దశావతారచరిత్రము/4. నరసింహావతారకథ

వికీసోర్స్ నుండి

4. నరసింహావతారకథ

చతుర్థాశ్వాసము



మద్వేంకటశైల
స్వామి కృపావర్ధమాన వైభవరేఖా
ధామేయ యసమసమర
క్ష్మామండలనూత్నకృష్ణ మగదలకృష్ణా!

1


తే.

అవధరింపుము జనమేజయక్షితీశ, శేఖరున కిట్టులను వ్యాసశిష్యమౌని
ధరణినాథ నృసింహావతార మిఁకను, దెలియఁ జెప్పెద విను మని తెలుపఁదొడఁగె.

2


శా.

శ్రీలీలావతి నవ్వనేటికని ఘర్షింపంగ నేనవ్వనో
బాలా సాజము సింహవక్త్రమున కీపారీంద్రచిత్రంబు నీ
వాలోకింపు మటంచుఁ గుడ్యమున జాయంజూపి నవ్వింపఁజా
ల్శ్రీలక్ష్మీనరసింహమూర్తి యొసఁగున్ క్షేమంబు భక్తాళికిన్.

3


సీ.

కనకాంబరునిచేతఁ గనకనేత్రుఁడు గూలె ననుమాట చెవినాటఁ గనలి కనక
కశిపుఁ డత్యుగ్రుఁడై కాలకాలాంతకులీల శూలము గేలఁ గీలుగొల్పి
వెలిహజారముఁ జేరి విప్రజిత్యాదిదైత్యులఁ జూచి వింటిరె యొక్కవింత
హరికిరియై హిరణ్యాక్షు విదారించి చనెనఁట తా నెందుఁ జనెడివాఁడు


తే.

చోరతనమున వారాశిఁ జొచ్చెనేనిఁ, గూర్మమై భూధరముక్రిందఁ గ్రుంకెనేని
బోత్రియై వని జేరినఁ బోవనీక, పట్టి వధియింతు నెంజిలి బాపుకొందు.

4


క.

ఆరీతి దగులకుండిన, సారెకు గోవిప్రహింస సల్పుడు తద్ర
క్షారతిఁ జేరిన శౌరిని, వారించెద నంచుఁ బంప వారు యథేచ్ఛన్.

5


క.

తడ విడిచిన పాములవలెఁ, బుడమిని నెల్లెడల నిండి భూసురవరుల
న్గెడపుచు గోగణములఁ బడ, నడుచుచుఁ జరియించి రంతకాకృతు లగుచున్.

6


తే.

దైత్యనాయకుఁ డంత సోదరునిపాటుఁ, జూచి శోకార్తుఁ డగుచుఁ దత్సుతుల శకుని

శంబరాదులఁ దత్ప్రియసతుల జననిఁ, గాంచి యిట్లనుఁ గడువివేకంబు దొరయ.

7


శా.

సామాన్యుండె హిరణ్యనేత్రుఁడు భుజాశౌర్యంబుచే భీమసం
గ్రామక్షోణుల గెల్వఁడే మునుపు సుత్రామాదుల న్నిస్సమ
శ్రీమత్వంబున మించఁడే గనఁడె కీర్తిం గాలధర్మంబుచే
నీమే న్వీడినయంత దీని కిటఁ దల్లీ యేల దుఃఖింపఁగన్.

8


శా.

వీరుండై జనియించి నప్పుడ రణోర్వి న్వైరుల న్దోర్బలో
దారత్వంబునఁ గెల్వఁగావలయు లేదా ఱొమ్ముగాయమ్ముల
న్వీరస్వర్గము గాంచఁగావలయు నింతేకాని వేఱొండు లే
దౌరా రెండును గాంచె నీతనయుఁ డేలా యింత జాలింబడన్.

9


శా.

నీపుత్త్రుం డితఁడంచు దుఃఖపడె దెంతో దేహమో జీవుఁడో
నీపుత్త్రుం డిట దేహమాత్ర మని యంటే కాదు జీవుండన
న్నీపుత్త్రుం డిపు డైనఁ గర్మగతి నెందే పూర్వముం బుట్టఁడో
రేపున్ బుట్టఁడొ యింక నెవ్వరికిఁ బుత్త్రీభావ మాద్యం బగున్.

10


క.

వినవే మున్ను సుయజ్ఞుం, డను నౌశీనరనరేంద్రుఁ డరిహతుఁడై భూ
మినిఁ బడ నాతనిపైఁ బడి, తనయులు పత్నులును బంధుతతి విలపింపన్.

11


క.

కాలుం డచటికిఁ తా నొక, బాలుండై వచ్చి ప్రేత బంధుల సుతులన్
బాలామణులం గనుఁగొని, యేలా శోకింప నెఱుఁగరే కాలంబున్.

12


క.

తా నిత్యుండై పోయిన, వానికిఁ జింతింపఁ బోయ వలఁబడుసతికిన్
లోనడరి యొకకుళింగము, వానికి లోనయ్యె శరము వైవఁగఁ బిదపన్.

13


క.

అని బుద్ధి సెప్పి వారల, ఘనశోకము మాన్పి యముఁడు గ్రమ్మఱెఁగానం
జననీ గతజీవులకుం, జనునే దుఃఖంపఁ దత్త్వసంవేదులకున్.

14


సీ.

అంభోజసంభవుఁ డాదిగా నల నవబ్రహ్మలు నిర్మాణపటిమ గనుట
శతపత్త్రనేత్రుండు శత్రులోకభయంకరంబైన దివ్యచక్రంబు గనుట
వెన్నెలవిరిదాల్పువేలుపు భువనమోహనసర్వమంగళావాప్తుఁ డగుట
భృగుముఖ్యు లగుమహాఋషులు బ్రహ్మాదుల శపియింపఁజాలు దౌష్ట్యంబు గనుట


తే.

నైదుసంవత్సరములప్రాయమున ధ్రువుఁడు, నిఖిలలోకోన్నతంబైన నెలవు గనుట
దపము చేసియె కాదె యంతటి తపంబు, నేను గావించి కాంచెద నిష్టసిద్ధి.

15


క.

అని యనిపించుక యమృతా, ద్యనుపమవస్తువుల నిచ్చె హరి కీగిరియం
చును మెచ్చుచు మందరనగ, మున కేఁగి తదగ్రసీమమున మునివృత్తిన్.

16


సీ.

తృణభక్షణము చేసి తిరుగవె ధేనువు ల్జలముల మనవె యాజలచరములు
గాలి యాహారంబుగా నుండవే ఫణు ల్మధుపానమునను ద్రిమ్మరవె తేంట్లు

ఫలరసంబులు గ్రోలీ చిలుకలు చెలఁగవె యిగురులు మేసి కోయిలలు దగవె
బిసఖండములు మేసి పెఱుఁగవె రాయంచ లబ్బిందువులఁ జాతకాళి మనదె


తే.

యొకటి యశనంబుగాఁ గొనియుంట తపమె, యని నిరాహారుఁడై పాద మంగుటమున
నేల నిల్పి ఖరాంశుపై నిల్పి దృష్టి, విబుధపరిపంథితపము గావించుచుండె.

17


వ.

అంత.

18


మ.

ఒకనాఁ డింద్రుఁడు వైజయంతమణిసౌధోదగ్రభాగంబునన్
సకియల్గొందఱు కుంచగిండిసురటుల్ సామ్రాణి పొంజాలవ
ల్లిక గాళాంజియుఁ బూని కొల్వఁగ శచీలీలావతింగూడి గాయక
చంద్రాస్యలగానము ల్వినుదుఁ గొల్వై యుండె మోదంబునన్.

19


మ.

స్వకదేహంబు తెఱంగునన్ బహుగవాక్షస్ఫూర్తి రాజిల్లు జా
లకమార్గంబులఁ గేళికాకుతుకబాలావృత్తవక్షోజకో
రకకాశ్మీరకురంగికామదవిమశ్రంబై త్రివేణీగతిన్
రకమౌ నాకధునిం గనుంగొని వధూరత్నంబుతో నిట్లనున్.

20


మ.

జిలుగుంబయ్యెద చాటునం గులుకు నీసిబ్బెంపుఁజన్ దోయినాఁ
జెలువయ్యెం జలజాతకోశములు హంసీపక్షవిక్షేపచం
చలగంగోర్ములఁజక్రవాకనఖలక్ష్మంబు ల్విశేషంబులం
దుల నిందుం గలిగింపఁగావలదె తోడ్తోఁ బద్మకోశస్తనీ.

21


మ.

అనినం జాలు మఱేమియంచు శచి యొయ్యారంపులేనవ్వు జం
కెనవాల్చూపులు చిన్నికిన్కఁ దెలుపం గెందమ్మిపూమొగ్గచేఁ
దను వైవం గని భర్త గుబ్బయని మెత్త న్గోర నొత్త న్నితం
బిని సీత్కారముతోడఁ జొక్కుచును గప్పెం బైఁట నున్సిగ్గునన్.

22


తే.

మఱియు నాయావిశేషము ల్మత్తభృంగ, వేణి కెఱిఁగించుచును రాజవీథిలోన
సత్వరంబుగఁ జనుదెంచు చారుఁ గాంచి, యేవిశేషంబు గల్గెనో యిల నటంచు.

23


క.

అక్కడికిఁ బిల్వనంపిన, గ్రక్కునవాఁ డరుగుదెంచి కడువినయముతో
మ్రొక్కి పరాకు సురేశ్వర, యొక్కవిశేషంబు గల్లె నుర్వీస్థలిపై.

24


తే.

కనకకశిపుండు ధీరుండు గనకకడఁగి, తవము సేయంగఁ దొడఁగె నాతపము శీత
మంచు నెంచక కదలనిమంచుగట్టు, దారిదారితకుధరమదారిభిదుర.

25


చ.

తపముల కేమి దానవులు దైత్యులు సల్పరొ కోర్కు లందరో
చపలతఁ గొందఱందు నెలజవ్వనులం గయికోరొ వారితో
నుపమకు రాఁడు వీఁడు గడునుగ్రపునిష్ఠ వహించె నింక నే
యుపమను మాన్పఁగావలెనొ యూహ మొనర్పు సుపర్వవల్లభా.

26

తే.

చండవాతోత్థభూరజోహిండనమునఁ, గొండమెండునఁ గదలకయుండు దైత్య
మండలేంద్రునిదేహ ముద్దండముగను, గండకండూతి నొఱయు వేదండగణము.

27


తే.

మానస మచంచలంబైన మట్టుపడెనొ, గాక నాసాబిలంబులఁ గ్రందుకొన్న
చిలువగుంపులు మేసెనో తెలియరాదు, వెలివి సరదయ్యె దైత్యేంద్రవిభుని యూర్పు.

28


తే.

పవనమున నిండి వానలఁ బదనుగన్న, రజముపైఁ గూళ్లు వెట్టిన ద్విజకులంబు
రెట్టలో విత్తుగమి యంకురింప శుక్ర, శిష్యశేఖరు చెవులలోఁ జెట్లు మొలచె.

29


తే.

ఇంక నొకవింత యాదానవేంద్రుకడిఁది, మేనఁ బుట్టిన పుట్టక్రొమ్మెఱుగుఁగోళ్ల
గ్రుచ్చి తేనియఁ గైకొను నిచ్చనిచ్చ, నచ్చభల్లంబు లచ్చట నచ్చుపడఁగ.

30


చ.

శిరసుననున్న తేనె పెఱశీతమయూఖునిరేఖగా నభం
గురతరదేహయష్టిఁ బెనఁగొన్న భుజంగకదంబకంబు లా
భరణములై దగ న్శుకవిపాటిచూతఫలస్రవస్మరం
దరసము గంగగాఁ దపము దైత్యుఁ డొనర్చు మహోగ్రవైఖరిన్.

31


క.

అని వినిపించిన విని మిం, చినభయమున నింద్రుఁ డనుపఁ జెలువలతోడం
గనకాంగి యల్ల మందర, మునకుం జని హావభావములు దళుకొత్తన్.

32


క.

ఆటలఁ బాటల మాటలఁ, దేటల నలపింపలేక దితిజాధీశుం
బాటలగంధి బలాసుర, పాటనుకడ కేఁగుదెంచి భయవినయములన్.

33


చ.

పలికిన మోముఁ జూపినను బాడిన నాడినఁ గేల నంటిన
న్గలకల నవ్విన న్ననుచు గా భువి నెల్ల పలాశిబృంద మం
చలవునఁ బోయి నేనలపలాశిని డగ్గఱి స్థాణువైఖరి
న్నిలువఁగఁ జూచి వచ్చితిని నేర్పు వితాచనఁగా సురేశ్వరా.

34


క.

నీచిత్త మింకమీఁదట, నాచేతం గాదటన్న నారీమణి యిం
కేచంద మనుచు మది నా, లోచన చేయుచు సహస్రలోచనుఁ డుండెన్.

35


ఉ.

అంతటఁ గొంతకాలమున కచ్చటి కొక్కచరుండు వచ్చి వృ
త్తాంతక దానవేశ్వరుఁ డుదారతపస్థితి నున్న దేహ మా
ద్యంతము మక్షిక ల్మసలె నస్థులనంటుక జీవముంట మా
కింతయుఁ దోఁచ దన్న దివిజేశ్వరుఁ డెంతయు సంతసంబునన్.

36


క.

మన కిదియే సమయం బిఁక, నని యన్యనిశాటకోటి నణఁగింప నటం
చును వజ్రి కుమారునిఁ జూ, చిన మంచిద యనుచు నతఁడు సేనలు గూర్చెన్.

37


మ.

జలధివ్యంజితశాదము ల్ప్రళయగర్జన్మేఘసంవాదము
ల్దళితక్ష్మాధరపాదము ల్దనుజకాంతాగర్భనిర్భేదము

ల్బలపన్నిర్జరమోదము ల్ప్రకటితబ్రహ్మాండవిచ్ఛేదము
ల్బలిసె న్భేరినినాదము ల్కృతసురప్రత్యర్థిఖేదంబు లై.

38


సీ.

గంధాంధపరిపంథీకంధిమంథవసుంధరాధరన్మదసింధురములు గదల
సర్వపూర్వసుపర్వదుర్వారగర్వదూర్వాపర్వచర్వణార్వములు నడవ
శృంగవన్మదభంగచంగరథాంగసంగతతుంగతరశతాంగములు వెడల
దుర్భావగార్భిణ్యగర్భనిర్భేదనప్రబలార్భటుల వీరభటులు సాగ


తే.

వీరదోహళకాహళీవివిధవాద్య, వారఘోషంబు వందికైవారరవము
దారుణంబయి భూనభోంతరము లలమ, శక్రుఁ డసురేంద్రుపట్టణ మాక్రమించి.

39


క.

యుద్ధము సేయఁగ నపుడు స, ముత్థబలాధికులు దానవేంద్రుని తనయుల్
క్రుద్ధులయి దనుజసైనికు, లుధ్ధతులై కొలువఁ దాఁకి రుత్సాహముతోన్.

40


క.

పెద్దపులి వెడలి చనెనని, గద్దఱితనమునను నక్కకదుపులు పొదలో
నుద్దవిడిఁ జొచ్చి చిఱుతల, యొద్దంబడినట్టు లయ్యె నోయమరేంద్రా.

41


తే.

ఎందుఁబోయిన నింకఁ బోనీము నిన్నుఁ, బట్టి ద్రుంతుము దైత్యేంద్రుపాదమాన
నిలువు క్షణమాత్ర మనుచు నిర్నిద్రరోష, రసభరంబున దారుణాస్త్రములు గురియ.

42


మ.

శలభీశాబగరున్మరత్కులముచేఁ జల్లాఱునే దావిక
జ్వలనజ్వాలిక యేల యీ తెగువ రక్షఃపుత్రులారా తెగ
స్వల దెందేఁ జనుఁ డద్రినిర్దళనమద్వజ్రంబు జిల్లేడురె
మ్మలపైఁ బాఱదటంచు వాసవుఁడు సామర్థ్యంబు సూచించుచున్.

43


మ.

శరవర్షంబున ముంప దైత్యతనయు ల్శౌర్యంబుతోఁ బోర ని
ర్జరలోకేశ్వరుఁ డంతవజ్రముగొన న్సైరింపఁగాలేక శా
తరులై యూడనిఁబాడి రన్యదనుజాతస్తోమము ల్మళ్లెఁ ద్రు
ళ్లె రణోత్సేకము తక్కి యింద్రుఁడు బలాళింగూడి యత్యుద్ధతిన్.

44


చ.

నగరము సొచ్చి హేమలలనామణి పట్టదుకూలముఖ్యవ
స్తుగణముఁ గొల్లలాడుచును దోడనె యంతిపురంబు సొచ్చిన
న్మృగపతిఁగన్న పద్మినులయేపున నెంతయు దత్తఱించుచున్
మగువలు సాలభంజికల మాటున డాఁగిరి కొంద ఱత్తరిన్.

45


సీ.

గమనించుచో మ్రోయు కటకము ల్కీలూడ్ప మలుచుట్టు బిగియించుమందగమన
యొకమూల డాఁగి మైచకచక ల్పరికించి కలఁగి పయ్యెద మేనుఁ గప్పువెలఁది
తొట్రిలు భయమునఁ ద్రోవఁ గానఁగలేక నివ్వెఱపాటుతో నిలుచునెలఁత
గాళ్లు కుప్పవడంగఁ గదలఁజాలక యట్టె నిడిముసుంగిడి శయనించుచెలువ

తే.

యుదిరికంబంబు మఱుఁగున నొదుఁగురమణి, డాఁగఁబోయి సమక్షంబు డాయుతరుణి
స్వీయు లంచును బరులను వేఁడు కలికిఁ, గలసి యంతఃపురంబు చీకాకువడియె.

46


చ.

అదరున నిల్లు పొచ్చి యమృతాశనుఁ డొక్కఁడు దల్పుమూల యం
దొదిఁగినఁ దన్ను నీడ్వఁ బద యూరకె వచ్చెద నంచు నాలుగే
న్పదములు వెంటఁబోయి కలపంబిదె తెచ్చెద నుండుమంచుఁ దా
సదనము చేరి తల్పు గెడసాచె నొకానొకకాంత నేర్పునన్.

47


వ.

అప్పుడు.

48


సీ.

జిగిమేనియోరలఁ దగునంపజీరలు గొనగోటితాఁకుల కోపు సూప
వడి నౌడు గఱచుచో వాతెఱనంటిన మొనపంటివగఁ గంటిమురువు నెఱప
ఱొమ్ముగాయముల రక్తమ్ము గాఢాశ్లిష్టకుచకుంభలగ్నకుంకుమము దెలుప
నతిరోషశోణంబులగు నేత్రకోణము ల్లీలమై నిద్దురలేమిఁ జాటఁ


తే.

జాఱుసికఁదోఁగు చెమ్మట శ్రమము గాఁగ, వీరశృంగారరసములు వియ్యమంద
విజయలక్ష్మీవధూసంగవిభ్రమంబు, లభినయింప నిలింపలోకాధివిభుఁడు.

49


మ.

వలచే వజ్రము ఱొమ్ములో బిగువు గర్వంబుం బ్రమోదంబు మీ
సలలో నవ్వు నొయారముం జెలఁగ నుత్సాహంబుతోఁ బాదమం
జులమంజీరఝళంఝళ ల్వెలయ రక్షోనాథశుద్ధాంతకాం
తల నీక్షించుచు భీతి దక్కి నలుచెంత ల్సూచుచు న్ముందటన్.

50


మ.

కులుకుందంతపుబొమ్మ చెక్కడపుబల్కంబంపు మేల్బోదెలం
దళమౌ నీలపుఱాలదూలములపైఁ దార్కొన్న నున్పచ్చదం
తెల దాపించిన కెంపుటిట్టికలసందిం బొంది రావజ్రగా
రెలఁ జెన్నౌ నొకగట్టిచప్పరములో రేరాచరాతిన్నియన్.

51


శా.

కాంతల్ క్షేమముఁ గోరి సేయు వ్రతసంఘాతంబుచే నంగ మ
త్యంతంబుం గృశ మయ్యుఁ జంద్రశకలోదారప్రభ న్మీఱఁగాఁ
జెంతన్ దానవదైత్యరాజతరుణు ల్సేవింపఁగా నెంతయుం
జింత న్జెందునిశాచరేశ్వరునిరాజీవాక్షి దౌదవ్వునన్.

52


తే.

తను విలోకించి సింగంబుఁ గనినకరిణి, కరణిఁ దత్తఱమంది మందిరము సొరఁగ
నెందుఁ బోయెదవంచుఁ బూర్ణేందువదన, వేణిఁ బట్టీడ్చెఁ గదిసి గీర్వాణవిభుఁడు.

53

చ.

తళుకులు గుల్కు బెళ్కుఁగనుదమ్ముల నశ్రుమరందబిందువుల్
దొలఁగ మెఱుంగుచన్బొగడదోయి వడంక శిరోజషట్పదా
వలి చెదర న్భుజాలతలు వాడ గజోద్ధృతపద్మినీక్రియం
దలఁకె సురారినారి గిరివైరికరాహృతకేశపాశ యై.

54


తే.

దైత్యసామ్రాజ్యలక్ష్మి చందమున నడలు, తరళలోచనఁ దెచ్చి రథంబుమీఁద
నుంచి యమరావతికిఁ జనఁ గాంచనాంగి, మూర్ఛఁ దెప్పిరి యిట్లని మొఱలు వెట్టె.

55


క.

ఈయెడ నను జెఱవెట్టుక, పోయెడి విభుఁ డిందు లేమిఁ బురుహూతుం డ
న్యాయము నెన్నక మునులా, రా యనదను నన్నుఁ గావుఁడని మొఱ యిడఁగన్.

56


ఉ.

గౌరశరీరకాంతితరగ ల్జడగుంపు ప్రవాళవల్లరీ
వారము వల్లకీరవ మవారితనాదము గాఁగ మూర్తమౌ
క్షీరధివైఖరి న్హృదయసీమ సునిష్ఠితనీరజాక్షుఁడౌ
నారదుఁ డేగుదెంచి సురనాథున కడ్డమువచ్చి యత్తఱిన్.

57


ఉ.

ఈనలినాక్షి యెవ్వతె సురేశ్వర నారద మీ రెఱుంగరే
దానవసార్వభౌము వనితామణి యాతని సంగరంబులో
నాని జయించితే సమసె నాతఁడు ఘోరతపంబుచేత న
జ్ఞానివె నొత్తురే తపము సల్పినవార లెఱుంగ వేమియున్.

58


మ.

ఇదిగో రేపె తపఃప్రభావమున వాణీశాను మెప్పించి మీ
పదముల్ గైకొననున్నవాఁడు విబుధప్రత్యర్థి సామాన్యుఁడే
త్రిదశాధీశ్వర విూదెఱుంగక మదోద్రేకంబుతో నేఁడు త
త్సుదతీరత్నము నేల తెచ్చి తిటుల న్శోకింప నెంతేనియున్.

59


సీ.

కురులు నున్నఁగ దువ్వి కొప్పుపెట్టెనె కాని తోరంపువిరిసరు ల్దురుమఁబోదు
పొలుపొందఁ గుంకుమబొట్టు పెట్టెనె కాని ముద్దుగాఁ దిలకంబు దిద్దబోదు
పాటిగా నెమ్మేనఁ బసుపుపూయునె కాని యందమౌ కలప మలందఁబోదు
పతికి సేమముఁ గోరి వ్రతము సేయునె కాని శృంగారవని విహరింపఁబోదు


తే.

కంటె తాలిబొట్టు కమ్మలు కడియంబు, లొక్కవన్నెచీరె యొకటి రెండు
వీడియములె కాని విభవముల్ గలిగియు, వల్లకుండు దైత్యవరపురంధ్రి.

60


క.

పరమపతివ్రత యగునీ, కరిగమనమనంబు నొవ్వఁ గాఱించిన నీ
దురితం బెంతకుఁ జాలదు, సురనాయక నీకు రాజ్యసుఖ మే దింకన్.

61


క.

విక్రమ మని యెంచకు నీ, విక్రమ మక్రమము విడువు మీసతి ననినన్
శుక్రాంతేవాసీవని, శుక్రుఁడు శక్రుండు నలువచూలికి ననియెన్.

62

ఉ.

తాపసనాథశేఖర ప్రతాప మటంచును దెచ్చినాఁడనే
కోపనగర్భసీమ నతిఘోరనిశాచరరాజతేజ ము
ద్దీపితమౌటఁ జేసి సుదతీమణి పుత్రునిఁ గాంచినప్పుడేఁ
గోపముదీఱ వాని శతకోటి హరించెద నంచుఁ దెచ్చితిన్.

63


వ.

అనిన సంక్రందనునకు శతానందనందనుం డిట్లనియె.

64


మ.

అతినైర్మల్యము గల్గి వైష్ణవకిరీటాలంక్రియాయోగ్య మై
హతదోషంబున వజ్రభేద్యతరమై యష్టాంగయోగాఢ్యమై
యితరాకల్పితరంధ్రమై సురుచియై యేతన్మహాదైత్యరా
టృతిగర్భాఖ్యఖనిం జనించు శిశువజ్రం బద్రినిర్భేదనా.

65


క.

నీచే సాధ్యుఁడె హరిపూ, జాచతురుఁ డతండు గాన జలజాతముఖ
న్నాచెంత నునిచి పొమ్మన, వాచంయమివరునితోడ వాసవుఁ డనియెన్.

66


మ.

తరుణీగర్భసముద్భవుండు హరిభక్తిశ్రేష్ఠకుం డంచు నీ
శ్వర మీ రానతి యిచ్చుట న్విడిచెదం జంద్రాననం గాని త
ద్వరదోశ్శక్తికి నేఁ దలంక బలవృత్రధ్వంసనోదారభీ
కరవజ్రంబు కరంబునం గలుగ శంకాలేశముం గల్గునే.

67


క.

మంచిది మీ రీసతిఁ బో, షించుం డని యొప్పగించి సేనలు గొలువ
న్వేంచేసెఁ బురికి హరి యిటుఁ, జంచలలోచనయు మిగులసంభ్రమ మొదవన్.

68


తే.

చిక్కువడుముంగురులు దీర్చి చెక్కుదోయిఁ, దొలఁకు కన్నీరుఁ బైఁటచేఁ దుడిచికొనుచుఁ
బ్రణుతి సేయ "సుమంగలీ భవ" యటంచు, వనజసంభవభవుఁడు దీవెన లొసంగి.

69


తే.

బాల చింతిల నేల నీప్రాణవిభుఁడు, వరతపశ్శక్తి బ్రహ్మచే వరములంది
లోకపాలుర గెల్చి ముల్లోకములకుఁ, దాన యేలికయౌను సత్యంబు నమ్ము.

70


క.

నీవిభుఁడు వచ్చునంతకు, నావనమున నుండు మనుచు నారదముని య
ప్పావనిఁ దోడ్కొని చనియెఁ ద, పోవనికి న్సాధు లార్తపోషకులు గదా.

71


చ.

వనితయు నాఁటనుండి మునివర్యునకుం బరిచర్యసేయఁ ద
ద్వినయవివేకసంపదకు వేమఱు మెచ్చి మనంబులోన న
మ్మునిపతి ధర్మమార్గమును ముక్తితెఱంగును విష్ణుభక్తియున్
దినదినమానతిచ్చు సుదతీమణి యెంతయు వేడ్కతో వినున్.

72


తే.

మునియనుగ్రహమహిమ నేమనఁగవచ్చు, భామగర్భంబులో నున్న బాలకుండు
హరిమహత్త్వంబుఁ దెలిసి తద్ధ్యానమునను, గర్భవేదన నెఱుఁగక గాంచు సుఖము.

73


వ.

అంత.

74

తే.

దైత్యనాథుని బ్రహ్మరంధ్రంబు పగిలి, ధూమ మొక్కటి పొడమె నస్తోకమగుచు
నదియ నిండి యకాండగాఢాంధకార, బంధురత సంఘటించెఁ బ్రపంచమునకు.

75


తే.

వెంటనె తపోగ్ని ఘోరమై వెడలుటయును, శరధు లుడుకెత్తె సురగిరి కరఁగెఁ బుడమి
మంగలంబయ్యె దిక్కులు మాఁడె గృహము, లన్ని యంగారదశ నొందె నాక్షణంబ.

76


తే.

ఉగ్రతరసప్తజిహ్వల నూర్ధ్వలోక, దాహ మొనరింతు ననురీతిఁ దత్తపోన
లము భువర్లోకమును మించి యమరనగరి, దగులుకొన్న సుపర్వులు దల్లడిలుచు.

77


క.

వనవహ్ని దవులుకొన్న, న్వినువీథికి నెగురుపక్షివితతులవలె న
య్యనిమిషులందఱు సత్యం, బునకుం జని నలువపాదముల కానతు లై.

78


మ.

దనుజాధీశతపోనలంబు త్రిజగద్దాహంబుఁ గావింప నెం
దును నిల్వ న్వసగాక వచ్చితిమి తోడ్తో వహ్ని వారింపుమా
యన కోర్కు ల్సమకూర్చి తామసము సేయ న్న్యాయమే చేసినం
బునరుద్యోగము సేయఁగావలె జగంబు ల్గల్గ లోకేశ్వరా.

79


తే.

అనిన జలజాసనము డిగ్గి వనజగర్భుఁ, డంతలో సాది దెచ్చిన యంచతేజి
నెక్కి భృగ్వాదు లయిన యనేకఋషులు, వెంటరా సత్యలోకంబు వెడలివచ్చి.

80


సీ.

మందరశైలంబునందు నొకానొకకోనలోఁ గానలోఁ గుమురుగాఁగ
బలసిన వెదురుజొంపముక్రింద దట్టమై పులుచుట్టుకొన్నట్టి పుట్టలోన
నీఁగలు చీమలు మూఁగి మైఁ గలిగిన చర్మంబు రక్తమాంసంబు మెసవ
నెమ్ములడింబ మై యెప్పటితననిష్ఠఁ దప్పక మొగులుచేఁ గప్పఁబడియు


తే.

నినుఁడు లోకములను దపియించు లీల, ఘనతపోనలశిఖల లోకములు వేఁచు
కాశ్యపునిఁ గాంచి విస్మయాక్రాంతుఁ డగుచు, భారతీకాంతుఁ డి ట్లని పలికె నపుడు.

81


సీ.

లేలెమ్ము కాశ్యప మేలగు నీకు నీతపము ఫలించు నీతలఁచుకోర్కి
యీయ వచ్చితి వేఁడు మేఁగంటి నీధైర్య మారయ నద్భుతం బయ్యె మాకు
దేహ మీఁగలు మూఁగి తినిపోవఁ బ్రాణము ల్శల్యగతంబులై సడల నిపుడు
నిట్టితపంబు ము న్నేఋషివరులు గావింపరు మీఁదఁ గావింపలేరు


తే.

జలము గోరక దివ్యవత్సరశతంబు, దనువు భరియింప నెవ్వరితరము నీకుఁ
జెల్లె గెల్చితి మమ్ము సుస్థిరసమాధిఁ, గోరు కోరినవరము సేకూర్తు నీకు.

82


మ.

అనుచుం బాణికమండలూదకము దైత్యస్వామిపై వంచె న
త్యనఘాత్మీయకృపానిరీక్షణసుధాధారాళధారాఢ్యమై

తనువెల్లం దడియన్ జగత్త్రితయసంతానంబు గావింపు మీ
వనుచుం దా నభిషిక్తుఁ జేయుగతి భృగ్వాదు ల్నిరీక్షింపఁగన్.

83


ఉ.

నీరజభూకమండలు వినిర్గతనిర్మలవారిధార బృం
దారకవైరిమస్తకమునం బడునప్పుడు చూచి మౌనిబృం
దారకు లెల్ల విస్మయమున న్మది నెంచిరి సత్యలోకని
ర్వారితయై సదాశివశిరస్థలి వ్రాలిన గంగకైవడిన్.

84


తే.

అమృతసేకంబువలన దైత్యాంగమునకు, బలముఁ దేజంబు సౌష్ఠవపాటవములుఁ
గలుగఁజేయుట యరుదె సంకల్పమాత్ర, మునఁ బ్రపంచంబు గల్పించు ప్రోడలకును.

85


మ.

అతిసంతప్తసువర్ణ మౌ నుదయశైలారూఢబాలప్ర భా
పతియో యాజ్యసమిత్సమేధితబృహద్భానుండొ జ్యోతిర్లతా
వృతమౌ ద్రోణనగేంద్రమో యనఁగ నావిర్భూతదేహప్రభా
న్వితుఁడై దైత్యుఁడు పుట్ట వెల్వడి నభోవీథి న్నిరీక్షింపుచున్.

86


తే.

అఖిలసురమునిసేవ్యుఁడై హంసవాహ, నమునఁ జెలువొందు భారతీనాథుఁ గాంచి
పులక లొదవఁ బ్రమోదాశ్రువులు జనింప, నవని సాగిలి మ్రొక్కి యిట్లని నుతించె.

87


శా.

నీవే దైవమ వీవె సేవ్యుఁడవు నీవే లోకనిర్మాతవు
న్నీవే త్రాతవు నీవె దాతవును నీవే సర్వము న్నీకు వే
ఱౌవా రెవ్వరు లేరు నాహృదయ మి ట్లశ్రాంత మీరీతినిన్
సేవింపన్ గరుణించి న న్మనుపవే చిద్రూపలోకేశ్వరా.

88


సీ.

పరమేష్ఠి నేఁగోరు వరము లన్నియు దయ నిచ్చెదనంటివి యిచ్చె దేని
నీవు సృష్టించిన నిఖిలభూతములచే నన్యుచేనైన గేహంబులోన
బయటను భూమిని బగలిట రాత్రిట నరసురాసుకమృగనాగముఖ్య
జీవులచేత నిర్జీవులచేతను నశియింపకుండ జన్యంబులందు


తే.

నప్రతిద్వంద్వపౌరుష మఖిలలోక, పాలమహిమంబు సర్వాధిపత్య మొసఁగి
నన్ను మన్నింపుమన్న నన్నలువ యన్ని, వరము లొసఁగె ముదంబున వాని కపుడు.

89


క.

అమరారిఖరాయుధభే, ద్యము గాకుండఁగ నొసంగు తనువన వాణీ
రమణుఁడు “నఖరాయుధ భే, ద్యము నీతను” వనుచుఁ బలికెఁ దద్దయు వేడ్కన్.

90


క.

అతిదుర్లభవరములు గోరితి వన్నియు నిచ్చినాడఁ బ్రీతుఁడ నగుచుం
గృతకృత్యుఁడ వని తత్పూ, జితుఁడై యజుఁ డరిగె దివిజసేవితుఁ డగుచున్.

91


తే.

అఖిలదిక్పాలతేజంబు లపుడె యాశ్ర, యించి నట్టితెఱంగు గాన్పించె నౌర
పటికనార్చిన పదివన్నెపసిఁడిగట్టు, రీతి జుగిఁబూనురక్కసిఱేనిమేను.

92

క.

ఈకరణి వరము లన్నియుఁ, జేకొని హర్షించి దైత్యశేఖరుఁ డనుజున్
సూకరమై వధియించిన, శ్రీకాంతునిఁ గూల్తునంచుఁ జింతించె మదిన్.

93


తే.

నగరమున కేగుదెంచిన నారదముని, యతనిసతిఁ దెచ్చియిచ్చి బలారిచేష్టఁ
దెల్ప నప్పుడె యాజ్యాహుతిప్రవృధ్ధ, వహ్నివలె మండె దైతేయవల్లభుండు.

94


శా.

కానీ వాసవుఁ డెందుఁ బోవఁగలఁ డింకం జిక్కె నాచేతిలో
వాని న్వానివధూటిఁ దెచ్చి చెఱవైవంజాలనే లేనిచో
నే నా కశ్యపనందనుండనె బలా యీసాహసం బెంత ల
క్ష్మీనాథాదులఁ జూడుఁ డింకిటను నాచే భంగపా టొందఁగన్.

95


క.

రావిప్రజిత్తి సేనల, రావింపు మటన్న వాఁడు రణజయభేరీ
రావాకులితబ్రహ్మాం, డావళిగా బలముఁ గూర్ప నని కుత్సుకుఁడై.

96


సీ.

అమరుల గెల్చి మహారాజికుల వ్రాల్చి తుషితుల నొంచి రుద్రుల జయించి
గంధర్వుల నడంచి గరుడుల వారించి వసువుల నడచి భాస్వరుల నొడిచి
యాదిత్యుల నలంచి యనిలుల శిక్షించి యక్షులఁ గొట్టి గుహ్యకులఁ బట్టి
విశ్వుల విదళించి విద్యాధరులఁ జించి సాధ్యులఁ దోలి రాక్షసుల నేలి


తే.

యురగులను గింపురుషులఁ గిన్నరుల భూత, ములను బితరులను బిశాచములను మనువు
లను నృపాలుర నోడించి దనుజనాథుఁ, డతుల దోశ్శక్తి ముజ్జగం బాక్రమించె.

97


తే.

కాలనాభుఁడు మొదలైన కనకనయన, పుత్రుల కొసంగె దిక్పాలపురవరంబు
లమరముల కిచ్చెఁ దక్కినయమరనగర, ములును గొలిచిన దానవేంద్రులకు నమఱ.

98


సీ.

వేదోక్తపద్ధతి వెలయంగ యాగంబు లలవరించినసోమయాజులకును
బగఱకు వెన్నిచ్చి పఱవక సంగరక్షోణిఁ గూలినమహాశూరులకును
నన్నదానాంబుదానావనీదానకన్యాదానములు సేయుననఘులకును
న్యాయంబు దప్పక యఖిలభూప్రజలను రక్షింప నేర్చిన రాజులకును


తే.

బారలౌకికఫలమై యపారమహిమ, నాహవశతైకయోగ్యమై యలరు త్రిదివ
మాహవశతంబు గావించి యాక్రమించె, సమరవరజేత పూర్వదేవాధినేత.

99


సీ.

పచ్చతాజగతులుఁ బగడంపుఁగంబము ల్మరకతసోపానమార్గములును
వైడూర్యవలభులు వజ్రకవాటముల్ గోమేధికోన్నతకుడ్యములును
బుష్యరాగద్వారములుఁ జంద్రకాంతవేదులు నవమాణిక్యతోరణములు
భావచిత్రంబులు బంగారుబొమ్మలు మేటైనముత్యాలమేలుకట్లు


తే.

సాంద్రసామ్రాణిధూపవాసనలు వికచ, పారిజాతప్రసూనబంభ్రమ్యమాణ
భృంగరవములు గలిగి యొప్పెడు సుధర్మఁ, బృథులచింతామణీభద్రపీఠియందు.

100

సీ.

కనకాంగి యపరంజికాళాంజి ధరియింప సొగసుగా మేనక సురటి విసర
శశిరేఖ వలిపెంపుచల్వపావడ వైవ రంభోర్వసులు చామరములు వీవఁ
దారాసరోజాక్షి తాలవృంతము పూనఁ గర్పూరతిలక బాగా లొసంగఁ
జిత్రరేఖ పసిండిచేగిండి భరియింపఁ గ్రతుశుల్కమణి పాదుకలు వహింప


తే.

ధాన్యమాలిని నిల్వుటద్దంబు సూప, మంజఘోషాలివేణీ సామ్రాణి వేయఁ
జంద్రకళ చేరి పాదాంబుజంబు లొత్తఁ, బెద్దగొలువుండె దైతేయభిదురపాణి.

101


చ.

గెలిచితి సర్వదేవతలఁ గేశవుఁ డొక్కఁడు దక్క నాతనిం
గెలిచినఁ గాని యీగెలుపు గెల్చుటగా దదియెట్టు లంటిరే
దొలుత వరాహమై యనుజుఁ ద్రుంచు టెఱుంగరె సూడుదీర్పఁగాఁ
గలుగనిగె ల్పదేల బలగౌరవ మేటికి శౌర్య మేటికిన్.

102


మ.

అనుచుం గాలకరాళకాలహరఫాలాభీలకీలాకులా
శనిలీలాపరిలోలశూలము భుజాగ్రస్థానిఁ గ్రాల న్మహా
జనలోకంబుల వారుసూచి వలస ల్సాగం దపోవాసు లొ
య్యనఁ గేల్మోడ్పఁగ సత్యధాములు జయం బౌనంచు దీవింపఁగన్.

103


మ.

బల మెల్ల న్వెనుచిక్క నొక్కరుఁడు శుంభద్భాహుదర్పంబునం
దలుపు ల్వీడఁగఁ దన్ని రక్షగణముం దట్టించి వైకుంఠవా
సులు చెల్లాచెదరై కలంగఁ బురముం జొత్తెంచు దైతేయరా
డ్దిలకంబుం గని విష్ణుసైన్యము మదోద్రేకంబుతోఁ దాఁకినన్.

104


సీ.

ఇల ఱెక్కముక్కాడ నీయకుండిన మోము దెల్లగాఁ జనెఁ బక్షివల్లభుండు
జిఱజిఱఁ ద్రిప్పివైచినశూల మసిఁబోవఁ దొలఁకువేడుక సునందుండు దొలఁగె
నడిదంబుచే రేఁకుమడఁగఁ గొట్టిన వికాసము దక్కి కడు స్రుక్కి జరిగెఁ గుముదుఁ
డదరింప నల్వంక బెదరుసేనలతోడ నరిగె విష్వక్సేనుఁ డదటుమాని


తే.

సింహనాదంబు చేసినఁ జేవఁదక్కి, పుష్పకంతాది హరిబలంబులు దలంక
నాకచరవైరి దైత్యారినగరు సొచ్చి, విమలమణిమయకక్ష్యాంతరములు దాఁటి.

105


తే.

కళుకువిడికెంపురవలచెక్కడపుమేడ, వలపట నెసంగు శృంగారవనములోనఁ
బచ్చజీరుకురాలచే మెచ్చుగులుకు, చలువతావుల కెందమ్మికొలనియెదుట.

106


సీ.

నీలంపుఱాల కిన్నెరపారిమగఱాల యుగ్గుచప్పరముల నిగ్గులీన
జాళువాపడుకింటిచలువఱాజగతిపైఁ గెందమ్మినెత్తావిచందురాల
పచ్చఱాతళుకుచప్పరకోళ్ళసకినెలమంచంబుపై నీవిమ్రానికమ్మ
విరిశయ్యనా సంచగరులతెమ్మెర గ్రోలి పఱపైనచిల్వరాపఱుపుపైని


తే.

బసనికుబుసంబు చలువదుప్పటి వసించి, వేతలాడలనొరఁగి నవీనభోగ
రత్నకాంతులు వెలుగంగ రాణివాస, సతుల సేవల సొక్కు శ్రీపతిని గాంచి.

107

శా.

ఔరా వైభవ మింతగోరియును నేలా మున్ హిరణ్యాక్షుతోఁ
బోరన్వచ్చితి రాకయుండినను నీభోగంబు నిత్యంబుఁగా
దా రాజీవదళాక్ష నన్ గొలిచినం దాళంగదా యింక నీ
శూరత్వం బెఱిఁగించు పాఱకు మటంచు గేలిగావించుచున్.

108


శా.

ఈలాశూలముఁ గేలఁబూని లయకాలేశానుచందంబున
న్రా లక్షించి రమామనోహరుఁడు దూరంబందె నేనింక నీ
వేళ న్వీని జయింపరాదు పఱవ న్వెన్నంటుఁ దోఁబ్రాణముల్
గాలుండుంబలె నేమి సేయుదు నిఁక న్గాలోచితం బెట్టిదో.

109


మ.

అని మాయావిజనంబులోపల ఘనుండౌ శౌరి చింతించుచుం
దనలోనుండెడు వానిఁ గన్గొనఁడు ప్రత్యక్షంబు నేగాని యీ
తనినిశ్వాసములందు నుందు ననుచుం దోనిల్చె సర్వాత్మకుం
డనపాయస్థితి సూక్ష్మరూపుఁడయి స్వీయాకారము న్మాటుచున్.

110


ఉ.

అంతటఁ జేరవచ్చి దనుజాధివుఁ డొయ్యన శేషశయ్య శ్రీ
కాంతునిఁ గాన కయ్యెడలఁ గన్గొని మూల వడంకుచున్న శ్రీ
కాంతను భూమినీళలను గన్ గొని మీతెరు వేను రాను మీ
కాంతునిఁ జూపుమన్న నలకామిను లన్న యెఱుంగ మంచనన్.

111


చ.

యెఱుఁగక యెందుఁబోవు మఱి యీభువనంబులయందు డాఁగిన
న్వెఱచఱవంగఁ దెచ్చి తెగవ్రేయక పోనె హిరణ్యుఁడంచుఁ
జెచ్చెర నలుమూలలం దుపరిసీమను మంచముక్రిందఁ జూచి ని
వ్వెఱ వెలివెళ్లెనో యనుచు వెల్వడె నిందును నందుఁ జూడఁగన్.

112


సీ.

శంఖచక్రంబులు సడలించువారును వైజయంతిని దీసివైచువారుఁ
గనకాంబరంబులు గడనుంచువారును మకరకుండలములు మాటువారుఁ
గరములు రెండు వెన్కకు డాఁచువారును గరిమను దెలిచల్వఁ గప్పువారు
ధవళాబ్జలోచనద్వయి మూయువారును దమగుడాకేశంబు లిముడువారుఁ


తే.

గదియవచ్చిన శ్రీవత్సకౌస్తుభములు, నిందిరయు లే దురంబున నిదిగొఁ జూడు
మేను విష్ణుండఁ గానంచు నిందు నందుఁ, జెదరి సారూప్యధరులు దప్పించుకొనఁగ.

113


మ.

నగుచుం బట్టణమంతయు న్వెదకి నానాలోకము ల్వారిధు
ల్నగము ల్నిమ్నగము ల్పురంబులు నరణ్యంబు ల్మహద్వీపముల్
మృగముల్ బక్షులు గోగణంబులును భూమీదేవతాయోగిప
న్నగదేవర్షిగణంబులు న్వెదకి కానన్ లేక విభ్రాంతుఁడై.

114


మ.

అనిశంబు న్వెదకంగ సాగితిని బ్రహ్మాండంబులో నేను జూ
డనిచో టెక్కడఁ గాన నెట్టియెడఁ దా డాఁగె న్ముకుందుండు డాఁ

గినఁ గన్పట్టఁడె భానుపుత్రపురి కేగన్ బోవనీ వైరి నొ
చ్చినమీఁదం బగ చెల్లునే యని మదిం జింతించి నిశ్చింతుఁడై.

115


చ.

సనకసనందనాదిమునిచంద్రు లెదుర్కొని త్రోవ “స్వస్తితే
దనుజవరేణ్య" యన్న విని తాపసులార జనార్దనుండు నొ
చ్చెను ననుఁ గొల్వుఁ డింకిటను జింతితమిచ్చెద నా నతండు వో
యిన మఱి నీవెకాక యిఁక నెవ్వరటంచు మునీంద్రు లేగినన్.

116


చ.

సకలసుపర్వవేణువుల శాంతశిలీముఖధార ద్రుంచి త
త్ప్రకటితకీర్తి మౌక్తికవితానము దిక్కులనుంచి యిట్టు లా
త్మకులము వృద్ధిబొందఁగ నుదారుభుజబల మొప్పఁగా హిర
ణ్యకశిపుఁ డేలె స్వర్గము సురాహితదుర్గము గాఁగ నయ్యెడన్.

117


మ.

దిగధీశానకిరీటకీలితమణు ల్దెప్పించి జంభాత్మజా
మృగశాబాక్షికిఁ గిల్కుటందియలు సేయించె న్శచీభామినిన్
దిగువండయ్యెఁ బదంబు లొత్త నిజపత్నీవారితౌద్ధత్యుఁడై
పగలంబొందియు సాధ్వు లన్యులను నొవ్వంజూడ రెప్పట్టునన్.

118


సీ.

క్రతువులందు "హిరణ్యకశిపవే స్వాహా” యటంచు వేల్తురు సోమయాజులెల్ల
హవవాదులను "హిరణ్యకశిపుప్రీత్యర్థ” మనుచు సంకల్పింతు రవనిసురలు
నమ్రులఁ గని "హిరణ్యకశిపూ రక్షతు త్వా" మని దీవించు దజ్ఞజనము
"కరుణాలయ హిరణ్యకశిపో ప్రసీదమే" యనుచుఁ బ్రార్థించు నానార్థిగణము


తే.

దను భజించిన స్వర్గ పదం బొసంగుఁ, గొలువకుండిన రౌరవములను ద్రోయు
బ్రహ్మ దీవింపఁ జనుదెంచుఁ బ్రత్యహంబు, హరుతెరువుఁ బోఁడుభిక్షుకుఁ డగుట నసుర.

119


తే.

లచ్చి కడకంట వాణి నాల్కను వసింప, గిరిజఁ జెఱపట్టకుండునే సురవిరోధి
యర్ధతను వంగనయుఁ గడ మర్ధతనువు, పురుషుఁడై కన్పడ జుగుప్స వొడమెఁ గాక.

120


సీ.

వాన లేదనరాదు వడిఁ బట్టి తెప్పించి పర్జన్యుఁ జబుకులపాలు సేయుఁ
దలనొప్పి యనరాదు ధరలోన నెవ్వారు విఱిచికట్టించు నశ్వినుల నొకటఁ
జిమిడెనం చనరాదు శిఖవట్టి యీడ్చి యగ్నిని నీళ్ళ వైచి త్రొక్కింపఁబంచు
నపమృత్యు వనఁగరా దాగ్రహవ్యగ్రుఁడై శమనుని యుసుఱుగాలమున వైచుఁ


తే.

గడమ కిన్నరగంధర్వఖచరసిద్ధ, సాధ్యపన్నగయక్షనిర్జరులఁ జిటుకు
మన్న నడ్డముపట్టించు నసురవిభుఁడు, చండశాసనుఁ డగుట నుద్దండుఁ డగుచు.

121


సీ.

జలకేళిఁ దేలు నచ్చరనెచ్చెలులతో గగనగంగాతరంగములలోన
వనవిహారము సల్పు వయసువేల్పులజవరాండ్రతో నందనాభ్యంతరమున
వాహ్యాళి వెడలు నిర్వంక జేజేలు పావడలూన నుచ్చైశ్రవంబు నెక్కి
పురవీథి నేతెంచుఁ దరళాయతాక్షి ముందటనుంచి యైరావతంబుమీఁద

తే.

మేరుకైలాసరోహణధారుణీధ్ర, ములను విహరించు గంధర్వజలజముఖులఁ
బ్రౌఢలను గూడి పుష్పకారూఢుఁ డగుచు, దితిసుతుండెందు నప్రతిహతనిరూఢి.

122


సీ.

నారద సుతిఁ గూర్పనేరవు నీవు తెమ్మని వీణె టింగుటింగునను మీటు
శిఖి హవిర్భాగ మిచ్చిన మెసంగుచుఁ జప్పనున్నది యనుచుఁ బై నుమియవచ్చు
జేరి యాశీర్వదించినసప్తఋషుల గ్రక్కునఁ బల్లకిం బట్టుఁడనుచుఁ బదరు
స్త్రీలుగా నందఱ సృష్టింప రైతి రంచును నుపధాతలఁ జూచి కెలయు


తే.

మఱియు నేమైనఁ దబ్బిబ్బు మాటలాడు, నంగ మెఱుఁగక కొల్వుండు నసురవిభుఁడు
గంధగజగామినీముఖకమలగంధ, మహితగంధోత్తమాపానమత్తుఁ డగుచు.

123


ఉ.

నీచెలువంబు నీసొగసు నీసరసోక్తులు నీవిలాసము
ల్నీచతురత్వ మింతయిన నిర్జరభర్తకు నేది యాయెలే
చూచితి మెందులేదు వెయిచూపులె యెక్కువటంచుఁ దక్కి దో
షాచరుమేనుబొంగ వెలచానలు గూడుదు రిచ్చకంబునన్.

124


సీ.

ఎచట నెవ్వరు కోర నచటనే వర్షించుఁ బడుగింజలనె పండు బుడమినిండ
నంతగా నెండఁగాయకయుండు భానుండు కళలు వేల్పుల కీయఁదలఁకు శశియు
రత్నాకరుండు దీరముఁ జేర్చు రత్నము ల్వలితెమ్మెరలు వచ్చు వలసినపుడుఁ
గల్పకాదులు ముజ్జగముల కిష్టములిచ్చుఁ బాకంబు దప్పఁగాఁ బ్రబలఁ డగ్ని


తే.

దుష్టమృగబాధ లపమృత్యుదోషములును, గలుగ వతఁడేలు మూఁడులోకములలోన
ధర్మమునఁ గాదు వానిహస్తమున నున్న, ధర్మమునఁగాని మేదినీధవవరేణ్య.

125


క.

సురథాని యేల రక్కసి, సురథానీలీల నముచిసూదనముఖ్యు
ల్దరిదా పెఱుఁగక మేరువు, దరిదాపున గూడి మిగులఁ దహతహపడుచున్.

126


మ.

హరి సర్వాత్మక లోకరక్షక రమాధ్యక్షా సరోజాక్ష కా
తరు లస్మమ్ము దయావిలోకనముల దర్శించి రక్షింపవే
యరి శిక్షింపవె యంచు నిద్దురయు నాహారంబు లే కెప్పుడు
న్మొఱపెట్ట న్విని యభ్రరూపహరి యంభోవాహధీరధ్వనిన్.

127


ఉ.

నిష్ఠురమౌ తపం బధికనిష్ఠితవృత్తి ఘటించి దేవతా
జ్యేష్ఠునివల్ల దైత్యపతి శ్రేష్ఠవరంబులు గాంచి సర్వభూ
యిష్ఠమహోగరిష్ఠుఁడయి యెల్లవరిష్ఠుల మేఘవాహన
ప్రష్ఠకనిష్ఠులం గెలిచి బాధలఁ బెట్టు లఘిష్ఠబుద్ధియై.

128


చ.

ఎఱుఁగుదు నైన వాని హరియించుటకున్ సమయంబుగాదు ముం
దఱ నిఁక నాకు భక్తుఁడని నందను బాధలఁ బెట్టినప్పుడే

నఱిముఱి దైత్యవల్లభుని నంతకుఁ జేర్చెద నిక్క మింతలో
వెఱవకుఁడన్న వేడ్క వినువీథికి మ్రొక్కుచుఁ బోయి రంతటన్.

129


సీ.

ప్రత్యర్థిసురరాజ భయములతోఁ గూడఁ దళుకులేఁజెక్కులు పలుచఁబారె
మనుజాశనీముఖ మలినసూచకములై కుచచూచుకంబులఁ గూడె నల్పు
వనజాక్షి భక్తివృద్ధినిదర్శనంబయి యనవరతంబు మధ్యంబు బలిసె
ఖలకృత్యములు మందగతిఁ గాంచుననురీతి సమదేభయానంబు జడనువడియెఁ


తే.

బతి హరిద్వేషి యితని సంగతి గొఱంత, యనుక్రమంబున రతివాంఛ యలఁతి యయ్యె
గర్భతేజం బనంగ నంగంబు మెఱసె, దివ్యదౌహృదవతికి దైతేయసతికి.

130


తే.

ఆగమపురాణములు విను ననుదినంబు, నంబుజోదరు భావించు నాత్మలోనఁ
బ్రాణసఖులకు ధర్మమార్గములు దెలుపు, జలజలోచన యాపన్నసత్త్వయగుట.

131


క.

ప్రొద్దులనెల నంతట న, మ్ముద్దియ యనవద్యలగ్నమున మేనిజిగిం
బ్రొద్దులనెల గెలువఁగనగు, ముద్దుకుమారకునిఁ గనియె మోదము మీఱన్.

132


తే.

తనయలాభంబునకుఁ బ్రమోదంబుఁ గాంచి, కనకకశిపుఁ డొసంగెను గనకకశిపు
ముఖ్యవస్తులు భూదేవముఖ్యులకును, జెఱలు విడిపించె జేజేలచిగురుఁబోండ్ల.

133


క.

జనకుని తొలుతటిపుణ్యం, బున వరసుతుఁ డొదవుగనుక పూర్వపుజన్మం
బున హరి గొలిచిన పుణ్యమె, తనయుండై పుట్టె నపుడు దైత్యేంద్రునకున్.

134


తే.

అటులుఁ గాకున్నఁ బ్రభవించునపుడె జ్ఞాన, భక్తివైరాగ్యములతోడఁ బ్రభవ మొందు
బాలకుల వింటిమే భూమిపాలతిలక, చెప్పఁ జిత్రంబు ప్రహ్లాదు చిత్తశుద్ధి.

135


తే.

ఎందు విందునొ గోవిందనింద దైత్య, మందిరమునందు ననుశంక డెందమంద
రెండుచేతుల గట్టిగా రెండుచెవులు, మూసికొని పుట్టె దైతేయముఖ్యసుతుఁడు.

136


మ.

జననీగర్భసముద్భవంబయిన విజ్ఞానంబు దీపంబురీ
తిని శూర్పానిలసంగతిం బొలియు [1]నెందే జీవలోకవ్రజం
బునకుం దైత్యకుమారు జ్ఞాన మటులం బో కెంతయున్ రూఢమౌ
టను దావానలలీల మించె నరిషడ్వర్గాటవుల్ మ్రగ్గఁగన్.

137


తే.

అంధకారనిరాకరణాభిరామ, కిరణములతోడ నుదయించు నరుణుకరణిఁ
బ్రశ్రితాజ్ఞానహరణకారణము లైన, యమలగుణములతోఁ బుట్టె నసురసుతుఁడు.

138

మ.

భళిరా నేఁడు ప్రసంగసంగతులచేఁ బ్రహ్లాదుఁ గీర్తింపఁగా
గలిగెన్ జిహ్వ పవిత్ర మయ్యె విను వక్కాణింతుఁ దద్బాల్యచే
ష్టలు భక్తి న్వినువారి కందఱికి విజ్ఞానంబు వైరాగ్యమున్
జలజాతేక్షణుభక్తియుం గలుగు నాశ్చర్యంబుగా భూవరా.

139


తే.

డోలికాకేళి సల్పెడువేళ నుపరి, భాగమణిగుచ్ఛమునను దీపంబునందు
దృష్టి నిల్పఁడు హృదయదేదీప్యమాన, పరమహంసత్వమును మదిఁ బదిల మగుట.

140


ఉ.

పూని కడానిడోలికను బొత్తులలోఁ బవళించియున్ హరి
ధ్యానపరాయణుండు ప్రమదాశ్రులు పూనఁగఁ జూచి నెచ్చెలు
ల్దేనియమోవిపై నగవుదేరెడు గం దడియంట నేల యెం
తేనియు విస్మయంబని గణింతురు కాంతురు మాటిమాటికిన్.

141


క.

పొత్తులలోఁ బవళించిన, యత్తఱినూరుపులు నిలువ నంతర్దృష్టిం
జిత్తము హరి హత్తించిన, యుత్తముఁ గనుఁగొన్న దాదు లుంకుదురు మదిన్.

142


తే.

అమ్మ బువ్వఁ బెట్టు మనఁ డొకనాఁడైనఁ, గన్నతల్లి పైఁడిగిన్నెలోనఁ
బాలు నన్న మిడిన బత్తితోఁ గృష్ణార్పి, తంబుచేసి మెసవు దైత్యసుతఁడు.

143


క.

రారా ననుఁ గనుతండ్రీ, రారా నాముద్దులయ్య రారా యనుచుం
గూరిమిని దల్లి పిలిచినఁ, జేరంగాఁబోఁడు విష్ణుచింతాపరుఁడై.

144


తే.

జననితో నుండి యిదిగొ నాస్వామి వచ్చె, ననుచు డిగ్గన లేచి సాష్టాంగ మెఱఁగి
దేవ రక్షింపు మంచు నుతించువాఁడు, గాన మొనరించు నేడుచుఁ గానకున్న.

145


మ.

జనకుం డయ్యలు విద్దె మేది యనఁ గృష్ణా రామ గోవిందయం
చు నటించుం గరతాళవైఖరులతో జోడందియ ల్మ్రోయఁ జ
క్కనిలేఁజెక్కుల మద్దికాయలరుచుల్ గన్పట్ట బాలేందుఁ బో
లినఫాలంబున రావిరేక గదలన్ లీలావిలాసంబులన్.

146


వ.

ఇవ్విధంబున దినదినప్రవర్ధమానదానవాహితపదారవిందానూనధ్యానామృ
తపానంబున దరీదృశ్యమానప్రపంచ మంతయు మఱచి విదళితదేహాభిమానుం
డగుచు నున్మత్తుని తెఱంగున స్వేచ్ఛాలబ్ధాశనాచ్ఛాదనుం డగుచు నితరకృ
త్యంబు లుడిగి యాతాయత్తచిత్తంబున నవధూతవృత్తిని వర్తిల్లుపుత్రకునిం
గని తదీయజనకుండగు కనకకశిపుఁడు చింతాక్రాంతుఁ డగుచు శుక్రకుమారు
లగు చండామార్కులం బిలిపించి యిట్లనియె.

147


క.

మునిపుత్రులార నాతన, యునిఁ గంటిరె వీని కేమి యున్మాదంబో
ఘనమగు భూతము పట్టెనొ, వినిపింపుఁడు వీనిమహిమ వింత యటన్నన్.

148


క.

దానవనాయక చదివినఁ, గాని వివేకంబు రాదు గావున మేమే
వీనిఁ జదివించి మతిగల, వానిం జేసెద మటంచు వారు దదాజ్ఞన్.

149

వ.

ఒక్కసుముహూర్తంబున దైతేయతనూజాతుని మంగళస్నాతునిం గలధౌత
పరిధానసమేతునిఁ గలధౌతరమణీయమణిభూషణాన్వితునిం గావించి యనే
కశతసహస్రదైత్యదానవరక్షో౽సురకుమారవర్గంబుతో బహువిధతూర్య
ఘోషంబులుం బోరుకలంగ రత్నఖచితకనకమండపాభ్యంతరంబున సకలసురా
సురబలకలకలంబులు సెలంగ విఘ్నేశ్వరపూజామహోత్సవం బొనరించి.

150


ఆ.

మౌనిపుత్రు “లోన్నమశ్శివాయ” యటంచుఁ, బసిఁడిపళ్లెరమునఁ బొసఁగ వ్రాసి
యుచ్చరించుమనిన “నోం నమోనారాయ, ణాయ” యనియె దైత్యనందనుండు.

151


క.

అనిన న్మఱియుం జదివిం, చినయట్లనె చదువ లెస్స శిక్షింపక చె
ప్పినరీతిఁ జదువఁడని గృహ, మునకుం దోడ్తెచ్చి శుక్రపుత్రకు లచటన్.

152


క.

చదివించిరి మునుపటివలెఁ జదివిన మాఱాడ నీకుఁ జనునే మాతో
నిది యేమి యనిన మాధవ, పదభక్తుం డనియె మిగులఁబ్రావీణ్యమునన్.

153


ఆ.

అజహరాదిసేవ్యుఁ డఖిలలోకేశ్వరుఁ, డచ్యుతుండు గలుగ నన్యదేవ
భజన మేల యనుచుఁ బలికితి మీతోడ, మాఱుపలుక నేను మౌనులార.

154


మ.

అనిన న్నీ కిది బుద్ధిగాదు దనుజేంద్రారాతి వర్ణింపఁగాఁ
జనునే యీచదు వింతయైన వినిన న్పైరించునేఁ నేఁడు నీ
జనకుం డాహరిఁ జెప్పునంచు శ్రుతులు న్శాస్త్రంబులు [2]న్గాల్పఁగాఁ
గనవే మానుము వైరిపక్ష మిది యింకన్ దైత్యరాజార్భకా.

155


క.

అనుచు బుద్ధులు సెప్పుచు నహరహంబు, నీతిశాస్త్రంబు లెఱిఁగింప నీరజాక్ష
చరణవిన్యస్తచిత్తుఁడై చదివె జ్ఞాని, కర్మ మొనరించుగతి ఫలాకాంక్ష లేక.

156


తే.

దానవేశ్వరుఁ డొకనాఁడు తనయుచదువు, వినవలయునంచు రప్పించి వినతుఁడైన
వాని నక్కునఁ జేర్చి భావంబు సెలఁగఁ, గనకపీఠిక నుంచి యి ట్లనుచుఁ బల్కె.

157


తే.

నీవు చదివినచదువులో నికరమైన, పద్యమొక్కటి చదివి యేర్పాటు గాఁగ
నర్థ మెఱిఁగింపుమనినఁ బ్రహ్లాదుఁ డనియెఁ, దండ్రి వినిపింతు వినుము చిత్తంబు నిలిపి.

158


క.

కడివెఁడుపెరుఁగుఁ జిలికి ప, ట్టెఁడునవనీతంబు గాంచు ఠీవిని నే నె
క్కుడు వేదశాస్త్రములలోఁ, బడసితి నొకసార మసురపాలక వినుమీ.

159


క.

అన సార మెఱుఁగ నేర్చితె, తనయా యని చుంచుదువ్వి తద్దయుఁ బ్రేమం
బున నేదీ సారాంశము, వినిపింపు మటన్న దైత్యవిభునకు ననియెన్.

160


క.

శారీరకాంతివిజితమ, సారము భక్తావనైకచాతుర్యదయా
సారము ఖిలభీకరభుజ, సారము హరితత్త్వ మొకటి సారము తండ్రీ.

161


మ.

చలపర్ణాంచలచంచలంబయిన సంసారంబు సారంబుగాఁ
దలపంజాలనితప్పు సేయుటను గాంతాపుత్రసంమోహశృం

ఖలికాద్వంద్వనిబద్ధులై గృహమహాకారానిరోధాఫ్తినా
కులులౌవారు హరీ యటంచు విభు నాక్రోశింప మోక్షం బగున్.

162


సీ.

అనుమాట చెవినాట నాగ్రహవ్యగ్రుఁడై యసురనాయకుఁడు శుక్రాత్ముజులను
గనుఁగొని యాచార్యతనయు లంచును మిముఁ జాల నెమ్మది నమ్మి బాలకునకు
నీతిశాస్త్రము దెల్పి నిపుణునిఁ గావింపుఁ డని వేఁడుకొనిన మీ రటులు సేయు
వారమంచును నాకుమారుఁ దోడ్కొనిపోయి ప్రతిపక్షనుతులైన ప్రల్లదములు


తే.

గఱపితిరె యంచు మిగుల మౌర్ఖ్యంబుతోడ, నసిజరీలనదూసి దైత్యాధినేత
బ్రాహ్మణుల వ్రేయఁబూనఁ జేపట్టి పట్టి, దిట్టతన ముట్టిపడ నిట్లు దెలిపె నపుడు.

163


తే.

ఎవ్వఁడు వసించు జనములహృదయతటుల, నట్టివిష్ణుండు శిక్షకుఁ డఖిలమునకు
నసురనాయక యాపరమాత్మ దక్క, నెవ్వ రెవ్వరిచే సాధ్యు లెన్న ననిన.

164


తే.

జగదధీశుండ నైన నాసమ్ముఖమున, వేఱె యొక్కని విష్ణుఁడు విష్ణుఁ డనుచు
మాటిమాటికిఁ దెలిపెద వోటలేక, విష్ణుఁ డన నెవ్వఁ డోరి వివేకహీన.

165


తే.

అరయ నెవ్వఁడు చిద్రూపుఁ డగుచు వెలయు, జగము లెవ్వనిచేఁ గల్గు సంతతంబు
విశ్వ మెవ్వనిరూపమై వెలయుచుండు, నతఁడు విష్ణుండు పరమేశుఁ డతఁడు తండ్రి.

166


క.

ఓరీ శరీర మొల్లవొ, యేరా పరమేశ్వరుండు నేనుండఁగ నె
వ్వారిం బరమేశ్వరుఁ డని, సారెకు బలికెదవు బుద్ధి సాలదొ నీకున్.

167


తే.

ప్రజలకును నీకు నాకును బ్రహ్మమైన, యట్టి విష్ణుండు పరమేశుఁ డతఁడె ధాత
యాతఁడె విధాత యూరకె యలుగనేల, సుప్రసన్నుఁడ వగుము రక్షోవరేణ్య.

168


క.

అతిపాపాత్ముం డెవ్వఁడొ, మతిహీనుండైన వీని మది నెలకొనియెన్
సతతం బటుగావున నీ, గతి దుర్భాషలు వచింపఁ గడఁగె న్బెలుచన్.

169


తే.

అయ్య వినవయ్య నాహృదయంబునందె, కాదు నీయందు సకలలోకములయందు
నుండి విష్ణుండు నయ్యై ప్రయోజనములు, దానె గావించు నెపుడు స్వతంత్రుఁ డగుట.

170


క.

అనఁ బండ్లు గీఁటి రోషం, బునఁ గన్నెఱ చేసి పలలభోజనుడు శన
స్తనయుల కొప్పించెం దన, యుని శిక్ష యొనర్ప వారియొద్ద నతండున్.

171


తే.

మఱియుఁ గొన్నాళ్లు చదివిన మనుజభోజి, మఱలఁ బిలిపించి యెయ్యది మంచిపద్య
మొకటి వినిపింపుమనిన లోకోత్తరుండు, దెలిపె నిటులని పలుకులఁ దేనెలొలుక.

172

తే.

తలఁప నెవ్వనివలనఁ బ్రధానపురుషు, లైరి యెవ్వనివలనఁ జరాచరంబు
గలిగె సర్వనిదానమై వెలయు నెవ్వఁ, డట్టివిష్ణువు సుప్రసన్నాత్ముఁ డగును.

173


సీ.

తుదఁ గెంపుచాయలు దొరయని ధవళాబ్దదళముల గేరు నేత్రములతీరు
గరుడపచ్చవిజాతిగా యంచు నిరసించి మెఱయంగఁజాలు నెమ్మేనిడాలు
కనుబింబమునఁ బద్మకన్యకన్యాయుక్తిఁ బ్రకటించు నీటిమానికముమించు
దనునీలభూధరంబునకుఁ గైరికదీప్తి గలుగఁజూపట్టు బంగారుపట్టు


తే.

పాలితాంభశ్చరాదన భద్రకుంజ, రోరుకర సూచనాచారు లూరువులును
బ్రబల నామానసంబునఁ బ్రతిఫలించు, శ్రీమనోహరుఁ డెపుడు రక్షించుఁగాత.

174


మ.

అనిన న్భగ్గున మండి దైత్యపతి యాహా యోరి నే నెంత చె
ప్పిన నీమార్గము మానవైతి విఁక నీబింకం బడంగింతు నే
నినుఁ బోనిత్తునె యంచు దైత్యభటుల న్వీక్షించి పుత్రుం డటం
చును గొంచించక వీని నొంచుఁ డిపుడంచు న్ముద్ర వాలించినన్.

175


శా.

ఓహోహో! యిది యేమి యంచు సభలో నున్నట్టిదైత్యాధిపు
ల్హాహాకారమునం గలంగుచును దైత్యస్వామి నేఁ డక్కటా
మోహం బించుక లేక పుత్రు నెటుల న్మొత్తించఁ బంచె న్పితృ
ద్రోహం బేటికి జేసె వీఁడని దురుక్తు ల్వల్కుచుం జూడఁగన్.

176


తే.

ఊడిగంబులు గావించుచున్న సురలు, విష్ణుభక్తున కిటువంటి వెత ఘటిల్లె
ననుచుఁ గన్నీరు [3]నించుచు నవనతాస్యు, లగుచు నుండిరి యౌను గాదనఁగ లేక.

177


శా.

ఆవార్త ల్విని గుండె భగ్గురన మూర్ఛాక్రాంతయై తల్లి శో
కావేశంబున హాకుమారక మహోదారా శుభాకారకా
నీ వీపాటున కోర్తువే యనుచు నెంతేఁ దా విలాపింపఁ ద
ద్రావం బంతిపురంబు నిండికొనె నంతం దైత్యు లత్యుద్ధతిన్.

178


తే.

పరశుతోమరముద్గరప్రాసభిండి, వాలశూలాదిసాధనాభీలు లగుచు
వేలసంఖ్యలు పొడువరా వెఱపులేక, నిట్లనుచుఁ బల్కె నాదానవేంద్రసుతుఁడు.

179


క.

మీయెడ నాయెడ మీచే, నాయుధములయందు నిందిరాధిపుఁ డెపుడుం
బాయం డటుగావున మీ, యాయుధములు నన్ను నొంపవని పల్కుటయున్.

180


సీ.

అడిదంబు జళిపించి మెడమీఁద వైచిన నది ఖణిల్లనుచు రెండయ్యె నపుడు
శూలంబు దిగిచి వక్షోవీథిఁ బొడిచిన ముమ్మొన లొక్కట మురిసిపడియె
గదచేతి నొక్కఁ డంగంబు బిట్టుగ మోదఁ దుత్తుమురయ్యెఁ దోడ్తోడ నదియు
సింగాణికోలలు చేదినఁ దఱచుగా నవియెల్ల విఫలంబు లగుచుఁ బడియె

181


తే.

మఱియు నేయాయుధంబుల మనుజభుజులు, నొప్పి గావింపఁజూచిన నొవ్వఁ డయ్యెఁ
గఱకుసానలఁ గెంపుగాఁగలఁగడాని, చికిలి యగురీతి మెఱసె బాలకునిమేను.

182

తే.

దనుజనాయకుఁ డంత నందనునిఁ గాంచి, బాల యీలీల నూరకె జాలిఁ జెంద
నేల యిఁకనైన హరి యంచు నెంచుకున్న, నభయ మిచ్చెదనన్నఁ బ్రహ్లాదుఁ డనియె.

182


క.

తనపేరు దలఁచినంతనె, జననాదిభయంబు లుడుపఁజాలినహరి నా
మనమున నుండఁగఁ దండ్రీ, ననుఁ జెందునె యాభయం బనాథునిభంగిన్.

183


క.

నావుడు విని యింకను నీ, కావర మడఁగదె యటంచు ఘనరోషమునన్
దేవారి తక్షకాదుల, రావించి కుమారునిం గఱవఁ బనుచుటయున్.

184


మ.

నిజదంష్ట్రాగ్ని సమేధమానవిషవహ్నిజ్వాలికామాలికల్
త్రిజగద్దాహము సేయఁగాఁ గదిసి దైతేయార్భకుం బాదముల్
భుజము ల్ప్రక్కలు బిక్కలుం గఱచె నాభోగీంద్రమ్ము ల్నల్గడన్
భుజగారాతిహయస్మృతి న్మఱచె మేనుం బాలుఁ డాహ్లాదియై.

185


క.

అఱిముఱిఁ దొమ్మిదికోటులు, నఱువది వేలైన తక్షకాదిమహాహు
ల్కఱకుంగోఱల విషములు, దొఱుగఁగ నీరీతిఁ గఱచి తూలుచు నంతన్.

186


క.

పడగలగలరత్నంబులు, గడఁబడ నొడ లుడుక దంష్ట్రకలు పొడిపొడి గాఁ
గడుబాములకున్ లోనై, గడుసరిపాములు దొలంగఁ గడురోషమునన్.

187


మ.

దనుజాధీశుఁడు పంప నంతటను దిగ్దంతావళేంద్రంబులం
గొని డీకొల్పిన దద్గజంబులు మదోద్వేగంబునన్ దైత్యపు
త్రుని దుండంబులఁ జుట్టి రాఁదిగిచి తోడ్తో ధాత్రిపై వైచి త
ద్ఘనవక్షఃస్థలి గ్రుమ్ముచో విఱిగె దంతంబు ల్విచిత్రంబుగన్.

188


మ.

అంత న్బాలుఁడు దండ్రిఁ జూచి దనుజేంద్రాధ్యక్ష కంటే శచీ
కాంతస్ఫారకఠోరవజ్రతులితాకారంబులౌ సర్వది
గ్దంతీంద్రంబుల దంతము ల్విఱిగె మద్వక్షంబునం దిట్టి య
త్యంతాంగద్రఢిమన్ హరిస్మరణమాహత్మ్యంబుగా నెన్నుమీ.

189


మ.

అనినం బాలక యేల ప్రేలెదవు పోరా యెంత నీసత్వమం
చును దిగ్దంతులఁ దియ్యగా బనిచి రక్షోవీరులన్ హెచ్చుగా
ననలంబుం దరికొల్పుమంచుఁ బవమానా వీని శోషింపు మీ
వని పంపం దనుజాత్మజుండు శుచియం ధారూఢుఁడై యిట్లనున్.

190


సీ.

శ్రీమించు గ్రొమ్మావిచిగురుగుంపులు నలుగడఁ దోరణంబులు గట్టినట్లు
నిండుపున్నమనాఁటినెల విచ్చుచెంగల్వవిరుఁ మేల్కట్లు గావించినట్లు
బాలభానుప్రభం బ్రహసించు నరుణాబ్దపత్త్రము ల్పఱుపుగాఁ బఱచినట్లు
తావి గల్గిన బంధుజీవప్రసూనము ల్సేసగాఁ బైని వర్షించినట్లు


తే.

చల్లఁగాఁ దోఁచుచున్నది సకలదిశలఁ, బీనపవమానజాజ్వల్యమానదహన
కీలజాలంబు లౌక్యంబు గీలు కొల్పి, తాప మొనరింప దింతైన దానవేంద్ర.

191

వ.

అనినఁ దదీయవచనరచనాదోహదధూమస్తోమపోషితరోషదాడిమీతరు
పరిపక్వప్రసవపత్రనిదర్శదర్శనారుణ్యంబున బాలుం గనుంగొనుచున్న దను
జపాలు న్విలోకించి భృగునందను లమందమృదుమధురసల్లాపంబుల సంస్తుతిం
చుచు నిట్లనిరి.

192


ఉ.

ఏమిటి కింతకోప మసురేశ్వర నీసుతుఁ డింతెకాని వీఁ
డేమి పరుండె మున్నె ఫలియించెఁ గదా మిషయేల దేవసం
గ్రామమునందె యింక నిట గారణ మేమి శమింపఁజేయుమీ
సామవచోవిశేషముల సాధు నొనర్తుము బాలు నిత్తఱిన్.

193


క.

నానోపాయంబుల నీ, సూనునకుం బుద్ధి సెప్పి చూచెద మటుగా
దేని హరింతుము మాహో, మానలమునఁ గృత్య దెచ్చి యద్భుతలీలన్.

194


క.

అని కనకకశిపుననుమత, మున బాలునిఁ దోడుకొనుచుఁ బోయిరి గేహం
బునకు శుక్రకుమారులు, నెనరున దద్గేహమునను నెలకొని యతఁడున్.

195


క.

గురువులు సెప్పినరీతి, న్నిరతముఁ బఠియించు రాజనీతిని మఱియా
గురువులు లేనియెడ న్బా, లురకు న్హరిభక్తి వత్సలుండై తెలుపున్.

196


తే.

గురువు సెప్పినచదువెల్లఁ గుటిల మనుచు, నెల్లసంసారమును దుఃఖహేతు వనుచు
విష్ణుఁడే సేవ్యుఁ డంచును వివిధగతులఁ, దెలిపి లోఁజేసికొనియె బాలురను దనకు.

197


తే.

ఇటుల బాలుర బోధించు టెఱిఁగిఁ గురుఁడు, దనకుఁ జెప్పిన విబుధారి గినుకతోడఁ
దనదుపట్టికి విషమిడుఁ డనఁగ వారు, నన్నపానంబులను హాలహలము నిడిరి.

198


ఉ.

శ్రీమదనంత యంచు నభిషిక్తము సేసి విషాన్న మెల్ల నెం
తేముద మొప్పఁగా మెసవె ధీరుఁడు దైత్యకుమారుఁ డట్టిచో
నేమివికారముం బొరయఁ డెప్పటికన్నను దృప్తిఁ గాంచె ను
ద్దామహలాహలం బుదరధామమున న్వసియించె నత్తఱిన్.

199


ఉ.

ఆమహిమంబు సూచి దనుజాధిపుఁ డెంతయు భీతచిత్తుఁడై
తామస మేల యింకిటను దైత్యపురోహితులార వీని కిం
కేమిట బుద్ధిరాదు సృజియింపుఁడు కృత్తినటంచుఁ బంప నా
భూమిసుధాశను ల్మఱియు బుద్దులు చెప్పుచుఁ జేరి బాలకున్.

200


మ.

అతిముఖ్యంబు భవత్కులంబు జనకుండన్నం ద్రిలోకేశ్వరుం
డతులైశ్వర్యము వేఱె తెల్పవల దేలా విష్ణు సేవింపఁగాఁ
బితృసంసేవ సమస్తలోకపతివై పెంపొందరాదే మహా
క్రతువు ల్సేసి జను ల్భజింపఁ గనవే క్రవ్యాదచూడామణీ.

201

మ.

అనినం దైత్యసుతుండు భూమిసురులారా వంశము న్ముఖ్యమౌ
జనకుండుం బతి మూఁడులోకములకున్ క్ష్మాదేవత ల్గొల్తు రే
నును సేవించెద గౌరవంబున ననంతుం గొల్వవద్దన్న మా
నను నాకుం బురుషార్థదాయకుడు శ్రీనారాయణుం డెమ్మెయిన్.

202


చ.

అనవుఁడు శుక్రపుత్రులు దురాగ్రహమెచ్చఁగ నోరి దుర్మతీ
యనలభయంబు మాన్పి దనుజాధిపు వేడుక నిన్నుఁ దెచ్చి యే
యనువున బుద్ధి చెప్పిన నహంకృతిచే విననొల్ల వింక నో
ర్చిన దనుజేశ్వరుం డలుగుఁ గృత్తి సృజించెద మన్న నవ్వుచున్.

203


క.

మీ రెవ్వరు రక్షింపఁగ, మీ రెవ్వరు శిక్ష సేయ మిమ్మును నన్నుం
గారుణ్యంబున బ్రోవఁగ, శ్రీరమణుం డున్నవాఁడు చింతిల నేలా.

204


తే.

అనినఁ బ్రహ్లాదుఁ జూచి బ్రాహ్మణులు మాకు, బుద్ధి చెప్పఁగ వచ్చితె ప్రోడ యనుచు
నలిగి యభిచారహోమంబు లాచరింపఁ, గృత్య జనియించె హరణైకకృత్య యగుచు.

205


సీ.

విరియఁబోసిననల్లవెండ్రుక ల్మొగులులో గిరిగొను మెఱుఁగుఁదీఁగెల ఘటింప
మద్యపానవిఘూర్ణమానలోచనములు వినువీథి నంగారవృష్టి గురియ
నాజానులంబివక్షోజతాడనములఁ గులభూధరంబులు గూలఁబడఁగఁ
జరణఘట్టనముల సైరింపఁగాలేక మ్రొగ్గ శేషునితోడ దిగ్గజములు


తే.

కహకహార్భటి బ్రహ్మాణ్డకటము పగుల, నోట నిప్పులు గ్రక్కుచు సాటిలేని
యుదుటు మీఱంగఁ బ్రహ్లాదు హుంకరించి, లావు చేఁబూని చేతిశూలమున వైచె.

206


క.

వైచిన నదియును నిఖిలా, రాచక్రము గాఁగఁ దాఁకి చక్రిసమేతం
బౌచిన్నివానిహృదయము, పైచర్మము దూఱలేక భగ్నం బయ్యెన్.

207


తే.

అది విలోకించి కృత్తి భీతాత్మ యగుచు, గెరలి హరిభక్తుపైఁ బ్రయోగింపఁ దగునె
పాపులార యటంచు నాబ్రాహ్మణులను, దవిలి తపియింపుచును మ్రింగఁ దఱిమికొనఁగ.

208


క.

వెఱపింపఁబోయి వెఱచిన, తెఱఁగున దందహ్యమానదేహు లగుచుఁ జె
చ్చెరఁ బరువిడు విప్రుల ముం, దఱఁ గని బ్రహ్లాదుఁ డపుడు దయదైవారన్.

209


మ.

గరళాహీంద్రగజాగ్నివాహములచేఁ గారింపఁగా వచ్చున
ప్పరుల న్మైత్రిని గాంతునేని త్రిజగత్పాలుండ వీవైన నో
హరి సర్వాత్మక విశ్వరూప పరమాత్మా వీరి రక్షింపవే
త్వరగా నంచు నుతింపఁ గృత్తి సనె నంత న్భూసురు ల్వేడుకన్.

210

తే.

అర్భకునిఁ జేరి యప్రతిహతబలంబు, నతులితైశ్వర్యపుత్రపౌత్రాభివృద్ధి
ప్రబల వర్ధిల్లు నీవల్ల బ్రతికినార, మనుచు దీవించి పొగడుచు నవనిసురులు.

211


మ.

చని యాకృత్తివిధానముం దెలుప నాశ్చర్యంబుతో నప్పుడే
తనయు న్బిల్వఁగనంపి దైత్యపతి పుత్రా యిట్టిమాహాత్మ్య మెం
దును గాన న్మఱి నీకుఁ గల్గుటకు మందో మంత్రమో తెల్పుమా
యనఁ బ్రహ్లాదుఁడు దండ్రితో ననియె నయ్యా లేదనం జెల్లునే.

212


సీ.

తాపత్రయాగ్నిసంస్తంభనం బశ్రాంతమదవదంతశ్శత్రుమారణంబు
కమనీయగుణగణాకర్షణం బాజన్మసంచితదుష్కృతోచ్చాటనంబు
సజ్జనవశ్య మజ్ఞానభూతనివారణము దుర్విషయవిషనాశనంబు
దుఃఖశోషణము సంతోషవృద్ధికరంబు ముక్తికాంతామణిమోహఘుటిక


తే.

మొక్కమంత్రంబు నదియును నొకటి రెండె, యక్షరములు పురశ్చరణాదిబహుళ
యత్నములు లేక ఫలియించు నట్టిదెట్టి, దనిన శ్రీహరియను నామ మసురనాథ.

213


తే.

ఔషధంబున నొకవింత యౌషధంబు, భక్తితులసీదలంబు శ్రీభర్తపాద
తీర్థమును బానముగఁ జేసి దినము సేవ, సేయుదును భవరోగము ల్జీర్ణమంద.

214


మ.

అని పల్క న్శతయోజనోన్నతమహాహర్మ్యాగ్రసంస్థాయియౌ
దనుజుం డచ్చటనుండి పుత్రకుని గ్రిందంద్రోఁచినన్ శ్రీహరీ
యనుచున్ వ్రాలెడి విష్ణుభక్తుని రయంబార న్మహీకాంత మె
త్తనిహస్తంబులు సాచి యెత్తె వెఱగందం జూచువా రయ్యెడన్.

215


క.

అందునఁ గందనినందను, చందము గని దైత్యవరుఁడు శంబరుఁ బనుపన్
బృందారకసందోహా, మందభయప్రదములైన మాయలు వన్నెన్.

216


సీ.

వీరదానవకోటి విచ్చుకత్తులతోడఁ బొడుపొడుపొడుమంచుఁ బొదివికొనినఁ
గల్పాంతదీర్ఘనిర్ఘాతసంఘంబులు ఫెళ ఫెళఫెళమంచుఁ బెటిలిపడిన
నభ్రంకషంబులై యంభోధివీచికల్ ఘళఘళఘళమంచుఁ గప్పుకొనిన
శాకినీభూతపిశాచబేతాళము ల్కహకహకహమంచుఁ గదురుకొనిన


తే.

మఱియుఁ గోటులసంఖ్యలౌ మాయ లెన్ని, గనిన వెఱువక హరిహరి యనుచునుండె
బాలుఁ డప్పుడు శ్రీహరి వంప చక్ర, కమలపతి వచ్చి మాయాంధకార మణఁచె.

217


మ.

మాయలు మాయమైనఁ గని మాయురె యంచును శోషకాఖ్యమౌ
వాయువు నంపఁగా దితిజవల్లభుఁ డత్తఱి శోషకంబు ద

త్కాయము సొచ్చి శైత్యమును గాఢతరోష్ణము సూప నెమ్మదిం
బాయని చక్రి తత్పవనపారణ జేసెను బాలుఁ డత్తఱిన్.

218


తే.

ఎన్నిబాధలు పెట్టిన నన్నిబాధ, లచ్యుతస్మృతిచేతనే యపనయించి
గురుగృహంబున నెప్పటికరణి నీతి, శాస్త్రమంతయుఁ జదువ నాచార్యసుతుఁడు.

219


చ.

ప్రమదము మీఱఁ దజ్జనకుపజ్జకుఁ దోడ్కొనిపోయి దానవో
త్తమ మతిశాలియై చదివె దైత్యగురూదితనీతులెల్ల నీ
కొమరుఁ డటంచుఁ దెల్ప నయకోవిద రమ్మని చేరఁబిల్చి యం
కముపయి నుంచి నీతి వినఁగావలెఁ దెల్పు మటన్న నిట్లనున్.

220


చ.

చదివితి నీతి యందు నొకసారము లే దది యప్రయోజనం
బది యెటులన్నఁ దెల్పెద హితాహితభేదము దెల్పునందు నీ
హృదయమునందు నాదు మది నెల్లరయందు ముకుందుఁ డుండఁగా
సదమలనీతి నెవ్వ రిఁక శత్రులు మిత్రులు దైత్యవల్లభా.

221


మ.

ఇది వ్యామోహకశాస్త్ర మిందుల ఫలం బేమున్న దీనీతిసం
పదకు న్హేతువు గాదు పూర్వజననప్రారబ్ధకర్మంపుసం
పదకు న్గారణ మెన్న నీతిపరుఁ డాపన్నుండుగా మూర్ఖసం
పదల న్మించఁగఁ గాంచవే తెలియదే ప్రత్యక్ష మెవ్వారికిన్.

222


సీ.

కామితార్థము లిచ్చు కల్మి గల్గిననేమి దండిశాత్రవులు పై నుండిరేని
దండిశాత్రవకోటి తలలు మెట్టిననేమి భోగపాటవము మైఁ బొదలకున్న
భోగపాటవము మైఁ బొదలియుండిననేమి దేహ మాకల్పంబు దృఢముగామి
దేహ మాకల్పంబు దృఢమైనఁ దానేమి కల్పాంతరమున భంగంబు గనుట


తే.

తలప నివి దుర్లభంబులు గలిగెనేని, యప్రయోజన మాసించి యలయ నేల
శాశ్వతానందపదకాంక్ష సంతతంబు, హరిని గొల్చుట మేలు దైత్యాధినాథ.

223


మ.

అన దంతావళబృంహితంబు విని శైలాగ్రంబుపైనుండి పై
కొనుసింగంబుతెఱంగు దోఁపఁ బరుషక్రోధానలాభీలలో
చనుఁడై దిగ్గున గద్దె డిగ్గి సుతువక్షఃపీఠి దన్నెం బదం
బున దైత్యేంద్రుఁడు విప్రజిత్తిమొద లౌ మూర్ఖు ల్విలోకింపఁగన్.

224


తే.

తన్ని యంతటఁ బోక యద్దానవేంద్రుఁ, డాగ్రహానలశిఖలచే నఖిలలోక
దాహ మొనరించురీతి నుదగ్రుఁ డగుచుఁ, బలికె నిట్లని భీషణభాషణముల.

225


ఆ.

ఓయి విప్రజిత్తి యోయి విధుంతుద, బాలు నాగపాశబద్ధుఁ జేసి
కడలి వైచిరండు గాకున్న వీని మ, తంబె యనుసరించు దైత్యకులము.

226


క.

అని పంప నిలింపాహితు, లనుకంప యొకింతలేక యాప్రహ్లాదు
న్ఘననాగపాశబద్ధుని, నొనరిచి గ్రాహోగ్రమౌ మహోదధి వైవన్.

227

మ.

దితిజాధీశకుమారశేఖరుఁడు మధ్యేవారిధిం గ్రుంకి యం
దతిశక్తిం బొరలంగ వారినిధి వేలాతీతకల్లోలసం
హతుల న్భూతలమెల్ల నిండిన నిశాటాధ్యక్షుఁ డుద్భ్రాంతుఁడై
యతివేగంబున భృత్యులం బిలిచి సాహంకారుఁ డై యిట్లనున్.

228


సీ.

తపియింపఁ బోయి తాఁ దపియించె శుచి శోష సేయఁగఁ బూని శోషించె గాడ్పు
భేదించు శస్త్రముల్ భిన్నంబులయ్యెను జిలువలు గఱువ దంష్టికలు విఱిగెఁ
బొడిచిన దిగ్గజంబుల దంతములు వ్రీలె మాయలన్నియు మటుమాయలయ్యెఁ
గుక్షిఁ జొచ్చిన కాలకూటంబు జీర్ణించిఁ గృత్తికృత్యంబు లకృత్యమయ్యెఁ


తే.

గాన వీనికి నెందును హానిలేదు, జలధిమధ్యంబులో వైచి శైలతతులు
బైనిఁ గట్టింపుఁ డాక్రిందఁబడి సహస్ర, వర్షములకైనఁ బ్రాణముల్ వదలు జడుఁడు.

229


క.

అని పంప భటులు ప్రహ్లాదుని జలధి న్వైచి పైని దోడ్తో వెయియో
జనములపట్టు మహాహా, ర్యనికాయంబులను గట్టి యరిగిన పిదపన్.

230


సీ.

పరుషపన్నగపాశబద్ధుఁడై పాథోధిఁ బడియును దైతేయబాలకుండు
మధ్యాహ్నవేళ నిర్మలమనోద్ఘాతుఁడై విశ్వప్రపంచంబు విష్ణుఁ డనుచు
భావింప నామరూపంబులు నశియించి చిన్మాత్ర మగుచుఁ దోఁచినను దాను
నైక్యమై “బ్రహ్మాహ” మనుబుద్ధి సిద్ధింప నానందవార్ధి నోలాడుచున్నఁ


తే.

దనకుఁ దా వీడె నాగబంధములు వారి, రాశి శోషింపఁ గదలె ధరాతలంబు
నంతఁ బ్రహ్లాదుఁ డుపరిబద్ధాద్రిచయము, నేల వడిఁ ద్రోచి వెలుపలి కేఁగుదెంచి.

231


క.

గగనాద్యుపలక్షణముల, జగముం గని భేదబుద్ధి జనియించినచో
నగి ప్రహ్లాదుఁడనా యని, జగతీశునిఁ బొగడికొనుచు జనకునిఁ జేరెన్.

232


చ.

కనుఁగొని విస్మయంబునను గశ్యపనందనుఁ డోరిదుర్మతీ
యనలములోన వైచితి మహావిష మిచ్చితి మాయవన్నితి
న్ఘనఫణిపాశబంధముల గంధిని ముంచితి నేమి సేసిన
న్మనియెద వింత ప్రోవఁగ రమాపతికైనను శక్తి గల్గునే.

233


వ.

అని రూక్షేక్షణంబుల నాక్షేపించు రక్షఃకులాధ్యక్షునకుఁ బుండరీకాక్షభక్తుం
డిట్లనియె.

234


సీ.

అతిఘోరతాపత్రయము మాన్పుఘనునకుఁ జిదుగుమంటలఁ జల్లఁజేయు టెంత
మృత్యుభయంబు వారించువైద్యున కహిప్రముఖాపమృత్యువు ల్బావు టెంత
యఖిలప్రపంచమాయ నడంచుమాయావి కిల దైత్యమాయ మాయించు టెంత
విస్తారసంసారవిషరాశి దాఁటించు ధీరునకును వార్ధిఁ దేల్చు టెంత


తే.

యేల యజ్ఞాన మొదవె దైత్యేంద్ర నీకు, విష్ణుచేఁ గానిపను లెల్ల విశ్వమునను
గాన నద్దేవుఁ గొల్చి మోక్షంబుఁ గాంచు, మైహికము తుచ్ఛ మంచుఁ బ్రహ్లాదుఁ డనిన,

235

నరసింహావతారదండకము

శ్రీనాథపాదారవిందద్వయారాధనాహ్లాదుఁ బ్రహ్లాదు
నీక్షించి యక్షిణరూక్షేక్షణుండై యదాక్షిణ్యవృత్తి న్మహాక్షుద్రుఁడై యోరి
దుష్పుత్ర పుత్రుండవే నాకు శత్రుండవే కాక లోకైకజైత్రు న్మహాగాత్రు గాంగే
యనేత్రు న్మృషాపోత్రియై త్రుంచి యీధాత్రి గైకొన్న దుర్భావుఁ డేదేవుఁ డం
చుం బ్రశంసించె దాదేవుఁ డెందుండురా మున్ను కంఠీరవాకుంఠశౌర్యంబుతో
నల్ల వైకుంఠముం జేరి వైకుంఠునిం జీరి యెందెందునుం గాన కేతెంచనా త్రుంచ
నాకన్న నాకన్న నాకాదిలోకంబులం దొక్కఁ డున్నాఁడె శిక్షింప రక్షింపనున్
దక్షుఁ డాత్ర్యక్షుఁడైనన్ సహస్రాక్షుఁడైన స్వచోధ్యక్షుడైన న్మదాజ్ఞ న్బ్రవర్తింపఁ
గాఁ గానవా గానవాచాలతన్ దేవగంధర్వకందర్పవాణీమణు ల్నన్ను మెప్పిం
చఁగాఁ గాంచవే యెంచవేలా యవేలాస్మదీయప్రభావంబు భావంబులో నైన
నేమాయ నీమాయ దైవంబు నెందుండు దాఁ జూపరా చూపఱగ్గింపనే దిగ్గన
న్నుగ్గు గావించెద న్నీవు సిగ్గొందఁ [4]బగ్గాడుకోనేల నీ వేళనో బాలకా యూరకే
ప్రేలకన్నన్ బరాకన్న నీకన్నచో నేల నున్నాఁడు విన్నాఁడు తన్నాడువాక్యంబు
ల న్నేఁడు నేనాఁడులో లేఁడు దైత్యాళి వెన్నాడు మన్నీని నిన్నిట్టె మున్నాడు
మన్నీఁడు మున్నాఁడు లేఁడంటివే వాఁడు నిన్నాఁడుకో రాడుగాకయ్య
యీకయ్యమేలా శుభశ్రీకి మేలా రమేలామనోహారికి న్వైరిసంహారికి న్శౌరికి
న్మ్రొక్కవే భక్తికిం జొక్కవే ప్రాజ్యసామ్రాజ్యసంపత్తిచే నిక్కవే కీర్తిఁ బెం
వెక్కవే పెక్కువేలేడు లంచు న్బవిత్రుండు పుత్రుండు శ్రీమచ్చరిత్రంబుఁ బెన్మ
క్కువం దెల్పఁ గల్పాంతసంకల్పజాతాహితానల్పభీమస్వనాకల్పఢక్కాఢమ
త్కారధిక్కారలీలాచమత్కారహుంకారము ల్ఘోరమై మీఱ నోరీ దురాత్మా
దురాలాపము ల్మానవేరా నవైరానుభావంబో నీకు న్స్వభావంబొ జీవంబుపై లేదొ
భావంబు నీకంబుజాతాక్షు సాక్షాద్రిపు న్సాటికి న్మాటికిన్ బేటికిన్ ధూర్తవై కీర్త
నల్ సేసెదో దుర్మతీ దుర్మదం బేటికి న్నేఁటికిన్ న్మామకాస్థానమధ్యస్థితస్తంభ
గర్భంబునం జూపరా జూపకున్న న్గృపాణంబుచేఁ బ్రాణము న్గొందు నీ దవుఁ
డావిష్ణుఁ డేలాగు రక్షించునో చూత మంచు న్మహారోషజాజ్వల్యమానేక్షుఁ
డయ్యున్ రణారంభసంరంభసంభిన్నజంభారిగంభీరకుంభీంద్రకుంభాగ్రసం
భూతముక్తావళీగుంభశుంభత్సరూదగ్రమౌ మండలాగ్రంబు చేబూని దిగ్గంధ
నాగేంద్రముల్ మ్రొగ్గగా డిగ్గనం గద్దియం డిగ్గి నాళీకనాభాగ్రతఃప్రేషితస్వీయ
తేజోవిశేష ప్రభాసూచిరోచిస్స్ఫురద్రత్నపాంచాలికాపాలికాబింబితాశే
షరక్షస్సభాస్తారవిస్తారితాత్మీయగర్భస్థితాబ్జాక్షతాప్రాప్తసర్వాత్మకత్వో
జ్జ్వలత్కాంచనస్తంభముం బూర్వసంరోపితాశాజయస్తంభసంభే
దనప్రక్రియ న్మించి వ్యాయామవేళాసునాయాసలీలాకృతాఘాత

లోలాయితస్వర్ణశైలాగ్రసాలాపతత్పుష్పవృష్ట్యాత్మశక్తిప్రహృష్టామరో
త్సృష్టమేధాభవత్తుష్టియౌ ముష్టిచే వ్రేయ నంత స్బెఠిల్లంచు నత్యంత
కల్పాంతదుర్దాంతతంతన్యమానానిలశ్రేణిదోధూయమానాభ్రవిభ్రా
జితాదభ్రశుభ్రేతరాభ్రచ్ఛటావిర్భవల్లక్ష్యకోట్యర్బుదప్రేంఖదుచ్ఛృంఖలా
సంఖ్యపుంఖానుపుంభీభవద్దీర్ఘనిర్ఘాతనిర్దోషము ల్మీఱి యత్యుగ్రమై
రావంబు పుట్టెన్ ఫెళారంచు బ్రహ్మాండభాండంబు వ్రీలెన్ ఫణీంద్రుండు సోలెన్
గ్రహశ్రేణి రాలె న్బయోజాతజాతుండు తూలెన్ దిగంతేభము ల్లూలెఁ
బ్రాలేయశైలాదికుత్కీలము ల్సీలె వారాసు లింకె న్దినేశుండు గ్రుంకె న్మహే
శుండు గొంకె ధరాచక్ర మల్లాడె దిగ్బిత్తిక ల్బట్టువీడె న్సురేంద్రాదుల న్మూర్ఛ
గూడె న్వెలుం గూడ నింబాడెఁ జీకట్లు పైయాడె నానామహాభూతసంఘంబు
గీపెట్టె విభ్రాన్తులై విప్రజిత్యాదిదైత్యు ల్హఠాల్లబ్ధచక్రాసికోదండదండాది
నానాయుధోపేతులై జాతసంఘాతులై చెంతకుంజేర నోహో భయం బేటికిం
చాళు మంచు న్మహాహార్యధైర్యంబు శౌర్యం బవార్యంబుగా దైత్యవర్యుండు
భాస్వద్గదాదండ మంసంబుపైఁ జేర్చి రూక్షేక్షలం జూడఁగా దాడితస్తంభ
గర్భంబున న్భగ్గుభగ్గంచుఁ గాలానలజ్వాలిక ల్గ్రక్కుచున్ దిక్కరిశ్రోత్రము
ల్వీలఁగా సింహనాదంబు గావించుచుం జండబాహాసహస్రోజ్జ్వలాసిక్షురప్రాస
బాణాసకౌమోదకీశంఖచక్రాదినానాయుధంబు ల్దిగంతములం జిమ్ముచు న్ఘోర
సంహారవేళాఫణీంద్రాన్యసాహస్రజంజన్యమానాగ్నిసంజాతసంకర్షణుండో
మహాకాలుఁడో లేక కాలాగ్నిరుద్రుండొ సాక్ష్మాన్మహామృత్యువో యంచు
నూహింపఁగా భ క్తజాలాఘశైలౌఘవిచ్ఛేదనామోఘలేఖాధినాథాసిరేఖా
వళీచంకనత్పాదపంకేజసంకీర్ణహంసావతంసక్రమోత్పాదితాపత్యమత్యా
మహాంగుష్ఠముఖ్యాంగులీసంగరంగన్నఖశ్రేణి వీరాభిధాచంద్రసేనాగ్రణీ
కాహళీమోహనిర్వాహజంఘల్ నరాకారహర్యక్షవక్త్రైకదాసూచనో
త్సాహసందర్శితోద్దండవేదండశుండాయితోరుద్వయంబు న్స్వకీయోరు
భాగా చిరాద్భావిరక్షఃకులాధ్యక్షవక్షఃస్థలానృక్ప్రవాహైకసంసూచకా
భామినీమేఖలోద్దామభాస్వత్కటీరంబు నీరేజజన్మస్ఫుటీకారకాసారగంభీర
నాభీప్రదేశంబు నానాబ్జజాతాండసంవాసముష్టిప్రమేయోదరంబున్ బహీ
రూఢహృద్గాఢరోషస్ఫురత్కౌస్తుభంబు న్మహోదారకాశ్మీరపంకాంక
ముక్తావళీవ్యంజితాగామిదైత్యాంత్రపాళీమహోర్యస్థలంబు న్మహాబాహు
భోగీంద్రభోగాభహస్తోజ్జ్వలత్పంచవక్రాయమానాంగులీజిహ్వికాజాగ్రదు
గ్రన్నఖాగ్రంబులు న్మాంసలాంసోదయాస్తాచలాగ్రస్ఫురచ్చంద్రసూర్యప్రతీ
కాశనక్రోజ్జ్వలత్కుండలంబు ల్మనుష్యాంగసింహాగనిర్ణేతృరేఖాస్ఫురత్కంబు
కంఠంబు సద్వేషదోషాచరాధీశ యోషామణీ రత్నభూషావిశేషావళీ జీర్ణపర్ణ

ప్రపాతప్రభూతప్రవాతోగ్రలోలాధరోష్ఠప్రవాళంబు సంవ్యావృతాస్యాఖ్య
పాతాళగర్తోద్ధితాహీంద్రశంకావహప్రోచ్చలజ్జిహ్వయున్ దానవద్వేషివిద్వేష
ణప్లోషహేమస్ఫురద్ధూమకేతూజ్జ్వలజ్వాలికాజాలమోముచ్యమానాస్యశ
శ్వత్పునస్సంవృతా శంకిపార్శ్వస్థలస్తాపితశ్శ్వేతదండోల్లసద్దంష్ట్రిక ల్వేషకాకో
దరీనాయకా కల్పశాతోదరీజన్మహేతుక్షమా భృద్ధరీసోదరీ భూతరీతిస్ఫుడ
న్నాసికారంధ్రము ల్వైరిసంహారహోమాగ్నికుండాయమానాములు న్భ క్తలో
కస్తవాకర్ణనస్తబ్ధలీలావహచ్ఛంకుకర్ణంబులుం దారకామౌక్తికశ్రేణికారంధ్రకృ
త్సూచికాగ్రేసరంబు ల్స్వవకత్రానలజ్వాలికాదాహశంకాశిరస్థాపితామర్త్యధాత్రీ
ధరభ్రాంతి క్రుద్ధేందుకోటీరము న్మీఱగాఁ గోటిసూర్యప్రతీకాశతేజంబుతోడ న్నృ
సింహుండు మించ న్నృసింహు న్విలోకించి కించిద్భయభ్రాంతియు న్లేక నాకారి
యత్యద్భుతాలోకుఁడై లోకమం దేకడం గాన మీజోక యాకార మౌరౌర
యాకారము న్మానవాకారమా పైని కంఠీరవాస్యంబు సూపట్టె నీపట్టునం బట్టి
వాక్యంబు చేపట్టి తా నిట్టిరూపంబునం దిట్టయై పుట్టెఁ గాఁబోలు వైకుంఠుఁ
డిం కెట్టు వోవచ్చు నం చట్టహాసంబుతోఁ జండవేదండశుండాయితోద్దండ
దోర్దండభాస్వద్గదాదండముం ద్రిప్పుచుం జేరరాఁగాఁ బతంగేంద్రుఁ డుత్తుంగ
రోషంబు వొంగ న్భుజంగంబు లాగించుభంగిన్ నృసింహుండు బాహాసహ
స్రంబునం బట్టినం జిక్కె దైతేయుఁ డంచు న్సుపర్వాళి పెల్లార్వఁగా నంత
దుర్దాంతదోశ్శక్తి మల్లాడి నిర్ముక్తుఁడై సాహసోద్యుక్తుఁడై ఖడ్గభేటంబులం బూని
నీడోద్భవశ్రేణీకి న్వాలుశ్యేనంబుచందంబున న్నింగికై చంగునం దాఁటుచుం
గ్రిందికిం దూఁటుచుం బ్రక్కలన్ డాయుచు న్మండలాగ్రంబుచే వ్రేయుచుం బట్ట
రాఁ ద్రోయుచుం దిట్టయై పాయుచుం దర్జన ల్సేయుచున్ లోకువల్ రోయుచుం
జాలఁబోరాడు దైతేయరా డుత్తముం గాంచి యత్యంతరోషంబుతోడన్ నృ
సింహుండు గర్వాంధపూర్వామరగ్రాహలోలంబులౌ బాహు లుత్సాహముం
జృంభితాస్యాంతరాలోచ్చలజ్జిహ్వచాపల్యముం గ్రోధజాజ్వల్యమానాక్షు
లుగ్రంబు భీమాట్టహాసంబు హర్షంబు వీరోక్తిగర్వంబు భ్రూభంగలౌల్యం బసూ
యన్ సునాయాససంగ్రామయత్నంబు మత్తత్వముం దెల్పగా రౌద్ర మాకా
ర మౌలీల నిశ్శ్వాసఝంఝానిలశ్రేణిచేతం బయఃకుంభికుంభీరకుంభీనసగ్రా
హమీనోగ్రయాదస్సమేధంబులౌ సప్తపాథోధు లభ్యంకషోల్లోలకల్లోలమై
మించి సప్తాంతరీపంబులం బోలుచున్ దారుణోచ్ఛ్వాసవాతంబుల న్మర్లుచు
న్సంజ్వలద్బాడబజ్వాలచేఁ దెర్లుచుండన్ లలాటస్రవద్ఝర్మతోయంబు దంష్ట్రా
స్ఫులింగంబులం జుయ్యి చుయ్యంచు మంచుం బొగ ల్వుట్టఁగా బెట్టుగా నట్ట
హాసంబు మీఱంగఁ జేరంగ సారంగముం గాంచి లంఘించు వ్యాఘ్రంబు
శీఘ్రంబున న్వెన్ను పద్మోద్భవాండంబు పై చిప్ప సోఁక న్సురారాతిపై నేచి

లంఘించి దైతేయునిం బట్టి రేయుంబగల్గాని సంజన్నివేశంబుఁ బాహ్యప్రదేశంబు
నుంగాక మధ్యస్థమౌ దేహళిన్ సాంగమౌ మర్త్యరూపంబుఁ గంఠీరవాకారముం
గాని సమ్మిశ్రరూపంబుతో భూమి యాకాశముంగాని యూరుద్వయిం బెట్టి య
ప్రాణులుం బ్రాణులుం గాని జాగ్రన్నఖ గ్రంబుల న్వజ్రి వజ్రంబునం దండి దండం
బునం బాసి పాశంబున న్శూలి శూలంబునం జించఁగా రాని రక్షఃకులాధ్యక్షు
వక్షఃస్థలిం జించిన న్హృత్పుటాపూర్ణరోషంబు పై కుబ్బుచుం గొబ్బునన్ ఱొమ్ము
పై గ్రమ్ము రక్తంబు హస్తంబుల న్ముంచి తామించి లీలాజయశ్రీ పయిం జల్లు
కాశ్మీరతోయంబుఠేవం దిశావీథులం జల్లుచున్ హృత్పుటి న్నీడ వీక్షించి
ఫాలేక్షణస్ఫూర్తి గన్ పట్ట లాలాటదేశంబున న్రక్తపంకంబుచే బొట్టుగాఁ బెట్టు
చున్ రక్తరక్తాగరుశ్రీ విడంబింపఁ గంఠంబున న్మేన నాలేపముం జేయుచుం
బెట్టుగాఁ బొట్టప్రేవు ల్వెసందీసి కట్టల్కతోఁ గంఠహారంబులుం జేయుచు న్మెం
డుగాఁ గండలుం దొబ్బలున్ మాంసమున్ గ్రొవ్వు నొండొంటి రాఁదీయుచుం
జేరికం జేరఁగా లేక యందంద వాచారు నానామహాశాకినీఢాకినీభూత
బేతాళరింఛోళికిన్ వ్రేయుచు న్వజ్రసారాస్థిపాళిన్ నెటుక్కంచు ఖండించు
చుం బోగుగా నించుచున్నంత విభ్రాంతితో విప్రజిత్యాదిదైత్యుల్ దల ల్వీడఁ
గాఁ బాఱి రెందెందునుం గొందఱం దార్తిఁ బ్రహ్లాదుపార్శ్వంబునం జేరి రక్షః
కులాధ్యక్షుని న్మర్త్యహర్యక్షుఁడై పంకజాక్షుండు శిక్షించె మమ్మింక నక్షీణకా
రుణ్యదాక్షిణ్యవీథి న్నిరీక్షించి రక్షింపుఁడంచు న్నుతు ల్సేసి యాత్మీయశౌర్యం
బు ధైర్యంబును న్మీఱఁగాఁ గుంతకౌక్షేయబాణాసముఖ్యాయుధశ్రేణులం
బూని ద్వేషంబు రోషంబు మీఱం జిగీషం దనుంజేరు దోషాచరవ్యూహ
ముం గాననం బేర్చు కార్చిచ్చులీలన్ ముఖజ్వాలల న్నీరుఁ గావించి మాతంగభం
గంబు గావించి తద్రక్తసిక్తాంగమౌ సింగముం బోలుచున్ దానవాసృగ్వసంతం
బునం బూయు పర్ణ ప్రసూనంబులో నా నఖశ్రేణి రాణింప నుద్యద్దినేంద్రాంశు
సంఘంబులో సాంధ్యరాగంబులో చంచలాజాలమౌ సుందరీ ల్లులో కంజ
కింజల్కపుంజంబొ సంతప్తసౌవర్ణదండంబులో నాగశోణాయమానంబులై
కేసరంబు ల్విరాజిల్లఁగాఁ గొండపై మండు దావాగ్ని విస్ఫూర్తి దైతేయసిం
హాసనాధీశుఁ డై చండరోషంబుతోనుండు జ్వాలానృసింహు న్విలోకింపఁ
గా డాయఁగా సన్నుతు ల్సేయఁగాలేక బ్రహ్మేంద్రముఖ్యామరు ల్భీతభీతాత్ము
లై దూరదూరంబున న్నిల్చి రవ్వేళ హర్షంబుతో దేవగంధర్వకాంతామణుల్
పుష్పవర్షంబు వర్షించి రుద్వేలశైత్యంబుతో గంధవద్గంధవాహార్భకశ్రేణి వీతెంచెం
దొడ్తో మృదంగావళీధింధిమధ్వానముల్ శంఖభుంభున్నినాదంబులున్ భేరి
ధంధం ధణారావముల్ తోరమై మీఱె నాకంబునం దచ్చరల్ నృత్య
వైయాత్యముం గిన్నరు ల్గానచాతుర్యముం జూపి రంత న్విధీశానముఖ్యు

ల్విదూరంబునన్ నిల్చి సాష్టాంగదండ ప్రణామంబు గావించి సేవించి
జ్వాలానృసింహద్విజిహ్వాభజిహ్మానతాంహసమశ్చక్రసంహారరంహాస్వ
యంహారిహారిత్తురంగప్రభాఝాటపాటచ్చరోద్యన్మణీకోటికోటీర
కోటీ నిరాఘాటధాటీ సమాటీకనాటోపశోభావళీ ఘాటికాక్రాంతజాటీగ
శాటీ నిశాటీ దృఢోరోజపాటీరచర్చాజటాటంకకోటీరశోభాసము
చ్చాటనాటంకపంకేజబంధుప్రభాబంధురేక్షాకటాక్షాకటాక్షానుకంపక్రియా
శంసితోద్యన్నిలింపారిసంపత్ప్రకంపా జగద్వేషిరక్షః కులాధ్యక్షు నీక్షించి
లోకంబు రక్షించి తింకం గృపావీక్ష మమ్ముం గటాక్షించు రూక్షేక్షణం బేటి
కంచుఁ బ్రశంసించి యద్దేవుప్రాశస్త్యముం గానఁగాలేక ఫాలేక్షు వేఁడ న్విదా
రింతు నేనంచు నత్యుగ్రమౌ శారభాకారముం బూని యష్టాంఘ్రులన్ శైల
రాజంబులం జిమ్ముచుం బద్మజాండంబు నిండారి వ్యావృతవక్త్రంబుతోఁ బైకి లం
ఘింప శంకింపఁగా సింహవైరి న్విచారించె దేవారి వక్షఃస్థలీదారుణోద్యన్నఖా
గ్రంబుల న్మర్త్యకంఠీరవం బంత శ్రీసన్నిధిం జేరి తల్లీ భవద్వల్లభుం డెంతయున్
రోషతంతన్యమానాత్ముఁడై యున్నవాఁ డిట్టివేళం బ్రసన్నాత్ముఁ గావించి యస్మ
ద్భయభ్రాంతి వారించి లోకత్రయీరక్ష గావింపఁగా మీరెగా కింక నెవ్వా
రలున్ లే రటంచుం దనుం బ్రార్థన ల్సేయు బ్రహ్మాదులం జూచి కా నిమ్మటంచున్
రమాదేవి నెత్తావిపూబంతికిం గ్రమ్ము భృంగంబులో నాఁగఁ గల్పప్రసూనంబులం
గొప్పయై యొప్పు కీల్గొప్పుక ప్పూనగా వేణీకాషట్పదశ్రేణి నెమ్మోము కెందమి
నెత్తావి యేమాత్రమో చూచి రమ్మంచు బంప న్ముఖాంభోజ సద్వాసన
ల్గ్రోలుచుం బోవఁగా లేని చారాళినా మీరు ఫాలస్థకస్తూరికారేఖయుం దాని
రాదాయనంచు న్విలోకించు బాలాళిబృందంబునా రంగులౌ ముంగురుల్
మోము జాబిల్లి గాన న్విచిత్రంబు గాలేడి లోనూని తల్లోచనద్వంద్వముం
బైని గన్పించు లీల న్విరాజిల్లు నేత్రంబులుం బెళ్కువాల్జూపులుం జాతినిద్దంపు
కెంపుం దుటారించు కెమ్మోవిపై నందమౌ మందహాసంబు చెన్నొందు క్రొమ్ము
తైపుంజెక్కడంపుంబదాఱ్వన్నెబంగారపుంగమ్మ గ్రొమ్మించు లేచెక్కుటద్దం
బుల న్నిద్దము ల్సూపఁగా జాళువాగిండ్ల పూఁజెండ్ల దాడింబపండ్ల న్విడంబించు
పాలిండ్లపై రత్నహారావళు ల్చౌకళింపన్ వలగ్నంబు జవ్వాడ శ్రోణీమణీమేఖలా
కింకిణు ల్మ్రోయఁ జెంగావిమంజీర ముంగొంగున న్వింతఁగాఁ గ్రొత్తఁగా జంట
ముత్తెంబుల న్గూర్చు చెల్వౌ నఖంబు ల్విలోకించువా రల్పదోర్మేవమాయస్య తత్ప
రమ్మంచున్ సమానింప నింపౌ పదాంభోరుహంబుల్ రణన్మంజుమంజీరశింజా
రవంబుల్ చెలంగన్ జగన్మోహనాకారరేఖావయోరూపలావణ్యశృంగార
లీలావిలాసంబులున్ హర్షరోమాంచము న్మించగాఁ జెంతకు న్వచ్చుచో నాథు
మధ్యందినాదిత్యకోటిప్రతీకాశమౌ మోము వీక్షించి యమ్మక్క యీయక్క

జం బెన్నడుంగాన నేరీతి నేజీరుదుం జేరి యేజాడ మాటాడుదుం బిల్చిమాటా
డిన న్మాఱుమాటాడునో యాడఁడో వేడుకం జూచునో చూడఁడో యంచు
నూహించుచు న్దాదృశప్రేమ మున్మున్నుగా దీయగా ఘోరమౌ దృష్టి వెన్వె
న్కకుం ద్రోయఁగా భీరుభావంబుచేఁ జాలనాందోళితస్వాంత యౌ నిందిరా
కాంత నీక్షించి పంకేజగర్భుండు ప్రహ్లాదుని న్వేఁడ నవ్విష్ణుభక్తాగ్రగణ్యుండు
మందంబుగా మోడ్పు కెంగేలితో సన్నిధింజేరి పాదాబ్జము ల్మౌళి సోఁకంగ
సాష్టాంగదండప్రణామంబు గావించి శ్రీగంధయోగంబునం జల్లనౌ దప్తతై
లంబులీలన్ మహారోషమెల్లం బ్రశాంతంబుగా సుప్రసన్నాత్ముఁడై యానృసిం
హుండు ముందగ్నితోఁ బోరు కందమ్మి కెంజాయ సౌగంధికశ్రీ విడంబింపఁ
గారుణ్యదృష్టి న్విలోకించి శస్తప్రదానప్రశస్తాత్మహస్తంబు ప్రహ్లాదు మస్తం
బునన్ నిల్పినన్ స్వేదరోమాంచమోదాశ్రుగాద్గద్యయోగంబు భక్త్యంగనా
లింగితత్వంబు మైగాంచి తత్త్వజ్ఞుఁడౌ బాలుఁ డేకాగ్రచిత్తంబుతోడ న్నమస్తే
నమస్తే లసద్రత్నమౌళిన్ నమస్తే నమస్తే యనామ న్కృపాళో నమస్తే నిర
స్తేంద్రశత్రోద్యతారే నమస్తే నమస్తేశ నఃపాహి విష్ణో యటంచుం బునర్వంద
నంబు ల్సమర్పించి లక్ష్మీకళత్రాపవిత్రంబులై పాపవల్లీలవిత్రంబులై చాలచిత్రం
బులౌ నీచరిత్రంబులన్ స్తోత్రము ల్సేయఁగా గోత్రపుత్రీకళత్రాదులు న్నేర
రన్నన్ సురామిత్రపుత్రుండ నేనెన్నఁ బాత్రుండనే ముక్తికాంతానురక్తి
న్విరక్తి న్సుయుక్తి న్భయద్భక్తి గావింతుఁ దద్భక్తికి న్సాటిరా వేజపంబుల్
తపంబు ల్మహాదానముల్ ధ్యానము ల్మౌనము ల్యాగము ల్యోగము
ల్త్యాగము ల్కర్మముల్ జేసియు న్నీపదాంభోజసద్భక్తి గావింపఁగా
లేని యావిప్రుకంటెం గృతార్ధుండు నీచుండు నీభక్తుఁ డైనన్ యథార్థంబు సం
తాపరూపంబుచే నగ్నిసంలగ్నమై యన్యలోహంబు శోషించుచుం బైఁడికి న్వన్నె
హెచ్చించి తానీటిలో నాఱు చందంబునన్ నీదురోషంబు దుష్టాసురశ్రేణి
ఖండించి కళ్యాణభూయిష్ఠమైనట్టి బ్రహ్మాండము న్వన్నెవాసిం గనంజేసె నింక
న్శమింపంగ యుక్తం బటన్న నృసింహుండు హృష్టాత్ముఁడై వత్స నీభక్తికి
న్మెచ్చితిం గోరు నీయిచ్చకు న్వచ్చు నర్థంబు నే నిచ్చెదన్ హెచ్చుగా నన్నఁ
బ్రహ్లాదుఁ డెంతే వినీతాత్ముఁడై స్వామి మేయర్థముం గోరువాఁడ న్సమస్తంబు
నిత్యంబు శక్రాదిదిక్పాలకైశ్వర్యము ల్క్రోధి దేవద్విషద్యోధబాధాకులంబుల్
నిజాటోన్నతు ల్నీవె వారింతు వట్లౌట నేనేదియు న్వల్ల నీవల్లనౌ భక్తియే చాలు
పోత్రిస్వరూపంబునం ధాత్రికై హేమనేత్రున్ విచారించినా వంచుఁ దా మిం
చురోషంబున న్నాదువాక్యం బసారంబు గావించి నీపైని ద్వేషంబు గావించు
గావించుకైనం బ్రియంబు ల్భవన్నామసంకీర్తనంబు ల్నినుం గొల్తునంచు న్ననుం
జాల బాధించు మాతండ్రినిం బాపనిర్ముక్తునిం జేయు నా కీవరంబే ప్రియంబన్న

లేనవ్వుతో స్వామి హర్యక్ష మోవత్స ని న్గాంచుటం జేసి నీతండ్రి ముయ్యేడు
వంశంబులంగూడి శుద్ధాత్ముఁ డయ్యె న్విచిత్రంబె నీవంటినాభక్తు లేదేశమం దుం
దురో యట్టిదేశంబులందున్న పాపాత్ములుం జాలపుణ్యాత్ములై యాయురారోగ్య
సౌభాగ్యభాగ్యంబులుం గల్గి వర్తింతురంచుం బ్రసన్నాత్ముఁడై యిందిరాకాంత
నంకంబుపై నుంచి లక్ష్మీనృసింహాఖ్యచే భక్తులం బూర్ణకారుణ్యదృష్టిం గటాక్షించి
రక్షించుచు న్మించె నెల్లప్పుడున్.

236


వ.

అంత.

237


శా.

ఆదిత్యు ల్సుమవర్షము ల్గురియఁ దూర్యారావము ల్మీఱ భృ
గ్వాదు ల్మంత్రము లుచ్చరింప మణిపీఠారూడుఁ గావించి ర
క్షాదక్షుండని దైత్యదానవమహాసామ్రాజ్య మేలంగఁ బ్ర
హ్లాదుం బట్టము గట్టె బ్రహ్మ జగదాహ్లాదంబు సంధిల్లఁగన్.

238


క.

ధరణీశ్వర వినిపించితి, నరహరిచరితంబు పావనం బిది నరులె
వ్వరు విన్న వా రికొదవు, న్హరిభక్తి [5]చిరాయురీహితైశ్వర్యంబుల్.

239


క.

అని శ్రీవైశంపాయన, మునిముఖ్యులు దెల్ప విని ప్రమోదాన్వితుఁ డై
జనమేజయుఁ డవ్వలికథ, యనఘా వినవలతుఁ దెల్పు మని యడుగుటయున్.

240


శా.

ఆత్మానాత్మవిచారచారుతరమేధాధారధారాధరై
కాత్మత్వప్రతిపాదనప్రవణదానా సారసారంగవా
హాత్మంబర్యధినాథ నిర్మలతరవ్యాహార హారస్థగా
రుత్మద్రత్న విభా నిదర్శిత హృదారూఢాచ్యుతాంగప్రభా.

241


క.

కవిరాజరాజకృతకృతి, కవిరాజవిరాజతనుత ఖలపథికపురః
కవిరాజరాజసమధని, కవిరాజవిరాజితాస్య కమనీయయశా.

242


పృథ్వి.

ఫణాధరపణా స్ఫురద్బహుచిరత్న రత్నప్రభా
రుణారుణవిదారణారుణభుజా మహోభీషణా
రణాంగణభయానక క్రమజయానక ప్రస్ఫుటా
ధణాధణధణార్భటీదళిత చిత్తవిద్వేషణా.

243


గద్య.

ఇది శ్రీరామభద్రదయాభిరామభద్రకరుణాకటాక్షవీక్షాపరిప్రాఫతలదీప్తతరాష్ట
భాషాకవిత్వసామ్రాజ్యధౌరేయ సకలవిద్వత్కవిజనవిధేయ ధరణిదేవుల నాగ
నామాత్యసుధాసముద్రసమున్నిద్రపూర్ణిమాచంద్ర రామమంత్రీంద్రప్రణీతం
బైనదశావతారచరిత్రం బనుమహాప్రబంధంబునందుఁ జతుర్థాశ్వాసము.

4. నరసింహావతారకథ సమాప్తము.

  1. నెందే సర్వజీవవ్రజం
  2. న్గూల్పఁగా
  3. గన్నీరు గ్రక్కుచు
  4. బ్రజ్ఞాడుకోనేల, ప్రజ్ఞ-పగ్గె
  5. చిరాయు సుమహితైశ్వర్యంబుల్