దశావతారచరిత్రము/3. వరాహావతారకథ

వికీసోర్స్ నుండి

3. వరాహావతారకథ

తృతీయాశ్వాసము



యుక్తధర్మ కృష్ణా!
నాయకమణి కృష్ణ హృదయనాయక కృష్ణా!
నాయకజాధిప సూచక
నాయకమణి కృష్ణపద్మనాభునికృష్ణా.[1]

1


తే.

అవధరింపుము జనమేజయక్షితీశ, శేఖరున కిట్టులను వ్యాసశిష్యమౌని
ధారుణీశ వరాహావతార మిఁకను, దెలియఁ జెప్పెద వినుమని తెలుపఁ దొడఁగె.

2


శా.

శ్రీదారత్వమునం బ్రసిద్ధుఁడవు, లక్ష్మీకాంత నేప్రొద్దు వ
క్షోదేశంబునఁ బూనఁగా నని కడుం గోపంబుచే నామహా
యాదోరాశిని డాఁగు భూసతిని దంష్ట్రాగ్రంబునం బూని తా
భూదారత్వమునం జెలంగె ధవళాంభోజాక్షుఁ డుర్వీశ్వరా.


సీ.

శ్రీవిష్ణుపదభక్తిఁ జెలఁగుసప్తర్షిచంద్రములలో ము న్నెన్నఁదగినమేటి
దిత్యదిత్యాదిసాధ్వీశిరోరత్నంబులను ప్రేమఁ జెట్ట వట్టినగృహస్థు
కమలాప్తభుజగేంద్రఖగరాజరోహిణీకన్యకారమణులఁ గన్నతండ్రి
రాముచే దానధారాపూర్వముగ భూతధాత్రి గ్రహించిన శ్రోత్రియుండు


తే.

తోయరుహసంభవునకుఁ బౌత్రుఁడు మరీచి, పుత్త్రుఁడు విచిత్రగుణమణిపాత్రుఁ డఖిల
వేదవేదాంతతత్త్వవివేకశాలి, మహిమఁ జెలువొందుఁ గశ్యపమౌనిమౌళి.

4


క.

దితి మొదలగు పదుమువ్వురు, సతు లతనికి గలరు సహజసౌశీల్యరమా
సతులు జాతాన్యజగత్త్రయ, సతులు వయోరూపభాగ్యసంపద్వసతుల్.

5

క.

కులరూపగుణసమృద్ధులు, గలసవతులలోన దితి సగౌరవలీల
న్విలసిలు గశ్యపకాంచన, కలితాలయరత్నదీపకళికయు పోలెన్.

6


ఉ.

ఆరమణీశిరోమణి వయస్యలతో నొకనాఁడు కేళికా
గారసమీపవర్ధితవికస్వరసూచితచిత్రచైత్రికో
దారవిలాసభాసురలతావికసత్ఫలపుష్పభారశృం
గారవనీవిహారకుతుకంబున నేఁగి తదంతరంబునన్.

7


సీ.

పల్లవాధర యల్ల మొల్లతీవవల్ల నెల్లతావుల తావు లుల్లసిల్లెఁ
గొమ్మ యీవిరిగొమ్మ కమ్మదేనియ గ్రమ్మ నెమ్మెమీఱెఁ గదమ్మ తుమ్మెదలకు
నింతి సంపెంగచెంత నెంతబాగాయె సేమంతిబంతులు వింతకాంతి నెరసి
కన్నెగేదఁగికన్న పొన్నచాయనె యున్న సన్నజాజులచెన్ను వన్నె మీఱఁ


తే.

బంకజాక్షిరొ యవంకఁ బొంకమాయె, గుజ్జుమామిడిపజ్జనె గొజ్జఁగులును
జూడు మనుచేడియలతోడఁ గూడియాడి, వనిత విహరించె శృంగారవనితలమున.

8


మ.

నిపతత్కుందమరందపూరమున దన్నృత్యన్మయూరంబు నా
లపదుద్యచ్ఛుకశారికాకులము లోలద్వల్లికాజాలమున్
క్షిపదుత్రస్తవిహంగమంబు పరితశ్ళీర్ణప్రవాళంబు నై
యపు డీక్షింపఁగ నొప్పెఁ, గేళివన మబ్జాక్షీవిహారంబునన్.

9


ఉ.

సారెకు గంధసారగిరిసారసమీరకిశోరవారముల్
చేరికఁ జేరి హారిసరసీశరశీకరశీతలత్వమున్
నేరుపుమీఱఁ జూపి హరినీలమణీరమణీయకుంతలో
దారశరీరసౌరభ మయశ్రమవారి హరించె నత్తఱిన్.

10


క.

శీతలతలవనకేళీ, కౌతుకమున నున్న దితినిఁ గని యపుఁ డొకనా
రీతిలకము వదనాంభో, జాతమరందాయమాన సరసమృదూక్తిన్.

11


క.

తిలకింపు మిదె విచిత్రము, లలనా మారీచమంజులత నతిమందా
నిలలోలమానసత్వము, కలుగుటను బ్రియాళి వదలకయె పెనఁగె ననన్.

12


క.

చెలియా కాంతా మోదము, గలుగనియెడల న్మదాళి కలియునె తమిచేఁ
గలసిన నట నెయ్యది స, త్ఫలమంచుఁ గటూక్తిఁ దోపఁ బలికిన దితితోన్.

13


క.

నారీకలితోచ్చైస్తన, హారితవిస్ఫూర్తి మించె నది గను మనఁగా
నోరమణీ వ్యర్థోక్తుల, నీరీతిం బలుకనేలనే యని నగుచున్.

14


సీ.

తనమనోహరుపేరు వినినంతఁ గాంతకు మనసు రంజిల్లిన మదనుఁ డదియె
సందుచేసుక మానససరోవరము నిండఁ గాలువల్ దీర్చినఁ గర్ణవివర

ములవెంటఁ గోకిల కలరవచ్చలమున నానను సుమవాసనామిషమునఁ
గనుఁగవ మిథునిత ఖగదర్శనోపాధి నాల్క రసాస్వాదన కపటమునఁ


తే.

దనువున హిమానితాశ్లేషజనితపులక, రాజకైతవమున రాగరసము నిండి
ధైర్యమనుకట్ట నగలింపఁ దాళలేక, వల్లభునిపొందుఁ గోరె నవ్వారిజాక్షి.

15


తే.

వసుధ వాసంతవేళ నెవ్వారి కైన, నంగజోద్రేక మొనరించు నందుమీఁదఁ
గొమరుప్రాయంబుఁ జెలువును గూర్మి గలుగు, దితికి రతివాంఛ యరుదె తద్విరసనమున.

16


సీ.

నునుదీవె సురపొన్నఁ బెనఁగొన్నఁ గనుఁగొని ప్రాణేశుఁ గౌఁగిలింపగఁ దలంచుఁ
గోవెల చిగురాకుఁ గొఱికిన నాథుని యధరంబు గంటిసేయంగ నెంచుఁ
గమకించి పల్కునిల్కడ కోకిరొద విన్న గళగళధ్వనులపై గాంక్ష నిలుపుఁ
దమినిఁ బైకొను చకోరములమోహమఁ జూచి పుంభావసంభోగమునకుఁ దివురు


తే.

గలికిరాయంచ ముక్కున గమిచి కమల, నాళఖండంబుఁ బతికిచ్చు నలువుఁ గాంచి
మమత మొనపంటఁ దెలనాకుమడుపుఁ గొరికి, చెలువునకు నీయఁగోరు నచ్చిగురుఁబోఁడి.

17


తే.

రామ శృంగారకేళికారామసీమ, సదృశవస్తునిరీక్షణోజ్జ్వలితసురత
కేళిలీలావిలోలయై యాళిజనముఁ, గాంచి యిట్లని పల్కె నుత్కంఠ మెఱయ.

18


శా.

ఈయారామమునం బికస్వరము లెంతే వింతగాఁ జల్లనై
డాయం దెమ్మెర వేడ్కతో రమణుతోడంగూడి క్రీడించు నా
ప్రాయంపుంజిగురాకుఁబోఁడులు గణింపం బూర్వజన్మంబులం
దేయేనోములు నోచినారలొ కదే యేణీ కిశోరేక్షణా.

19


ఉ.

ప్రాయముగా వసంతము నపాయముగా వినఁ గర్ణసూచికా
ప్రాయముగాఁ బికస్వర ముపాయముగా మరుఁ డేఁచ నిట్టిచో
దాయఁగదా వియోగికిని తాళఁగ రా దను బుద్ధియింతలే
దాయెఁగదా మనోహరున కక్కట నే నిఁక నేమి సేయుదున్.

20


క.

ఉపవాసంబుల వ్రతములఁ దపములఁ, గృశియించు బడుగుఁదపసుల కేలా
కృపవుట్టు మన్మథార్తిత, చపలాలోకనలయందు శరదిందుముఖీ.

21


తే.

కన్నకొడుకులు మూఁడులోకముల నేల, నక్కటా ముక్కుఁ బట్టుక యనుదినంబుఁ
గ్రిందుజడలంట గూర్చుండుఁ గ్రీడ యుడిగి, యేమి సాధింపనెంచియో యెఱుఁగరాదు.

22

తే.

అకట తన కేమి కొదవ గేహమున సకల, భోగభాగ్యంబులును మంచిపువ్వుఁబోండ్లు
గలిగియుండంగ ననుభవకాల మెఱిఁగి, పడయనొల్లఁడు సౌఖ్యంబు వెడఁగుఁదపసి.

23


తే.

వలపు గలిగిన నిండుజవ్వనిని వనినిఁ, గలయుకంటెను సౌఖ్యంబు గలదె వేఱె
యెఱుగఁడే మఱి నాదురదృష్ట మింతె, కాక యాతని దూరఁగాఁ గలదె ఫలము.

24


ఉ.

తానయి చేరఁబిల్చి సురతప్రియుఁ డై యొకనాఁటికైన స
మ్మానము సేయఁగా నెఱుఁగ మానిని యేమని తెల్పుకొందు నే
నేనయి యెన్నఁడైనఁ దమి హెచ్చినచోఁ ననుఁ జేరి యెంతప్రొ
ద్దైనఁ బదంబులొత్త క్షణ మప్పటికేమొ ఘటించుఁ గోరికల్.

25


చ.

అని సురతస్పృహాహవిరుదగ్రమనోజశిఖక్షతత్రపా
వినయవివేకియై మధుపవేణివసంతవనిని హసంతికం
గనుఁగొనులీలఁ గన్ గొనుచుఁ గంజదళాక్షులఁ బాసి యొంటిమై
దనపతియున్న యింటికి ముదంబున వచ్చెఁ బదంబు దొట్రిలన్.

26


సీ.

సంపూర్ణపూర్ణిమాచంద్రబింబము చెన్నుఁ గన్న ప్రసన్నవక్త్రంబువానిఁ
వెలిమెట్టతమ్ముల వెలివెట్టఁగాఁజాలు శ్రవణాంతకాంతనేత్రములవాని
శివశరాసనశృంగశృంగశృంగారంబుఁ గబళించునంసభాగములవాని
నతికఠోరనిజస్తనాచలదక్షమం బైనవిపులవక్షంబువాని


తే.

సూర్యతేజంబు గైకొన్న శుచికిఁ జంద్ర, కాంతియు నొసంగుభంగి దుగ్ధముల నగ్ని
హోత్ర మొనరించి వేసంజ హెూమశాల, నేకతంబున నున్న ప్రాణేశుఁ గాంచి.

27


సీ.

చంకనత్ప్రత్నతాటంకంబు లిరువంకఁ గనుపట్టుచంద్రభాస్కరులు గాఁగ
నలతిపయ్యెదలోని హారము ల్చిలుపవెన్నెలలోని తారకావళులు గాఁగ
వలిపెంపుకుసుమపూవన్నెచేలమెఱుంగు జగజంపుసంజకెంజాయ గాఁగఁ
గంకణమేఘలాకటకఝళంఝళ లమితవిహంగనాదములు గాఁగఁ


తే.

గనుబొమ లనంగుఁ డూనుసింగాణి గాఁగ, విప్పుఁగన్నులు విరిగల్వవిరులు గాఁగ
బటువుగుబ్బలు ముకుళితాబ్జములు గాఁగ, సంజచెలువునఁ బతిఁ జేరి కంజవదన.

28


క.

తలవంచి మించుసిగ్గునఁ, బలుకక యూరకయె యున్నఁ బతి యచ్చెలువం
దిలకించి కలికి యేమో, తెలుపఁగ వచ్చితి వదేమి దెలుపు మటన్నన్.

29

శా.

కించిల్లక్షితదంతకోరకరుచు ల్కెమ్మోవిపై మించఁగాఁ
జాంచల్యాంచితలోచనాంచలము లజ్జాలీల సూచింపఁగాఁ
జంచచ్చూతదళగ్రసవ్యసనకూజత్కోకిలాపంచనా
చుంచువ్యాహృతి మీఱ నిట్లని వచించున్ బోటి గంభీరతన్.

30


తే.

అనవరతసౌఖ్యసంధాత యైననేత, కంటె దైవంబు గల్గునె కామినులకుఁ
గాన మీసేవ చేసి నాకాంక్షితంబు, ఫలితముగఁ జేయవచ్చితిఁ బ్రాణనాథ.

31


క.

మంచిది యటువలెఁ జేసెద, నంచానతి యిచ్చె దేని యది వినిపింతుం
గొంచక గాకుండిన భా, షించంగా వెఱతు నెంత చెప్పిన నధిపా.

32


క.

అని వనితామణి దెల్పిన, విని నవ్వుచు మౌనివిభుఁడు వెలఁదీ యీలా
గున సంశయింప నీకుం, జనునే నీమాట నేను జవదాఁటుదునే.

33


సీ.

అలసి వచ్చినవేళ నడుగు లొయ్యన నొత్తి విడె మిచ్చి సురటిచే విసరుటకును
నాఁకటఁ బడనీక యన్నపానంబులచేతఁ బ్రొద్దునఁ దృప్తి సేయుటకును
సంతరించినయట్టి సకలపదార్థముల్ దగులీల నింటిలో దాఁచుటకును
నతిథుల బంధుల నత్తమామల చిన్నిశిశువులఁ దెలిసి పోషించుటకును


తే.

ననవరత మగ్నిహోత్రంబు లరయుటకును, దేవపూజోపకరణము ల్దీర్చుటకును
బత్ని పాల్పడ గృహకృత్యభరములేక, గృహి యథేష్టంబుగా సుఖియించు నబల.

34


సీ.

సంసారసంభవాక్షయదుఃఖవారాశిఁ దరియింపఁగాఁ జేయుతరణి తరుణి
హృదయంగమస్ఫూర్తి నెపుడు నామోదంబు గలిగించుతావిచెంగలువ చెలువ
కామితఫలములు ఘటియించి వేలుపుఱేడు పెంచినచెట్టురెమ్మ కొమ్మ
కందొగ ల్నిత్యవికాస మొందింపఁగా మంచిపున్నమచందమామ రామ


తే.

సదనమణిమయదీపికాజ్వాల బాల, వల్లభమనోమదావళవారి నారి
శుభపరంపర వర్షించు సోన చాన, పృథులధర్మార్థమణిగణపేటి బోటి.

35


సీ.

అతిథుల నిష్టమృష్టాన్నతృప్తులఁ జేసి యనుదినంబును బుణ్యమందికొనుట
శాస్త్రోక్తపద్ధతి సవనముల్ సవరించి శ్రీహరి సుప్రీతుఁ జేసికొనుట
నన్యాశ్రమములయం దతిదుర్దమంబైన మన్మథోద్రేకంబు మాన్పికొనుట
నిజపితౄణము దీర్చి నిఖిలలోకంబులు పాలించుపుత్త్రులఁ బడయుటయును


తే.

గమలలోచన నీవల్ల గాదె యట్టి, నీకుఁ బ్రత్యువకారంబు నెఱఁపగలనె
యేను బదివేలజన్మంబు లెత్తియైన, మనసు వచ్చిన గతిఁ బనిగొనుము నన్ను.

36


తే.

దుర్గముల నాశ్రయించినదొర యరాతి, వర్గముల గెల్చువైఖరి వనిత నీదు
చారువక్షోజదుర్గముల్ చేరికాదె, కంతుశత్రు జయించెద గడియలోన.

37


క.

మహిఁ జతురాశ్రమములలో, గృహి యధికుం డట్టిగృహము నీవే “గృహిణీ
గృహముచ్యతే” యనందగు, మహితవచోరూఢి వినమె మదగజగమనా.

38

తే.

అనిన వల్లభ యీలీల నాడ నెంత, దాన నావంటివా రెందఱైనఁ గలుగ
నగ్రపత్నియటంచు న న్నాదరించి, మీరు నవ్విన వలదననేరఁగాని.

39


తే.

ఇంకఁ దాఁపఁగ నేల ప్రాణేశ వినుము, సిగ్గువడి యుండనీయఁడు చిత్తభవుఁడు
కన్నెగేదఁగిరేకుచేకత్తికొద్దిఁ, గ్రుమ్ముచున్నాఁడు దయలేదు కొంతయైన.

40


తే.

అటులు గావునఁ గామార్త నగుచు నిన్ను, శరణు వేడెద రక్షింపు సౌఖ్య మొసగి
యార్తజనరక్షణాదక్షు లఖిలభూత, సదయులును గారె మీవంటిసాధు లరయ.

41


మ.

అనినన్ లేనగ వంకురింప మునికాంతా యింతసంతాప మే
లను మాకుం బ్రియమైనకార్య మిది వాలాయంబుగా నేను జ
య్యన నీవాంఛిత మెల్లఁ దీర్చెదను సంధ్యావేళఁ బోనిమ్ము నా
వనజాతాక్షి స్మరేభమార్గణకరవ్యాధూతచిత్తాబ్జ యై.

42


సీ.

మలయాచలాయాతమందానిలము గాదు రణరంగసన్నధరథము గాని
ప్రాగస్తగిరుల చంద్రదివాకరులు గారు కమనీయకనకచక్రములు గాని
సాయంసముజ్జృంభసాంధ్యరాగము కాదు కొమరుఁజెంగావిటెక్కెములు గాని
సాధారణవిహంగసంరావములు గావు మణికింకిణులఘణంఘణలు గాని


తే.

తారకలు గావు దేవతాద్వంద్వముక్త, నవనమస్కారకుసుమబాణములు గాని
సంజగా దిది విరహిపై స్మరుఁడు దండు, వెడలు గోధూళిశుభలగ్నవేళ యధిప.

43


సీ.

తిలకింప ద్వాదశార్కులకన్న వేండ్రమై జలజారి పండువెన్నెలలు గాయఁ
బల్లవితాశేషపాదపచ్ఛాయలు విలయాగ్నికీలలవిధము చూప
మలయాచలాయాతమందమారుతములు ఝంఝామరుల్లీల సంచరింప
ఫలపుష్పనిష్యందిబహుమరందరసంబు వసుమతి నేకార్ణవంబు సేయఁ


తే.

గాలకంఠకఠోరహుంకారములను, దండిదండిని కుసుమకోదండి యడర
విరహిణీలోకసంహారవేళ గాని, యిది వసంతంబు గాదు ప్రాణేశ కంటె.

44


తే.

ప్రాణనాయక యిదె చూడు పతులఁ గూడి, పాయకుఁ డటంచు సతులకుఁ బల్కుతేజి
పాదుషాహు శికాచేసి పంపు కాగి, తంపుఫరమానువోలె సుధాకరుండు.

45


చ.

అళు కొకయింత లేక కుసుమాస్త్రుఁడు క్రొన్నెలసానదీరుచెం
గలువలకోరులం గులుకుగుబ్బచనుంగవ గాఁడ నేయఁగాఁ
గళగొనఁ గాఱురక్త మిదె గన్గొను కుంకుమ గాదు నాథ పూ
విలుతునిదుండగంబు దగవే సహియింపఁగ మాకు నిత్తఱిన్.

46


శా.

ఓయాత్మేశ్వర యీవసంతమున శాంతోష్ణాంశుసంతాపమున్
భూయోదృష్టతమం బధిజ్యధనురంభోజాస్త్ర ముద్యత్పటీ
రాయాతానిలశైత్యము న్విశదసర్వాంశంబు రమ్యంబు నౌ
సాయంవేళ రమింపవచ్చితి మది న్సంతోష ముప్పొంగఁగన్.

47

తే.

ప్రాణనాయక యొకముహూర్తంబు తాళు, మంచు నానతి యిచ్చితి రంత యేల
యొక్కక్షణ మొక్కదినమయి యున్న దిపుడు, తాళఁగాఁజాల మత్కాంక్షితంబు దీర్పు.

48


వ.

అదియునుం గాక.

49


సీ.

తల్లి దైవం బని తగుప్రదక్షిణనమస్కృతుల నింద్రాదులు సేవసేయ
నత్తగా రని బత్తినడుగు లొత్తుచు శచీవనజాక్షి కోడలితనము నెఱప
నవ్వ యంచును బ్రేమ నివ్వటిల్లగఁ జేరి మురిపెంపుమనుమఁడు ముద్దుగురియ
దివ్యవాద్యములతో దినదినంబు నికేతనంబున శుభశోభనములు నడువఁ


తే.

జుట్టఱికమున నిచ్చిపుచ్చుకొను బంధు, జాల మెంతయు గౌరవసరణిఁ జూడ
విభవముల విఱ్ఱవీఁగెడువిబుధమాత, నదితి గని యెట్లు దరియింతు [2]ననవరతము.

50


సీ.

అదితి గన్నకొమాళ్లయం దొక్కరుఁడు జగత్త్రయరక్షణాధురంధరతఁ బూనె
మఱియొక్కఁ డాకాశమణియై జగత్త్రయీమూర్తియై భువనసత్కీర్తి మించె
వినతాత్మసంభవుం డనుపమేయబలాప్తి వనజాక్షువిశ్వంభరుని భరించెఁ
గద్రుతనూజుండు గహననానాసముద్రాహార్యములతోడ నవని మోచె


తే.

మఱియు నీచెట్టపట్టిన మగువలందు, నెవ్వరికి లేరు సత్పుత్త్రు లెంచి చూడ
నందఱు నభీష్టసంపద నలరినారు, కాంత నాభాగ్య మిట్లయ్యెఁ గాని నేఁడు.

51


క.

రమణునిమన్ననవలనన్, రమణీమణి రమణనొందు రవిమన్ననచేఁ
గమలిని శశిమన్ననచేఁ, గుముదినివలె ననిన నతఁడు గోమలి కనియన్.

52


సీ.

విరియఁబోసినజటావిసరంబు కెంజాయ సాంధ్యరాగంబుపై చౌకళింపఁ
బ్రేతవనాయాతవాతనీతవిభూతినికరంబు నెమ్మేన నిండికొనఁగఁ
గృతతప్తసౌవర్ణగిరివిగ్రహంబైన ఘనవిగ్రహము భయంకరము గాఁగ
వికటాస్థిహారము ల్విషభరమాలికల్ గజచర్మవసనంబు గండుమిగులఁ


తే.

గేల శూలంబు పూని దిగ్భిత్తు లగల, నట్టహాసంబు చేయుచు నఖిలభూత
విసరములు గొల్వ మదమత్తవృషభ మెక్కి, రుద్రుఁ డీవేళ మెలఁగెడు రౌద్రముగను.

53


తే.

అనలచంద్రార్కనేత్రత్రయంబు దెఱిచి, చూచుచున్నాఁడు రోషస్పురణ దనర
మఱఁది యనుచుట్టఱికమున మాఱుమసల, వలదు దుర్మార్గులైన నెవ్వారి నైన.

54

క.

శిక్షించు న్సత్పురుషుల, రక్షించుం గడలిఁ బొడమి ప్రబలినవిషమున్
భక్షించి జగముఁ గృపచే, వీక్షింపఁడె నీ వెఱుంగవే జలజాక్షీ.

55


మ.

అనిన న్మందమరుత్కిశోరకులలోలాకాశగంగాతరం
గనికాయంబులు దమ్మిపైఁ బొరలు పొంకం బెంతయున్ వింతగా
నునులేనవ్వు ముఖారవిందమునఁ జిందు ల్ద్రొక్క నక్కల్కి యి
ట్లనియెన్ యౌవనగర్వనిర్వహణలీలాలోలవాచాలతన్.

56


తే.

కుడువఁ గూడును కట్టుకోఁ గోక లేక, తోలు గట్టుక తిరుగు బిచ్చాలశివునిఁ
జాల వర్ణింపఁగా నేల చాలుఁ జాలు, నతని కొకకూఁతు నిచ్చి లోనడలుఁ దండ్రి.

57


తే.

చూడఁ దెడ్డును మంచముకోడు గాని, యేమిసంపద పార్వతి కీశ్వరునకు
మీరు దోఁబుట్టు వంచును మెచ్చుకొనిన, నిచ్చకంబుననైన నే మెచ్చుకొనను.

58


క.

జనకుఁడు పదుమువ్వురు మముఁ, గని మీప్రియుఁడైన వాసఁ గైకొనుఁ డన్న
న్నినుఁ గోరమె యన్నింటన్, ఘనుఁడవు గావునను గావునను రతి ననినన్.

59


శా.

“శాంతంపాప” మటంచు మౌనిపతి హస్తచ్ఛాదితశ్రోత్రుఁడై
యింతైన న్మదిఁ గొంకు లేక తగునే యీలాగు నిందింపఁగాఁ
గాంతా విశ్వజనీనవైభవమహాగంభీరశైలేంద్రజా
కాంతద్వేష మనాత్మనీనము గదా కన్గొన్న నెవ్వారికిన్.

60


సీ.

అఖిలలోకంబుల నధికుండ నేనంచుఁ గర్వించు విధిమస్తకంబుఁ ద్రుంచె
నధ్వగంబులఁ దన్ను నవమాన మొనరింప మీదక్షున కొసంగె మేషశిరము
పుష్పాస్త్రముల రక్తిఁ బుట్టింప గిట్టిన భస్మంబు గావించెఁ బంచశరుని
వ్యాసులు మును “నదైవం కేశవాత్పరం " బనిన బాహుస్తంభ మలవరించె


తే.

శౌరి నయనాంబుజమునఁ బూజన మొనర్ప, మెచ్చి చక్రం బొసంగె నమ్మేటిమగని
నెట్లు నిందించెదవె యొడ లెఱుఁగ లేక, దక్షపుత్త్రివి గనుక నోతరలనయన.

61


సీ.

దండధరోద్దండత నడంచు విషభోక్త యహిఫణామణు లూను నస్థిహారి
మసనంపుటిలు సర్వమంగళాధీశ్వరుఁ డైశ్వర్యశాలి యానాదిభిక్షుఁ
డతివకై యర్ధదేహ మొసంగు కామారి యాశ్రితసులభుఁ డైనట్టియుగ్రుఁ
డధ్వరఫలదాత యైనక్రతుధ్వంసి విపులారథికుఁడైన వృషభహయుఁడు


తే.

హరుఁడు శంకరుఁడును భవుఁ డభవుఁ డిందు
శితవిభానిథి నీలలోహితుఁడు నష్ట
తనుఁడు పంచాననుఁడు త్రిలోచనుఁడు నిర్గు
ణాత్ముఁ డద్దేవుఁ దెలియ శక్యంబె మనకు.

62


తే.

అనిన నట్టిదేవుఁ డంగజునకు లొంగి, సందెలందు దివములందు విడక
వేయువత్సరములు వెలఁదితో రమియించి, యర్ధదేహ మొసఁగఁడా యటన్న.

63

శా.

ఈలాగందురె బాల వాంఛితఫలం బీఁజాలువిశ్వేశ్వరుం
డేలాగుండిన నుండెఁగాక మఱిమాదృక్తాపసు ల్చిత్తభూ
లీలామగ్నత నుండఁగాఁదగునె తాల్మిందూలి శాస్త్రోక్తముల్
బాలింపం దగదే గృహస్థులకు సద్భావంబుతో నెప్పుడున్.

64


తే.

దశమి హరివాసరమున ద్వాదశిని బర్వ, తిథుల సంక్రమణంబుల తిథుల నన్య
తిథులయందైనఁ బగలు సంధ్యలనుఁ ప్రేమ, నంటఁగా రాదు సతుల గృహస్థులకును.

65


క.

ఋతువై స్నానము సేసిన, సతి నంతర్గృహమునందు సంతానేచ్ఛన్
రతికృతిగాక జుగుప్సా, మతిఁ గలయుట గృహికి యుత్తమం బని పల్కన్.

66


శా.

ఔలెండా యిటువంటిఛాందసము లెన్నైనా గలా విందుకున్
వేళల్ గావని చెట్టపట్టితివి చెన్లేనవ్వుతో వల్లభుం
బాలారత్నము కేళికాకుతుకసామర్థ్యక్రియాదూరిత
వ్రీళాసూచకసానురాగవికసద్వీక్షారుచు ల్మీఱఁగన్.

67


తే.

వెఱవ దననేల కామిని విభునిచెట్ట, పట్టినప్పుడె స్వేదకంపంబు లొదవె
గద్గదిక దోఁచె మోమునఁ గాననయ్యె, దీనభావంబు నది యొక్కదిట్టతనమె.

68


తే.

నయము దెల్పెడుగతి కంకణములు మొఱయఁ, గౌను నలియింపఁ బులకలు గ్రమ్మికొన్న
గుబ్బ యరగానరాఁ బైటకొంగు జాఱ, మగువ యీగతి తెగువతో దిగువ నతఁడు.

69


చ.

వల దిది సంజవేళ చెలువా యొకయించుక తాళుమంచు నేఁ
బలుమఱుఁ జెప్పిన న్మననుఁ బట్టఁగఁజాలక నొంటిపాటున
న్వలనుగఁ గంటి కింపయిన వాని గనుంగొని ప్రేమ హెచ్చఁగా
బలిమిని జేరుజారవలెఁ బైకొనఁగోరెదు నీకు మేరయే.

70


మత్తకోకిల.

ఈమనోరథ మెల్లఁ దీర్చెద నీముహూర్తము దాళవే
కామినీ యిది వేళ గామినిఁ గైకొనంగఁ దలంపనం
చామునీంద్రుఁడు వేఁడిన న్వినదయ్యెఁ దొయ్యలి యెయ్యెడం
గామ మష్టగుణం బటం చనఁగా వినంబడునే కదా.

71


క.

ధీరాగ్రేసరుఁ డంతట, నీరేరుహనేత్రచేతినిర్బంధము దు
ర్వారముగా రుద్రనమ, స్కారము గావించి కేళికాకృతమతి యై.

72


తే.

ఎంత చెప్పిన వినవె కా నింక నీవె, యనుభవించెదు రమ్మంచు హసితవదన
యైన మాసిని కైదండఁ బూని మౌని, కేళిసదనంబుఁ జేరిన బాల యపుడు.

73


తే.

జాళువాకోళ్ళపట్టెమంచంబుమీఁదఁ, దళుకుకుంకుమపఱపుపై వలువఁ బఱిచి
జాతిపట్టుతలాడలు చక్కఁబెట్టి, కాంతుఁడు శయింపఁ దాను చెంగట వసించి.

74

క.

మదనుండంపినకిల్లా, కిదిగో మనసిమ్మటన్న యేపున నవలా
మొదట నొకమడు పొసంగుచుఁ, బిదప న్బాగా లొసంగెఁ బ్రియునకుఁ బ్రేమన్.

75


క.

వడిగ బిగిగుబ్బజిగి గ, న్పడుజిలుగున్సరిగచెలువపయ్యంటపయిం
దడి దుడుచుచుఁ దెలియాకున్, మడుపు లొసఁగి చాలుటయును మదిఁ దమి బొదలన్.

76


తే.

చెలువ పయ్యెదఁ జుబుకంబుచేత నదిమి, ఱవికె సడలింపఁ దిలకించి రమణుఁ డెంత
సిగ్గరివె యంచుఁ బైఁటఁ దీసినను వేగఁ, గరయుగంబునఁ జనుదోయిఁ గప్పుకొనుచు.

77


మ.

అలరు శయ్యకుఁ జేరి యొత్తిగిలి సయ్యాటంబునన్ గబ్బిగు
బ్బలు ఱొమ్మానఁగఁ బ్రాణనాథుకటిపైఁ బాదంబు కంఠంబునన్
వలకే ల్గ్రుచ్చి కవుంగిలించి జిగిజాళ్వాచెల్వపున్ ముద్దుచె
క్కిలి ముద్దాడుచు మిక్కుటంబు తమి సొక్కె న్కాంత కన్మోడ్పునన్.

78


చ.

పడఁతుక ప్రేమమీఱ మొనపంటఁ జుఱుక్కున మోవి నొక్కినం
జిడిముడిపాటుతోడ నునుజెక్కిలి మీటుచుఁ జాలుఁజాలునే
విడవె గయాళి యంచుఁ బతి వేఁడినఁ జిక్కితి వింక నేల నే
విడువనటంచుఁ గ్రోలెఁ బెదవి న్మదవిహ్వలతాంతరంగ యై.

79


తే.

కలికి యీరీతిఁ బరిపరిగతులఁ బెనఁగఁ, గఠినవక్షోజయుగళసంఘట్టనమున
హృదయమున నిద్రవోయెడుమదనుఁ డపుడు, మేలుకొనె నాఁగఁ బతి దమి మీఱ ననియె.

80


మ.

అలుకల్ దీరిచి ముద్దు పెట్టుకొని సయ్యాటంబునం జంటిపై
జిలుగుంబయ్యెదకొంగు జాఱ్చి తమి నాశ్లేషించుచుం బైకొనన్
బలిమి న్వల్లభుఁ డప్పు డొల్లమి నటింపంజూచుభ్రూభంగరీ
తుల నొందుం గులకాంత లింతతమి యెందుం గానఁ జంద్రాననా.

81


తే.

అకుటిలభ్రూశరాసన వనతితీక్ష్ణ, చంచలాలోకవిశిఖవకంచుకాఢ్య
నపురుషాలాపలాలస వయ్యు నతను, సమరసన్నద్ధ వగుట యాశ్చర్య మబల.

82


క.

అని నర్మోక్తులఁ దనసతి, చనవుం జెల్లింపఁగోరె సమరతికలనన్
మునిపతి గులకాంతలు గో, రినకోరికెఁ జిన్నవుత్తురే గృహు లనుచున్.

83


తే.

నెలఁత రమ్మని తనదుసందిటికిఁ దిగిచి, చన్నుగవ యంటి వాతెఱచవుల దేరి
విడువఁబోయిన నునుపోఁకముడికి గాను, కోమలి బెనంగె సిగ్గుచేఁ గొంతదడవు.

84


తే.

నిగనిగల్ గుల్కు నధరమాణిక్య మొసఁగె, గుబ్బచనుదోయి బంగారుకుండ లొసఁగె

బెనఁగెఁ దనపోఁకముడికిఁగాఁ బ్రియునితోడ, నీరజాక్షులు ముగ్ధలు గారె యెందు.

85


తే.

నీవి తనయంతటనె జాఱె నీరజాక్షి, రౌర యభిమానరక్షకు లైనవారు
దొలఁగుసమయంబునను దామె తొలఁగిపోకఁ, బరులచేఁ ద్రోపుఁబడుదురె పలుచ నగుచు.

86


వ.

అంత.

87


మ.

తను లేలెమ్మనికొమ్మ యెత్తులిడ మోదంబొప్ప నాథుండు పై
కొని యానందపయోధి నీఁదుచును వక్షోజాతకుంభంబు లూఁ
దినసత్త్వంబున నంతలో బడలి యెంతే సోలి యోష్ఠామృతం
బు నితాంతంబుగఁ గ్రోలి మున్గెను శ్రమాంభోవాహిను ల్ముంచఁగన్.

88


తే.

అనధరక్షత మనఖభేదన మకంఠ, కూజిత మభాషణ మబంధకుశల మయ్యు
మౌని సురతంబు మానినీమణిని బార, వశ్య మొనరించి యానందవార్ధిఁ దేల్చె.

89


అంత సురతాంతవైరాగ్య మనుసరింప, నింతమాత్రసుఖంబున కేల యిట్టి
వేళఁ బ్రాల్మాలితి వటంచు విభునిమోము, చక్కఁజూడంగ సిగ్గయి శయ్య డిగ్గి.

90


చ.

ప్రిదిలినకట్టుకొంగు సవరించి మిటారపుఁజన్నుదోయి ప
య్యెదఁ గదియించి ముత్తియపుటంచులకమ్మలు చక్కనొత్తి క్రొ
వ్వెద ఘటియించి ముంగురులు విన్ననువొప్పగఁ దీర్చి నెమ్మదిన్
గుదిగొనుసిగ్గుతోఁ గుసుమకోమలి మజ్జనశాల కేఁగినన్.

91


తే.

మౌని స్నానంబు చేసి నవీనధౌత, చేలములు గట్టి నిర్మలక్షితి వసించి
బ్రహ్మగాయత్రి జపియించి భావశుద్ధి, హోమశాలాంగణంబున నున్న యపుడు.

92


మనోహారిణీవృత్తము.

ఉదరము బరువై యున్నను మది స, మ్మదమును భయమును మల్లడిగొనఁగాఁ
బెదవులు దడుపుచు బిత్తరి రమణుం, గదియఁగఁ జనియెను గద్గదికి దగన్.

93


తే.

కామమోహిత నగుచు దుష్కాలమునను, నిన్ను గూడి రమింపఁగ నిలిచె గర్భ
మింకఁ దా నేమి చేయునో యెఱుగఁబడదు, క్రొవ్వి నవ్వితి లోకైకగురుని హరుని.

94


వినయవృత్తము.

అనిన, న్విని య, మ్ముని యి, ట్లనియెన్.

95


సీ.

పతిచిత్త మెఱుఁగక రతిఁ గోరుట పతివ్రతలకు ధర్మముగాఁ దలఁపవైతి
విది సందెవేళగా యీవేళ రమియింప ఘోరపాతక మని కొంకవైతి
ఫాలాక్షు వృషవాహు శూలపాణి మహోగ్రుఁ గఱకంఠుఁ జూపిన వెఱవవైతి
దితి కశ్యపుని బలాత్కృతిఁ బట్టె నని లోకు లాడుకొందు రటంచు నలుకవైతి

తే.

మించి నేనెంత దెలుప లజ్జింపవైతి, దక్షనందనవయ్యు సత్పదము దక్కి
చిత్తభవునకుఁ జిక్కి దుష్క్రియకుఁ జొక్కి, యింత చేసితి వేమందు నిందువదన.

96


ఉ.

కామము ధైర్యవారణనికామము దుర్దమదుష్క్రియాలతా
రామము సత్క్రియాధృతివిరామము క్రోధముఖాదిపంచక
క్షేమము నాస్తికత్వ మతిసీమము దుర్వ్యసనాబ్ధిరాట్సుధా
ధామము సర్వదుష్టగుణధామము దానిఁ బరిగ్రహింతురే.

97


సీ.

వదినె యంచు నొకింత వాత్సల్య ముంచక పౌలోమి ముందల బట్టువారు
న్యాయంబు గాదిది యని బృహస్పతి పల్క వికవిక నగి చెంప వ్రేయువారుఁ
బినతండ్రి యని తండ్రి గనమి జయంతుండు వచ్చినఁ జెఱసాల వైచువారు
హరిని నుతించు నటంచు నానావేదశాస్త్రము ల్ఖిలముగా సల్పువారు


తే.

నీదుగర్భంబునందు జన్మింతు రబల, సంజ రమియించినట్టిదోషంబువలన
రుద్రభృత్యులు భద్రానుభద్రు లనెడు, వారు గడపటఁ దెగుదురు శౌరిచేత.

98


క.

అన ముఖవర్ణవ్యత్యయ, మున మోదము ఖేద మగుట మునిపతి దెలియం
గనుఁగొని భయసంభ్రమములు, బెనఁగొనఁ దనమనములోన బిత్తరి యనియెన్.

99


తే.

విను మనోహర యొకరసావేశమునను, దను వెఱుంగమి నపు డట్టితలఁపు పుట్టె
నిపుడు విస్మయమయ్యెడు నెన్నికొనిన, దైవకృత్యంబు గాకేమి తప్పు గలదె.

100


మ.

ఘనశౌర్యంబున వైరివీరవరులన్ ఖండించి లోకంబు లె
ల్లను బాలింపఁగఁ జాలునిద్దఱుసుతు ల్మద్గర్భసంభూతు లై
నను జాలు న్గలుషాత్ములైన వెఱవం దర్వాత శ్రీభర్తచే
తనుమేను ల్ద్యజియింపఁ గల్గుట గరస్థంబౌఁ గదా మోక్షమున్.

101


తే.

ఐన సాధునింద కాలయు లగుటను, వగవవలయు వారివారి కైన
విష్ణుదేవుభక్తి విబుధానురక్తియుఁ, గలుగఁ గరుణ సేయు కాంత యనిన.

102


క.

వనితా పశ్చాత్తాపం, బునఁ గుందుట విష్ణుదేవుఁ బొగడుట నన్నుం
గని మని కొల్చుటవలన, న్నిను మెచ్చితి శుభము గల్గు నీ కిటమీఁదన్.

103


తే.

రమణి నీయగ్రసుతుఁడు హిరణ్యకశిపుఁ, డతనికి జనించుఁ బ్రహ్లాదుఁ డనుకృతార్థుఁ
డతనియుత్తమచారిత్ర మఖిలవిష్ణు, భక్తజనముఖ్యులకు మేలుబంతి యగును.

104


క.

శ్రీదయితపాదసేవా, హ్లాదుఁడు ప్రహ్లాదుఁ డలరు నతిపావనుఁడై
మోదమున నుండుఁ బొమ్మని, యాదితి నూరార్చియుండె నతఁడు యథేచ్ఛన్.

105


వ.

అంత.

106


తే.

దితికపోలతలంబులు తెల్లవాఱె, నదితి నెమ్మోము వెలవెలనయ్యెఁ దోఁడఁ
బంచికొనెనేమొ రుఛియు సాపత్యమునను, గాక సైరింపఁగలదె యేకడ సపత్ని.

107


క.

గర్భమున వృద్ధిఁబొందెడు, నర్భకులశరీరకాంతి యధికంబై యా

విర్భూతమయ్యె ననఁగా, గర్భిణికుచచూచుకములఁ గాళిమ దోఁచెన్.

108


క.

చిట్టుములువుట్టెఁదాఁ గను, పట్టికి నిటమీఁద ధర్మపథమున నిటులం
బుట్టెడు నరుచియటంచుం, గట్టిగ జనములకుఁ దెల్పుకైవడి దితికిన్.

109


క.

ఇటువంటిభూమి నీవిం,కిఁట గైకొను మంచుఁ బట్టి కెఱిగించుగతిం
గుటిలాలకమృద్భక్షణ, ఘటితాదరయ్య మిగుల గర్భస్ఫురణన్.

110


సీ.

శ్రేష్ఠనిష్ఠురతపోనిష్ఠచేఁ బరమేష్టి మెప్పించి వరముఁగా మించ నెంచు
జగతీతలం బెల్లఁ జాఁపచుట్టుగఁ జుట్టి యొకమూల దాఁపగా నుత్సహించు
శతమఖప్రముఖనిర్జరులఁ బాఱఁగఁద్రోలి యెల్లలోకములుఁ దా నేలఁ దలఁచు
బ్రాహ్మణయూథంబు బాధించి రోధించి యధ్వరభాగంబు లందఁగోరు


తే.

నమరకాంతలఁ జెఱల వేయంగఁ దివురు, దేవదేవునితో నిరోధింపఁజూచు
గర్భ మైనది మొదలుగాఁ గస్యపాగ్ర, పత్నిభావంబులోనఁ బ్రాభవము మెఱసి.

111


తే.

బాలకులఁ గాంచినను బాకభంజనాది, శత్రువులు నొత్తురో యను సంశయమున
గర్భము ధరించె నూఱేండ్లు గాఢనియతి, జలజలోచన పుత్రవాత్సల్యమునను.

112


సీ.

వదనంబు సఱచినవానిఁ గానఁగలేక ధరణీజనం బెల్లఁ దల్లడిల్ల
ఘణిఘణిల్లుమటంచు గగనమార్గంబున వైమానికుల విమానములు దాఁక
రథముపై నున్న మార్తాండుఁ జూడఁగలేని గరుడాగ్రజుఁడు బెట్టుగాఁగఁ బిల్వ
నున్నవాఁడవె యంచు నొద్దివారలు బింబ మంటి శైత్యస్పర్శ నబ్జుఁ దెలియ


తే.

నంబునిధి జాతహాలాహలంబులీల, నదితి దుర్భరగర్భంబునందుఁ బొడమి
భూర్భువస్వర్ముఖాశేషభువనములను, గాఢమై నిండె ఘోరాంధకార మొకటి.

113


తే.

అప్పు డింద్రాదికసుధాంధు లంధు లగుచుఁ, బేరుపేరుల నొండొర్లఁ బిలిచికొనుచుఁ
జెట్టఁ బాయక కైలాసశిఖరి గనుచు, సత్యలోకంబుఁ జేరి విస్మయము మీఱ.

114


మ.

అతిచంద్రార్కతనుద్యుతిచ్ఛటల లోకాంతర్బహీరూఢగా
ఢతమోహారకుఁడై సమస్తమునిచూడారత్నసంసేవ్యప
చ్ఛతపత్త్రుండయి భారతీరమణితో సౌవర్ణపీఠంబునం
దతులప్రౌఢిఁ జెలంగుఁ బ్రహ్మఁ గని సాష్టాంగంబు సేవించుచున్.

115


తే.

భారతీనాథ సర్వసంపత్సనాథ, ప్రకటతరవిశ్వనిర్మాణపారదృశ్య
తెలియఁబడుఁ గాదె కరతలామలకసరణిఁ, ద్రిభువనంబులవృత్తంబు దేవ మాకు.

116


తే.

అంధకార మొకటి హాలాహలాగ్రమై, మించి జగము లాక్రమించి యున్న
దిందులకు నిమిత్త మెఱిఁగింపు భయమెల్లఁ, దీఱ ననిన భారతీనిభుండు.

117


సీ.

ఆదికాలమున "సోహం” బంచు నామానసంబునఁ బుట్టిన జ్ఞానవంతు
లీజగంబాదిగా నెల్లజగంబులఁ దృణలీలఁ జూచి వర్తిలు విరక్తు

లుగ్రుఁడు మొదలుఁ బ్రత్యుత్థాన మొనరించి పూజింపఁగాఁ దగుపూజ్యతములు
నారదాదులకు డెందంబునఁ దోఁపని యర్థముల్ దెల్పు తత్త్వార్థవిదులు


తే.

సంతతాత్మానుభవసౌఖ్యజాయమాన, తృప్తితృప్తాంతరంగులై తిరుగుచుండ్రు
సకలజగముల సనకాదిశాంతినిధులు, వార లొకనాఁడు హరిఁ జూచువాంఛ యొదవ.

118


సీ.

ద్వారకాంచనరంభ లూరుకాండములుగాఁ గలితసోపానము ల్వళులుగాగఁ
గమలాకరస్ఫూర్తి గంభీరనాభిగా నారామరేఖ నూగారు గాఁగఁ
బదివన్నియలకోట పసిఁడియొడ్డణముగా సౌధశృంగము లురోజములు గాఁగ
భవనాగ్రకేతనపాళి పయ్యెద గాఁగఁ దొగలతోరణము భూయుగము గాఁగ


తే.

హంసకారావయుతపరిఖాంబుజంబు, లడుగులును ధూపధూమంబు లలకములుగ
ఠీవి సాక్షాత్కరించిన శ్రీవధూటిఁ, బోలి చెలువొందు వైకుంఠపురమునకును.

119


క.

చని యేలోకంబునఁ గాం, చనివైభవ మిందుఁ జూడ సమకూరె నటం
చని ప్రాపించి కరమ మె, చ్చనివా రన్యోన్యసూక్తిచాతురి మెఱయన్.

120


ఉ.

శ్రీవిభుఁ డాద్యుఁ డీశ్వరవిరించిముఖామరసేవ్యుఁ డంచు స
ద్భావమునన్ భజింపఁగల భక్తులు ముక్తశరీరులై ముదం
బావహిలంగ నీడ జలమాడక లింగశరీరముక్తి లే
దీవిరజానదీమహిమ మెన్న సమర్థులమే సనందనా.

121


ఉ.

మందసమీరచంచలసమంజసకంజపరాగపుంజ మెం
దెందు రజోగుణంబు వెలయింపఁ దదీయమరందలాలసేం
దిందిరము ల్దమోగుణముఁ దెల్పెడు నింతియకాని చూడఁగా
నిందురజస్తమోగుణము లెన్నఁడు లేవుగదా తపోధనా.

122


మ.

అరిషడ్వర్గము లేమి దుఃఖములపొం దావంతయున్ లేక శ్రీ
విరజానామతరంగిణీజలములో విధ్యుక్తి సుస్నాతులై
స్థిరభక్తిన్ సమయం బెఱింగి హరి సంసేవించుచుం దుష్టిచే
కుఱహర్షించు సలోకముక్తులఁ గనుంగొంటే జటీంద్రాగ్రణీ.

123


సీ.

మణీకిరీటంబులు మకరకుండలములు నాకర్ణధవళనేత్రాంబుజములుఁ
బావనవైజయంతీవనమాలికాకౌస్తుభకలితవక్షస్థలములు
శంఖచక్రగదాసిశార్ఙపంచాయుధదుర్వారబాహాచతుష్టయములు
ఘనకటీతటబద్ధకనకాంబరంబులు నాభిశోభితపాండునయనములును


తే.

విబుధపతినీలరుచిదివ్యవిగ్రహములు, దర్పకానంతసదృశసౌందర్యములును
గలిగి చెలువొందుచున్నారు కంటె వీరి, విష్ణుసారూప్యవంతుల విమలమతుల.

124

సీ.

పదియాఱువన్నెలబంగారమే కాని యితరలోహంబు లిందెందు లేవు.
నవనీయముగ మించు నవరత్నములె కాని యితరోపలంబు లిందెందు లేవు
కామితార్థము లిచ్చు కల్పకంబులె కాని యితరభూరుహము లిందెందు లేవు
శ్రుతివచోరచన మించు విహంగములె కాని యితరఖగంబు లిందెందు లేవు


తే.

సరసీరుహనాభసారూప్యధరులె కాని, యితరు లైనట్టివార లిందెందు లేరు
తరమె యెంచ గుణాకుంఠతరము ముక్తిగురుకుచాకంఠసరము వైకుంఠపురము.

125


వ.

అని యనీదృశ లోకసాధారణ లోకదురవలోక మణిగణలోకవిలోకాయిత
శతకోటికోటిలోచన సలోకవాసనివాసవర్గంబు లగు రాజమార్గంబు లవలోకిం
చుచు నతిక్రమించి నిజసమాగమసమసమయసమయద్భయభక్తివినయ
ప్రధానప్రధానజననిటలతటముకుళితకరవందనమాలికాసందీపితారవింద
కోరకవందనమాలికాకలితనిజారం బగు హరిహజారంబుఁ బ్రవేశించి వాద
వేదండంబులం బోలి బహుకక్ష్యాభిరామంబై గగనకాసారంబులం బోలి
సద్వారారూఢంబై కపోతపాలికాలాలితం బయ్యు నసత్యంబై త్రైకాలిక
సత్యంబును నై ఘనతరవజ్రవలభిత్రాణం బయ్యు ననాకంబై నిత్యనాకంబును
నై మేచకరుచిరుచిరనీలకంఠోత్కంఠాపాదనప్రవణహరిన్మణిరమణీయకాంతి
కాళికావిలాసం బయ్యు నఖర్జూరనగారామంబై పరిపక్వఖర్జూరనగారామం
బును నై ముక్తావాసంబు గావున ముక్తావాసంబును నీలాభిరామంబు గావున
నీలాభిరామంబును శ్రీనివాసంబు గావున శ్రీనివాసంబును నచలోజ్జ్వలంబు
గావున నచలోజ్జ్వలంబును ననంతవిలాసభాసురంబు గావున ననంతవిలాస
భాసురంబును నష్టాపదమయంబు గావున నష్టాపదమయంబును విష్వక్సేనావృ
తంబు గావున విష్వక్సేనావృతంబును నగుచుఁ జెల్వొందు త్రిభువనాధిపుభువ
నాధిరాజంబుఁ బ్రవేశించి యంతిపురంబు వెడలివచ్పు పరిచారకాజనంబుల నం
బుజలోచనసమయంబు వేఁడు సేవాపరాయణులకలకలంబులచే నుపలక్షితంబు
లగు త్రిచతుఃకక్ష్యాంతరంబులు గడచి హరినామసంకీర్తననర్తనసామగాన
ప్రవర్తనంబులం బరమభాగవతులం బోలు కీరమయూరశారికల నుపలాలించు
మించుబోఁడులం గనకాంబరునకుఁ జేశానుక లొసంగఁ గనకమంజరులు గట్టు కన
కాంగుల మఱియు లక్ష్మీనారాయణవివిధకైంకర్యపరాయణు లగు శుకవాణు
లం గనుంగొనుచు నీరంధ్రసౌగంధికతృణగ్రాహివిషహరమణీప్రభానీరంధ్రంబు
లగు పంచషట్ప్రదేశంబులుం దాఁటి యవ్వల.

126


మ.

కలితస్తంభము కామినీహసనరంగచ్చంద్రికాస్విన్నశీ
తలరుక్కాంతసమేతకుడ్యము సరత్నశ్రేణివైవర్ణ్యము

త్పలమారంద ముదశ్రువు న్మదకపోలద్వంద్వమై సర్వమై
చెలువయ్యె న్గృహలక్ష్మి సాత్త్వికముచే శ్రీవిష్ణుసంగంబునన్.

127


వ.

అని యిందిరారవిందనయనానందకరుం డగు నందకకరునిషందిరసౌందర్యంబు
నకు డెందంబున నానందించుచు శతానందనందను లగు సనకసనందనాదికర్మం
దిబృందారకులు ప్రజ్ఞావిజ్ఞానంబులం దాము తద్దయుఁ బెద్దలయ్యు నద్దేవదేవు
నకు ముద్దులమనుమలుగావునఁ జౌపంచప్రాయంబులవారలై కనుపట్టి దిగం
బరు లయ్యు నంబరమణిరమణీ ప్రభాడంబరవిడంబనామందేహంబు లగు
దేహంబులు ప్రకాశింప దండకమండలువులు గైకొనకుండియుం దమయతి
లోకప్రభావంబు భావంబున భావించి తత్రత్యదేవతాగణంబులు గావించు
సాష్టాంగసేవలకు నుచ్చరించు నారాయణోచ్ఛారణం బోంకారసూచకం
బుగా నభ్యంతరగృహంబున కరుగు సమయంబున.

128


క.

బాలురుగాన వివేకము, సాలదొ బిసబిసన నెందుఁ జనియెద రంచుం
గోలలు వైచిరి శతధృతి, బాలులముందఱను ద్వారపాలకు లలుకన్.

129


వ.

ఇవ్విధంబున.

130


క.

పోవలదని రోధించిన, దౌవారికజనముఁ గాంచి తాపసవరు లే
లా వారించెద రకట, శ్రీవల్లభుపాదసేవ సేయఁగఁ దగమే.

131


తే.

అనిన వేళ గాదు వనజాతనేత్రుండు, తరుణిఁ గూడి యంతిపురమునందు
నున్నవాఁ డటన్న నొక్కింత నవ్వుచు, సనకమౌని వెనుక సనక యనియె.

132


మ.

ఇనబింబంబున యోగిమానసములం దేప్రొద్దు శ్రీకాంతతో
వనజాక్షుండు వసించు మీ రెఱుఁగరే వారింపరా రెన్నఁడుం
గనుదమ్ము ల్వికసింపఁ గన్గొనుదు మర్కస్థాయి నాత్మస్థితున్
ఘనవిజ్ఞానవిలోకనంబునఁ గడుం గన్గొందు మిచ్ఛారతిన్.

133


క.

కనుటయుఁ గనఁదగు నదియును, గనుఁగొనువాఁ డాత్మ యయ్యెఁ గనుఁగొనవలదం
చును వారించెద రెవ్వరిఁ, గనుఁగొనఁగా రానిదేది కనుఁగొనుఁ డాత్మన్.

134


తే.

ఏల యజ్ఞాన మొదవె నీవేళ మీకు, నిర్వికారంబు పూర్ణంబు నిర్మలంబ
నైనపరమాత్మ కొకవికారానుభవము, గలుగఁజేసితి రేమనఁగలము మిమ్ము.

135


తే.

ఘట[3]మటోపాధి భిన్న మౌ గగన మట్లు, ప్రకృతిసంబంధమున భిన్నభంగిఁ దోఁచు
నాత్మ యింతియె కాని వేదాంతయుక్తి, నరసిచూచిన భేద మావంత లేదు.

136


తే.

ప్రకృతిభిన్నగుణంబులఁ బ్రభువుఁ బోలి, మమ్ము దౌవారికులఁ జేసి మనుపుచోటఁ
దదధికారంబు దప్పింపఁ దరముగా ద, టన్న నటువలె ననఁగరా దదియు వినుఁడు.

137

క.

చనవరుల నడ్డగింపం, జనునే దౌవారికులకు జగదీశునకుం
దనయాత్మజులము మాక, న్నను జనవరు లేరి యిచట నానాగతులన్.

138


క.

ఎటువంటి బంధు లయినం, గుటిలాత్ములఁ జేరనీయఁ గూడునె యన్నన్
గుటిలుల మౌటయుఁ గాకుం, డుటయును మీభావ మెఱుఁగు నూ ఱేమిటికిన్.

139


తే.

హరికి నెటువలెఁ దోఁచునో యనిన మీకు, వెన్నునకు భేద మెయ్యెది యెన్ని చూడఁ
గరచతుష్టయవనమాలికాగదాసి, హైమవర్ణాంబరంబుల నలరినారు.

140


తే.

ఐన సమయంబు గాదని యంటిరేని, కన్నుల రవీందులును నాభిఁ గమలభవుఁడు
శయ్యయై శేషుఁ డుండంగ శౌరిఁ గొల్వ, మాకు సమయంబు గాదె ధీమహితులార.

141


క.

కమలాక్షునిఁ గొల్వఁగ నిది, సమయము గాదన్న నేది సమయం బిఁక నో
విమలాత్ములార యెప్పుడుఁ, గమలాసతి ఱొమ్ముఁ దించఁగాఁ గన మెందున్.

142


వ.

ఇవ్విధం బంతయు నెఱింగియు నంజనంబునం దెలిసి వసుధాంతరంబున నుండు
నిదానంబు గైకొనంజను జనులకు మహాభూతంబు లడ్డుపడుతెఱంగున బ్రహ్మ
దత్తవిజ్ఞానంబున సన్నిధియగు హరిసన్నిధి కరుగు మమ్మువంటి నిష్కాములందు
నిష్కారణక్రోధంబు చేసి నిరోధించితిరి గావున నిక్షేపకాముకుండు మంత్ర
తంత్రంబుల మహాభూతంబుల నిరసించుచందంబున మత్తపోబలంబున మత్త
చిత్తవృత్తుల రగు మిమ్మువంటి సజ్జనకంటకుల గెంటించి పరమపదంబు నిష్కం
టకంబు గావించెద మని జయవిజయభూపాతననిమిత్తజాతంబు లగురీతిం బ్ర
భూతోచ్ఛ్వాసవాతంబులు నిగుడం దదీయనిర్గమనసమయాపవర్గపురద్వార
కవాటార్గళవిఘట్టనరటనానుకరణనిపుణరదనపటలకిటకిటధ్వానంబులు వెలయ
నితఃవరతదాహతజంతుసంతానరక్తసిక్తధారావలయసూచకరోషారుణాయ
మాననయనంబులు వెలుంగ నశనిసదృశగుణపదపరమపదజాయమానకోపరూప
దోషహేతుధూమకేతుభవద్భ్రుకుటి ఘటిల్లఁ గోపాటోపంబు సైరింపనేరక వై
రించి హరిద్వారపాలకుల నవని జనియించి సురద్విషద్వారపాలకులు గమ్మని
శపియించిన.

143


క.

గడగడ వడఁకుచుఁ బెదవులు, దడుపుచు జయవిజయు లపుడు దాసోహ మటం
చడుగుందమ్ములపైఁ బడి, జడదారుల వేఁడుకొనెడుసమయమునందున్.

144


సీ.

తొడలపై నిడియొత్త నడుగు పంటవలంతి జఘనంబుఁ దాఁకించు సరసలీల
మడుపుఁ దెమ్మని మోము మలచిచూడనిలీల కుచముపైఁ జేసాఁచు కోడిగంబు
వనధికన్యక కిన్క వక్షంబు డిగ్గ నొత్తగిలిచే వలగొను దంటతనము
విసరకు మని తాళవృంతపుత్రి నదల్చి యందఱ నవ్వించు నందగింపు


తే.

నొకరొక రెఱుంగనటులు గాఢాపగూహ, చుంబనంబుల సొక్కించి సొగసువగలు
వెలయ దక్షిణనాయకవిలసనమున, శేషశయ్యాశయానుఁడై శ్రీవిభుండు.

145

క.

వాకిటికలకలమంతయు, నాకర్ణించుచు సరోరుహాక్షులు దమలో
నేకడకని యూహింపఁగఁ, గాకోదర రాజశయ్య గ్రక్కున డిగియెన్.

146


మ.

ఉడురాణ్మండలపాండురాగముఖరత్నోదారరత్నంబులౌ
పడగ ల్మించఁగ మించు నాగజగతీపాలుండు ప్రాఁగెంపుచె
క్కడపుందంతపుపావలై తనర శృంగారంబుగా మెట్టి యా
కడయంతస్థునఁ బక్షిరా జొసఁగుకే ల్కైదండఁగాఁ బూనుచున్.

147


సీ.

కంకణంబులు మ్రోయఁగా నీళయును ధరారమణియు వింజామరములు వైవ
విమలాల తాతన్వి వెలయాకుమడుపుతో నడుగువాయక వెంటనంటి నడువ
మొలకలేనవ్వుతోఁ గలిమినెచ్చెలి వీఁచు సురటితెమ్మెరల ముంగురులు గదలఁ
తలతలయందు సూత్రవతీసతీపతి బలసి ముందఱ బరాబరి యొనర్ప


తే.

జాఱుసిగ కేలనొత్తుచు జాళువామె, ఱుఁగుదుప్పటివలెవాటుకొంగు జాఱఁ
జీర కెంగేలఁబూన నెచ్చెలి యొక ర్తె, యంబుజోదరుఁ డంతిపురంబు వెడల.

148


వ.

అప్పుడు.

149


సీ.

తనమ్రొక్కుఁ గినుకఁ గైకొనక లచ్చివిదిర్చుపదనఖం బంటినఫాలతలము
వనరాశినందన వలచి ముద్దాడఁగాఁ దాంబూల మంటిన తళుకుఁగన్ను
లరవిందమందిర [4]యామోదముగఁ బీల్చు మొదటిరక్తిమ మించు ముద్దుమోవి
కెమ్మోవి నొక్కజంకించి యిందిర మీటఁ గొనగోరు సోఁకిన మినుకుఁజెక్కు


తే.

చిటులు గస్తూరితిలకంబుఁ జిఱుచెమటయుఁ, గలిగి సురతాంతకాంత శృంగారలక్ష్మిఁ
జాటు శ్రీహరిముఖజలజమున వ్రాలి, మరల వళిపంక్తులట్టు లమ్మానిదృష్ట్లు.

150


తే.

శ్రీవధూమణి చెక్కుతోఁ జెక్కుఁ జేర్చి, పవ్వళింపంగ మకరికాపత్త్రరేఖ
లంటిన ముకుందుచెక్కిటియందుఁ దోఁచు, మకరకుండల మని యెన్ను మౌనిజనము.

151


క.

పంకజసదనానవనఖ, రాంకిత వైకుంఠకంఠ మనులేపభవ
త్కుంకుమ పంకదళాంకుర, సంకీర్ణము గాఁగ నెంచు జటికుల మెలమిన్.

152


తే.

యోగివంద్యుని సందిటియొత్తులకును, రణితకేయూరమణులు గారణము గాఁగఁ
దలఁపుదురు గాని రమ కుపధానమైన, కొప్పువిరు లొత్తు టెఱుఁగరు కొంతయైన.

153


తే.

నీరజాలయగుబ్బ కస్తూరికుంకు, మములసోఁకులు వక్షఃస్థలమునఁ జూచి
నిస్తులము లగు శ్రీవత్సకౌస్తుభముల, విభలు ప్రసవించెనని కండ్రు విమలమతులు.

154


తే.

కలిమిముద్దియ నిద్దపుఁ గమ్మమేని, పనపునిగ్గులటంచు నేర్పరుపలేక
కటితటంబునఁ గట్టినకనకపటికి, వింతరుచి వచ్చెనని కండ్రు శాంతినిధులు.

155

తే.

అడుగు లొత్తెడు నప్పు డప్పుడమిపడఁతి, గబ్బిగుబ్బలయంగరాగంబు సోఁకె
ననరు కేంజిగిచరణంబు లంబుజములు, గానఁ బుప్పొడి యందురు మౌనివరులు.

156


తే.

భువనమోహనశృంగారపూర్ణ మగుచు, వెలయు హరిదివ్యమంగళవిగ్రహమున
మగ్నమై చిత్త మానందమయతఁ గాంచె, విషయవిక్షేపములు లేమి ఋషివరులకు.

157


తే.

మౌను లానందబాష్పాయమాననయను, లగుట నంతట నానతు లగుచు లేచి
బ్రహ్మ దెల్పినరీతి మీభవ్యమూర్తిఁ, గాంచి ధన్యులమైతిమి కమలనయన.

158


శా.

భేదాతీతుఁడవై జగన్మయుఁడవై పెంపొందు నీలీల సం
వాదం బే మొనరింప నేర్తుమె “యతో వాచోనివర్తంత” యి
త్యాదిప్రాక్తనసూక్తు లొప్ప మఱి యేమన్న న్మనఃపీఠి నీ
పాదద్వంద్వము నిల్పికొల్తు మనుకంపం బొప్ప సర్వేశ్వరా.

159


సీ.

పద్మరాగప్రభాభాసమానకిరీట మృగమదతిలకజృంభితలలాట
విపులనేత్రాభోగ విజితపంకజవర్ణ మకరకుండలదీప్యమానకర్ణ
మందహాసవిలాస మాధుర్యముఖపద్మ యిందిరాసందీప్తహృదయసద్మ
ఘనకటీతటబద్ధకాంచనకౌశేయ మణిమయదివ్యభూషణనికాయ


తే.

శంఖచక్రాదిసాధనసహితహస్త, యజ్ఞనిగ్రహరుచివిగ్రహప్రశస్త
మీకు మ్రొక్కెద శుభనామ మిహిరధామ, శిష్టజనపద్మమిత్ర లక్ష్మీకళత్ర.

160


ఉ.

శ్రీపతి తావకీనపదసేవనశీలుర ద్వారపాలురం
గోపము మీఱఁ దిట్టితిమి కుంభినిఁ బుట్టఁగ నింకనిట్టి బ
ల్పాషముచేత రౌరవము పాలయి కూలక యుండ మమ్ము మీ
ప్రాపున నుంచి ప్రోవుము ప్రసన్నజనావన లోకపావనా.

161


మత్తేభగర్భితసీసము.

వినతపద్మాసన విశ్వరక్షణచణా నాళీకపత్రేక్షణా రమేశ
సతతతేజోనిధి సజ్జనవ్రజనుతా తారుణ్యలక్ష్మీయుతా యుపేంద్ర
విజితమత్తాసుర విక్రమోజ్జ్వలభుజా శృంగారలీలానిధీ ముకుంద
మహితకార్యోద్యమ మమ్ముఁ బ్రోవుము దయ హేమాంబరాడంబరా మహాత్మ.


తే.

యని విచిత్రవచస్ఫూర్తి వినుతి సేయ, మౌనిమత్తేభవృత్తంబు మదిని మెచ్చి
యంబుజోదరుఁ డిట్లని యానతిచ్చెఁ, బ్రావృడంభోదగంభీరభాషణముల.

162


క.

ముక్తులును విరక్తులు భవ, ముక్తులు హృదయాంబుజాతముఖ్యగుణాళీ
ముక్తులు శాంతతనుత్రా, ముక్తులు మీ కేటికలుషములు మునులారా.

163

సీ.

ఆఁకొన్నసురలెల్ల ననుదినం బెవ్వరిక్రతుశాలపంచలఁ గాచియుండ్రు
భజియింతు రెవ్వారిభవనము ల్బ్రతిమాసమును బితృదేవత ల్భుక్తిగోరి
సకలభూతంబులు సంతృప్తిఁ జెందు నెవ్వరు సేయఁదగు బలిహరణసిద్ధి
నర్చావతారంబు లశ్రాంతమునుఁ బూజ లందు నెవ్వరిచేత నర్హరీతి


తే.

వేదశాస్త్రంబు లేరిచే వెలయుచుండు, నెంచు నెవ్వరిదినచర్య స్మృతిచయంబు
లర్క జయ మిచ్చు నెవ్వరియర్ఘ్యతోయ, మట్టివిప్రుల కెన యెవ్వ రఖిలమునను.

164


శా.

ఏమీనాక్షికటాక్షలేశమునకై యీశానవాణీశసు
త్రామాదు ల్భయభక్తియుక్తి నెపుడుం బ్రార్థింతు రాలక్ష్మి యెం
తోమోదంబునఁ జేరి పాయదు విరక్తు న్నన్ను నే భూసుర
శ్రీమాహాత్మ్య మెఱింగి కొల్వఁగఁ గదా సిద్ధించు నానార్థముల్.

165


మ.

అజమూర్థాపహవృత్రశాత్రవులు బ్రహ్మద్వేషము ల్సేయఁగా
నజహత్సంపద గాంచలేక కడుభిక్షావృత్తికి న్మర్త్యదై
త్యజనోద్వృత్తికిఁ జిక్కి పొక్కెదరు సత్యం బెందు విప్రావళీ
భజనాచారము లేనివారలకు సౌభాగ్యంబు చేకూరునే.

166


క.

అపరాధం బొనరించిన, కపటాత్ములఁ బుణ్యజనులు గండని కినుకన్
శపియించితి రన్నను మీ, కృప యెంతని పొగడుదున్ యతీశ్వరులారా.

167


చ.

సరసులు ఘర్మకాలమునఁ జండకరోష్ణము పైని బూని యం
తరముల శీతలంబు లగు దారి భవాదృశసాధుచిత్తముల్
పరిఘటితాపరాధములపట్టునఁ బైపయిఁ గిన్కఁబూనియుం
బొరయవు లోఁ గఠోరతఁ బ్రపూర్ణశమాఢ్యము లౌట నెప్పుడున్.

168


క.

వీరలు మీ కొనరించిన, నేరంబున ధరణిఁ బుట్టి నిశిచరు లగుచుం
బోరున నాచేఁ దెగి నం, జేరెద రని యతులఁ బంచి శ్రీపతి యంతన్.

169


సీ.

జయవిజయులఁ జూచి దయ నిటులను మున్ను యోగనిద్రాసక్తి నున్నవేళ
నాచెంత కరుదేర నళినవాసిని నడ్డగించిన మీపైని గినుకపూనె
నదియుఁ దప్పించితి నవనీసురులశాప మలవియె తప్పింప నవనిలోన
నిఁక మీరు దైత్యులై యేడుజన్మంబుల దాస్యంబుచే నీపదంబుఁ జేరఁ


తే.

గోరెదరొ జన్మములమూఁట వైరు లగుచుఁ, జేరెదరొ యన్న వారలు వైరముననె
చేరెద మటంచు మొక్కి కన్నీరు దొరుఁగ, విన్ననై విన్నవించిన వెన్నుఁ డపుడు.

170


వ.

అటు గావింపుఁడని యంగీకరించి యంగనాసంగతుండై భుజంగపుంగవశయ
నుం డంతఃపురంబున కరుగ సరగ జయవిజయులు సముద్రమేఖలకుం జని రుద్ర
భృత్యు లగు భద్రానుభద్రుల రౌద్రాంశంబులం గూడి దితిగర్భంబున నర్భకులై

యున్నవా రిది వారియావిర్భావసమయంబు గావున నఖిలలోకంబు లంధతమ
సమయంబులై యున్నయవి యింకఁ జతుర్భుజనిర్భరకరుణాతిశయంబున మీరు
నిర్భయులు గాఁగలరని హిరణ్యగర్భుం డానతిచ్చిన హవిర్భుఙ్ముఖులు యథేచ్ఛం
జని రంత.

171


తే.

శ్రీవిభుని నామ మెక్కడఁ జెవులఁబడునొ, యంచు మూసినచందాన హస్తపిహిత
కర్ణమై యుద్భవించె నాకశ్యపాగ్ర, దారగర్భంబునందు దైత్యద్వయంబు.

172


పంచచామరము.

ధరంబు లొడ్డగిల్లెఁ ద్రెళ్లెఁ దార లాఱె నగ్ని భా
స్కరుండు మాసె మ్రోసె జంబుకంబు లంబురాసు ల
బ్బురంబు గాఁగఁ గ్రాఁగి పొంగె భూమిఁ గ్రుంగె వాహినీ
ఝరంబు లింకెఁ గొంకెఁ బంకజాతసూతి యత్తఱిన్.

173


తే.

కశ్యపుఁడు వచ్చి కృతజాతకర్ముఁ డగుచు, నగ్రజుఁడు హిరణ్యకశిపుఁ డని సహోద
రుఁడు హిరణ్యాక్షుఁ డనుచును రూఢి గాఁగ, నామకరణంబు గావించె నందనులకు.

174


వ.

అంతఁ బ్రతిదినప్రవర్ధమాను లగు దితిసూనులయం దగ్రజుం డగుహిరణ్యా
క్షుం డక్షీణబలంబున మించె నట్టియెడ.

175


సీ.

అంగుష్ఠమున నిల్చెనా కిరీటము దాఁకి పటపట బ్రహ్మాండభాండ మగలు
నట్టె చేతులు సాఁచెనా పూర్వపశ్చిమచంద్రదినేంద్రులఁ జంకనిఱుకు
వడిగాఁగ నాలుగై దడుగులు నడిచెనా ధారుణీతలము పాతాళ మంటు
నొకయింత ఘనముగా నొడ లుబ్బఁజేసెనా హరిదంతరము లెల్ల నవియఁబారుఁ


తే.

గడిఁది నిట్టూర్పుగాడ్పుల గ్రహగణంబు, లొక్కమూలకుఁ జిక్కు నత్యుగ్రదృష్టి
నిగుడుచోటెల్ల నిగుఱులై యెగయు నట్ట, హాస మొనరింప విధిగుండె లవియుచుండు
వానియౌద్ధత్య మెన్న నెవ్వారితరము.

176


మ.

అసురాధీశుఁడు రోహణాచల సముద్యద్రత్నముల్ సెక్కి ర
మ్యసువర్ణాద్రిని మౌళిఁజేయఁ బరభూషావాప్తికై ఫాలదృ
గ్వసుధాభృన్ముఖలోహముల్ పుటములై వ్రంద న్మణిప్రాప్తి క
న్ని సముద్రంబులు వెళ్లజల్లఁ దలఁచున్ మోహానురూపంబుగన్.

177


వ.

అంత నొక్కనాఁడు.

178


క.

జలరాసు లేడు నొండై, కలసిన జలకేళి సల్పఁగా నిమ్మగు నీ

యిల యేమి నడుమ ననుచుం, దలఁచి హిరణ్యాక్షుఁ డధికదర్పస్ఫురణన్.

179


మ.

నగరంబు ల్నగము ల్నదంబులు నరణ్యంబు ల్నదుల్ లోనుగా
జగతిం జిత్రపటంబు డంబు గనిపింపం జుట్టి చక్షుశ్రవో
జగతిం డాఁచె హిరణ్యనేత్రుఁడు తపశ్చర్యానపర్యాప్రహ
ర్షగభాషాహృదయేశదత్తవరదోస్పారంబు ఘోరంబుగన్.

180


మ.

చటులోచ్ఛ్వాసమరుత్పరంపరలచే సర్వంకషాభ్రంలిహ
స్ఫుటిమ న్మించు మహాపయోధిని సముద్భూతోరిజాతంబు లు
త్కటఘోషంబున ఘూర్ణిల న్ఘనగదాదండంబుచేఁ జెండుచున్
ఘటియించెం జలకేళి హాళిమెయి రక్షస్స్వామి యక్షీణుఁ డై.

181


క.

అది చాలక బ్రహ్మాండం, బుదితము గావించి బాహ్యమున నుదితం బౌ
నుదకమున నీఁదులాడఁగఁ, మదిఁ దలఁచుచు నుండె దితికుమారుం డధిపా.

182


వ.

ఆసమయంబున.

183


క.

స్వాయమ్భువమను వొకనాఁ, డాయంబుజభవునిఁ జేరి యతివయుఁ దాను
న్వేయువిధంబులఁ బొగడుచు, నేయనువున సుగతి గల్గు నెఱిఁగింపు మనన్.

184


క.

వనజాక్షుఁ గూర్చి జన్నము, లొనరించిన సుగతి గలుగు నొండేమిటిచేఁ
గననేర వనుడు నలువకు, మను వనియెం జోటు గాన మఖమున కనఁగన్.

185


ఉ.

ఔ నిది నిక్కువంబు గనకాక్షుఁడు ఘోరతపంబు చేసి నా
చే నవనీతలంబుఁ గొని చేర్చె నధోభువనంబునందు న
ద్దానవుఁ ద్రుంచి భూతల ముదారతరాంబుధిఁ నీరఁ దేల్చఁగా
[5]నేనె సమర్థుఁ డౌదుఁ బరు లెవ్వరు తద్ధర నుద్ధరింపఁగాన్.

186


క.

అని హరి దలఁచుచుఁ దనలో, నను చింత యొనర్చు బ్రహ్మనాసారంధ్రం
బునఁ గిటి యొక్కటి వెలువడి, యెను వడి నంగుష్ఠమాత్రదృశ్యాకృతితోన్.

187


ఉ.

అంతట హంసమాత్ర మయి యాపయి నుక్ష సదృక్షమై గజం
బంతయి యంతమీఁదఁ దుహినాచల మంతయి యీజగంబునా
ద్యంతముఁ దానయై సితసమంచితగాత్ర ముదారపోత్రమున్
దంతురదంష్ట్రలుం దనర దంభకిటీంద్రము దారుణంబుగన్.

188


మ.

ప్రళయారంభవిజృంభితాంబుధరగర్జాతర్జనప్రోజ్జ్వల
ద్గళగంభీరకఠోరఘర్ఘరలతో గర్జింప లోకేశము
ఖ్యులు వర్ణించిరి నైగమోక్తులను రక్షోరాడ్జిగీషావిశృం
ఖలలీలాత్తవరాహవిగ్రహు నమత్కంజచ్చటావిగ్రహున్.

189


వ.

అంత.

190

మ.

ఘనసూచీముఖసూచకాగ్రధవళాంగస్తబ్ధరోమాళి డు
స్పిన బ్రహ్మాండము తూంట్లబానవలె భాసిల్లంగ మై వెంచుచు
న్వనధు ల్పల్వలలీల పంకిలములై వర్తిల్లఁ గ్రీడించుచుం
జని పాతాళము సొచ్చి యెత్తెఁ గిటిరాజన్యుండు కోఱ న్ధరన్.

191


క.

జనమేజయనృప కిటియై, కనకాంబరుఁ డవని నెత్తఁ గనఁడో వినఁడో
కనకాక్షుఁ డూరకుండెనె, యని సేయక నంటివేని యది విను తెలియన్.

192


ఉ.

కాటుకకొండఁ బోలు మెయికాంతి జగంబులఁ జిమ్మచీఁకటుల్
వాటిలఁజేయదే కనకభాసురరత్నవిభూషణప్రభ
ల్మీటయి మించకున్న నని మెచ్చి కనుంగొనువార లెన్న దో
షాటకులీనమౌళి కనకాక్షుఁడు దా నొకనాఁడు వేడుకన్.

193


సీ.

అంజనాచలమౌళి రంజిలు కమలాప్తబింబంబు నాఁ గిరీటంబు దనర
మింట స్వాతిపథంబు మించుసంచున మహోరఃస్థలిఁ దారహారములు వెలయ
సపయోజశైవాల జలరాశివృత ధాత్రి గతి విచిత్రాంబర కటి దనర్ప
జేజేల యెకిమీలఁ జెక్కిన గండపెండారంబు పదమున న్గండుమీఱఁ


తే.

గాలభణభృతఫణాగ్రజాగ్రచ్చిరత్న, రత్నసూచికరోర్మికారాజి మెఱయఁ
గరధృతాయసముసలసింధురము కరణి, వరగదాదండుఁ డై త్రిదివంబు సొరఁగ.

194


క.

అడుగులు దడఁబడఁ బెదవులు, దడపుచు గుండియలు పగుల దడదడయన న
ప్పుడు బెబ్బులిఁగను మృగముల, వడువునఁ దనుఁ గని సుర ల్జవంబునఁ బఱవన్.

195


చ.

కనుఁగొని కేక వేయుచుఁ గికాకిక నవ్వుచు సైన్యనాథులం
గనుఁగొని యెంతశూరు లిదె గన్గొనుఁ డాసురలన్న గాక స్వా
మిని నెదిరింపఁజాలు నొకమేటి గలండె జగత్త్రయంబునం
దన సహజంబెకా యను నహంకరణోక్తుల బిట్టుపల్కుచున్.

196


మ.

అమరావాసము సొచ్చి యచ్చట సుధర్మాస్థానచింతామణీ
రమణీయాసనవాసియై భటహఠప్రత్యాగృహీతామరీ
సముదాయోదితగాననాట్యకలనాసంప్రాప్తసమ్మోదుఁడై
సమరాకాంక్షఁ గృశానుముఖ్యపదము ల్చర్చించి మార్లేమికిన్.

197


చ.

వరుణునిఁ జేరఁబోయి రణవాంఛను వచ్చితిఁ బొరుమన్న నా
శరనిధిభర్త నిన్నెదుర శౌరి సమర్థుఁడు గాక యన్యులో
పరు చనుమన్నఁ బాల్కడలి పజ్జకు నేఁగుచు నున్న నారదుం
డరుదుగ నేఁగుదెంచి దనుజాధిప ‘‘స్వస్తి" యటంచు వెండియున్.

198

మ.

త్వరగాఁ బోయెద వేమికార్య మనినం దైత్యుండు నేఁ బోరికి
న్వరుణుం బిల్చినఁ బోరఁజాలక హరిన్ వర్ణించినం బోయెదన్
హరి వైకుంఠమునం గలండె యన నాహా యిట్టి నీవార్త ముం
దరగానే విని ఘోణియై చనియెఁ బాతాళంబునం దాఁగఁగన్.

199


తే.

ఎందుఁబోయిన బోవ నీ కిపుడు నీవు, వెంటనే పోయి గెలువు మవ్విష్ణు ననుచుఁ
బలుక నారదమౌని నీపాదమాన, పోవనీ నంచుఁ బాతాళమునకు నరిగి.

200


మ.

కనియెం దానవసార్వభౌముఁ డెదుట న్గంభీరపాథోధిమ
ధ్యనిమగ్నావనిభారసంవహనదంష్ట్రాంకూరమంచచ్ఛర
ద్వనభృద్గౌరము వజ్రసారకృతసంధానాంగరుడ్వారమున్
స్తనితాభీలరవానుకారము మహోదారంబు భూదారమున్.

201


వ.

ఇట్లు కనుంగొని.

202


తే.

నాకచరవైరి శౌరి హా పోకుపోకు, మిదిగో వచ్చితి నెందు వోయెదవు పంద
తిరుగుతిరుగు మటన్న నుద్వేలరోష, రసభరంబునఁ గుహ నావరాహ మపుడు.

203


తే.

కోఱఁ దనరారు ధరణీచకోరనయన, వారిరాశిని దేల్చె నవారితాత్మ
శక్తి యాధారముగఁ జేసి శక్తినాథ, ముఖులు నానాబృహద్భానుముఖులు వొగడ.

204


తే.

పర్వతారాతి గురిసె ముద్బాష్పమేఘ, పుష్పవృష్టికిఁ దోడుగాఁ బుష్పవృష్టి
పర్వతారాతి భాస్వరప్రభల నజయ, దానవోత్పాతమునకు నిదాన మయ్యె.

205


వ.

ఇవ్విధంబున నవ్వరాహమూర్ధన్యుం డనన్యసామాన్యవిరోధిరమాన్యకార
మాన్యబలంబునం గువలయంబుం గువలయంబుచందంబునఁ గమలాకరంబు
నం దేలించి మదాభంగురమాతంగపుంగవసముత్తుంగబృంహితంబునం
గెరలు కొదమసింగంబు తెఱంగునఁ గిఱుక్కునఁ దిరిగి యిట్టట్టు సనక పులి
తోలుగట్టు వేలుపుగట్టువలె పీఁట వెట్టి ముట్టె బిగించి వెన్నుసట లుబ్బ సెలవులు
సప్పరించుచు వేఁడిమిడుంగుఱులు వొడమ నిడుదక్రొవ్వాడికోఱలు దీఁటుచు
దీర్ఘనిర్ఘాతఘర్ఘరముర్ఖురనిర్ఘోషంబుల బ్రహ్మాండభాండంబు పటపటం బగిలించు
జండ్రనిప్పులకరణి వేండ్రంబై తీండ్రించుచూపులం జుఱచుఱం గనుచుఁ
గదిసిన నసురపతి యట్టహాసంబు చేసి యిట్లనియె.

206


తే.

హరి వగుటఁ జేసి మును పంది వగుట నిక్కు, వంబు తుది నేఁడు నీవికారంబు నొంది
పంది వైతివి నేను సొంపంది యుందుఁ, బంది వేఁటాడుటకుఁ గోర్కి ఫలితమయ్యె.

207

ఉ.

వాసవదంతి దంతములు వల్ల దిభాస్యున కొంటికొమ్ము గాఁ
గా సరిపోవ దేకరణిఁ గాంతకు దంతపుఁ బావలిత్తునం
చాసను గ్రుమ్మరం గలిగె నాదివరాహమ నీదుకొమ్ము నేఁ
జేసిన యత్నము ల్ఫలము జెందెను తావకదర్శనంబునన్.

208


ఉ.

వీరుఁడ వంచు నిన్నుఁ బదివేలవిధంబులఁ బ్రస్తుతించుచు
న్వారిధిభర్త దెల్ప విని వచ్చితి మెచ్చెద నేఁడు చూపు నీ
వీరతఁ గాందిశీకపద వీరతవృత్తిని మోరత్రోపునం
బాఱెదనన్నఁ బోవిడఁడు స్వర్ణవిలోచనుఁ డంచు నుగ్రుఁడై.

209


ఉ.

దండము పెట్టఁగా సురవితానము లందును భక్తిసేయకన్
దండము బెట్టుగా విసరి దైత్యుఁడు వేసినఁ బొందెతూఁట వే
దండముఁ దాఁకినట్లు కిటి దాఁకి యదంతట ఖండమైన కో
దండముఁ బూని వాఁడు నిశితప్రదరంబులు గాఁడనేయఁగన్.

210


తే.

సెలసి కొట్టిన కిటికోఱ జీరవారి, కనకనయనునిబలుమేనఁ గాననయ్యె
వలపు మీఱఁగ నిడు మృత్యువనరుహాక్షి, వాఁడికొనగోఁట జీరె నా వసుమతీశ.

211


వ.

అంత.

212


మ.

శునకంబుంబలెఁ జుట్టుముట్టుకొను రక్షోవీరు దంష్ట్రాహతిం
దునుక ల్చేసి తేదీయసైన్యములఁ బొందు ల్వాపి తద్రక్తసి
క్తనవీనాంబుధి నోలలాడుచును భూదారేంద్రుఁ డెప్పంటిమే
రను దాల్చెన్ సురలెల్ల గోరఁ దనకోఱ న్ధారుణీమండలిన్.

213


సీ.

తమ్మికన్నుల మరందముదశ్రువులు జాఱ నెలదేఁటిచూపులు బెళుకుఁజూప
శైలవక్షోజము ల్ఝర ఘర్మమున దోగి మబ్బువన్నియపైఁట మాటుకొనఁగ
నబ్జాకరాస్య మోహనభంగవిభ్రమభ్రూవిలాసంబులు పొల్పు మిగుల
మహితనితంబబింబము నొరయుచు యమునావేణి వెనుచాయ నటన దెల్ప


తే.

రంధ్రనాభియు వనరోమరాజి మెఱయఁ, దనులత చలింపఁ గపటభూదారకాంత
దంతకోరకఘట్టితాధర నవోఢ, వసుమతీకాంత యానందవార్ధిఁ దేలె.

214


మ.

పరికింపం గిటికోఱ దంతమయ దీపస్తంభమై యొప్పె పై
పరిశోభిల్లెడుధాత్రి పాత్రవలెఁ జూపట్టెం దదగ్రాల్పపు
ష్కరముల్ తైలములీలఁ బొల్చెఁ గనకగ్రావంబు దీపంబువై
ఖరిఁ బెంపొందెఁ దదంతదీపశిఖవీఁక న్మించె మేఘాళియున్.

215

వ.

అంత.

216


క.

దితిజనిశాధవరాహున్, శ్రితదురితేందీవరాహు శ్వేతవరాహున్
నుతియించి రవుడు శతధృతి, శతమఖముఖవహ్నిముఖులు సన్ముఖు లగుచున్.

217


శా.

ఆహా యజ్ఞవరాహమూర్తి వగు టీ వాశ్చర్యమే విస్ఫుర
దేహచ్ఛాయలు పౌండరీకరుచి జ్యోతిష్టోమలీలన్సమ
సాహార్యచ్ఛదవిచ్ఛిదచ్ఛహరిమేధారూఢిఁ జాటం భవ
న్మాహత్మ్యంబు నుతింప నేరుతుమె దంభక్రోడచూడామణీ.

218


సీ.

క్రూరారికోటీరకురువిందములఁ గాని కురువిందముల నెందు గ్రొచ్చఁబోవు
పరిపంధిబహురక్తపల్వలంబులఁ గాని పల్వలంబులఁ గ్రీడఁ బడయఁబోవు
వైరివీరనిశాటవంశంబులను గాని వంశంబు లెందును వంచఁబోవు
బలసమేధితపలాశులఁగాని వెఱపలాశులఁ గొమ్ముచే నేలఁ గలుపఁబోవు


తే.

ఘోణిమాత్రంబవే దితిప్రాణదనుజ, పాణిగతఖండనఖయురక్షోణి నీల
వేణికోద్ధారచణదంష్ట్రికాణిమేత, రబల శమితార్తి కుహనావరాహమూర్తి.

219


చ.

వలపున నీవు ముద్దుఁ గొనవచ్చిన నీదగుమోము సూచి పో
యలసితి వందగాఁడవని యంబుజగేహిని గేలి సేయఁ దా
జెలిమిని నీకు ముద్దొసఁగఁ జేరినయట్టి క్షమావధూటితోఁ
గలసితి వెందు నోర్పు గలకాంత శుభాన్వితయౌఁ గిటీశ్వరా.

220


సీ.

గిరిరాజఘర్షీంద్రకరిమదధారనా శ్రీకంధరాకాశశిఖ యనంగ
వజ్రసౌధాగ్రభాస్వరహరిన్మణి యనఁ గల్పశాఖాకలకంఠి యనఁగ
గౌరాబ్జకోరకకలహంసిక యనంగఁ గేతకీకుసుమభృంగిక యనంగ
మౌక్తికైకస్తంభమఘవాశ్మగృహ మన వారిభదంతశైవాల మనఁగ


తే.

నున్ముఖాహీంద్రలోచనద్యుతి యనంగ, నవ్యతావకదంష్ట్రికానాళమునను
గువలయంబనఁ జెలువం దెఁగువలయంబు, రక్షితావనిదేవ వరాహదేవ.

221


క.

అని పొగడెడు బ్రహ్మాదుల, ఘనకృప నీక్షించి దంష్ట్రికాభూసతికిన్
వినుపించె నఖిలధర్మము, లనుగపటకిటీంద్ర ముల్లసద్వాక్యములన్.

222


క.

తొలుతఁ బెనుగంటి సుట్టుట, వలనం జాపవలె ముడుగు వసుధాస్థలిపై
గులగిరులఁ జేసి యెల్లెడ, నిలిపె నజుఁడు ముడుఁగకుండ నేరుపు మెఱయన్.

223


చ.

పురము ల్గ్రామములు న్నదు ల్సరసు లంభోదు ల్వను ల్ద్వీపము
ల్గిరులు న్విప్రనృపార్యశూద్రకులు సంకీర్ణోద్భవుల్ తేరులుం
గరులుం దేజులు ధేనువు ల్ధధనమణు ల్కాంతాదులుం గల్గి భా
స్వరయయ్యెం ధర యప్పు డంబురుహభూసంకల్పమాత్రంబునన్.

224


క.

ఆయెడ బహుయజ్ఞంబులు, స్వాయంభువమనువు భక్తి సల్పెన్ లక్ష్మీ
నాయకుఁడుఁ బ్రీతుఁడై ని, శ్రేయస మెసఁగన్ యథేష్టసిద్ధుల నొసఁగెన్.

225

ఉ.

శ్వేతవరాహకల్ప మిది వేఁడుక నీ కెఱిఁగించితిన్ జగ
త్ఖ్యాతికిటీంద్రచర్య కుతుకంబున విన్నఁ బఠించినన్ జన
వ్రాతము గాంచు నద్వరవరాహకృప న్నిఖిలేప్సితార్థసం
ఘాతము విష్ణుభక్తతిలకా జనమేజయభూమిపాలకా.

226


క.

అని శ్రీవైశంపాయన, మునిముఖ్యుఁడు దెల్ప విని ప్రమోదాన్వితుఁడై
జనమేజయుఁ డవ్వలికథ, యనఘా వినవలతుఁ దెల్పుఁ డని యడుగుటయున్.

227


శా.

శ్రీరంగ త్కరుణాకటాక్షతపన శ్రీముష్ణతీక్ష్ణవ్రతా
పారామాకుచకుంభఘోణవిలసత్పత్త్రాంక కాశీశ్వర
శ్రీరామేశ్వరకీర్తివారినిధి కాంచీరక్షణోపాయవ్యా
హారప్రౌఢిమ ధైర్యశేషగిరి దృప్తా యోధ్యమాయాతిగా.

228


క.

భారతశాస్త్రార్థప్రతి, భారత మత్యూఢ ధరణి భారతమోను
ద్భారతపారీణయశో, భారతబింబాస్యభృత్య భారతభృతిదా.

229


పంచచామరము.

హిరణ్యగర్భముఖ్యదానహృష్టశిష్టశేముషీ
హిరణ్యగర్భభామినీసమీహితాంగసుప్రభా
హిరణ్యగర్భవైభవాఢ్యహృత్సరోజవిస్ఫుర
ద్ధిరణ్యగర్భభేదిధైర్య హేమభూమిభృద్వరా.

230


గద్య.

ఇది శ్రీరామభద్రదయాభిరామభద్రకరుణాకటాక్షవీక్షాపరిప్రాప్తదీప్తతరాష్ట
భాషాకవిత్వసామ్రాజ్యధౌరేయ సకలవిద్వత్కవిజనవిధేయ ధరణిదేవుల నాగ
నామాత్యసుధాసముద్రసమున్నిద్రపూర్ణిమాచంద్ర రామమంత్రీంద్రప్రణీతం
బైనదశావతారచరిత్రం బనుమహాప్రబంధంబునందుఁ దృతీయాశ్వాసము.


3. వరాహావతారకథ సమాప్తము.

  1. క. శ్రీరాజితవీరాజిత, ఘోరాజితలప్రవీణకుశలధురీణా
            ధారాధరధారాధర, ధారాధరకీర్తితృష్ణ దవనముకృష్ణా!
  2. ఁ బ్రాణనాథ
  3. పటోపాధి
  4. యామూలముగఁ
  5. నేనె సమర్ధుఁడం బరు లిఁ కెవ్వరు