6. భృగురామావతారకథ
షష్ఠాశ్వాసము
|
ధవకథాసుధారస
మాధుర్యాధీనహృదయ మగదలకులపా
థోధికళానిధి సకలక
ళాదికనైపుణ్య కృష్ణయార్యవరేణ్యా!
| 1
|
తే. |
అవధరింపుము జనమేజయక్షితీశ, శేఖరున కిట్టులను వ్యాసశిష్యమాని
ధరణివర భృగురామావతార మిఁకను
దెలియఁజెప్పెద వినుమని తెలుపఁ దొడఁగె.
| 2
|
శా. |
శ్రీకాంతోజ్జ్వలదంతవాస మలకాక్షీణప్రభావాప్తము
ద్రాకారాజవిరాజమానముఁ గళారమ్యంబు శుద్ధద్విజా
లోకం బుత్కటహేమధామవర వల్గుస్ఫూర్తి చిత్రంబు క
న్యాకుబ్జంబు కకుబ్జనస్తుతినిఁ జెల్వంబౌ ముఖాబ్జంబునన్.
| 3
|
ఉ. |
ఆపుర మేలు గాధి మనుజాధిప శైలనిరోధిబాధితా
టోపవిరోధిసాధితకఠోరధరాంతపయోధియూధికా
భాపటుకీర్తిశోధితకపర్దిశిరోధి సమేధితాత్మమే
ధాపరిపూరితాంబుధి సుతాగృహమేధి మహాశ్వమేధియై.
| 4
|
చ. |
అతఁ డొకనాఁడు వేడుక నొయారులు గొందఱు గొల్వుసేయఁగా
రతనపుమేడ నున్నతఱి రాఁగరుచీకుఁడు చారుభక్తితో
నతిథిసపర్యలం బ్రముదితాత్మునిఁ జేసి మణీమయాసన
స్థితు నొనరించి తా నతనిచెంత వసించె వినీతి నత్తఱిన్.
| 5
|
తే. |
పడుచుఁదనమునఁ బైపక్కఁ బడుచునున్న, పడుచునొక్కతె వేడుకపడుచుఁ గాంచి
రాజ యీకన్య నీకూఁతురా మఱేమి, భాగ్యశాలివి సకలసంపదల నీవు.
| 6
|
క. |
వీక్షించినపుడె తెలిసెన్, లక్షణవతియంచు రాజనందనిహస్తం
బీక్షించి తపసి సతియగు, లక్షణమున్నయది నాతలఁపు చేకూరెన్.
| 7
|
క. |
కన్యార్థి నగుచు వచ్చితి, ధన్యా నీయింటికడకుఁ దడయక నాకుం
గన్యాదానము చేసి య, నన్యాదృశసుకృత మొందుమా నృపసోమా.
| 8
|
వ. |
అని పలికిన జడదారిపలుకులు ములుకులై చెవినాటిన నుల్కిపడి యప్పు డప్పు
డమిఱేఁడు తనమనంబున.
| 9
|
తే. |
ఆకునలము మెసవి యడవిలో వసియించు, తపసు లేడ రాజతనయ లేడ
నందు నించుకైన నెంచక యక్కటా, యడుగవచ్చె నిట్లు వెడఁగుఁదపసి.
| 10
|
తే. |
ముక్కుననె యుండుఁ గోపంబు మునుల కెల్లఁ, జెల్లఁబో యీయన శపియించిన శపించు
నటులుగావున నొకయుపాయమున దీనిఁ, గడపెదనటంచు నిట్లను గౌరవమున.
| 11
|
మ. |
అమలాత్మా నినువంటి ధన్యునకుఁ గన్యాదానముం జేయుభా
గ్యము సామాన్యమె యైనఁ జంద్రధవళాంగశ్యామకర్ణాగ్రవా
హముల న్వేయి నొసంగఁగావలయుఁ గన్యాశుల్క మస్మత్కుల
క్రమ మీరీతి నొసంగి కైకొను మిదే కన్యామణి న్నావుఁడున్.
| 12
|
చ. |
వెలవెలఁబోవు మోమునను విప్రకుమారకుఁ డౌర యెవ్వరుం
దలఁపరు తొల్లి యీతలఁపు ధారుణిలోపల నిట్టిగుఱ్ఱము
ల్గలుగునె గల్గెనా యొకటిగా పదిగావు సహస్రవాహము
ల్గలుగునె యేమి సేయుదును గన్నియఁ జూచిన నాస యయ్యెడిన్.
| 13
|
మ. |
అనుచు న్నెమదిఁ గొంతచింత యిడి రాజా మంచిదే తెత్తునం
చని యంపించుక భూమిఁగల్గు సకలక్ష్మాధీశుల న్వేఁడి యెం
దును దాదృక్తురగంబు లేక మదిలో నూల్కొన్న చింతాభరం
బున నిట్లంచుఁ దలంచె మౌని యపరాంభోరాశితీరస్థుఁడై.
| 14
|
సీ. |
నెఱివేణిఁ గూడని నెఱులు నెన్నుదుటిపై కమ్మకస్తురితిలకమున నెరయఁ
దెలివాలుగనుకెలంకుల సానదేఱెడి చికిలిచూపు లొకింతసిగ్గు గులుక
గోట నొక్కిన పాలుగాఱుకెంజెక్కుల నుదిరికమ్మలకాంతి యుదుటుసూప
నొరులచూ పొరయుచో నుసిరికాయమెఱుంగుచన్నుల పయ్యెదచాటు కొసఁగఁ
|
|
తే. |
గొమరుప్రాయంబునను ముద్దుగులుకుచున్న, కన్నెఁ జూచిన మొదలు నాకన్నుఁగవకు
నిదుర గాన హయంబుల నెమకి గాన, గాన నీచింత దరిఁ జేరు క్రమము గాన.
| 15
|
మ. |
అని యత్యంతదురంతచింత మునిరా జౌర్వానలజ్వాలికా
ఘనసంతాపపరిప్లవన్మకరనక్రగ్రాహమీనాదిజం
తునికాయాభ్రనదీనివాసకరుణోద్యుక్తోర్మికాహస్తమై
కననౌవార్ధి గుభిల్లునం దుమికె నక్రస్ఫూర్తి వర్తిల్లఁగన్.
|
|
చ. |
దుముకి మునీంద్రనందనుఁడు తోడనె వారుణభృత్యు లెందఱే
సమధికభక్తిఁ జేరి కడుచక్కనిమార్గము సూపఁగా నుపా
యమున నగాళికోసరిలి యయ్యమరావతి సేరివచ్చు సం
యమి యమితప్రభావమున కప్పతి విస్మయ ముప్పతిల్లఁగన్.
| 17
|
క. |
ఎదురుగ వచ్చి మునీంద్రుని, పదములు పన్నీటఁ గడిగి బంగరువిరుల
న్సదమల భయభక్తులు మదిఁ, బొదలం బూజించి యతని బొగడుచు ననియెన్.
| 18
|
శా. |
సామాన్యుండె భవద్గురుండు భృగుఁ డక్షయ్యప్రభావాఢ్యుఁ డై
యామూర్తిత్రయిచేతఁ బూజగొనె నింద్రాదు ల్భవత్కింకరు
ల్నీమాహాత్మ్యము కొంచెమే కలిగెఁగా నీపాదము ల్గొల్వఁగా
నే ము న్నేమితపంబు చేసితినొకో భృగ్వాన్వయగ్రామణీ.
| 19
|
వ. |
అనిన వరుణు వినీతవృత్తికి వినీతప్రాప్తి యగునని సంతసిల్లి మునివల్లభుం డిట్ల
నియె.
| 20
|
మ. |
చెవి నల్పుం దనువెల్లఁ దెల్పుగల తేజు ల్వేయిటిం గోరి నే
ధవళైకాశ్వుని మేషవాహనుని గంధర్వద్విషద్వాహు మా
నవవాహు న్నిరసించి కాండపతిని న్యాచింపఁగా వచ్చితి
న్భువనాధీశ్వర యిచ్చిపంపుము శుభంబు ల్నీకు జేకూరెడిన్.
| 21
|
మ. |
అనిన న్భాగ్యము చేసితి న్మునికులాధ్యక్షా సహస్రాశ్వము
ల్గొను నే నిచ్చెద నంచు నట్టి వొసఁగన్ క్షోణీసురేంద్రుండు గ్ర
క్కన గంగానదిత్రోవగా వెడలెఁ దత్కంఖాణజాతంబునం
దనరారెన్ హయతీర్థ మన్నదినిఁ గన్యాకుబ్జపార్శ్వంబునన్.
| 22
|
క. |
జటివరుఁ డిటువలె గంగా, తటిని గృపీటముల వెడలి తతఘోరఖురా
స్ఫుటితధరాచటులరజః, పటలారుణితాంశుఁ డగుచుఁ బఱతెంచుటయున్.
| 23
|
చ. |
పరనృపుఁ డెవ్వఁడో పురముపైఁ జనుదెంచెనటంచు గాధీభూ
వరుఁడు మహారథద్విరదబంధుపదాతులతోడఁ గూడి ము
ద్గరకరవాలతోమరగదాపరిఘక్షురికాదిసాధనో
త్కరము వెలుంగఁ బెట్టెదురఁ గన్గొని డగ్గఱి విప్రుఁ డిట్లనున్.
| 24
|
శా. |
మామా తెచ్చితి వేయిగుఱ్ఱములు కొమ్మా నాకు నీకన్య ని
మ్మా మాట ల్వెయియేల యంచనిన గోత్రాధీశుఁ డౌరౌర ని
|
|
|
స్సామాన్యంబు తపోవిశేషమేకదా జామాత యయ్యె న్భళీ
యీమౌనీంద్రుఁడు నాకు నాకులము యెంతే పావనం బయ్యెడిన్.
| 25
|
తే. |
అనుచు ముదమున మునిఁ దోడుకొనుచుఁ బురము, సేరి పురమెల్ల మిగులఁ గైసేయఁ బనిచి
వేగ మౌహూర్తికులను రావించి లగ్న, నిర్ణయము చేసె గాధిభూనేత యంత.
| 26
|
సీ. |
చెలువ యొక్కతె నూనె చిలికించి జడ విప్పి నిదురరాఁ దలయంటె నేర్పు మీఱఁ
జెలియోర్తు కుంకుమ నలుగిడె భసితావలిప్తదేహము హేమదీప్తి మెఱయ
గంధ మిందేలన గందంపు టటకలిఁ బెట్టె నవ్వుచు నొక్కబిసరుహాక్షి
యుష్ణాంబువు లటంచు నొడ్డుకోఁ గోర్వెచ్చజలముల నొకకల్కి జలకమార్చె
|
|
తే. |
చలువ లందిచ్చె నొకచెల్వ వెలఁది నవ్వు, లుత్తరీయము లందుఁ జేనొడియ మాల్య
భూషణంబులఁ గైసేసెఁ బొలఁతి యొకతె, రాజులమె యంచు నమ్మునిరాజు సెలఁగ.
| 27
|
తే. |
ఇవ్విధంబున రుచికమునీంద్రచంద్రుఁ, బెండ్లికొడుకును జేసినఁ బ్రేమమీఱఁ
గన్యకామణి సకలశృంగారములను, చెలులు గైచేసి రటమున్ను చెలువుమీఱ.
| 28
|
సీ. |
అట గాధిభూపాలుఁ డత్యంతముదముతో జాతిముత్యపుపెండ్లిచవికెలోనఁ
దోరమై మంగళతూర్యఘోషంబులు భూనభోంతరముల బోరుకలఁగఁ
బాటలగంధులు పాటలు పాడంగ మమతతో రుచికుపాదములు గడిగి
మధుపర్క మొసఁగి సమ్మతి సత్యవతిఁ దనపుత్రికామణి ధారవోసి యిచ్చి
|
|
తే. |
యంత నాల్గుదినంబులు నైనపిదప, భూరిమణివస్తువాహనభూషణంబు
లరణముగ నిచ్చి యల్లుని నాఁడుబిడ్డఁ, దనపురంబున నిల్పఁ జిత్తమునఁ దలఁచి.
| 29
|
మ. |
అనఘా మానసశుద్ధి గల్గిన నరణ్యానిం బ్రవర్తిల్లుట
ల్గనకాగారమునందు నుంట సరియేకాదే తమోదూరుఁడై
జనకుం డేలఁడె భూమి మీ రటులు నస్మత్పట్టణాభ్యంతరం
బునఁ గొన్నాళ్లు వసించు టొప్పదె యన న్భూమిసురుం డిట్లనున్.
| 30
|
ఉ. |
మంచిది సార్వభౌముని కుమారికకు న్వనవాసఖేద మె
ట్లించు నటంచు నెంచి వసియించెద [1]నట్లనె దీన నేరమే
మంచుఁ దదీయపట్టణమునం దొకకాంచనమందిరంబునం
జంచలనేత్రతోడఁ బతి సల్పె సమస్తగృహస్తధర్మముల్.
| 31
|
చ. |
గురుకుచకుంభము ల్గదలఁ గ్రొవ్వెద జాఱఁ గడాని కమ్మక్రొ
మ్మెఱుగులు దళ్కుచెక్కులను మించ మిటారపుఁగల్కి చూపులం
|
|
|
దొరసిన సిగ్గుతో నళుకుతో సతతంబును గ్రొత్తపెండ్లికూఁ
తురు పరిచర్య సేయఁ బతి తోరపువేడ్క నొనర్పు సత్క్రియల్.
| 32
|
సీ. |
ఔపాసనంబున కక్షత ల్దెమ్మన్న తఱినిచ్చు నపుడు తత్తఱము పేర్మి
నౌనటే నైవేద్య మాయెనాయన నాయె ననక పదార్థంబు లునుచు నేరు
పడుగకమున్న మాఱిడఁ దెచ్చి యాతఁ డేమాత్రంబు వలదన మగుడు సిగ్గు
మడుపులన్నియు నొక్కమఱి యిచ్చి భుజియింపఁ జనుమన్న నొండొం డొసంగు ప్రేమ
|
|
తే. |
విశ్రమింపఁగ శయ్య గావించు నెనరు, వీజనం బల్లనల్లన విసరు మమత
యొయ్యనొయ్యన పాదంబు లొత్తు బత్తిఁ, బతినిఁ జొక్కింప మెలఁగు నప్పద్మగంధి.
|
|
|
అంతట నొక్కనాఁ డాగాధినృపపత్ని పతిని కోలాటంపుప్రతిమజోళ్ల
తీరైనమంజిష్ఠితెరతోడి పచ్చలపల్లకి యెక్కి ప్రాభవము మెఱయ
నిరువంక నుడిగంపువిరిఁబోండ్లు రా నన్నగళుముందిసందడిఁ గడలక్రొత్త
రంగులఱవికెలు బంగారుపూకొప్పెసవరము ల్వగవగ [2]సన్నచీర
|
|
తే. |
లద్దము ల్పరిమళములు నాది గాఁగఁ, బెట్టియలతోడ రాఁ దనపట్టియున్న
నగరి కేతేర నారాజనందనియును, మోదమునఁ దల్లిపాదాబ్జములకు మ్రొక్కె.
| 34
|
తే. |
మ్రొక్కినను లేవనెత్తి యమ్ముద్దుఁగూఁతు, నక్కునను జేర్చి యో యమ్మ యగ్రవర్ణు
చెట్టపట్టియు దండంబు పెట్టఁదగునె, రాచవారికి నంచు నారాజవదన.
| 35
|
క. |
నునుసిగ్గునఁ దలవంచిన, తనయకు వస్తువు లొసంగి తపనీయగృహం
బున నొక్కరత్నపీఠిని, నెనరుగఁ గూర్చుండి యిట్లనియెఁ గూఁతురికిన్.
| 36
|
ఉ. |
కన్నియ నేఁడు నీముఖవికాసము దెల్పె సమస్తసౌఖ్య మై
న న్నిను వేఁడ వేడుకగు నాథుఁడు నిచ్చలు నింగితజ్ఞుఁడై
మన్నన సేయునే తెలుపుమా యెలఁబ్రాయపుముద్దుఁగూఁతు మే
లెన్నక యిచ్చితిం జడున కేనని నీజనకుండు చింతిలున్.
| 37
|
తే. |
అనిన నేమనకున్న సత్యవతిఁ జూచి, సఖులు దెల్పఁగరాదఁటే జననిచెంత
సిగ్గువడ నేల మాతోడఁ జెలగి చెలఁగి, పతి చతురుఁ డంచుఁ దెల్పుదే ప్రతిదినంబు.
| 38
|
తే. |
అమ్మ యిది దెల్పకున్న నేమాయె వినుము, తనమనోహరు సాటిగా రనుచుఁ బలుకు
నింద్రుఁ జంద్రుని నెడఁబాయ దింతతడవు, నేమి మంత్ర మెఱుంగునో ఋషిసుతుండు.
| 39
|
చ. |
అన విని యంతెచాలుఁ జెలులార మహాత్ములు గారె తాపసు
ల్వనితల కింపు సేయఁదగువైఖరిఁ గూడి మెలంగఁజాలరే
యనిశము నవ్వనేల యని యాకుశనాభకుమారపత్ని త
త్తనయను గౌఁగిలించి ప్రమదంబున నిట్లనియె న్మృదూక్తులన్.
| 40
|
తే. |
కన్య నినుఁగన్న కతమున ధన్యమయ్యె, నాకులంబంతయును నైన నాకులంబు
గాకమానదు నామది నాకుబలెనె, నీకుఁ దనయుండు లేమికి నీరజాక్షి.
| 41
|
క. |
పతి వేఁడికొనుము పుత్రుని, నతులతపోన్వితుఁడుగాన నతఁ డొసఁగెడియా
సుతుఁ డుభయకులంబునకుం, గతి యొసఁగెడి ననుచుఁ దెల్పి క్రమ్మఱఁ జనియెన్.
| 42
|
ఉ. |
బాలిక నాఁటి రేయి పతిపజ్జకుఁ బోయి పయింటకొంగు కెం
గోల బిగించుచు న్నెలను గేరెడు లేనగుమోము వంచి వా
చాలతఁ జూపలే కిగురుచాయల మోవి గదల్పుచున్న నీ
లాలక చెట్టపట్టి తనయంకమునం దిడి మౌని యిట్లనున్.
| 43
|
తే. |
యేమి యడుగంగ వచ్చితి వింతలోన, సిగ్గుపడ నేల తెల్పవే చిగురుఁబోఁడి
యెద్దియైన ఘటించెద నే నటన్న, జననివాక్యంబు సతి దెల్ప మునివరుండు.
| 44
|
క. |
కని పెంచువయసు గాదే, తన కేటికి లేక పోవుఁ దనయుం డిఁకనీ
కును నీజననికి నుత్తమ, తనయులు గల్గుటకుఁ జర్వుఁ దగఁ గావింతున్.
| 45
|
క. |
అని యున్నతఱిని భృగుముని, సనుదేరఁగ రుచికమౌని సతిమణికలశం
బునఁ బన్నీరము వంచఁగ, జనకుని పాదములు గడిగి సంతస మెసఁగన్.
| 46
|
తే. |
చౌకమై మించు దంతంపుఁజవికెలోన, రత్నమయపీఠిపై నుంచి ప్రకటభక్తి
పొసఁగ బంగారుపువ్వులఁ బూజ సేసి, వినయమున డాసి వీవన విసరుచున్న.
| 47
|
ఉ. |
వేడుక మీఱఁగా విభుని వీవన గైకొని చల్లతెమ్మెరల్
గూడఁగ మెల్లనే విసరు కోడలి వల్లభభక్తి యెందునుం
జూడని సద్గుణంబులును జూచి ముదంబున నమ్మునీంద్రుఁ డి
ట్లాడె వధూమణీ యడిగినర్థ మొసంగెద వేఁడు మీ వనన్.
| 48
|
క. |
వనజముఖి పలుకకున్నం, దనతల్లికిఁ దనకు మంచితనయులు వలెనం
చును వేఁడె నిన్న రే న, న్నని రుచికుఁడు దెల్ప సతి త్రపాన్విత యగుచున్.
| 49
|
తే. |
తలఁగిపోయిన భృగుమౌని తనయుఁ జూచి, యాత్మజులు గల్గుటకు నుపాయంబు దెల్పి
శముల కేటికి నృపనివేశములఁ బుత్రుఁ, బడసి వని నుండు మీ వని పలికి చనిన.
| 50
|
ఉ. |
అంతట భార్గవుండు తనయంగనఁ గన్గొని సి గ్గి కేటికే
యింతిరొ నీదుకోర్కి ఫలియించెను నీజనయిత్రి నీవు ఋ
త్వంతమునందుఁ బిప్పలము నత్తియుఁ గౌగిట నొత్తి రండు నా
చెంతకు నీకు నేఁజరువుఁ జేసి యొసంగెద నంచుఁ బంచినన్.
| 51
|
క. |
సరభసముగ సత్యవతీ, తరుణీమణీ యవ్విధంబుఁ దన కెఱిఁగింపం
బరితోషంబున నరవర, సురపతిసతి ఋతువు కెదురుసూచుచు నెలమిన్.
| 52
|
సీ. |
మును దాను గడకుఁ బోయినదినం బాధిగాఁ దెచ్చుక దినమును దినము లెన్ను
మధురము ల్ప్రియమైన మాని భోజనవేళ సారెకు నావపచ్చళ్లు మెసవుఁ
దుఱుమున నొకపువ్వు దుఱుము నెచ్చెలియోర్తు తెఱవ పుష్పవతి వైతి వన బ్రమయు
నలవోకఁ దొడమీఁదివలువ కుంకుమకఱ్ఱ గనుఁగొని తొలఁగితి ననుచుఁ దొలఁగుఁ
|
|
తే. |
దెలిసి కాకున్న వగచు నజ్జలరుహాక్షి, యంత నెలయైన ఋతువైన యాత్మజయును
దాను మూన్నాళ్లు మూఁడేండ్లుగాను గడపి, నాలవదినంబునందు స్నానములు చేసి.
| 53
|
వ. |
నిబ్బరంబగు నబ్బురపు సంతసపు కబ్బినుబ్బి తబ్బిబ్బగు నబ్బిబ్బోకవతులు రుచికుం
డాడినక్రమంబు వోనాడి వాఁడిచనుమొనలు గాఁడిపాఱఁ బుడమిఱేనిపూఁ
బోఁడి మేడియును రుచికమునిలికుచకుచ రావియును గౌఁగిలించి పసుపాడిన
రాచిల్కలవడువున నడివీథి నడతేరునపుడు తమరాక మునుగల్గ సౌవిదల్లులవలన
విని చంకలనిండ పసిబిడ్డలు గల్గుతల్లులు సరగమఱుఁగున కరుగ మందిరంబున కరిగి.
| 54
|
తే. |
మౌనిపతి బ్రాహ్మనక్షత్రమంత్రములను, జరువు గావించి యటయుంచి సవిథ నదికిఁ
జనిన నావేళ మెసవిరి తనయచరువు, జనని జనయిత్రిచరువుఁ దత్తనయ పదరి.
| 55
|
ఉ. |
అంతట మౌని వచ్చి యది యంతయు నాత్మ నెఱింగి కిన్కతో
గాంతరొ నీదుగర్భమున క్షత్రకులాంతకరుండు పుట్టెడి
న్శాంతిధనుండు బ్రహ్మఋషిచంద్రుఁడు పుట్టెడి నీదుతల్లికిన్
భ్రాంతిని నీ వొనర్చినవిపర్యయ మిట్లు ఫలించు నావుడున్.
| 56
|
చ. |
భయపడి యంత సత్యవతి భర్తపదంబుల వాలి రాజహుం
డయినకుమారునొల్ల సదయాత్ము నొసంగు మటంచు వేఁడిన
న్దయ ముని నీసుతుండగు నుదాత్తుఁడు దత్తనయుండు ఘాతుకుం
డయి జనియించు నీజననియందు మహర్షివరుండు పుట్టెడిన్.
| 57
|
క. |
అని పల్కిన ముదమందిరి, వనితామణు లంత సత్యవతి జమదగ్నిం
గనియె జగత్త్రయసజ్జన, వినుతుని నృపపత్ని గనియె విశ్వామిత్రున్.
| 58
|
శా. |
విశ్వామిత్రుఁ డమిత్రభీకరభుజావార్యం బవార్యంబుగా
విశ్వం బేలి వసిష్ఠమౌనిపతితో విద్వేషియై యంతట
న్శశ్వద్బ్రహ్మఋషిత్వముం గనియె సాక్షాద్బ్రహ్మదేవాగ్రణీ
విశ్వేశాదులు సన్నుతింపఁగ జగద్విఖ్యాతశీలంబునన్.
| 59
|
క. |
జమదగ్నిమునియు సకలా, గమనిగమపురాణశాస్త్రకలనాచణుఁడై
శమదమయమనియమాదిమ, సమధికగుణశాలి యగుచు సన్నుతి కెక్కెన్.
| 60
|
క. |
రేణుకభూపకుమారి క, రేణుక గుణగణనగణ్య ఋక్షధరిత్రీ
రేణుకగతి జితసమదక, రేణుక విలసిల్లు రూపరేఖలకలిమిన్.
| 62
|
క. |
ఆకన్నె రౌచికుఁడు పాణౌకృతఁ గావించి కాంచె నలుగురసుతుల
న్శ్రీకాంతుఁ డైదవసుతుం, డై కూరిమి నెఱపె నతని కవనీనాథా.
| 63
|
క. |
అనవుఁడు నమ్మునిఁ గనుఁగొని, జనపతి యిట్లనియె శౌరి జమదగ్నికి నం
దనుఁడై జనియించుట కే, మి నిమిత్తం బనిన మౌని మృదుగతిఁ దెల్పెన్.
| 64
|
ఉ. |
నారదమౌనిచంద్రుఁ డొకనాఁడు వినోదము గాఁగ నాసహ
స్రారముఁ జేరి భాస్కరసహస్రనిదర్శన యోసుదర్శనా
వైరి నిశాటకోటి ననివారణ ద్రుంచుట నీదుశక్తియో
సారసపత్రనేత్రు భుజశక్తియొ మా కెఱుఁగంగఁ జెప్పుమా.
| 65
|
చ. |
అనవుడుఁ జక్రమూర్తి కమలాసనసూనునిఁ జూచి నవ్వుచున్
విను మొకమాట దెల్పెద వివేకముతోఁ జలవాహనిర్గ తా
శని గిరిభిన్న మౌట పవిశక్తియొ యల్లపయోదశక్తియో
కనుఁగొను మట్ల శౌరి యొక కారణ మేన హరింతు శత్రులన్.
| 66
|
చ. |
అన విని శౌరిఁ జేరి కలహాశనుఁ డబ్జపలాశలోచనా
దనుజవరేణ్యఖండనము తావకశక్తియొ చక్రశక్తియో
యనవుఁడుఁ జక్ర మేమిపని యస్మదుదారబలంబెకాక విం
టను హరియించెనో యసి నడంచెనొ వైరుల నీ వెఱుంగవే.
| 67
|
మ. |
అనిన న్వెన్నునిఁ జూచి మౌని కమలాక్షా నీవు నీశక్తియం
చును నీచక్రము వేఁడిన న్స్వబలమంచుం బల్క నిందేదియొ
క్కొ నిజంబన్నను నవ్వి యట్లయిన నీకుం దేటఁగా నింక నే
నును ధాత్రిం జనియింతుఁ బోరుటకుఁ దానుం బుట్టుగా కుర్వరన్.
| 68
|
మ. |
అని పద్మాక్షుఁడు పంపఁ జక్రము హసాదంచుం బ్రమోదంబు మీ
ఱను మాహిష్మతి నేలుచున్న కృతవీర్యక్షోణిపాలాగ్రగ
ణ్యునకుం బుట్టె సహస్రబాహులయి నైజోగ్రారము ల్మించ న
ర్జుననామంబున ధీరతానుగుణతాశూరత్వము ల్శోభిలన్.
| 69
|
మ. |
అణుమాత్రేతరభక్తియుక్తుఁడయి దత్తాత్రేయు సేవించి య
య్యణిమాద్యష్టవిభూతులం బడసి సప్తాంభోధిసంవేష్టితా
గణితోర్వీస్తవసప్తకక్ష్యగృహరక్షాలీల రక్షించెఁ దా
రుణుఁడై తోఁచుచు నెందు యోగమహిమం గ్రూరాత్ములం ద్రుంచుచున్.
| 70
|
సీ. |
మఖభోక్తలయజీర్తి మాన్పఁగా వేలుపువెజ్జు మందులు సారె వెతకసాగె
హోమధూమంబుల నుబ్బుమబ్బులు మరున్నేత్రశృఙ్ఖలలలో నిల్వవయ్యె
వివిధకాంక్షలఁ జెంది ద్విజులు గృతార్థులై దేవతాతతులఁ బ్రార్థింపరైరి
యెడలేదు నువుగింజ యిడఁగ సప్తద్వీపములయందు యూపము ల్పొదలుకతన
|
|
తే. |
నర్జునక్షోణిపాలకుఁ డహరహంబు, సేయుయాగంబుల నతండు సేసినట్లు
ధర్మములు చేసినట్టి భూధవునిఁ గాన, భూతభావిభవత్కాలముల నరేంద్ర.
| 71
|
సీ. |
ఉడురాజముఖులతో నొకనాఁడు జలకేళి సవరించుచును విలాసంబు గాఁగఁ
జేతులచేత రేవాతోయములు గట్టి యొకయిన్ని యవ్వలి కుబుకనీక
యంతట విడువ నయ్యంబుప్రవాహంబు సైకతలింగపూజన మొనర్చు
రావణు ముంప విభ్రాంతుఁడై కోపించి కలహించి వచ్చినఁ గాంచి నవ్వి
|
|
తే. |
వానిఁ గొని చని చెఱసాల వైచె నంతఁ, బౌత్రునకుఁగాఁ బులస్త్యుండు బ్రార్థనంబు
సేయ దశకంఠు విడిచె రక్షితరణాహృ, తార్జనుం డగు కార్తవీర్యార్జనుండు.
| 72
|
సీ. |
మఱియొక్కనాఁ డల్ల మహిపుకొల్వున కొక్కబ్రాహ్మణుఁ డరుదెంచి పార్థివేంద్ర
యాఁకలిగొంటి నే నడిగినయన్నంబు పెట్టింపు మనవుఁడు బ్రీతి నతఁడు
నటువలెఁ బెట్టింతు ననిన నే దహనుండ నీదేశ మాహుతి యి మ్మటన్న
బొంకక చావెంటఁ బోవుచు శిఖి నార్చువారి వారించుచు వనులు పురము
|
|
తే. |
లాదిగాఁ గాల్పనీయ నిజాశ్రమంబు, దగుల వగచుచు వరుణనందనుఁడు రామ
దళితభుజుఁడవు గమ్మని యలుకఁ బలుక, యులికి యంతట నర్జునుం డుండెఁ బురిని.
| 73
|
చ. |
హరియును రేణుకాజలరుహాయతనేత్రకు జమదగ్ని నా
ధరిణి జనించి జాత్యుచితతాపసవేషము మీఱ శూరుఁడై
పరశువుఁ బూని మౌనిజనబాధకసింహహయద్విషన్మృగో
త్కరకిరిముఖ్యసత్త్వముల దైత్యులఁ ద్రుంచుచునుండె నెల్లెడన్.
| 74
|
చ. |
అట నొకనాఁడు రేణుక మహర్షిపురంధ్రులతోడఁ గూడి యె
ప్పటివలె గంగ కేగి యతిపావనతీర్థము లాడి యన్యదు
ర్ఘటముగ వాలుకాపటలి గట్టి ఘటిన్ ఘటియించి నీటితోఁ
గటితటినుంచిఁ దోవతులు గాలికిఁ బైనడతేర వచ్చుచోన్.
| 75
|
సీ. |
అలతి జక్కవపిట్ట లంచుఁ బట్టితిఁ గాని గుబ్బలం చెఱుఁగనే కోమలాంగి
నునునాచుతీవియ యని యెడిసితిఁ గాని వేణియం చెఱుఁగనే విద్రుమోష్ఠి
సుడి యంచు మునివ్రేళ్ళఁ బుడికిచూచితిఁ గాని నాభియం చెఱుఁగనే నలినగంధి
తామరవిరి యంచుఁ దావి గ్రోలితిఁ గాని మో మంచు నెఱుఁగనే ముద్దులాఁడి
|
|
తే. |
యంచు నర్మోక్తిఁ జెనకుచు మించుఁబోండ్లఁ, గూడి జలకేళిఁ గావించు కోడెకాని
తలిరువిల్కాని నగుచక్కఁదనమువాని, నొక్కగంధర్వుఁ గాంచి యయ్యుత్పలాక్షి.
| 76
|
శా. |
ఏమే రేణుక కూడిరాఁగదవె నీ వెవ్వారి నీక్షించెదే
మామాట ల్వినవే య టంచు మునిభామారత్నము ల్బిల్వ నో
|
|
|
హో మీ కెంతటితీవ్రమే నిలువరే యొక్కింతసే పంచు న
క్కామిన్యుత్తమ నిల్చెఁ దోడిసతు లేగ న్వాని వీక్షించుచున్.
| 77
|
తే. |
మఱియు మఱియును వానిమన్మథవికార, ముల విలోకించుచును వేఱెతలఁపు లేక
బ్రమసి యనురక్తయై యున్న పంచబాణ, కాండ మగలించె ననఁ గటిఘటము పగిలి.
| 78
|
క. |
జలములఁ జేలము దడసినఁ, జెలి యది యపు డెఱిఁగి యకట చేసడలె నటం
చలగంగయిసుక నెప్పటి, వలె ఘటముం జేయఁబోయి వస గాకున్నన్.
| 79
|
క. |
తనపాతివ్రత్యంబున, కును భంగము వచ్చెనేలొకో యని చిత్తం
బునఁ దలఁచుచు గుండియ జ, ల్లన నిఁక నే నెందుఁ జొత్తు నని నతివగతోన్.
| 80
|
శా. |
నానారీతులఁ బిల్చు నెచ్చెలుల వెంటం బోవ కేనూర కే
యీనిర్భాగ్యు ని టేల సూచితిని నా కీభంగపాటొందె నే
లా నాపాలివిధాత నానొసట వ్రాయంబోలు నీరీతి నిం
కేనేమందును గంగలోఁ బడుదునో యీదుర్యశం బింకఁగన్.
| 81
|
తే. |
అనుచుఁ జింతించుచును రిక్తహస్తములను, గదియవచ్చిన యిల్లాలిఁ గాంచి నాథుఁ
డెంతప్రొ ద్దాయెఁ బోయి నీ వింతతడవు, నెచట నుంటివి జలఘటం బేది యనిన.
| 82
|
క. |
ఏమన నేరక యూరక, కామిని తలవంచికొనినఁ గపటజ్ఞుండౌ
నామునికి వచ్చెఁ గోపం, బేమాత్రమొ నాటికోప మీశ్వరుఁ డెఱుఁగున్.
| 83
|
క. |
జటివరుఁ డిటువలెఁ గనలుచు, జిటచిటనిప్పుకలు సెదర జిగికనుఁగొనలం
డటతటకటతటు లదరఁగఁ, గిటకిటమన రదనపటలి గీఁటుచుఁ బలికెన్.
| 84
|
శా. |
ఔనే యోసి దురాత్మురాల నిను నిల్లా లంచు నే నమ్మియుం
టే నీ విట్టు దురాశఁ జెందఁదగునే నీభోగము ల్సెల్లునే
కానిమ్మంచును రుక్మవంత యిదిగోఁ గన్గొంటి దుశ్చేష్టితన్
దీనిన్ ద్రుంపుము శస్త్రపాణివయి మాతృస్నేహ మింకేటికిన్.
| 85
|
తే. |
అనిన శ్రీరామరామ యటంచు మౌని, నందనుఁడు హస్తములను గర్ణములు మూసి
యెంతమా టానతిచ్చితి రింత సేయ, నేమి నేరంబు గావించె నీపురంధ్రి.
| 86
|
వ. |
అని మఱియు స్వేచ్ఛాగర్భవతు లగుసతులసైతంబు నోర్చి కూర్చుకొను
బృహస్పతిప్రభృతుల వినమే యట్టికాయికదోసం బణురేణుమాత్రం బీరేణుక
|
|
|
యందు లేదుగదా మానసికదోషంబునకుం దగినప్రాయశ్చిత్తంబు చిత్తగించుట
యుత్తమం బిది నీచిత్తంబునకు రాకున్న నిమ్మత్తకాశిని వర్జించు టంతియకాక
క్రూరకర్మంబు బ్రాహ్మణునకు ధర్మంబు గాదని పలుకు రుక్మవంతుతోఁ గూడ
వివస్వత్సుషేణవిశ్వావసులను మువ్వురుసుతు లట్ల పలికిన దురాధర్షామర్షంబున
నమ్మహర్షి దురాత్ములారా మాకు ధర్మోపదేశంబు సేయవచ్చితిరే యలంఘ్యమ
ద్వచనోల్లంఘనదోషంబున నజ్ఞానులై వనజంతుసంతతులం గూడి తపింపుండని
శపించి యాముని చెంతనున్న పరశురాము విలోకించి నీవైన నీచంచలాత్మఁ
ద్రుంచెదవో లేదో యని యడుగ గడగడ వడంకుచు కేలు మొగిచి మీరు నొడి
వినవడువున నడంచెద ననిన తడవు సేయకు మని తండ్రి తరువిడఁ బెల్లడరు
నడలున భార్గవుం డనర్గళధారాకఠోరంబగు కుఠారంబు దెస చూచినఁ గని కొడు
కులారా మిమ్ము నెడఁబాసిపోయెదనని కన్నీరు నించుతల్లిం గాంచి రుక్మవం
తుండు మొదలైన నలువురుసుతులు మాతృస్నేహంబువలని దుఃఖావేశంబున
జననికంఠంబు వట్టికొని తోఁబుట్టువుల మమ్ము మొదట మట్టు పెట్టి మఱిమీఁదట
మాతృశిరంబుఁ గొట్టి కీర్తిఁ గట్టుకొమ్మని బెట్టు చలపెట్టిన వారల నెట్టు విడిపింప
లేక పరశ్వధాయుధుండు దనమోము చూచిన జమదగ్ని యగ్నివిధంబున
బగ్గున మండిపడి రుక్మవత్ప్రభృతుల మున్నుగా హతులం గావించి పిదప రేణు
కను దెగవేయు మని త్వర పెట్టిన బెట్టుల్కి యిట్టికట్టిడితనంబున కొడిగట్టుట
కెట్టిపాపంబు చేసితినో యని యెదఁ బట్టుసాలక నెట్టుకొనుదట్టపు నెవ్వగ
నిట్టట్టె యెట్టకేలకు నొడంబడి దిట్టతనంబునఁ దనతోఁబుట్టువుల నొకరొకరిఁ
జెట్టవట్టి కడకు రాఁదిగుచుచు వారు తమ్ముఁడా నీ కిది ధర్మంబు గాదని వాపో
వుచు నొకకేల మాతృకంఠంబు విడక నొకకేల నొడ్డించుకొన నొడ్డారంబు
మానక గండగొడ్డంట నన్నలువుర న్నలజడ్డిగంబులు దెంచిన దిగువంబడ్డ
తత్కళేబరంబులపై వాలి వారిబిడ్డలు నిల్లాండ్రు కన్నీరు మున్నీరై
దొరుగ నురంబులు శిరంబులు మోదికొనుచు బహువిధంబుల విల
పించుచుఁ గట్టా యిట్టిశోకం బెట్టు భరింపఁగలవారము రామా
పరశ్వథంబుననే యిఁక మావధంబునుం గావించి యధిపులం జేర్చి యధికపుణ్య
పదంబునం బొమ్మని వేఁడుకొనిన నట్టిక్రూరకర్ముండ నౌఁగదా యని రెట్టించువగ
రైణుకేయుండు దల్లికిం బ్రణమిల్లి యమ్మా భావంబున నిష్టదైవంబుఁ దలంచు
కొమ్మనిన నమ్మానిని నాకింక నితరదైవం బున్నదే యని పతికి నమస్కృతి చేసి
మహాత్యా మనోవాక్కాయకర్మంబులు నీవ దైవంబని యుండుదుం గాని యొం
డెఱుంగఁ బురాకృతవశంబున నిప్పు డిట్టిమానసికదోషం బనుభవించితి నీదోషంబు
మరణాంతప్రాయశ్చిత్తంబున నివృత్తంబు గావించి నాజన్మజన్మాంతరంబులు మీకే
|
|
|
దాసినై పరిచర్య సేయుటకు ననుగ్రహింపుం డని పునర్వందనంబు చేసి కరగత
పరశుధారాభీముం డగుపరశురాముం గనుంగొని కుమారకా క్షణభంగురం
బైన యీశరీరంబునకుఁగా విచారంబు వలదు జనకవాక్యోల్లంఘనంబున రుక్మ
వదాదు లిట్లయిరి గదా నీవైన జనకవాక్యప్రతిపాలనంబున దీర్ఘాయుష్మంతుఁడవై
కులంబు నిలుపుమని రేణుక పద్మాసనాసీనయై పుత్త్రా యన్యుల నియమింపక నా
పతి నిన్ను నియమించి మేలు చేసెఁగనుక చెదరక ధారదప్పక యొక్కపెట్టునం దె
గనఱకు నీనరుపు సూతమను మాత తెగువ సూచి తల్లి తెగనఱకుమంచుఁ బెంచి
తివే యీ చేతులంచుఁ బలపలకన్నీరు నించి యొడలు గడగడవడఁక జమదగ్ని దు
రాగ్రహదుర్గకుం బలివెట్టుచందంబున నెట్టకేలకు గేలికుఠారంబున రేణుకశిరం
బు గఱుక్కనం దెగనఱికినఁ దలమిడిసి యల్లంతటంబడియెఁ దత్కంఠనాళంబున
జుల్లున రక్తంబు వెడలునప్పుడు హాహాకారంబులు సేయువారును రేణుకవలన నే
మిపాపం బిది యధర్మం బనువారును నిట్లయిన స్త్రీల కింకఁ బాతివ్రత్య మతిదుర్లభం
బనువారును ఋషుల కింతరోషంబు చెల్లునే యనువారును పరశురాముం డతి
క్రూరకర్ముండు పొమ్మనువారును రాముం డేమి సేయుఁ దండ్రి సెప్పినయట్లు సేసె
ననువారును దండ్రి ముది ముది తప్పు సెప్పిన నకార్యంబు రామునకుం జేయఁద
గునే యనువారును జేయకున్న నన్నలపా టొందఁడే యనువారును నెట్టిపా టొం
దినఁదా నేమి యిట్టి క్రూరకర్మంబున కొడిగట్టఁదగునే బ్రాహ్మణున కనువారును వీ
రెక్కడి బ్రాహ్మణులు జన్మాంతరంబున బోయ లనువారును బోయలైనం దమవారిం
దెగఁజూతురే యనువారును నిట్టియుత్కృష్టకర్మంబున జమదగ్ని కిచ్చటనె యను
భవంబునకు రాకపోవునే యనువారును జమదగ్ని సర్వజ్ఞుం డతఁ డెఱుఁగడే
యిది యెట్టి ధర్మసూక్ష్యంబో యనువారు నైరి యయ్యాశ్రమవాసు లయ్యెడ
గరుడగంధర్వసిద్ధవిద్యాధరాదులతోఁగూడ బ్రహ్మరుద్రేంద్రాదు లంబరంబున
నిల్చి యాసాహసకర్మం బద్భుతం బని చూచుచుండి రయ్యవసరంబున.
|
|
చ. |
బళిబళి నిన్ను మెచ్చితి నపారభుజాబలధామ రామ నీ
వలయు వరంబు వేఁడు మనివారణ నిచ్చెద నన్నఁ దండ్రిప
జ్జలజములందు వ్రాలి మునిచంద్ర యొసంగుము జీవితంబు ల
న్నలకును నాదుతల్లి కనినం జమదగ్ని ప్రహృష్టచిత్తుఁడై.
| 88
|
తే. |
వారివారితలలు వారివారికబంధ, ముల నమర్పఁబంచి మునివరుండు
గరకమండలూదకములు పైఁ జల్లిన, సుతులతోడ బ్రతికె సతియు నంత.
| 89
|
ఉ. |
నిద్దురవోయి లేచుగతి నీరజలోచన లేచి నవ్వులే
ముద్దుమొగంబుతోఁ బతికి మ్రొక్కి పదానతులైన పుత్త్రులం
దద్దయుఁ గౌఁగిలించి మునిదారలతోఁ దగ సుద్దులాడుచున్
నిద్దపువేడ్క నందఱను నివ్వెరపాటున ముంచె నత్తఱిన్.
| 90
|
క. |
విరిసోన గురిసె మొరసె, న్సురదుందుభు లపుడు మిగులఁ జోద్యము లనుచుం
బరితోషంబున వేలుపు, దొర లెన్నిరి వందిమాగధులవలె నంతన్.
| 91
|
క. |
జమదగ్ని యొసఁగె రామున, కమితభుజాబలము సంగరాంగణవిజయం
బమరనరాజేయత్వము, నమరత్వము లోనుగాఁగ నఖిలవరములున్.
| 92
|
క. |
హరశిష్యుండై సురరిపు, హరణం బొనరించి శివుదయన్ దివ్యాస్త్రో
త్కరముఁ గని గుహునిపై మ, చ్చరమున భేదించెఁ గ్రౌంచధర మొకకోలన్.
| 93
|
సీ. |
అంతటఁ గార్తవీర్యార్జునుం డొకనాఁడు వేఁటలాడఁగ వచ్చి విపినవాటి
గజగండభేరుండఖడ్గాదిదుష్టసత్వములను ఖండించి శ్రమము మించి
జమదగ్ని యాశ్రమస్థలముఁ బ్రవేశించి యతఁడు విందొనరింప నారగించి
కామధేనువుఁ గాంచి కలుగదొకో యిట్టి యావు నావంటిజనాధిపతికి
|
|
తే. |
నంచు నెంచుచుఁ బురమున కరుగ నతని, చిత్త మెఱిఁగి కుమారు లుద్వృత్తు లగుచు
రాముఁ డట లేనివేళ నాశ్రమము సొచ్చి, కామగవిఁ దెచ్చి తమయింటఁ గట్టికొనిరి.
| 94
|
శా. |
ఆవార్త ల్విని భార్గవుండు పటురోషావేశసందీప్తనే
త్రావిర్భూతహుతాశనప్రభవధూమాకారఫాలస్థల
వ్యావల్లద్భ్రుకుటీమహోగ్రుఁడయి దోరంచత్కుఠారంబుతో
వే వచ్చె న్నగరాటవీజనపదాన్వేషంబు గావించుచున్.
| 95
|
చ. |
అల గాధేయుఁడు చక్రవాళకులశైలాంభోధిదేవాప్సరో
లలనాదిప్రతిసృష్టి చేసె నన సాలంబు ల్మహాసౌధరా
జులు ఖేయంబు నృపు ల్సుతు ల్మొదలుగా సొంపొందు మాహిష్మతిం
దిలకించెన్ భృగురాముఁ డద్భుతరసోన్మేషానిమేషంబుగన్.
| 96
|
మ. |
కని యౌరా కృతవీర్యనందనునిభాగ్యం బంచుఁ దద్గోపురం
బున నుగ్రాకృతి నిల్వ నచ్చటిజనంబు ల్పర్వుతోఁ బోయి య
ర్జునభూభర్తకుఁ దెల్ప నాతఁడు గడుం జోద్యంబుతోఁ దోడితె
మ్మనుచు న్నైజపురోహితుం బనుప నయ్యార్యుండు శీఘ్రంబునన్.
| 97
|
తే. |
ఎదురుగా వచ్చి నృపతి మిమ్మిపుడు తోడి, తెమ్మనియెఁ బ్రేమ భృగురామ రమ్మటన్న
భార్గవుఁ డనర్గళాగ్రహభర్గపటిమ, నిట్లనుచుఁ బల్కె నృపపురోహితునితోడ.
| 98
|
క. |
మే మేటికి వచ్చెద మటు, కామగవిం దెచ్చి యొసగు గ్రక్కున ననినన్
భూమిసురుఁ డెఱిఁగి ధరి, త్రీమండలపతికిఁ దెల్ప ధీరత నతఁడున్.
| 99
|
క. |
తనయులకుఁ జెప్పి పంపిన, విని వార లొసంగ మనిన విభుఁడు సుతులఁ గా
దనలేక గోసహస్రము, వినయంబున నొసఁగఁ బనుప విప్రుఁడు నటులున్.
| 100
|
క. |
ఒసఁగినఁ గనుఁగొని కనుఁగొన, నెసఁగిన కెంజాయ పొసఁగ ఋషిపతి మద్ధే
నుసమానులె యీధేనులు, మసారమున కెనయె గాజుమణు లెన్నైనన్.
| 101
|
తే. |
వలదు పొమ్మన విప్రుఁ డావార్తఁ దెలుప, విని నృపాలుఁడు మాతోడ వికటమేల
విప్రుఁ డేమాత్రముననైన వేడ్కఁ జెంద, వలయు ననుమాట వినఁడె భూవలయమునను.
| 102
|
తే. |
అటులు గాకున్న దనయిచ్చ యాత్మజులకుఁ, జెప్పి పంపిన విన రేమి సేయువాఁడ
ననిన నామాట విప్రుచే నాలకించి, యేల కించిత్తు న న్నెంచఁ డితఁ డటంచు.
| 103
|
ఉ. |
మున్నుగ ద్వారరక్షుల సముద్ధతసంగరరంగదక్షులన్
ఛిన్నుల సేయు భార్గవుని సేనలు గూడి యెదుర్ప భూధరా
భ్యున్నతమత్తదంతిహయతుంగశతాంగభటప్రతానమున్
ఛిన్నము చేసె రాముఁ డతిభీమకఠోరకుఠారధారలన్.
| 104
|
తే. |
అంత హతశేషమైన సైన్యంబు గొంత, యెంతయును భీతి నేఁగె దిగంతములకు
నంతయును విని రోషితస్వాంతుఁ డగుచుఁ, జింతఁ జేయుచు మేదినీకాంతవరుఁడు.
| 105
|
క. |
తనచేతనున్న చాపముఁ, బనిచి నిషంగంబు మెట్టఁబనిచిన నదియుం
జని గొనయ మెక్కి చాపము, దనయంతనె సంధిలె న్శితప్రదరములన్.
| 106
|
క. |
సంధిలుచు భూనభోంతర, బంధురత న్నిగుడు బాణపంక్తులు దునిమెం
గంధరగణముల సప్త, స్కంధముగతి రాముఁ డల్ల చాపము దునిమెన్.
| 107
|
క. |
చాపము దునిసిన నిషునిధి, రోపంబులు వెడలి తనదు ఱొమ్మగలింపం
గోపంబున భృగుపతి ప్రతి, రోపంబుల నృపునిశరధి రూపఁడగించెన్.
| 108
|
ఉ. |
అంతట నర్జునుం డనుప నాయుధము ల్బహురూపధారులై
యంతకదండదారుణములై శతకోటిశితంబులై యహః
కాంతకరోజ్జ్వలంబులయి కాలమహాభుజగాదిరాజదు
ర్దాంతములై హుతాశనకరాళములై తనపైపయిం బడన్.
| 109
|
క. |
పరశువున రాముఁ డన్నిటి, నిరసింపఁగ నృపతి యణిమనేర్పున నణువై
పరికింపఁగ వచ్చిన దనుఁ, బరమమహాయోగి దెలిసి పట్టఁ దివురుటన్.
| 110
|
చ. |
దివి భువి నిండియున్న ఘనదేహము మేరులసత్కిరీటము
న్వివిధవిభూషణంబులును వేయివిధంబుల నాయుధంబు ల
త్యవితథతేజము న్మహిమ నంది త్రివిక్రముఁ బోలియున్న న
య్యవనిపుఁ జించె నంచితశరావలి రాముఁ డచంచలాత్ముఁ డై.
| 111
|
మ. |
గరిమ ధారుణిఁ ద్రొక్కె దిక్కరులు మ్రొగ్గం గట్టు లిట్టట్టుగా
ధరణీవల్లభు డంత భార్గవుఁడు తత్పాదంబు నుగ్రాశుగ
స్ఫురణ న్మించిన ఖడ్గఖేటధరుఁడై భూమిళుఁ డత్యాశుగ
త్వరతో మింటఁ జరించుచున్ లఘిమచే దర్పం బనల్పంబుగన్.
| 112
|
క. |
ఖగగతి వ్రాలి ఖరాసి, న్భృగురాముశిరంబు వ్రేయ ఋషి పరశువునం
దెగనఱకినఁ దత్ఖడ్గము, జగతీనాయకుఁడు ప్రాప్తసౌభాగ్యమునన్.
| 113
|
ఉ. |
హా యని చేయిసాఁప బహుళాయుధము ల్చెయిగూడు నన్నియు
న్వేయివిధంబులం దునుము వేగ భృగూద్వహుఁ డంతలోనఁ బె
క్కాయుధము ల్ధరించు మనుజాధిపుఁ డంతనె త్రుంచు రాముఁడు
న్సాయకకోటు లేసి సురసంఘము విస్మయ మంది చూడఁగన్.
| 114
|
క. |
అహమిక భార్గవుఁ డిటువలె, బహులాయుధతతులఁ దునుమఁ బ్రాకామ్యమహా
మహిమాఢ్యుఁడు నీరమురహి, మహిలీయముగాఁ గుఠారి మహి భేదించెన్.
| 115
|
మ. |
ఒకచోఁ దేలి మహీశుఁ డీశతగిరింద్రోద్యద్రథారోహణో
త్సుకుఁడై సేనకుఁ జేయివీచిన భటు ల్శూలాదినానాయుధ
ప్రకరంబు ల్వెలుఁగ న్భృగూద్వహుని పైపైఁబర్వ నుర్వీజముల్
పెకలెం గట్టు దనంతఁదా నెగసివాలె న్రాముపై నత్తఱిన్.
| 116
|
సీ. |
నిబిడరోషజ్వాలనేత్రాగ్నిశిఖలతోఁ బటుతరోగ్రప్రతాపంబు వెలుఁగ
నిటలవక్రీభవచ్చటులభ్రూకుటితోడఁ గోదండదండంబు గొనయమెక్కఁ
గటుదంతసంఘర్షకిటకిటస్వనముతో శింజినీనినదంబు సెవుడుపఱుప
ద్వేషణభీషణభాషణంబులఁ గూడి క్రొవ్వాఁడితూపులు గుదులుగొనఁగఁ
|
|
తే. |
జించి చెండాడె భుజబలోదంచదహిత, హైహయాధీశసేనల నగవితతుల
జలజములు ద్రుంచు మదమదావళము ఠేవ, రాముఁ డాహవవిజయాభిరాముఁ డగుచు.
| 117
|
తే. |
వశితచే నంత ధారుణీవల్లభుండు, మెఱుఁగు మెఱసినరీతి భ్రమించుచుండి
యఖిలదిక్కులఁ దానయై యనుపమాన, మానమున నిట్టులనియె నమ్మౌనిఁ గాంచి.
| 118
|
ఉ. |
భార్గవరామ నీవు నొకపౌరుషశాలివిఁబోలె మచ్చమూ
వర్గముతోడఁ బోరెదవు వద్దిక సాహస మస్మదీయదో
రర్గళనిర్గళద్బహువిధాస్త్రపరంపర కోర్చి నిల్వఁగా
భర్గుఁడఁవో ముకుందుఁడవొ పాఱుఁడ వింతియకాక పాఱుమీ.
| 119
|
చ. |
ధరణిసురుండ వంచుఁ జెయి దాళితిగాని పరుండవైన దు
ర్భరశరమండలిం గెడపి భండనసీమఁ బరుండ నుంతు సం
|
|
|
గరముఁ ద్యజించు మింకయినఁ గాక యెదిర్చిన నోర్వఁ జెప్పితిన్
దురితము లేదు నాకిఁకను దోఁచినరీతి నొనర్తు గ్రక్కునన్.
| 120
|
చ. |
పొలుపుగఁ గొండ కట్టెలకుఁ బోయెడివానివిధంబు దోఁప గొ
డ్డలి యిది యేమి దీన జగడం బొనరింపఁగ వచ్చితే బళా
బళ భృగురామ యన్న నరపాల నిజంబు సమిత్ప్రియుండనై
నలువుగ నర్జునచ్ఛిద మొనర్పఁగ వచ్చితి నంచు రాముఁడున్.
| 121
|
శా. |
ఔరా విప్రుఁడ నంచు నం జులకసేయ న్వచ్చితే మంచిదే
రారమ్మా ధనువూని నీవయినక్షాత్రం బేను వీక్షించెద
న్శూరత్వంబులు మీకె యంచు నజుఁ డెచ్చో ముద్ర గావించెనే
లేరా బ్రాహ్మణశూరు నింకిటను గల్పింతు న్ననుం జూడుమా.
| 122
|
మ. |
ప్రమథేంద్రుండు నుతింప నంపమొనచేఁ గ్రౌంచాద్రి భేదించి మా
ర్గముఁ గల్పించితిఁ దొల్త నంచలకుఁ దత్కాండంబుల న్నీదువ
క్షము భేదించి మదీయకీర్తినవహంసం బెల్లచోఁ బోవ మా
ర్గముఁ గల్పించెద నాబలంబు గను మింకం గార్తవీర్యార్జునా.
| 123
|
తే. |
అనుచు రాముఁడు ఘనరీతిఁ దనపృషత్క, తతి సహస్రకరస్ఫూర్తి దరలఁ జేయఁ
బఱచె నంతట నర్జున పక్షబలము, మానసమున కధీనమై మనుజవమున.
| 124
|
ఉ. |
అంతట భార్గవుండు భిదురాగ్రకఠోరకుఠారధార దు
ర్దాంతమహఃకృతారివనితాజనితాస్త్రము కార్తవీర్యభూ
కాంతభుజాసహస్రము సగర్వసహస్రము గాఁగ మించి వి
భ్రాంతునిఁ జేసి కుత్తుకకుఁ బాపె శిరంబున దక్షిణంబునన్.
| 125
|
తే. |
కార్తవీర్యుఁడు ఘనసమీకార్తవీర్యుఁ, డగుచుఁ గూలిన నన్యోన్యమయుతు లగుచు
నతని పుత్రకు లయుతసంఖ్యాతు లెల్ల, కడల కేగిరి ప్రాణము ల్గాచికొనఁగ.
| 126
|
చ. |
అసదృశకీర్తి కామగవి నాజి శరత్కబళీకృతార్జునుం
దెసలఁ జరింపఁ బంచి జగతీవరజాహృతకామధేనువున్
మసలక తెచ్చియిచ్చి నృపమారణమున్ జమదగ్ని మౌని కిం
పెసఁగఁ గుఠారి దెల్ప నత్వ డి ట్లనియెన్ సవిషాదచిత్తుఁడై.
| 127
|
సీ. |
నిరతంబుఁ గొల్వఁడే దురితంబు లణఁగించు దానేప్సితత్యాగి దత్తయోగి
భుజసీమ నిల్పఁడే నిజధామసంరక్షితాబ్ధి చతుష్కాంత నవనికాంతఁ
జెఱసాల వెట్టఁడె మొఱ సాల వెట్టంగఁ బ్రధనజయోత్కంఠుఁ బఙ్క్తికంఠు
ధృతిఁ దృప్తుఁ జేయఁడే యతితప్తుఁడై వేఁడు సకలదాహామోదుజాతవేదు
|
|
తే. |
నకట సామాన్యుఁడే యణిమాదిసిద్ధి, సిద్ధకీర్తితభువనప్రసిద్ధకీర్తి
స్నిగ్ధసద్గుణరత్నప్రసిద్ధమూర్తి, శత్రుసమవర్తి యర్జునచక్రవర్తి.
| 128
|
క. |
ఒకయావునకై నృపు నే, టికిఁ జంపితి వింతకటికిడెందము దగునే
యకటా విప్రున కఘనా, శకముగ నిఁకఁ దీర్థయాత్ర సలుపుము పుత్త్రా.
| 129
|
క. |
అనినం గానిమ్మని పని, వినియె భృగూద్వహుఁడు కార్తవీర్యసుతులు తం
డ్రిని జంపిన పగ తీరుచు, కొనవలెనని పొంచియుండి క్రూరాత్మకులై.
| 130
|
మ. |
ఒకనాఁ డాశ్రమవేదికాంతరమున న్యో గాఢ్యుఁడై యున్నయ
య్యకలంకున్ జమదగ్నిఁ జుట్టుకొని చేయంటన్ జడల్సుట్టి మ
స్తకముం బాణి కృపాణిఁ గొట్టి ధరమీఁద న్వైచి వేచన్న రే
ణుక హానాథ యటంచు మోదికొనియెన్ శోకంబుతోఁ బల్మఱున్.
| 131
|
తే. |
ఏఁటిలోపలఁ దీర్ఘంబు లెల్లఁ దిరిగి, యప్పు డచటికి భార్గవుఁ డరుగుదెంచి
తండ్రిఁ గనుగొని శోకదందహ్యమాన,మానసుండయి విలపించె దీనుఁ డగుచు.
| 132
|
క. |
కలనైనఁ బరుల కాపదఁ, దలఁపని నీ కిట్టికీడు దైవము దలఁచెం
దల క్రొవ్వి నేనొనర్చిన, కలుషంబున నేమి సేయఁగల నిఁక తండ్రీ.
| 133
|
తే. |
అనుచు వగచుచునున్నచో మునులు రుచిర, వాగమృతధారఁ దచ్ఛోకవహ్ని నణఁచి
తండ్రికై తర్పణాదికృత్యములు దీర్పు, మనిన భార్గవుఁ డనియె సత్యాగ్రహమున.
| 134
|
క. |
అనదవలె నదిజలంబుల, జనకునకుం దర్పణం బొసంగుదునే య
ర్జునసుతశోణితములచే, నొనరుతు వినుఁ డదియుఁ గాక నొక్కప్రతిజ్ఞన్.
| 135
|
చ. |
ఇరువదియొక్కమాఱు జనయిత్రి యురఃస్థలి మోదికొంట నే
నరసితి నన్నిమాఱులు నృపాన్వయజాతుల దుర్వినీతులన్
దురితసమేతులన్ ఖలులఁ ద్రుంపకమాన నటంచుఁ గ్రోధియై
పరశువుఁ బూని యర్జుననృపాలకుమారజిఘాంస నత్తఱిన్.
| 136
|
సీ. |
మునుమున్న నతిరయంబునను మాహిష్మతి కరిగి త న్గనుఁగొని యార్తులగుచు
నెఱుఁగక చేసితి మీతప్పు సైరింపు రామరామ యటంచుఁ బ్రాణభీతి
బతిమాలి వేఁడినఁ బదములు వాలిన సందులు సొచ్చిన శరణ మనినఁ
దలవీడ మొలవీడ నలుగడఁ బఱచినఁ బూరి గ్రసించినఁ బోవనీక
|
|
తే. |
బ్రహ్మఘాతుకులార దురాత్ములార, దయయు ధర్మంబు మీయందుఁ దలఁపఁదగునె
యనుచు గోచరులైన యర్జునసుతులను, బాఱి గొఱియల నఱకినపగిది నఱకి.
| 137
|
చ. |
పురముల కేఁగు భూవరులఁ బోరికి రమ్మని చీరు వచ్చినం
బరశువుచేతఁ జీరు భయపడ్డనృపాలురు రాకయున్న స
|
|
|
త్వరముగ నీడ్చి తెచ్చి యమవాసముఁ జేర్చుచు నిట్లు ధారుణిం
దిరుగుచు నెల్లరాజుల వధించె భృగూద్వహుఁ డట్టివేళలన్.
| 138
|
సీ. |
కొట్టివైచినతల ల్గుట్టలై కాటుకకొండలదండిని మెండు సూప
భూరిమాంసంబులు ప్రోవులై మించుచుఁ గాంచనాచలములకరణిఁ గాంచ
నాకసం బంటిన కీకసరాసులు రజతశైలంబులరహి వహింప
నెఱ్ఱనై నెత్తురుటేఱులు వాఱుచు శోణనదంబుల సొంపు నింపఁ
|
|
తే. |
జెలఁగి మెసవుచు భూతము ల్సిందులాడె, కంకగృధ్రాదిఖగముల కఱువు దీఱె
నారదుడు మెచ్చుచును దందనాలు పాడె, ధరణి నిర్భర యగుచు సంతసముఁ గూడె.
| 139
|
తే. |
ఏనుమడుగు లగుచు నిల రాజరక్తంబు, గనె శమాత్తపంచకప్రసిద్ధి
రాముఁ డాజి విజయరమఁ గూడి క్రీడింప, నలరు కుంకుమంపుఁగొలను లనఁగ.
| 140
|
సీ. |
ఇవ్విధంబున రాముఁ డెల్లరాజుల ద్రుంచి చిత్రశక్తిని గురుక్షేత్రమునను
బరిహృతపాతకపంచకంబుగ క్షోణినాయకరక్తంబునను శమంత
పంచక మొనరించి భక్తితో నటఁబితృతర్పణంబు ఘటించి ధన్యుఁ డగుచు
నశ్వమేధము చేసి యలసరస్వతిలోన నవబృథస్నానంబు లాచరించి
|
|
తే. |
యవని దక్షిణగాఁ గశ్యపున కొసంగఁ, దన్మహత్త్వంబునను జమదగ్ని శీర్ష
యుక్తుఁడై సప్తఋషులలో నొక్కఁ డగుచు, వెలుఁగుచున్నాఁడు నక్షత్రవీథియందు.
| 141
|
ఉ. |
అంతట శాంతి గైకొని వనాంతమునం దప మాచరించె దు
ర్దాంతమహాభిరాముఁ డగురాముఁడు నయ్యెడ గాధిమేదినీ
కాంతుకుమారపౌత్రుఁ డతిఘాతుకబుద్ధి పరావసుండు క్ష
త్రాంతకుఁ జేరవచ్చి దురహంకృతి మీఱఁ దృణీకరించుచున్.
| 142
|
మ. |
మును మున్నీవు ప్రతిజ్ఞ చేసితివి నిర్మూలింతు శాత్రం బటం
చును నేఁ డేల భయంబుఁ జెందితివి యిచ్చో నట్లు గాదే ప్రవ
ర్ధనరాణ్ముఖ్యుల నొంప వేమిటికిఁ గారా వారు రాజు ల్నినుం
గనినం బోవఁగనిత్తురే తొలఁగు మింకన్ దుష్ప్రతిజ్ఞానిధీ.
| 143
|
వ. |
అని సదృక్షమునిసమక్షమంబునం బరావసుం డధిక్షేపించిన నతివీక్షరూక్ష
ణుండై భృగుకులాధ్యక్షుం డిట్లనియె.
| 144
|
క. |
బాలురు వృద్ధు లటంచును, జాలించితిఁగాక వెఱవ క్షత్రియుల కికన్
నేలంగల రాజులను స, మూలం బాబాలవృద్ధముగ ఖండింతున్.
| 145
|
మ. |
అని యత్యుగ్రత భార్గవుం డవనిలో నాబాలవృద్ధంబుగాఁ
దునిమెన్ రాజుల నేమి చెప్పుదును దద్రోషంబు రాజాంగనా
జనగర్భంబుల నూడ్చె హుంకృతి ధనుజ్యాటంకృతిన్ ఘోరగ
ర్జనలన్ రూక్షనిరీక్షణచ్ఛటల దుర్దాంతాట్టహాసంబులన్.
| 146
|
తే. |
ఇవ్విధంబున రాజుల నెల్లఁ ద్రుంచి, యరిగి మఱికొన్నినాళ్ళకుఁ దిరిగివచ్చి
ఆదిఁ దనదృష్టిపథమున కందనట్టి, గర్భములఁ బుట్టుశిశువులఁ గని వధించు.
| 147
|
శా. |
ఈలా గిర్వదియొక్కమాఱు నృపులన్ హేలాగతిన్ రాముఁ డా
బాలప్రౌఢజనంబు గాఁగ వధియింపన్ రాజకాంతావిలా
పాలాపంబులు భూమినెల్లెడల మెండై నిండెఁ దద్దైన్యము
న్మూలించె న్మది నెంచి కశ్యపుఁడు రాముం జేరి దీవించుచున్.
| 148
|
మ. |
ఇల నిక్షత్ర మొనర్చి చేసితి మఖం బీవిశ్వవిశ్వంభరన్
బళిరే దక్షిణ గాఁగ నిచ్చితివి దానక్షాత్రధర్మంబులం
గలరే నీసరి యీక్షితిస్థితిని సాక్షాత్పంకజాక్షుండ వీ
వలఘుస్తోమయశోభిరామ భృగురామా సార్వభౌమాంతకా.
| 149
|
క. |
మాకొసఁగిన వసుమతిలో, నీ కేటికి సంచరింప నిఁక దక్షిణర
త్నాకరతీరముఁ జేరు ప్ర, భాకరశశికులవిరామ భార్గవరామా.
| 150
|
క. |
అన మంచిది యని రాముఁడు, చని చాపం బెక్కుపెట్టి శరము [3]దొడిగి వా
ర్ధినిఁ గొట్టఁబోయి నంతనె, తనరంగా కొంతచోటు తత్క్షణ మొసఁగెన్.
| 151
|
తే. |
అందు విహరించె రాముఁ డనంత నంత, బ్రాహ్మణుల కిచ్చి యంతఁ దపంబు సేయఁ
జనియెఁ గశ్యపుఁ డవని కాస్యపి యనంగ, నమరె నది యాది మఱి యుర్వి యౌట వినుము.
| 152
|
చ. |
క్షితిసురు లిట్లు కశ్యపునిచే మహి గాంచి ప్రభుత్వ మొప్ప సం
తతమును రాజభోగపరతంత్రత భార్గవుచే ననాథ లై
గతి మఱి యొండులేమి నృపకాంతల సమ్మతి బల్మినైన సం
గతి యొనరించుచుం గ్రతుమఖక్రియ లన్నియు నీఁగి రయ్యెడన్.
| 153
|
తే. |
తగిన దండంబులేమి నుద్దండవృత్తి, వైశ్యులును శూద్రులును విప్రవరు లుదార
గోధనాదుల బలిమిఁ గైకొనఁగఁ దొడఁగి, రి ట్లరాజకమై ధర్మ మెల్లఁ జెడిన.
| 154
|
క. |
కుతలం బతలం బంటిన, వెతలం బడుచున్న జనుల విని కశ్యపుఁ డూ
రుతలంబున నెత్తఁగ క్షో, ణితలం బుర్వియనఁ బరఁగు నృపకులతిలకా.
| 155
|
వ. |
ఇవ్విధంబున కశ్యపమునివలన సముద్ధరింపంబడిన ధరావరారోహ యద్ధీరాగ్రణి
కిట్లనియె.
| 156
|
మ. |
అనఘా విప్రులు ప్రోవలేరు నను బ్రోద్యద్బాహుశౌర్యంబుచే
ఘనులౌ రాజులె గాని భార్గవమహోగ్రక్రోధదావాగ్ని ద
ప్పినవార ల్గలరందు నందు నృపతు ల్పేర్కొందు నన్నామము
ల్విని రప్పింపుము వారి ధర్మపరుల న్విఖ్యాతశీలాఢ్యులన్.
| 157
|
సీ. |
కశ్యపమునినాథ కాచితిఁ గొందఱన్ హైహయులను గుహలందు దాఁచి
పౌరవాన్వయుఁడు విదూరథతనయుండు ఋక్షవద్గిరియందు ఋక్షరక్ష
సౌదానవర్యుండు శక్తిజు శరణొంది దధివాహసుతుఁడు గౌతమునిఁ గొలిచి
గోపాలనముఁ జేసి గోపతి యనురాజు వత్సము ల్మేఁపుచు వత్సనృపుఁడు
|
|
తే. |
గృధ్రకూటమనెడు గిరిని కోలాంగూల, జాతివలన భూతి జలధిచే మ
రుత్తుసుతులు మువ్వురును బ్రతికిరి వారిఁ, బతులఁ జేయు నాకు భవ్యమతుల.
| 158
|
మ. |
అని ప్రార్థించిన మంచిదే యని దయైకాయత్తచిత్తంబుతో
మునిచూడామణి శిష్యులం బనిచి సమ్మోదంబుతోఁ దెచ్చి వా
రిని సామ్రాజ్యపదాభిషిక్తుల నొనర్చె న్వారలున్ భూమిపా
లనముం జేసిరి ధర్మ మెచ్చ జన ముల్లాసంబుఁ గాంచె న్నృపా.
| 159
|
తే. |
విప్రులకు రాజసతుల కావిర్భవించి, రుత్తమక్షత్రియులు ధర్మయుక్తు లగుచు
నంతటను వారిసంతతు లతిశయిల్లె, ధరణి నంతటఁ దామరతంప రగుచు.
| 160
|
తే. |
భార్గవుం డిప్పుడు మహేంద్రపర్వతమున, నున్నవాఁడు తపోధను ల్దన్నుఁ గొలువ
నాతఁడే గాదె భీష్మకర్ణాదులకును, జాపవిద్యోపదేష్టయై జయము లొసఁగె.
| 161
|
మ. |
అనఘా యీభృగురామచర్య వినువా రత్యంతపుణ్యాత్ములై
యనిశంబున్ బహుభోగభాగ్యములు దీర్ఘాయుష్యవైదుష్యముల్
ధనదాన్యంబులు బుత్త్రపౌత్త్రులును భద్రంబు ల్మనోభీష్టము
ల్గని రాజిల్లుదు రెందుఁ గాంతురు తుదిం గైవల్యసామ్రాజ్యమున్.
| 162
|
క. |
అని శ్రీవైశంపాయన, మునిముఖ్యుఁడు దెల్ప విని ప్రమోదాన్వితుఁడై
జనమేజయుఁ డవ్వలికథ, యనఘా వినవలతు దెలుపు మని యడుగుటయున్.
| 163
|
ఉ. |
తీక్ష్ణమహామహోనిధిసుధీయుత దారకతారదారకా
శ్లక్ష్ణకలావిహార యుడుజాలసమాచ్ఛవిహార యాశ్రితా
భీక్ష్ణముదంచితాత్మ యవిభిన్నదృశోరచితాత్మమేదినీ
రక్షవిధాన దానచతురన్నయశోధన శ్రీయశోధనా.
| 164
|
క. |
పుంఖ్యాతియుత సరస్వతి, సాంఖ్యవిశేషజ్ఞ యోగశాస్త్రాభిజ్ఞా
సంఖ్యావత్పరిపోషక, సంఖ్యాతిగసుగుణధామ సచివలలామా.
| 165
|
పంచచామరము. |
ధరాజరాజరాధిరాజదాతృతాజితాంగణా
ధరాజరాజరాజ దేవతావధూప్రదాసుధా
ధరాధరాధరాధరామృతస్పృహా మహావసుంధరా
ధరాధరాతిశౌర్యధైర్య దారితారికంధరా.
| 166
|
గద్య. |
ఇది శ్రీరామభద్రదయాభిరామభద్రకరుణాకటాక్షవీక్షాపరిప్రాప్తదీప్తతరాష్ట
భాషాకవిత్వసామ్రాజ్యధౌరేయ సకలవిద్వత్కవిజనవిధేయ ధరణిదేవుల నాగ
నామాత్యసుధాసముద్రసమున్నిద్రపూర్ణిమాచంద్ర రామమంత్రీంద్రప్రణీతం
బైన దశావతారచరిత్రం బనుమహాప్రబంధంబునందు షష్ఠాశ్వాసము.
|
|
6. భృగురామావతారకథ సమాప్తము.