ


తే.

నదరువ్రేటులరొదల బ్రహ్మాండ మగల, నెందుఁ జూచిన దివ్వెటీలే వెలుంగ
భూరిశోభనవాద్యము ల్బోరుకలఁగ, బలిసి యెల్లడఁ జతురంగబలము గొలువ.

251


తే.

పదియునాఱేండ్లప్రాయంపుపద్మముఖులు, కాసె గట్టుక మిగులశృంగారముగను
దశరథేంద్రునిమీఁది పదము పాడి, యభినయించుచు నెదుట నృత్యంబు సలుప.

252


సీ.

“జయజీవ వర్ధస్వజగతాంపతే" యంచుఁ జేరి మౌనీంద్రు లాశీర్వదింపఁ
"జండీశ చండకోదండఖండనవిచక్షణ” యంచు వందిమాగధులు పొగడ
శోభనంబులు పాడుచును బుణ్యకాంతలు మునుపుగా గ్రంతలు గొనుచు నడువ
నాప్తమంత్రులును రాజాధిరాజులు దొర ల్నలువంకఁ గ్రమ్ముక కొలిచి రాఁగ


తే.

ముగురుతమ్ములు సరిగ నేనుఁగుల నెక్కి, వెంట నేతేరఁగా రాజవీథి వేడ్క
వచ్చెఁ గోటిసురేంద్రులవైభవమున, భద్రకరి నెక్కి శ్రీరామభద్రుఁ డపుడు.

253


ఉ.

కాంతరొ వీరునల్వురును గంతుజయంతవసంతరోహిణీ
కాంతులొ కాకయున్న మఱిఁ గల్గునె యీభువనైకమోహనా
త్యంతవిలాసరేఖలవిధం బని యొండొరు లాడుకొంచు సౌ
ధాంతరరాజరాజముఖు లారసి యారసికాగ్రగణ్యులన్.

254


చ.

వనితరొ వీరిలో మనసువచ్చిన రాజకుమారుఁ డెవ్వఁడే
యని యొకరాజకన్యఁ జెలి యాడినఁ బో యిది యేటిమాట యం
చును నునుసిగ్గు మీఱఁ దనుఁ జూచినఁ గాదది రూపరేఖక
న్నను రఘురాముఁడే యనిన నవ్విరి తోడిసకు ల్కిలాకిలన్.

255


మ.

వనజాతాయతపత్రలోచనలు భావం బిట్లు రంజిల్లఁగాఁ
గనుచు న్సేసలు జల్ల నుల్లసితశృంగారంబు భాసిల్ల న
ల్లన నేతెంచి విదేహవల్లభుని జాల్వాపెద్దమోసాలఁ జం
గున దంతీంద్రుల డిగ్గి యారతులు గైకొంచున్ రఘుగ్రామణుల్.

256


మ.

జనకక్ష్మావిభువెంబడి న్నడచి చంచద్దివ్యమాణిక్యదీ
పనికాయంబు ఫలోల్లసత్కనకరంభాస్తంభసంభావితం
బును స్వర్ణాబ్జపటీవితానకలితంబు న్సర్వలోకైకరం
జనమౌ హేమవివాహమండపమున న్సౌవర్ణ పీఠంబులన్.

257


క.

ఆసీనులైన యత్తఱి, శ్రీసీతాకన్యకాదిసీమంతినులన్
రాసుతలఁ దోడి తెచ్చిరి, భానురతను కాంతి బయలు బంగరు సేయన్.

258


వ.

అంత వసిష్ఠవిశ్వామిత్రశతానందాదిముదితవిప్రప్రవరసముదితమంత్రపూర్వకం
బుగా లక్ష్మణపూర్వజు పదారవిందంబులు గడిగి మణిమయభూషణాదిపరిణయ
దక్షిణాసంపర్కం బగుమధుపర్కం బొసంగి.

259

శా.

ఏపట్ల న్సహధర్మచారిణిగ నీ కిసీత నాకన్య ధా
రాపూర్వంబుగ నిచ్చితిం గలుగుభద్రం బెప్పుడు న్నీ విఁకన్
జేపట్టందగు నంచు మైథిలనృపశ్రేష్టుండు పల్కంగ సీ
తాపాణిగ్రహణం బొనర్చె రఘునాథస్వామి హృష్టాత్ముఁడై.

260


తే.

ఊర్మిళను లక్ష్మణునకు మహోత్పలాక్షి, యైనమాళవి భరతున కనుపమాన
కీర్తి శత్రుఘ్నునకు శ్రుతకీర్తి నొసఁగె, జనకమహీకాంతుఁ డెంతయుసంతసమున.

261


క.

అప్పుడు పువ్వులవానలు, దెప్పలుగాఁ గురిసె మొరసె దివిదుందుభులున్
ముప్పిరిగొనుమోదముఁ గని, యొప్పిరి జనులెల్ల నమ్మహోత్సవవేళన్.

262


శా.

ఉర్వీదేవులు మంగళాష్టకము లత్యుత్సాహసమ్మోదము
ల్పర్వ న్నెమ్మది బెట్టుగాఁ జదువుచుం బల్మాఱు నాయత్తమా
సర్వాయత్త మటంచు నంతఁ దెరవంచం జానకీరాఘవుల్
పర్వేందూపమవక్త్రము ల్గనిరి దృక్పర్వంబుగా నొండొరుల్.

263


క.

మంగళసూత్రము శ్రీసీ, తాంగనగళమునను రాఘవాధీశుఁడు గ
ట్టెం గదిసి మోవితనమో, ముం గౌఁగిలి తనదు వక్షముం గోరంగన్.

264


సీ.

కళుకుముత్యపుకమ్మ కమ్మపూబంతులఁ గలితకటాక్షభృంగములు గదియఁ
జీనిచక్కెర లొల్కు చిగురాకుమోవిపై మొలకనవ్వులమంచు ముంచుకొనఁగ
రమణీయశృంగారరసపూర్ణకుచఫలభర మోరువక మధ్యభాగ మలయ
నికరంపుఁజిలుపతేనెలఁ దొప్పుదోఁగినచెలువున మేనఁ గ్రొంజెమట వొడమ


తే.

భక్తజనులకుఁ గామితఫలము లొసఁగు, మమత ముంగిటియాలవాలమునఁ దనరు
కల్పలతవోలె మేదినీకన్య యపుడు, ఠీవిఁ దగు మెట్టు ప్రాలపుట్టికను నిలిచి.

265


చ.

నిజభుజమూలకాంతులకు నివ్వెరగందుచు నున్న రామభూ
భుజుని కిరీటభాగమున భూసుత వే తలఁబ్రాలు నించె నం
బుజముఖులెల్ల సీత చెయి ముంచె నటంచు నుతింప నంత నం
గజనిభమూర్తియైన రఘు కాంతుఁడు నించెఁ దదీయవేణికన్.

266


క.

ముడిపడె నని యెడఁదం జిడి, ముడివడకుఁడు మీకుఁ గొంగుముడిఫల మనుచున్
నొడివెడికడఁక వసిష్ఠుఁడు, తొడిఁబడ ముడివైచె దంపతులచేలంబుల్.

267


క.

నునుసిగ్గుఁ బ్రేమ బెనఁగొన, నొనరించె నిలాజ లాజహోమము రఘువ
ర్యునికరములఁ బొదువఁ జెమ, ర్చినదో యిటిలాజ లగ్నిఁ జిటపొటమనఁగన్.

268


ఉ.

కొంచక పాదపల్లవముఁ గొంచుఁ గఠోరపుసన్నెకల్లుఁ దాఁ
కించెదవంచు నల్కఁ దిలకింపదు జానకి పాదమంటి ప్రా
ర్థించెదఁగాక యంచును సతీసఖి గన్గొన రామచంద్రుఁ డొ
క్కించుక నవ్వుకొంచు శుభకృత్యములన్ ఘటియించు వేడుకన్.

269

తే.

కేలఁ గీలించి జానకీనీలవేణి, చరణకమలంబు కెంపురాసన్నెకంటఁ
గదియఁ దాఁకించి యంతలోఁ గందెననుచు, మరలెఁ దత్కాంతి దొరసి యత్యరుణమైన.

270


క.

వలగొనిరి శిఖికి వేడుక, వెలయఁగ ఫలకాంక్ష పల్లవితచూతంబుల్
వలగొను శుకదంపతులుం, బలెను వధూవరులు చెట్టపట్టుక ప్రేమన్.

271


తే.

చూపి ధ్రువు నూరకయ వసిష్ఠుండు నిలువ, నగుచుఁ గౌశికముని యరుంధతినిఁ జూపె
మీపురోహితురాలు సుమ్మీ పురంధ్రి, దయఁ గటాక్షించుమంచును ధరణిసుతకు.

272


సీ.

మంగళం బంభోజ మంజుళేక్షణునకు మంగళం బంగనామన్మథునకు
మంగళం బంభోజమహనీయమూర్తికి మంగళం బసురేంద్రమర్దనునకు
మంగళం బాకాశమణివంశమౌళికి మంగళం బురుకీర్తిమండనునకు
మంగళం బుర్వీకుమారికేశ్వరునకు మంగళం బాజికుమారునకును


తే.

ననుచుఁ బాటలు పాడుచు నతులగతుల,సతులు కంకణఝణఝణత్కృతులు శ్రుతుల
రహి వహింపంగ జానకీరాఘవులకు, మంగళారతు లిచ్చిరి మమత నంత.

273


మ.

తలుపు ల్వట్టుక పేర్లు సెప్పు మని కాంతారత్నము ల్వల్క మె
చ్చులకున్ సీతయు నేను వచ్చితి నటంచు రామచంద్రుండు సి
గ్గొలయన్ రాఘవుఁ డేను వచ్చితి నటం చుర్వీజయుం బల్కుచుం
గులదైవంబు భజించి పెద్దలకు మ్రొక్కు ల్వెట్టి హర్షంబునన్.

274


తే.

నిఖిలబంధులతోడ మాణిక్యదీప, జాలము వెలుంగు పెండిలిచవికలోనఁ
బసిఁడిపీఁటల బువ్వంపుబంతి సాగి, సోదరులతోడఁ బ్రేమఁ గూర్చున్నవేళ.

275


సీ.

నడిచక్కిఁ జేరోజనపుఁజెక్కడపుపైఁడిపళ్లెంబు ముక్కాలిపై ఘటించి
కడవన్నెతళుకుబంగరుగిన్నియలు చుట్టు నమరించి కూర లందంద నిలిపి
పడమటిపన్నీటికుడినీరు రాయంచగిండులు చెంగటఁ గీలుకొల్పి
వలయుపదార్థము ల్వడ్డించి కెలఁకుల వనజలోచనలు వీవనలు విసర


తే.

సఖులు వడ్డించు వింతకజ్ఞముల మర్మ, మెఱిఁగి త్రోయుచుఁ గైకొంచు నిష్టములను
వెలఁది కందిచ్చుచును రామవిభుఁడు వేడ్క, మించుబువ్వంపువిం దారగించునపుడు.

276


సీ.

ప్రొద్దుపోయెనటన్న భూపాల యిటువలెఁ బ్రొద్దుపోవలె నంచుఁ బొగడికొనుచు
వింతపదార్థము ల్సంతరించు మటన్న నింతకన్నను వింత లెవ్వియనుచుఁ

గలిగినయపచారములు క్షమింపు మటన్న నిఁట వింతసేయ నేమిటి కటంచు
ధన్యుఁడ నీదుబాంధవమున ననిన నే మాడువాక్యంబు నీ వాడి తనుచు


తే.

జనకనృపమౌళి దశరథజనవిభుండుఁ, గూర్మి నుపచారములు వల్కికొనుచు సకల
బంధుజనములతోఁ గూడి బంతిసాగి, పెండ్లివిం దారగించిరి ప్రేమతోడ.

277


మ.

కలయం జేతులు వార్చి యున్నయెడ బాగాలిచ్చి వే వియ్యపుం
గులుకుంగుబ్బెత యోర్తు మేలితెలియాకుంజుట్టు లందిచ్చుచోఁ
గళుకుంగేదఁగిరేకుఁ జుట్టి యొసగంగా నంది బొ మ్మంచు కెం
దలిరు న్మోవి గదింప లక్ష్మణునిగాంత ల్నవ్వి రొక్కుమ్మడిన్.

278


ఉ.

చక్కనిపైఁటలోన జలజాతముమాడ్కి యిదేమి తెల్పుమా
గ్రక్కుననంచుఁ దన్ను నొకకామిని వేఁడినఁ బైఁటలోనివా
చిక్కనిచన్నుదోయి యిఁకఁ జెప్పెడి దేమని లక్ష్మణుం డనం
బక్కున నవ్వి రవ్వికచపంకజలోచన మోము వంచఁగన్.

279


మ.

విరికెందామరలోని మిద్దియ కడున్ విన్నాణమయ్యె న్మరం
దరసం బుబ్బెడిఁ జుట్టుఁ గేసరము లందంబాయె లేఁదేఁటీరా
గరులం బోలెడినంచు నొక్కనవలాకంజంబుఁ గాన్కిచ్చిన
న్సరసోక్తుల్ పచరించె లక్ష్మణుఁడు హాస్యప్రౌఢి రంజిల్లఁగన్.

280


వ.

అంత.

281


సీ.

కమ్మక్రొవ్విరి మేలుకట్ల ఘుమ్మనిమించు జాళువానాటకశాలలోనఁ
జికిలిదంతపుబొమ్మ చెక్కడంపుకడాని కళుకుకంబములయంకణమునడుమఁ
బఱచిన రత్నకంబళిమీఁది పచ్చసూర్యపుటంపుగద్దియ నందమైన
బురుసాతివాసిపై నిరుగడబలుదిండ్లు తలగడ నొఱఁగి యద్దశరథుండు


తే.

జనకనృపమౌళి గొలువున్న సవిధమునను, రాఘవాదికుమారవర్గంబు మునులు
నవల బంధులు రాజులు నా ప్రజనులు, నిండి కనుఁగొనఁ గన్నులపండువుగను.

282


ఉ.

అట ధిమ్మంచు మృదంగతాళములు మ్రోయన్ ఖంగునన్ ఠాయిగా
బటువుం గుబ్బెతదోయి రాగమనియె న్పాడెం బదం బొండు నం
తట గ్రొమ్ముత్తెపుతీఁగమోడి తెరయెత్త న్మేమము ల్బాసి వి
స్ఫుటలౌ చంద్రకళల్వలె న్వెడలి రంభోజాతపత్రేక్షణల్.

283


క.

నెలకొని చక్కఁగఁ బుష్పాం, జలి యిచ్చి నటించి రంత సఖియలు బహుభం
గుల వారియాటపాటల, శిలలు గరంగె నన జనుల చిత్తము లరుదే.

284


సీ.

నెలకొని చక్కఁగా నిలిచిన నిలుకడ మిహికుందనపుబొమ్మ మహిని నిలుపఁ
జికిలికోపులు కమ్మచేకత్తి మాష్టీని చికటారిపొదలికఁ జెలువు గులుక
నభినయించుచును బదార్థము ల్దెలుపుచో రతిముద్దురాచిల్క రహి వహింప
ఠీవిగాఁ దిరుపుగట్టి తటానఁ దిరువుచోఁ దొలుకరిమెఱుఁగులు దులకరింపఁ

తే.

గొసరుచూపుల బెళుకు బేడిసలునిగుడ, సొగసు ముత్యాలచనుకట్టు బిగువు సూపఁ
దళుకుఁజెంగావికాసె బిత్తఱము నెఱపఁ, జెలఁగి పదచాళి వినిపించెఁ జెలువ యొకతె.

285


తే.

దురుపదంబులు సొక్కు మైసిరులు వొసఁగ, సరిగ నిరుగెల గుంచియ లవదరించి
పెక్కువగ జక్కిణీకోపు ద్రొక్కె నొక్క, చక్కనిమిటారి నరపతు ల్సొక్కి చూడ.

286


క.

ఎఱుకో యెఱుక యటంచుం, గొరవంజి నటించె నొక్కగురుకుచ చంకన్
బురుకఁడు బంగరుబుట్టియు, సొరిదిం గొల్లాపురమ్మసుద్దులు వెలయన్.

287


క.

తరకటబురకట గాదే, తరుణీ నామాట నీకుఁ దార్కాణగు నే
బురుకనికి బువ్వ దేవే, యెఱు కడగవె యంచు నొక్కయింతి నటించెన్.

288


తే.

ఇంతి యొక్కతె యర్ధనారీశవేష, మూని సాక్షాత్కరించిన మౌనిజనులు
బ్రమసి సద్భక్తి “జయజయ పార్వతీశ", యనుచు మ్రొక్కిరి నృపులు గన్గొనుచు నగఁగ.

289


క.

చెలి తకతోం తకతోం ద, త్తళంగతోంధిక్దుతోంత తధిగిణతో మం
చలవోక దీరెఁ బేరణి, వెలయించుచుఁ జూచువారు విస్మయమందన్.

290


తే.

తరుణవిటులు నటించిన దశరథుఁడును, జెలఁగి రత్నాభిషేకంబు చేసి యంత
నటులకు సువర్ణమణిభూషణము లొసంగి, చాలబహుమానము లొనర్చె సంతసమున.

291


తే.

కలయఁ గుంకుమ కస్తురి కప్పురంపు, వీడెము లొసంగి దశరథు విడిది కంపి
యంచితోల్లాసమున జనకావనీంద్ర, చంద్రుఁడు శయించె వేఁకువజామువేళ.

292


వ.

ఇవ్విధంబున సకలసంభ్రమంబులు గలిగి లక్ష్మీనారాయణుల కల్యాణంబునుం
బోలె నమందరాగాధిష్ఠితంబై పార్వతీపరమేశ్వరుల పరిణయంబునుంబోలె
సమరసాభిరామంబై పౌలోమిపాకశాసనుల పాణిగ్రహణంబునుంబోలె జనక
సమ్మదంబై సీతారామమహోత్సవంబు వెలసె నంత.

293


క.

కవిగాయకాదియాచక, నివహములకుఁ ద్యాగ మొసఁగి నృపతులకుం బం
ధువులకు దశరథముఖభూ, ధవులకు బహుమతి యొనర్చెఁ దగువైఖరులన్.

294


సీ.

మదమేనుఁగులు మంచిమాపుతేజీలు మేలాయుధంబులజోళ్లు నరదములను
సకినెలపట్టెమంచంబులు పచ్చలపల్లకీల్ రాచిల్కపంజరములు
సరిగెజీనువజీని సురటీలు నిలువుటద్దంబులు నుడిగెంపుఁదలిరుఁబోండ్లు
పట్టంబరంబులు పరిమళపేటిక ల్ముఖ్యభూషణములు మొదలు గాఁగ


తే.

నన్యకన్యాజనకగర్వహరణముగను, హరణముగ నిచ్చె నల్లుండ్ర కాఁడుబిడ్డ
లకును వెయ్యేసి గ్రామము ల్పసుపునకు నొ, సంగి పంచె విదేహభూజాని యంత.

295


చ.

దశరథదారుణీధవసుధాకరుఁ డెంతయు భక్తి మీఱ న
క్కుశికకుమారు నంపి కొడుకు ల్మహిజాదివధూజనంబులున్

శశిముఖు లేఁగుదేర నిజసైన్యముతో బహుతూర్యఘోషముల్
దశదిశలన్ ఘనంబయి చెలంగ నయోధ్యకు వచ్చుచుండఁగన్.

296


సీ.

రాజహంసాళి దుర్ధర్షకామర్షవర్షతటిచ్ఛటులునా జడలు దనర
స్వకృతరక్తహ్రదసంసూచకంబులై దహనోగ్రరక్తనేత్రములు వెలుఁగ
నిబిడనిజోచ్ఛ్వాసనిశ్వాసపవనతీవ్రమున నా నధరప్రవాళ మదర
శాంతినిర్గమనావసరముఖాద్విశ్లథార్గళులనా దంతసంఘర్ష మొదవఁ


తే.

బాదఘట్టన మేదినీభాగ మగల, గండ్రగొడ్డలి భుజమునఁ గ్రాల వేఁడి
వేఁడి రాముఁ డటంచును విలయరుద్ర, రౌద్రమున వచ్చె భార్గవరాముఁ డపుడు.

297


సీ.

ఇక నేమి సేయుద మెందు డాఁగుద మంచు దశరథేశ్వరుఁ డెదఁ దల్లడిల్ల
సంయమిఁ బుత్రభిక్ష యొసంగు మని వేఁడుదునొ యంచుఁ గోసలతనయ గలఁగ
నిన్న నయ్యెను బెండ్లి నేఁ డిట్టియలజడి వచ్చెనే యని సీత వగలఁ బొగుల
మనచే నసాధ్యుఁ డేమనవచ్చు నిఁక నంచు ననుజు లింతింత నాయత్తపడఁగ


తే.

నల వసిష్టాదు లర్ఘ్యపాద్యములు గొనుచు, నలికి చేరక యూరక నిలిచియుండఁ
జేరి ప్రణమిల్లి యంజలి చేసి యున్న, రాముఁ గనుఁగొని భార్గవరాముఁ డనియె.

298


సీ.

ఖండించె నేవీరకార్తవీర్యావార్యఘనభుజాకదలికాకాననంబుఁ
జండించె నేమహేశ్వరకుమారునితోడఁ గ్రౌంచభూధరవిదారణనిరూఢి
మండించె నేమహోద్దండప్రతాపవైశ్వానరుచే రాజవంశములను
బండించె నేయాగఫలము తండ్రికిని శాశ్వతమగు సప్తర్షిస్థాన మొసఁగి


తే.

యహహ సామాన్యుఁడనె యెంచ నశ్వమేధ, సవనదీక్షాంతకశ్యపసంయమీంద్ర
దత్తసప్తసముద్రాంతధరణితలుఁడ, భార్గవుఁడ ధావదరివాసభార్గవుఁడను.

299


తే.

బాపురే నన్ను బీదబాఁపనివిధంబు, నను గనుంగొని యర్ఘ్యదానం బొసంగ
వచ్చితివె యంచు రోషంబు పెచ్చుపెరుఁగ, రామచంద్రున కనియె భార్గవుఁడు మఱియు.

300


శా.

ఓరీ రాజకులాధమా తెలిసె నోహో నీదుబ్రహ్మణ్య మీ
ఘోరాస్త్రంబుల దానవీహరణమే కోపంచుఁ గావించి తీ
వౌరా తాటక తల్లి గాదు గదవయ్యా భూమి నిఃక్షత్రగా
నేరాసేయుట సత్యవాదివవు లే నే నెవ్వడన్ దెల్పుమా.

301


మ.

అనుచున్ భార్గవరోషపోషణపటువ్యాహారము ల్మీఱఁ ద
ద్ధనువుం తేజముతోడఁ గైకొని సమున్యద్భాహుదర్పంబునం
గొనయం బెక్కిడి యమ్ము గూర్చి యిఁక నీకుం శాస్తి గావింప కేఁ
జన నాబాణ మమోఘ మంచు ధరణీజాభర్త యత్యుగ్రుఁడై.

302

తే.

భార్గవుఁడు పెక్కునాళ్లు తపంబువలనఁ గూర్చు స్వర్ణోకములనెల్ల గూల్చె నొక్క
కోలఁ 'గుమ్మరి కేఁడును గుదియ కొక్క, పె'ట్టటంచును బల్కఁగాఁ బృథివి వినమె.

303


తే.

జామదగ్న్యుండు విష్ణుతేజంబు సనిన, రామచంద్రనృపాల మార్తాండు దండఁ
జందురుఁడుపోలి కనుపట్టె సవినయముగఁ, దొలఁగెఁ దా మున్ను వచ్చిన త్రోవఁ బట్టి.

304


తే.

సకలజనము సెలఁగె జానకీకల్యాణ, వేళకన్న రామవిజయలక్ష్మి
కలసియున్న రాముఁ గాంచి సీతయు మెచ్చె, సవతిమత్సరంబు సతికిఁ గలదె.

305


వ.

అంత.

306


మ.

జనకుండు జనను ల్సహోదరులుఁ దజ్జాయ ల్మునిజ్యాయలున్
జననాథు ల్హితులుం బురోహితవరు ల్సైన్యంబు లేతేరఁగా
జనకక్షోణివరాగ్రగణ్యసుతతో శత్రుంజయారూఢుఁడై
తనసాకేతపురంబు సొచ్చె రఘునాథస్వామి హర్షంబునన్.

307


సీ.

అకలంకమణికంకణకళంకరహితేందుమహితాస్య లుభయచామరలు వీవ
నుడిగంవువిడికెంపుపొడికెంపునునుమోవిపడఁతులు వన్నెపావడలు వైవ
మరుదధ్వచరదధ్వబిరుదధ్వజచ్ఛాయ నేలకు నీలి బూర్ణీసు గాఁగ
నెలవంకవలవంక నలశంకరకుమారుఁ బ్రతిఘటింపఁగఁజాలు భటులు గొలువఁ


తే.

బౌరవారిజముఖులు సొం పౌర యనుచు, సేసకొప్పులు గదలంగ సేసఁ జల్ల
రామభూజాని జూనకీరామతోడ, నగరుచిరసౌధ మగుతననగరు సొచ్చె.

308


వ.

అంత.

309


సీ.

చికిలికెమ్మోవికెంజిగురు మిటారింప దంతకోరకము లందంబు గాఁగ
మవ్వంపుఁజిఱునవ్వుఁబువ్వు నివ్వటిలంగఁ బొదలు వాల్చూపుతుమ్మెదలు మెదలఁ
గలకలఁ గోయిలపలుకులు చెలరేఁగఁ గలితనాసాచంపకము దనర్పఁ
జెన్నుగాఁ బొక్కిలి పొన్నక్రొవ్విరి మించ గుత్తంపుగుబ్బపూగుత్తు లలరఁ


తే.

బ్రథమఋతుమతి యయ్యె ధరాతనూజ, శుభదినంబున నంతట శోభనంబు
సేసి రారేయి రఘుపతి చిత్తజాత, కేలికాలోలుఁడై కేళిగృహమునందు.

310


చ.

పగడపుఁగోళ్లుఁ గుందనపుఁబట్టెలు గుజ్జరినేఁతపట్టెయం
చగరులపాన్పు జాజివిరిశయ్య దుకూలము పై తలాడలున్
జిగిదళుకొత్తు చప్పరము చెందొవ క్రొవ్విరిచందువాలతా
విగలిగిమించు మంచమున వేడుక శ్రీరఘురాముఁ డున్నెడన్.

311


సీ.

తళుకుముత్యపుకొప్పు వలనిగ్గు మదబంభరాళికి విరిగుత్తియాసఁ గొలువఁ
జుఱుకుకెంపులకమ్మమెఱుఁగు వేఁ జెక్కులఁ గుంకుమమకరికల్ గుదురుకొలుపఁ

గడకంటికెంజాయ గర్ణాంతరంబుల వలగొని మేనిజవ్వాది యుంచఁ
గస్తూరితిలకంబుకాంతి దీవెలు సాఁగి చెదరుముంగురుల యొప్పిరము గులుకఁ


తే.

జెలులు గైసేసి జానకిఁ జెలువు మీఱ, నల్లనల్లన దోఁదెచ్చి యధిపుచెంత
నిలిపి వారెల్ల నొక్కొకనెపము పూని, వెడలి చనినను శ్రీరామవిభుఁడు వేడ్క.

312


ఉ.

బాలిక వీడె మిమ్మనుచు బాహువు సాచిన మాట దాటఁగాఁ
జాలక సాధ్విగాన జలజాతవిలోచన కప్పురంపుబా
గా లొసగంగఁ గైకొని తగన్మడుపొయ్యనఁ జుట్టి యీయ శం
పాలలితాంగి నీదుగుచభారము నెన్నడు మోర్వనేర్చునే.

313


ఉ.

రమ్మని రామచంద్రుఁ డనురాగము మీఱ ధరాకుమారి నం
కమ్మున నుంచి సిగ్గునను గ్రక్కున డిగ్గిన డిగ్గనీక హ
స్తమ్ములఁ బట్టి ముంగురులు సక్కఁగ దువ్వుచుఁ దళ్కుబెళ్కు పై
చెమ్మట గోట మిటి వలిసిబ్బెపుగుబ్బసరు ల్దెమల్చుచున్.

314


సీ.

చవిచూడనీయవే చంద్రబింబాస్య నీకండచక్కెరమోవి గరఁగిపోదు
లీలఁ గెంగేలఁ గీలింపనీయవె కొమ్మ వలిగుబ్బిబంతులు వాడిపోవు
మించి బిగ్గరఁ గౌగిలింపనీయవె బాల జాళువానెమ్మేను సమసిపోవ
దింపుతో ముద్దాడ నీయవే కామినీమణి చెక్కుటద్దము ల్మాసిపోవు


తే.

తెఱవతల యెత్తి చూడవే దృష్టి దాఁక, దిందుముఖ పల్కవే తేనె చిందిపోవ
దువిద నవ్వవె క్రొవ్విరు లుడిగిపోవ, వంచు వేఁడుచు రఘుభర్త మించుతమిని.

315


ఉ.

కంచుక మేటికే చెమట గ్రమ్మెడి నంచు సడల్పఁబూని యు
బ్బించకు మే నటం చనిన బిత్తఱి యంతకు నుబ్బగాఁ బటా
పంచయి వీడెఁ గంచుకము పక్కున నిద్దపుపైడికొండలం
దంచితమైన మంచినకరాప్తిని మించుక్రమంబు దోఁపఁగన్.

316


తే.

వజ్రసంపర్కమున కోర్చి వరవిచిత్ర, పత్రవైఖరిఁ బొల్చు నీబటువుగబ్బి
కులుకుగుబ్బలు కులశైలములను మించె, నేటి కళికెదు నాకోట కిటవధూటి.

317


క.

అని సయ్యాటంబునఁ జ, న్మొన లలముచు మోవియాన ముద్దియ నొక్కెన్
మొనపంటఁ జుఱుక్కన నొ, క్కినఁ దెప్పిరి చెక్కు ద్రోచి కినుకన్ లేవన్.

318


చ.

తరుణిరొ వాఁడిగోరు గలదాన వటంచును జెక్కు నించి నీ
వరిగెదు పొమ్ము పొమ్ము నిను నారడి పెట్టకపోదునే సఖీ
పరిసరసీమఁ జూప వనబాలిక పోవఁగఁ గాళ్లు రాక ని
బ్బరమును లజ్జ నిల్వఁ బయిపాటున గౌఁగిటఁ జేర్చి క్రమ్మఱన్.

319


క.

అలరున్ శయ్యకుఁ దారిచి, జలజానన చిత్త మెఱిఁగి సమరతికలనన్
గళలంటి కరఁచి శ్రమజల, కలితుఁ డయినయంత మదనకదనాంతమునన్.

320

సీ.

ఒకసాలభంజిక యొయ్యనఁ గమ్మదెమ్మెరలు రాఁ గపురంపుసురటి విసరె
నొకరత్నపాంచాలి యొసపరితావిపన్నీటిచేగిండి పాణికి నొసంగె
నొకపైఁడిప్రతిమ యొద్దికతోడ గండూష మొనరింపఁ గాళాంజిఁ గొనుచు వచ్చె
నొక్కజంత్రపుబొమ్మ యుమ్మెత్తవిరిచాయ నందమౌ పావడ యందియిచ్చె


తే.

నొక్కమణిపుత్రి వాసనపక్క లొసఁగె, మడిచియుండిన తెలనాకుమడుపు లొసఁగె
రాఘవుఁడు నేర్పుమీఱ సూత్రము గదల్ప, సీత చెలులంచు లజ్జచే సెజ్జ డిగియె.

321


క.

మతి దెలియ నవ్వుచుఁ బునా, రతులం దేలించి యంత బ్రౌఢను జేసెన్
సతిఁ గ్రమమున శ్రీరఘుపతి, చతురతరుఁడు గాఁడె యతనుశాస్త్రములందున్.

322


క.

ఈగతి రఘుకులపతి యను, రాగమతి ధరాసుతావరారోహాసం
భోగాభోగసుఖోన్నతుఁ, డై గిరిగొనువేడ్క నహరహము విహరించెన్.

323


క.

అని శ్రీవైశంపాయన, మునిముఖ్యుఁడు దెల్ప విని ప్రమోదాన్వితుఁడై
జనమేజయుఁ డవ్వలికథ, యనఘా వినవలతుఁ దెలుపు మని యడుగుటయున్.

324


క.

ప్రౌఢ్యసితద్రాక్షారస, లేఢ్యసమవచోవిలాస లేఖాచార్యా
రూఢ్యంచిత మేథావిభ, వాఢ్య నవోదారతోత్సవాఢోకమనా.

325


మ.

రమణీకీర్తితకీర్తితప్తహిమతారాకాశ రాకాశశాం
కమనోజ్ఞానన జ్ఞాననవ్యమిథిలాకాంతేంద్ర కాంతేంద్రనీ
లమణీకుంతలకుంకులక్ష్మభటలీలాభవ్యలాభవ్యయ
ప్రమదాపాదన పాదనమ్రనృపశుంభద్రాగభద్రాగమా.

326


ఉత్సాహ.

అమృతధామ గిరిశధామ హరసుధామరాశికా
హిమకరా మరతరుసోమహిమకరామజాహ్నవీ
కమలభూమదరలలామకరివిరామదేవతా
రమణసామజసితతామరస యశోమనోహరా.

327
క.

శ్రీరమ్య మగదలాన్వయ, సారసనవహంసయోగ సారసమేతా
త్మారూఢ హంససన్నుత, సారయశోహంస కృష్ణసచివవతంసా.

1


తే.

అవధరింపుము జనమేజయక్షితీశ, శేఖరున కిట్టులను వ్యాసశిష్యమౌని
ధారుణీనాథ యవలికథావిధంబు, తెలియఁజెప్పెద వినుమని తెలుపఁదొణఁగె.

2


సీ.

శ్రీరామచంద్రునిఁ జికరాయపట్టంబు గట్టగా దశరథక్ష్మావిభుండు
సమకట్టి పురమెల్లఁ జాలశృంగారింపఁ బనిచిన యట్టిసంభ్రమముఁ జూచి
దురితాత్మురాలు మందర సహింపఁగలేక గునుకుఁ బర్వున గూనుగునియ నేగి
యిఁక నేటినిదుర లేవే యని కైకను దొడదట్టి లేపి యోపడఁతి వినవె

తే.

రాముఁ బట్టము గట్టఁగా రాజు పూనె, భరతుఁ డింకిట రఘుపతిబంటువాఁడు
నీవు కౌసల్యదాసివి నే నిఁకేల, వెలఁది తొత్తుకుఁ బడితొత్తు గలదె యెందు.

3


తే.

అటులు గాదేని రాముపట్టాభిషేక, విఘ్న మొనరింపఁగా నొకవింతయుపమ
గలదు తగినది నీకుఁ గావలనెనేని, చెప్పెద నటంచుఁ జెవిలోనఁ జెప్పి పనుప.

4


క.

తలపట్టు బెట్టి కోపపు, టిలు సొచ్చెం గైక దశరథేశుఁడు వచ్చెన్
వలపు దలకెక్కఁ జూచెన్, లలనామణి గుండెజల్లనఁగ నిట్లనియెన్.

5


ఉ.

[2]ఎందుకుఁ బల్కవే తరుణి యేమిటి కల్గితివే మిటారి నా
యందలినేర మేమె చెలి యేమి యెఱుంగనె కొమ్మ కొండెముల్
విందురె ముద్దుగుమ్మ వెడవింటివజీరున కొప్పగించకే
యిందుముఖీ యయోరతుల నేలఁగదే జగదేకసుందరీ.

6


సీ.

తరుణి నీయధరామృతం బొసంగఁగఁ గాదె యవనిలో నాకు దీర్ఘాయు వొదవె
రమణి నీదుముఖాంతరమున గాదె యశేషరాజమండలము గర్వం బడంగె
లలన నీశ్రోణీఫలకజితమై గదే ధరణిచక్రంబు నామఱుఁగుఁ జొచ్చె
లోలాక్షి నీదయాలోకంబుననె గాదె ప్రాపించె నాది శంబరజయంబు


తే.

నిట్టి నినుఁ బాయజాల నీకేల యలుక, యనుచుఁ గైకను దశరఁథుఁడ నునయించి
ముదిసిముప్పునఁ దన కేల మోహ మనుచు, మరుఁడు రతిచేతిలోఁ జెయి సఱచె ననఁగ.

7


క.

జనపతి యిటువలె వేఁడుచు, వనితామణి యలుకలేల వలసిన విత్తు
న్ననుఁ గోరుమనినఁ గేకయ, తనయామణి యిట్టు లనియె దశరథుతోడన్.

8


ఉ.

భూవర పూర్వదత్తవరము ల్దయచేయుము నేఁడు నీకు నేఁ
గావలెనన్న నం దొకటఁ గట్టుము పట్టము మత్కుమారు సీ
తావిభు నొక్కటకొ వనపదంబున నుంచు చతుర్దశాబ్దము
ల్నావుడు మూర్ఛపోయె నరనాథుఁడు రాముఁడు వచ్చి యంతటన్.

9


మ.

జననీ భూపతి పల్కఁ డే లని వచింపం గైక సీతాధిపా
వినుమా నే నిట నిన్నుఁ గాన కనుప న్వేడన్ వరంబిచ్చినం
బనువం బిల్వఁగబంచి సంశయపడెం బల్కంగ నేమందువో
యని సత్పుత్రుఁడ వీవు మాట వినవే యంచుం బ్రశంసింపఁగన్.

10


క.

అమ్మా యింతేగద కా, నిమ్మని యోతండ్రి యడలనేటికి నీవా
క్యముఁ గయికొంటి నిదిగో వ, నమ్మున కరిగెద నటంచు నయనిధి యంతన్.

11


సీ.

కైక యొసంగువల్కలములు దాఁగట్టి కట్టనేరక సీత గాంచునపుడు
హారామ ననుఁ బాసి యడవి కేఁగెదవంచు భూపతి వెలవెలబోవు నపుడు
పట్టి నాకడుపునఁ బుట్టి యిటైతివే యని తల్లి కౌసల్య యడలునపుడు
శ్రీమించు పట్టాషిషేకసామగ్రికి వలగొని యంజలి సలుపునపుడు

తే.

మది చుఱక్కనకుండునే మహితధైర్య, శాలి గావున శ్రీరామచంద్రమూర్తి
యందుఁ గనఁబడనీయక మందహాస, కందళితమైన మోము వేడ్కలనె దెలుప.

12


సీ.

మహితనితంబబింబంబు జాంబూనదమయమహారథవిభ్రమంబుఁ జూప
గుత్తంపువలిగబ్బిగుబ్బచన్గవఠీవి భద్రకుంభులవిజృంభణము నెఱపఁ
జిల్క తేనియలొల్కఁ బల్కెడిపల్కులఁ బ్రద్యుమ్నవాహము ల్బారుదీర
జఘనభారంబున జడియునెన్నడలును రాజహంసకులీనరాజి పొదల


తే.

సీత వెనుకొన రాజ్యలక్ష్మియును బోలి, తాను దమ్ముఁడు దశరథదత్తయైన
క్షమ వహింపక యప్పటిక్షమ వహించి, రామచంద్రుఁడు శృంగిబేరమున కరుగ.

13


మ.

కులుకుంగుబ్బలపైఁట జాఱఁ జిగిచెక్కుల్ చెమ్మగిల్లంగ మై
పులక ల్మించఁగఁ జెంచుజవ్వనులు సొంపు ల్మీఱ శ్రీరామునిన్
బెళుకుంజూపులఁ జూడ సీత యట నీర్ష్యాదృష్టిచే నట్టివా
రలఁ జూచుం జిఱునవ్వుమోమునఁ దనుం బ్రాణేశుఁ డీక్షింపఁగన్.

14


వ.

అంత.

15


తే.

శబరిపతిపూజలకు మెచ్చి జడలు వూని, దశరథనృపాలుని మనోరథంబుతోడ
రథము మరలించి యానాగపదగభీర, మైన భాగీరథిఁ దరించి యవలిసరణి.

16


సీ.

కమనీయపద్మరాగకిరీటతులితమై పల్లవారుణజటాభరము దనర
హరిచందనపుఁబూఁతహరువునఁ గపురంబుబూది నెమ్మెయిపూఁతపొలుపు మిగులఁ
దెలిసాలెజిలుగుదువ్వలువచెల్వంబున లలితకటీరవల్కలము లలర
మకరకుండలహారమణిముద్రికలు కోటినవరత్నమయభూషణములు గాఁగ


తే.

మినుకుదంతంబుపావలు మెట్టి గట్టి, విల్లునమ్ములు చేపట్టి వెంట ముద్దుఁ
గులుకునడ సీత వినయంబు దెలుపఁ దమ్ముఁ, డరుగుదేరఁగ శ్రీరాముఁ డరుగునపుడు.

17


మ.

ఎలనాఁగా తల యెత్తి చూడఁగదె వీ రెవ్వారు వీ రేమి గా
వలెనే యంచని యమ్మలక్క లటఁ ద్రోవన్ వేఁడ నీపైఁడిచా
యలచే మించు నతండు నామఱది యౌనం చంతటన్ సిగ్గుచే
దలవంచు న్మహికన్య వార లదె యాతం డెవ్వఁడే యం చనన్.

18


సీ.

వడి గాఁగ నాలుగైదడుగులు ముందయి వెనుకఁ జిక్కితి వేమి యనుచుఁ బిలుచుఁ
దను జూచు కాఁపుజవ్వనులు ముత్తెపుసొమ్ము ధరియింపరేలని ధవుని వేఁడుఁ
జెలికత్తెవలె లెస్స పలుకుచున్నది మావి నలచిల్కఁ బట్టి యిమ్మనుచుఁ గొసరు
మనయింట శృంగారవని గల్గ వనవాసమున కిందు రానేల ననుచు నలయుఁ


తే.

జెట్టు జెట్టు గనుంగొను జెలమ చెలమఁ, జల్లనీరాను బొదపొద మొల్లవిరుల
చిదుమ రమ్మన్న నిదిగొ వచ్చెద పదుండ, యని సొలయు సీత త్రోవలోఁ జనుచు నపుడు.

19

మ.

అదె కన్గొంటి విచిత్రకూటము ప్రఫుల్లాంభోజపత్త్రాక్షిపై
కుదురయ్యె న్నెలవంక యీచెలువు నీకుం జూడ నెట్లొప్పె మా
కుఁ దగం దెల్పుమటంచు సీత నగుచున్ గోరంటగాఁ జంటిప
య్యెద గప్పంగ రఘూద్వహుండు చని యయ్యద్రీంద్రకూటంబునన్.

20


చ.

రజనిచరాంతకుండు రఘురాముఁడు వేడుకమీఱ జానకీ
గజగమనాసమేతముగఁ గానలఁ ద్రిమ్మర నచ్చటచ్చటన్
ధ్వజకలశాతపత్రసముదంచితతత్పదముద్రఁ జూచి త
ద్రజము మహామునీంద్రులు శిరంబునఁ దాల్తురు భక్తి మీఱఁగన్.

21


వ.

అంత నక్కడ.

22


ఉ.

శత్రుల రావణాదులను జంపు మటంచును రామచంద్రు నా
పుత్రకుఁ బంచితిన్ భయముఁ బొందకు మింకిట నంచుఁ బూర్వపున్
మిత్రుఁడు దేవతాపతికి మేలెఱిఁగింపఁగఁ బోయెనో యనన్
ధాత్రినిఁ బాసి యద్దశరథక్షితిపాలుఁడు చేరె స్వర్గమున్.

23


ఉ.

అంత వసిష్ఠుఁ డంపఁగ రయంబునఁ జారులు వోయి పిల్చినన్
స్వాంతము సంచలింపఁగను సానుజుఁడై భరతుండు వచ్చి య
త్యంతసువర్ణరత్నమయమయ్యు నొకింతయు దాతగాని శ్రీ
మంతునివీఁడుఁబోలెఁ గళమాసిన యట్టియయోధ్యఁ జూచుచున్.

24


తే.

నగరు సొచ్చిన యంతలో నిగుడు వేడ్క, నెదురుగా వచ్చి కైకేయి యిదిగొ నీకుఁ
గాను బంపితి రామలక్ష్మణుల వనికి, జనపతియు నీల్గె ధరణిఁ గైకొను మటన్న.

25


చ.

అడవుల కేఁగె రాముఁడు సహానుజుఁడై యనుమాట వీనులం
బడ భరతుండు మూర్ఛిలి యమాత్యులు దెల్పఁగఁ దేరి కైక నీ
కడుపునఁ బుట్టి నింద కొడిగట్టితిఁగా యని [3]బాష్పనేత్రుఁడై
యడలి పితృక్రియ ల్సలిపి యంతట రాఘవుఁ జేరె వేఁడఁగన్.

26


సీ.

నినుఁ జూడ కుండఁజాలను రార నారామచంద్ర యటంచుఁ గౌసల్య పిలువ
నేరంబు గలదు మన్నింపు మంచును గైక విడక చేతులు వట్టి వేఁడుకొనఁగ
వలదన్నయాపె పిల్వఁగను రారాదొకో[4] పుత్ర యటంచు సుమిత్ర నుడువ
నిందఱు ప్రార్థింప నిది యేటిచలము పోద మటంచు సౌమిత్రి తరువు సేయ


తే.

భరతశత్రుఘ్ను లిరువురు పాదయుగముఁ, బట్టుకొని రాక విడుమంచు నెట్టుకొనఁగ
దొరయునగవునఁ దనదు పాదుక లొసంగి, పనిచె రఘుభర్త పురికదంభరతు భరతు.

27

వ.

ఇవ్విధంబున.

28


ఉ.

పట్టము గట్టుకొమ్మనుచుఁ బల్మఱు ప్రార్థన సేయ రాముఁ డే
పట్టున నిచ్చలేక తనపాదుక లిచ్చినఁ దెచ్చి వానికిం
బట్టము గట్టి భూమి పరిపాలన చేసెను గ్రామవాసియై
పుట్టునె యెందునున్ భరతుఁ బోలినసోదరుఁ డెంచి చూచినన్.

29


మహాస్రగ్ధర.

జనియించెన్ గ్రీష్మ మంత న్సమధికరవిరుగ్జాలజాజ్వల్యమానా
శ్మనితాంతోద్భూతవహ్నిజ్వలితనికటసంఛన్నతార్ణాగ్నిదహ్య
త్తనువీరుద్భుగ్నశాఖాతతితరుదమునోదగ్ధజీర్ణాటవీమ
ధ్యనిషణ్ణారీణవేణూత్కరచిటచిటనిధ్వానభిభ్యన్మృగంబై.

30


తే.

అట్టివేళను జిత్రకూటాద్రి డిగ్గి, జానకీలక్ష్మణులతోడ భానుకులుఁడు
శరభకేసరకరటికాసరవరాహ, చటులకాననసీమల జరుగునపుడు.

31


సీ.

సురటివిధంబున సరిగపయ్యెదచేల చెఱగు మో మెండకు మఱుఁగుఁజేయు
మెండయ్యె బడలిక మెల్లనే పదఁడంచు దండకుఁ జేరి కైదండ యొసఁగుఁ
గ్రమ్మెఁ జెమ్మటలంచుఁ గర్పూరకదళికాదళవీజనమున నందముగ విసరుఁ
జెల్లఁబో యెంత నొచ్చెనొ పాదపద్మంబు లొత్తెద నిలుఁడంచు బత్తిసేయు


తే.

సీత ఱేపటివేళ నాప్రీతిఁ జూచి, చెలువ మా కుపచారంబుఁ జేసినటులు
నీవు బడల కరము పొద్దెక్కె ననుచు, రాఘవుఁడు పల్క నవ్వు నారాజవదన.

32


మ.

కనుఁగొంటే కలకంఠకంఠి మగసింగం బట్టె పైకొంచు హ
స్తిని నుచ్చైస్స్తన కుంభము ల్నఖముఖశ్రీ వ్రచ్చినం జల్లుజ
ల్లున రాలెం దెలిముత్తియమ్ము లన నాలోకింతురే యిట్టికే
ళిని బ్రాణేశ యటంచు జానకి నగున్ లీలావినోదంబులన్.

33


సీ.

స్తనభార మొక్కింత సరసుక వచ్చెద నను గబ్బిచనుగుబ్బ లంటునెనరు
ఇది యింత ఘనమౌటఁగద మందమయ్యెను నడయంచు శ్రోణిఁ గేలిడుబెడంగు
బడలితి దప్పిపుట్టెడు దీర్పవే యని కొనరుచుఁ గెమ్మోవి గ్రోలుమమత
యింతదూరము వచ్చి తెంత నొచ్పెనొ యంచు వెడవెడఁ దొడలఁ జై వేయుదుడుకు


తే.

మది గరంగింప గమనశ్రమం బెఱుఁగక, ఠీవి శృంగారవనులఁ గ్రీడించునటుల
విజనవనభూమి శ్రీరామవిభునిఁ గూడి, జానకీకాంత విహరించె సంతసమున.

34


వ.

అంత.

35


సీ.

మదకలప్రతిమల్లమల్లసంగరభిల్లభిల్లసన్నఘభల్లభల్లతతము
పంకజాతవిఫాలఫాలలనాజాలజాలలాలితసాలసాలకులము
ధీరయానగభీరభీరహితోదారదారకపరివారవారణంబు
జ్వలితానలపిచణ్డచణ్డచారుశిఖణఖణ్డకుండలికాండకాండకంబు

తే.

గండలసమానకుండల కంపమాన, మస్తకాఖణ్డలముఖారిమండలాగ్ర
భండనఖరాదిమౌనిప్రకాండదండ, కావనంబనఁ దగు దండకావనంబు.

36


క.

చొచ్చి చని విశిఖయతికిం, జెచ్చర నటఁ బ్రథమభిక్ష చేసెన్ దివిజుల్
మెచ్చఁగ రఘుపతి క్షితిసుతఁ, గ్రచ్చఱఁగొనిపోవు సాపరాధువిరాధున్.

37


తే.

అంత శరభంగమునికి బ్రహ్మపద మొసఁగి, యత్రిసుచరిత్రు సేవించి యతనిపత్ని
యైనయనసూయ యనసూయనంగరాగ, మవనిసుత కీయఁ గైకొని యవలఁ జనుచు.

38


సీ.

భామి నీకుచవిజృంభణము వీక్షించెనో భద్రకుంభీంద్రము ల్బఱవఁదొడఁగె
లేమ నీసన్నపులేఁగౌను గనియెనో కలగి సింగంబులు గట్టు లెక్కెఁ
గలికి నీకనుదోయి బెళుకుల కళికెనో పదపడి మృగములు పొదలు తూఱెఁ
గాంత నీనూగారుఁ గాంచెనో నీలాహి యిట్టిట్టు బొర్లుచు గుట్ట లెక్కె


తే.

ననుచు లక్ష్మణధనుగుణధ్వనులవలనఁ, దలఁకి పరువిడు వన్యసత్త్వములఁ జూచి
జనకజకు మెప్పు ఘటియించు సరసఫణితి, రఘువరేణ్యుఁడు దండకారణ్యమునను.

39


తే.

జాతివైరగుణం బొకచైతృనందె, కాని సత్త్వంబులం దెందుఁ గలుగనీక
రహి వహించునగస్త్యునాశ్రమముఁ జొచ్చి, మౌనిచంద్రునిపాదపద్మముల కెఱఁగి.

40


సీ.

అలిగి 'సర్పోభవ' యనినంత నహుషభూధవుఁడు గాఁడే పెద్దత్రాచుపాము
నే వచ్చునందాఁక ని ట్లుండు మని పోవ వెఱచి యట్లుండదె వింధ్యశిఖరి
యెక్కడ వాతాపి యింక జీర్ణింపవే యనిన జీర్ణింపఁడే యసురభర్త
యాపోశనజలంబు లౌఁగాక చతురర్ణవీతోయ మనఁగాదె విస్మయముగ


తే.

విజయ మొందుమటంచు దీవించుమాట, చాలదే మాకు శస్త్రంబు లేల ననుచుఁ
గలశసంభవుఁ బొగడుచు ఖడ్గతూణ, మఘవధనువులు గైకొని రఘువరుండు.

41


క.

అంభోజనయనుఁ డసురా, లంభమునకుఁ బ్రతిన సేసె లక్ష్మణయుతుఁడై
కుంభజవని “సిద్ధస్యా, రంభోనియమార్ధ” యను సుర ల్విన మఱియున్.

42


సీ.

గొనబైన తట్టువున్గునను గోడలువైచి మంచిగందంపుఁ గంబములు నిల్పి
తళుకుటేనుంగుదంతముల దూలము లెత్తి వారాహిదంష్ట్రలవాసఁ బోసి
తీరుగాఁ బగడంపుఁదీఁగెపెండె లమర్చిగట్టిగాఁ గురువేరు కట్లు గట్టి
బహుచామరంబుల పైకప్పు సవరించి కళుకుపచ్చల గృహాంగణముఁ దీర్చి


తే.

పంచవటిలోన సౌమిత్రి యంచితముగఁ, జాలనేరుపుతోఁ బర్ణశాల గట్ట
వాస్తుహోమంబు గావించి వాసుధేయిఁ, ప్రేమతోఁ గూడియుండె శ్రీరాముఁ డచట.

43


మ.

వనరాశిన్ వటపత్రశాయి వయి మున్ వర్తింతువంచుం జెవిన్
వినుట ల్గాని కనంగ నేరముగదా విన్నట్టులన్ దండకా
వనవాసి న్వటపత్రశాయి వగుచు న్వర్తించు నిన్గంటిమం
చును దత్పంచవటీనివాసు ఘనభాసుం గాంతు రాయామునుల్.

44


సీ.

అట నొకనాఁడు మోహమున శూర్పణఖ రా నిటునటు ద్రిప్పి హాస్యంబు చేసి
శ్రీరఘుపతి సన్నఁ జేసిన సౌమిత్రి యేమి శూర్పణఖ రావే యటన్నఁ

గటకటా యికనైనఁ గరఁగెఁగా మనసంచు మురియుచుఁ జేరరా ముక్కు వట్టి
యేసీమసరసంబు లివి యమ్మ నేఁ జెల్ల యనిన నీ వెఱుఁగవే వనిత యింత


తే.

జాణవయ్యును మాసీమసరస మనుచు, మొలకరాచూరిఁ బెదవితో ముక్కు జవిరి
చెవులుఁ గూబలతోఁ గోసి చేత నిడిన, నరిగె ముక్కిఁడి యోలక్ష్మణా యటంచు.

45


తే.

అరిగి ఖరదూషణాది దైత్యాధిపతులు, దర్పబలసంయుతులఁ జతుర్దశసహస్ర
రథికముఖ్యులఁ దెచ్చె సంగ్రామమునకుఁ, దద్బలంబులఁ జెండెఁ [5]గోదండధరుఁడు.

46


ఉ.

ఆహరివంశమౌళి ప్రథమాహుతి చేసె ఖరుం బ్రభాతవే
ళాహవభూమి బాహుజమహానలకీలల దూషణున్ ద్వితీ
యాహుతి చేసె నత్రిశురు నవ్వలియాహుతి చేసేఁ దోడుతో
నాహుతి సర్గదోషపరిహారముగా విధిచోదితక్రియన్.

47


వ.

అప్పుడు.

48


సీ.

అరవీడుకొప్పుతో నపరంజిచాయచెక్కులధళాలను కమ్మతళుకుతోడ
జాఱుపయ్యెంటతో జంటఱవికలోన గమకించుగుబ్బజక్కవలతోడ
సడలెడునీవితో జఘనస్థలిని మ్రోయు మొలనూలిచిఱుగంటమ్రోఁతతోడ
గిలుకుమెట్టియలతోఁ గలహంసములు గెల్వనవుజాళువాయందెరవళితోడ


తే.

జిఱునగవుమోముతోడను సిగ్గుతోడ, సొలపుఁజూపులతోడ పైవలపుతోడ
సీత చనుదెంచి కౌఁగిటఁ జేర్చె రాము, ఖరముఖవిరాము వీరశృంగారధాము.

49


చ.

ఖరకరకాండకాండ మెద గాఁడిన యప్పుడు పారవశ్యముం
బొరయని రామభూవిభుఁడు భూమిసుతాకుచఘట్టనంబునం
బరవశుఁడయ్యెఁ జన్గవనెపంబునఁ గంతుఁడు పద్మకోశపున్
శరముల నేసెఁ గాదనినఁ జన్మొనలంటి యురంబు నాటునే.

50


తే.

శూర్పణఖ యంతఁ దననేర్పు శోభిలంగ, రామకర్పూరగంధిని బ్రణుతి సేయఁ
గపటమునఁ దెత్తునని దశకంధరుండు, పంపె మారీచు జానకి బ్రమయఁజేయ.

51


మ.

అల మారీచుఁడు నంతఁ గాంచనమృగంబై పర్ణశాలాగ్రత
స్థలి నానావిధచేష్టలన్ మెలఁగ గోత్రాపుత్త్రికాలోచనం
బులకుం గల్గెను నుత్తమంబయిన సమ్మోదంబు చిత్రం బె
యిలలో నేరిసరూపదర్శనముచే నింపొంద వీక్షింపమే.

52


శా.

స్త్రీచాపల్యముచేతఁ దెమ్మనియెఁ బో సీతాలతాతన్వి తా
నేచందంబున లేడివెంబడిని బోయెన్ రామచంద్రుం డహో
తూచా జానకివాణి తప్పఁడుగదా దూరం బెఱింగెన్ బళీ
యాచోఁ బోవలదంచుఁ దెల్పె ననుజుం డైనన్ సుధీశాలిగా.

53

తే.

అధిపుఁ డీరీతి లేడి వెన్నాడి పోయి, సీతకన్నులముందఱ చెలువుఁ గులుకు
నంతమద మేమిటికి దీని కన్నభంగి, శరము వైచె మృగంబు లక్ష్యంబు సేసి.

54


సీ.

శ్రీరామశరమున క్షితిఁగూలుదైత్యుండు హాసీత హాలక్ష్మణా యటంచు
వ్రాలిన యాయార్తరావంబు చెవిసోఁక క్షితిసుత బెదరి మూర్ఛిల్లి తెలిసి
యేమి సేయుదు మింక నెందుఁ బోయెను నాథుఁ డట్లయ్యె నాదువాక్యంబు వినక
మొదటనేఁ దెలిపితి మునులతోడఁ బ్రతిజ్ఞ గావించునపుడె రాక్షసులతోడ


తే.

వలదు వైరం బటంచు నీవలన వచ్చె, దానవిని ముక్కు గోసిన దాన నలిగి
ఖరుఁడు వచ్చినఁ ద్రుంచె రాఘవుఁడు నేఁడు, రక్కసులఁ గూడి సూడు మరల్పఁబోలు.

55


క.

ఈయెడఁ దామస మేటికి, నీయన్నను జూచి రమ్ము నీవనిలోనిం
గాయమ్ములఁ బడినాఁడే, మో యనవుడు లక్ష్మణుండు ముగుదకు ననియెన్.

56


చ.

ఎఱుఁగవె యన్యదుర్దమగిరీశశరాసనఖండఖండనం
బెఱుఁగవె రాజలోకభయహేతుభృగూద్వహమానమర్దనం
బెఱుఁగవె నిన్నుఁ గాంచిన సమిద్దఖరాదిజయంబు లెల్ల నీ
వెఱిఁగియు నిట్టు లెంచఁదగవా తెగవేయఁడె రాముఁ డాయరిన్.

57


చ.

దనుజుఁడు నేఁడు నిన్నిట వెతం బొగిలింపఁగఁ గూసెఁ గాని య
మ్మనుకులుఁ డట్ల చీరఁ డసమానబలాఢ్యుఁడు గాడె యంచనన్
జనకజ యేటిమాట వినసైఁపదు రాఘవునాద మౌను జ
య్యనఁ జనుమన్నఁ బోవక నయక్రియఁ దెల్పినఁ గోపగించుచున్.

58


ఉ.

వంచన చేసెదే తగినవాఁడని రాముఁడు నమ్మి యీడ ని
న్నుంచి చనంగఁ గాముకునియోజన చేసెద విట్టులైన నా
సించునె యీశరీర మిఁక సీత యటంచును దాళలేక చే
లాంచల మూఁది నేత్రముల హారఘువీర యటంచుఁ జింతిలన్.

59


ఉ.

కలకన్ లక్ష్మణుఁ డింత యేల జననీ కాఁగానిదోసాన నీ
పలుకు ల్పల్కకు మమ్మ కంటఁ దడినింప న్నీతి గాదమ్మ నా
పలుకు ల్నమ్మఁగదమ్మ యిప్పు డిదె నీప్రాణేశుఁ డేతెంచుఁ బో
వలెనన్న న్వడిఁ బోయివచ్చెద ధృతి న్వర్తిల్లు మబ్జాననా.

60


క.

అని యంపించుక చనుచుం, జనఁ గాళ్లాడక మహీజజాలములో ని
ల్చిన నటకుం జని పొంచెదె, చనవా యని సీత పలుకఁ జనె నతఁ డంతన్.

61


చ.

అతనుగదార్తుఁ డౌట దశ లారును మూఁడును జెంది యంతనే
గతిగడలేక యాతురము గైకొనురీతి యతీంద్రవేషుఁడై
గతి గలుగన్ స్మరించుగతిఁ గంజదళాక్ష హరే నృసింహ యం
చతికపటంబు మీఱఁగ దశాస్యుఁడు జానకిఁ జేరి యిట్లనున్.

62

సీ.

ఘననీలవేణి నీకచపాళిమత్తాళి పక్షంబునకు నైల్యభిక్ష యొసఁగు
ముకురాస్య నీముద్దుమొగము రాకాచంద్రబింబంబునకుఁ గాంతిభిక్ష యొసఁగుఁ
గమలాక్షి నీవాలుఁగనుదోయి వలకారి బేడిసలకు లౌల్యభిక్ష యొసగుఁ
గుంభవక్షోజ నీకుచములు కనకకుంభికలకు శృంగారభిక్ష యొసఁగు


తే.

రామ యటుగాన నీయధరామృతంబు, భిక్ష యొసఁగవె తృషితుండఁ బ్రేమ ననిన
బెదరి శ్రీరాముఁడే శరభిక్ష యొసగుఁ, దాళుమని సీత శాలికాంతరముఁ జేరి.

64


ఉ.

అమ్మకచెల్ల యెవ్వడొ నిశాటుఁడు భిక్షుకవేష మూని మో
హమ్మున వచ్చెఁ గాదన సమర్థులు లే రిట నేమి సేయుదం
చమ్మహికన్య చింతిల దశాననవింశతిబాహుదండఘో
రమ్మగుమూర్తిఁ జూపి యల రావణుఁ డంతట హుంకరించుచున్.

65


చ.

పరవశ భూసుతన్ రథముపై నిడి లంకకుఁ బోవువేళ న
య్యరదము టెక్కియంబున రయంబున నొక్కట గ్రద్ద వ్రాలి యా
సురపతిమూర్థముం బొడువ స్రుక్కక దాని వధించెఁ గాని లో
నరయఁ డొకింత దుశ్శకున మౌట దశాననుఁ డెంతమూఢుఁడో.

65


క.

ధరణిజను దెచ్చి లంకా, పురవనమున నిలువఁ దనుజపుంగవసామ్రా
జ్యరమాపతి తాఁ దొలఁగెం, బరసతి గోరఁగ నసూయ పడియెనొ యనఁగన్.

66


తే.

మరలి రాముఁడు ద్రోవ లక్ష్మణునిఁ గాంచి, తమ్ముఁడా యేల వచ్చితి తప్పెఁ కార్య
మనుచు వేగ నిజోటజంబునకు వచ్చి, సీతఁ గానక యలసి మూర్ఛిల్లి తెలిసి.

67


శా.

ఏరా తమ్ముడ పర్ణశాల తెరువేదీ తాళవే చూపుమా
యోరామా యిదె గాదె సీత నెల వేదో తెల్పు మీశాలయై
తే రామామణి యేది కాన మదె యెం దేగెం గనంజూడు కాం
తారశ్రేణుల లేదు హాధరణిజాతా సీత యెం దేగితే.

68


మ.

అవురా లక్ష్మణ యెందుఁ బోయితిమి యన్నా వేఁటకై కాదె యే
ల విదేహాత్మజ వేఁడ నిమ్ము మృగ మేలాగిత్తు నేదేవిఁగా
నవనిన్ హాజనకక్షమారమణకన్యం గానవే సీతఁ గా
నవె యంచు న్విలపించు రాఘవుఁడు నానాదీనవాక్యంబులన్.

69


మ.

కటిభూమండలము న్వలగ్నతలనాకంబున్ లసన్నాభివి
స్ఫుటపాతాళబిలంబు చేకుఱు జగంబుల్మూఁడు ము న్నేలుచు
న్నటులం దోఁచె మహేంద్రభోగముఁ దృణప్రాయంబుగా నెంచి తి
ప్పటికిం దోఁచెఁ బ్రవాసదుఃఖము నినుం బాయంగ నోయంగనా.

70


సీ.

వెలఁది నీకుచపాళి విహరించు నప్పుడు కృతకమహీధరక్రీడ మఱతు
పొలఁతి నీపొక్కిలి పుణికెడువేళల కేళీసరోవరక్రీడ మఱతు

నెలఁత నీనూగారు నిమిరెడువేళలఁ గేలీవనాంతరక్రీడ మఱతు
సకియ నీకెమ్మోవి చవిచూచువేళల మధురోపహారసామగ్రి మఱతు


తే.

గౌఁగిలింపఁగ రాజ్యభోగంబు మఱతు, మఱతు సకలంబు నినుఁ గూడి మలయువేళ
నట్టినిన్నును నెడఁబాపె నదయవృత్తి, దైవ మిఁక నేమి సేయుదు తరళనయన.

71


సీ.

ఇది పంచవటి యంచు నిపు డెఱింగితిఁ గాని మును భూతలస్వర్గ మనుచునుంటి
నిది ఘోరవన మంచు నిపు డెఱింగితిఁ గాని మును గేళికారామ మనుచునుంటి
నిది కొండదరి యంచు నిపు డెఱింగితిఁ గాని మును గేళికాసార మనుచునుంటి
నిది పర్ణశాలయం చిపు డెఱింగితిఁ గాని మును గేళికాగార మనుచునుంటి


తే.

నిది వనావాస మని తోఁచె నిపుడు గాని, మును వనవిహార మనియుంటి మోద మలర
నిది తపశ్చర్యగాఁ దోఁచె నిపుడు గాని, మును గృతార్థుఁడనై యుంటి వనజనయన.

72


సీ.

తెలినవ్వు మొగమునఁ దిలకంబు దీర్తుగా యిఁక నెందుఁ దీర్తునే యిందువదన
వలిగుబ్బచన్నుల నెలవంక లుంతుగా యిఁక నెందు నుంతునే హేమగాత్రి
పెన్నెరికొప్పునఁ గ్రొన్ననల్ సేర్తుగా యిఁక నెందుఁ జేర్తునే యేణనయన
చికిలిలేఁజెక్కుల మకరిక ల్వ్రాఁతుఁగా యిఁక నెందు వ్రాఁతునే యిగురుఁబోణి


తే.

జలరుహము పువ్వుగొత్తులు షట్పదాళి, లవళిదళములఁ జూపితో యవి సహింప
కన్యవనితాంగతులితంబు లౌటఁ దావ, కాంగసమములు గామి నోహంసయాన.

73


సీ.

పటుసింహగర్జల భయముఁ జెందనినన్నుఁ బికనాదములు భయపెట్టదొణఁగె
సుడిగాడ్పులకు మున్ను జడియకుండెడినన్ను లేఁదెమ్మెరలు సంచలింపఁజేసె
దవవహ్నికీలలఁ దాప మొందనినన్ను మించువెన్నెల దపియింపసాగె
ఖరయుద్ధమునను భంగము గాంచనినన్ను భంగంబు నొందించె నంగజుండు


తే.

అకట వీనిని సైరింప నలవిగానఁ, గలదె నినుఁ బాసినను దృణాగ్రంబునైనఁ
గదలఁగావించుత్రాణ నాకలిమి బలిమి, జీవదేహంబులును నీవె గావె సీత.

74


సీ.

చల్లనిదరహాసచంద్రిక ల్పైఁజల్ల జాబిల్లి వేఁడిమి చల్లఁజేసి
పలుకులఁ గపురంపుపల్కు లొల్కఁగఁ బల్కి కలకంఠకటువచఃకలనమాటి
తనుసౌరభంబున దక్షిణానిలమునఁ గలవిషస్పర్శంబు దొలఁగఁజేసి
భూవిలాసంబులఁ బుష్పకోదండకోదండదండము ఖండితంబుఁ జేసి


తే.

నన్నుఁ బోషించితివి కాననంబులోన, నీ విపుడు లేమి నివియెల్ల నిజముఁ బూనె
కాకయుండినఁ గలదె యేకంబునందు, రెండుగుణములు [6]నవపుండరీకనయన.

75


సీ.

అని విలపించుచు నందంద జానకి వెదకుచు నఁట గృధ్రవిభునిఁ గాంచి
సంస్కార మొనరించి చనుచోఁ గబంధునిబాహులు ఖండించి ప్రకటభక్తి
శబరి యొసంగు పూజనములు గైకొని పంపాసరోవరప్రాంతములను
హనుమంతుతో మాటలాడి తన్మంత్రంబు వలన సుగ్రీవుతోఁ జెలిమి చేసి

తే.

యడుగుబొటవ్రేల దుందుభియొడలు మీటి, సప్తసాలంబు లొక్కయస్త్రమునఁ గూల్చి
వాలిఁ బడనేసి కపిరాజ్య మేలుటకును, గరుణ సుగ్రీవుఁ బట్టంబు గట్టి యంత.

76


సీ.

రవి కర్కటముఁ జేర రాజసింహము రాముఁ డట మాల్యవద్గిరికటకమునను
మీనకేతనధనుర్జ్యానాదపరిముక్తవృషభకేతనభీమవిశిఖమేష
యానకీలలనతులాధిచే జనకకన్యాళివేణీసమాయత్తచిత్త
వృత్తి నుండంగ సుగ్రీవుండు తారారుమామత్తకరికుంభమహితకుచల


తే.

మమతతోఁ గూడి మరకతమందిరములఁ, గల్పకారామతులితశృంగారవనుల
స్వర్ణసౌధంబులను గేళిసదనములను, వేడుకలు గాంచె మిథునసంక్రీడనముల.

77


వ.

అంత.

78


తే.

గ్రీష్మభీష్మశిఖండినర్తితశిఖండి, కాననహుతాశిఖండిమేఘప్రతాన
కల్పితవిధానచిత్రశిఖండియు నయి, లక్షితంబయ్యె వానకాలంబు క్షితిని.

79


సీ.

నృపవరాస్థానమండపసరోవరము హసంతికాహల్లకోజ్జ్వలిత మయ్యె
మంత్రీంద్రశిబికారిమావధూటి మధూద్ధపరికల్పితనిచోళపటముఁ బూనెఁ
జరమానవభుజాభుజంగంబు కేతకీదళకలితాతపత్రఫణ మయ్యె
విరహిణీచిత్తంబు విరహితాశ్రయకాననాశ్రితాళికి నాశ్రయత్వ మొందె


తే.

విపణి కమలాక్షి యాపణవీక్షణముల, దడికెఁ గనుఱెప్ప వాల్చె మోదమునఁ బొదలి
గేహమూకాస్యగోగణక్రియను గోగ, ణంబు వసియించె నాసమయంబునందు.

80


మ.

గొనబుంగింటెపుజంటగొంగడి ముసుంగుల్ వెట్టి సంకేతతా
వనికిం గొంచెపుఁజిన్కులోపలను బోవన్ వీథిలోనం దళు
క్కన నక్కాలమునందుఁ గ్రొమ్మెఱుఁగు డాయం దన్ముఖాంభోజముల్
గనియుం గానరు జారలం దలవరు ల్గాఢాంధకారాంధు లై.

81


ఉ.

ఈమెయిఁ గ్రొమ్మెఱుంగులు పయింబయి మించుపయోధరంబులున్
వేమఱుగట్టివాన కడువేగమె వచ్చు నటంచు నెంచితే
నీమది కింపుగా దిచట నిల్వుమటంచును బల్కెఁ బాంథునిం
గోమలియోర్తు తోడియళికుంతలకున్ మరు వెట్టినేర్పునన్.

82


చ.

వడఁకెద వేటికే తడిసివచ్చితి వల్లభ వానలోపలం
దడిసి వడంకలేదు గృహనాయకు వంచన సేయ నింతగాఁ
దడసితిఁ గావునన్ వడకెదన్ మఱి యేగతి నీకుఁ దోఁచునో
యెడఁదనటన్న మెచ్చుకొని యిత్వరిఁ గూడె భుజంగుఁ డత్తఱిన్.

83

సీ.

అమరేంద్రముక్తమేఘములఁ దెచ్చుక్రమంబు రవణించ మించువాయువులు విసరె
మబ్బుచేతనె వారి మరలింప వరుణుండు ధనువుఁ బూనఁగ నింద్రధనువుఁ దోఁచెఁ
దననైల్యమున దండితనుకాంతి దండింపఁ గదలెనాఁగ వలాహకములు నడచె
నానటన్నీలకంఠజటాచ్ఛటలునాఁగఁ దొలుకాఱుమెఱుఁగులు తులకరించె


తే.

జలదకరిశంక గర్జించు సమయసింహ, గర్జ లన గర్జితము లొప్పె గగనకరటి
సాంద్రమ న ధార లనఁగ వర్షంబు గురిసె, వనధిఁ బైకొనెఁ బౌరుషమునకు నదులు.

84


శా.

తే తే లక్ష్మణ విల్లునమ్ములును దేతే తామసం బేటికిం
దైతేయుం డఁదె పోయెఁ బోయె మనసీతం గొంచు నంచు న్నిజ
భ్రాతన్ వేఁడుచుఁ దత్తఱించె రఘువీరస్వామి యుద్ధామజీ
మూతశ్రేణి తళుక్కునన్ మెఱసి సొంపు ల్గుల్క విభ్రాంతుఁడై.

85


మ.

మనపై మూఁకలు గూడివచ్చె దితిజన్మస్తోమము ల్గంటె భ
ర్జనలుం జూప విజృంభణంబు జయనిస్సాణధ్వను ల్లక్ష్మణా
యనినన్ రామునిఁ జూచి లక్ష్మణుఁడు గాదయ్యా విలోకింపుమా
ఘనము ల్గర్జన లింద్రచాపమును నిర్ఘాతధ్వనుల్ రాఘవా.

86


మ.

అదె గర్జించుచుఁ జిత్రవర్ణసుమబాణాసంబు భాసిల్లఁగా
మదనుం డేసె శరప్రకాండములఁ దెమ్మా విల్లు వీనిన్ హరిం
చెదనన్నన్ రఘురామ క్రొమ్మొగులు వచ్చెం గాని మారుండు గా
డది యింద్రాయుధ మింతె పువ్వువిలుగాదన్ లక్ష్మణుం డయ్యెడన్.

87


సీ.

ఘనగర్జవిని యుల్కి ననుఁ గౌగిలించిన వెఱవకుమనినచో వింతసొలపు
జడిసె నీనడలకు వెడవెడ రాయంచ లనినచో నను మెచ్చుకొనెడుప్రేమఁ
గొప్పున మొగలిఱేకులు సెక్కి మెఱుఁగుతో మొగిలిదె యనినచో నగుబెడంగు
నెమ్మి నీనెఱివేణి నీలాహి యని గ్రసించఁగఁ జేరె ననినచో జళుకుఁ జూపు


తే.

మఱవరా దిఁక మున్నిటిమమత లివిగొ, చెల్ల యిప్పటి కిటువలెఁ జేసె దైవ
మిట్టిదుర్దినముల సీత యేమి యయ్యె, నొక్కొ తమ్ముఁడ యెటువలె నోర్చువాఁడ.

88


మ.

అని చింతిల్లఁగఁ లక్ష్మణుం డనియె నన్నా కంటివే మేఘముం
దనస్వర్ణంబుల నెల్లధాత్రి కిడి యంతన్ వంతచే వెల్లనై
ధనదాశం జనెఁ దొల్లి యెల్లెడల గోత్రం దట్టమౌ కీర్తియుం
జనఁ దాత్కాలికదాత కెయ్యెడల శశ్వత్కీర్తి సంధిల్లునే.

89


సీ.

క్రశిమానరావణ రాజ్యలక్ష్మియుఁబోలె నెందెందు నిమ్నగ లింకఁబాఱ
“విజయస్వ” యనుచు దీవింపఁగా నేతెంచు కైవడిఁ దోఁచె నగస్త్యమౌని
భవదీయకీర్తిసంపదఁ బోలి యెల్లెడ నుల్లసిల్లెను ఱెల్లు పెల్లు వెఱిఁగి
తానును హంససంతతి గాన సాహాయ్య మడరించుబలె నంచ లరుగుదెంచె

తే.

నాశరస్ఫూర్తి నారీతి నతిశయిల్ల, నింక నీదుశరస్ఫూర్తి హెచ్చఁజేయ
కేల కురియించె దీపస్రవృష్టి వైరి, బలములఁ దదీయవనితలఁ గలుగఁజేయు.

90


మ.

అని సౌమిత్రి తదాజ్ఞఁ దోడుకొనిరా నంభోజినీబంధునం
దనుఁ డేతెంచె వలీముఖప్రముఖనానాసింహనాదార్భటీ
జనితప్రత్యురుశబ్దసూచితభవిష్యద్ధక్షిణాంభోధిబం
ధనవేళోద్ధరణక్రియాకులసమస్తక్ష్మాధరాక్రోశుఁ డై.

91


క.

ఏతెంచి నాల్గుదిక్కుల, సీతాసతి వెదకఁ బ్లవగసేనఁ బనుపుచో
సీతాపతి హనుమంతుని, చేతికి ముద్రిక యొసంగి శీఘ్రం బనుపన్.

92


మ.

అతఁ డుప్పొంగుచు నంగదాదిపిసారంగాచ్ఛభల్లేంద్రసం
గతుఁడై దక్షిణదిక్కునం జనుచు రంగత్పక్షసంపాతసం
వృతసంపాతిఖగోక్తమార్గమున నుర్వీకన్యకాలోకనో
ద్ధతుఁడై యెక్కె మహేంద్రశైలము మరున్మార్గస్పృహత్సాలమున్.

93


సీ.

నిలిచి యంఘ్రులఁ దన్ని నిగుడుచో గిరి ఘటోద్భవపదన్యాసవింధ్యాద్రిఁ బోల
గట్టినాళపుటుంటపిట్టకైవడి యురోఘట్టన ఱెక్కలగట్టుగూల
సురసార్థకృతమహత్తరసూక్ష్మతరరూపములను హరిత్వంబు విలసితముఁగ
నంజనాసంతతి యందు సింహిక నొంచు టని నిలింపులగుంపు లభినుతింప


తే.

రాముచే దైత్యుఁ డీల్గు కార్యంబు దెత్తు, విశ్వసింపుడు నామాట వేల్పులార
యనుచు బాడబలంఘన మాచరించు, పగిది నౌర్వాంబునిధి దాఁటెఁ బవనసుతుఁడు.

94


ఉ.

ఏపున నాసువేలగిరి యెక్కి యట న్శతయోజనోన్నతం
బై పదియాఱువన్నెఁ జెలువైన త్రికూటముమీఁద సింహల
ద్వీపమునన్ బలారిముఖదేవభయంకరదీప్తి నొప్పులం
కాపురరాజ్యలక్ష్మి తటకావడి చూచుచు నున్ననత్తఱిన్.

95


మ.

రవి యస్తంగతుఁడైన సూక్ష్మతనుఁడై రక్షోధిరాట్పట్టణం
బవలీలం జొరఁబాఱి పఙ్క్తిముఖముఖ్యానేకనాకద్విష
ద్భవనశ్రేణుల నెల్లెడన్ వెదకి సీతం గానఁగాలే కశో
కవనిం బావని గాంచెఁ బావని మహీకన్యం బ్రహృష్టాత్ముఁ డై.

96


శ.

కనుఁగొని లెస్సగ గుఱుతులు, కనుఁగొని యట వచ్చి పఙ్క్తికంధరుఁ డని పో
యినమాటలు విని నమ్మిన, జనకసుతం జేరి మ్రొక్కి సవినయుఁ డగుచున్.

97


తే.

తల్లి జానకి నీ ప్రాణవల్లభుండు, శ్రీరఘూద్వహుఁ డనుజసుగ్రీవముఖ్య
యోధతతితోడ సుఖముననున్నవాఁ డ, టంచు శ్రీరామునంగుళీయక మొసంగె.

98


క.

కైకొని కన్నుల నొత్తుచు, హాకాంత రఘూద్వహా యటంచును బ్రణయ
వ్యాకులితచిత్తయై క్షో, ణీకన్యక యిట్టులనియె నివ్వెఱతోడన్.

99

శా.

అన్నా యేగతి దాఁటివచ్చితివి నీ వంభోధి సేమంబుతో
నున్నారా రఘురామలక్ష్మణులు లంకోద్యానమద్వాసమున్
విన్నారా దశకంధరాధము రణోర్విం గూల్చుకార్యంబు దాఁ
గన్నారా వినిపింపు నీకు శుభమౌ గాకంచుఁ ద న్వేఁడినన్.

100


మ.

తనవృత్తంబును రామలక్ష్మణుల యందంబు న్వివస్వత్కుమా
రునిసఖ్యంబును దెల్పి భీమతరమౌ రూపంబునుం జూపి సీ
తను నమ్మించి [7]శిరోమణిం బడసి యోతల్లీ ముదంబుండుమీ
యనఘున్ రాముని దెత్తు నేనని తదీయాజ్ఞానుసారంబునన్.

101


తే.

వెడలి యవ్వనిలోపల వృక్షవితతి, విఱిచి కుప్పలు వేసె నవ్వీరవరుఁడు
లంక భస్మంబు సేయువేళకును గాష్ఠ, జాలమును గూడవేసిన చంద మొంద.

102


తే.

అంత వనపాలపంచసేనాధినాథ, సప్తమంత్రి సుతాక్షశిక్షాప్రవీణుఁ
డైన హనుమంతు నింద్రజిత్తును నెదిర్చి, బ్రహ్మశరపాశమునఁ గట్టి పట్టి తెచ్చి.

103


తే.

తండ్రిముందఱఁ బెట్టి యోదానవేంద్ర, కోఁతిఁ దెచ్చితి ననఁబోయి కొఱవి దెచ్చి
నాఁడ ననవుడు ముక్కులు నలఁచుకొనిరి, కొలువువారెల్ల నపుడు పక్కునను నగుచు.

104


క.

కరువలిసుతుఁ డిట్లనియెం, గొఱవి నగుదు నీపలాశకులము దహింపన్
సురవైరి సత్యవాణిని, సరస్వతి యనంగ వినమె సత్యం బనుచున్.

105


ఉ.

శ్రీరఘువీరచంద్రునకు సీత నొసంగి యభంగవైభవో
దారుఁడవై చెలంగుము దశానన యంచును బుద్ధి చెప్పినన్
మారుతితోఁక చూఁడుమనె మండుచు రావణుఁ డౌర సమ్మతిం
జేరి మదాంధచిత్తునకుఁ జెప్పఁగఁ బోయిన హాని వచ్చుఁగా.

106


ఉ.

శ్రీజనకేంద్రనందనకుఁ జిత్తము రంజిలఁ గంజరాగవి
భ్రాజితకీలకాభినవపంకజపూజ లొనర్చి కేళికా
రాజితవాలకీలి నలరావణు లంకఁ దగుల్పఁజేసె నీ
రాజస మెంత భక్తుఁడవురా హనుమంతుఁడు క్షోణిపుత్త్రికిన్.

107


మ.

దనుజాధీశపురంబుఁ గాల్చి మహిజాతం గాంచి వాలాగ్ని వా
ర్ధిని జల్లార్చి కపీంద్రులం గలసి యెంతేవేగ నేతెంచి నేఁ
గనుఁగొంటిన్ రఘువీర జానకిని లంకాపట్టణాభ్యంతరం
బున నంచున్ హనుమంతుఁ డిచ్చె ధరణీపుత్త్రీశిరోరత్నమున్.

108


క.

ఇచ్చినఁ గైకొని మారుతి, మెచ్చినఁ గౌఁగిటను గ్రుచ్చి మిహిరకులీనుం
డచ్చెరువగుబలములతో, వచ్చె న్వారాశితీరవనిఁ జేరంగన్.

109


క.

శరణాగతు దశకంధర, శరణాగతుఁ డనక యనఘసద్గుణమణిసం
భరణు విభీషణుఁ గరుణా, భరణుం జేపట్టె రామభద్రుఁడు ప్రేమన్.

110

ఉ.

కట్టఁడు వారివాశి లయకాలధురంధరుఁ బఙ్క్తికంధరుం
గొట్టఁ డదెంత నమ్మెనొ యకుంఠితనైజభుజాబలంబు చే
పట్టుగ నవ్విభీషణు నపారకృపారస మూర లంకకుం
బట్టముఁ గట్టె రామజనపాలశిఖామణి రాజమాత్రుఁడే.

111


ఉ.

అంత విభీషణోక్తగతి నంబుధిచెంత దినత్రయంబు తా
నెంతయు భక్తి దర్భల శయించి నిరాహృతియై ధరాసుతా
కాంతుఁడు త్రోవ యిమ్మని యకంపితచిత్తముతోడ వేఁడ నం
తంతకు నుబ్బువార్ధిఁ గని యారఘువీరుఁ డుదగ్రకోపుఁడై.

112


సీ.

కుంభకర్ణస్ఫూర్తితి కొమరొంద నందంద జలకుంభంభము ల్సందడింప
మేఘనాదనిరూఢి మీఱుచు నుల్లోలకల్లోలజాలము ల్గడలుకొనఁగ
నతికాయవిభ్రమం బతిశయిల్లఁగఁ దిమింగిలగిలాదివిసారకులము పొదలఁ
బటుమహోదరమహాపార్శ్వవైఖరి వారిచరజంతుసంతతుల్ ల్చౌకళింపఁ


తే.

బ్రతిఘటించిన రావణుబలముఁ బోలి, యెదుటఁ గనుపట్టెఁ గంటివె యీపయోధిఁ
దెమ్ము లక్ష్మణ చాపంబుఁ దీవ్రవేగ, రూపరోషంబులను వారిరూ పడంతు.

113


వ.

అని హంసడోలికాయమానకల్లోలపాలికాశాలిశాలికావాలరింఛోళికాసము
త్పతజ్ఙలకణమాలికాకల్పితగగనకేలికాలోలమరుద్బాలికాచూలికాపాలికా
నవమాలికాజాలకదుర్నివారం బగుపారావారంబు నిరీక్షించి పునఃపునః
ప్రవర్ధమానరోషంబున జటాపటలి కన్న ముందుగ ముడిగొను కుటిలభూకుటి
యును దూణీరాంబకంబులకన్న ముందుగ గొప్పలగు నిప్పులకుప్పుల వెదచల్లు
విశాలాంబకంబులును దటినీవిటహృత్పుటంబుకన్న ముందుగఁ గటతటనదరు
కటతటంబులును దుర్వారమౌర్వీనినాదంబుకన్న ముందుగఁ బర్వురథసంఘర్షక
టుతరకిటకిటధ్వనులు వెలయ నిజసహోదరకరోదరకలితకాకోదరతులితశరశ
రాసనంబు సెలసి పుచ్చుకొని భవిష్యజ్జలధిశిరోనమనసూచకంబుగాఁ గార్ముకం
బు వంచి యప్పు మరలించు మరలించు మని పొగడదండ వేయుక్రమంబునఁ
గోదండంబున నారి సారించి లంకాంతరీపదనుజగార్భిణ్యగర్భనివారణావారణ
మన్త్రాయమానంబుగ గుణధ్వానంబు చేసి యిటువలె శరధిశరంబులు రిత్త సే
యుదు ననువలెఁ జటులతరమాంసలాంసరుచిరశరధిశరంబు లొక్కపరి తివిచి
వైచిన నంతకంతకు నుప్పొంగుశరధిశరంబులంబోలి నిజశరధిశరంబు లక్షయం
బుగాఁ దొడిగి యేయుచుండ నప్పుడు ధారాశుద్ధి వెలయ వారాశినీరంబునకు
లంఘించు కాండప్రకాండంబులును జలధిరాజన్యుండు వదాన్యుండని జలకరి
కరభంబుల వేఁడుకొన నిగుడు మార్గణగణంబులును జలకన్యకాముఖాంభోజం
బులవ్రాలు శిలీముఖంబులును మకరప్రాణసమీరణపారణంబు సేయుమహాజిహ్మ
గంబులును వనాంతరంబుల నెల్లెడం జొచ్చి వర్తించు పృషత్కంబులును పొదఁ

జొరవంజొచ్చి చనువిశిఖంబులును జలపాయితోదయంబుల వారించునాశు
గంబులను మణిమాంసాపేక్ష ఫణిఫణంబులందును ముకంకపత్రసముదాయం
బునుం గలిగి ప్రళయానసరప్రకటీభవదేకభావసకలాకూపారవారిశోషణప్రణవ
ద్వాదశద్వాదశాత్మాదారుణకిరణశ్రేణికాధురీణంబులై రామబాణంబులు దీర
నిర్ఘాతసదృశలింగంబులగు విస్ఫులింగంబులు చెదర వారాశిం జొరఁబాఱిన
రఘువీరశరఘాతధూతదంభోళిపాతభీతపలాయమానంబు లగుచు శతశఃకణశః
ఛిన్నభిన్నంబులగు నంగంబులును రఘునాయకుసాయకంబు లేచాయ నిగుడునో
యని నిర్నిమేషంబున గనుంగొనుచుండియు ఖండఖండంబులగు సగండకసముద్దండ
పాఠీనమండలంబులును దలలు దాఁచుకొనియునుం దప్పలేక తెప్పలుగాఁ గూలు
కమఠకర్కటంబులును ముడిగొను నడుగుల నెడనెడం దడబడుచుఁ జుట్టలు చుట్టు
కొని బిట్టొరలుభుజంగంబులును నారాచంబులు నాసారంధ్రంబులం దూఱి
శిరంబుల కెక్కినం గ్రక్కతిలి తుండంబులు ద్రిప్పుచు ఘీంకృతులు గుప్పుచుఁ గు
ప్పదెప్పునం గూలు జలకరిఘటలునుం గలిగి రత్నాకరంబు హల్లకల్లోలమైయుండె
మఱియును.

114


సీ.

జలనీలికాశిరోజశ్రేణి బెదరించి చంకనత్సంకజాస్యంబు దూఱి
కలితముక్తారదావళి నుగ్గు గావించి ప్రకటప్రవాళాధరంబు చించి
శంఖకంధరనాటి శైలశృంగాంసము లగలించి భుజగబాహలు దళించి
కనుకవక్షఃస్థలి గాఁడి భ్రమీనాభి యవియించి కరికరోరువులు చీల్చి


తే.

మనుకులశరంబు లాపాదమస్తకంబు, ముంచి భువనైకమోహనమూర్తిఁ గలఁప
హతమహాసత్త్వ మయ్యు నుబ్బడగడయ్యె, నమృతనిధి గానఁ బ్రాణభయంబు లేదొ.

115


ఉ.

ఇటు లుప్పొంగ నభంగభంగజలధిన్ వీక్షించి రూక్షేక్షణా
స్ఫుటదంభోజభవాండుఁ డౌచు ఖరరక్షోహర్త బ్రహ్మాస్త్రమున్
ఘటియించెం దనవింట వింటఁగలమూఁక ల్వీఁగె నూఁగెన్ సము
త్కటశైలంబులు వేఁగె మూఁడుజగము ల్గ్రాఁగె న్విధిస్వాంతమున్.

116


తే.

చకితుఁడై యంత గంగాదిసతులతోడ, నబ్ధి యేతెంచి రత్నోపహార మొసఁగి
జానకీజానిపాదాంబుజాతయుగళి, కవని సాష్టాంగ మెఱఁగి యిట్లని నుతించె.

117


సీ.

శ్రీజానకీమనోరాజీవసారంగ రంగదభంగశౌర్యప్రచండ
చండకరాన్వయజలధిపూర్ణశశాంక శంకరధనురహీశ్వరసుపర్ణ
పర్ణమూలాశితాపసమానసవిహార హారాదిభూషణోదారవత్స
వత్సలతాగుప్తవనజాప్తతనుజాతఁ జాతరూపాంబరద్యోతమాన


తే.

మానవాశనగర్వశిక్షానిదాన, దానజలవాహినీపూర్ణతమనదీన
దీనజనవాంఛితార్థప్రదానదక్ష, దక్షజానుతనామ కోదండరామ.

118

సీ.

తనసహోదరున కిత్తఱి నెద్దిగతి యంచుఁ దల్లడించుచు గౌరి ధవుని వేఁడెఁ
[8]గద్రువపుత్రశోకంబు నేగతి మాన్ప నగునంచుఁ గశ్యపుఁ డడిగె నజునిఁ
దనపౌత్రుఁ డేమి యయ్యెనొ బలీంద్రుఁ డటంచుఁ బ్రహ్లాదుఁ డెంతయుఁ బలవరించె
గిరికొనుచింతచేఁ గిటికూర్మరూపము ల్సంహరింపఁదొణంగెఁ జక్రపాణి


తే.

నీశరాగ్నులు నానీరు నీఱుఁ జేసి, మీఱి పాతాళలోకము ల్దూఱునవుడు
లోకసంరక్షణైకలోలుండ వయ్యుఁ, దగునె నీ వింత సేయ సీతాసహాయ.

119


తే.

అని నుతులు చేసి మరుభూమి నజునియాశు, గంబుఁ బఱపించి సేతుబంధంబునకును
నలుని నియమించి చనియె నజ్జలధి నలుఁడుఁ, గపులు దెచ్చిన గిరులచేఁ గట్టునపుడు.

120


మ.

ఒకచేఁ బట్టెఁడు నెంతగట్టు నితఁడం చుగ్రాత్ముఁడై గంధవా
హకుమారుం డట నుత్తరంబు గన దేవాహార్య మేలంచు భూ
మికుమారీవరుఁ డన్న వద్దనఁగ నేమీ తెచ్చుఁగాకంచు ను
త్సుకుఁడై కట్టె నలుండు వారధి సురస్తోత్రైకపాత్రంబుగన్.

121


మ.

మును సుగ్రీవునకు న్విభీషణునకున్ మోదంబుతోఁ బట్టముం
దనుఁ జేరంగని కట్టెనంచును సముద్రంబుం దనుంజేర శో
భనలీల న్ఫువనాధిపత్యమునకుం బట్టంబుఁ దాఁ గట్టెనో
జననాథాగ్రణినాఁగ సేతు వమరెన్ సాముద్రగోధిస్థలిన్.

122


మ.

హరిసంఘంబులు గొల్చిరా సరసవాతాపత్యసంరూఢుడై
ఖరశత్రుం డసమాస్త్రరీతి వెలయం గామాతురుం బఙ్క్తికం
ధరు నంత్యోగ్రదశార్తుఁ జేయుటకు దోర్దర్పంబునన్ దైత్యరా
ట్పురముం జేరెను హంససంతతి నతు ల్వొంగార శృంగారియై.

123


వ.

ఇవ్విధంబున రఘునాథుండు పాథోనిధానంబుం దాఁటి యనేకబలజాలంబులతో
సువేలనగరంబునఁ బాళెంబు డిగిన శుకసారణులు వచ్చి చూచి చని రామ
లక్ష్మణసుగ్రీవమహాబలనందనాదిబలంబుల వేఱువేఱ విన్నవించిన విని నిశిత
క్రూరకటాక్షంబుల నాక్షేపించుచు జిహ్మగమనద్విజిహ్వుని విద్యుజ్జిహ్వునిం
బిలిచి మాయ సేయ నియోగించి యద్దురాత్ముండు వద్దురా రావణా యనక
కుహనారఘూద్వహుని శిరంబును సశరాసనశరంబునుంగాఁ దెచ్చి సీతముంద
ఱం బడవైచినం జూచి యుల్లంబునఁ దల్లడిల్లి పెల్లడలు పుడమిపట్టికి నవి కల్లలని
తెల్పు సరమవాక్యంబుల సముల్లాసరమం గాంచి యుండె నంత.

124


చ.

ఇనకులుఁ డాసువేలగిరి నెక్కి కనుంగొనఁ బైఁడిమేడపైఁ
బనివడి కుంచెగిండి యడపంబును బావడ లూని వేల్పుజ

వ్వను లిరుగ్రేవలం గొలువ వన్నెయుఁగాఁ గొలువున్న రావణుం
గని పడఁదన్ని వచ్చె భుజగర్వమునన్ రవిపుత్త్రుఁ డత్తఱిన్.

125


క.

పడమట ననిలజుఁ దూరుపు, కడ నీలుని దక్షిణమునఁ గపిరాజసుతున్
విడియించి యుత్తరంబున, విడిసి రఘూద్వహుఁడు సామవిధితత్పరుఁ డై.

126


ఉ.

అంగదుఁ బంప నాతఁడు రయంబున లంకకుఁబోయి పఙ్క్తికం
ఠుం గని దుర్మతీ మహితనూజను రామున కొప్పగించి నీ
యంగము నిల్పుకొమ్ము వల దావల దానవవైరి వీడుఁ గాం
చంగలవంచు నక్కొలువు సౌధము గూలఁగఁ దన్ని వచ్చినన్.

127


లయగ్రాహి.

సంగరము గల్గెనని యంగములు మిక్కిలియుఁ
            బొంగఁగ రయంబునను జంగలిడుచున్ వే
బంగరపుకోటలతుదంగలుగు మానికపు
           శృంగముల కెక్కుచు నలంగములపైకిం
జంగునను దాఁటుచుఁ గురంగములరీతియుఁ
          దురంగములభాతియుఁ జలంగఁగ నభంగో
త్తుంగభుజుసత్త్వము వొసంగఁగఁ బ్లవంగ
         కులపుంగవులు శూరత మెలంగిరట వేడ్కన్.

128


వ.

అంత.

129


సీ.

స్మరహరాదికసురాసురదురాసదధరాధరవరాతిగరథోత్కరముతోడ
మదవదాయతపదాస్పదవదావదఘనాంగదమదావళరాజఘటలతోడ
మృగహయాధికరయాహృతిజయాహతభయావహహయాత్యుత్తమావళులతోడ
నలికులానలపలాహకబలాహితబలార్జనకులాచలబలప్రతతితోడ


తే.

నసురనాయకు లెదిరి శస్త్రాస్త్రవృష్టి, గురియ నగధారులై యెదుర్కొనిరి కపులు
ద్వంద్వసంగ్రామ మయ్యె నత్తఱిని మేఘ, నాదుఁ డంగదుఁ గికురించి నభముఁ జేరె.

130


క.

భవపాశనోదనుల రా, ఘవులన్ దశకంఠసుతుఁడు గట్టెం గద్రూ
భవపాశంబుల గరుడుం, డవి యుడిపె న్దమము మాన్చు రవియుం బోలెన్.

131


తే.

అంత హనుమంతుచేత ధూమ్రాక్షుఁ డీల్గె, ననిన కంపనుఁ డతనిచేతనే యడంగె
వాలినందనుచేఁ గూలె వజ్రదంష్ట్రుఁ డనిలపుత్రునిచేతఁ బ్రహస్తుఁ డీల్గె.

132


వ.

అప్పుడు.

133


మ.

రణనిస్సాణధణంధణధ్వనులచే బ్రహ్మాండము ల్వీలరా
వణుఁ డేతించి శితాస్త్రపఙ్క్తి రవిజున్ వారించి యయ్యక్షశి
క్షణు నొప్పించుచు నీలునిం గదిసి దోశ్శౌర్యంబు వాటించి ల
క్ష్ముణు శక్తిం బడవైచి రామవిభుపై శస్త్రాళి వర్షింపఁగన్.

134

మ.

అలుకన్ రామనృపాలశేఖరుఁ డధిజ్యంబైన వింటన్ శరం
బులు సంధించి ధ్వజాశ్వసారథిరథంబు ల్గూల్చి మాణిక్యమౌ
ళులు నేలంబడనేసి యేటి కిఁకఁ జాలున్ వీటికిం బొమ్మనం
దలవీడం బరువెత్తె రావణుఁడు సేన ల్కేకిస ల్గొట్టఁగన్.

135


చ.

ఇటువలె లంకఁ జేరి దనుజేశ్వరుఁ డంతటఁ గుంభకర్ణుఁ బం
పుటయును వాఁడు నాకసము భూమియు నిండినకొండమెండునం
బటపటనార్చుచుం గపులఁ బట్టుక మ్రింగుచు వచ్చి భానుజ
త్రుటితసనాసకర్ణుఁడయి త్రుంగెఁ దుదన్ రఘువీరుతూపులన్.

136


తే.

నెనరు గల్గిన యన్నయ నిదురలేపి, పనుప వచ్చినకుంభకర్ణునకు దీర్ఘ
నిద్ర యొసఁగె రఘూత్తమనిశితమార్గ, ణంబు లవిపక్షపాతు లనంగరాదె.

137


తే.

అంత దేవాంతకుండు నరాంతకుండు, ద్రిశిరుఁ డతికాయుఁడును వింశతిభుజసుతులు
దగ మహాపార్శ్వుఁడును మహోదరుఁ డనంగ, వెలయు పినతండ్రులను గూడి వెడలి రపుడు.

138


సీ.

రంగదభంగశౌర్యమున నంగదుఁ డప్పు డంగదుం డయ్యె నరాంతకునకు
దేవాంతకుండును ద్రిశిరుఁ డంగదలైరి హనుమంతుచేతి మహాద్రులకును
భుజమహోదరవహ్నిపుత్రుచే భిన్నమహోదరుం డయ్యె మహోదరుండు
వృషభునివలన నివేశితయను మహాపార్శ్వుఁ డయ్యెను మహాపార్శ్వుఁ డొకట


తే.

సంగరము చేసి యతిఘోరసంగరమున, గపులఁ బెక్కండ్రఁ జంపి నాకపులు వొగడ
నంత నతికాయుఁ డతికాయుఁ డయ్యె లక్ష్మ, ణప్రయుక్తవిరించిబాణప్రహతిని.

139


ఉ.

అంతట నింద్రజిత్తు సమరాంగణహోమము చేసి నీతిహో
త్రాంతరసీమ వెల్వడు మహారథ మెక్కి పయోధరాధ్వసం
క్రాంతి చెలంగె వైధనశరంబున షష్ఠిసహస్రకోటివి
క్రాంతకపీంద్రలక్ష్మణుల రాఘవు మూర్ఛిలనేసి నవ్వుచున్.

140


చ.

గెలిచితి రామలక్ష్మణులఁ గీశులనంచు మహాట్టహాసము
ల్సలుపుచు నింద్రజిత్తు చనఁ జయ్యన బ్రహ్మనుతోపదిష్టుఁడై
మలయక వేగ నేగి హనుమంతుఁడు మందులగట్టుఁ దెచ్చి వా
రలరుజలెల్ల మాన్పె రఘురాముఁడు మెచ్చుచుఁ గౌఁగిలింపఁగన్.

141


వ.

అంత.

142


మ.

ఖలుఁ డారావణుఁ జేరియుండెనని యింకం దీనిఁ గైకోఁడు ని
ష్కలుషుండైన విభీషణుం డనుచు లంకన్ శుద్ధి గావింప ను
జ్జ్వలకీలనలముం దగిల్చెఁ గపిరాట్సైన్యంబు హాహారవా
కులదైత్యాళి తదంతరాఘమువలెన్ క్షోభించె నత్యుద్ధతిన్.

143

క.

కుంభుఁడు సంస్ఫాలితభుజ, కుంభుఁడు పురి వెడలె మఱి నికుంభునితోఁ ద
త్కుంభచ్ఛదకు దివాకర, సంభవదోర్దండ మపుడు చండం బయ్యెన్.

144


తే.

తోడఁబుట్టిన కుంభునిఁ జాడనేఁగె, నల నికుంభుండు నంతట ననిలసుతుని
చేత నంపించుకొని మైందుచేత శోణి, తాక్షుఁడు ద్వివిదుచేత యూపాక్షుఁ డరిగె.

145


క.

మకరాలయబంధనరా, మకరాళశరాస్త్రశస్త్రమహిమ రుషోద్దా
మకరాక్షుఁ డగుచుఁ గూలెన్, మకరాక్షుఁడు దనుజసేన మల్లడిగొనఁగన్.

146


వ.

అంత.

147


ఉ.

జంభవిదారి వైరికృతసంగరుఁడై రఘువీరరోషసం
రంభముఁ జూచి నిల్వక పరాజితుఁడై కుహనామహీసుతా
లంభమున న్మరుత్సుతుఁ దొలంగఁగఁ జేసి యఁట న్నికుంభిలా
కుంభిని దీక్షఁ గైకొనుచు గొబ్బున హోమము సేయుచున్నెడన్.

148


మ.

హనుమంతుం డట పోయి యశ్రువులతో హారామ హారామ యం
చును శోకింపఁగ సీతఁ జంపి చనె నచ్చో నింద్రజిత్తుం డటం
చును దెల్పన్ విని హావిదేహసుత యంచున్ మూర్ఛిలెన్ రాఘవుం
డు నివారించెఁ దదీయమూర్ఛ ననుజుండున్ యత్నపూర్వంబుగన్.

149


ఉ.

అక్కట నేఁడు నీదగుననర్థము దెల్పెను నిట్టులైన నే
నెక్కడఁ జొచ్చువాఁడ నిఁక నెవ్వరిఁ జంపిన నేమి యంచుఁ దా
వెక్కుచు లక్ష్మణుండు పలవింపఁగ రాముఁడు చేరి యాగతిం
జొక్కిపడన్ విభీషణుఁడు భూసుతమేలు వచించి యిట్లనున్.

150


చ.

ఇనకుల యాంజనేయు భ్రమయించి నికుంభిలహోమదీక్ష గై
కొనఁ జనె నింద్రజి త్తటకు గొబ్బున లక్ష్మణుఁ బంపుమన్న న
జ్జనపతి విస్మయంబున ససైన్యముగాఁ బనుప న్నికుంభిలా
వని కరుదేర లక్ష్మణుఁడు వాసవవైరియు ముక్తహోముఁడై.

151


మ.

కనకస్యందన మెక్కి బిట్టెగయ నుగ్రంపశ్యనేత్రాబ్జుఁడై
హనుమద్వాహన మెక్కి లక్ష్మణుఁడు దివ్యాస్త్రాలిచే వానిమా
య నివారించి శిరోధరంబుఁ దెగవ్రేయం గల్పకశ్రేణి బో
రున వర్షించెఁ బ్రసూనవర్షములు మెండయ్యెన్ సురస్తోత్రముల్.

152


వ.

అంత.

153


శా.

సౌమిత్రేయుఁడు శక్రజిజ్జయరమాచంచన్నఖశ్రేణికా
సామగ్రిం బిశునాశుగప్రణితనూసౌందర్యుఁడై మొక్కినన్
వైమాత్రేయునిఁ గౌగిలించుకొని ముద్వారాశి నోలాడె శ్రీ
రామక్షోణివిభుండు రావణు గతప్రాణుండుగా నెంచుచున్.

154

మ.

హతశేషత్రిదశాహితుల్ బలవిపక్షారాతియాయోధన
క్షితిలోఁ గూలుటఁ దెల్ప మూర్ఛిలి దశగ్రీవుండు హాపుత్త్ర దై
వతలోకేంద్రుఁడు తన్నుఁబట్టుకొని పోవన్ వాని వారించి తె
చ్చితి నేఁ డేటికి నొప్పగించి చని తీశ్రీరాముబాణాగ్నికిన్.

155


మ.

అని శోకించి సరోషుఁడై జనకకన్యం జంపఁగాఁ బోయి మం
త్రినిరుద్ధుండయి పంపి మూలబలముం ద్రెళ్లన్ రఘూత్తంసుచే
తను దా వచ్చి యనేకకీశభటులం దండించి యత్యుగ్రశ
క్తిని సౌమిత్రిని నేయ నాతఁడు ధరిత్రిన్ వ్రాలె నిశ్చేష్టుఁడై.

156


చ.

అనుజునిఁ జూడ శోకము దశాననుఁ జూడఁగ వచ్చురోషముం
బెనఁగొన రామభూవిభుఁడు పేర్చి జ్వలద్విశిఖార్చి నేర్చగా
దనుజవిభుం డెదుర్చుటకుఁ దాళక యూడనిఁ బాడె ఖిన్నుఁడై
వనచరు లోదశాస్య యలవాటుగదా యిది నీకు నంచనన్.

157


సీ.

అంతట హనుమంతుఁ డౌషధు ల్గొనితేరఁ గదలుచు మునివేషుఁ గాలనేమిఁ
గని మున్ను గాన మిమ్మునినం చడిగి వాని జలము వేఁడిన వాఁడు గొలను జూపఁ
జని యచ్చటను మౌనిశాపంబు దీర్చి పొమ్మని పదంబులు పట్టుకొనినమకరి
మర్దింప నది ధాన్యమాలినియై కాలనేమిఁ దెల్పిన నైన నేమి యనుచు


తే.

వానిఁ బరిమార్చి ద్రోణపర్వతముఁ జేరి, యచట కాపున్న గంధర్వనిచయములను
గెలిచి తరిగట్టుఁగొని తెచ్చు పులుఁగుఱేని, సరణి మందులకొండ యంసమునఁ జేర్చి.

158


క.

తెచ్చిన యంతనె ప్రాణము, వచ్చె న్సౌమిత్రి కఖిలవానరబలము
న్మెచ్చెన్ రాఘవుశోకము, విచ్చెన్ రావణమనోరవిందము నొచ్చెన్.

159


సీ.

అసురేంద్రుఁ డంత శుక్రాదిష్టమగునియమమునఁ బాతాళహోమంబు సేయ
ననలుఁడు చెప్పి పంపెనొ నాఁగ ధూమంబు భీమమై వెడల విభీషణుండు
దెలిసి రాఘవులకుఁ దెలిపి తద్విఘ్నంబు గావింప సబలు నంగదునిఁ బంప
నతఁడు మందోదరీహరిణాక్షి వేణిఁ బట్టీడిచితెచ్చి దైత్యేంద్రుచెంత


తే.

నిలుప నాకంజవదన కన్నీరు దొరుగ, నాయకునిఁ జూచి వెస రోయఁబోయె వాఁడు
స్వక్సృపంబులు పడవైచి సురియఁ బూని, యంగదాదులఁ దఱిమి మహారయమున.

160


సీ.

దశమస్తకాధగద్ధగితరత్నకిరీటకాంతి భాస్కరుఁ గచాకచికిఁ గవయ
భుజచతుఃపంచకాద్భుతసాధనశ్రేణి భుజగజిహ్వాభుజాభుజకి మొనయ
జాజ్వల్యమానవింశతిదంష్ట్రి మర్త్యహర్యక్షదంష్ట్రారదారదికి నెదుర
దీప్తరోషజ్వలద్విదశకాలోకము ల్శిఖశిఖావళి ముఖాముఖికి డాయ


తే.

వెడలె సంగ్రామమునకుఁ బృథ్వీధరేంద్ర, సహజగౌరవవైభవాసహశతాంగ
పటపటాత్కారపటలలంపటపటాగ్ర, గళితదశకంధరుఁడు దశకంధరుండు.

161

చ.

మనుకులచంద్రుఁ డట్టియెడ మాతలి దెచ్చిన వాసవీయకాం
చనరథ మెక్కి యెక్కిడిన చాపముతోఁ బ్రతిఘాజ్వలద్విలో
చనములతో యుగాంతయమశాసనుకైవడి మించు వేల్పులం
గనుఁగొన గొంకి రంత దశకంఠు నెదుర్పడి పోరు నయ్యెడన్.

162


సీ.

పల్లవారుణజటాపటలంబు ముడిగొన ముడిగొనుబొమల నెమ్మొగము వెలుఁగ
వెలుఁగుతోఁ జనుచూపు విలయాగ్ని వెదచల్లఁ జల్ల గానిమహోచ్ఛ్వసనము దనరఁ
దనరఁ బై బైఁ గటి తటియంగ మదరంగఁ దరగలై రథపటుధ్వాన మాన
మానని ఫాలఘర్మమునఁ జెక్కులు నాన నానతంబగుచు బాణాస మలర


తే.

మలరహిని బోల్చు రావణు మర్మ మంట, మంటలన్నియుఁ దనకదంబముల మాటి
మాటికే యంచు నంధకమధనభీమ, భీమమగురోషమున వీరురాముఁ డెదిరె.

163


మ.

పరుషాన్యోన్యవికత్థనంబు విహితప్రత్యస్త్రశశ్వన్మిథ
శ్శరజాతం బితరేతరత్వరితమూర్ఛామగ్నసారథ్యభం
గురరథ్యంబుఁ బరస్పరాహతదళత్కోదండదండంబునై
కర మొప్పెన్ రఘురామరావణుల సంగ్రామంబు భీమంబుగన్.

164


మ.

గుణజాతంబులొ యంగుళీభవములో కోదండకౢప్తంబులో
గణుతింపం బసకాదు కాదన నిషంగం బంటి చేసాచి మా
ర్గణముల్ దీసినయప్డు కుండలితమై కన్పట్టునే భానుదా
రుణమా విల్లని మెచ్చి రందు రఘువీరున్ దేవతాబృందముల్.

165


మ.

శరవేగప్లవమానగండక సమంచద్భంగలీలాప్తిసా
గరమున్ రాహుతులాధికాయతధనుఃకంఠీరవప్రాప్తి నం
బరముం బోలుచు రామరావణు లసామ్యంబైన యుద్ధంబుఁ జే
సిరి నక్తందిన మేడునాళ్లు దివిజశ్రేణు ల్విలక్షింపఁగన్.

166


వ.

అంత.

167


ఉ.

రామవిభుండు నిస్తులశరంబుల రావణుహస్తమస్తక
స్తోమముఁ ద్రుంచినన్ మొలచుఁ దోడనె తోడనె త్రుంచు రాముఁడున్
వేమఱు నట్లు ద్రుంచి యటు వెన్క విభీషణు డెచ్చరింప గ
ర్భామృతమున్ హరించె ననలాస్త్రమున న్శిర మొండు చిక్కఁగన్.

168


శా.

బ్రహ్మణ్యంబయి మించు రాఘవపరబ్రహ్మంబు ధన్వంబునన్
బ్రహ్మాస్త్రం బరివోసి యేసినఁ గృతాబ్రహ్మణ్యవిప్రావహున్
బ్రహ్మాండోజ్జ్వలతేజు రావణు జగద్భాధాచణుం ద్రుంచి వే
బ్రహ్మాదు ల్నుతియింప రామశరధిం బ్రాపించె నత్యుద్ధతిన్.

169


తే.

విజయకమలాభిరాముఁడై వీరరాముఁ, డనుజకరమున కొసఁగి బాణాసనంబు
రథము డిగ్గి మనోల్లాసరమను భాను, సుతునికైదండ గొని యనిఁ జూచుచున్న.

170

మ.

పరితఃకీర్ణకచావృతాంసము గళద్భాష్పంబు సిక్తస్తనాం
తరచేలంబుఁ బతద్విభూషణము హానాథేతివాగాస్య మ
త్యురునిశ్వాసవిశోషితాధరము శోకద్విగ్నచిత్తంబు నై
యరుదెంచెన్ రణభూమిఁ జేర దశకంఠాంతఃపురం బయ్యెడన్.

171


క.

అరుదెంచి వరునిపైఁ బడి, పొరల విభీషణుఁడు వారి బోధించి ధరా
వరునాజ్ఞఁ బంక్తిముఖునకుఁ, బరలోకక్రియలు దీర్చి పావనుఁ డైనన్.

172


శా.

యావత్కాలము భూమి రాముకథ సూర్యాచంద్రముల్ వారిధుల్
తావత్కాలము లంక నేలు మని తాత్పర్యంబుతో రామసం
సేవాలోలు విభీషణున్ సుగుణరాశిన్ నిల్పె సౌమిత్రి సీ
తారామాహృదయేశజంగమజయస్తంభంబునా నంతటన్.


మ.

తళుకున్నిద్దపుఁబైఁడిబొమ్మవలె సీతాకాంత పెంజిచ్చుని
చ్చలపుంగాఁ కలవన్నెవాసి గని మించం గాంచి హర్షించుచుం
గులకాంతామణి చెంత నుంచుకొనియెం గోదండదీక్షాగురుం
డలఘుప్రౌఢవచోనిరూఢిఁ దగ బ్రహ్మాదు ల్ప్రశంసింపఁగన్.


వ.

అంత.

175


తే.

దశరథుని గాంచి మ్రొక్కి యింద్రవరమునను, బలము బ్రతికించి పురి కేఁగఁదలచురాము
నకు విభీషణుఁ డొసఁగె సాంద్రప్రఫుల్ల, పుష్పకంబైన కౌబేరపుష్పకంబు.

176


క.

రతివలెఁ గామగమనమయి, వితతంబగుపుష్పకము బ్రవేశించి చమూ
తతితో సతితో ధృతితోఁ, బతితోరపువేడ్క రాజపథగతుఁ డగుచున్.

177


సీ.

అదె చిత్రమకరాంకహయవిచిత్రవిటంకవసతిలగ్నశశాంక యసురలంక
సకలలోకములందు జయలక్ష్మినేఁ జెందఁ గుంభకర్ణుం డిందుఁ గూలె ముందు
మనలక్ష్మణునితోడ మల్లాడి మదమూడి శక్రు గెల్చినప్రోడ సమసె నీడ
నట వ్రాలె బటుదండుఁ డైయుండు మును నిండురాజసంబున నుండురావణుండు


తే.

సేతు వదె యంచుఁ దెల్పుచు సీతతోడ, రామచంద్రుఁడు రామేశ్వరంబు చేరి
తనదుపేర సమీరణతనయుపేర, దివ్యలింగంబు లఁటఁ బ్రతిష్ఠించి కొలిచి.

178

వ్యోష్ఠ్యాచలజిహ్వాద్వ్యక్షరీకందము

భవభావిభవవిభావా, భవభావభవాభిభావభావీభూభా
భవభావభావివైభవ, భవభావిభుభావివిభువభావావిభవా.

179


మ.

అని వర్ణించి విభుండు సేతువు శరాసాగ్రంబునం ద్రుంచె శే
షునకైనం బొగడంగ శక్యమె ధనుఃకోటిప్రభావంబు గ

న్గొనినంతం జను బ్రహ్మహత్య మొదలౌ క్రూరాఘసంఘంబు మ
జ్జనముం జేసినవారి పుణ్య మెఱుఁగన్ శక్యంబె మాబోంట్లకున్.

180


తే.

అంత రఘువల్లభుఁడు పుష్పకాధిరూఢుఁ, డగుచుఁ గిష్కింధత్రోవఁగా నరిగి రవిజ
సతుల రప్పించి సీతపార్శ్వముల నిలిపి, జనకనందనతో నిట్టు లనియెఁ జనుచు.

181


సీ.

పంపానదినిఁ గంటె శంపాలతాతన్వి ఋశ్యమూకముఁ గంటె ఋష్యనయన
శబరీవనముఁ గంటె శబరీజితఘనాళి దండకఁ గంటె వేదండయాన
పర్ణశాలలఁ గంటె స్వర్ణభాసురవర్ణ ఘటజాశ్రమముఁ గంటె కుటజగంధి
చిత్రకూటముఁ గంటె చిత్రశాలికపోల గంగఁ గన్గొంటివె భృంగచికుర


తే.

యనుచుఁ దెల్పుచు వచ్చి యయ్యనిలసుతుని, బిలిచి తమరాక భరతుతోఁ దెలుపఁబంచి
ఘనభరద్వాజుఁ గనఁ బ్రయాగమున నిల్చి, యాతఁ డొనరించు మంచివిం దారగించి.

182


వ.

ప్రభాతసమయంబునఁ బ్రభావతీప్రభాతరంగితపుష్పకాభిరాముండై భరద్వాజ
సమాసాదితభోజనానందిగ్రామసమేతంబుగా రామచంద్రుండు నందిగ్రామంబు
నకుఁ జనుదెంచునప్పుడు నెదురుగా సకలసేనాపరివృతుండును శత్రుఘ్నసేవి
తుండును గౌసల్యాదిజనయిత్రీసహితుండును నైన భరతుండు కృత్యాచార
తరంగిణీరోధఃపురోధఃపురస్సరంబుగా నరుగుదెంచినం జూచి రఘువీరుండు డిగ్గు
న లేచి సుగ్రీవుకైదండ గొని విభీషణపురోనిర్దిష్టమణిసోపానమార్గంబునఁ బుష్ప
కంబు డిగ్గి వసిష్ఠునకు వందనం బాచరించి వందమాను లగు భరతశత్రుఘ్నులఁ
గౌఁగిలించికొని తల్లులకుం బ్రణమిల్లి తదీయానందబాష్పధారానేకంబు చిరా
ద్భావిపట్టాభిషేకసంసూచితంబుగా సంతసిల్లి నందిగ్రామంబు ప్రవేశించి భరత
పూర్వకంబుగా సుమిత్రాపుత్రులతో జటావల్కలంబులు సడలించి పతంగనందన
దనుజపుంగవాదిపురోహితసహితంబుగా నభ్యంజనస్నానంబు చతుర్విధశృం
గారంబు లంగీకరించి మణిమయశతాంగం బెక్కి సుగ్రీవాంగదవిభీషణాదులు
మాతంగతురంగాదివాహనారూఢులై కొలిచిరాఁ బురాంగనలు సేసలు చల్ల
వందిమాగధులు వొగడఁ బంచమహావాద్యంబులు బోరు కలుగ మహోల్లాసంబున.

183


సీ.

అల మేరువును బోలి యందంద నందమై కురుజులు మేరువు ల్గొమరుమిగుల
గలువడంబులలోన యలజవ్వనపుమిటారులచూపు కలువడంబులు ఘటింపఁ
గలయ నెల్లెడ వణిక్కులదీపములవాకిళులయందు మణిదీపములు వెలుంగ
మకరతోరణము లంబరమార్గమకరతోరణవిచక్షణములై రాయడింప


తే.

రహి వహించు నయోధ్యాపురంబు సొచ్చి, తననగర లక్ష్మణునియింటఁ దపనసుతవి
భీషణుల నన్యులను నన్యపృథులరత్న, గేహముల నుంచి తా రాజగృహము చేరి.

184

ఉ.

ఆమఱునాఁడు మారుతసుతాదికపీంద్రులు వారిరాశి గం
గాముఖపుణ్యతీర్థములు గైకొనిరా శుభవాద్యఘోషముల్
భూమిసుపర్వమంత్రరవముం జెలఁగ న్మణిపీఠి సీతతో
శ్రీ మెఱయంగ రాము నభిషిక్తునిఁ జేసె వసిష్ఠుఁ డత్తఱిన్.

185


సీ.

భరతుండు ముక్తాతపత్త్రంబు ధరియించి యిందుబింబంబు కొల్వెక్కఁజేయ
సరిగాఁగఁ గవులు చామరములు వీచుచు విష్ణుపయోధులవిధము దెలుపఁ
గపిరాజతనయుండు ఖడ్గంబు ధరియించి శేషాహివల్లభుసేవ నెఱపఁ
బవమానసూనుండు పగలు దీవటిఁ బూని స్వప్రతాపంబు సాక్షాత్కరింప


తే.

సీతప్రతిబింబ మన సురస్త్రీప్రదీప, మర్కసంకాశరత్నసింహాసనమునఁ
బ్రేమఁ గొలువుండెఁ బట్టాభిరాముఁ డగుచు, రామచంద్రుండు భక్తసంరక్షణుండు.

186


తే.

అపుడు బ్రహ్మాదిదేవత లఖిలమునులు, వచ్చి కృతపూజు లగుచు రావణుని ద్రుంచి
మనిచితివి లోకముల రామ యనుచు వినుతి, చేసి రందఱు వేజ్వేఱఁ జిత్రగతుల.

187

పుష్పమాలికాబంధము

చ.

ఖరకరఘోరతేజ కవికల్పక బంధనదీనజానకీ
వరధరధీర రాఘవభవస్తవలోలుప చాపరోధ భా
స్వరకర వీరగుప్తసవసర్వనమారమణీమణీమనో
హర శరహారకీర్తియనయప్రియదానవదావజీవనా.

188

గోమూత్రికాబంధము

చ.

రఘువరధీరతా విమలరామ దయాపర దివ్యమూర్తిమా
నఘనలినాక్ష దానరతయక్షయరూప జితారిభాసు రా
లఘుశరవీరభూవిధులలామజయాకర భవ్యకీర్తిని
త్యఘనఘనాభ దాశరథి యక్షయరూపప్రతాపభాస్కరా.

189

ఛత్రబంధము

క.

సురవరదరకరఖరకర, కరఖరశరవారవీరఖరహరహార
స్ఫూరదరనరవరధీర, త్రరమారఘురమ్యరక్షిరణరతరథ్యా.

190

నాగబంధము

స్రగ్ధర.

భవ్యారామక్షితీశా భవనజలజప్రాయవైశద్యకీర్తీ
దివ్యాగత్యాగరాజద్విజకులరమణాదీనభద్రాఫలాయ
త్క్రవ్యాదాకీర్ణనానాదహనవినతపక్షాజరాతీతధీరా
నవ్యాపద్మేశభావ్యానరభరణదిశానాథగణ్యోపసేవ్యా.

191

పాదగోపనము

చ.

నరవరధీరగుప్తకృపణావరభూధవమన్యువేగజే
త్రరియుతధీరతాలఘుతరావనభృల్లలితాభభూసురా
త్యురుఘనభావమావిభవయుక్తరమావహవత్సనిర్మలా
వరకృప ధన్యుఁ జేయు రఘువల్లభ రాఘవ భక్తవత్సలా.

192

అనులోమవిలోమము

క.

మానవపాయజనుతశివ, మానధనాసారభవనమదసదననదా
దానవదసదమనవభర, సానాధనమానశినుత జయపావనమా.

193

అష్టదళపద్మబంధము

స్రగ్ధర.

హారీనిత్యాసనర్మాహరవినుతనయాత్యాయసత్రావిరాధీ
ధీరానిత్రాసయత్యాధృతపదనతధాత్రీపదివ్యాభరాకా
కారాభవ్యాదిపత్రీడ్గమన శుభగుణగ్రామసక్తాసరామా
మారాసక్తాసమగ్రామహిత వరధనుర్మాససత్యాదిరీహా.

194


క.

అని బ్రహ్మాదులు వొగడఁగ, విని సంతస మొందు రామవిభునకు భక్తిన్
వినుతి యొనర్చి సమీరణ, తనయుం డిట్లనుచుఁ బొగడెఁ దనవాక్ప్రౌఢిన్.

195

ఉత్పలమాలికలో మంజుభాషిణియను వృత్తము

ఉ.

భ్రాజితవిక్రమా వికచపంకజపత్త్రవిలోచనా రణ
క్ష్మాజితదానవా విమలకార్తికచంద్రనిభాననా మహా
రాజశిరోమణీ జనకరాజలలామకుమారికామనో
జ్ఞాజలజాప్తతేజ యతిసన్నుత చారుగుణోన్నతా హరీ.

196


క.

అని హనుమంతుఁడు పొగడఁగ, విని వేడుక మీఱ రామవిభుఁడు ధరిత్రీ
తనయఁ గని చెలువ వింటే, నను బొగడెడి పద్యముననె నైపుణి మెఱయన్.

197


మంజుభాషిణి.

వికచపంకజపత్త్రవిలోచనా, విమలకార్తికచంద్రనిభాననా
జనకరాజలలామకుమారికా, జయతి సన్నుతచారుగుణోన్నతా.

198


మ.

అని నాస్తోత్రము మంజుభాషిణి త్వదీయస్తోత్రము న్గర్భితం
బును నైమించ రచించె నందు ననినన్ భూపుత్రి మోదంబుతోఁ
దనచేహార మొసంగ మారుతియు ముక్తాదామముం దాల్చి చె
ల్వెనసెన్ స్ఫాటికమాలికామహితవాణీశానుచందంబునన్.

199


వ.

అంత.

200


తే.

వారివారి యథోచితవైఖరులను, బనిచి కృతయుగధర్మంబు ప్రబల సకల
యాగములు చేసి జనులు సౌఖ్యములఁ బొదల, జగములను బ్రోచు శ్రీరామచంద్రవిభుఁడు.

201

క.

ఈరామాయణకథ యె, వ్వారు పఠించినను వినిన వ్రాసిన సౌభా
గ్యారోగ్యభాగ్యయుతులై, వారలు వెలయుదురు సుమతి వసుమతిలోనన్.

202


క.

అని శ్రీవైశంపాయన, మునిముఖ్యుఁడు దెలుప విని ప్రమోదాన్వితుఁడై
జనమేజయుఁ డవ్వలికథ, యనఘా వినవలతుఁ దెలుపు మని యడుగుటయున్.

203


శా.

శ్రీరాగోజ్జ్వలగేహ తోయజదళాక్షీమోహనాదానవ
త్సారంగప్రవరాళిపార్శ్వనినదద్ఘంటీరవప్రాంగణా
సౌరాష్ట్ర ప్రియశంకరాభరణరాజత్ప్రజ్ఞకేదారకా
శ్రీరామేశ్వరధీరమధ్యలలిత శ్రీదాభిరామక్రియా.

204


క.

పూర్వోత్తరమీమాంసా, పూర్వోత్తరవినుతసమరభూసాహసితా
పూర్వోత్తరసారథిరథి,పూర్వోత్తరరాజమిత్ర భూరిధనాఢ్యా.

205


స్రగ్విణీ.

చంద్రకాంతోన్నమత్సౌధయూథక్రమా
చంద్రకాంతోపలాంచద్యశశ్చక్రమా
చంద్రకాంతోపమానన్ముఖాబ్జక్రమా
చంద్రకాంతోత్తమాశ్వస్ఫురద్విక్రమా.

206


గద్య.

ఇది శ్రీరామభద్రదయాభిరామభద్రకరుణాకటాక్షవీక్షాపరిప్రాప్తదీప్తతరాష్ట
భాషాకవిత్వసామ్రాజ్యధౌరేయ సకలవిద్వత్కవిజనవిధేయ ధరణిదేవుల నాగ
నామాత్యసుధాసముద్రసమున్నిద్రపూర్ణిమాచంద్ర రామమంత్రీంద్రప్రణీతం
బైన దశావతారచరిత్రం బనుమహాప్రబంధంబునందు సప్తమాశ్వాసము.

7. శ్రీరామావతారకథ సమాప్తము.

  1. నిజాలకును జెల్వయటంచును మోహమెట్టిదో
  2. ఎందుల కల్గితే కలికి యేటికిఁ బల్కవు కుల్కులాఁడి నా
  3. సాశ్రునేత్రుఁడై
  4. మేలే యటంచు సుమిత్ర
  5. మార్తాండకులుఁడు
  6. సమదవేదండగమన
  7. శిరోమణిం గొనిప్ర మోదం బందుమీతల్లియ త్వనఘున్
  8. గద్రువపుత్రశోకము మాన్ప ననువెయ్య దనుచుఁ గశ్యపుఁ డజు నడుగఁ జనియె.