దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర/నిర్బంధాల వెల్లువ
ప్రచురణ ప్రారంభించాము పుస్తక ప్రచురణకు లక్ష్యం డబ్బు సంపాదనకాదు సత్యాగ్రహ సంగ్రామానికి ఉపయోగపడే విధంగా పుస్తకాలు ప్రచురించినందున వాటి అమ్మకంకూడా పెరిగింది. ఈ విధంగా ఇండియన్ ఒపీనియన్ మరియు ప్రెస్సు రెండూ దక్షిణాఫ్రికాలో జరిగిన సత్యాగ్రహ పోరాటానికి ఎంతో సహకరించాయి. సత్యాగ్రహం భారతీయుల హృదయాలలో వ్రేళ్లు పాతుకున్న కొద్దీ ఇండియన్ ఒపీనియన్ మరియు ప్రెస్సులు రెండూ ఎంతో ప్రగతిని సాధించాయి
20
నిర్భంధాల వెల్లువ
రామసుందర్ పండిత్‌ను నిర్బంధించడంవల్ల ప్రభుత్వానికి ప్రయోజనం కలుగలేదని మనం చూచాం రెండో వైపున ప్రజల్లో ఉత్సాహం పెరిగిపోతున్న విషయం ప్రభుత్వం గ్రహించింది. ఇండియన్ ఓపీనియన్‌లో ప్రచురించబడే వ్యాసాల్ని, ఇండియన్ ఏసియాటిక్ శాఖ వాళ్లు కూడా శ్రద్ధగా చదువుతున్నారు జాతీయ పోరాటమేదీ రహస్యంగా జరగలేదు జాతిబలాన్ని జాతిబలహీనతల్ని రెండిటినీ జనం ఇండియన్ ఓపీనియన్ ద్వారా మిత్రులైనా, శతృవులైనా, తటస్థంగా వుండేవారైనా తెలుసుకుంటున్నారు తప్పుడుపని చేయనవసరంలేదు మోసానికి అతి తెలివికి చోటులేదు. తమ ఆత్మబలంతోనే విజయం సాధించుటకు అవకాశం వున్నా సత్యాగ్రహ సంగ్రామంలో రహస్యానికి తావులేదని కార్యకర్తలంతా తెలుసుకున్నారు. జాతి బలహీనతలనే రోగాల్ని తొలగించుకోవాలంటే వాటిని బయటపెట్టి, వాటిని బాగా అందరూ తెలుసుకో గలగాలని కార్యకర్తలు గ్రహించారు. ఏషియాటిక్ శాఖవారు. ఇండియన్ ఒపీనియన్ విధానం యిదేనని తెలుసుకున్నారు. భారత జాతీయ సత్యాగ్రహ సంగ్రామ చరిత్రగా ఇండియన్ ఒపీనియన్ పత్రిక రూపొందడం గమనించిన ఏషియాటిక్ శాఖాధికారులు యీ సంగ్రామానికి సంబంధించిన నాయకుల్ని నిర్బంధంలోకి తీసుకోవడం అవసరమనీ, లేకపోతే జాతిబలం పెరుగుతుందేగాని తరగదని భావించారు. తత్ఫలితంగా 1907 డిసెంబరు మాసంలో కొంతమంది నాయకులకు కోర్టులో హాజరుకమ్మని నోటీసు పంపారు. నోటీసు యిచ్చే విషయంలో అధికారులు సభ్యతగా వ్యవహరించారని చెప్పవచ్చు.
వాళ్లు అనుకుంటే వారంట్లు జారీ చేసి నాయకుల్ని నిర్బంధంలోకి తీసుకోవచ్చు కాని అలా చేయకుండా హాజరుకమ్మని వాళ్లకు నోటీసు యిచ్చి అధికారులు సభ్యతతోబాటు, జాతి నాయకులు అరెస్టు కావడానికి సిద్ధంగా వున్నారనే సత్యాన్ని కూడా ప్రకటించారు. హాజరు కావలసిన రోజు శనివారం ది 28-12-1907 ఆనాడు కోర్టులో హాజరైన నాయకులు "చట్ట ప్రకారం మీరు అనుమతి పత్రాలు తీసుకోవాలి కాని మీరు తీసుకోలేదు. కనుక ఫలానా సమయంలోపున ట్రాన్స్‌వాల్ సరిహద్దుల్ని దాటి వెళ్లిపొండని మీకు అర్డరు ఎందుకు యివ్వకూడదో తెలుపండి" అని యిచ్చిన నోటీసుకు సమాధానం యివ్వాలి. ఇట్టి నాయకుల్లో ఒక సజ్జనుడి పేరు క్వీస్ అతడు జోహన్స్‌బర్గ్‌లో నివసిస్తున్న చైనీయులకు నాయకుడు జోహన్స్‌బర్గ్‌లో 300 . 400 మంది చైనావారు వుంటున్నారు. వారంతా వ్యాపారాలు వ్యవసాయం చేస్తువుంటారు భారతదేశం వ్యవసాయ ప్రధాన దేశం అయితే వ్యవసాయాన్ని చైనా ప్రజలు అభివృద్ధి చేసినంతగా భారతీయులు చేయలేదని చెప్పక తప్పదు. అమెరికా మొదలుగాగల దేశాల్లో ఆధునిక యుగంలో జరిగిన వ్యవసాయాభివృద్ధి అమోఘం అయితే పాశ్చాత్య దేశాలలో జరుగుతున్న వ్యవసాయం ప్రయోగస్థాయిలో వున్నదని భావిస్తున్నాను చైనా మన భారతావని వలెనే ప్రాచీన దేశం ప్రాచీన కాలాన్నుంచి అక్కడ వ్యవసాయ కార్యక్రమం జరుగుతున్నది. అందువల్ల చైనాను భారతదేశాన్ని రెండిటినీ యీ విషయంలో పోల్చి చూచుకొని ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. జోహన్స్ బర్గ్‌లో నివసిస్తున్న చైనీయులు చేస్తున్న వ్యవసాయం చూచి, వారి వ్యవసాయానికి సంబంధించిన విశేషాలు విని వాళ్ల జ్ఞానం, కృషి మనకంటే గొప్పదని నాకు అనిపించింది పంటకు పనికి రాదు అని భావించి మనం ఏ భూమిని వదిలి వేస్తామో, ఆ భూమిని చైనా వాళ్లు పరీక్షించి అక్కడి మట్టి యందలి వివిధ ఎశేషాల్ని గ్రహించి ఆ మట్టికి సరిపోయే విత్తనాలుచల్లి ఆందుపంటలు పండిస్తారు
కష్టపడి పని చేసే తెలివిగల చైనా ప్రజలకు కూడా రక్తపు చట్టం వర్తింపచేశారు. అందువల్ల భారతీయులు ప్రారంభించిన సంగ్రామంలో చైనావారు కూడా చేరాలని నిర్ణయించుకున్నారు. అయితే యిరుదేశాల వారు అనుసరించిన విధానాలు మాత్రం విడివిడిగా పున్నాయి. తమతమ సంస్థల ద్వారా రెండు జాతులవారు. తెల్ల ప్రభుత్వంతో పోరాటం సాగిస్తున్నారు ఆవిధంగా పోరాడినంత కాలం రెండు జాతులవారు లాభం పొందారు యింతలో ఒక జాతి పడిపోయింది రెండో జాతి పడిపోలేదు. ఆ పోరాటంలో చాలా మంది చైనా వారు ఓడిపోయారు వారి నాయకుడు వారిని మోసగించాడు. చైనా నాయకుడు. రక్తపు చట్టానికి లొంగిపోలేదు. కాని ఆ సంస్థకు సంబంధించిన డబ్బు, లెక్కల పుస్తకాలు అన్నీ తీసుకొని పారిపోయాడని నాకు మిత్రులు చెప్పారు. నాయకుడు లేకపోతే జనం చెల్లాచెదురైపోవడం సహజమే కదా నాయకుడిలో మలినం కనబడితే, అనుచరులు నిరాశపడిపోతారు. అరెస్టులు జరిగినప్పుడు చైనీయులు అమితోత్సాహంగా వున్నారు. వారిలో ఎవ్వరూ అనుమతి పత్రాలు తీసుకోలేదు భారతీయులతో బాటు వారి నాయకుల్ని అరెస్టు చేసినట్లే చైనావారిని, క్విన్‌తో లో సహా వారి నాయకుల్ని అరెస్టు చేశారు. కొంతకాలం శ్రీక్విన్ చక్కగా పనిచేశాడని చెప్పవచ్చు
అరెస్టు చేయబడిన భారతీయ నాయకుల్ని పరిచయం చేస్తాను శ్రీ తంభినాయుడు తమిళభాషీయుడు. ఆయన మారిషస్‌లో జన్మించాడు ఆయన తల్లి తండ్రి పొట్టపోసుకోవడం కోసం మద్రాసు నుంచి మారిషస్ వెళ్లారు. తంబినాయుడు సామాన్య వ్యాపారస్తుడు ఆయనకు పాఠశాల విద్య అబ్బలేదు. కాని అనుభవజ్ఞానం అధికంగా లభించింది. ఇంగ్లీషు బాగా మాట్లాడగలరు వ్రాయగలరు. భాషాశాస్త్ర దృష్ట్యా వారి ఇంగ్లీషులో దోషాలువుండేవి అనుభవం ద్వారానే వారు తమిళం నేర్చుకున్నారు హిందుస్తానీ భాషకూడా మాట్లాడగలరు తెలుగు కూడా వారికి వచ్చు హిందీ, తెలుగు లిపులు వారికి రావు కాని ఆ రెండు భాషలు వారికి వచ్చు మారిషస్ భాషయగు క్రియోల్ కూడా వారికి బాగా వచ్చు. క్రియోల్ భాష ఫ్రెంచి బాపయొక్క ఆపభ్రంశరూపం దక్షిణ భారత దేశానికి చెందిన వారికి సామాన్యంగా యిన్ని భాషలు తెలుసునని చెబితే ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. దక్షిణాఫ్రికాలో వున్న వందలాది భారతీయులకు యీ భాషలన్నిటి సామాన్యపరిచయం వున్నది. వాళ్లు తేలికగా యిన్ని భాషలు మాట్లాడుతారు. నా దృష్టిలో యిందుకు ఒక కారణం వున్నది. విదేశీ భాషా మాధ్యమం ద్వారా విద్య గడించి వారి బుర్రలు అలిసిపోవు. వారిజ్ఞాపకశక్తి చురుగ్గా వుంటుంది యీ భాషలు మాట్లాడే వారితో ప్రత్యక్షంగా మాట్లాడి ఆయా భాషల తీరు తెన్నుల్ని పరిశీలించి ఆ భాషా జ్ఞానం వారు పొందుతూ వుంటారు. మస్కిష్కానికి యిది చిన్ని వ్యాయామం దీని వల్ల వారి మస్కిష్కం అలసిపోదు. వికాసం పొందుతుంది. తంబినాయుడి విషయం కూడా యింతే ఆయనకు బుద్ధి తీవ్రత అధికం క్రొత్త ప్రశ్నల్ని తేలికగా అర్థం చేసుకుంటారు తక్కువగా జవాభిచ్చేవారి పద్ధతిని చూచి అంతా ఆశ్చర్య పడుతూ వుంటారు ఆయన భారత దేశాన్ని ఎన్నడూ చూడలేదు. కాని భారత దేశమంటే ఆయనకు అపారమైన ప్రేమ స్వదేశాభిమానం ఆయన రోమరోమంలో హత్తుకుపోయింది. వారి యందలి స్థిరత్వం వారిముఖంలో ప్రతిబింబిస్తూ వుంటుంది. వారి శరీరం బలిష్టంగా వుంటుంది. మంచి ఒడ్డుపొడవుగల మనిషి కాయకష్టం చేస్తున్నప్పుడు అలిసి పోయేవారు కాదు. ఏ సభలోనైనా కుర్చీమీద కూర్చొని అధ్యక్ష పదవినలంకరించవలసి వచ్చినా లేక అవసరమైనప్పుడు హమాలీ పని చేయవలసి వచ్చినా చేస్తూ వుండేవారు నడిరోడ్డున మూటలు మోయవలసి వచ్చినా తంబినాయుడు సిగ్గుపడేవాడు కాదు. కష్టపడవలసివస్తే రాత్రి, పగలు అనే తేడాను గమనించేవాడు కాదు భారత జాతి కోసం సర్వమూ అర్పణ చేసే విషయంలో ఎవ్వరికీ తీసిపోని త్యాగధని శ్రీతంబినాయుడు అవసరానికి మించిన సాహసి, సహజంగా ముక్కోపి కాకుండా వుంటే, అటువంటి వీర పురుషుడు ట్రాన్స్‌వాల్‌లో కాఛలియా స్థానాన్ని అలంకరించి జాతికి నేతృత్వం వహించియుండేవారు. ట్రాన్స్‌వాల్‌లో సత్యాగ్రహసమరం ప్రారంభమైనంతవరకు ఆయన ముక్కోపం బయటపడలేదు. ఆయన యందలి సుగుణాలు రత్నాలవలె ప్రకాశించాయి కాని ఆ తరువాత ఆయనకోపం, ఆయన సాహసం రెండూ ఆయనకు ప్రబల శతృవులుగా మారాయని విన్నాను. ఆ రెండు దుర్గుణాలు వారి సద్గుణాలనన్నింటిని కప్పి వేశాయి. ఏదిఏమైనా దక్షిణాఫ్రికా సత్యాగ్రహ సంగ్రామ చరిత్రలో తంబినాయుడు పేరు ప్రధమ శ్రేణిలో వుండతగినది. మేమందరం కోర్టులో ఒకేసారి హాజరు కావాలి కాని అందరి కేసులు విడివిడిగా నడిచాయి. మేజస్ట్రేటు కొంతమందిని 48 గంటలలోపున, కొంతమందిని 7 లేక 14 రోజుల్లోపున ట్రాన్స్‌వాల్ వదిలివెళ్లమని ఆదేశించాడు. ది 10 జనవరి 1908 నాటికి ఆ గడువు పూర్తి అవుతుంది. ఆ రోజున విధించబడిన శిక్షను వినడం కోసం మేము కోర్టుకు తిరిగి రావాలని అర్దరు వేశాడు మేము మా రక్షణ కోసం వాదించవలసిందేమీ లేదు. గడువుదాటేలోపున ట్రాన్స్‌వదిలి వెళ్లేది లేదు. సవినయంగా మేజిస్ట్రేటు ఆర్డరును ధిక్కరించి, ఆ ఆపరాధాన్ని అంగీకరించడానికి అంతాసిద్ధంగా వున్నాము
కోర్టులో చిన్న ప్రకటన చేయుటకు నేను అనుమతి కోరాను. అందుకు అనుమతి లభించింది. "నా కేసుకు, నాతరువాత వచ్చేవారి మీద మోపబడిన కేసులకు వ్యత్యాసం చూడటం అవసరం. ప్రిటోరియానుంచి యిప్పుడే నాకు సమాచారం అందింది నా దేశబంధువులకు అక్కడ మూడు మాసాలకైదుశిక్ష, మరియు పెద్ద జుర్మానా విధించబడ్డాయి. జుర్మానా చెల్లించకపోతే యింకో మూడు మాసాల శిక్ష విధించారు. వారంతా అపరాధంచేసియుంటే, వారందరి కంటే నేను పెద్ద అపరాధిని గనుక నాకు కఠినాతికఠిన శిక్ష విధించచుని మేజస్ట్రేటు గారిని ప్రార్థిస్తున్నాను" అని ప్రకటించాను. కాని మేజస్ట్రేట్ నా ప్రకటనను పట్టించుకోలేదు. నాకు రెండు మాసాల సామాన్య ఖైదు శిక్ష విధించాడు. ఏకోర్టులో నేను వకీలుగా వందలాది సార్లు నిలబడ్డానో, వకీళ్ల మండలి సభ్యులతో కలిసి మెలిసి తిరిగానో అదే కోర్టులో యివాళ నేను ముద్దాయి. రూపంతో బోనులో నిలబడ్డాను. యీ స్థితి నాకు విచిత్రంగా తోచింది. అయితే వకీళ్లతోబాటు వున్నప్పుడు ఎంతటి గౌరవప్రతిష్ఠల్ని నేను హృదయంలో పొందానో, అంతటి గౌరవ ప్రతిష్ఠల్ని ముద్దాయిగా బోనులో నిలబడ్డ యిప్పుడు కూడా పొందానని చెప్పగలను సంకోచమేమీ నాకు కలుగలేదు. కోర్టులో వందలాది భారతీయ సోదరులు. వకీళ్లు. మిత్రులు మొదలైన వారి ఎదుట నిలబడి యున్నాను శిక్ష విధించ బడిన తరువాత ఒక రక్షక భటుడు ముందుకు వచ్చి జైలుకు తరలించే ముందు కైదీలను వుంచే చోటుకి నన్ను తీసుకువెళ్ళాడు
అక్కడ నిశ్శబ్దంగా వున్నది. కైదీలు కూర్చునేందుకై ఒక బెంచివున్నది ఆ బెంచీ మీద కూర్చోమని చెప్పి ఆ రక్షక భటుడు బయట తలుపు బిగించి వెళ్లిపోయాడు యిక్కడ నాకు కొంచెం గాబరాకలిగింది. నేను ఆలోచనల్లో మునిగిపోయాను. నా యిల్లు వాకిలి ఎక్కడ నా బారిష్టరీ ఎక్కడ, ఆ ప్రజాసభలు ఎక్కడ? అన్ని స్వప్నాల్లా తెరమరుగైనాయి యిప్పుడు నేను కైదీగా యిక్కడకూర్చున్నాను. రెండు మాసాల్లో ఏమవుతుందో? రెండు మాసాలపూర్తి కైదు శిక్ష నేను అనుభవించవలసి వస్తుందా? జాతి ప్రజలంతా అనుకున్న ప్రకారం పెద్ద సంఖ్యలో జైళ్లకు వెళ్లితే రెండు మాసాల పాటు శిక్ష అనుభవించనవసరం వుండదు. కాని వారంతా ఆలా జైళ్లకు వెళ్లడానికి సాహసించకపోతే రెండు మాసాలు జైళ్లో వుండక తప్పదు. రెండు మాసాలంటే ఎక్కువ సమయమే యీ విధంగా కలిగిన భావాలను వ్రాయడానికి యిప్పుడు పట్టినంత సమయంలో వందో శాతం సమయం కూడా ఆ భావాలు కలగడానికి పట్టలేదు. యిటువంటి భావాలు మనస్సులో మసలినందుకు సిగ్గుపడిపోయాను నేను ఎంత మిధ్యాభిమానిని జైలును పెద్దమహలుగా భావించమని జాతి ప్రజలకు చెప్పాను రక్తపు చట్టాన్ని వ్యతిరేకించే సమయంలో ఎన్ని దుఃఖాలు కలిగినా వాటిని సుఖాలుగా భావించాలని బోధించాను ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సంపదలు చివరికి ప్రాణాలు సైతం అర్పించవలసి వచ్చినా, సత్యాగ్రహి ఆనందంగా ఆర్పించడానికి సిద్ధపడాలని కూడా చెప్పాను ఆ నా జ్ఞానమంతా యిప్పుడు ఏమైంది? ఎక్కడికి పోయింది? యిట్టి భావాలు నాలో క్రొత్త శక్తిని నింపాయి నా మూర్ఖత్వాన్ని తలుచుకొని నవ్వుకున్నాను. యిక సామాన్యస్థితిలో ఆలోచించసాగాను మిగతామిత్రులకు ఏమి శిక్ష విధించబడిందో? వాళ్లను కూడా నాతో బాటు జైల్లో వుంచుతారో లేదో అని ఆలోచిస్తూ వుండగా యింతలో తలుపులు తెరుచుకున్నాయి. పోలీసు అధికారి తన వెనుక రావలసిందని నన్ను ఆదేశంచాడు. అతడి వెనుక నడుస్తూ వుండగా నన్ను ముందు వుంచి తాను నా వెనుకకు జరిగాడు జైలుకు సంబంధించి పంజరం వంటి వాహనం దగ్గరకు తీసుకు వెళ్లి యిందులో కూర్చోమని చెప్పాడు. నేను కూర్చున్నాను వెంటనే ఆ వాహనం జోహన్స్‌బర్గ్‌కు బయలు దేరింది
జైల్లో నా బట్టలు విప్పించివేశారు జైల్లో ఖైదీలను నగ్నంగా వుంచుతారని విన్నాను వ్యక్తిగతంగా అవమానం కలిగించనంతవరకు, మతరీత్యా వ్యతిరేకంకానంత వరకు జైలు నియమాల్ని పాటించాల్సిందేనని ముందుగా నిర్ణయించుకున్నాము. అక్కడ ధరించుటకు నాకు యిచ్చిన దుస్తులు మురికిగా వున్నాయి. వాటిని ధరించడానికి నా మనస్సు అంగీకరించలేదు కాని ఆ దుస్తులు ధరించాను మనస్సును ఒప్పించాను దుఃఖం కలిగినా, జైల్లో మురికిని సహించక తప్పదని నా మనస్సుకు నచ్చ చెప్పాను నా పేరు. అడ్రసు వ్రాసుకున్న తరువాత నన్ను ఒక పెద్ద కొట్లోకి తీసుకు వెళ్లారు కొద్ది సేపు నేను అందులో వున్నాను యింతలో నా అనుచరులు కూడా నవ్వుతూ మాట్లాడుకుంటూ అక్కడికి వచ్చారు. నేను వచ్చిన తరువాత వాళ్లకేసులు ఎలా నడిచాయో ఏమేమి జరిగిందో సవివరంగా నాకు చెప్పారు నా కేసు పూర్తి అయి నాకు శిక్ష విధించబడిన తరువాత కొంతమంది భారతీయులు నల్లజండాలు పట్టుకొని ఊరేగింపు జరిపారనీ, కొంతమంది ఉత్తేజితులైనారని వారివల్ల తెలిసింది. పోలీసులు ఊరేగింపును ఆపి యిద్దరు ముగ్గురిని లాఠీలతో కొట్టారని కూడా తెలిసింది. అయితే మమ్మలందరినీ ఒకే జైల్లో ఒకేచోట వుంచారు. అందుకు చాలా సంతోషించాము
సాయంత్రం 6 గంటలకు మా కొట్టు తలుపులు మూసి వేశారు దక్షిణాఫ్రికాయందలి జైళ్ల తలుపులకు యినుపగడియలు, ఇనుప కడ్డీలు వుండవు గోడకు పై భాగాన ఒక చిన్న జాలీతో కప్పబడిన కిటికీ గాలి కోసం వుంది. అందువల్ల తలుపులు మూసేసరికి గల్లాపెట్టెలో పెట్టిమూసి వేసినట్లు మాకు అనిపించింది. జైలు అధికారులు రామసుందర్ పండితునికి చేసిన ఆదరసత్కారం మాకు చేయలేదని పాఠకులు గ్రహింతురుగాక యిందు ఆశ్చర్యం ఏమీ లేదు. రామసుందరపండితుడు ప్రధమ సత్యాగ్రహకైదీ అతడితో ఎలా వ్యవహరించాలో అధికారులకు బోధపడియుండదు. మా సంఖ్య ఎక్కువగా వున్నది యింకా చాలా మందిని ప్రభుత్వం నిర్బంధంలోకి తీసుకోవాలి. మమ్మల్ని హబ్షీల వార్డులో వుంచారు. దక్షిణాఫ్రికాయందలి ఖైదీలలో రెండు వర్గాలు వుంటాయి. తెల్లవాళ్లు, నల్లవాళ్లు (హబ్షీలు) భారతీయ ఖైదులను కూడా హబ్షీ వర్గంలో చేర్చారు. నా అనుచరులందరికీ నా వలెనే రెండు మాసాల సామాన్య జైలు శిక్ష విధించబడింది
రెండో రోజు ఉదయం సామాన్య ఖైదు శిక్ష పొందిన ఖైదీలు తమ సొంత దుస్తుల్ని ధరించవచ్చునని, తమ బట్టలు ధరించడం వారికి యిష్టంలేక పోతే ఖైదీలకు యిచ్చే ప్రత్యేక దుస్తులు ధరించవచ్చునని తెలిసింది. అయితే మేము సొంత దుస్తులు ధరించవద్దని, జైల్లో వున్నంత కాలం జైలు దుస్తులే ధరించాలని నిర్ణయానికి వచ్చాం మా నిర్ణయాన్ని జైలు అధికారులకు తెలియ చేశాం మాకు సామాన్య ఖైదీలు ధరించే హబ్షీవారి దుస్తులు అందాయి. అసలు సామాన్య జైలు శిక్ష విధించబడిన ఖైదీలు పెద్ద సంఖ్యలో దక్షిణాఫ్రికాజైళ్లలో వుండరు. అందువల్ల అట్టిదుస్తుల కొరత జైల్లో ఏర్పడింది తగాదా పడటం మాకు యిష్టం లేదు అందువల్ల పెద్దశిక్ష పడ్డ హబ్షీఖైదీలదుస్తులు ధరించడానికి మేము అంగీకరించాము ఆ తరువాత జైలుకు వచ్చిన భారతీయులు యిట్టి దుస్తులు ధరించకుండా తమ సొంత దుస్తులే ధరించారు. అది నాకు యిష్టంకాకపోయినా, యిట్టి విషయంలో పట్టుదల అనవసరమని భావించాను. రెండు, మూడు రోజులకు సత్యాగ్రహఖైదీల సంఖ్య బాగా పెరిగిపోయింది. వారు కావాలనే శిక్ష పొంది జైలుకు వచ్చారు వారిలో ఎక్కువ మంది కేకలు పెట్టి వస్తువులు అమ్ముకునే వారే దక్షిణాఫ్రికాలో యిలా వీధుల వెంట తిరిగకేకలు బెట్టి వస్తువులు అమ్ముకునే వారు తెల్లవారైనా సరే నల్లవారైనా సరే ప్రభుత్వం దగ్గర అనుమతి పత్రం తీసుకోవాలి. దాన్ని తమ దగ్గర భద్రంగా వుంచుకోవాలి పోలీసులు ఆడిగినప్పుడు వాళ్లకు చూపిస్తూ వుండాలి. రోజూ పోలీసులు అలా అడిగి చూపించని వారిని జైల్లో పెడుతూ వుంటారు. మమ్ము నిర్బంధంలోకి తీసుకున్న తరువాత భారతీయులంతా జైళ్లకు వెళ్లాలని నిశ్చయించుకొన్నారు వారిలో అధిక సంఖ్యాకులు యిట్టి వ్యాపారస్థులే అరెస్టు కావడం వాళ్లకు తేలికే అనుమతి పత్రం చూపించకపోతే చాలు వాళ్లను వెంటనే జైలుకు పంపుతారు. ఒక్క వారంలో యిట్టి ఖైదీల సంఖ్య 100కు పెరిగింది. రోజూ ఖైదీలు వస్తూ వున్నారు. కనుక పత్రికల అవసరం లేకుండా బయటి సమాచారం మాకు అందుతూనే వున్నది. యీ విధంగా రోజు రోజుకీ సత్యాగ్రహుల సంఖ్య పెరుగుతూ వుండే సరికి మేజిస్ట్రేటుకు క్రొత్త ఆదేశం అందింది. యిక సత్యాగ్రహులకు సామాన్య ఖైదు శిక్షకు బదులు కఠోరశిక్ష విధించమనునదే ఆ ఆదేశం అప్పటి నుంచి అందరికీ కఠోరశిక్ష విధించారు. తరువాత జరిగిన పోరాటాల్లో పాల్గొన్న వందలాది భారతీయ సత్యాగ్రహులకు, వాళ్లు స్త్రీలైనా సరే, పురుషులైనా సరే సామాన్య ఖైదుకు బదులు కఠోర శిక్షయే విధించారు. అయినా భారతీయులు అధిక సంఖ్యలో జైళ్లకు రావడం గొప్ప చమత్కారమే
జోహన్సు బర్గ్ జైల్లో వున్న ఖైదీలకు రోజూ ఉదయం మొక్కజొన్నల పిండితో తయారుచేసిన సంకటియో లేక గంజియో ఉప్పు కలపకుండా అందజేసే వారు ఉప్పు విడిగా అందజేసేవారు. మధ్యాహ్నం 12 గంటలకు నాలుగు ఔన్సులు అన్నం, విడిగా కొద్ది ఉప్పు, ఒక ఔన్సు నెయ్యి, నాలుగు ఔన్సుల డబల్ రొట్టె ఆహారంగా యిచ్చేవారు. సాయంత్రం మొక్కజొన్నల పిండతో తయారైన సంకటి. లేక గంజి, కొద్దిగా కూర, ముఖ్యంగా బంగాళా దుంపలు యిచ్చే వారు పెద్దవైతే ఒక బంగాళా దుంప చిన్నవైతే రెండు దుంపలు యిచ్చేవారు. యీ భోజనంతో ఎవ్వరికడుపు నిండేదికాదు బియ్యం వండితే మెత్తబడేది జైలు డాక్టర్ని పిలిచి మసాలా దినుసులు యిమ్మని కోరాం భారతదేశంలో యిస్తారని చెప్పాం “ఇది భారత దేశం కాదు. ఖైదీలకు నోటి రుచితో సంబంధం లేదు. అందువల్ల మసాలా దినుసులు యివ్వడానికి వీలులేదు" అని గట్టిగా అరిచాడు. డాక్టరును వ్యతిరేకించాము యిది రుచికి సంబంధించిన వ్యవహారం కాదు. శరీరానికి కావలసిన అవసరమైన తత్వాలకు సంబంధించిన విషయం యీ భోజనం వల్లఅట్టి తత్వాలు లభించవు కదా డాక్టరు యీ విధంగా ఆలోచించలేదు నిరాకరించడమే అతడిపని జైలు సూపరింటెంటు మాకోరికను అంగీకరించి మీ భోజనం మీరే తయారు చేసుకోమని చెప్పాడు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేశాడు. అయితే వస్తువులు అందజేసే జైలు అధికారులకు, మనవాళ్లకు వస్తువుల ఎక్కువ తక్కువలను గురించి ఘర్షణ జరుగుతూ వుందేది. వారానికి రెండు రోజులు కూరలు తయారు చేస్తారు. అప్పుడు రెండుసార్లు వంటచేసేవాళ్లు మిగతా రోజుల్లో ఒక సారే వంట చేసేవాళ్లు మధ్యాహ్న భోజనమప్పుడే మరో పదార్థం చేసుకోడానికి అంగీకరించేవాళ్లు వంట పని మన వాళ్ల చేతుల్లోకి వచ్చాక అంతా సంతోషంగా భోజనం చేయసాగారు
ఇటువంటి సౌకర్యాలు లభించినా, లభించకపోయినా శిక్షను అనుభవించవలసిందే సత్యాగ్రహబైదీల సంఖ్య 150 వరకు పెరిగింది మేమంతా సామాన్య ఖైదీలం కనుక గదులు శుభ్రం చేసుకోవడం మాత్రమే మా పని అందువల్ల మేము జైలు సూపరింటెండెంటును ఏమైనా పని యిమ్మని కోరాము అందుకు ఆయన అంగీకరించలేదు. నేను మీకు పని అప్పగించితే నాకు శిక్ష పడుతుంది కావున గదులు ఎక్కువ సేపు పరిశుభ్రం చేసుకోండి అని ఆయన చెప్పాడు. అయితే మా చేత కవాతు చేయించండి అని అన్నాము పెద్ద శిక్షపడ్డ హబ్షీలు కవాతు చేస్తూ వుండటం మేము చూచాము మీ కోరికను అంగీకరిస్తే నాకు మంచిదే మీఖైదీల సంఖ్య పెరిగినందున వార్డరుకు పనిభారం పెరిగింది నేను అతడికి ఆర్డరు వేయను అతడు కవాతు చేయిస్తానంటే నాకేమీ అభ్యంతరం లేదు. అని సూపరింటెండెంటు అన్నాడు వార్డరు మంచివాడు సూపరింటెండెంటు అనుమతి అతడికి కావాలి ప్రతిరోజూ ఉదయం శ్రద్దగా మా చేత కవాతు చేయించసాగాడు మా గదుల ముందు గల కొద్ది ప్రాంగణంలోనే మేము కవాతు చేయాలి. అందువల్ల మేము గుండ్రంగా తిరుగుతూ వుండాల్సి వచ్చింది. మా ఫరాన్ అనుచరుడు నవాబ్ ఖాన్ వార్డరు. వెళ్లాక మాచేత కవాతు చేయిస్తూ వుండేవాడు. కవాతుకు సంబంధించిన ఇంగ్లీషు శబ్దాల్ని ఉర్దూ ఉచ్చారణతో పలికి మమ్మల్ని బాగా నవ్విస్తూ వుండేవాడు. "స్టాండ్ ఎట్ ఈజ్'ను 'టండలీస్' అని అనేవాడు టండలీస్ అంటే ఏమిటో ముందు మాకు అర్థం కాలేదు. అయితే ఆ తరువాత యిది హిందూస్తానీ శబ్దం కాదని. నవాబ్ ఖాస్ ఇంగ్లీషు అని తెలుసుకొని నవ్వుకున్నాం
21
మొదటి ఒడంబడిక
ఈ విధంగా మేము జైల్లో సుమారు 15 రోజుల పాటు వున్నాము యింతలో బైటినుంచి వచ్చిన క్రొత్తవాళ్లు ప్రభుత్వంతో ఏదో ఒడంబడిక జరుపుకొనుటకు ప్రయత్నం సాగుతున్నదని సమాచారం తెచ్చారు. రెండు మూడు రోజుల తరువాత జోహన్స్‌బర్గ్ నుంచి వెలువడే ట్రాన్సవాల్ లీడర్ అసు దిన పత్రికా సంపాదకుడు శ్రీ ఆలబర్ట్ కార్టరైట్ నన్ను కలుసుకోవాలని, జైలుకు వచ్చాడు. ఆ రోజుల్లో జోహన్స్ బర్గ్ నుంచి వెలువడే దినపత్రికలన్నిటి యాజమాన్యం బంగారం గనుల ఏదో ఒక యజమాని చేతిలో వుండేది