దశకుమారచరిత్రము/ద్వితీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

దశకుమారచరిత్రము

ద్వితీయాశ్వాసము

     శ్రీశ్రితవక్షునకు నుదా
     త్తశ్రౌతస్మార్తకర్మతత్పరమతికిన్
     విశ్రుతవిశ్రాణునకును
     నాశ్రితభరణునకుఁ దిక్కనామాత్యునకున్.1
వ. అభ్యుదయపరంపరాభివృద్ధిగా నా చెప్పంబూనిన కథానికా
     యం బను (సుర)లతాజాలం బెట్టి దనినఁ దదీయకందం బైన
     కుసుమపురంబున కధీశ్వరుం డైన రాజహంసమహీవల్లభు
     వృత్తాంతంబును రాజవాహనప్రముఖదశకుమారజననప్రకా
     రంబును దివ్యవాగుపదేశక్రమంబున వారలు దిగ్విజయార్థం
     బరుగుటయు వింధ్యాటవీమధ్యంబున మాతంగకుం డను
     సాధకునకుఁ గ్రియాసహాయత్వంబు ననుష్ఠింపం బూని
     రాజవాహనుండు చెలుల వంచించి చనుటయుఁ దదన్వేష
     ణార్థంబుగాఁ దక్కినకుమారులు దిక్కులను బెక్కుముఖం
     బులం బోవుటయు దైవయోగంబున బిలంబు సాధించి
     వెలువడివచ్చి పుష్పోద్భవసోమదత్తులంగలసి రాజవాహనుం
     డుజ్జయినీపురంబునకుం బోయి తత్పతియైన దర్పసారుని చెలి
     యలి నవంతిసుందరి యను కాంతారత్నంబుం గపటో
     పాయంబునం బరిణయంబగుటయుఁ గొండొకకాలంబునకుఁ

     జంపానగరంబునం గుమారు లెల్లం గూడుటయుఁ దొలుతఁ
     గూడిన యిరువురచరితంబులు రాజవాహనువలన నెఱింగి
     దక్కినకుమారులుం దమతమచరితంబులు క్రమంబున నత
     నికి విన్నవించుటయును బదంపడి శాత్రవజయం బొనర్చి
     రాజహంసుచేత రాజవాహనుం డభిషిక్తుం డగుటయు
     నతండు సముద్రముద్రితంబైన వసుధాచక్రంబు నిర్వక్రం
     బుగాఁ బాలించి మిత్రగణసమేతంబుగా రాజ్యసుఖంబు
     లనుభవించుటయు నై యొప్పు సిద్ది యది సవిస్తరసందర్భ
     సంకీర్తనం బాకర్ణనీయంబుగా వర్ణించెద.2
సీ. ఎందులపరిఖ భోగీంద్రబృందమునకు
                    భాసురకేళీనివాస మయ్యె
     నెందులకోట దినేంద్రునశ్వములకు
                    సముచితవిశ్రమస్థాన మయ్యె
     నెందులసౌధంబు లిందిరాదేవికి
                    నెసకంపుఁ బుట్టినయిండు లయ్యె
     నెందుల జనుల సమృద్ధవర్తనములు
                    పరుల కుత్తమకృత్యభంగు లయ్యె
ఆ. నట్టి కుసుమపురమునందు విశ్వంభరా
     భారభరణపరిణతోరుభుజుఁడు
     రాజవంశజుండు రాజహంసుం డను
     రాజు గలఁడు దివిజరాజనిభుఁడు.3
వ. అమ్మహీవల్లభునకుం గులక్రమాగతులగు నాప్తమంత్రులు
     మువ్వురు గల రందు మతిశర్మ యను మంత్రికి సుమ
     తియు సత్యశర్మయు, ధర్మపాలుండను నమాత్యునకు సుమి

     త్రుండును గామపాలుండును, బదోద్భవుం డను సచివు
     నకు రత్నోద్భవుండును సుశ్రుతుండును సుమంత్రుం
     డును నను తనయులు పుట్టి రి ట్లుదయించినపుత్రవర్గంబు
     లోన సత్యశర్మ ధర్మకర్మపరాయణుం డై తీర్థయాత్ర పోయెఁ
     గామపాలుండు దుర్వినీతుం డై జనకాగ్రజులశాసనంబునం
     దనాదరంబు చేసి యెక్కడికేనియుం జనియె రత్నోద్భ
     వుండు వణిగ్వ్యాపారపారంగతుం డై కలం బెక్కి [1]బేహా
     రంబునం బోయెఁ దక్కినసుమతియు సుమిత్రుండును సుశ్రు
     తుండును సుమంత్రుండును నను నలువురుం దమతండ్రుల
     పిమ్మట నారాజునకుం బ్రధాను లై కార్యంబు లనుష్ఠింప
     వసుమతికి సవతియనం దగు వసుమతీదేవి యగ్రమహి
     షిగా నతండు రాజ్యసుఖంబు లనుభవించుచున్నయెడ
     మాళవదేశాధీశుండైన మానసారుండు రాజ్యగర్వంబున
     గన్నుఁగానక కయ్యంబునకుఁ గాలు ద్రవ్వి యెగ్గు లొనర్చిన
     వానిమీఁదఁ బోవం దలంచి ప్రయాణభేరి సఱవం బంచిన.4
మ. కులశైలంబులు దిర్దిరం దిరుగ దిక్కుంభీంద్రవర్గంబు సం
     చలతం జెంద వియత్తలంబు పగులన్ సర్వంసహాచక్రమా
     కులతం బొందఁగ సప్తసాగరములున్ ఘూర్ణిల్ల లోకంబుల
     ల్లలనాడం జెలఁగెన్ బ్రయాణపటహం బత్యద్భుతాపాదియై.5
వ. తదనంతరంబ.6
క. భేరీభైరవభాంకృతి
     ధూరీకృతశత్రుఁ డగుచుఁ దుహినాంశుకులా

     ధారుఁ డగు రాజహంసమ
     హీరమణుఁడు దండు వెడలె నెంతయు నలుకన్.7
క. జలనిధులు నిట్టపొడువం
     బ్రళయాంతకుఁ డవనిజనులపై నేచినయ
     ట్లలఘుప్రకటచతుర్విధ
     బలయుతుఁ డై మానసారుపై వడి నడిచెన్.8
ఉ. మాగధనాథుఁ డి ట్లరుగ మాళవవల్లభుఁ డాగ్రహించి యు
     ద్యోగము విక్రమంబు విభవోన్నతియున్ విలసిల్లుచుండ నా
     నాగజయూథఘోటకసనాథ సమగ్రబలంబుతోడ భూ
     భాగము పల్లటిల్లఁ బయిపై నడిచెన్ సమరాభిలాషి యై.9
వ. ఇవ్విధంబున మగధమాళవేశ్వరు లొండొరుల కెదురు
     నడిచి కలను చెప్పి మొనలు దీర్చి కదిసినసమయంబున.10
క. కరిఘటలు తుకగచయములు
     నరదంబుల మొత్తములు భటానీకములున్
     బెరసి దిగంతము లద్రువఁగఁ
     బరువడి దలపడిరి రెండువాగులయందున్.11
వ. అయ్యవసరంబున.12
క. కరికరములఁ దురగఖురో
     త్కరముల రథచరణములఁ బదాతులు పై పైఁ
     దొరుఁగుచుఁ దునియుచు నలియుచు
     ధరణీభాగమునఁ బడిరి తఱచై యుండన్.13
క. కాలుబల మెల్ల నిమ్మెయిఁ
     గాలునిబల మయ్యె నంతఁ గరితురగరథా

     భీలత్రివిధబలంబులు
     నాలంబున రౌద్రరసము నాకృతి చూపెన్.14
వ. తత్సమయంబున.15
ఉ. ఆమగధేశమాళవధరాధిపు లెక్కటిఁ బోరి రాజిలోఁ
     గాముఁడు శంబరుండు శశిఖండధరుండు గజాసురేంద్రుడున్
     రాముఁడు రావణుండు సురరాజతనూజుఁడు సింధునాథుఁడున్
     భీముఁడు దుస్ససేనుఁడు నుపేంద్రుడు కంసుఁడుఁ బోరునాకృతిన్.16
వ. ఇ ట్లతిఘోరయుద్ధంబు సేసి పసమరియున్న మానసారుం
     జూచి కరిపోతకంబుఁ గనిన కంఠీరవంబునుంబోలెఁ గోపించి
     పట్టుకొని తదీయసదనంబు లజ్జావనతం బగుట గనుంగొని
     కరుణించి యమ్మాళవేంద్రునిం దోడ్కొనిపోయి వానిరా
     జ్యంబునం బ్రతిష్ఠించి క్రమ్మఱివచ్చి రాజహంసధాత్రీపతి
     యప్రతిహతం బగు తనసంపద పొంపిరివోవ లక్ష్మికిం
     బాత్రంబుగా సుపుత్రుం బడయం గోరుచున్నయెడ నొక్క
     నాఁడు ప్రభాతసమయంబున.17
క. వసుధాధిపుకోర్కికిఁ దగఁ
     బసనగు సంతానవృక్షఫలము కరుణతో
     వసుమతికి వాసుదేవుం
     డొసఁగెన్ గలలోన దైవయోగము పేర్మిన్.18
వ. ఆసుస్వప్నంబు సఫలంబగుటం చేసి యద్దేవి గర్భంబు దాల్చి
     నం బ్రమోదసంపదవలనఁ బొంపిరివోవుచు సమస్తసు
     హృద్భూపాలవర్గంబు రావించి వసుమతీదేవికి సీమంతో

     త్సవం బొనర్చి మగధేశ్వరుండు విభవవిజితదేవేంద్రుం
     డగుచు మంత్రిపురోహితసామంతపరివారపరివృతుం డై
     కొలువున్న యవసరంబునఁ బ్రతిహారి చనుదెంచి సవిన
     యంబుగా నిట్లనియె.19
క. దేవ! భవద్దర్శనసం
     భావన లెడఁ గోరి వచ్చి ప్రతిహారమునన్
     దేవసముఁ డొకమునీంద్రుఁడు
     దా వేడుక నున్నవాఁడు ధరణీనాథా!20
క. అని విన్నవించి జనపతి
     యనుమతమునఁ దోడి తెచ్చె నాసన్న్యాసిన్
     గని యెఱిఁగి మందహాసము
     వినయముతోఁ గూర్చెఁ బతి వివేకము వెలయన్.21
ఉ. అంతఁ బయోజబంధుఁడు దినార్ధగతుండగుడున్ సమస్తసా
     మంతుల భృత్యులన్ బుధుల మాన్యులఁ బొండని యానృపాలుఁ డే
     కాంతగృహంబులోనికిఁ బ్రియంబున మంత్రులుఁ దాను బోయి వే
     షాంతరగూఢుఁడైన చరు నల్లన చేరఁగఁ బిల్చి యిట్లనున్.22
క. ఓరీ! నీతో వచ్చిన
     చారులు నినుఁ బాసి యెందుఁ జని రీ వీయా
     కారముఁ గొని యేపురముల
     నేరాజుల కొలఁదు లెఱిఁగి తెఱిఁగింపు మొగిన్.23
వ. అనిన వాడు సవినయంబుగా నిట్లనియె.24
క. దేవరపనుపున మును నా
     నావిధదేశముల కెల్ల నాతోడిచరుల్

     పోవుటయు నేనుఁ బోయితి
     నీవేషము దాల్చి మాళవేశ్వరుపురికిన్.25
వ. అందు నిగూఢంబుగా వర్తించి యతనివర్తనంబు నెఱింగి
     వచ్చితి నది యెట్లనిన.26
క. ఆనృపతి మును పరాజితుఁ
     డై నీచే నిలువఁబడిన యంతటఁగోలెన్
     బూని మహాకాళంబునఁ
     దా నీశు గుఱించి యుగ్రతప మొనరించెన్.27
చ. అతనితపఃప్రభావమున కాపరమేశుఁడు మెచ్చియిచ్చె ను
     ద్యతగద యేకవారభయదంబుగఁ గావున దానిలావునన్
     బ్రతిభటుఁడై కృతఘ్నమతిఁ బైఁ జనుదేరఁగ నున్నవాఁడు ని
     శ్చిత మిది మీఁదికార్య మెడసేయక సేయుము మేదినీశ్వరా!28
చ. అని యెఱిఁగించి వాఁ డరుగ నప్పుడె కార్యము నిశ్చయించి యి
     ట్లనిరి తగంగ మంత్రులు నరాధిప! యిట్టిదయేని మాళవేం
     ద్రున కెదురెత్తరా దతఁడు రోషమునం బయి నెత్తివచ్చినన్
     జెనయుట దక్కి దుర్గములు సేరుట నీతి దలంచిచూడఁగన్.29
వ. అని దైవబలము విచారించి పలికిన మంత్రులను బతి యి
     ట్లనియె.30
మ.మగపంతంబున మానసారుఁ డనిలో మా కల్గి పై నెత్తినన్
     బగ వాటింపక వాని నొంపక జగత్ప్రఖ్యాతిగా నోటమైఁ
     దగ వూహింపక దుర్గభూములకు నిందాపాత్రమైఁ బోక బు
     ద్ధిగఁ జెప్పందగునే నృపప్రకృతి నిస్తేజంబు సైరించునే.31
ఉ. దైవబలం బసాధ్య మని ధైర్యము పెద్దఱికంబు లజ్జయుం
     బోవఁగఁ బెట్టి కానలకుఁ బోయిన లోకమువారు నవ్వరే

     యేవపుమాట లేమిటికి నెల్లవిధమ్ముల మానసారుపైఁ
     బోవుటమాన వాఁ డనికిఁ బూని నిజంబుగ నెత్తివచ్చినన్.32
వ. అనినం బతిపలుకు లతిక్రమింపనేరక యొడంబడి వీడ్కొని
     నిజనివాసంబులకుఁ జనిరి మఱునాడు మాళవేశ్వరుండు
     సమస్తసామగ్రితో నెత్తివచ్చిన విని సుమతి ప్రముఖులగు
     నలుగురు మంత్రులు కార్యబలంబు సాధనంబుగా నధిపు
     చిత్తంబు మెత్తం జేసి హేతుదృష్టాంతంబులు సూపి యొడఁ
     బఱచి గర్భభారాలసాంగియైన మహాదేవి నిఖిలాంతఃపుర
     సంతానంబుఁ గూర్చి బుద్ధిసహాయంబుగా నాత్మసతీవర్గం
     బును శరీరస్థితిసహాయంబుగా ధాత్రీవర్గంబును గ్రీడాస
     హాయంబుగా సఖీవర్గంబును దుర్గస్థలవర్తనసహాయంబుగా
     మూలంబును సమర్పించి వింధ్యాటవీమధ్యంబున నిగూఢం
     బుగా నిలువ నియమించి కందువఁ జెప్పి యనిచిపుచ్చిరి
     రాజహంసుండును దండు వెడలె నిట్లొండొరులు చేరవిడిసి.33
క. మగధాధీశుఁడు మాళవ
     జగతీపతియును సమస్తసైన్యాన్వితు లై
     దిగధీశులు మది బెదరఁగ
     నగునగు ననఁ బోటులాడి రాహవభూమిన్.34
క. తదవసరంబున విజయా
     స్పదుఁడై మగధేశుమీఁద భవదత్తమహా
     గద వైచె మాళవేశ్వరుఁ
     డది నుగ్గుగ నేసె రాజహంసుం డలుకన్.35
ఉ. భూతపతిప్రసాదవిధి బొంకగు టెందును లేమిఁ దీవ్రమై
     యాతునుకల్ రణాగ్రమున నన్నియు నన్ని ముఖంబులన్ వడిన్

     సూతునెఱంకు లంటి నృపసూనుశరీరము గాఁడెఁ గ్రక్కునన్
     సూతుఁడు నేలఁ గూలెఁ బతి సొమ్మిలఁ బోయె రథోపరిస్థలిన్.36
క. అంత వడిం దురగము లు
     ద్భ్రాంతము లై కలను వెడలి పటుగతిమైఁ ద
     త్కాంతాజును లున్నయర
     ణ్యాంతరమున కేఁగె దైవయత్నముకలిమిన్.37
వ. ఇట్లు రథ్యంబులు పఱచునెడ నంతఃపురసన్నివేశంబున
     కనతిదూరంబున నొక్కవటవిటపి నరదంబు దగిలినఁ బరి
     శ్రాంతములైన వాహనంబులు నిశ్చలంబు లై యుండ రాజ
     హంసుండును సేదదేరకయుండె నట మాళవేశ్వరుండును
     మగధపతిరాజ్యంబు గైకొని కుసుమపురంబున కరిగిన.38
క. నలుగురు (మంత్రులు) నిట పొలి
     కలనం బడియును విధాతృకారుణ్యమునం
     దెలిసి పతిఁ దడవి కానక
     పొలఁతులకందువకుఁ జేరఁబోయిరి పెలుచన్.39
వ. ఇట్లు చను దెంచి వారలు వసుమతీమహాదేవిం గని యుద్ధ
     ప్రకారంబును రాజహంసునిం గలని రోసి కానమియు సవి
     షాదంబుగా నెఱింగించిన నిజవల్లభుండు పరలోకగతుం
     డయ్యన కాఁదలంచి యద్దేవి శోకంబు సైరింపంజాలక తను
     త్యాగంబునకు నుద్యోగించి యనలంబు దయసేయుం డనిన
     మంత్రు లిట్లనిరి సంశయంబగు పతిమరణంబునకు నను
     మరణంబు తగ దదియునుంగాక నీస్వప్నఫలంబు సాకారం

     బైనట్లున్న యీగర్భంబు రక్షించుటయ సమస్తలోకరక్ష
     ణం బగు మఱియును.40
మ. ఉదరస్థుండు సుతుండు వాఁడును జిరాయుశ్శ్రీయశస్సౌకుమా
      ర్యదయాధైర్యపరాక్రమంబుల జనారాధ్యుండు లోకత్రయీ
     హృదయాహ్లాదకరుండు నిక్క మని ని న్నేకాంతదుర్గంబులో
     బ్రదికింపన్ మది గోరె భర్త యది దప్పం జూడఁగాఁ బాడియే.41
సీ. అనవుడు వారితోఁ బెనఁగుట కొల్లక
                    యప్పటి కొడఁబడి యర్ధరాత్ర
     మందఱు నిద్రపరాధీను లగుటయు
                    నంత సముత్థశోకానలంబు
     సైరింపఁజాలక చపలవిలోచన
                    యచ్చోటు వెలువడి నల్ల నరిగి
     యొకమానికొమ్మున నుద్భంధనముఁ జేసి
                    కొనియెదఁగాక యే నని గడంగి
తే. వరుని యరదంబు చిక్కినవంక దైవ
     యోగమునఁ జేరి మదిఁ బతి నునిచి మగధ
     నాథ! యే నీకు భావిజన్మములయందు
     ధర్మచారిణి యై యుండుదాన ననుచు.42
క. తనకట్టినపుట్టముకొం
     గనుమానము లేక చించి యావృక్షముకొ
     మ్మున నులిచి ముడిచి యురిలోఁ
     జొనిపె మొగం బబల ప్రబలశోకముతోడన్.43

వ. అంతకు మున్న మిళితనీహారంబైన మారుతంబుసోకునం
     దెప్పిఱియును బహువ్రణపరివృతశోణితుం డై లావరుటం
     జేసి లేవఁజాలకయున్న రాజహంసమహీవల్లభుం డయ్యవ
     సరంబున.44
క. తనసతి తనపై నెయ్యము
     దనరఁగఁ జావునకుఁ దెగుట తనచెవులారన్
     విని తాన యెట్టకేనియు
     వనితా! యీసాహసంబు వల దని పలికెన్.45
చ. పలికిన నుల్కిపాటు మదిఁ బట్టుకొనంగ నెలుంగుదిక్కు చూ
     డ్కులు పచరించి యాత్మపతిఘోషముచందముకారణంబుగాఁ
     దలఁకక డాయఁబోయి విదితంబుగఁ గాంచె రథంబుమీఁద ని
     ర్మలమణిమండనద్యుతినిరాకృతహంసుని రాజహంసునిన్.46
క. కని సంభ్రమించి నిజపరి
     జనులకు నెఱిఁగించుటయును సచివులుఁ బ్రజయున్
     జనుదెంచి చూచి యందఱు
     ననురాగసాబ్ధి నోలలాడిరి వేడ్కన్.47
వ. అనంతరంబ.48
చ. జనపతి నెత్తి తెచ్చి మృదుశయ్యపయిన్ ముద మొంద నుంచి నే
     ర్పునఁ దనుసక్తశల్యములు వుచ్చి మఖస్థితుఁ జేసి యాత్మవ
     ర్తనములు చెప్పి మంత్రు లనురాగముతోఁ బతిఁ జూచి దేవ! యీ
     వనమున కెట్లు దెచ్చె రథవాజులు సారథి లేక చీఁకటిన్.49

చ. అనిన మహీశుఁ డిట్లనియె నాలములోపల మాళవుండు వై
     చినగద చూర్ణితాకృతిగఁ జేసితిఁ దీవ్రశరంబు లేసి య
     త్తునియలు వచ్చి సూతు వెసఁ ద్రుంచి మదంగము లెల్ల నొంచినన్
     మనమరి మూర్ఛవోయితిఁ గ్రమంబున నియ్యెడ సేదదీఱితిన్.50
క. తేఱినయవసరమున నీ
     కాఱడవిం గాంతయెలుఁగు కరుణాస్పదమై
     మీఱి చెవి సోఁకుటయు నడ
     లాఱఁగ నేఁ బలికితిం బ్రయత్నముతోడన్.51
తే. అరుగుదెంచినతెఱఁ గిట్టి దని యెఱుంగ
     ననిన మంత్రులు కాంతలు నాప్తజనులు
     నఘటమానవిధాయకుం డగు విధాతఁ
     బొగడి రానంద మాత్మ నుప్పొంగుచుండ.52
క. కతిపయదినములకు మహీ
     పతి యంగక్షతము లుడిపి భరమైన మనః
     క్షత ముడుపఁ దలంచి మంత్రిస
     మితి యతనికి నిట్టు లనియె మితవాక్యములన్.53
శా. దేవా! మున్ను సమస్తభూపతులలోఁ దేజోగరిష్టుండవై
     యీవింధ్యాచల మధ్యకాననమునం దిబ్భంగి నీయున్కియున్
     దైవాధీనము గాక దీనికి విషాదం బందఁగా నేల యం
     భోవాహంబులయట్ల సంపద లొగిం బుట్టున్ జెడున్ మాత్రలోన్.54
క. అని బోధించి పదంపడి
     జనపతియుం బ్రజయుఁ దారు సకుటుంబముగాఁ

     జని వామదేవుఁ డనియెడు
     మునివరునిం గని మనః ప్రమోదం బెసఁగన్.55
వ. తదీయాశ్రమంబునఁ గొండొకకాలంబు నిలిచి నిజమనో
     రథం బమ్మహామునివలన సఫలంబు గావించుకొనం దలంచి
     మంత్రివరులు నియోగింప విభుండు వినయావనతశిరస్కుం
     డై యతని కిట్లనియె.56
చ. తప మొనరించి మాళవుఁడు దైవబలంబున నన్ను నోర్చి రా
     జ్యపదవిఁ దాను గైకొనియె నట్లన యేనును బూని చాలను
     గ్రపుఁ దప మాచరించి రిపుగర్వ మడంపఁ దలంచి నేను నీ
     కృపఁ బడయంగ వచ్చితి నకిల్బిషమానస! తాపసోత్తమా!57
వ. అనినఁ గాలజ్ఞాని యగుటం జేసి భావిఫలం బెఱింగింపందలం
     చి వామదేవుం డిట్లనియె.58
క. ఆయాసంబుగఁ దపములు
     సేయంగా నేల శత్రుజిద్బాహుఁడు దీ
     ర్ఘాయుష్మంతుఁడు పుట్టెడు
     ధీయుతుఁ డగు సుతుఁడు వసుమతీగర్భమునన్.59
వ. అని యిట్లు చెప్పు నవసరంబున మునివాక్యంబునందు సంశ
     యింప వలవదు వసుమతికి జన్మించిన పుత్రుండు సంప్రాప్త
     యావనుం డగుడు దిగ్విజయార్థం బరుగవలయు నది నీ కభ్యు
     దయనిమిత్తం బని యశరీరవాణి యంతరిక్షంబున నేతెంచిన
     ధరణీశ్వరుండు పరమానందంబునం బొందియున్న కొన్ని
     దినంబులకు శుభముహూర్తంబున నద్దేవికి సర్వలక్షణలక్షి

     తాంగుం డగు సుపుత్రుం డుదయించి జాతకర్మాదిసంస్కా
     రంబులఁ బ్రదీప్తుం డై రాజవాహనుం డనఁ బరఁగుచుండె
     బదెపడి క్రమంబున నలువురుమంత్రులు కాంతిమంతు
     లైన కొడుకుల నలువురం బడసిరి సుమతికొడుకునకుఁ
     బ్రమతి యను నామంబును సుమ త్రు కొడుకునకు మిత్ర
     గుప్తుం డను నామంబును సుమంతుకొడుకునకు మంత్రగు
     ప్తుండను నామంబును సుశ్రుతుకొడుకునకు విశ్రుతుం డను
     నామంబును గావించిన నక్కుమారుండును నయ్యమాత్య
     పుత్రులును ననుదినప్రవర్ధమాను లగుచుండఁ గొండొక
     కాలంబునకు.60
క. ఒకనాఁ డొకముని యొకబా
     లకుఁ దెచ్చినఁ జూచి వీనిలక్షణములు రా
     జకుమారత్వముఁ దెలిపెడు
     నకటా! నీ కెట్లు చేరె నని పతి యడిగెన్.61
చ. అడిగిన నానృపాలకున కమ్ముని చెప్పె సమిత్కుశార్థ మే
     నడవికి నేఁగి యొక్కయెడ నార్తరవంబు చెలంగుచుండఁ జే
     డ్పడి పడియున్న కాంతఁ గని డాయఁగఁబోయి విపన్నిమిత్త మే
     ర్పడ నెఱిఁగింపు మీ వనిన భామిని యిట్లని వల్కె వెక్కుచున్.62
సీ. మేటిమగం డగు మిథిలాధిపుడు మగ
                    ధాధిపు తోడి సఖ్యమున నతని
     నాతిసీమంతమునకుఁ బుత్రదారస
                    మేతంబు తత్పురి కేఁగి యచట

     నున్నంత మాళవుం డుగ్రుఁ డై మగధభూ
                    పతిమీఁద వచ్చిన బంధుభావ
     మేర్పడఁ జంపాపురీశుండు సింహవ
                    ర్ముఁడుఁ దాను మగధేశ్వరునకుఁ దోడు
తే. కడిమి నని సేసి సమరరంగమునఁ బడిన
     మాళవేంద్రుఁడు గెల్చియు మహితబుద్ధి
     ననిచిపుచ్చె నయ్యిరువురునందు సింహ
     వర్మ చంపాపురంబునవలని కరిగె.63
క. ఘనుఁ డగు ప్రహారవర్మయుఁ
     దనదేశంబునకు వనపథంబున ననదై
     చనుచో నెఱుకులు దాఁకినఁ
     గనుకని తత్పరిజనము వికావిక లయ్యెన్.64
వ. అమ్మహీవల్లభునకుఁ గవలవారలగు కుమారులు గలరు
     వారలకు నన్నును నాకూతును దాదులంగా నియమించు
     టం జేసి వారికి సమస్తశరీరరక్షలు నేము నడపుచుండుదుము
     గావున.65
క. ఆరాజనందనులఁ గడుఁ
     గూరిమిమై [2]నదిమి యెత్తికొని నడచునెడన్
     వారని కలకల మగుటయు
     బోరన నే మధిపుపజ్జఁ బోవం బోవన్.66
ఆ. అపుడు ధరణివిభుని యంతఃపురాంగనా
     జనముఁ బొదివి యాప్తజనము కొంద

     ఱొక్కదిక్కు తొలఁగ నొకభంగిఁ గొనిపోయి
     రేటు దాఁకి నొచ్చి యేను బడితి.67
క. ఆతఱి నుధ్ధతుఁ డొక్కకి
     రాతుఁడు చనుదెంచి యధికరభసంబున నా
     చేతికొడుకుఁ జేకొని య
     య్యాతతగుల్మములలోనికై చనియె వడిన్.68
క. తక్కటిబాలుఁడు, గూఁతురు
     నెక్కడఁ బోవుటయు నెఱుఁగ నిది నా తెఱఁ గే
     నొక్కతె నైనను విభుచను
     చక్కటికై పోదు ననుచుఁ జనియె నరేంద్రా!69
వ. ఏనును భవత్సఖుం డగు ప్రహారవర్మకుఁ బాటిల్లిన యాప
     దకు విషాదం బంది తదన్వయాంకురం బైన కుమారుని
     రోయుతలంపున బోయ పోయినచొప్పునం బోయి యనతి
     దూరంబునఁ జండికాగృహంబుసమీపంబున.70
సీ. చూఱ యెప్పుడు నిట్లు చొప్పడునట్లుగా
                    నీదేవతకు బలి యిత్త మనుచుఁ
     దరుదీర్ఘతరశాఖఁ దలక్రిందుగాఁ గట్టి
                    వరుస నెల్లలువెట్టి వైత మనుచుఁ
     బాదంబు లిసుకలోఁ బాఁతి వెంపర సేసి
                    పటుసాయకముల పాల్పఱుత మనుచు
     దవ్వుదవ్వులు బెట్టి తవిడి పాఱఁగఁ జూచి
                    వెసఁ గుక్కకూనల విడుత మనుచు
తే. బాలకునిఁ జంపఁ దలఁచుట పాప మనక
     కోఱడంబున నొండొరుమీఱఁ బాఱి

     వేఱెవేఱె యుపాయము ల్వెదకి వెదకీ
     కలయఁ బలుకు కిరాతులఁ గాంచి యచట.71
క. పాఱుఁడ ముడిసినవాఁడన్
     గాఱడవిన్ దెరువు దప్పి గాదిలిసుతునిన్
     జూఱకు నొప్పించితి నని
     చీఱితి నెలుఁగెత్తి వారి చేరువఁ గలయన్.72
క. పలుమఱు నీచందమునన్
     బలవింపఁగ దైవగతిఁ గృపాతత్పరు లై
     పిలిచి కిరాతులు బాలకుఁ
     జొలవక గొనివచ్చి నాకుఁ జూపి ముదమునన్.73
తే. వీఁడు నీపుత్రుఁ డగునేని వెఱవవలదు
     పుచ్చికొనిపొమ్ము నావుడుఁ బూని వారి
     బలువిధంబుల దీవించి బాలుఁ దెచ్చి
     శిశిరజలసేచనాదుల సేద దేర్చి.74
వ. నీపాలికిఁ గొనివచ్చితి వీనికి బితృభూతుండవు గావునఁ
     జేకొని రక్షింపు మనిన రాజహంసమహీవల్లభుండు.75
క. వరహితచరితులకు శుభం
     బరుదే యను బుధుల పలుకు లనృతంబులు గా
     పరయఁగ దైవము మత్సఖు
     దురితమ్ములఁ బెట్టె ననుచు దురపిల్లి మదిన్.76
వ. విపులవిషాదంబుఁ బొందియు నతనినందనుండు సేరుటకు
     సంతసిల్లి యపహారవర్మ యను నామంబు గావించి.77
క. బాలునిఁ గైకొని వసుమతి
     పాలఁ బ్రియం బొంద నునిచి ప్రతిదివసము త

     త్కేళీసందర్శనసుఖ
     లాలసుఁ డై యుండె నిశ్చలప్రేమమునన్.78
చ. జనపతి యొక్క పుణ్యదివసంబునఁ బావనతీర్థసేవనం
     బున కని యేఁగుచో విపినభూమిఁ గిరాతులపల్లెపొంతఁ దా
     ననుపమమూర్తిమంతు నొకయర్భకు నొక్కతె ముద్దు
     లాడఁగాఁ గనుఁగొని యంతరంగమునఁ గౌతుక మెంతయు
     నగ్గలింపఁగన్.79
క. మీబోఁటులచందము గాఁ
     డీబాలుఁడు రుచిరమూర్తి యెవ్వరి తనయుం
     డే బాసఁ జేరె ననవుడు
     నాబోయతమగఁడు వినతుఁడై యి ట్లనియెన్.80
తే. ఆత్మదేశంబుదెసకుఁ బ్రహారవర్మ
     విపినపదమున నడవంగ వేచి తాఁకి
     చూఱుగొనుచుండి వీని నచ్చోట నోర్తు
     చేతఁ గొనితెచ్చి వేడ్కఁ బెంచెద నరేంద్ర!81
వ. అనుటయు.82
క. ముని చెప్పిన రెండవనృప
     తనయునిగా నెఱిఁగి సావధానమునఁ గిరా
     తునిఁ బ్రీతుఁ జేసి బాలకు
     గొనివచ్చె మహీశ్వరుండు కూరిమి వెలయన్.83
వ. ఇట్లు తెచ్చి యుపహారవర్మ యని పేరుఁ బెట్టి వసుమతీ
     దేవికి సమర్పించి యుపలాలించుచుండెఁ బదంపడి యొక్క
     నాఁడు వామదేవుని శిష్యుండు సోమశర్ముఁ డను ముని

     కుమారుం డొక్కబాలకునిం గొనివచ్చి రాజునకుఁ జూపి
     యిట్లనియె.84
ఆ. ఏను రామతీర్థ మేఁగి క్రమ్మఱి వచ్చి
     వచ్చి యొకమహెూగ్రవనమునందు
     నొక్కవనితచేత నుండంగ నుజ్జ్వలా
     కారుడగు కుమారుఁ గని నయమున.85
క. డాయం జని నీ వెవ్వతె
     వీయర్భకు నెత్తికొని యహీనాటవిలో
     నాయాసంబునఁ దిరుగుట
     కేయది గత మనిన నదియు నిట్లని పలికెన్.86
ఆ. కాలయవన మనఁగఁ గల దొకదీవి యం
     దనఘ! కాలగుప్తుఁ డనఁ బ్రసిద్ధ
     వైశ్యవరుఁడు గలఁడు వానికి గాదిలి
     తనయయగు సుపుత్రదాది నేను.87
సీ. తద్ద్వీపమునకు నేతద్వీపముననుండి
                    మగధాధినాథుని మంత్రికొడుకు
     రమణీయగుణనిధి రత్నోద్భవుం డను
                    వాఁడు బేహారంబువచ్చె నతని
     కులశీలవిద్యలఁ గలపెంపునకు నియ్య
                    కొని తనకూఁతు నతనికి బ్రీతిఁ
     బరిణయ మొనరించి పరమసమ్మదముతో
                    నతఁ డాత్మసంపద కధిపుఁ జేసె
తే. నాలతాంగియు గర్భిణి యయ్యె నంత
     సోదరులఁ జూచు వేడ్క రత్నోద్భవుండు

     మామ కెఱిఁగించి కౌతుకోన్మాదుఁ డగుచుఁ
     గోమలియుఁ దానుఁ గల మెక్కి కుసుమపురికి.88
శా. రారా నబ్ధిఁ గలంబు డిందుటయు గర్భశ్రీవిలాసంబునన్
     గారామైన సుపుత్ర నెత్తికొని దుఃఖం బందుచుం జేరితిన్
     దీరం బే నొకపట్టెతెప్ప గొని యీదృగ్వేదనం జెంతకున్
     వేరం బెత్తిన ధాత చెయ్ది యుడుపన్ వె జ్జెవ్వఁ డూహింపఁగన్.89
క. చెలులును రత్నోద్భవుఁడును
     జలనిధిలోఁ బడిరొ బ్రతికి చనిరో యెఱుగన్
     బొలఁతి సుపుత్రయు నిడుమకుఁ
     గొలువుగ నట్టడవిలోనఁ గొడుకుం గాంచెన్.90
వ. కని యొకపొదరింటిలోనఁ బ్రసూతివేదనార్త యై యున్న
     నాతిం జూచి విజనంబగు విపినమధ్యంబున నిలుచుట యను
     చితం బని జనపదంబున కరుగు తెరువు పరికింప నిట యరుగు
     దేరం దలంచి యబ్బాలకుని బరవసయైన తల్లికడ నునిచి
     వచ్చుట కర్జంబుగామి నెత్తికొనివచ్చితి.91
సీ. అని తనవృత్తాంత మది చెప్పుచున్నచో
                    వచ్చె నయ్యెడ కొక్కవనగజంబు
     తద్వన్యగజము రౌద్రన్ఫూర్తిఁ గనుఁగొని
                    భీతాత్మ యై తనచేతిబిడ్డఁ
     బడవైచి యాయవ్వ కడువేగమునఁ బాఱె
                    నేనును నొకపొదరిల్లు చొచ్చి
     యొదిగి యద్దెసం జూచుచున్నంత బాలకుఁ
                    బల్లవకబలంబు పట్టుకొనిన

ఆ. కరణిఁ బట్టుకొనియె గజము తద్గజముపై
     కంత నొక్కసింహ మాగ్రహమున
     నుఱుకుటయును జూచి వెఱఁ గొంది యర్భకు
     నెత్తివైచె దివికి మత్తగజము.92
వ. తదవసరంబునఁ గుమారుని యాయుశ్శేషంబు పరిపాలింపం
     బూనిన విధి యఘటమానసంధానచాతుర్యంబున.93
క. ఆసన్నోన్నతతరుశా
     ఖాసీనం బైన యొక్కయగచర మాహా
     రాసక్తిఁ జేసి ఫల మని
     డాసి పడంబడఁగఁ గరపుటంబునఁ బట్టెన్.94
తే. పట్టి పండు గాకున్న నాపాదపంబు
     పెద్దఱెమ్మలసందునఁ బెట్టిపోయె
     బాలకుండును సత్వసంపన్నుఁ డగుట
     జేసి యెంతయు నోర్చె నాయాసమునను.95
ఉ. సామజవైరియున్ గజముఁ జంపుచు నెక్కడకేనిఁ బోయె దే
     జోమయుఁ డైన యాశిశువుఁ జూచి దయామతి నల్లడించి యే
     నామగువన్ వనాంతమున నారసి కానక యేఁగుదెంచి మ
     త్స్వామికి వామదేవునకు సమ్మద మొందఁగఁ జూపి యింతయున్.96
క. చెప్పి మునివరునిపంపున
     నిప్పుడు కడువేడ్కఁ దెచ్చి యిబ్బాలుని నీ
     కొప్పించితి ననవుడు విధి
     త్రిప్పుల కచ్చెరువుఁబాటు దీటుకొనంగన్.97

తే. అకట! రత్నోద్భవుం డిటు లగునె దైవ
     మిట్లు సేయునె యని తనయిచ్చ దూర
     వగచియును వానితనయుండు వచ్చి తన్నుఁ
     జేరుటకు నెంతయును సంతసిల్లి విభుఁడు.98
వ. అక్కుమారుని గైకొని సుశ్రుతుని రావించి వీఁడు రత్నో
     ద్భవతనయుం డని యతనికిం జూపి తద్వృత్తాంతం బంతయు
     నెఱింగించి వానికిఁ బుష్పోద్భవుం డని పేరుఁ బెట్టి యొప్పిం
     చిన సుశ్రుతుండును దనమనంబున సవిస్మయవిషాదమోదం
     బులు ముప్పిరిగొన నగ్రజునందనుం గొని నిజమందిరంబు
     నకుం జనియె మఱునాడు వసుమతీదేవి యొక్కబాలకుని
     నెత్తికొనివచ్చి తత్ప్రాప్తిప్రకారంబు దెలియ వల్లభున కి
     ట్లనియె.99
ఆ. చనిన రేయి వీనిఁ గొనివచ్చి యొక దివ్య
     [3]కాంత నన్ను మేలుకాంచి చేరి
     యతివినీత యగుచు నత్తఱి నచ్చెరు
     వంద నాకు నిట్టు లనియెఁ బ్రీతి.100
ఉ. ఏ నొకయక్షుకామిని నహీనదయాపరతంత్ర యక్షనా
     థానుమతంబునం దగ మదాత్మజుఁ దెచ్చితి నీతనూజుఁ దే
     జోనిధి రాజవాహను విశుద్ధయశోనిధిఁ జేర్చి మన్పు మం
     భోనిధివేష్టితక్షితివిభుత్వ మతండు వహించు నిమ్మెయిన్.101
వ. నా పేరు తారావళి నీప్రెగ్గడ ధర్మపాలునినందనుండు కామ
     పాలుండు మదీయవల్లభుం డని చెప్పి చనియె ననవుడు.102

ఆ. కామపాలుఁ డేమి కారణమున యక్షి
     పొందు గాంచెనొక్కొ పుత్రు మనల
     జేర్పఁ దనవిభుండు చెప్పుట యాకాశ
     వాణిపలుకు నిక్కువంబు సేసె.103
క. అనుచు సుపుత్రుని బిలువం
     బనిచి మహీవిభుఁడు వదనపద్మ మలర నీ
     యనుజన్ముని తనయుడు వీఁ
     డనినన్ విని యాత్మవిస్మయం బడరంగన్.104
వ. సుమిత్రుండును నిది మేలువివరం బని యడిగిన వసుమతీ
     దేవివలనఁ దారావళిపలుకులు విని యనుజుం డనపాయుం
     డై యునికికిఁ దత్ప్రాప్తికి మనంబున నుబ్బుచు.105
క. జనపాలుఁ డర్థపాలుం
     డను నామము పెట్టి తగ సమర్పింపఁగఁ దాఁ
     గొనిపోయె ననుజుతనుజుం
     గనుఁగవ నానందబాష్పకణములు దొరుఁగన్.106
వ. మఱునాఁడు వామదేవశిష్యుండు కీర్తిదేవుం డను నొక్క
     విప్రుఁ డొక్కపాపనిఁ దెచ్చి చూపి భూపతి కిచ్చి యిట్ల
     నియె నేను దీర్థయాత్రఁ బోయి కావేరీతీరంబున నిక్కుమా
     రుని ముందటం బెట్టుకొని యొక్కవృద్ధాంగన యేడ్చు
     చున్నం గని నీ వెవ్వతె నిబ్బాలుఁడు నీ కేమగు నేల
     యేడ్చె దనిన నదియును.107
ఆ. రోదనంబు దక్కి యాదరవృత్తిఁ గం
     దోయి కరయుగమునఁ దుడిచి నన్నుఁ

     జూచి తనమనంబుశోక మే నార్తునో
     యని తలంచి యిట్టు లనియె నాకు.108
ఆ. మగధవిభుని మంత్రి మతిశర్మ యాతని
     పెద్దకొడుకు సుమతి పిన్నకొడుకు
     సత్యశర్మ వాఁడు సద్వృత్తి మెయి నిటఁ
     దీర్థయాత్ర యరుగు చెంచి ప్రీతి.109
సీ. అతఁ డర్థిమై నొకయగ్రహారంబునఁ
                    గాళి నాఁ బరఁగిన కాంతఁ బెండ్లి
     యై యపత్యం బెడయైనఁ దత్సోదరి
                    గౌరి వివాహమై గౌరవమున
     సుతుఁ గాంచె నేనుఁ దత్సుతునకు దాదినై
                    యున్న నాకాళియు నురక నొక్క
     నెపమునఁ దెచ్చి యీనిండారునీటిలో
                    బాలునితో నన్నుఁ బట్టి త్రోచె
తే. నేను నొకచేత బాలుని నెత్తిపట్టి
     నొక్కచే నీఁదుచున్నంత నొయ్యఁ జేరె
     దైవవశమున నొకమ్రాను దాని నమరఁ
     బట్టికొని తత్తఱంబున బాలు నిడితి.110
క. పిడు గడిచినవానిఁ గొఱవి
     వడిఁ జూఁడినగతి నవస్థపడి పోవం బై
     నడరి యొకకాలసర్పము
     గడగడ వడఁకంగ నన్ను గఱచెం బెలుచన్.111
క. నాపట్టిన ధరణీరుహ
     మీపొదలం జేరెఁ దీర మేఁ జేరితి ను

     ద్దీపించె విషము కావఁగఁ
     బాపకు వెసలేమి నేడ్పు వాటిలెఁ గొడుకా!112
వ. అని చెప్పి విషమవిషజ్వలనజ్వాలాసమాలీఢంబులైన యం
     గంబు లంతరంగంబునకుం దలకొన [4]నలవిగామి కారణం
     బుగా ధారుణిం బడి మూర్ఛపోయిన ముదుసలిం జూచి
     యపాస్తాంతరంగంబున మంత్రక్రియ మగుడింపం దొడంగి
     శక్యంబు గాకున్నం బోయి యౌషధవిశేషంబున నైనను దీర్తు
     ననునాసం దత్సమీపతరుగుల్మంబులం గుమ్మరి క్రమ్మఱి
     వచ్చునంత నయ్యింతి యుత్క్రాంతజీవిత యగుటయు భవ
     దమాత్యనందనుండగు సత్యశర్మయపత్యం బగతికం బగుటకు
     శోకించి యయ్యవ్వచేత నతనివృత్తాంతంబు వినునపు డొ
     క్కయగ్రహారం బనుమాత్రంబె కాని తెలియ వినంబడక
     మున్న యది మూర్ఛిలుటం జేసి తదన్వేషణాశావిముఖుం
     డనై యన్నియు సంస్కరించి వీడు మీకు రక్షణీయుండను
     బుద్ధిమెయిం గొనివచ్చి నిన్నుఁ జేర్చితి ననిన విని కొండొక
     తడవు వగఁ జెంది.113
క. మనసత్యశర్మ పొగడఁగ
     వినియుండియుఁ దేటపడఁగ వినఁగానమ యిం
     క నతనివలని విషాదము
     మనమున నిడనేల యనుచు మానవపతియున్.114
వ. తదగ్రజుండైన సుమతి రావించి యంతయు నెఱింగించి
     కుమారునకు సోమదత్తుం డను పేరు పెట్టి యతనికి సమ
     ర్పించిన నాతండును దమ్ముండు దన్నుఁ జేరినంతయ సంత

     సిల్లి కొనిపోయె నిత్తెఱంగునం బ్రాదుర్భావంబు నొందిన
     పదుండ్రు కుమారులు శైశవక్రీడలు సలుపుచుం బెరిఁగి
     క్రమంబునఁ జౌలోపనయనాదిసంస్కారంబులు వడసిరి తద
     నంతరంబ.115
సీ. వేదంబు వాదంబు వీణాదివాద్యంబు
                    లాలేఖ్యకర్మంబు లాగమములు
     మంత్రతంత్రంబులు మందులు మాయలు
                    సింధురగంధర్వశిక్షణములు
     జూదంబు మ్రుచ్చిమి జోస్యంబు గానంబు
                    ధర్మార్థకామశాస్త్రములు కవిత
     కావ్యనాటకములు కథలు పురాణంబు
                    లాయుధనైపుణ మంజనంబు
తే. నాదిగా నన్నివిద్యలు నన్ని[5]కళలు
     నభ్యసించిరి యౌవన మలరె నిట్టు
     లక్కుమారులఁ గనుఁగొని యవ్విభుండు
     సమ్మదాంబుధిలోఁ గేళి సలుపుచుండె.116
వ. అట్టిసమయంబున నొక్కనాఁడు.117
శా. ఫారావారపరీతవిశ్వవసుధాభాగంబునం గీర్తి కా
     ధారం బై వెలుఁగొందువాఁ డతులసత్యత్యాగశీలంబులం
     బారీణుండు విరించివంశవనధిప్రాలేయభానుండు దు
     ర్వారాంధఃపరిపంథివర్గనిబిడప్రాలేయభానుం డిలన్.118
క. ధీరుఁడు కవీంద్రలోకా
     ధారుఁడు సకలాగమార్థతత్త్వవిచారో

దారుఁడు విస్ఫారయశో
     హారుఁడు సుజనాభినందితాకారుఁ డిలన్.119
మాలిని. అతులశుభచరి త్రుం డన్వయాంభోజమిత్రుం
     డితరసచివదాత్రుం డిద్ధలక్ష్మీకళత్రుం
     డతిదినకరతేజుం డన్యమాంబాతనూజుం
     డతనుగుణసమాజుం డార్యభోజుండు ధాత్రిన్.120
గద్యము. ఇది సకలసుకవిజనప్రసాదవిభవ విలసదభినవదండి
     నామధేయవిఖ్యాత కేతనార్యప్రణీతం బైన దశకుమార
     చరితం బను మహాకావ్యంబునందు ద్వితీయాశ్వాసము.

  1. వ్యవహార
  2. దఱిమి
  3. లలన నన్ను మేలుకొలిపి చేరి
  4. రింప నిలువ
  5. కథలు