దశకుమారచరిత్రము/తృతీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

తృతీయాశ్వాసము

     శ్రీరమణుఁడు దానపయో
     ధారా[1]ఫలవితతవివ్రథాత్రీజుణడు నీ
     రేరుహభవవంశాగ్రణి
     ధీరగుణాన్వితుఁడు మంత్రితిక్కం డెలమిన్.1
మ. మునినాథుండగు వామదేవుఁడు మనోమోదంబుతో వచ్చి య
     మ్మనుజాధీశుఁ డొనర్చు నర్చనల నాత్మప్రీతి సంధిల్ల వా
     రనిభక్తిం దగఁ జాఁగి మ్రొక్కిన కుమారవ్రాతముం జూచి దీ
     వన లిచ్చెన్ మితసత్యహృద్యవికసద్వాక్యమ్ములం గూర్మితోన్.2
వ. దీవించి వారల నెత్తి కౌగిలించుకొని మూర్ధఘ్రాణంబు
     సేసి మగధపతి మొగంబుఁ జూచి భవదభిమతంబు సాఫ
     ల్యోన్ముఖం బగునట్లుం గుమారునకు యావనం బయ్యె
     దివ్యవాగుపదేశవిధేయంబగు దిగ్విజయం బతని కిది సమ
     యంబు సంశయంబు దక్క సహచరవర్గంబుతో నిరర్గళ
     ప్రసారంబుగా ననిచిపుచ్చుము వీర లమానుషప్రభావు
     లగుట నాకుఁ దెల్లంబు గావున ప్రతిహతు లై యభ్యుద
     యంబు పొందుదు రనిన విని రాజహంసమహీవల్లభుండు
     తానును దేవియు దైవవచనాశ్వాసంబును నూఁది నంద
     నునికి విజయప్రయాణంబు నిశ్చయించి యొక్కశుభదిన

     మునందుఁ బుణ్యోదయంబున నతనికి యువరాజ్యపట్టంబు
     గట్టి తక్కినకుమారుల సచివుల రావించి వారలకు వలయు
     బుద్ధు లుపదేశించి సముచితప్రకారంబుల వీడుకొలిపిన
     రాజవాహనాదికుమారదశకంబును శుభసూచకంబులగు
     నుత్తమనిమిత్తంబులును ననుశూలశకునంబులును జేకొ
     నుచు వెలువడి వింధ్యాటవీమధ్యంబునం జనుసమయంబున.3
సీ. నిధిసాధనక్రియానిమ్నోన్నతం బైన
                    ప్రాంతపట్టణమునఁ బాడువోలెఁ
     గాలాయసమున నంగములు గావించిన
                    ప్రాణంబువచ్చిన ప్రతిమవోలెఁ
     దొండమ్ము కొమ్ములు తునియ వ్రేటులుపడి
                    కొదపడ్డ యేనుఁగుకొదమవోలె
     డాంబికవిప్రవిడంబనం బొనరింప
                    బూనిన యొఱపిఁడిబోయవోలె
తే. మేనఁ బోటుగం బ్లెంతయు మిక్కుటముగ
     నల్లనై తుండుపడి బ్రాహ్మణత్వమునకుఁ
     దావలం బైన వెడజన్నిదములు దాల్చి
     యున్న యొక్కనిఁ గాంచె యమన్నుఱేఁడు.4
క. కని యతనిచేతఁ బూజలు
     గొని జనపతి యనియె నిట్లు ఘోరాటవిలో
     జనసంగరహిత మగు నీ
     యునికికి గతమేమి భూసురోత్తమ! చెపుమా.5
వ. అదియునుంగాక.6

క. జందెముల బ్రాహ్మణత్వము
     చందంబున బోయతనము శస్త్రాహతిఁ బొ
     ల్పొందఁగ రాచఱికము నీ
     యందొక్కటఁ దోఁచుచున్నయది తలపోయన్.7
వ. అని యడిగిన యమ్మహీపతిమహానుభావంబు లుపలక్షించి
     నిజాంతర్గతంబున నితండు కేవలమర్త్యుండు గాఁ డనుచుఁ
     దత్సహచరవర్గంబువలనఁ దదీయజననాభిధానంబు లెఱింగి
     యతనికిం దనవృత్తాంతంబు లెఱింగింపం దలంచి యవ్వి
     ప్రుండు సవినయంబుగా ని ట్లనియె.8
సీ. చదువులు విడిచి యాచారంబు దిగఁద్రావి
                    ధర్మువు చెఱచి సత్యంబు మఱచి.
     మొగమోట తెగఁజూచి తగవు దూరము సేసి
                    కులము గీటునఁబుచ్చి వలను దప్పి
     శౌచంబు వదలి విశ్వాసంబు మొఱఁగి తా
                    లిమి మాలి పెద్దఱికము దొరంగి
     దయ పిఱందికి వైచి నయము క్రుమ్మడఁగించి
                    బాంధవం బురివి పాపమునఁ బొదలి
తే. యెఱుకులకు నొజ్జలై వారియిండ్లఁ గుడిచి
     కొలిచి దీవించి యించుక వెలికి బోయ
     లనఁగఁ బరఁగిన పాఱు లియ్యడవిలోన '
     నెన్నఁ బెక్కండ్రు గలరు ధాత్రీశతిలక!9
క. అం దొకవిప్రుని కూరిమి
     నందనుఁడఁ బుళిందరాజనామమువాఁడన్

     నిందాపాత్రచరిత్రుఁడ
     మందుఁడఁ బే రడిగెదేని మాతంగకుఁడన్.10
చ. ఎఱుకులఁ గూడి భూములకు నేఁగుచు నూళ్ళును జొచ్చి వ్రేల్మిడిం
     బఱిపఱి సేయుచున్ సతుల బాలుర నేపునఁ బట్టి తెచ్చుచున్
     జెఱ నిడి దండువుల్ గొనుచుఁ జెట్టలపుట్ట యితండు నాఁగ నే
     గొఱకుఁదనంబు మీఱి ధరఁ గ్రుమ్మరుచుండుదు నెల్లకాలమున్.11
క. ఒకనాఁ డొకముదిపాఱుని
     నొకచో నాతోడిబోయ లొలిచికొనంగా
     నకటా! తగదని పలికిన
     మొకమోడక నన్ను బన్నములఁ బఱచి రొగిన్.12
క. వారలు పలికినపలుకులు
     సైరింపక తొడరి యస్త్రశస్త్రప్రౌఢిన్
     బోరి తదీయప్రహరణ
     పారంపర్యమున మూర్ఛ పాటిల్లుటయున్.13
ఆ. ప్రేతపురికి నరిగి పేరోలగంబున
     నున్న జముని కెఱఁగి యున్న నన్నుఁ
     నతఁడు దెలియఁ జూచి యాసభలోనికిఁ
     బ్రీతిఁ జిత్రగుప్తుఁ బిలువఁ బంచి.14
వ. వీనికి నిది యపమృత్యువుగాని కాలమృత్యువు గాదు వీఁడు
     దుర్వర్తనుం డయ్యును విప్రార్థంబుగాఁ బ్రాణంబు విడుచు
     టం జేసి పాపంబులు నీఁగికొనియెం గావునఁ బదంపడి శరీ
     రంబు విడిచినను నరకావాసంబు లే దైనను నిటమీఁద

     ధర్మరుచి వుట్టవలయు దుష్కర్ములు పడుపాట్లు చూపి మరలఁ
     ద్రోపు మనినఁ గొనిపోయి చూపునప్పుడు.15
సీ. ఎఱ్ఱఁగాఁ గాఁగిన యినుపకంబములతోఁ
                    గట్టినఁ గమగమఁ గమరువారిఁ
     క్రాఁగిన వెడఁదమంగలములఁ బొరఁటినఁ
                    బెల్లునఁ బెరపెరఁ బ్రేలువారిఁ
     గండలు దిగఁజెక్కి గంట్లను గొఱవులఁ
                    జూడినఁ జుఱచుఱ స్రుక్కు వారి
     గుదియలు గైకొని గుండెలు కుళ్లంగ
                    మోదిన మురముర ములుగువారి
తే. ముడియకట్టలక్రియఁ గట్టుపడినవారి
     నోలీఁ దలక్రిందుగా వ్రేలుచున్నవారి
     జూపి దుర్వర్తనములకుఁ జొఱకు మనుచుఁ
     జిత్రగుప్తుండు బుద్ధులు చెప్పి వుచ్చె.16
వ. ఏనునుం బ్రాప్తశరీరుండ నై యిమ్మహాటవిమధ్యంబున.17
క. ఒడ లెఱిఁగియు బలహీనత
     బడియుండిన విప్రవరుఁడు బాసటయై నా
     కడ నిల్చె నంత నట యేఁ
     బడిన తెఱం గెల్ల వినుచుఁ బాయనివగలన్.18
వ. మాతల్లిదండ్రులు వచ్చి న న్నెత్తికొనిపోవునెడ నాబ్రా
     హ్మణుండు కృతంబు విచారించి తోడనె చనుదెంచి ప్రాణ
     నిరోపణం బగునంతకు నిలిచి క్రమంబునం.19
ఉ. అక్షరశిక్షఁ జేసి వివిధాగమతంత్రము లొప్పఁ జెప్పి దో
     షక్షయకారణంబు లగు సచ్చరితంబులత్రోవఁ జూపి నూ

.

     క్ష్మేక్షణగోచరుం డయిన యీశ్వరుచందముఁ దెల్పి సత్క్రియా
     దక్షత నాకు నూల్కొలిపి తా నరిగెన్ ముదితాంతరంగుఁ డై.20
ఉ. ఏనును నాదుబాంధవుల నెవ్వరి మెచ్చక పాసివచ్చి యీ
     కాననభూమిలోనఁ ద్రిజగద్గురుఁ జంద్రకళావతంసుఁ జే
     తోనళినంబునం దిడి విధూతకళంకుఁడ నై వసించెదన్
     మానవనాథ! యిట్టి క్రమం బని యేర్పడఁ జెప్పి వెండియున్.21
క. పతిఁ [2]బాయఁ బిలిచి యతఁ డే
     కతమున నిట్లనియె నేడు కలలో గౌరీ
     పతి నాకు సన్నిహితుఁ డై
     హితుఁడగు బాంధవుఁడువోలె నిట్లని పలికెన్.22
సీ. దండకారణ్యమధ్యంబునం బాఱిన
                    సెలయేటిదరిఁ బ్రతిష్ఠించియున్న
     పటికంపులింగంపుఁ బడమటిదెస సమం
                    చితగిరిజాపదచిహ్నమైన
     శిల క్రేవఁ గల దొక్కబిల మందులో రెండు
                    సాధనతామ్రశాసనము లుండుఁ
     జని చొచ్చి యిష్టశాసనవిధి సాధించి
                    పాతాళలోకాధిపతివి గమ్ము
తే. నీకుఁ దోడ్పడువాఁ డొక్కనృపకుమారు
     డెల్లి నేఁ డిందులకుఁ దాన యేఁగుదెంచు

     ననియెఁ దద్వచనమునకు ననుగుణముగ
     నీవుఁ జనుదెంచి తిచటికి నెమ్మి వెలయ.23
మ. అనినం బ్రీతమనస్కు డై నృపతి సాహాయ్యంబు గావింతు నే
     నని నిక్కంబుగఁ బల్కి యచ్చెలులఁ బాయం బెట్టి యారాత్రి తా
     నును మాతంగకుఁడు వనాంతమునకున్ మోదంబు సంధిల్లఁ బో
      యినఁ బ్రాభాతికవేళ నందఱును ధాత్రీశాగ్రణిం గానమిన్.24
వ. విషణ్ణు లగుచుం గూడఁ బాఱి తత్ప్రదేశంబున నారసి విత
     ర్కించి వివిధదేశంబుల వేర్వేఱ వెదకువారై తమకు
     నందఱికిం బదంపడి గూడికొన నొక్కసంకేతస్థానంబుఁ జెప్పి
     కొని బహుముఖంబుల నరిగి రంత నిక్కడ రాజవాహన
     కుమారుండును మాతంగకుండును నీశ్వరోపదిష్టప్రకారం
     బునఁ బరాజ్ఞాతం బైన బిలంబు సాధించి చొచ్చి శాసనంబులు
     పరిగ్రహించిరి తదనంతరంబ.25
సీ. పాతాళమునకు నిర్భయమునఁ జని యొక్క
                    పురముచేరువ సరోవరముక్రేవ
     శాసనక్రమమున సంభావితములైన
                    చారువస్తువులు ప్రసన్నబుద్ధి
     వివిధవిఘ్నములకు వెఱవక యగ్నికుం
                    డంబున సిద్ధిహోమంబు సేసి
     రక్షాకరుండగు రాజవాహనపతి
                    సూచి నెమ్మనమునఁ జోద్యమంద
తే. మంత్రపూర్వంబుగాఁ గ్రాలు మంటలోన
     నుఱికి మాతంగకుండు విద్యుత్సమాన

     కాంతి నుద్దీప్తగాత్రుఁ డై కమ్మఱంగ
     వెడలె మహనీయముగఁ బుష్పవృష్టి కురిసె.26
ఉ. అయ్యెడఁ గన్య యొక్కతె మహామణిమండనమండితాంగియై
     నెయ్యపుబోటికత్తెలు వినీతగతిం జనుదేఱఁ బ్రీతితో
     నొయ్యన వచ్చి కాను కని యొక్క లసన్మణి యిచ్చె విప్రుఁడుం
     దొయ్యలిఁ జూచి యెవ్వతెవు తోయజలోచన! నీవు నావుడున్.27
వ. ఏను దానవేశ్వరుం డైన నముచికూఁతుర గాళి యను
     దాన నమ్మహానుభావుం డీలోకం బేలుచుండుఁ దత్పరాక్ర
     మాసహిష్ణుం డగు విష్ణుదేవుకారణంబున.28
చ. అతఁడు నిజాంగనాసహిత మంతకుఁ గూడినఁ దద్వియోగసం
     భృతమహనీయశోకమున బెగ్గల మందుచునున్న నన్ను నూ
     ర్జితకరుణార్ద్రచిత్ఁ డొక సిద్ధవరేణ్యుఁడు చూచి పల్కె ని
     య్యతలముఁ జొచ్చి నీకుఁ బతి యై యొకమానవుఁ డేలు నింతయున్.29
మ. అనినం గద్వచనము నమ్మి మహనీయం బైన మోదంబుతో
     ఘనశబ్దోన్ముఖచాతకంబుగతి నాకాంక్షించి నల్దిక్కులున్
     జనుచుం జూచుచునున్నచోట నమృతాసారాకృతి న్నీవు తోఁ
     చిన నేతెంచితి [3]నేఁడు భాగ్యమహిమం జేకూరె నాకోరికల్.30
తే. నాకు భర్తవు నీవ యీలోకమునకు
     నీవ భర్తవు గైకొమ్ము నెమ్మి వెలయ

     ననిన మాతంగకుఁడు పతియనుమతమున
     వనజలోచనఁ బ్రీతి వివాహమయ్యె.31
వ. ఇత్తెఱంగున శరీరశుద్ధియు నుత్తమాంగనాసాంగత్యంబును
     రసాతలరాజ్యంబునుం బడసి మాతంగకుండు పరమానం
     దంబునం బొంది రాజవాహననరవల్లభునకుఁ బ్రియం బెఱిం
     గించి తానును నమ్మానినియు వివిధసంభాషనావిశేషంబులఁ
     దోషితుం జేయుచుండఁ గొండొకకాలంబున కవ్విభుండు
     చెలుల వంచించి వచ్చుటం జేసి తద్దర్శనకుతూహలం
     బునం బోవ సమకట్టి యిత్తెఱంగు వారల కెఱింగించిన నతం
     డునుం దనకుఁ గాళి కానుక యిచ్చిన మాణిక్యంబు పరిభవ
     క్షుత్పిపాసాదిక్లేశాపనోదం బగుట యవ్వనితవలన వినుటం
     జేసి యమ్మణి మానవేశ్వరున కొసంగం దలంచి తత్ప్రభావం
     బుపన్యసించి సకలరత్నంబులకును రాజు లొడయలు గావున
     దేవర దీనిఁ బరిగ్రహింపవలయు నని ప్రార్థించి యిచ్చి పాతా
     ళభువనంబు వెలువడ ననిచి వీడ్కొని మరలె ధరణీశ్వరుం
     డును సవితర్కంబుగా నొక్కరుండ యరిగి యెదురఁ
     బుష్పోద్భవుం గని సంభ్రమంబున గాఢాలింగనంబు సేసి
     యతని సవినయప్రణతి నాదరించి సమీపతరుచ్ఛాయా
     శీతలతలంబునందు నాసీనుం డై హర్షవికసితాననుం డగుచు
     నిట్లనియె.32
క. ఎఱిఁగినఁ బోనీ రని మిము
     మొఱఁగి మహీసురవరార్థముగఁ బోయితి నం
     దఱు నాతెఱఁ గేమని మది
     నెఱిఁగితి రెబ్భంగి నిశ్చయించితి రచటన్.33

క. ఎట వోయిరి చెలు లందఱు
     నిట నీ వేకతమ యేల యేఁగెద వనినన్
     నిటలతలంబున నంజలి
     పుట మల్లన మోపి పలికెఁ బుష్పోద్భవుఁడున్.34
తే. విప్రు వెంబడిఁ బడి నీవు వేడ్కఁ జనిన
     తెఱఁ గెఱింగియుఁ బోయిన దిక్కు తెరువు
     తెలియ నెఱుఁగమిఁ జెలు లెల్ల దెసలు గలయ
     వెదక సమకట్టి కదలి వేర్వేఱఁ జనిరి.35
వ. ఏనును.36
ఉ. దేవ! భవద్వియోగవనధిం బడి దుఃఖపరంపరోగ్రవీ
     చీవశవర్తినై తిరిగి చేడ్పడి యొక్కనగంబు నున్నత
     గ్రావముక్రేవ సాంద్రశిశిరంబగు నీడను డాసియున్నచో
     నావనజాతబాంధవుఁడు నంబరమధ్యముఁ బొందె నత్తఱిన్.37
క. ముందట బట్టబయల మ
     ధ్యందినగతిఁ గుఱుచలైన యంగంబులతో
     నందంబై యొకమానిసి
     చందంబున నీడ దోఁచె జగతీనాథా!38
ఉ. దానికి జోద్యమంది విదితంబుగ నంబరవీథి నప్పుడే
     నానన మెత్తి చూచునెడ నాకులవృత్తి రయంబుతోడ న
     మ్మానవుఁ డొక్కరుండు ఘనమార్గమునం బడుచున్నఁ జేరి వే
     వే నయ మొప్ప నాతని భువిం బడకుండఁగఁ బ్రీతిఁ బట్టితిన్.39
క. అతఁడును ఘనపథపతనము
     కతమున మూర్ఛిల్లి తెలిసి కనుఁగవ బాష్పా

     వృతిఁ బొందఁగ ననుఁ గనుఁగొని
     యతులితశోకాకులాత్ముఁ డై యిట్లనియెన్.40
తే. ప్రాణసమయైన సతిఁ బెడఁబాసి తోసి
     యనఘ! భృగుపతనంబు సేయంగ నిట్లు
     నేలఁ బడకుండ నన్ను నీ వేల పట్టి
     తభిమతంబున కంతరాయంబు గాఁగ.41
వ. అనిన నచ్చెరువంది యతని తెఱం గెఱుంగం దలంచి నీ వెవ్వం
     డ వని యడిగి యిట్లంటి.42
క. సతి నెట్టిభంగిఁ బాసితి
     సతిఁ బాసినమాత్రఁ జేసి చావునకుఁ దెగం
     గత మేమి దీని నంతయు
     వితతంబుగ నెఱుఁగఁ జెప్పవే వినవలతున్.43
వ. అని యడిగిన నతం డిట్లనియె.44
క. ఘనుఁ డగు మగధేశ్వరునకు
     ననుఁ గై పద్మోద్భవాఖ్యుఁ డగు ప్రెగ్గడకున్
     దనుజాతుఁడ రత్నోద్భవుఁ
     డనువాఁడ వణిక్క్రియార్థ మంబుధిలోనన్.45
క. ఓపి మును కాలయవన
     ద్వీపమునకు నరిగి యొకసతిం బరిణయ మై
     యాపొలఁతియు నేనును నీ
     ద్వీపమునకు నరుగుదేఱ విధి చెయ్దమునన్.46
వ. తీరంబున కనతిదూరంబునం గలం బబ్థిలోన [4]బిద్దంబగు
     టయు నెట్టకేనియు మహార్ణవంబు దరిఁ జేరి నిజాంగనా

     వియోగదుఃఖార్ణవంబునం దేలుచుం దిరుగ నొక్కసిద్ధునాదే
     శంబ యాధారంబుగా పోడశవర్షంబులు గడపి దురవస్థ గడ
     గానక సతీవియోగం బసహ్యం బగుటయు భృగుపతనంబు
     సేసితి నని చెప్పం జెప్పం దనజనకుం డను నెఱుక పుట్టు
     నవసరంబున.47
క. సైరింపరాని శోకము
     కారణముగ నాదుతనయ కాంతారములో
     మారుతసఖు పాల్పడియెడుఁ
     జూరే యనుపలుకు చెవులు సోఁకం బెలుచన్.48
వ. ఏనును దయావిధేయచిత్తుండ నై నీ కెఱింగింపవలయు
     కార్యంబు చాలం గల దంతకు రమ్మని యతని మొగంబు
     గనుఁగొని.49
చ. కరుణకుఁ బాత్రమై వినిచెఁ గాఱడవిన్ సతికూఁత యిత్తెఱం
     గరయుద మంచు నద్దెసకు నాదటతోఁ జని యొక్కచో భయం
     కరహుతభుక్శిఖాముఖవిగాహనసాహసికత్వ మేర్పడం
     గరములు మోడ్చియున్న యొకకాంతఁ గనుంగొని సంభ్రమంబునన్.50
క. అనలము సొరకుండఁగ న
     వ్వనజాననఁ బట్టి వృద్ధవనితాసహితం
     బొనరఁగ బోధించుచు మ
     జ్జనకుని డాయంగఁ దెచ్చి సవిషాదమునన్.51
వ. ఇ ట్లేకాంతంబునం గాంతారంబులో దురంతంబైన యవస్థాం
     తరంబుం బొందుటకుఁ గతం బేమి నీ వెవ్వర వనిన నయ్యవ్వ
     యి ట్లనియెఁ గాలయవనం బను దీవియందుం గాలగుప్తుం

     డను సెట్టికిం బుట్టి సుపుత్ర యనం బరఁగి యీకాంత నిజ
     కాంతుండైన రత్నోద్భవుం డను మగధరాజామాత్య
     పుత్త్రుండు తోడు తేఱంగలం బెక్కి వచ్చునెడ నేను నీతన్వి
     దాదింగావునం దోడన వచ్చితిం గలంబు బిద్దంబైన నంద
     ఱుం గనుకని మునింగిన నాసన్నప్రసవయైన యిత్తరుణి
     యేనును దైవయోగంబున నొక్కపట్టె పట్టికొని తీరంబు
     సేరితిమి మందభాగ్యయైన యిక్కోమలి కొడుకుం గాం
     చిన వాఁడును గోలుమృగంబుల పాల్పడుటయుం బరిభ్ర
     మించుచుండి షోడశవర్షాంతరంబునం బుత్త్రసమాగమం
     బగు నను నొక్కసిద్ధవచనంబు విశ్వసించి ప్రాణంబులు వట్టి
     యల్లపుణ్యాశ్రమంబున నొక్కయుటజంబున వసియించియు
     న్నంత నదియును నసత్యం బగుటయు శోకోద్రేకంబున నిలు
     పోపక యనలంబు సొర నుద్యుక్త యయ్యె ననవుడు మా
     తల్లింయగుట యెఱింగితిఁ దండ్రి యాదాదిమాటకుం జెవి
     యొగ్గి చెదరినచిత్తంబు కూడంబడ నచ్చెరుపడి యుపలక్షిం
     చుచు నుండె నేను మదీయశైశవప్రకారంబులు జనముఖం
     బునను వినుతెఱంగు సెప్పి జనకుం జూపి వారలకుం దద్వ
     ర్తనంబును దెలిపి యివ్విధంబున మాయంతవట్టును బ్రత్యభి
     జ్ఞానంబుగా నొండొరు లెఱింగికొనిన యనంతరంబ రాజ
     హంసమహీవల్లభు రాజ్యభ్రంశంబును భవదీయజన్మంబును
     సకలసచివకుమారప్రాప్తియు దివ్యవాగువదేశంబున దేవర
     దిగ్విజయార్థంబు వెలువడుటయు మనము గనుకనిం జనిన
     కారణంబును సవిస్తరంబుగాఁ దేటపడం బలికి నిన్ను నన్వే
     షించుటయ పరమకార్యంబుగా నిశ్చయించి మజ్జనని

     వాసంబున కరిగి యందు సర్వార్థసిద్ధిమిత్తంబు విత్తంబ కా
     విచారించి.52
సీ. భవదనుగ్రహమునఁ బడసిన సాధక
                    త్వమునకు సత్క్రియాదక్షు లైన
     శిష్యుల సవరించి సిద్ధాంజనము గూర్చు
                    కొని వింధ్యవనమధ్యమునకు నరిగి
     పాడుపోళ్ళ[5]ం జొచ్చి బహువిధనిధినూచ
                    కము[6]లకు ధరణీరుహములవలనఁ
     గందువ లెఱిఁగి రక్షకులఁ గొందఱఁ జేసి
                    [7]కొందఱు తోడుగా గుద్దలించి
తే. పెన్నిధులు గాంచి [8]వెరవునఁ బెల్లగించి
     కోటిసంఖ్యలమాడలు గూడఁబోయు
     నవసరంబున నొక్కసా తరుగుదెంచి
     రవము మిగులంగ ననతిదూరమున విడిసె.53
ఆ. అందులోనఁ [9]బేరు నలపడ్డయెడ్లనుఁ
     దడవి విలిచి తెచ్చి ధనము వట్టి
     యొండుసరకుపేర నుగ్గడించుచు నల్లఁ
     జేరి నేర్పుగలుగువారిఁ గలసి.54
క. ఆవీటికిఁ బతియును సం
     భావితుఁడును నైన చంద్రపాలుఁడు మిత్రుం
     డై వేడుకతోఁ దోకొని
     పోవఁగ నుజ్జయిని కేను బోయితిఁ బ్రీతిన్.55

క. పజ్జన తోకొని రమ్మని
     బుజ్జగమున నొక్కశిష్యుఁ బుచ్చిన వాఁడున్
     మజ్జననీజనకుల న
     య్యుజ్జయినికిఁ దెచ్చి యం దనూనప్రీతిన్.56
వ. అట్లున్న కొన్నిదినంబులకు.57
ఆ. చంద్రపాలుతండ్రి సకలసద్గుణనిధి
     బంధుపాలుఁ డనఁగఁ బరఁగువాఁడు
     గారవమున రాజు గాన్పించి నింపు గా
     వించె మాకు నెమ్మి వెలయుచుండ.58
ఉ. ఏనును బంధుపాలునకు నిష్టుఁడ నై మనవర్తనంబులున్
     గాననభూమిలోన నిను గానక రోయఁగఁ బోయిపోయి యు
     జ్జేనికిఁ జేరఁబోవుటయుఁ జెప్పి భవద్గతి యారయంగఁ బోఁ
     బూనిన నాతఁ డిట్లనియెఁ బొచ్చెము లేని దయాగుణంబునన్.59
ఆ. అంత మెఱుఁగ లేని యవనీతలం బెల్లఁ
     గలయఁదిరుగ నలవిగాదు తిరిగి
     కాన నలవిగాదు గాన [10]నీదగు మనో
     గ్లాని మాను మతనిఁ గను తెఱంగు.60
క. శకునజ్ఞానబలంబునఁ
     బ్రకటంబుగ నెఱిఁగి నీకుఁ బ్రవ్యక్తముగా
     సకలము నెఱిఁగించెద నని
     యకుటిలుఁ డై పలికె మత్సహాయుం డగుటన్.61

చ. అతనివచోమృతంబు హృదయంబునకుం బ్రమదం బొనర్చినన్
     దతనిరహాతురత్వ మెడ దవ్వుగఁ జూపి కరంబు నెమ్మిమైఁ
     బ్రతిదివసంబు నే నతనిపాలఁ జరింపుచునుండి యొక్కనాఁ
     డతనితనూజ రాజముఖి నాదటఁ జూచితి బాలచంద్రికన్.62
మ. సమదృష్టిన్ ననుఁ జూచి యచ్చెలువయున్ శారీరకంబైనకం
     పముచే మానసవృత్తి యంతయును విస్పష్టంబుగా భావసం
     గము నాచిత్తము చూఱగోలుకొన రాగవ్యక్తి పుట్టించె నా
     సుమనోబాణుఁడు సేయఁ జొచ్చెఁ జెలువం జూతాంకురాస్త్రమ్ములన్.63
వ. ఇట్లన్యోన్యజనితస్నేహంబునం దగిలి యమ్మానినియు నేనును
     జతురనిగూఢచేష్టలం జిత్తవృత్తు లొండొరుల కెఱింగిం
     పుచుఁ బొందు వడయు నుపాయంబుఁ దలపోయు చు
     న్నంత నొక్కనాఁడు బంధుపాలుండు శకునజ్ఞానంబున భవ
     ద్గతిఁ దెలియ సమకట్టి నిజగృహోపాంతవిహారవనమునకు
     నన్నుం దోకొని యరిగి యొకవృక్షంబుక్రేవం బక్షిచేష్ట నిరీ
     క్షించునెడ నుత్కంఠావినోదపరాయణుండ నై తత్ప్రదే
     శంబునం గలయం దిరిగి యొక్కకొలనితీరంబునఁ జింతా
     క్రాంత యై చిన్నవోయియున్న బాలచంద్రికం గని డాయం
     జని సంభ్రమప్రేమలజ్జాకౌతుకమనోహరం బైన తదీయా
     లోకనంబు ననుభవించి యమ్ముద్దియమొగంబునఁ దోతెంచు
     విషణ్ణభావంబు మదనజనితఖేదంబు గాకునికి నిరూపించి
     కలరూ పెఱుంగం దలంచి చేరంబోయి నీవిన్నఁదనంబునకుం

     గారణం బేమని యడిగిన నదియును మనస్సంగసంజాత
     విస్రంభ యగుచు నిశ్శంక యై యి ట్లనియె.64
సీ. మును మానసారుండు ముదిమి వాటిల్లినఁ
                    దనతనూభవుఁ డగు దర్పసారు
     నభిషిక్తుఁ జేసిన నతఁడు పదంపడి
                    యేడుదీవులు తాన యేలఁ గోరి
     తపమున కరిగె నాతనియాజ్ఞ చలఁ గొని
                    మఱుదులు చండవర్మయును దారు
     వర్మయు ననువారు వసుధాతలం బెల్ల
                    శాసింతు రిప్పు డాచండవర్మ
తే. మేటి యై కార్యబలమున మీఱియుండు
     దారువర్మ దుష్పథమునఁ దగిలియుండు
     నన్నకైనను మఱి మామకైనఁ బూని
     వానికొఱగామి మాన్పింప వసముగాదు.65
వ. కావునఁ బరద్రవ్యాపహరణంబును బరదారదూషణంబును
     భూషణంబులుగాఁ బురంబు ముప్పెట్టు వెట్టుచుండు.66
శా.నిన్నుం జూచిననాఁటఁ గోలె నధికస్నేహంబునం జేసి నా
     కన్నుం జిత్తము నొండు చూడఁ దలఁపంగా నేర కిట్లున్నచో
     నన్నుం గోరుచు నున్నవాఁ డతడు కన్యాదూషణం బెగ్గుగా
     నెన్నం డెన్నఁడు నీదురంతదురితం బెప్పాఱ నే నీఁగుదున్.67
వ. అని నిజహృదయగతం బైన రాగోద్రేకంబును మనోరథ
     సిద్ధికిం బుట్టిన యంతరాయంబును సవిస్తరంబుగా నెఱిం
     గించి బాష్పపూరితనయన యై యున్న యన్నాతి నెట్టకే

     నియు నూరార్చి దారువర్మం జంప నుపాయం బూహించి
     యిట్లని పలికితి.68
క. వనితా! యూఱడి నిలువుము
     నినుఁ గోరెడివానిఁ జంప నేర్తు భవద్వ
     ర్తనమె యుపాయం బగు నీ
     వనుమానము లేక నడువు మది యె ట్లనినన్.69
సీ. బాలచంద్రికఁ బొంది పాయక బేతాళుఁ
                    డొకఁ డున్నవాఁడు వాఁడునికి తెలియ
     నెవ్వరు నెఱుఁగ రే నెఱుఁగుదు నమ్ముగ్ధ
                    యాకారసంపద కాససేసి
     సంబంధయోగ్యుండు సాహసికుండు నై
                    చనుదెంచి యెవ్వఁడు జానుమీఱి
     యేకాంతగృహములో నేకసఖీసాక్షి
                    కముగ సల్లాపామృతమునఁ దేల్చి
ఆ. ప్రాణగొడ్డములకుఁ బాసి తా వెలువడు
     నతఁడ భర్త యమ్మృగాక్షి కనియె
     నొక్కసిద్ధుఁ డని దృఢోక్తులఁ బూని మీ
     వారు సెప్పవలయు నూ రెఱుంగ.70
చ. అనిశముఁ జెప్పఁ జెప్ప విని యాతఁ డెదన్ భయమంది తాన ని
      ల్చినఁ గడు మేలు క్రొవ్వునఁ జలింపక దీనికి నియ్యకొన్న ని
     ట్లనునది దర్పసార! వసుధాధిపు కూర్మిమఱందివైననీ
     కనుచిత మస్మదీయనిలయంబున సాహసవృత్తి చేయఁగన్.71
క. వేయేటికి నీ యింటికిఁ
     దోయజముఖి నూ రెఱుంగఁ దోకొని చని దీ

     ర్ఘాయుష్మంతుఁడ వైనన్
     జేయుదము వివాహ మిష్టసిద్ధిగ నీకున్.72
క. అనవుడు వాఁ డొడఁబడు నీ
     వనుమానము లేక తద్గృహంబునకు ముదం
     బున నరుగు మేను నీతో
     జనుదెంచెద బోటికత్తెచందముతోడన్.73
వ. చనుదెంచి యేకాంతగృహంబులోన వాని నగపడం బట్టి
     కొని ముష్టిజానుఘాతంబులం దెగఁ జూచి యెప్పటిసఖీ
     వేషంబున భవదనుగమనంబు సేసెద నిదియ వెరవు దీనికిం
     దగ నీవు లజ్జాభయంబు లుజ్జగించి భవదీయజననీజనక
     సహోదరులకు మనయన్యోన్యస్నేహంబు లెఱింగించి
     రత్నోద్భవుండు సంబంధయోగ్యుండేని నిన్నుఁ బుష్పో
     ద్భవున కీ నర్హం బని వారల నియ్యకొలిపి దారువర్మవలనం
     బుట్టునపాయంబును నీయుపాయంబునం దలంగ నాయియ్య
     కొనుటయుఁ జెప్పి తదనుమతిం బడసి నాకు మాఱుమాట
     సెప్పుటయు [11]మతివిక్రమం బప్రతిహతంబుగా నివ్విధంబు
     సేసి.74
మ. తుది నే నిన్ను వివాహ మయ్యెద మదాంధుం గ్రూరకర్మోన్ముఖుం
     బ్రిదులం బోవఁగనీక చంపుటయ తా బీరంబు ధర్మంబు ని
     ట్టిద కార్యస్థితి నిత్తెఱంగున న నీడెందంబునుం గన్న స
     మ్మదపాత్రం బగు నంబుజాక్షి! యని యే మానంబు మానించితిన్.75

వ. అదియును నాచెప్పిన యుపాయంబు గావింప నొడంబడి
     యరిగె నేనును బంధుపాలుం డున్నయెడకుం జని భవద్దర్శ
     నంబు కతిపయదినాంతరమ్ముల సమకూరుట యతనిశకున
     జ్ఞానంబున నెఱింగి నిజగృహంబున కరిగితిఁ బదంపడి మదీయ
     వాక్యవాగురాపాశంబుల దారువర్మ దగులుటం జేసి బాల
     చంద్రిక వానియింటికిం బోవ సమకట్టి నా కెఱింగించి
     పుత్తెంచినఁ బరమానందంబు నొంది.76
సీ. మట్టియ లుజ్జ్వలమణినూపురంబులు
                    మొలనూలు వస్త్రముల్ ముత్తియములు
     కట్టుపడంబులు గట్టినూళ్ళును సుద్ద
                    సరితీఁగె మినుకులు సందిదండ
     లంగుళీయకములు హారికంకణములు
                    చేకట్టుపాలెలు చెన్ను మెఱుఁగు
     టాకులు సరిపెణ లాలక్తకము పూఁత
                    కాటుక తిలకంబు కమ్మపువ్వు
తే. లాదిగాఁ గల మేలిద్రవ్యముల నొప్ప
     బసదనముఁ జేసి యుచితరూపంబుఁ దాల్చి
     బాలచంద్రికబోటినై పజ్జ నరిగి
     దారువర్ముని లోఁగిలి దఱియఁ జొచ్చి.77
వ. తదీయవాసగృహద్వారమున నిలిచి యెఱింగించి పుచ్చిన
     వాడును సంభ్రమంబున నెదురువచ్చి రాగాంధుఁ డగుటం
     జేసి యొండు దలంపక సిద్ధాదేశంబున కనుగుణముగా
     దద్వారోపాంతనివారితసమ స్తపరివారుం డై మద్ద్వితీయం
     బైన బాలచంద్రికం దోకొని చనియె నయ్యవసరంబున.78

క. బేతాళునికథ ముందర
     భూతాక్రోశంబెగాఁగఁ బుట్టిన దానం
     గౌతుకము పొంది పౌరులు
     నేతెంచిరి దారువర్మయింటికిఁ గలయన్.79
మ. ఎలమిం బొంది వివేకశూన్యమతి యై యేకాంతసౌధోపరి
     స్థలభాగంబునఁ బాన్పుపైకిఁ జని రత్నప్రస్ఫురద్భూషణం
     బులు వస్త్రంబులు పూఁతలుం దములముం బుష్పంబులున్ లోనుగా
     లలితద్రవ్యము లెల్ల నా కొసఁగె మేలం బాడుచుం బ్రీతితోన్.80
వ. అనంతరంబు.81
తే. దారువర్మ రాగాంధుఁ డై తరుణిఁ గవియఁ
     దివిరి పైఁబడఁ దలఁచినతివుట యెఱింగి
     కదిసి వెసఁ ద్రెళ్లఁ ద్రోచి మోఁకాల గుండె
     గ్రుమ్మి చంపితి లావు బీరంబు మెఱయ.82
వ. ఇట్లు చంపి కలుషితచిత్తయగు బాలచంద్రిక నూఱడంబలికి
     వికలంబైన శృంగారము యథాపూర్వంబుగా నలవరించు
     కొని మందిరద్వారంబు వెలువడి యగ్గలంబగు బెగ్గలంబు
     భావించి.83
శా. రండీ! రాజుమఱంది నొక్కరుఁడు ఘోరస్ఫారగాత్రుండుక్రూ
     రుం డై చంపెడు బెట్టుగట్టి యని యాక్రోశించి యేఁ బిల్చినం
     దండం బై జను లెల్ల వచ్చి కని యుగ్యద్భాష్పులై రేసి బ్ర
     హ్మాండం బొక్కట మ్రోయ నేడ్చి రచటన్ హాహానినాదంబులన్.84
వ. ఇట్లు రోదనంబు సేయుచు.85

క. పోలదు సాహసరుచి యగు
     టా లొండొకచోట లేదె యని చెప్పంగా
     బేలతనంబున నీబే
     తాళునిపా ల్పడియె నితఁడు దైవము చెయిదిన్.86
వ. అనుచు బహుప్రకారంబు లగు శోకాలాపంబులు సేయు
     చుండి రయ్యవసరమున.87
క. సందడిలో బడి యిరువురు
     ముం దత్క్షణమాత్ర నరిగి మోదం బలరన్
     డెందమున నూఱడిల్లియుఁ
     బొందెడుతలఁ పొరు లెఱుంగఁ బోలకయుండన్.88
వ. వర్తిలుచుండితిమి పదంపడి పౌరు లెల్ల నభ్యర్థించి సిద్ధాదే
     శంబు సేసినవాఁడనై తత్ప్రకారంబు నడపి బాలచంద్రికం
     బరిగ్రహించితి సముచితవ్యాపారంబులం గతిపయదినంబులు
     సనిన దేవరవలని తలంపు మనంబునం గదిరి బంధుపాలు
     శాకునికవచనంబుల కూఱడిల్లక యన్యు లెఱుంగకుండ
     నేఁడు పురంబు వెలువడివచ్చి యీదృగ్విధంబైన యానం
     దంబున కర్హుండ నైతి నని పుష్పోద్భవుండు తన వృత్తాంతంబు
     రాజహంసున కెఱింగించి.89
క. చెలు లెటు చనుటయు నెఱుఁగక
     తలపోఁత[12]ల వాడు నృపుహృదయకమలము మి
     క్కిలి యలరఁ దత్సహాయము
     కలిమికి మొద లగుటఁ బ్రియము గదిరిన మదితోన్.90
చ. మనసిజమూర్తి యానృపకుమారుఁడుఁ దాను సవంతికాపురం

     బునకు ముదంబుతోడఁ జని భూపతి వీఁ డని బంధుకోటి క
     ల్లన యెఱిఁగించి వర్తనముల బెఱలోకుల కెల్ల భూసురుం
     డనుమతిఁ బుట్టఁ జేయుచు ముదం బెసఁగన్ విహరింపుచుండఁగన్.91
ఆ. దంపతులకు నింపు పెంపార విరహుల
     కంతరంగతాప మతిశయిల్ల
     సకలజీవులకును సంప్రీతిగా మనో
     హారి యగు వసంత మరుగుదెంచె.92
ఉ. వేఁకువఁ గమ్మతెమ్మెరలు వీవఁగ మాపుల నెల్లిదంపుఁగా
     రాకులపాటు డెందముల నాకులపా టొదవింపఁజొచ్చె శో
     భాకరపల్లవప్రచయ మంగజవహ్నిశిఖాసరూపతం
     గైకొని వంతఁ జేసెఁ బథికప్రకరంబునకున్ వనంబునన్.93
వ. తదవసరంబున.94
క. మొగడలఁ బూవులఁ బూపల
     నగణితసమ్యక్ఫలముల నభిరామం బై
     జగతీజము లొప్పిదమున
     మిగులఁగ భావజుని[13]క్రొవ్వు మిమ్మట మయ్యెన్.95
వ. ఇట్లతిరమణీయం బైన వసంతసమయంబున మానసారనందన
     యగు నవంతిసుందరి యను కన్యక నగరోపాంతరమ్యారా
     మంబున బాలచంద్రికాప్రభృతిసఖీజనసమేతంబుగాఁ జని
     చూతపోతకచ్ఛాయాభిరామం బగు సికతాతలంబున విహ
     రించుచున్న సమయంబునఁ దద్దర్శనకౌతుకంబున రాజవాహ

     నుండు పుష్పోద్భవుండు తోడ రా మధుసహాయుండగు
     పుష్పబాణుండునుంబోలెఁ దద్వనంబు సొత్తెంచి.96
సీ. కీరంబులకు జన్మగృహమైన యెలమావి
                    జొంపంబు లింసాఱఁ జూచిచూచి
     పరపుష్టములకు నాస్పదమైన పున్నాగ
                    ధరణీజరాజిలోఁ దిరిగితిరిగి
     భ్రమరంబులకు నాటపట్టైన మాధవీ
                    మండపంబులకడ మసలిమసలి
     కలహంససమితికి నెలవైన విరదమ్మి
                    కొలకుల కెలకుల నిలిచినిలిచి
తే. రమ్యకేళీవనాభ్యంతరమున నిట్టు
     లల్లనల్లనఁ బొలయుచు నబల లున్న
     కందువకు డాయఁ బోయినఁ గాంత లెల్లఁ
     జూపువేఁదురు గొనిరి రాసుతుని జూచి.97
క. శంకింపక రండని మును
     సంకేతము సేసి బాలచంద్రిక చనుటన్
     బంకజముఖి డాయఁగ మీ
     నాంకునిగతి రాజవాహనాంకుం డరిగెన్.98
వ. తదవసరంబున.99
క. ఆవిభుఁడు నాలతాంగియు
     భావజు నంకములమాడ్కిఁ బటువీక్షణశ
     స్త్రావిద్ధహృదయు లై నిజ
     భావము నొండొరుల కెఱుక పఱచిరి ప్రీతిన్.100

ఉ. ఎవ్వరిసూనుఁ డీతఁ డితఁ డెందులవాఁ డిట వచ్చు టేమియో
     యెవ్వరు నాకు నింతయును నేర్పడఁ జెప్పెడువారు వీనిపొం
     దెవ్విధిఁ గాంతు నెచ్చెలికి నేమని చెప్పుదునొక్కొ వీని నం
     చువ్విళులూరుచుండె దళితోత్పలలోచన నెమ్మనంబునన్.101
వ. అయ్యవసరంబున బాలచంద్రిక యయ్యిరుపురచిత్తవృత్తు
     లుపలక్షించి యత్తెఱవ కీతని తెఱం గెఱింగింప నిదియె
     తఱి యని యూహించి జనసమాజసన్నిధి యగుట లోక
     సామాన్యవచనములఁ గాలోచితకార్యంబు నడపం దలంచి
     యిట్లనియె.102
ఉ. విప్రకుమారుఁ డితఁడు ప్రవీణుఁడు విద్యలఁ బల్కు నేర్పుమై
     నప్రతిమానుఁ డాహవవిహారములందు సమర్థుఁ డాత్మశ
     క్తిప్రకటీకృతిం గొఱలి దేశము లెల్లఁ జరింపుచుండుఁ బూ
     జాప్రతిపత్తిపాత్రముగఁ జాలెడువాఁడు పయోజలోచనా!103
క. అనవుడు నవంతిసుందరి
     యనురాగము పొంది సముచితాసన మిప్పిం
     చిన రాజవాహనుఁడు గై
     కొని పుష్పోద్భవుఁడుఁ దానుఁ గూర్చుండి మదిన్.104
వ. ఇత్తన్వి మదీయపూర్వజన్మపత్ని యైన యజ్ఞావతి యగుఁ
     గానినాఁడు దీనియందు నాచిత్తంబు దగులుటకుఁ గతం
     బేమి యని వితర్కించి శాపసమయంబున నమ్ముని యను
     గ్రహించిన జాతి[14]స్మరత్వంబు నాకును నమ్ముద్దియకును

     నొక్క సమానంబు గావునం దత్కాలజనితవిశేషసూచకంబు
     లగుమాటలాడి యీలేమ కలరూ పెఱుంగుదు ననునిశ్చ
     యంబు పుట్టి యున్నంత.105
తే. అయ్యెడకు వచ్చె నొక్క రాయంచ దాని
     బాలచంద్రిక వేడ్కమైఁ బట్టఁ బోయె
     జనవిభుండును నిది నాకు సమయ మనుచు
     మగువ వారించెఁ గరవిభ్రమంబు మెఱయ.106
వ. ఇట్లు వారించి యొక్కకలహంసవలన నొక్కరుండు పడిన
     పాటు విను మని యి ట్లనియె.107
చ. జలరుహలోచనాత్మజుఁడు సాంబుఁడు దొల్లి వధూటి తోడ రాఁ
     గొలనికి గేలికాంక్షఁ జని కోకనదప్రచయంబుచేరువం
     బొలయఁగ నొక్కయంచఁ గని బోరనఁ బట్టి సరోజనాళతం
     తుల గుదివెట్టి సంతసముతో మృగలోచనమోము సూచుచున్.108
క. మన [15]కగపడి యిప్పుడు దా
     మునిక్రియ నిప్పులుఁగు ముచ్చముడిఁగినయది వేఁ
     డినఁ దనకుం బోవచ్చునె
     యని యుల్లసమాడె సస్మితాననుఁ డగుచున్.109
వ. ఇ ట్లవమానించినఁ గోపించి యాహంస మనుష్యవచనముల
     ని ట్లనియె.110
క. ఏ నొకనైష్ఠికుఁడ నను
     ష్ఠానపరత్వమున జలజషండములో నే

     నానందించెద నను నవ
     మానింపం దగునె రాజ్యమదమున నీకున్.111
క. ఏపున నవమానింపుచు
     నీపొలఁతికిఁ జూపిచూపి నిష్ఠురమతి వై
     నాపాదంబులు గుదిచిన
     పాపంబున విరహవహ్నిఁ బడు వివశుఁడ వై.112
వ. అని శపియించిన సాంబుండు నిజజీవితేశ్వరిం బాయంజాలక
     విషణ్ణహృదయుం డై మహాభాగా! యెఱుంగక చేసితి
     సహింపు మని దండనమస్కారంబు సేసినం జూచి హంస
     కరుణించి యీజన్మంబున శాపఫలం బనుభవింపకుండునట్లు
     గా ననుగ్రహించితి నావచనం బమోఘం బగుటం జేసి యవ
     శ్యంబు ననుభవింపవలయు నీ విం కొకజన్మంబున దేహాం
     తరగతయైన యిమ్మగువకు మగండవై మదీయచరణయుగ
     ళంబు నిగళితంబు గావించిన యీముహూర్తద్వయంబు
     నకు మాసద్వయంబు నిగళితచరణుండ వై వియోగదుఃఖం
     బనుభవించి పగంపడి నిజాంగనాసహితుండ వై రాజ్య
     సుఖంబు లనుభవింపుమని వారియపరజన్మంబునకు జాతిస్మర
     త్వంబు దయసేసెం గావున మరాళంబుతోడి మేలంబు వల
     దని కథారూపంబున నిజపూర్వజన్మవృత్తాంతంబు సూచిం
     చిన రాజవాహను పలుకులు విని యవంతిసుందరియునుం
     దనపురాతనజన్మవృత్తాంతం బగుటం దెలిసి యితండు మ
     త్ప్రాణవల్లభుండగు నని యుల్లంబు పల్లవింపం దన్ను నత
     నికిం దెలుపం దలంచి యెఱుకపడ ని ట్లనియె:113

క. యజ్ఞవతి యనుపఁగఁ బతి
     యాజ్ఞాపరిపాలనార్థ మటు సేయుట దా
     నజ్ఞానమె మొగమోటమిఁ
     బ్రాజ్ఞులు చేయుదురు సతులు పనిచిన భంగిన్.114
తే. అనిన విని రాజవాహనుం డాత్మలోన
     నమ్మృగాక్షీపూర్వాభిధానమ్ము దొంటి
     తనదు చరితంబు నెఱిఁగించెఁ దలఁప నిది మ
     దీయవల్లభ యగుట సందియము లేదు.115
మ. అని మోదింపుచు నింతిఁ గన్గొనియె ని ట్లన్యోన్యజన్మంబుఁ దా
     మనుజేశుండు నవంతిసుందరియుఁ బ్రేమవ్యక్తి సంధిల్ల నే
     ర్పునఁ జెప్పంగ నెఱింగి కోర్కు లెసకంబుం బొంద నున్నంత వ
     చ్చె నవంతీశ్వరుదేవికూఁతుకడకుం జిత్తంబు రాగిల్లఁగాన్.116
క. ఆసమయమున రహస్యము
     గాసిం బడకుండ బుద్ధిగౌరవమున నా
     కాసుతుని బాలచంద్రిక
     చేసన్నలఁ దొలఁగఁ బంచెఁ జెలితోఁ గూడన్.117
వ. ఆదేవియుం గూఁతుకడకుం జనుదెంచి తత్సఖీజనంబుల
     వివిధకేళీవినోదంబు లాచరించి కొండొకసేపునకు విహార
     విలోకనకుతూహలంబు సాలించి సపరివారమ్ముగా నమ్ముద్ది
     యం దోడ్కొని మందిరంబున కరుగుసమయంబున.118
ఉ. తల్లిపిఱుందఁ బోక యుచితం బని పోయెద దీన మన్మనో
     వల్లభుఁ డెగ్గుగాఁ దలఁచి వారనికోపరసంబు నొందునో
     యుల్లమునందు నాతగుల మూఱిడిపోవునొ యంచు నెంతయుం

     దల్లడ మందెఁ బూర్ణహిమధామనిభానన నెమ్మనంబునన్.119
క. మా టిడ నేరని కూరిమిఁ
     గాటుకకన్నీరు దొరుఁగఁగాఁ గోమలి ప
     ల్మాటునుఁ బెడమరి చూచుచు
     నేటికి నెదు రీఁదుమాడ్కి నింటికిఁ జనియెన్.120
వ. చని కన్యాంతఃపురంబున బాలచంద్రికం గలపికొని తక్కటి
     చెలుల వంచించి యచ్చెలియుం దానును నిజవల్లభువలని
     మాటలాడునెడ నతనియన్వయనామధేయంబులు దాని
     చేతం దెలియ విని సంతసిల్లి పూర్వజన్మదంపతీత్వంబు
     హంసకథాప్రసంగంబున నొండొరులకుం దెలుపుట య
     త్తెఱవ కెఱింగించి.121
క. అనురూపరాగవర్ధిత
     మనసిజసంతాప యగుచు మడిఁగి వయస్యా
     జను లెఱిఁగి తలరునట్టుగ
     ననుదినమును మిగులనంత నలఁదురుచుండెన్.122
మ. కనుబేటంబున గాటమైన హృదయగ్లానిన్ బయోజాస్య యి
     ట్లునికి న్నెచ్చెలు లిచ్చ నోర్చి తమలో నూహించి శీతక్రియల్
     పొనరింపన్ సమకట్టి లేఁదలిరులం బుష్పంబులం బూఁతలన్
     ఘనసారంబు మృణాలవల్లికలు వీఁకం గూర్చి నెయ్యంబుతోన్.123
సీ. దర్పకుఁ గర్పూరదళముల నిర్మించి
                    యెలమితో నర్చన లిచ్చువారు

     నీహారజలముల నిండారుకుండలు
                    శిశిరగంధముల వాసించువారు
     బిసతంతుపటము లింపెసలారఁ జందన
                    ద్రవమున జొత్తిల్లఁ దడుపువారు
     పువ్వుసెజ్జలును లేఁబొరల వీచోపులు
                    వెరవు పాటించి గావించువారు
ఆ. మలయమారుతంబు నెలమావిజొంపంబు
     నమృతకరు వసంతు నళిచయంబు
     చిలుకపిండు గోయిలలకును మొఱలిడు
     వారు నైరి వీరు వారు ననక.124
వ. మఱియును.125
మ. చిలుకా! పల్కకుమీ లతాంతశరుఁడా! చెల్వం గృపం జూడు మీ
     యళులారా! మొరపంబు దక్కి నిలుఁడీ యాలోలమంచానిలా!
     కలయం బాఱకుమీ పికప్రకరమా! కంఠధ్వనుల్ నల్దెసల్
     చెలఁగం గూయక తక్కుమీ యనుచు రాజీవాస్య లుద్బాష్ప లై.126
క. ఆరమణీతిలకమునకు
     గౌరవమున శిశిరవిధులు గావించినఁ బొం
     గారెడు నేతికిఁ బయిపై
     [16]నీ రలికినయట్లవోలె నిష్ఫల మయ్యెన్.127
వ. అమ్ముద్దియ ననునయింపం దలంచి దానిబహిఃప్రాణంబునుం
     బోని బాలచంద్రిక యి ట్లనియె.128
చ. చెఱకటె విల్లుపువ్వు లటె చిక్కనిచక్కనియమ్ము లేయుచో

.

     గుఱియటె చిత్తముల్ హరుఁడు కోపమునం గనుఁగొన్ననంగముం
     బఱిపఱి యయ్యె నట్టె తలప్రాణము తోఁకకు వచ్చె నెవ్వరిం
     గఱచు ననంగుఁ డేమిటికిఁ గంపము చెందెద వంబుజాననా!129
తే. అనిన వెలవెలపాటుమై నల్ల నిగుడు
     చిఱుతనగవున నెమ్మోము చెన్నుఁ జేయఁ
     నళినలోచనదృగ్దీప్తు లొలసి గ్రాల
     నెలుఁగు రాల్పడ నల్లన యిట్టు లనియె.130
ఉ. సుందరి! రాజనందనుని జూచిన చూపుల పజ్జఁ బోయి నా
     డెందము పూవుఁదూఁపులఁ దొడంబడి మన్మథరాగవార్ధిలో
     డిందె మరల్చి తెచ్చుట కడింది దురాశలఁ బొంది పొంది యే
     నందని మ్రానిపండ్లకును నఱ్ఱులు సాఁచెద నేమి సేయుదున్.131
వ. అని యివ్విధంబున నివ్వటిల్లు నెవ్వగలం బొగులు నమ్మృగ
     లోచనం జూచి బాలచంద్రిక యాత్మగతంబున.132
మ. జగతీజాతజయంతుఁడైన మగధక్ష్మానాథుఁ దేకున్న ని
     మ్మగువం జిత్తజుఁ డేల మెత్తనిమెయిన్ మన్నించు వేపోయి నే
     ర్చుగతిం బిల్చెద నిట్లు నాతఁ డిట వచ్చుం దమ్మిలేఱేకులం
     జిగురుంబ్రోవులఁ దూండ్లనుం దొలఁగునే చింతాజ్వరం బింతికిన్.133
వ. అదియునుంగాక.134
ఆ. ఏన కాదె విభున కీతన్వి నెఱిఁగించి
     దీని కతనితెఱఁగు తెలియఁ జెప్పి
     ప్రేమమునకు మొదలు పెట్టినదాన నా
     చేత నెట్లు దీరు నీ తెఱంగు.135

క. వెఱ పేల నాకు నాఁ డీ
     తెఱవం గనుఁగొనుచు వలపుత్రిప్పులఁ బడు టే
     నెఱుఁగనె యింతకుఁ గైకొని
     పఱిపఱిగా నేయకున్నె భావజుఁ డతనిన్.136
వ. కావునఁ గుమారుకడకుం జని తగిన తెఱుంగు సేసెద నని
     సమయోచితశరణంబులకుఁ జతురలైన సఖుల నియమించి.137
క. చని మదనాతురుఁ డగు న
     మ్మనుజేంద్రకుమారుఁ గాంచి మన మలరఁగ నా
     తనిచేయు నుచితసంభా
     వనఁ గైకొని ప్రేమగర్భవచనప్రౌఢిన్.138
వ. లీలోద్యానవర్తనప్రసంగంబున నల్లన కలసికొని యవంతి
     సుందరి వలవంత యెఱింగించి యి ట్లనియె.139
ఉ. నేచియు నేరకుండియును నీసుకుమారతనూవిలాసముం
     జూచిన రాచకూఁతుఁ దెగఁజూచు తలంపున నంపవానలో
     ద్రోచె లతాంతసాయకుఁడు దూఱగునాఱడిచావు మాన్పఁగాఁ
     జూచుట మేలు వచ్చి దయఁ జూడుము మాగధరాజశేఖరా!140
క. అనిన విని రాజవాహనుఁ
     డనవరతము తోడునీడ యై తన్నుం బా
     యని చెలియగు పుష్పోద్భవుఁ
     గనుఁగొని యిట్లనియె వదనకమలం బలరన్.141
క. మది నూఱడు మిఁక నీతలఁ
     పు దలంపం గూడె నాడఁబోయిన తీర్థం

     బెదురుగ వచ్చిన క్రియ న
     మ్మదిరేక్షణ తాన వచ్చె మనకడ కర్థిన్.142
వ. అని బాలచంద్రిక మొగంబుఁ జూచి యీకార్యలతకు నాలు
     వాలంబు భవదీయచాతుర్యంబ కాదె కావున నీ కెయ్యది
     ప్రియం బేగతి మనోరథంబు సఫలం బగు నెవ్విధం బుచితం
     బగు దానిన చేయుదు ననిన నమ్మానిని యి ట్లనియె.143
క. మరునెత్తికోలు చెప్పితి
     వెరవు తగవు నీవె నేర్తు వేయేటికి నా
     తరుణీరత్నము చింతా
     జ్వరభయమునఁ దెగకమున్న వలయం గవయన్.144
క. అను పలుకులకు విషాదము
     వెసఁగినమోదంబుతోడఁ బృథివీపతినం
     దనుఁ డయ్యంగనతో ని
     ట్లనియెం బ్రేమార్ద్రసముచితాలాపములన్.145
చ. మరుఁ డలయింప నమనము మానము దూలిన నయ్యవంతిసుం
      దరి కనుదేట మేర్పడుట తాఁ దగు కారణ మయ్యెఁ గాక యా
     వెరవరి వల్లభుం గలయ వేగిరపాటునఁ జుల్కగాని యి
     త్తరుణియు నేను బ్రీతి నుచితంబుగఁ బొందినఁ గాక యొప్పునే.146
వ. కావున దుష్కరం బైన కన్యాంతఃపురప్రవేశంబున కను
     రూపంబగు నుపాయంబు విచారించి.147
క. నేఁ డెల్లి వత్తుఁ బిలిచిన
     రాఁ డను వగ దక్కు మెన్నిక్రమములనైనన్.

     బోఁడిగ రక్షింపుము పూఁ
     బోఁడిని వేఱొక్క యెగ్గు పుట్టకయుండన్.148
వ. అనిన విని యత్తన్వి చిత్తంబున నూఱడి మగుడం జనియె
     నతండునుం గుసుమబాణతూణీరాయమానమనసుం డగు
     చు నిలుపోపక యవంతిసుందరిం జూచినకందువలకుం
     బుష్పోద్భవానుగతుం డై యరిగి తత్ప్రదేశంబున.149
క. ఇచ్చటఁగాఁ జనుదెంచితి
     మిచ్చో టచ్చెలుప యున్న యెడ మనలం దా
     నిచ్చమెయి బాలచంద్రిక
     యిచ్చోఁ దగవుమెయిఁ బిలిచె నింతిం జేరన్.150
ఉ. ఎప్పుడు చింత వాయునొకొ యిందునిభాననయాననేందు విం
     కెప్పుడు నాదుచూడ్కులకు నింపొదవింపుచుఁ దోఁచునొక్కొ నా
     కెప్పుడు కోర్కు లెల్ల కఱ వేదఁగ జన్మఫలంబు నొందఁగాఁ
     జొప్పడునొక్కొ యంచు నృపసూన్యుడు నెచ్చెలిమీఁద వ్రాలుచున్.151
సీ. లోలాక్షి తన్ను నాలోకించు నెఱుకువ
                    భావించి నెమ్మది బమ్మరించుఁ
     బడఁతుక పొందు చొప్పడుటకు నెమ్మెయి
                    వెరవు గానక యెద విహ్వలించు
     నింతికి నింతకుఁ గంతుబాణంబుల
                    నెగ్గు పుట్టునొ యంచు బెగ్గలించు
     దనమ్రోల రాజనందనలీల నున్న యా
                    చందంబు దోఁచిన సంభ్రమించు

ఆ. నళులమ్రోఁత కళుకుఁ జిలుకలపలుకుల
     కులుకుఁ బికనినాదములకుఁ గలఁగు
     మలయమారుతంబు పొలయుట కలయు నె
     వ్వగలఁ బొగులు రాజవాహనుండు.152
వ. ఇట్లు నానాప్రకారంబులగు మారవికారంబులఁ జిత్తం బత్త
     లంపడ నమ్మహీవరుండును వయస్యుండును దానును బరి
     భ్రమించుచున్న సమయంబున.153
ఆ. సోమదత్తుఁ డొక్కభామినియును దాను
     నందలంబు లెక్కి యాప్తభృత్యు
     లోలిఁ గొలువ వచ్చి యుద్యానతలమున
     నిలిచి కలయఁ జూచి నృపతిఁ గాంచి.154
ఉ. మోము వికాసముం బొరయ మోదమున న్మది పల్లవింపఁగా
     సోమకళావతంసుఁడు విశుద్ధయశోనిధి రాజవాహన
     స్వామి యితండు భాగ్యమున వచ్చితి నీతనియున్నచోటికిం
     గామితదాయి యయ్యె విధి గన్నులపండువు సేయఁ గాంచితిన్.155
వ. అనుచు సంభ్రమంబున నందలంబు డిగ్గి యద్దెసకుం జనిన
     వారలుం ద న్నవలోకించి హర్షోత్కర్షంబున నెదుర్కొన.156
క. సరభసపదవిన్యాస
     స్ఫురణుం డై యరిగి యతఁడు భూపతిపాదాం
     బురుహములు మౌళి సోఁకఁగ
     ధరణీస్థలిఁ జాఁగి మ్రొక్కెఁ దద్దయు భక్తిన్.157

ఉ. మ్రొక్కినఁ గౌతుకంబును బ్రమోదము డెందమునం బెనంగొనన్
     గ్రక్కున నెత్తి చూడ్కులు మొగంబుపయిం బొలయంగ భూవిభుం
     డక్కునఁ జేర్చె నప్పుడు తదంగములం బులకంబు లెంతయున్
     మిక్కుటమయ్యెఁ బెల్లడరె నేత్రములం బ్రమదాశ్రుపూరముల్.158
వ. తదనంతరంబ పతి యతనికిం బుష్పోద్భవుం జూపిన నయ్యిరు
     వురు.159
క. విరహభరదుఃఖితాంతః
     కరణంబులు ప్రీతిఁ బొందఁగా రభసమునం
     బరిరంభణంబు సేసిరి
     నరనాథుఁడు సోమదత్తునకు ని ట్లనియెన్.160
క. ఇందాఁక నేమిగతి నీ
     వెందుల వర్తించి యిప్పు డెం దరిగెద వీ
     సుందరి యెవ్వతె ప్రియజను
     లిందఱ నెబ్భంగిఁ గూర్చి తింతయుఁ జెపుమా!161
వ. అని మిత్రసందర్శనకథాంతరితచింతాతిశయం బగు చిత్తం
     బునఁ దదీయవృత్తాంతశ్రవణకుతూహలి యగుచు నొక్క
     చూతపోతంబుక్రేవ సికతాతలంబున సుఖోపవిష్టుం డై
     యున్న యన్నరేంద్రబృందారకునకు నాత్మీయప్రచార
     ప్రకారంబు సవిస్తరంబుగాఁ జెప్పం దలంచి ముకుళితకర
     కమలుండగు సోమదత్తుం డి ట్లనియె.162
ఉ. పండితపుండరీకనవపంకజబాంధవ! నీతిసంపదా
     ఖండలపూజ్య! కిల్బిషవికారమదస్మయదూర! పుష్పకో

     దండతనుప్రభాచరవిధానవిశారదభవ్యరూప! మా
     ర్తాండసమానతేజ! సతతప్రియభాషణ! సత్యభూషణా!163
క. వేదోదితకర్మవ్రత!
     భూదేవకులాగ్రగణ్య! బుధబంధుజనా
     హ్లాదనతత్పర! సుగుణా
     మోదభరితవిభవమదనమూర్తిముకుందా!164
మాలిని. అలఘుమహితధామా! యాగవిద్యాభిరామా!
     చలనరహితచిత్తా! సజ్జనాయత్తవృత్తా!
     సలిలనిధిగభీరా! శ్లాఘనీయప్రచారా!
     కులజలరుహమిత్రా! కొమ్మనామాత్యపుత్రా!165
గద్యము. ఇది సకలసుకవిజనప్రసాదవిభవ విలసదభినవదండి
     నామధేయనిఖ్యాత కేతనార్యప్రణీతం బైన దశకుమార
     చరితం బను మహాకావ్యంబునందుఁ దృతీయాశ్వాసము.

  1. పల్లవిత
  2. జేరఁ
  3. నిందు
  4. నిర్భిన్న
  5. వసించి
  6. లగుఫలభూ
  7. గొండలుపిండిగా
  8. వఱపున
  9. బండి కలవడ్డ
  10. నాదెస
  11. మదీయ
  12. లు పొందు
  13. ప్రోపు
  14. స్మరణ
  15. లంగని
  16. నీరంబుం జిలికినట్ల