Jump to content

దశకుమారచరిత్రము/చతుర్థాశ్వాసము

వికీసోర్స్ నుండి

చతుర్థాశ్వాసము

     శ్రీ సంయుక్తకటాక్షా!
     భాసురనయశిక్ష! బంధుపాలనదక్షా!
     వాసితబుధసాంగత్యా!
     ధీసంపత్సారనిత్య! తిక్కమాత్యా!1
తే. దేవ! భవదీయచరణసంసేవ గోరి
     చెలుల కెడఁబాసి నిన్ను నీక్షితితలమున
     వెదకి క్రమ్మఱుచో నొక్క విపినభూమి
     నదితటంబున నొక్కరత్నంబు గంటి.2
క. కని పుచ్చి ముడిచికొని యట
     చనిచని యొక్కయెడ దేవసదనములో వి
     ప్రుని నొకదీనానను బహు
     తనయుం గని నామనంబు దయ పుట్టంగన్.3
వ. అతని యోగక్షేమం బడిగినం గార్పణ్యవివర్ణంబైన యాన
     నంబునం దాసపాటు దోఁప నవ్విప్రుం డి ట్లనియె.4
క. దీనత చొప్పడ మాతృవి
     హీనతఁ గడుఁ గందియున్న యీతనయులకుం
     బూని యనేకవిధంబుల
     నా నేర్చినభంగి రక్షణం బొనరింతున్.5
క. కూటికి నక్కఱపడి యీ
     లాటేశ్వరు వీటిలోపలం గలయఁగ భి

     క్షాటన మొనర్తు నని య
     చ్చోట విడిసియున్న వీడుఁ జూపుటయు వడిన్.6
వ. ఈలాటపతినామం బెయ్యది యతం డిందు వచ్చుటకుం
     గారణం బేమి యని యడిగిన నతం డి ట్లనియె నితండు
     మత్తకాళాభిధానుండు నిషధవిభుండైన వీరకేతుకూఁతురు
     వామనయను కామినీరత్నంబురూపాతిశయంబు విని తనకు
     నమ్ముద్దియ నడుగం దగువారలం బుత్తెంచి కోర్కి సఫలంబు
     గామికిఁ గోపించి.7
క. పై నెత్తి వచ్చి విడిసిన
     నానరపతి యెదురుగా భయంబునఁ దనయం
     గానిక యిచ్చిన లాట
     క్ష్మానాథుఁడు ప్రమదభరితమానసుఁ డయ్యున్.8
ఆ. మరల విడిసె నచట మసలినవాఁ డయ్య
     రణ్యతలమునందు రమణితోడ
     వేఁటలాడుటకును; విపినభూభాగసం
     చరణరతులు గారె ధరణిపతులు.8
వ. సబహుమానంబుగా నతనిఁ గన్యారక్షణంబునందు నియమిం
     చి వేర విడియించినం జతురంగబలసమేతుం డై యతండును
     దనచిత్రానువర్తనంబులఁ బ్రవరిల్లుచునుండు మానధనుం
     డైన యామానపాలుండు నిజమానవాధీశ్వరు నభిమాన
     ధనంబులు గోలుపోకకు మనంబున ఖేదంబంది యంతర్భేధం
     బులు వెదకుచు నుండు ననుమాటయుం దదీయజనంబుల
     వలన విని యుండుదు నని చెప్పి మఱియు నాత్మీయదురవ
     స్థాసూచకంబులగు వాక్యంబుల సంభాషణంబు సేసిన.10

క. పలువురు కొడుకులు విప్రుఁడుఁ
     బలుపాటులు వడుట తేటపడ విని కరుణం
     దలకొని తనచిత్తమునకు
     నెలమిగ నాచేతిరత్న మిచ్చితిఁ బ్రీతిన్.11
ఉ. ఇచ్చిన నాకు దీవన లనేకవిధంబుల నిచ్చి విప్రుఁడుం
     జెచ్చెర నేఁగె నేఁగి యిరుచేతులు త్రాడులఁ గట్టి తేరఁగా
     వచ్చి శరీరవేదన నవారితబాష్పజలంబు లొల్కఁగా
     మ్రుచ్చును నచ్చు వీఁడె యని మోఁదుల కోపక నన్నుఁ జూపినన్.12
వ. ఆవిప్రుని దెచ్చి వారలు నన్నుం బట్టికొని యి ట్లనిరి.13
క. మ్రుచ్చిలి రాజుల ధనములు
     దెచ్చి పరమసాధువోలె దేవరగుడిలోఁ
     జొచ్చినఁ బోవునె పెఱధన
     మెచ్చో డాఁచితి సహాయు లెవ్వరు నీకున్.14
చ. అనిన భయంబునం బొరయ కమ్మణి వాహినితీరభూమి నేఁ
     గనుటయు విప్రుఁ జేర్చిన ప్రకారముఁ జెప్పితి నెన్ని చెప్పినం
     గనుకని యెగ్గులాడుచు నకారణబాధ లొనర్చి నన్ను మ్రు
     చ్చని వెసఁ గట్టి బంధనగృహంబునకుం గొనిపోయి యయ్యెడన్.15
వ. అటమున్న సంకలియ నున్నవారిం గొందఱ నాకుఁ జూపి
     నీతోడియయ్యలు వీరె వీరలు నీవును మంచిమగల రై
     యుండుం డని శృంఖలానియమితచరణుం జేసి పోయిన
     యనంతరంబ.16

క. తలవరి పలికినపలుకులు
     కలరూ పెట్టిదని యెఱుఁగఁగా నేరక వా
     రలవలనఁ దెలియుతలఁపున
     దలపోఁతకుఁ జొచ్చి యేను దగ ని ట్లంటిన్.17
క. మీ రెవ్వ రిట్టిదుస్తర
     కారాగృహవాసమునకుఁ గత మెయ్యది యి
     య్యారెకులు నాకు మిము నా
     వా రని చూపు టిది యేమి వలయుం దెలియన్.18
వ. అనిన విని చోరవీరు లాలాటపతివృత్తంబు విప్రువలన
     నామున్ను (విన్న)విధంబునఁ జెప్పి తా రక్కన్యారక్షణంబు
     సేయవచ్చిన మానపాలుభృత్యు లగుటయు నతనిపంపున
     లాటేశ్వరవధార్థంబు తద్గృహంబు కన్నం బిడుటయు
     (వేఁటకరిఁగి?) యతండు దప్పుటయు నతం డమ్మందిరమ్మున లేమి
     యుం దలంపు దప్పి మరలునప్పు డయ్యింటిలోనం గల ధనం
     బెల్ల దేవికొని వచ్చుటయు నాచొప్పు దప్పించుటకుం దమ
     వీడు చొరక విసినంబుల కరుగుటయు వేఁకువయైన నాఁటి
     పగలు గడుపుటకు నొక్కయెడ నిలుచుటయుఁ జొప్పునం
     బెక్కండ్రు వచ్చినం గని సరకు లెత్తికొని వాఁగుల వంకలఁ
     బాఱిపాఱి పట్టుపడుటయు వీటికిం దెచ్చిన సమస్తవస్తువులు
     శోధించి యొక్క యనర్హ్యరత్నంబు లేదని పలుదెఱంగు
     లం దమ్ము బాధించి కానక సంకలియలం బెట్టుటయు నెఱిం
     గించి యిది మాతెఱుంగు మమ్ము నారెకులు నీవా రనునది
     మాకుం దెలియ దని పల్కిన నేనును మణిఁ గన్నకందువ
     తేటపడం బలికి వార లియ్యకొన్న నదియె యిదియని నిశ్చ

     యించి తలవరు లట్లనం దగుట తెలిసి యమ్మాణిక్యంబు
     పాఱున కిచ్చి పడినపాటును మదీయజన్మాభిధానంబులును
     భవదీయాన్వేషణార్థంబు పర్యటనప్రకారంబును సముచి
     తోక్తుల సూచించి తెలుపుకొని చెలిమి చేసి యాదివసంబు
     గడపి నిశాసమయంబున.19
తే. సాంద్రతిమిరంబు చూచి యశంక వారి
     చరణబంధనకీలముల్ వెరవు లావు
     వెలయఁ దునిమి మదీయశృంఖలయు [1]విడిచి
     యేను వారును వాకిటి కేఁగి యచట.20
క. రక్షకులు నిద్రవోవుట
     వీక్షించి తదాయుధములు వెసఁ గైకొని యే
     మాక్షణమున వెలువడి పుర
     రక్షకతతిఁ గాంచి పటుపరాక్రమలీలన్.21
చ. కనుకని తూలఁ దోలి బలగర్వమునం దలపడ్డవారలన్
     దునియలు సేసి యొండొరుల దోర్బలసంపద చెప్పికొంచు బో
     రనఁ గటకంబు వెల్వడి నృపాత్మజువేలము చొచ్చి మంత్రినం
     దనుఁడగు మానపాలు నుచితంబుగఁ గాంచి యనాకులస్థితిన్.22
వ. మా తెఱం గెల్ల నెఱింగించుచున్నయెడ నతండు నా కులం
     బునుం బేరునుం బూర్వవృత్తాంతంబును నప్పటిబలపరా
     క్రమంబులును నిజభృత్యులవలన విని సన్మానపూర్వకంబుగా
     నన్నుం గైకొనియె మఱునాఁడు మత్తకాళుండు స్వజనంబులం
     బుత్తెంచినం గొందఱు వచ్చి మానపాలుం గని యి ట్లనిరి.23

క. మీవీటిమ్రుచ్చు లేవురు
     మావీటం గన్న పెట్టి మణిభూషణముల్
     గోవతనంబునఁ దెచ్చిరి
     నీ విటు సేయించు టెల్ల నేరము కాదే.24
క. అని యిబ్భంగిఁ బలుక నతఁ
     డనియె నిజం బెఱుఁగ కాడ నగునే మీకున్
     ధన మది మ్రుచ్చులు వీ రని
     కని పలుకుఁడు మిన్న కేల కాఱులు ప్రేలన్.25
క. అనిన విని వార లి ట్లని
     రనుమానము లేదు మ్రుచ్చు లందఱు నిట వ
     చ్చిన నెఱిఁగి వచ్చితిమి నీ
     పెనుపులు లాటేశు నలుక పెనఁచిన మేలే.26
వ. అని ముట్టం బలికిన మానపాలుండు కోపించి.27
క. లాటపతి యెవ్వఁ డాతని
     పో టేటిది వాని తోడి పొం దేమిటికిం
     జీటికి మాటికి నీ క్రియ
     ద్రోటికిఁ బడనేల వెడలఁదోలుఁడు వీరిన్.28
మ. అని త్రోపించిన వారు త్రోపువడి రోషావేశ మేపార వే
     చని నిక్కంబును బొంకునుం బొరయ నస్తవ్యస్తము ల్సెప్పఁగా
     విని లాటేశుఁడు నీతి పోవిడిచి దోర్వీర్యంబు పాటించి కో
     పనుఁ డై కానక యల్పసైనికులతోఁ బై వచ్చె గర్వంబునన్.29
వ. ఇట్లు చనుదెంచి వీడు ముట్టిన నటమున్న కృతనిశ్చయుం
     డై పరివారంబునుం దానును సాహసంబు వాటించి యుని

     కింజేసి కలంగక మానపాలుండు మానంబు వాటించి నిజ
     నామంబు సార్థంబుగా లాటపతిం దలపడి సమరంబు సేయు
     సమయంబున నంతకుమున్న సబహుమానంబుగా నాకుఁ
     జటులఘోటకంబులఁ బూన్చిన తేరును వెరపరియగు సార
     థియును దృఢంబగు కవచంబును ననురూపంబగు చాపం
     బును వివిధబాణంబులుం గల తూణీరంబును రథికజనోచి
     తంబులగు తక్కినయాయుధంబులు నొసంగి యమ్మంత్రి తన
     తీరమి నావలనం దీర్చికొందు నను విశ్వాసంబు దేటపఱుచు
     మాటలాడుటంజేసి తెంపు సేసి యేనును.30
ఉ. ఏపునఁ బోరుసేనలకు నెల్లను మీఱి సముల్లసద్భుజా
     టోపముమై నరాతులఁ బటుప్రదరంబులఁ దూలఁ దోలి యా
     భూపతి యగ్గమైన రథమున్ రథమున్ గదియించి లంఘన
     ప్రాపితతద్రథుండ నయి పట్టి వెసం దెగఁజూచి యార్చితిన్.31
క. దొర పడుటయు విరిగిన మో
     హరముం దోలికొనిపోయి హయగజవివిధా
     భరణాదివస్తునికరా
     హరణం బొనరించి మంత్రి యత్యున్నతుఁ డై.32
వ. లాటేశ్వరు పరివారంబు నెల్లం జంపియుఁ గాచియుఁ గాని
     పించికొనియు మఱియు నెద్దాని కేది యుచితం బగు నవ్విధం
     బున సమరవిజయపారపారంగతుం డగుచు సమస్తకరణీయం
     బులు నాచరించి యొడ్డోలగంబున ననేకప్రకారంబుల
     నన్ను సంభావించి.33
ఉ. ఇత్తెఱఁ గంతయుం బతికి నేర్పడ నప్పుడే చెప్పిపుచ్చె భూ
     పోత్తముఁడున్ రయంబున మహోత్సవ మేర్పడ నేఁగుదెంచి నా

     వృత్త మమాత్యుచేత విని విస్మయమంది కులంబు శీలమున్
     జిత్త మెలర్పఁగా నతఁడు చెప్ప నెఱింగి మనోముదంబునన్.34
ఆ. మంత్రిబాంధవానుమతి శుభ దినమునఁ
     బుణ్యవేళ నతివిభూతి వెలయఁ
     దనతనూజ నాకుఁ దగఁ బెండ్లి చేసి భూ
     జనులు వినుతి సేయ మనుజవిభుఁడు.35
వ. ఏనునుం బ్రతిదినం బతనిచిత్తం బారాధించి యువరాజ్యాభి
     షిక్తుండ నై వివిధసుఖంబు లనుభవించుచుండి భవద్విరహ
     వేదనాశల్యహృదయుండ నై వర్తిల్లుచు నొక్కసిద్ధముని
     యాదేశంబున నభిమతజనావలోకనఫలంబగు పూజావిశే
     షంబున మహాకాళనివాసుండగు పరమేశ్వరు నారాధించు
     టకు నేఁడు పత్నీసహితం బిటు వచ్చి భక్తవత్సలుండగు
     నద్దేవుని కారుణ్యంబున భవదీయపాదారవిందసందర్శనానం
     దంబు వడసి కృతార్థుండ నైతి ననిన విని రాజవాహనుండు
     మోదమానమానసుం డై నిరపరాధచండంబునకు విధి
     నిందించి వయస్యుపరాక్రమం బభినందించి యాతనికి నాత్మ
     వృత్తాంతంబును బుష్పోద్భవుచరితంబునుం గ్రమంబునఁ
     జెప్పె నయ్యవసరంబున.36
క. ధరణీసురుఁ డొక్కరుఁడు చ
     తురవేషోపేతుఁ డచటఁ దోతెంచి మహీ
     వరు నాశీర్వాదపుర
     స్సరముగఁ గాంచుటయు నధికసంప్రీతిమెయిన్37

క. కేవలుఁడు గాఁడు వీఁ డని
     భావించి నృపాలసుతుఁడు బ్రాహ్మణుఁ దగ సం
     భావించి యాదరంబున
     నీ వెవ్వఁడ వేమి విద్యనిపుణుఁడ వనినన్.38
క. హృద్యమగు నింద్రజాలపు
     విద్యలమెయిఁ బరిణతుండ విను దేశములం
     దుద్యత్ప్రీతిం దిరుగుదు
     విద్యేశ్వరనామధేయవిఖ్యాతుండన్.39
క. అని చెప్పి రాజవాహన
     జననాయకుఁ జూచి యతని చతురాకృతి యి
     ట్లనయము వెలవెలఁ బాఱుచు
     నునికికిఁ గతమేమిఁ యనిన నుల్లం బలరన్.40
వ. పుష్పోద్భవుం డీవిప్రు నింద్రజాలంబుచాతుర్యంబు గాయ
     కంబు గానోపు నని యూహించి యున్నరూపు చెప్పం
     దలంచి.41
ఆ. సజ్జనులకు నెల్ల సఖ్య మాభాషణ
     పూర్వ మగుట నీ వపూర్వసఖుఁడ
     వకుటిలాత్మకుండవైన వయస్యుని
     కెఱుఁగఁ జెప్పరాని దేమి గలదు.42
మ. విను మీమాళవనాథుకూఁతునకు నువ్విళ్ళూరు నీరాజనం
     దనుఁ డాలేమకు నిక్కుమారవరుమీఁదం జిత్త మత్యంతరా
     గనిరూఢం బటులుండియున్ సరసభోగప్రాప్తి కెమ్మైఁ దలం
     చిన లేకున్నది నేర్పు దాన నితఁ డీచేడ్పాటునం దూలెడున్.43

వ. అనిన విద్యేశ్వరుండు లజ్జాభిరామం బగు రాజవాహను
     మొగంబు గనుంగొని చిఱునవ్వు నవ్వుచు నాయట్టియను
     చరుండునుం గలుగ నీకుం జేకుఱని కార్యంబునుం గలదె
     యని యతని కిట్లనియె.44
ఆ. మాళవేంద్రు నింద్రజాలంబువిద్యల
     యందు మోసపుచ్చి యతనితనయ
     నూ రెఱుంగ నీకు నుద్వాహ మొనరించి
     యంతిపురములోని కనుచువాఁడ.45
క. ఆటుమీఁద బుద్ధి నీయది
     యిటు సేయుకు రాజపుత్రి కెఱిఁగింపఁగ మున్
     బటువగు చెలిఁ బుచ్చుము సం
     కట మొక్కించుకయు లేదు కార్యస్థితికిన్.46
వ. అని యనిమిత్తమిత్రుండైన యవ్వప్రుం డకృత్రిమస్నేహం
     బునఁ గృత్రిమక్రియాపాటనంబు ప్రకటించినఁ బరమానం
    దంబు నొంది గాఢాలింగనతాంబూలదానాద్యుపచారం
     బులం గలపికొని సోమదత్తుం జూచి భవత్ప్రియయును బరి
     వారంబును మహాకాళేశ్వరారాధనపూర్వకంబుగా నీవీటికిం
     బోవునట్లు నియమింపు మని పంచిన నతం డట్లు చేసి
     యరుగుదెంచిన యనంతరంబ రాజవాహనుండు గమిగట్టి
     పోవ నొల్లక పుష్పోద్భపసోమదత్తుల ముందటఁ బుచ్చి
     ముందటం బురంబున భూసురమిషంబునం దనవర్తిల్లుట
     విద్యేశ్వరునకుం జతురతగా నెఱింగించుచు నతండునుం
     దానును నల్లన నిజనివాసంబునకుం జని బాలచంద్రికం బిలిచి
     యిత్తెజం గెల్ల నెఱింగించిన నత్తెఱవయు నవంతిసుందరి

     కంతయుం జెప్ప నయ్యింతియుం జింత దక్కి సంతసిల్లి
     తానును నదియునుం దత్కార్యానురూపం బగు చాతు
     ర్యంబు మనంబున నలవరించుకొనుచుండిరి. మఱునాఁడు
     రేపకడ నవ్విద్యేశ్వరుండు వేషాంతరపరిగ్రహగుప్తరాజ
     వాహనానుగతుం డై రాజగృహంబునకుం జని యే నైంద్ర
     జాలికుండఁ జనుదెంచినవాఁడ నని యెఱింగించి పుచ్చిన
     మాళవేశ్వరుండును దద్దర్శనకౌతూహలంబున నవరోధజన
     పరివారితుం డై పిలువంబంచినం జని తత్సభామధ్యంబున
     ముకుళితనయనుం డై యొక్కింతప్రొద్దు నిలిచి.47
క. చట్టలు చఱచుచుఁ బలుమఱు
     జిట్టలు మడుచుచు దివంబు చేతుల విరియం
     దట్టుచుఁ గాటుకకన్నులు
     జుట్టిన ప్రజ నెల్ల నతఁడు సూచెం గలయన్.48
క. క్రాలుచు నలు[2]వంకలు ని
     ట్లాలోచించుటయుఁ దత్సభాంతమున విష
     జ్వాలలు గ్రక్కుచు రోఁజుచు
     నోలిని దోతెంచే బాము లుద్గ్రీవము లై.49
క. ఆపాములపై గ్రద్దలు
     కోపముతో వచ్చి యెత్తికొని దివిఁ బఱచెన్
     భూపతియు నువిదతండము
     చూపరు లాశ్చర్య మొంది చూచుచు నుండన్.50
ఉ. ఓలిని రామరావణుల యుద్ధము నానరసింహమూర్తియున్
     వాలిన దానవేశ్వరుని వ్రచ్చినభంగియు భారతాజియున్

     బోలఁగఁ జూపి యాట తెగిపోవుతఱిన్ శుభసూచకంబుగాఁ
     జాలు తెఱంగుఁజూపుట ప్రశస్తము గావున నానెపంబునన్.51
శా. దేవా! దేవరకూర్మినందన కృతార్థీభూతగా వల్లభున్
     భూవర్యున్ వరియించునట్లుగ శుభంబుల్ వృద్ధిపొందంగ నే
     నావిద్యన్ వరు నర్హులైన జనులన్ నానార్థిసంసారమున్
     గావింతుం దగఁ బెండ్లిఁ జూడు మనుడుం గౌతూహలా
     యత్తుఁ డై.52
క. పతి యియ్యకొనిన విప్రుం
     డతిశయమోదంబు నొంది యాత్మగతమునన్
     జతురోపాయము మార్గ
     స్థితిఁ పొందఁగఁ గార్యసిద్ధి సేకురు నింకన్.53
మ. అని శంకింపక మాళవేంద్రసుతకళ్యాణార్థమై తత్సభా
     జను లెల్లం బ్రియ మంది చూడఁగ జనశ్లాఘ్యాంజనం బిమ్ముగాఁ
     దన కన్నుంగవఁ గూర్చి యార్చుటయు సాంద్రంబై వివాహోత్సవం
     బునకుం గూడినమాడ్కిఁ దోఁచెఁ బ్రజ సద్భాషానువేషంబుతోన్.54
వ. తత్సమయంబున.55
క. కృతసంకేతుండగు నృప
     సుతుఁడు నిగూఢంబుగాఁగ శోభనసమయో
     చితముగఁ గైసేసి రమా
     సుతుకైవడి నాయవంతిసుందరి డాసెన్.56
సీ. రాగపల్లవిత మై రాజనందను చూపు
                    తీఁగె లతాంగిమైతీఁగెఁ బెసఁగ

     లజ్జావిభూత మై లలనచూడ్కి మెఱుంగు
                    పతిమూర్తి మేఘసంగతిఁ జరింపఁ
     గౌతుకావహలీఢకాంతు చిత్తము నాతి
                    డెంద మత్తఱి నున్న చంద మరయ
     సంక్షోభకలిత మై సతి నెమ్మనము పతి
                    హృదయవికాసంబు నెఱుఁగ కుండ
తే. లోలతాలోలమానవిలోచనులును
     మన్మథాధీనపరతంత్రమానసులును
     నగుచు నేకాసనానీను లైరి తన వ
     ధూవరులు సౌఖ్యరసముల దోయివోలె.57
వ. విద్యేశ్వరుండును.58
క. భావారాధితహరి యై
     వైవాహికమంత్రతంత్ర వైదగ్ధ్యమునన్
     భూవరునకు నమ్మగువను
     దేవిని గావించె నగ్నిదేవునిసాక్షిన్.59
వ. తదనంతరంబ.60
క. మీ రరుగుఁడు మీ రేగుఁడు
     మీరు చనుఁడు మీరు పొండు మీమీపను లొ
     ప్పారఁగఁ జలుపుఁడు నావుడుఁ
     బోరన నయ్యింద్రజాలపుంబ్రజ వోయెన్.61
క. భూపతియు నింద్రజాలపు
     రూపులతోఁ గలిసి మును నిరూపించిన గూ
     ఢోపాయమునం దగ క
     న్యాపురమున కేఁగె నామనం బలరంగన్.62

వ. మాళవేంద్రుండును నయ్యైంద్రజాలికునకుఁ బసదనం బొసంగి
     యాస్థానమండపంబు వాసి చనియె నవంతిసుందరియు
     నాప్తసఖీసమేతంబుగా భూపాలుం డున్నకందున కరిగె
     నివ్విధంబున దైవమానుషంబులు సంయుతంబులుగాఁ గా
     ర్యసిద్ధి పొంది రాజవాహనుండు సరసమధురంబులగు చతు
     రచేష్టలం జేసి మెత్తన యత్తన్విసిగ్గునగ్గలిక వారించుటయు.63
సీ. విభుమూర్తి యేమియు వెలివోవఁగా నీక
                    తనకన్నుఁగవఁ ద్రావికొనఁగ నిచ్చు
     రమణు లీలాలాపరసము విచ్చలవిడి
                    వీనులఁ ధనియంగ నాన నిచ్చు
     భూవల్లభుని మేనిపొందు లింపెసలార
                    సొగయ మైతీఁగెకుఁ జూఱ యిచ్చు
     బ్రాణేశపికమును బడయ నానందభ
                    రావేశ మర్థిఁ గేమ్మోవి కిచ్చుఁ
ఆ. జొక్కి సతిమనంబు సొచ్చు నుల్లంబున
     నొదవు[3]కప్పు తనకు నొజ్జ గాఁగ
     మదనతంత్రములు క్రమక్రమంబునఁ దగ
     నభ్యసించు బాలహరిణనయన.64
వ. ఇట్లు మరగియున్న యవంతిసుందరియును రాజనందనుం
     డును జతురసఖీవిరచితకరణీయు లగుచు నభిమతసుఖంబు
     లనుభవింపుచున్నంత నొక్కనాఁడు.65
క. సురతసుఖవ్యతికరమునఁ
     బరవశు లై నిద్రవోయి పశ్చిమయామాం

     తరమున బిసగుణనిగళిత
     చరణము నొకహంసఁ గనిరి జంపతులు కలన్.66
వ. అంత నిద్రావసానం బగుటయు.67
ఉ. రాజతశృంఖలం బెనఁగి రాజపదద్వితయంబు తారకా
     రాజకరావృతం అయిన రక్తసరోజయుగంబువోలె ని
     స్తేజము నొందియఃన్నఁ గని చేడ్పడి తా నెలుఁ గెత్తి యేడ్చెఁ గాం
     తాజనరాజి బెగ్గడిలఁ దామరసాక్షి విపాదవేదనన్.68
క. పరు లెఱిఁగిన నాఱడికిం
     గరి యగు నను తలఁపు లేక గతధృతి సననీ
     శ్వరసుత విరివేనలితోఁ
     బురపురఁ బడి యేడ్చుచుండె భూభాగమునన్.69
క. అంతిపురము జను లెఱిఁగి య
     నంతభయభ్రాంతిఁ బొంది యప్పుడె తద్వృ
     త్తాంతంబు చండవర్మున
     కంతయు నెఱిఁగించి రాగ్రహంబున నతఁడున్.70
క. విని కినిసి యుదిరిపడి చ
     య్యన నంతఃపురముఁ జొచ్చి యతికోపనుఁ డై
     కనుఁగవ నిప్పులు రాలఁగ
     వనితాపరివృతుని రాజవాహనుఁ బలికెన్.71
క. నాతమ్మునిఁ జంపిన[4]యఱ
     జాతికి వీఱిఁడికి బాలచంద్రికకు మగం
     డై తిరిగెడు పుష్పోద్భవుఁ
     డీతనికిం బ్రాణబంధుఁ డెల్ల నెఱుఁగుదున్.72

క. రూపున వివేకమున వి
     ద్యాపరిణతి కీతఁ డధికుఁ డన నతిమిథ్యా
     రోపితమహానుభావుం
     డై పురమున వీఁడు భూసురాకృతిఁ దిరుగున్.73
ఉ. ఈకుటిలాత్మునిం గవిసె నింత వివేకము లేక మాదృశా
     నేకనరేంద్రనందనుల నెవ్వరి మెచ్చక దాని కేమి దో
     షాకరుఁ డైన వీని నిశితాయుధశూలమునం దవిల్చెదం
     జేకొని చూచుఁగాక ప్రియుఁ జిత్తము దృష్టియు నూఱడిల్లఁగన్.74
వ. అని యధిక్షేపించి.75
క. కరి ఘనతరతుండంబున
     నరుణసరోజంబు వట్టి యతిష్ఠురతన్
     దెరలఁగఁ దిగిచినపరుసున
     నరపతి చేసేతఁ బెనఁచి నయమరి తిగిచెన్.76
వ. అయ్యవసరంబున.77
ఉ. ధీరగరిష్ఠు డైన జగతీపతి దైవము సేయు దుర్దశల్
     సైరణఁ గాని తీఱ వని శౌర్యము దక్కి యవంతిసుందరిం
     జేరఁగఁ బిల్చి యి ట్లనియెఁ జిత్తవిషాదము మానినిల్వుమీ
     నీరజనేత్ర! హంసకథ నిచ్చలు నెమ్మదిలోఁ దలంపుచున్.78
క. అనుటయు నతండు కోపము
     తనమని రెట్టింపఁగా నదయుఁ డై వీనిం
     దునుమవలయు నగరు వెడలం
     గొనిరండని యాత్మసేవకుల నియమించెన్.79

వ. అయ్యవసరంబున.80
తే.విభుఁడు దేవియు నవ్వార్త విని తలంకి
     యతిరయంబునఁ జను దెంచి యల్లుఁ జూచి
     యతనిఁ జంపిన దారును నాక్షణంబ
     చత్తు మని కాచి కాత్మల సంతసిల్లి.81
సీ. కాచిన వారలఁ గడచి చంపుట పతి
                    హితము గా దని తనమదిఁ దలంచి
     యారాజనందను దారుపంజరమున
                    నునిచి పుష్పోద్భవు ధనము లెల్లఁ
     గొని వాని నలిపెట్టి కొఱగాము లెన్నియొ
                    నెన్ని పత్రికల వ్రాయించి దర్ప
     సారుపాలికి నొక్క జంఘాలుఁ బంచి వాఁ
                    డీసింహశర్మమహీశుకూఁతుఁ
తే. దనకు నడుగుటయును సముదగ్రవృత్తిఁ
     ద్రోపు సేసిన విక్రమాటోప మొప్ప
     నతని సాధింప సమకట్టి యాగ్రహంబు
     మిక్కుటముగఁ జంపాపురిమీఁద నడిచె.82
వ. ఇట్లు నడుచుచుండి యొరుల నమ్మక దారుపంజరగతుం డై
     కిశోరకేసరి ననుకరించు రాజవాహనకుమారుఁ దోడన కొని
     పోయి కతిపయప్రయాణంబుల నంగపురము డాయం జని
     చుట్టుముట్టి విడిసి యనుదినంబు కయ్యంబు సేయుచునుండె
     సింహవర్మయు సుహృన్మహీపతుల కెఱింగించి పంచిన వారు
     చంపాపురంబునకు సన్నాహంబు మెఱసి వచ్చుటం దడవు
     లేకున్నను దాలిమిమాలి కోట తలుపులు తెఱపించి.83

శా. చంపాపట్టణ మేడ్తెఱన్ వెడలి యుత్సాహోగ్రుఁడై శాత్రవుల్
     కంపింపంగ గజంబు నెక్కి యవలీలం బోరిలో గిట్టి సా
     ధింపం జాలుదు నేన వాని నని యుద్రేకించి శుంభచ్చమూ
     సంపద్వైభవ మొల్ల కేఁగె దనయజ్ఞానంబు చేదోడుగన్.84
వ. ఇవ్విధంబున నక్షమాపరిణతుం డై నడచి నగరోపకంఠం
     బునం దలపడి యతిఘోరయుద్ధంబు సేయం జొచ్చిన.85
ఆ. అపుడు చండవర్ముఁ డలిగి యంగాధీశు
     సేన పాఱిన మఱి సింధురంబు
     మీఁదనుండి యతనిమీఁదికి లంఘించి
     పట్టికొనియెఁ జలము బలము మెఱయ.86
ఆ. పట్టి యతనికూర్మిపట్టి నంబాలిక
     నర్థిఁ బెండ్లియాడ నతఁడు దలంచి
     యునికి జేసి చంప నొల్లక బలుచెఱ
     నునిచి సంతసమున నుండి యంత.87
వ. దర్పసారుకడ[5]కుఁ దనవుచ్చిన యెణజెంముం డన జంఘా
     లుండు పఱతెంచి యాజ్ఞాపత్రిక యిచ్చినఁ బుచ్చికొని
     చండవర్ముండు విచ్చి చూచె నందలిపదబంధం బెట్టి
     దనిన.88
సీ. స్వస్తి సమస్తరాజన్యచూడామణి
                    కిరణరంజితపదసరసిజాతుఁ
     డగు దర్పసారధరాధీశుఁ డానతి
                    చండవర్మున కిచ్చె సంతసమునఁ

     గన్యాపురముఁ జొచ్చి గాసి సేసిన దుష్టుఁ
                    జంపెడుచోట విచార మేల!
     దుశ్శీలయగు కూఁతుతోడి నెయ్యంబునఁ
                    దల్లిదండ్రులు మతి తప్పి యేమి
తే. పలికిరేనియు మదిలోన భయముగొనక
     దుష్టకన్యకఁ జెఱఁ బెట్టి ద్రోహియైన
     వాని లేఖ గన్నప్పుడె వధ మొనర్చి
     చెవులపండువ మాకర్థిఁ జేయవలయు.89
వ. ఇ ట్లున్న లేఖ తనలోనన చదివి నిజమనోరథంబు సఫలం
     జగుటకుఁ బ్రీతచేతస్కుం డై రాజవాహను నేనుంగుకాలి
     పీనుంగుం జేయఁ దలంచి చూడామణిప్రభావనిరంజనదపన
     మస్తకుం డై యున్న యన్నరేం ద్రుఁ దోడ్కొని రాఁ
     బనిచి చండపోతకం బను మాతంగపతిం దెప్పించి యంబా
     లికావివాహంబున కెన్నిన లగ్నం బాసన్నం బగుటయు
     నశుభప్రసంగంబు నని వివాహానంతరంబ చంపించువాఁడై
     యప్పటికి నుడిగి నగరద్వారంబుచేరువం గుమారు నునిచి
     యచ్చట నగ్గజంబు నిలుప నియమించి వివాహగేహంబున
     కరిగె నంత.90
క. దారుణతరశాపము నది
     సేరినఁ గీ లెడలి రజతశృంఖల కాంతా
     కారము గైకొని లబ్ధమ
     నోరథుఁ డగు రాజువాహనున కి ట్లనియెన్.91
గీ. నరనాథ! యేను సురమం
     జరి యను సురకాంత నాకసమున విమాన

     స్ఫురితగమనమున నొక్కెడ
     కరుగఁగఁ బ్రతికూలదైవయత్నముకలిమిన్.92
క. నావదనము కమలం బని
     తావికి నొకమత్తషట్పదము సుడిసిన నే
     నావేగంబున దానిం
     బోవఁగఁ జూపఃగఁ బ్రమాదమున నాచేతన్.93
తే. తగిలి హారంబు గ్రక్కునఁ దెగిన ముత్తి
     యములు రాలె నాచక్కటి హిమనగంబు
     పొంతఁ గమలాకరముతీరభూమి నియతిఁ
     దపము సేయు మృకండునందనునిమీఁద.94
వ. ఇట్లు దొరుఁగుటయు.95
క. చేయునది లేక యమ్ముని
     నాయకుదెస సంభ్రమంబునం గనుఁగొనఁగా
     నాయున్నదెసకు మార్కం
     డేయుఁడు చూచుటయుఁ దల్లడిల్లితి నతఁడున్.96
వ. అతికుపితచిత్తుం డై.97
క. చైతన్యశూన్యయగు నీ
     వీతెఱఁ గి ట్లాచరించి తీక్షణమున ని
     శ్చేతన వై తగ లోహపు
     జాతి భజింపు మని తీవ్రశాపం బిచ్చెన్.98
క. ఏనును శాపభయమున వి
     మానము డిగివచ్చి మొయి సమస్తము సోఁకం
     గా నెరఁగి యమ్మునీశ్వరు
     తో నల్లన యిట్టు లంటిఁ దొట్రులుపడుచున్.99

క. ఇచ్చట [6]నకామకృతమున
     వచ్చిన యపరాధమునకు వావిరి శాపం
     బిచ్చితి దీనికి నేఁ గడు
     నొచ్చితిఁ గరుణింపు లోకనుతసచ్చరితా!100
వ. అని ప్రార్థించిన నతం డి ట్లని యనుగ్రహించె రాజవాహ
     నుం డను రాజు పూర్వజనితంబైన శాపంబువలన రెండు నెల
     లు(ండు)వాఁడు గావున నీవును నింద్రియశక్తి సహితం
     బుగా వెండి సంకలియ వై యతనిచరణంబు లాశ్రయించి
     మాసద్వయానంతరంబున నిజాకారంబు పడయు మనినం
     బ్రసాదం బని యాక్షణంబ శాపంబున కనురూపంబు సేసి
     కొని తత్ప్రదేశంబున నున్నంత.101
సీ. వీరశేఖరుఁడను విద్యాధరుండు క్రీ
                    డార్థంబు చనుదెంచి యచట నన్ను
     గని ముదంబునఁ బుచ్చికొనిపోయెఁ బదపడి
                    యాతండు దర్పసారాభిధాను
     మహితతపోవీర్యమహనీయు మీబావఁ
                    జేరి యాతనితోడఁ జెలిమి సేసె
     నతఁడు నెయ్యంబు తియ్యంబునఁ జెలియలి
                    నిచ్చెద నన దాని కియ్యకొనియె
తే. వాఁడు నిష్ఫలమగు తనవాంఛపేర్మి
     నాసరోజాక్షిఁ గనుఁగొను నాసఁజేసి
     వచ్చి యుజ్జయినీపురిఁ జొచ్చి యన్యు
     లెఱుఁగకుండ నంతఃపుర మెల్ల నరసి.102

శా. ప్రాసాదోపరిరమ్యభాగమున సాంద్రంబైన చంద్రాతప
     శ్రీసౌధామలదీప్తులం జెనయఁగాఁ జిత్తోద్భవక్రీడన
     వ్యాసంగంబున డస్సి మీరు సుఖనిద్రాయత్తు లై యున్నచో
     రోసం బెక్కిన వీరశేఖరుఁడు నీరూపం బొగిం జూచుచున్.103
వ. డాయం జనుదెంచి భవదీయమహానుభావంబుచేతఁ బ్రతి
     హతుం డై యొం డెద్దియుం జేయఁజూలకుండి దైనదత్తో
     త్సాహుం డగుటం జేసి నిజఖడ్గముష్టిశిఖరంబున రజతశృంఖ
     లారూపంబున నున్న నన్నుఁ బుచ్చికొని భవచ్చరణయుగ
     ళంబునఁ గలితంబుఁ జేసి యతిత్వరితంబున నెక్కడికేనియుం
     బోయిన.104
క. అది యాదిగాఁగ నే నీ
     పదయుగళం బాశ్రయించి బ్రదికితి నిట యె
     య్యది సేయఁదగిన కార్యం
     బది సేసెద నన్నుఁ బనుపు మద్భుతచరితా!105
క. అన విని భూమీశుఁడు మన
     మున ఘనవిస్మయము మోదముం బెనఁగొనఁగా
     ననిమిషకామినితో ని
     ట్లనియెం బ్రియ [7]దెస దలంచి యాదరవృత్తిన్.106
క. నాకుం బ్రియ మొనరింపఁగ
     నీ కిష్టము గలిగెనేని నీరజనేత్రా!
     యీకథ యింతయుఁ జెప్పుము
     శోకాతుర యగు నవంతిసుందరితోడన్.107

క. అని యనిచిపుచ్చి దైవము
     తనపైఁ గృప సేసి యాపదలు తలఁగుటకున్
     జనపతి నెమ్మదిలోపల
     ననురాగముఁ బొందుచుండి యాసమయమునన్.108
వ. తత్ప్రదేశంబున.109
శా. అంగంబుల్ ప్రమదంబునం బొదలఁగా నౌత్సుక్యవృత్తిం దగన్
     శృంగారం బొనరించి సర్వజనసంసేవ్యోత్సవాగారవే
     దిం గన్యన్ వరియింప నున్నెడ బలోద్రేకంబుమైఁ జండవ
     ర్ము గూలం బొడిచెన్ భటుం డొకఁడు క్రూరుం డై కఠారంబునన్.110
క. అని సంభ్రమించి పలుకుచుఁ
     గనుకని చెడి పాఱు జనులఁ గని రాజసుతుం
     డును జండవర్మ చావున
     కనుమానములేమి నిశ్చయము సేసి వెసన్.111
చ. వెరపు జనంబు సత్త్వమును విక్రమమున్ విలసిల్లుచుండఁగాఁ
     గరిపతి నెక్కి మావతునిఁ గ్రక్కునఁ గీటణఁగించి త్రోచి ని
     ష్ఠురసృణిపాతభేదిగజశుంభధరుం డిభబృంహితధ్వనిం
     బరుపడి మూఁక పాయ విడఁ బార్థివదేహము డాసి యి ట్లనున్.112
చ. వగవ మనుష్యమాత్రమున వారికి దుష్కరమైన యట్టి యా
     మగతన మెవ్వఁ డిప్పుడు సమస్తజనస్తుతికారణంబుగా
     విగతభయాత్ము డై నెరపె వేగమె వాఁ డిట యేఁగుదెంచి వే
     మొగపడునేని నియ్యెడ సముద్ధతిఁ గైకొని కాతు నాతనిన్.113

చ. అనుడు నొకండు వచ్చి వినయంబున మ్రొక్కినఁ జూచి రాజవా
     హనుఁ డపహారవర్ముడగు టాత్మ నెఱింగి ముదంబు వొంది ర
     మ్మని కసంజ్ఞ చేసి చరణాయతికుంచితకుంజరంబు నె
     క్కినచెలిఁ గౌఁగిలించెఁ దనకేలు పిఱిందికి జాఁచి వేడుకన్.114
వ. మఱియును.115
క. అతనికరంబులు కక్ష
     ద్వితయంబున నిగుడఁ దెగిచి వికసితముఖుఁ డై
     పతి యన్యోన్యాలింగన
     వితతసుఖం బనుభవించె వేడుకతోడన్.116
వ. అపహారవర్మయుఁ జిరవియుక్తుండైన రాజవాహనుం గలయఁ
     గనుంగొని పరమానందంబు పొందుచుండె నయ్యిరువురు
     నన్యోన్యకుశలసంప్రశ్నంబులు సేయునెడ నెడలేకుండఁ
     జండవర్మ పరివారంబు శస్త్రాస్త్రఘోరంబుగాఁ బొదివినం
     బతి కరపతిం బురికొలిపిన దొరలేని కూటువమూఁకలు
     విరియఁబాఱినమంచువిరియించినపతంగుండుంబోలె వెలింగి
     వీటిలోని సంకటంబున కొల్లక బయలు మెఱసియున్నంత సిం
     హవర్మకుం దోడుపడుటకు నరుగుదెంచిన సర్వపాలుఁ డతని
     పరిభవంబు విన నరవాయి గొనక యురువడించి చండవర్ము
     తోడి భండనంబున కియ్యకొని వచ్చివచ్చి యాతండు
     చచ్చుట యెఱింగి యచ్చెరువందుచుఁ బురంబు డగ్గఱి.117
చ. తెగువ జనంబు లెల్ల వినుతింప దొరం దెగఁ జూడఁ జాలు ని
     మ్మగటిమిఁ జేసి గ్రందుకొన మార్కొను వైరిబలంబుఁ దోలియ
     ల్లగజముమీఁద విక్రమవిలాసము సొంపెసఁగంగ నున్నవా

     రగణితశౌర్య లిద్ద ఱని యాదటఁ జెప్పఁగ వించు వేడుకన్.118
ఉ. అందఱుఁ గూడఁ బూఱి కడు నచ్చెరు వెట్టి మహాతులొక్కొ? వీ
     రిం దగఁ గానఁగావలయుఁ బ్రీతి మెయిన్ వెస నిప్డ వింత మై
     గ్రందుగఁ బోక యొప్పదని గ్రక్కున నొక్కని బుద్ధిమంతుఁగా
     ముందర బారిచుట్టకముం గొనియాడఁగఁ బంచి రర్ధితోన్.119
వ. తదనంతరంబ తొల్లి రాజవాహను నన్వేషింపం జని పుణ్య
     వశంబున నొక్కొక్కదేశంబున కధిపతు లై యుండి చం
     పాపురీశ్వరునకు సహాయ మనుష్ఠింపం దమసైన్యంబులతో
     జనుదెంచిన యపహారవర్మయు నర్ధపాలుండును బ్రమతియు
     మిత్రగుప్తుండును మంత్రగుప్తుండును విశ్రుతుండును నొం
     డొరుం గనుంగొని గాఢోపగూఢసౌఖ్యం బనుభవించు నెడ
     నర్ధపాలుండు నపహారవర్మయు నిజజనకులైన కామపాలునిం
     బ్రహారవర్మునిం జెలులకుం జెప్పిన నయ్యిరువురకు నందఱు
     నుచితాలాపంబులఁ బ్రియంబు సేయు సమయంబున ముంద
     టం బోయిన దూత రాజవాహను ననుమతి రాజలోకంబు
     నతనిపాలికిం బిలువ వచ్చిన సమస్తమహేశ్వరులుం బోవఁ
     గదలుటయుఁ గుమారులు విధియత్నంబున లోకోత్తరచ
     రిత్రులగు నయ్యిరువురు మనవార యగుటకు దైవయో
     గంబు గలుగునో యని యన్యోన్యకుశలవార్తాశ్రవణకుతూ
     హలంబు శోభిల్ల వీరపురుషదర్శనోత్సుకు లగుచు నతిత్వరి
     తంబున నరిగి వారలం జూచి రాజవాహనుండును నపహార
     వర్మయుఁగా నెఱింగి.120

క. వినయము సంభ్రమముం దమ
     మనముల నెలకొనఁగ నక్కుమారులు నృపనం
     దనునకు మ్రొక్కిన నతఁడుం
     గనుఁగొని వారల వయస్యగణ మని యెఱిఁగెన్.121
తే. ఎఱిఁగి యపహారవర్మకు నెలమిఁ జూపె
     నెట్టి భాగ్యంబు నెచ్చెలు లెల్ల (నిచటి)
     కరుగుదెంచిరి చూచితె యనుచు సమధి
     కాదరంబున గజపతి నవతరించి.122
వ. వారిం గౌఁగిలించుకొని వార లెఱింగింపఁ బ్రహారశర్మ కామ
     పాలుర నర్హప్రతిపత్తి [8]ప్రీతులం గావించి వారికి నపహార
     వర్మ నెఱింగించి వారలు నక్కుమారులు నతండును నుచి
     తాచారంబులు నడపిన యనంతరంబ యితరధరణీశ్వరుల
     నాలోకనసంభాషణంబుల సన్మానించి సింహవర్మను రావించి
     లజ్జావనతవదనుండగు నతనిఁ బ్రియాలాపంబులం చేర్చి
     పుచ్చి చెలులతోడిసల్లాపంబులు సేయువేడ్క చిత్తంబు వేగిర
     పఱుపఁ దదీయసైన్యంబులు సముచితప్రదేశంబుల విడియు
     నట్టుగా నియమించి తక్కినరాజుల నెల్ల నిజపురంబులకుం
     బోవం బనిచి.123
తే. చెలులుఁ దానును గౌతుక మెలమి మిగుల
     నొక్క రమ్యోపవనములో నుల్లసిల్లు
     చూతపోతంబుకడ సికతాతలమున
     మానవాధీశ్వరుఁడు సుఖాసీనుఁ డయ్యె.124
వ. ఇట్లు సుఖోపవిష్టుం డై.125

క. సవినయమున వా రడుగఁగ
     నవనీనాయకుఁడు చెప్పె నాశ్చర్యకరం
     బవు తనచరితము పుష్పో
     ద్భవు వృత్తాంతంబు సోమదత్తుని కథయున్.126
వ. చెప్పి సుహృద్వర్తనంబులు వినం దలంచి యపహారవర్మ
     మొగంబుఁ జూచి నీవృత్తాంతంబు సవిస్తరంబుగా నెఱిం
     గింపు మనిన.127
ఉ. పోషితసత్కవీంద్రునకుఁ బుణ్యచరిత్రునకు న్నిజప్రభా
     దూషితవాసరేశునకు ధూతకళంకునకున్ గుణావళీ
     భూషితకీర్తికాంతునకుఁ బుష్పశరప్రతిమానమూర్తికిం
     దోషితబంధువర్గునకు దుర్గమశాత్రవపార్శ్వభేదికిన్.128
క. నీతినిపుణమతిజితపురు
     హూతామాత్యునకుఁ బుణ్యయుతకృత్యునకున్
     బూతచరిత్రసముజ్జ్వల
     గౌతమగోత్రునకు నుభయకవిమిత్రునకున్.129
మాలిని. జనవినుతవివేకక్షాంతిసంపత్తిసౌమ్యా
     త్మునకు నిఖిలలోకామోదసంపాదివిద్యా
     ధనున కసమదానత్యాగలీలాసముద్య
     ద్వినయనిధికిఁ గీర్తిస్థేమనిర్వర్తి కుర్విన్.130
గద్యము. ఇది సకలసుకవిప్రసాదవిభవ విలసదభినవదండి
     నామధేయవిఖ్యాత కేతనార్యప్రణీతం బైన దశకుమార
     చరిత్రం బను మహాకావ్యంబునందుఁ జతుర్థాశ్వాసము.

  1. విఱిచి
  2. ప్రక్కలు
  3. నయ్య
  4. దుర్జాతికి
  5. నుండి తనయొద్ద కేణ
  6. నాభ్రమ
  7. దేవిఁ దలఁచి
  8. ప్రేమలం గారవించి