తెలుగు భాషాచరిత్ర/ప్రకరణం 5

వికీసోర్స్ నుండి

ప్రకరణం 5

శాసనభాషా పరిణామం

(క్రీ. శ. 1400 - 1599)

_ఎం. కందప్పశెట్టి

5.0. తెలుగుశాసనాలు గతయగంలో దాదాపు రెండువేలుండగా, ఈ యుగంలో అవి ఇంచుమించు మూడు వందలే ఉన్నాయి. ఇలా శాసనాలసంఖ్య తగ్గిపోవడమే కాక అనేక శతాబ్దాలుగా తెలుగుభాషను రాజకీయ, మత, సాంఘిక విషయాల్లో చాలా విరివిగా వాడడంచేత తెలుగుభాషాలేఖనపద్ధతిలో కొన్ని కొన్ని సా౦ప్రదాయాలేర్పడ్డాయి. ఉదా : పెట్టినవి అనడానికి పెట్నవి (SII 5.24.7,1401) అనీ పెట్టిన అనడానికి పెట్న (పై.5.26.4, 1412) అనీ సర్ప వరం శాసనాల్లో చాలా తరచుగా కనిపిస్తాయి. ఇట్టివి పూర్వయుగంలోనూ క్వాచి త్కంగా కనిపిస్తాయి. ఇలా వ్రాసి ఉండటంచేత ఈవిధంగానే ఆ రోజుల్లో ఉచ్చ రించే వారని చెప్పలేం. ఎందుకంటే నేడూ గ్రామాల్లోని కొందరు సా౦ప్రదాయక లేఖకులు 'తమ' అని ఉచ్చరిస్తూనే “త్మ' అని వ్రాయడం చూస్తూన్నాం. కాబట్టి "పెట్నవి" మొదలైనవి సాంప్రదాయక రచనలే కాని ఆలా ఆనాడు ఉచ్చరించేవారని చెప్పలేం.

ఇలాంటి సా౦ప్రదాయాలవల్ల భాషలో ఉచ్బారణలు మారినా లేఖనాపద్ధతి మారక పోవచ్చు. అతి ప్రాచీనశాసనాల్లోనే శకటరేఫకు సాధుకరేఫ వ్రాయడం ప్రారంభం అయినా సాధురేఫ శకటరేఫల చిహ్నాలు 20 వ శతాబ్దిదాకా వాడుకలో ఉండటం మనకు తెలిసిందేకదా ! ఇలా కొన్ని సా౦ప్రదాయక రచనలున్నా ఈయుగపు శాసనాలు కూడా గతయగపు శాసనాల్లాగానే కొన్ని కొన్ని ముఖ్యమైన చారిత్రక అంశాల్ని తెలుసుకోడానికి ఉపయోగిస్తాయి.

5.1. వర్ణాలు: వర్ణాల విషయంగా ఇంతకు పూర్వయుగానికీ, ఈ

యుగానికి అట్టే తేడా కనిపించదు. కాబట్టి దీనికి వేరే ప్రత్యేకమైన వర్ణాల పట్టిక

144

తెలుగు భాషా చరిత్ర

ఇవ్వనవసరంలేదు. ఱకారం ఇంతకు పూర్వయుగంలో కనీసం కొన్ని కొన్ని సంజ్ఞావాచకాల్లోనైనా నిల్చి ఉన్నట్లు చూశాం. కాని ఈ యుగంలో ఆవిధంగా కూడా కనిపించదు. గతయుగంలో కనిపించని ఝ వర్ఘం ఈయుగంలో వర్ణంగా కనిపిస్తుంది.

ఈ యుగంలోనూ పూర్వయుగంలోలాగానే చకారానికి [చ చే] అని రెండు సవర్థాలు (ఉచ్చారణలు) ఉండినట్లు సూచన లున్నాయి. (చూ. 5.2). ఇట్లు ఉచ్చారణ విషయంగా సూచనలున్నాయి. కాని వాటిని రెండు వర్ణాలుగా చెప్పడానికి ఆధారాలు లేవు.

ఎ ఏ లకు ఈ యుగంలో తాలవ్యహల్లుల తర్వాత ఎ ఏ (æ, ǣ) అని సవర్ణాలుండినట్లు కొన్ని స్పష్టమైన సూచనలు కన్పిస్తాయి.

ఈ యుగంలో జరఝంపా ( SII 8.1085,8, 1428 ), ఔభ ళోఝ సింగాఓఝ౦గారి (పై. 5.10.5,1404) మొ. చోట్ల ఝ వ్రాతలో కనిపిస్తుంది. ఓజు (ఒజ్జ) అనే దాని రూపాంతరం ఓఝ అని చెప్పవచ్చు. జరఝంపా అనడానికి అర్థం ఏమో స్పష్టంగా తెలియడంలేదు. ఇలా కొన్ని పదాల్లో ఝ కనిపించటంచేత దీన్ని ఈ యుగంలో వర్ణంగా చెప్పాలి.

ధ్వనుల మార్పులు

5.2. అ > ఎ : తత్సమపదాల్లో తాలవ్యహల్లుల తర్వాత అకారం 'ఎొ'గా మారినట్లు గతయుగంలోనే చూశాం. ఈ యుగంలోనూ అట్టివి చాలా తరచుగా కనిపిస్తాయి. అ చెంద్రార్కస్థాయిగాను (SII 5.1228.9, 1508 ), హరిశ్చె౦ద్ర (పై. 5.165.6,1596), సెనివారానను (శవర్ణానికి స) (పై.6 850. 2,1418) మొ.వి. ఇట్టివి తెలుగు పదాల్లోనూ యకారంమీద కనిపించడం ఈ యుగంలో విశేషం. ఊరుంగాయెలతోడను ( పై. 4.981.7,1518 ), అనగా తాలవ్యహల్లుల తర్వాత అకారానికి బదులు ఎకారం ఉచ్చరించటం వ్యవహారంలో ఉన్నదని దీన్నిబట్టి తెలుస్తుంది. దేశిపదాల్లో అకారానికి ముందున్న చజలు దంతమూలీయంగా ఉచ్చరింపబడడంచేత వాటి తర్వాత ఆకారానికి ఈ మార్పు ఇంత తరచుగా కనిపించటంలేదు.

5.3. ఎ ఏ > అ ఆ : దేశిపదాల్లో తాలవ్యహల్లుల తర్వాత ఉన్న ఎ ఏలు క్రమంగా అ ఆలుగా మారడం తరచుగా కనిపిస్తుంది. యవ్వరు ( SII

శాసన భాషా పరిణామం

145

6.219 22,1494), యఱమనాయనిగారు (పై. 5.37.29,1494), సమర్పించను (పై. 5.1228.10,1503 ) ఇందు క్రియా ప్రాతిపదిక సాంస్కృతికమైనా కూడా దానిపై ఇంచుగాగమంలోని చకారంపై ఈ మార్పు కనిపిస్తుంది. సమర్పణ చేశను (పై. 6.1073.12,1402, ). ఎకారం ముందు స > ఛ కావడానికి చూ. (4.18). పండితుల చాత ఇప్పించిన (ఫై. 4.699.57,1546) వారి చాతను ఇప్పించిన (పై. 4.699. 28,1546) మొ. వి. వీటినిబట్టి తాలవ్యహల్లుల తర్వాత ఎ ఏలు ఎ ఏ లుగా (ఈషత్సంవృతంగా) ఉచ్చరించే వారని తెలుస్తుంది. ఇంకా తెలుగు పదాలు కొన్ని: కుచ్చళ్లు (SII 4.709.75,1558), కుచ్చెళ్లు (పై. 4.709. 136,1558) అని రెండు రూపాల్లోనూ ఉండడం గమనార్హం. 5.2 లో అ > ఎగా మారడమూ, ఈ 5,3 లో ఎ < అగా మారడము చూస్తే తాలవ్యహల్లుల తర్వాత అ/ఎ ల భేదం పోయినట్టూ ఆ అ/ఎలకు బదులు ఎ వ్యవహారంలో ఉండినట్లూ చెప్పవచ్చు.

5.4. ఋ, ౠ > రి,రీ/రు,రూ : ఋ,ౠలు రి, రీలుగా. మారినట్టు ప్రాచీనశాసనకాలం నుంచీ కనిపిస్తుంది. ఇట్టి మార్పుతోడివి ఈయుగంలోనూ కనిపిస్తాయి. శ్రింగారభోగ అవసరం ( SII 5.5.8, 1404), వ్రిత్తులు (పై. 5.26.4,1412) మొ. వి. ఋ, ౠలు రు, రూలుగా కూడా మారినట్లు 12వ శతాబ్దినుంచి ఆధారాలు కనిపిస్తాయి.. పిత్రుస్తానము. ( SII 4.1248.9, 1112) మొ. వి. అలా రు, రూలుగా మారినందుకు ఈ యుగంలోనూ ఉదహరణలు చాలా తరచుగా కనిపిస్తాయి. బ్రుందావనం (SII 5.104 12,1428 ), సుక్రుతము (పై. 5.46.24, 1450) మొ. వి. దీనికి విలోమలేఖనం (inverse spelling) లో వ్రాసినవి కూడా చాలా తరచుగా కనిపిస్తాయి. తల్లితండృలకు (పై. 5.47.21,1424)- కాశ్యపగోతృలై (పై. 5.1158.6,1471), సపుతృండైన (పై. 5.1187.4, 4141)మె. వి.

5.5. ఇ ఈ/యి యీ, ఉ ఊ/వు వూ: ఎ ఏ/యె యే, ఒ ఓ/వొ వో:

పై అచ్చులకూ యకార వకార పూర్వకఅచ్చులకూ. భేదం లేనట్లు పూర్వపుయుంగలోనే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ యుగంలోనూ శాసనాల్లో దీనికి చాలాప్రయోగాలు కనిపిస్తాయి. నెఇ (నెయి) ( SII 5.5.6,1404 ), పినబోఇని- (పినబోయిని) (పై. 5.28,5, 1412), ధేనుఉన్ను (ధేనువు) ( పై. 5.29.10,


(10)

146

తెలుగు భాషా చరిత్ర

1402), పోఉవాండు (పోవు) (పై.5. 104.16, 1423) పరచూరన వూరగరణము (పై. 10.586.7,1448), రెండు చేనువూరి దక్షిణ (పై 5.149.10,1402) మొ.వి. పదమధ్యంలో యెయే, వావోలు ఎక్కువగా రావు కాబట్టి వీటకి ఏ ఏలు, ఒ ఓలు వ్రాయబడి ఉండడం శాసనాల్లో కనిపించదు. కాని పదాదిలో ఎ ఏలకు యె యేలు, ఒ ఓలకు వొ వోలు వ్రాయడం పై భేదం లేదనటాన్ని స్పష్టపరుస్తుంది. ఉదా : కోరివల్న యెన్ని దశములకు వచ్చు (SII.10.747.12,1574), పాలు పెరుగులకుంగానై వొక మోదవును (పై. 5.47,20,1424) మొ.వి.

5.6. ఐ,ఔ/అయ్‌, అవ్‌ : తెలుగులో ఐ/ఆయ్‌లకు,.ఔ/ఆవ్‌ లకు వ్యత్యాసం లేదనడం ప్రసిద్ధం కాని తత్సమపదాల్లోని ఐ ఔ లను తెలుభాషలో పూర్వయుగపు శాసనాల్లో అనేకవిధంగా వ్రాసినట్లు కనిపిస్తుంది. పుత్రపౌత్ర అనడానికి పవుత్ర (SII 4.929 10,1068). పైవిత్ర (పై. 6.134,7,1149), పవిత్ర (పై. 6.141.10,1148), (పై. 8.154.8,1152) మొ. వి. కనిపిస్తాయి. ఈ యుగంలో అంత వైవిధ్యం లేకపోయినా కొన్ని రూపాంతరాలు మాత్రం కనిపిస్తాయి. గౌడేళ్వర (SII 5.1165.2,1460), గవుడేశ్వర (పై.5.1153.2, 1470), గఊడేశ్వర (పై. 5.1105.2,1460), కఊసిక గోత్రుండు (పై. 5.1104.10,1455), వైశాఖ (పై. 5.1184.2,1403), వయిశాఖ ( పై. 5.1167.1,414) మొ. వి

5.7. ఇయాంతనామపదాలు పూర్వయుగంలో మూడుమాండలికాల్లో మూడు రకాలైన మార్పులు పొందినట్లు చూచాం. (1) ఉత్తర-ఇయ > య/అ; (2) మధ్య > ఇయ > ఎ (3) దక్షిణం-ఇయ > Φ /ఉ, కాని ఈ యగంలో దీని విషయంలో అంత స్పష్టమైన మాండలికాలు కనిపించటంలేదు. ఉత్తరంలో ఇయ > ఎ కనిపిస్తుంది. మధ్య ఆంధ్రలోనూ-ఇయ/అ వంటి రూపాలు కనిపిస్తాయి.

ఇయ/య. ఇయరూపాలు : గొఱియలు (SII 6.667.22,1422) 6.748.6,1428) విశాఖ.

-య రూపొలు : గొఱ్యలు (పై. 5.1180. 9,1402; 5.1239,11,1418) శ్రీకాకుళం.

పల్యంబులు (పై. 4,1844.7,1470). తూ. గోదావరి.

శాసన భాషా పరిణామం

147

పళ్యాలు (పై. 4.981.6, 1518) గుంటూరు.

పళ్యపన్ను (పై. 6.219.20,1498) గుంటూరు.

-యె రూపాలు :

పళ్యెము (పై. 5.47.17,1424) తూ. గోదావరి.

-ఆ రూపాలు :

విడం పోంకలు (పై, 5.5.7,1404) తూ. గోదావరి.

పళాలు, పళ్ళం (పై. 4,981.6,1518) గుంటూరు.

-ఎ రూపాలు

గొఱ్ఱెలు (గొఱ్ఱెలు) (పై. 5.1184,15,1404) శ్రీకాకుళం.

గొఱ్ఱెలు (పై. 6.656,17,1417) విశాఖ.

గొఱెలు (పై. 6.667.10, 6.887,12,1425) విశాఖ.

తిరుసుట్టు మాలె (పై. 5.94.7.1432) తూ. గోదావరి.

పళ్లెం (పై. 6.694.3,1516) విశాఖ.

పళెం (పై. 6.694.6, 1516) విశాఖ.

పళెము (పై 5.118,12,1438) తూ. గోదావరి.

పళ్లెం, పళ్లెలు (పై. 4.981.6,1518) గుంటూరు.

పై ప్రయోగాల్నిబట్టి చూస్తే నామపదాల్లోని ఇయాంతపదాలు లేక ఎకారాంత పదాలు ఏ ధ్వనితో ఉచ్చేరింపబడినట్లు మనమూహించవచ్చు. ఈ ధ్వనికి వ్రాత లేకపోవడంచేత కొన్ని సందర్భాల్లో య గాను, కొన్నిచోట్ల యె గాను, మరికొన్ని చోట్ల అ గాను వ్రాయ మొదలు పెట్టారు. -ఇయ/- ఎ మార్పు తత్సమపదంలో కూడా జరగడం ఈ యుగంలోని విశేషం. హత్య > హత్తె ( SII 10.745.69, 1530), ఒడయలు శబ్దం ఒడెలు అని వ్రాసి ఉండటమూ గమనించ దగినదే. ఒడెలుంగారు (పై. 10. 748.12,1577).

5.8. విశాఖ- శ్రీకాకుళం ప్రాంతంలో ఈ యుగంలో కూడా అచ్చుల్లో హ్రస్వ దీర్ఘాలు తారుమారౌతాయి. ఆదివరనను (SII 6.709.2,1416) విశాఖ, అలావటం

148

తెలుగు భాషా చరిత్ర

(పై. 6.1101.12,1420 ) విశాఖ మొ.వి. ఇది ఆప్రాంతపు ప్రాకృతభాషా ప్రభావం వల్ల అని చెప్పాలి. త్రికంలో ఉన్న 'ఈ' శాసనాల్లో తరచుగా. 'ఇ' హ్రస్వరూపంలో కనిపిస్తుంది. ఇ నిజోగి ( పై. 6.1076.7, 1416), ఇ కొలువు (పై. 6,777.11,1461) మొ. వి.

5.9. క్‌ > గ్‌ : సుకృతం అనేమాట ఈ యుగంలో చాలా తరచుగా గకారంతో వ్రాయబడి ఉంది. సుగృతంగాను (SII 5. 94.5,1432), (పై. 5.104. 12 1423), సుగృతమగాను (పై. 4 694.7,1425) మొ. వి. అఖండము అనడానికి అగండం అని శాసనాల్లో క్వాచిత్కంగా కనిపిస్తుంది. అగండదీపానను( పై.6.667. 10, 1422) మొ.వి.

5.10. ఙ్ఞ > గ్న : 'ఙ్ఞ' ను పూర్వకాలంలో 'గ్'నగా ఉచ్చారించే వారని డా. చిలుకూరి నారాయణరావుగారు అన్నారు, శాసనాల్లో “జ్ఞ " కు బదులు " గ్న " వ్రాయబడలేదు, కాని “గ్న” కు బదులు “జ్జ " వ్రాయబడింది.ఆఙ్ఞేయభాగం (SII 10. .748.24,1583)మొ.వి. ఇటువంటి రచన విలోమలేఖనాపద్ధతి (Inverse Spelling) అని తీసుకొంటే 'జ్ఞ 'ను 'గ్న'గా ఉచ్చరించే వారని చెప్పవచ్చు.

5.11. చ వర్ణానికి [చ చే] అని రెండురకాలైన ఉచ్చారణ ఉన్నట్లు ముందే చూశాం. ద్విత్వంలో చ్చ కు బదులు త్స వ్రాయడం కూడా దీనికి ప్రబలతార్కాణం అవుతుంది. పత్సలు (పచ్చలు) (తొ. తి. దే. శా. 3.32,1512) మొ.వి.ఉత్సవ అనడానికి ఉచ్చవ అని విలోమలేఖనపద్ధతిలో వ్రాసి ఉండడం కూడాదీనికి ఉదాహరణగా తీసుకోవచ్చు. ఉచ్చవదేవళన్ను ( SII 4. 1344.7,1470 ). మొ.వి.

5.12. ఈయుగంలో శకటరేఫ వ్రాతలో ఉండినా, శకటరేఫకు సాధురేఫకు మధ్యభేదం పోయినట్లే చెప్పవచ్చు. శకటరేఫకు బదులు సాధురేఫ వాడటం ఈయుగంలో గతయుగం కన్నా చాలా తరుచుగా సంభవిస్తుంది. కరియముదు ( SII 5.5.7,1404), విరుగమొత్తి (పై. 5.26.4, 1412), మనుమరాలు (పై.5.1248.15,1471), తాటిపరు (పై. 4.800.5,1513) మొ. వి. ఒక్క చెఱు వు శబ్దమే తీసుకొన్నా కూడా చెర్వుకింద ( పై. 686.44, 1580,4.702.104,1518), చెరువుగట్టించి (పై. 4.702.108,15180), చెరువులు ( పై. 4.709.43,1558)

శాసన భాషా పరిణామం

149

అని పలుసార్లు శకటరేఫకు బదులు సాధురేఫ కనిపిస్తుంది. అంటే చెఱువు (పై. 4.702.124,1518) మొ.వి. కేవలం వ్రాతలో మాత్రం నిల్చిఉ౦దనీ ఉచ్చారణలో ర ఱ ల భేదం పోయిందనీ చెప్పవచ్చు.

5.13. పదాది హల్లుతో రేఫ సంయక్తమై ఉంటే అట్టి సందర్భంలో రేఫకు లోపం జరగడం కిందటి యుగంలోనే చూశాం (4+14),కాని ఈ యుగంలో ఈ లోపం చాల తరచుగా సంభవిస్తుంది. ఉదా. కొత్తయింటికి (SII 4.711.81, 1593), పెగ్గడ (పై. 6.1027.8,1415) మొ.వి. ఒక్క క్రింద శబ్దమే తీసుకొన్నా అనేక ప్రయోగాలు కనిపిస్తాయి. చెఱువు కింద (పై 4.702.121,1518), కిందిదమడి (పై. 4.702.128,1518), చెర్వుకింద వరిమడి. (పై.4.702.240, 1518), చెర్వుకింద (పై. 4.686.14,1580), నగరి కింది (పై. 5.86.20,1422), పినచెరువుకిందను (పై.10.785,18,1524)మొ. వి.

5.14. దీర్ఘం తర్వాత యకారానికి ద్విత్వమున్ను దీర్ఘానికి హ్రస్వమున్ను కావడం శాసనభాషలో తరుచుగా కనిపిస్తుంది. ఇట్టివి ఇంతకు పూర్వపుయగంలో తరచుగా తత్సమపదాల్లోనే కనిపిస్తాయి. తృతియ్య, రమణియ్య మొ. వి. నేయి, వేయి మొదలగు దేశిపదాలు నెయి, వెయి అని హ్రస్వయక్తరూపాలు తరచుగా కనిపిస్తాయి. కాని నెయ్యి, వెయ్యి వంటి రూపాలు క్వాచిత్కంగా కనిపిస్తాయి. తక్కిన దేశిపదాల్లో ఇట్టి మార్పు అరుదుగా కనిపిస్తుంది. కాని ఈ యుగంలో దేశిపదాల్లోనూ పై మార్పు తరచుగా కనిపిస్తుంది. పొయ్యం గలారు (SII 6.817.16, 1408), ఇయ్యంగలారు (పై. 6.817.19,1480), చెయ్యంగాను (తె.శా. 1,156. 8,1551), చెయ్యక (SII 4.659.10,1485) మొ.వి.

5.15. నాయుండు, బోయుండు శబ్దాల్లోని మధ్యఅక్షరానికి లోపం శాసనభాషలో సర్వసహజంగా కనిపిస్తుంది. బోయ శబ్ధానికి బహువచన ప్రత్యయం పరమయేటప్పుడు యకారలోపం అతి ప్రాచీన శాననాల్లోనే కనిపిస్తుంది. ఉఱుటూరిబోళ రెండుట్టియు, బోళచేత శవణగొణిరి. మొ.వి. బహుత్వం పరమయ్యేటప్పుడు గుంటూరు, గోదావరి మధ్యశాసనాల్లో యకారం తప్పనిసరిగా లోపించి, నెల్లారు శాసనంలో లోపించని రూపంకూడా కనిసిపించడంచే (బోయలన్-ధర్మవరశాసనం) ఈ లోపం గుంటూరు, గోదావరి మధ్యంలో ప్రారంభమైనట్లు చెప్పవచ్చును. 11వ శతాబ్దం నుంచి ఏకవచనరూపమైన బోయుడు శబ్దంలోను యకారం లోపించి బోండు అని శాసనప్రయోగాలు కనిపిస్తాయి . నాయుండు అనే శబ్దం ప్రాచీన శాసనభాషలో కనిపించకపోవడంచేత ప్రాచీనకాలంలో ఇందలి యకార లోప విషయం తెలియదు. కాని 12వ శతాబ్దిలోనే నాయుండు అనడానికి బదులు నేండు/ నీండు అనే రూపాలు కనిపిస్తాయి. కాపినేనికి (SII 10.207.4,1198), కొమ్మ నిండు (పై.6.1020 7,1184) మొ.వి. కాబట్టి 12వ శతాబ్దికి పూర్వమే ఇందులోనూ పదమధ్య యకారం లోపించిందని చెప్పవచ్చు. ఇందులో మరోవిశేషం ఏమంటే నాయుండు > నాండు కాక నాయుండు > నీండు/ నేండు అయింది. అనగా యకారంలోని తాలవ్య ప్రభావం వల్ల నా > నీ/నే అయిందని చెప్పాలి.

నాయుండు, బోయుండు శబ్దాల్లోని యకారలోపం 12వ శతాబ్దికి పూర్వమే జరిగినా యకారం తోడి రూపాలు కూడా 16వ శతాబ్దిదాకా విరివిగా కనిపిస్తాయి. యకారంపై ఉకారం ఇకారం కావడం 12వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దిదాకా చాలా తరచుగా కనిపిస్తుంది. సింగనబోఇండు (SII 5.1165.18,1460), ఎలబోఇండు (పై. 6.748.5,1428), ఘుఘ్ఘలు నాఇండు (పై. 6. 1094.6,1415), మొ. వి. ఇలా పదమధ్యంలోని యు > ఇ కావడం ప్రస్తుతయుగం మరీ ప్రచురంగా ఉండిందనడానికి ఈ కింది ఉదహరణ ప్రబల తార్కాణ అవుతుంది. (మాముళు) సేఇ మని వారికి యిచ్చి (= చేయుమని) (పై. 4.711.16,1598).

5.16. యి>హి : పదమధ్యంలోని యి > హి కావడం పూర్వయుగంలోనే చూశాం. అలాంటివి ఈయుగంలో అంత తరచుగా కాకపోయినా క్వాచిత్కంగానైనా కనిపిస్తాయి. ఆచందార్క స్తాహిగా (SII 5.1194.14,1455) మొ. వి. పూర్వ యుగంలో (4.18) బంగారు, బంగారు నాణేలు అర్థంలో పహిండి, పైండి, పయిడిం అనే రూపాల్ని చూశాం గాని పసిండి అనే రూపం కనిపించలేదు. 11వ శతాబ్దికి తర్వాత శాసనాల్లో ఉన్న పసిండి అనే రూపం ఈ యుగంలోనే కనిపిస్తుంది. (పై.5.134.9,1415). ఈ యుగంలో కూడా పహిండి, పయిండి, అనే రూపాలే విరివిగా కనిపిస్తున్నాయి. పహిండి రసన (పై. 6.1187.7, 1414), పహిండి గుడి (పై. 10.577.47,1410), పహిడి ( పై. 6.1248.30,1471.), పైండి పటికము (పై. 6.886.10,1421), పైడి (పై. 6.696.6,1219), పఇండి (పై. 6.709.9,1416), పయిండి కుండలు (పై. 4.702.104,1518). అమృతమణి శబ్దానికి సింహాచలంశాసనాల్లో తరుచుగా హి చేరడం ఈ యుగపు శాసనాల్లో ఒక విశేషం. అమృతమణిహి ( SII 6.827.11,6,778.8, 1427, 1415, 6.966.3, 1421) మొ.వి. హి చేరని రూపం అమృతమణి (పై. 6.1054.8, 1461, 6.727.8, 1465) మొ.వి.

హిందువులు అనే పదం ఒకచోట ఇందులు (తె శా. 1. 56.1,1551) అని ఉండటం మరొక్కవిశేషం.

5.17. పదమధ్యమందలి వకారం మకారం కావడం ఈ యుగపు శాసనాల్లో క్వాచిత్కంగా కనిపిస్తుంది. తిరుమజాము ( < తిరువజాము<తిరువర్థజాము) (SII 6.1085.7,1428), హేమలంబి (పై. 66.08.8.1580), దేమున్కి ( < దేవునికి NI 8 పొదిలి 14.29,1517)

తాలవ్యాచ్చులు పరమవుతుండగా వకారం యకారం కావడం తెలుగులో పూర్వ యుగంలోనే కనిపిస్తుంది. కయిలలు (<కవిలలు) (SII 5.1347.10,1098:5 1348.11,1098). ఈ యుగంలో అట్టివి క్వాచిత్కంగా కనిపిస్తాయి. ఉదా : ఇదీపం బెలుంగును ( < వెలుంగను) ( పై. 6.1024.8,4416), ఇండ్లపొది (< విండ్లపొది) (పై. 6.770.8,1408), గోఇందు నాఇని కొడ్కు ( < గోవిందు) పై.6.1104.18,1420)

5.18. తాలవ్యాచ్చులు పరమైతే సకారం శకారంగా వ్రాయడం 13వ శతాబ్ది నుంచి చాలా తరచుగా కనిపిస్తున్నట్లు ముందే తెలుసుకొన్నాం. ఈ యుగంలోనూ అట్టివి చాలా తరచుగా కనిపిస్తున్నాయి. వల్లభదాశి లేస్తేచేశి (SII. 5.24.9,1401) పుట్టె౦డేశి...పందుమేశి (పై. 5.26.7,1412); చేశెను (పై. 5.37.40,1494). ఈ యుగంలో మరో విశేషం ఏమంటే ఈ స < శ మార్పు జరిగాక దాని పైన ఉండే ఎ ఏలు, అ ఆలుగా మారుతాయి. శలవు దయచేస్తేను (పై. 10.751.22, 1598), శలవు ఇచ్చి (పై. 10.751.21,1598), సమర్పణచేశను (పై.6.1073. 12,1402), శావ సేసిది (పై. 10.747.17, 1574), శావకు (పై. 10.747,19, 1574), దశిమి శావలకు (పై. 10.747.9, 1574) మొ. వి. దీన్ని బట్టి ఈ యుగంలో తాలవ్యహల్లులపై నుండే ఏ ఏలు ఎ ఏలుగా ఉచ్చరించబడేవని స్పష్టపడుతుంది. (చూ. § 5.3). ఇలాంటి ఉచ్చారణ పూర్వయుగంలోనే ప్రారంభమైనట్లు కూడా చూశాం. 152 తెలుగు భాషా చరిత్ర

5.19. ద్విత్వానునాసికాలముందు ఈ యుగంలో చాలా తరుచుగా అనుస్వారం కనిపిస్తుంది. కాచంన్నందారు ( SII 5.29.8,1402). పుచుకొంన్న గ్రామాలు (పై.6.695.2.1519), దుంన్ని (పై. 10747,10,1574), వొ౦మ్మెచ్చు (తి.తి. దే. శా. 3.38.4, 1512), తిరుమలంమ్మవారు (పై. 9.59,8,1512) మొ.వి. ద్విరుక్తాలు అద్విరుక్తాలు కావడం పూర్వశాననాల్లోనూ ఈ యుగవు శాసనాల్లోనూ తరచుగా సంభవిస్తుంది. ఈ యుగంలో మూర్ధన్యాక్షరాల్లో ద్విరుక్తం అద్విరుక్తం కావడం చాలా తరచుగా కనిపిస్తుంది.

ద్విరుక్త రూపాలు

సోమారెడ్డి (SII 5.10.5.1404), పెరుమాళ్లకు (పై.5.14.8,1408), ఇంత పట్టు (పై 5.5 8,1404), పుట్టెండేశి (పై. 526.7,1412), సంభాళ్ల (పై. 5.1248.11,1471) మొ.వి.

అద్విరుక్త రూపాలు

సోమారెడ్డి (SII 5 5–10,1404), పెరుమాళకు (పై. 5.10.4,1404). ఇంతపటు (పై. 5.26.18,1412), పుటెండున్న (పై. 5.244,1401), సంబాళ (పై. 5.1248.12.1471); పళెమున్న (పై. 5.29.10,1402) మొ. వి. ఇవిగాక చకారంలోనూ ఇట్టి పరిణామం కనిపిస్తుంది. ఇచి (ఇచ్చి) (SII 5.90.15,1403), పుచుకొన్న (పై. 6.695.2,1519) మొ.వి. శ్రీకాకుళం-విశాఖ శాసనాల్లో ద్విరుక్తాలకు బదులు అద్విరుక్తాలు వాడడం మరీ తరుచుగా కనిపిస్తుంది.

2.20. జ్యేష్ఠమాస మనడానికి శ్రేష్ఠమాసమను సామ్యోత్పత్తి రూపం (folk etymology) పూర్వయుగంలోను ఈ యుగంలోను క్వాచిత్కంగా కనిపిస్తుంది. శ్రేష్ఠ (SII 5.109.3,1428) మొ.వి.

5.21. అనుధాతువుకు అకారంతో ప్రారంభమయ్యే ప్రత్యయంచేరగా నా-అని వర్ణవ్యత్యయరూపం ఏర్పడ్డ (అను+అ- > నా-) సాహిత్యభాషలో తరుచుగా కనిపిస్తుంది. అనవుడు > నావుడు, అనన్ > నాన్ ఈ యుగంలో అనుధాతువు విశేణ

రూపమైన అనే అనుశబ్దంలోనూ మొదటి ఆకారం లోపించడం కనిపిస్తుంది. తిరు

శాసన భాషా పరిణామం

153

పతినే ఊరి (57 5.102,8,1449). ఇక్కడ జరిగింది వర్ణవ్యత్యయం వల్హ అనిధ చెప్పటంకన్నా అనన్‌ > నాన్‌, అనపుడు > నావుడు సామ్యంతో అనే > నే అని ఏర్పడిందని చెప్పవచ్చు.

  5.22. డ్ల సంయుక్తరూపం ళ్లగా మారడం పూర్వయుగంలో చాలాతీవ్రంగా జరిగింది. ఈ యుగంలో డ్ల రూపం దాదాపు ళగా మారిపోయిందనవచ్చు. మామీళు౦మ్న, మారేళు౦న్ను, నేరేళు౦న్ను (SII 10,787.44,1526),  దేవుళు (పై. 6.694.3,1516), నీళు (పై. 6.699.7,1535), (నంబ్యాళు) (పై. 6.709.13, 1416), మాళు (మాడలు) (పై. 6.731.1406) మొ.వి. (ళ్ళ > ళ కావడానికి 5.19. చూడండి). ఇలా డ్ల > ళ్ల పూర్వయుగంలోనే దాదాపు పూర్తికావడంచేత ఈ యుగంలో కొత్తగా సంధిగతమైన డ్ల రూపాలేర్పడటం లేదు. అంటే ల్‌ + ల > డ్ల, ర్‌ + ల > డ్ల వంటి మార్పులు జరగటంలేదు అని చెప్పాలి. తూర్చు పడమర్లు (SII 4.789. 227, 4518), దేవర్లకున్ను (పై.10 677.48,1410), హరాంభోర్లు (పై 10.751.19,1598) మొ.వి. డ్ల తోడి రూపాలు ఈయుగంలో చాలా  క్వాచిత్క౦గా కనిపిస్తున్నాయి. గుడ్లు కట్టించి (పై. 10,749.16,1583) మొ వి.

సంధి

5.23. సంధివిషయంలో పూర్వయుగంలో లాగానే ఈ యుగంలోనూ ఏ నియమం లేకుండా రెండచ్చుల మధ్య యడాగమం రావచ్చు, రాకపోవచ్చు. లేదా సంధి జరగవచ్చు. అముదులు నాలుగు యింతవట్టు (SII 5 5.8,1404), విచ్చేశి వుదయగిరి (పై. 6.248.12, 1515); పఱచూరను వూరగరణము (పై. 10. 586 7,1448), కొలుపు ఒకటి (పై 6.710.6,1409), కాంచనం గారజునుండు (గారిఅనుజుండు), (తె.శా. 1.178.5,1482) మొ.వి. గసడదవాదేశ సంధి పూర్వయుగంలో లాగానే జరిగినా జరగవచ్చు, జరక్కపోయినా పోవచ్చు. ఘడియారము పెట్టి (SII 5.10.5,1404), పందు మేశిసేనున్ను (పై. 5 26.7,1412). ద్రుతము మీది కచటతపలు గజడదబలు కొనిచోట్లు చాలా ఉన్నాయి. ఉదా : అప్పములకు బియ్యంను తిరుబోనములో పవుపెసలును పిండివంటకు (పై.5.5.4,1404) మొ.వి. 154 తెలుగు భాషా చరిత్ర

నామవదాలు

5.24. ఈ యుగపు కృత్తద్ధితాంతాల విషయంలో అట్టె విశేషాలు లేవు. కాని ఎరువుమాటల విషయంలో ఈ యుగంలో ఒక నూత్నదశ అవతరించింది. అంటే ముస్లిం రాజ్యాలు ఈ యుగంనాటికి స్థిరపట్టంచేత దక్కనీ ఉర్దూనుంచి అనేక పదాలు ఈ యుగంలో తెలుగులోకి వచ్చాయి. వాటిలో కొన్ని ఉదాహరణలు : మహం (మాసం), (SII 10.758.5. 1580),సులతాని (పై. 10.748. 6,1580), దరివేనులు (సాధువులు) (పై. 10.748.15, 1580), ఠాణేదార్ (పై.10.745.12, 1587), హవాలాదారు. (సైన్యాధిపతి) (పై. 10.748.2,1577), సహాయబు(పై 10.748.28, 1577), హజరతి(గౌరవనీయలు) (పై. 10.751.9, 1598), నామజాదు (పై. 10.751.10,1598), ఖబురు (పై. 10.751.28,1598), మక్తా (పై. 4.711.29,1598), నఫరు (పై. 4.711.26,1598) మొ.వి. ఇవిగాక ప్రాకృత భాషనుండి వచ్చిన దఇబడలు (దధివడలు) (పై. 6.1040. 6,1417) మొ.వి. ఈ యుగంలోని వింత ప్రయోగాలు.

5.25. సమాసం: సమాసాల విషయంలోనూ ఈ యుగంలో చెప్పుకోదగ్గ విశేషాలు లేవు. చాలావరకు పూర్వయుగంలో లాగానే ఉంటాయి. వూర్వయుగంలో కనిపించిన తిరువజాము మొదలయిన రూపాలు ఈయుగంలో క్వాచిత్కంగా కనిపిస్తాయి. తిరవజాన (SII 8.1107.5,1414), తిరుమజామ (పై. 6.1085,7, 1428) మొ. వి. ఇలుపట్టు మొదలై న రూపాలుకనిపిస్తాయి. (పై. 5.14. 9,1410), గతయుగంలో నీరినేల, నీరునేల అని రెండు రూపాలు కనిపిస్తాయి. కాని ఈ యుగంలో నీరునేల రూపం మాత్రం కనిపిస్తుంది. అన్నందమ్ములు (పై. 6.1184. 14,1408). ఇది బహుశా ఊరుంగాయెలు (పై. 5.981.7, 1518) మొదలయిన సమాసరూపాల సామ్యంవల్ల ఏర్పడి ఉండవచ్చు. మాతాపితాళ్ళు (పై. 6.219.25, 1494), తల్లిద౦డ్రాదులకు (పై. 5.87.85,1494) వంటి ద్వంద్వస మాసరూపాలు ఈ యుగంలో క్వాచిత్కంగా కనిపిస్తాయి. ఇందు మాతా పితాళ్ళ రూపం ఎక్కువసార్లు కనిపిస్తుంది.

5.26. లింగ ప్రత్యయాలు : మహత్తులో-న్హు ఈయుగంలో.. బొత్తుగా కనిపించదు. -౦డ్రు. -డు అన్ని మాండలికాల్లోనూ స్థిరపడినట్లే. ఈ-ంతు ప్రత్యయందఖనీ ఎరువు మాటల్లోనూ చేరుతుంది. ఉద్దండభానుండు (SII 6,248.22. శాసన భాషా పరిణామం 155

1515), ద్రోహి అనే మాటలో ఒక్కచోట -౦డు కనిపిస్తుంది. ద్రోహిండు (పై 6. 1054.18,1461). ఇది బహుశా బోహిండు, నాహిండు శబ్దాల సామ్యంవల్ల, వచ్చి ఉండవచ్చు. నాయుండు, బోయుండు. శబ్దాలకు నాహిండు,బోహి౦డు అని వ్రాయడం శాసనాల్లో చాలా కనిపిస్తుంది మహతీవాచక శబ్దాలకు _రాలు ప్రత్యయం కనిపిస్తుంది.

5.27. వచనం ; పూర్వయుగంలో 'డలర'లతో బహవుచన లకారం కలిస్తే డ్ల సంయుక్రమయి, ఆ 'డ్ల' సంయుక్తం 'ళ్ల' గా మారుతూ వచ్చింది. కాబట్టి ఆయగంలో బహుత్వంలో డ్లు, ళ్ళు రెండు రూపాలూ చూచాం. గత యుగంలోనే అంతిమదశలో డ్లు > ళ్లు మార్చు దాదాపు పూర్తికావడంచేత ఈయుగంలో -ళ్లు రూపమే కనిపిస్తుంది. దేవళ్లు (SII 10.748.8,1583) ఆడువాళ్లు (పై. 5.102.4,1442), కవుళ్లు (పై. 4 711.14, 593), మామీళుంన్ను మారేళుంన్ను నేరేళుంన్ను (పై. 10.637.44,1526), నంబ్యాళు (పై.6.308.13,1416), దేవుళు (పై 6.694.3, 1516), నీళు (పై. 6.889.8, 1535) మాళు (పై.6.731.7,1406) మొ.వి. -డ్లు రూపం చాలాక్వాచిత్కంగా కనిపిస్తుంది. గుడ్లు గట్టించి (పై. 10.749.18,1588), అమృతపడ్లకు (NI 3. పొదిలి 14.7,16th century).

ఇంకొక్కవిశేషం ఏమంటే దీర్ఘాచ్చు తర్వాత -ండుతో అంతమయ్యేపదం ఉంటే ఆ -౦డుతో -లు సంయుక్తమవుంది. ఏండు-ఏండ్లు (సంవత్సరాలు) (SII 5.87.46,1494), అయినవాండ్లు (పై. 10.751,23,1782), యక్కడివాండ్లు (పై. 10.751.24.1592) మొ.వి.

రాత్రి అనే తత్సమపదానికి రాత్రిళ్ళు అనే బహువచన రూపం పూర్వయుగంలోనే కనిపించింది. ఈ యుగంలో రాత్రిళ్ళు అనే ఒక రూపం కనిపిస్తుంది (SII 5.1105.15,1460), ఱాయి శబ్దానికి పూర్వయగంలో ఱాలు అనేది బహువచన రూపం. కాని ఈ యుగంలో రాళ్ళు అనే రూపం కూడా కనిపిస్తుంది (పై. 4.789.210,1518). కూతురు శబ్దానికి కూతులు, కూతఱ్లు అని రెండు రకాలయిన బహువచనరూపాలు కనిపిస్తున్నాయి.కూంతులు (పై. 6.668.17,1437), కూతుఱ్లు (పై 6.954,7,1441).

గౌరవార్థ ప్రత్యయాలు : సాదారణ బహువచన ప్రత్యయాలు గౌరవార్థంలో 156 తెలుగు భాషా చరిత్ర

చేరుతాయి. చక్రవర్తులు (SII 6.667.17, 422), దేవులు (పై. 5.34.11, 1484), సంబ్యాళు (పై. 6.709.18,1426) మొ.వి.

గతయుగంలో లాగానే -గారు, -వారు ప్రత్యయాలు కూడా విరివిగా కని పిస్తాయి. పాతృలంగారు (SII 6.219.15,1494), పంచాననవారు. (పై. 6.219, 19,1494), పోతినేనింగారు (పై.6.242 10,1427). అమ్మవారు (పై. 6.248. 36,1515) మొ. వి. -రు అంతమందున్న బహువచనరూపాలకు తరచుగా మరో బహువచన ప్రత్యయమైన -లు చేరుతుంది, అమంగారులు (పై.10 587. 45,1410), అమ్మంగారులు (పై 10 577.10,1410) మొ.వి.

5.28. ఔషవిభక్తికరూపాలు : మహద్వాచక రూపాల్లో _డు లోపించి -ని చేరిగాని, చేరకగాని విభక్తి ప్రత్యయాలు చేరడం కావ్యభాషలో సహజం. కాని, -డు లోపించకుండానే -ఉ చేరిన రూపాలకు విభక్తి ప్రత్యయాలు చేరిన రూపాల్ని పూర్వయుగంలోనే కొన్నింటిని చూశా౦. అట్టివి ఈ యుగంలో మరికొంత ప్రచు రంగా కనిపిస్తున్నాయి. శ్రీకూర్మనాథుడి సంముఖమందు (SII 5.1172.9, 1427), ఓభళబోయడి గోచరానను (పై. 5 1162.11,1427), దేవుడికి (NI 3 పొదిలి 19.10.1689). బ్రాహ్మణి జంపిన దోషానం (>బ్రాహ్మడిని) (SII 10. 745.61,1530), బ్రంహ్మేశ్వరుంణ్ని (పై. 10.749.10, 1588); పాపవి నాశరేశ్వరుంణ్ని (పై. 10.749.10,1583), గోపీ నాధుండ్ని (పై. 10.749. 39,1589), చన్నకేశ్వరరాయన్ని ప్రతిష్టసేయించి (రాయణ్జి > రాయన్ని. (NI 3, రాపూరు 41.18, 1585)

బహువచన ప్రత్యయం తర్వాత -అ అనే ఔపవిభక్తికప్రత్యయం చేరేట్టు పూర్వయుగంలోనే చూశా౦, ఈ యుగంలో తరచుగా కనిపించే -ళు రూపం పైన కూడా దీన్ని చూడవచ్చు. తమ్మి సంబ్యాళచేత (SII 6,710.8,1409) మొ వి. మిగిలినవాటి విషయంలో గతయుగానికి ఈ యుగానికీ తేడా అట్టె కనిపించదు. -టితో అంతముయ్యే ఔపవిభక్తిక రూపాలకు బదులు -ఇంటి చేరడం పూర్వయు గంలోనే కనిపించింది. ఈ యుగంలోనూ అట్టివి తరచుగా కనిపిస్తాయి. పగలు- పగలింటి (పై. 6.737.7,1465) మొ. వి.

5.29. ద్వితియావిభక్తి : నామపదాలు అలాగే మార్పు లేకుండా ప్రథమా రూపాలుగా వస్తాయి. ద్వితీయారూపాల విషయంలో అట్టే విశేషాలు లేవు. కాని శాసన భాషా పరిణామం 157

డు మంతరూపాల్లో డుజువై -ఇ చేరగా వానిపై -ని చేరి ద్వితీయారూపం కావడం ఈ యుగంలో తరచుగా కనిపిస్తుంది. బ్రహ్మేశ్వరుంణ్ని (SII 10.749 24,1583), (-డి -ని చేరి ణ్ని అవుతుంది). బ్రాంహ్మణి (పై. 10.745.61,1530) మొ. వి.

5.30. తృతీయావిభక్తి : పూర్వయుగంలో పద్మశాసనాల్లో మాత్రం కనిపించిన-మెయిన్ ప్రత్యయం ఈయుగంలో కనిపించదు. ఈయుగంలో కనిపించేవి ఈ కిందివి.

(అ). చేతన్‌, చేన్‌ తోడన్‌, తోన్‌,

చేతన్‌, చేన్‌ : పూర్వయుగంలో ఈ ప్రత్యయాలు సాధారణంగా గ్రహ్యార్దంలోనే కనిపించేవి. కాని ఈ యుగంలో ద్వారా అనే అర్ధంలోకూడా కనిపిస్తాయి. దేవరలకు నిత్యకృత్యముగాను వొడాడదేవనచేతను యెత్తించి (SII 5.14.4,1410), చిన్నాదేవమ్మ చేతచు రత్నమహాదానమున్ను తిరుమలదేవి అమ్మవారి చేతను సప్తసాగర మహాదానమున్ను సేయించ నవధరించి (పై. 6.248.33,1515) చె > చా మార్పుచేత ప్రత్యయానికి చాత అనే రూపం కూడా తరుచుగా కనిపిస్తుంది. తమ దేవుళు చింనాదేవంమంగారి చాతాను సమర్పించిన పదకం (పై.6.694.3,1516), ప్రతాపరుద్రగణపతి మహారాయల చాతను పుచుకొంనగ్రామాలు. (పై 6.695.2, 1519) మొ. వి

తల్లి సూరాంబచే సముత్ప [౦]న్న మగుచుం బరగు(పై.10.582.6,1415), జలక్షేత్రము వీరిచే వృతింగాబెటేను (పై 6.1061,5,1374) మొ.వి.

(ఆ) తోడన్‌, తోన్‌ : ఈ ప్రత్యయాలకు ఈ యుగంలో ప్రయోగంచాలా తక్కువ. ఇవి సహార్థంలో ప్రయోగింపబడతాయి. ఊరుంగాయలతోడను ఆరగించి (SII 4.981.7,1518), అన్మతోయుజ 14 గంగుతోయ జ 168 నున్న కాముతో...(పై. 5.26.5,1412) ఇక్కడతో కళగా కనివెస్తుంది. అందులోను ఇది సంప్రదానంలో ప్రయోగింపబడి ఉంది. ఈ తోడ శబ్దం సమాస గతమైనప్పుడు తోడి అనడం సహజం. కల్యాణవేదితోడి శిలామండపం (పై. 5.113.58,1416). కాని ఈ యుగంలో తోటి అని ఆధునికరూపం మొదటి సారిగా కనిపిస్తుంది. 158 తెలుగు భాషా చరిత్ర

ఖండికలతోటి మరియాదా (SII 3.1168.32, 1434 ), మణీకలా తోటి సమస్య (పై. 6.1098.17,1402) మొ. వి.

5.31. చతుర్ధీ విభక్తి : కొఱకు ప్రత్యయం పూర్వయుగంలో చాలా క్వాచిత్కంగా కనిపించింది. కాని ఈ యుగంలో చాలా తరచుగా కనిపిస్తుంది. ఇది ఎప్పుడూ గుణవాచకాలపైనా, క్రియావాచకాల పైనా కనిపిస్తుంది. ఆయష్యాభివృద్ధి కొఱకుంన్ను (SII 5.1158,8. 1471), అక్షయఫలంకొఱకు (పై. 5,1228.10,1503), గుగ్గిలము వెట్టికొఱకై (పై. 5.129.4,1422), వెలింగిడి కొఱకై (పై.5.1184.42,1480) మొ.వి.

5.32. పంచమీవిభక్తి : చేతన్‌, వలనన్‌లు పూర్వయుగంలో లాగానే గ్రహ్యార్థంలో వస్తాయి. చేత ప్రత్యయం సాధారణంగా మానవాచకాల మీదను, -వలన ప్రత్యయం క్లీబవాచకాలమీదనూ వస్తాయి. సూరాజోస్యులచేతను సదాశివుని చేతను క్రయలబ్ధమైన (SII 5.48, 12,1450), స్తానమువారి చేతంగొన్న (పై.5.149.8,1402) మొ.వి. కోరివల్న యెన్ని దశములకు వచ్చును (పై. 10.747.12,1574) మొ.వి. -నుండి, -దనుక గమనార్థంలో వస్తాయి. వుంపున నుండి వ్యాయవ్యానకు (NI 8 ఒంగోలు 71.48.1517), కొండవీటి దనకాను. విరుగంబొడిచి (తి. తి. దే. శా. 8,68,1514), మొ.వి. నుండి శబ్దం వల్లకు పరమై కూడా వస్తుంది. ఏలానది వల్లనుండి (SII 5.3781, 1491) -లోను నుండి అని కూడా కనిపిస్తుంది. భూమిలోననుండి (పై. 4.889.228, 1518).

షష్టి, సప్తమీ విభక్తుల విషయంలో విశేషాలేమీ లేవు.

సంఖ్యావాచకాలు

5.33. ఒకటి : గతయుగంలో ఒకండు, ఒకటి రెండు రూపాలూ పర్యాయంగా కనిపిస్తూ 14వ శతాబ్దిలో ఒకటి శబ్దమే బహుళంగా ఉన్నట్టు చూశా౦. ఈ యుగంలో ఒకటి శబ్దం స్థిరమైపోయినట్టు చెప్పవచ్చు. ఒకండు శబ్దం తూ.గో-విశాఖ ప్రాంతంలో మాత్రం క్వాచిత్క్మంగా కనిపిస్తుంది. ఒకడు (SII 6.825.9, 1416, 6,1045.5, 1405) సింహాచలం, విశాఖ; ఇరువయ్యొకండు మోదాలు (పై. 4.1378.10, 1416) దాక్షారామం, తూ. గోదావరి. శాసనభాషా పరిణామం 159

5.34. నాలుగు : నాలుగు శబ్దానికి నాలు అనే రూపం కూడా విశాఖ- శ్రీకాకుళం ప్రాంతంలో ఉన్నట్లు గతయుగంలో చూశాం. ఈ యుగంలోను అట్టి రూపం ఆ ప్రాంతంలో కనిపిస్తుంది. నాలుకుంచాలు (SII 6.1057.9, 1514) సింహాచలం : నాలుపుట్లు (పై.6.1040.9, 1417) సింహాచలం : విశ్యలు నలు (పై. 5.1239.12, 1418) శ్రీకూర్మం.

5.35. ఐదు : ఐదు శబ్దానికి పూర్వయుగంలో ఐదు, ఏను అనే రెండు రూపాలూ వ్యాప్తిలో ఉండి రానురాను ఐదు శబ్దం ప్రచారానికి వచ్చి ఏను శబ్ద౦ తగ్గుతూ వస్తున్నట్లు చూశాం. ఈ యుగంలో ఐదు శబ్దం అన్ని ప్రా౦తాల్లో స్థిరంగా నిల్చినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఏను శబ్దం విశాఖ-శ్రీకాకుళం ప్రాంతంలో మాత్రం క్వాచిత్కంగా కనిపిస్తుంది. ఇరువఇ ఏనుపుట్లు (SII 5.1199.5, 1451) శ్రీకూర్మం ; ఇరవై యేనుట (పై. 6.844.16, 1472) సింహాచలం.

5.36. పదికి ఒకటి,మూడు,నాలుగు, ఎనిమిది చేరేటప్పుడు గతయుగంలో -ఉన్ - ప్రత్యయంగాని లేదా కేవలం -న్ - గాని చేరినట్లుు చూశాం. -న్- ప్రత్యయం ద్రుతంవలె ఉంటే ఉంటుంది, లేకపోతే కనిపించదు. ఉదా: -ఉన్- తోడివి పదునెనిమిది, మొ.వి. -న్- తోడివి - పదినెనిమిది, పదియెనిమిది మొ.వి. ఈ యగంలో -ఉన్న - ప్రత్యయం స్థిరపడినట్లు చెప్పవచ్చు. అనగా -న్ -మాత్రం చేరడం ఈ యుగంలో లేదు. పదునాలుగు (SII 6,219.12 1494) మొ.వి. పదునొకండు శబ్దానికి పదునకొండు అని 13వ శతాబ్దిలో ఒక ప్రయోగం కనిపిస్తుంది. పదునకౌండు (తె.శా. 141.8, 1231). ఈ యుగంలో ఒక్కచోట ఇలాంటిది కనిపిస్తుంది. పదున[కొ]౦డు (SII 4.1375.18, 1444) ఇందులో ఉకారం అకారం కావడం విశేషం.

5.37. ఇరువది, ముప్పది మొదలగు సంఖ్యావాచకాల్లో చివర ది > యి మార్పు గతయుగంలోనే వేగంగా జరుగుతూ ఉండింది. ఈ యుగంలో ఈ మార్పు పూర్తిఅయి స్టిరపడినట్టు తెలుస్తుంది. అయినా -ది అంతంతో కొన్ని రూపాలు ఈ యుగంలోనూ కనిపిస్తున్నాయి. ఏ౦బది (SII 6.865.7, 1403), మూన్నూట ముప్పది యేడు (పై. 10.582.1, 1415) మొ.వి.

5.38. ఇరువది, ముప్పది శబ్దాలకు ఏను శబ్దం చేరగా ది > డి గా మారడం పూర్వయుగంలో చూశా౦. పూర్వయుగంలోనే అంతిమదశలో ఈమార్పు తగ్గి 160 తెలుగు భాషా చరిత్ర

పోవడం చూశా౦. ఈ యుగంలో ఈ మార్పుతో ఉన్న రూపం ఒక్కచోట మాత్రం కనిపిస్తుంది. ఇరువదేను మోదాలు (SII 6.663. 11,1132) సింహాచలం-విశాఖ.

5.39. నూఱు శబ్దానికి అంతకంటె చిన్న సంఖ్యను చేర్చునపుడు 'ఱు' కు ఐదులు 'లు' కావడం తెలుగుభాషలో సహజం. కాని ఈ యుగంలో 'లు'కు బదులు -ంట సర్వత కనిపిస్తుంది. నూంట యెనుమండ్రకు (SII 6.248.42,1515), నూంటపది (పై. 6.743.6,1428), వేయి మున్నూంట ఇరవై యేడు (పై. 10. 573.36,1405), నూ౦ట యెనంభది (పై. 6.805.27,1472), మూన్నూ౦ట ముష్పదియేడు (పై. 10 582.1,1415), నూంట ఇబ్బరకున్ను (పై. 10.737, 60,1526) మొ.వి. ఇట్టివి గతయుగంలోనూ క్వాచిత్కంగా కనిపిస్తాయి. కాని 12-14వ శతాబ్దులో -ట తోటి రూపాలే ఎక్కువగా ప్రచారంలో ఉన్నాయి.

5.40. ఇద్దుము (SII 5.1153,10,1471), ముత్తుము (NI 2కనిగిరి 4.36, 1416), నలుతుము (పై. 3.68. 13-24,1534), ఎందుము (పై. 2కనిగిరి 4.37 1416). లేక ఎందుము (SII 5.1162.14, 1427) వంటి రూపాల్లో గత యుగానికి ఈ యుగానికి తేడా ఏమీలేదు. ఏడుతూములు అనుటకు ఏడుదుమం' గుంచ్చండు (ఫై. 6.1098. 15,1402), ఎద్దుము (పై. 6.1091,8.1421) వంటి రూపాలు కనిపిస్తాయి. ఎనిమిది అనడానికి ఎనమందుము (NI 2కనిగిరి 4.33) కనిపిస్తుంది.

సర్వనామాలు

5.41. ఉత్తమ మధ్యమపురుష సర్వనామాల్లో స్వరంతో ప్రారంభమయ్యే సర్వనామరూపాలీయుగంలో కనిపించటం లేదు. అంతా అనునాసీకాలతోనే ప్రారంభమౌతాయి. ఉదా: మేము (SII. 6.122.17,1551), మీరు (పై.4.1875. 22, 1444) మొ.వి. తాము అనడానికి పూర్వయుగంలో తారు అనే రూపమే ఉన్నట్లు గుర్తించాం. ఈ యుగంలో తాము, తారు అను రెండు రూపాలూ కని పిస్తాయి. ఉదా: తారు పాలింపి దేశాలంగల (పై. 6.1168.32,1484), తమ లోందాము (ఫై. 10.748.4, 1577) మొ.వి. వాండు, వీండు అను సర్వనామాలకు పూర్వయుగంలో వారు, వీరు అనురూపాలే బహుత్వంలో కనిపిస్తాయి. కాని ఈ శాసన భాషా పరిణామం 161

యగంలో వాండు అవడానికి వాండ్లు బహుత్వంలో కనిపిస్తుంది. అయిన వాండ్లు (SII 10.751.23, 1592). యక్కడివాండ్లు (పై. 10.751.25,1592), పిల్లవాండ్లు (NI 8 రాపూరు 11-19,1570)మొ.వి.

క్రియలు

5.42 క్రియాప్రాదికల విషయంలో పూర్వయుగానికీ ఈ యగానికీ అట్టె తేడా చెప్పలేము. కాని ఈ క్రియాప్రాతిపదికలతో ప్రత్యయాలు చేరేటప్పుడు సంధి మార్పుల విషయంలో ఈ యుగంలో స్పష్టమైన కొన్ని విశేషాలు కనిపిస్తాయి. పోవు ప్రాతిపదికకు అన్నంతమగునప్పుడు వు లోపించి బిందువు వచ్చుట ఈయుగంలో సర్వత్ర జరగుతుంది. పోంగలరు, (SII 6.709.13,1436), పోంగల వారు (పై. 6.248,60,1515), పోంగను (పై. 6.1040.4, 1417) మొ.వి.

5.43. .ఇంచు ప్రత్యయం చేరిన ధాతువులకు అచ్చులతో ప్రారంభమయ్యే ప్రత్యయాలు చేరగా, ఈ యుగంలో ఇంపుగా మారుతాయి. ఇట్టివి తూర్పు గోదావరి శ్రీకాకుళం మధ్యలో 15వ శతాబ్దిలో విపుల ప్రచారంలో ఉండినా మిగిలినప్రాంతాల్లో కనిపించవు.

సమర్చించిన మూల్యం (SII 6.5. 10, 1410) కాకినాడ తూ. గో

ఎవ్వరు విరోధింపినాను (పై, 5. 10.12,1404)

సమర్పి౦పేను (పై. 5.84.28, 1424)

సమర్చింపిరి (పై. 5.47.23,1424)

ఆరాధింపి (పై. 5.52.6,1428)

సమర్పి౦పెను (ఫై. 5.102.12,144బ) పెద్దావురం

సమర్పి౦పి (ఫై. 5.1౦3.11, 1408)

సమర్పింపెను (పై. 5.118,21,1488) రాజమండ్రి

నడిపి[౦]పి (పై. 6.656.19,1417) సర్వసిద్ధి విశాఖ

సమర్సింపెను (పై. 6.667.18,1422)

సమర్పింపెను (పై. 6.867.22,1452)

అవధరింపిరి (పై. 676.11, 1480)

(11) 162 తెలుగు భాషా చరిత్ర

తారు పాలింపిదేశాలం (పై. 6.1168.1234) సింహాచలం-విశాఖ

సమర్పింపి (పై. 6.1098.8,1402)

సమర్పింపెను (పై 6.1071.4,1402)

సమర్చింపిన మోదాలు (పై. 6.1248.28,1471) శ్రీకూర్మం-శ్రీకాకుళం.

మిగిలీన ప్రాంతాల్లో సమర్చించెను వంటి రూపాలే కనిపిస్తాయి.

తాలవ్యంకాని అచ్చుతో ప్రారంభమయ్యే ప్రత్యయాలు పరమైనప్పుడు చు > పు మార్పులేకపోవడం ఈ యుగంలో తరచుగా కనివిస్తుంది. ప్రాతిపాలించక (SII 5.37.41,1494), అనుభవింంచుమని (పై. 4.800. 22,1513), పాలించ నవధరించిన (పై. 4.709 25,1658), పాలించగా (పై. 1.986.18,1581) మొ.వి.

5.44. పరిమాణార్థకమైన కొలుచు ధాతువు అన్నంతమై-కల చేరేటప్పుడు చకరానికి యకారమవడం 15వ వ శతాబ్దిలో విశాఖ-శ్రీకాకుళం ప్రాంతలో మాత్రం కనిపిస్తుంది. తెచ్చి కొలయంగలవాడు (SII 6.1184, 1408), శ్రీకూర్మం కొాలాయంగలారు (పై. 6.817.17, 1408) సింహాచలం, తెచ్చి కొలయంగలా౦డు (పై. 6.711, 1409) సింహాచలం, నె; తు.7 కొలాయంగలాండు, (పై. 6. 850.10, 1418) సింహాచలం మొ.వి.

5.45. పూర్వయగంలో కనిపించిన ఇస్తిమి సమర్పిస్తిమి, చేస్తిమి వంటి రూపాలు ఈ యుగంలో స్థిరపడ్డాయి. అయినా ఇచ్చితిమి, సమర్పించితిమి వంటి రూపాలు చాలా క్వాచిత్క౦గా కనిపిస్తాయి. సమర్పించితిమి (SII 6.825.10, 1416) మొ.వి.

5.45. ఈ యుగంలో వెలయు ధాతువుకు వైలసును అనే తద్ధర్మార్థక్మక్రియ (SII 10.584.6, 1436; 6.655.6 1436) కనిపిస్తుంది. కొలుచు, చేయు ప్రాతిపదికలు విశేషణమైనప్పుడు కొలును, చేను అవుతుంది. కొలునువాండు (పై. 6,887. 17,1425), చేసువాండు. (పై. 5.1162.13, 1427). చేసువారు (పై. 5.1250.10 ,1451) మొ.వి.

సమాపక క్రియలు

5.47. సమాపకక్రియలు రెండు రకాలు (1) సామాన్య సమాపకక్రియలు (2) సంశ్లిష్టసమాపకక్రియలు. వచ్చినవాడు > వచ్చినాడు వంటివి సంశ్లిష్ట సమాపకక్రియలు. సామావ్యసమాపక క్రియలలో ప్రాతిపదిక + కాలబోధక ప్రత్యయం + శాసన భాషాపరిణామం 163

పురుషవచన ప్రత్యయం అని మూడు విభాగాల్తున్నాయి. ఉదా. వచ్ + ఇ + రి > వచ్చిరి, వచ్ + ఎ + న > వచ్చెను. మొ.వి.

5.48. సామాన్య సమాపకక్రియలు (అ) భూతకాలం : పురుషబోధక ప్రత్యయవిషయంలో పూర్వయుగానికీ ఈ యుగానికీ తేడా లేదు. కాలబోధక ప్రత్యయవిషయంలోనూ అట్లే తేడా కనిపించదు. కాని తాలవ్యహల్లుల తర్వాత ఎ > అ మార్పు ఈ యగరలో సృష్టంగా కనిపించటంచేత క్రియలలోను ఇది తరుచుగా కనిపిస్తుంది.

సమర్చించను ( < సమర్చించెను) (SII 5.1228. 0 1508), సమర్పణ చేశను (చేసెను) (పై. 6 1078.12,1402), గుడి కట్టించను. (కట్టించెను) (పై 10.584.5 , 1436) మొ.వి, ఉత్తమ మధ్యపురుషల్లో - ఇతి కాలబోదక ప్రత్యయం. కాని ద్విత్వచకారం, యకారం, సకారంగా మారి - ఇతిలోని -ఇలోపిస్తుంది. ఉదా: ఇస్తిమి (SII 4.800.20,1513), సమర్పింస్తిమి (పై. 4.981.5,1518), ఇస్తిరి ( పై. 10.784.12.1574). ఇస్తిని ( పై. 10747.11,1574), చేస్తిమి ( పై. 5.48.19,145౦) మొ.వి.

(ఆ) వర్తమానభవిష్యత్తు : వర్తమానభవిష్యత్ప్రత్యయం ప్రథమైకవచనంలో -ఎడి-/-ఎడు-, తక్కినచోట్ల -ఎద-అని పూర్వయుగంలో చర్చింపబడింది. ఈ -ఎద- ప్రత్యయం -ఏ-గా మారి నేడు తమిళనాడులో నివసిస్తున్న ప్రవాసాంధ్రుల వ్యవహారంలో ఉంది. ఈ ప్రత్యయం ఈ యుగంలో క్వాచిత్కంగా కనిపిస్తు౦ది. మీరు భీమేశ్వరుని ఊలిగము సేసేరుగాన (SII 4.1375.23, 1444), పాదాలు మా సిరన్సున ధరించేము. (పై. 6,248.58, 1515). ఇస్తేరు (ఇచ్చేరు) (పై 10.748.26:1580) మొ.వి.

(ఇ) భవిష్యత్తద్ధర్మం : ఈ భవిష్యత్తద్ధర్మ౦ విషయంలో పూర్వయుగానికీ ఈయుగానికీ చెప్పుకోదగ్గ మార్పులు లేవు.

5.49 నంశ్లిష్టరూపాలు : ఈ సంశ్లిష్టరూపాలు క్రియాజన్యవిశేషణాలకు వాడు, వారు, అది, అవి అను సర్వనామాలు చేర్చగా ఏర్పడతాయి. ఈ రూపాలకు ఉత్త్యమపురుషల్లో పురుషవచన ప్రత్యయాలు చేరుతాయి. వచ్చువారము, వచ్చినవాడను మొ.వి. పై సామాన్య సమాపకక్రియలకు ఈ సంశ్లిష్టసమాపక క్రియ 164 తెలుగు భాషా చరిత్ర

లకూ భేదమేమంటే ఫైవాటిలో ప్రథమైకవచనంలో, మహదహమద్భేదాలుండవు. క్లీబవాచకంలో ఏకత్వబహుత్వభేదమూ ఉండదు. కాని ఇందులో వాడు, వారు, అది, అవి అనే సర్వనామాలు చేరటంచేత సర్వనామాల్లో కనివించే లింగభేదం ఇందులోనూ కనిపిస్తుంది.

(అ) భూతకాలం : కట్టించినారు (SII 5. 36.27,1422), సమర్పించినాడు (పై.5.1229.9,1495), పెట్టినారము (పై. 6.798.12,1425). ఇట్టివి భవిష్యత్కాలంలోనూ ప్రయోగింపబడుతాయి. యీ ధర్మము యిట్టపాలింపక ముందటికి యెవ్వరు దప్పినాను పంచమహాపాతకాలుంన్ను చేసిన పాపానం బోఇనారు (పై. 10.586.21,1448) మొ.వి. అయినది అనడానికి 'అఇంది" అనీ కనిపిస్తుంది. (పై. 5.1175.11.1419) మొ.వి.

(ఆ) వర్తమానం : శాసనాల్లో వర్తమాన క్రియారూపాలు చాలా అరుదు. కాబట్టి పూర్వయుగందాకా శాసనభాషలో వర్తమాన క్రియారూపాల్ని గురించి అట్టే తెలియటం లేదు, కాని ఈ యుగంలో సామాన్యసమాపకక్రియారూపాలు కొన్ని కనిపించాయి (చూ§. 5.48(అ), సంశ్లిష్ట వర్తమానార్థకరూపం ఒక్కచోట మాత్రం కనిపిస్తుంది. సేవచేన్తున్నాండు ( SII 4.936.27,1453). ఈ యుగంలో శత్రర్థంలో -చున్ ప్రత్యయంతోడి రూపాలు తగ్గి -తున్ ప్రత్యయంతోడి రూపాలు ఎక్కువవటంచేత చేస్తున్నాడు వంటి రూపాలు వర్తమానార్థం ప్రచారంలో ఉండేవని చెప్పవచ్చు (చూ§. 5.58).

(ఇ) భవిష్యత్తు : అన్నంత క్రియారూపాలకు -కల చేరితే భవిష్యత్క్రియాజన్యవిశేషణ మేర్పడుతుంది. చేయు-చేయంగల మొ.వి. ఇట్టివాటికి రెండురకాలైన ప్రత్యయాలు చేరి సమాపకక్రియలు అవుతాయి. (1) పై భూత, వర్తమాన క్రియలలాగానే వాండు > ఆండు, వారు > ఆరు, అది, అవి చేరి సమాపకక్రియలుకావచ్చు. (2) విశేషణరూపాలకు. -౦డు, -రు, -వు -ను, -ము చేరి సమాపకక్రియలు కావచ్చు. ఉదా : జరపంగలవాండు (SII 5.129. 7,1422), చేయంగలారు (పై. 5.1180.12, 1402), పెటంగలారు (పై 6.1100.8,1407), మొ.వి. (2)పెటంగలడు (పై. 6.1082.11,1102), కౌలువంగలడు (పై. 6.1072.8,1413) (స్త్రీ) కొలువంగలడు (పై.6.710,12,1409), వెలువంగలదు (పై. 5.1185. 15, 1480) (క్లీబం) మొ.వి. ఈ రెండు రకాల రూపాలూ విశాఖ-శ్రీకాకుళ౦ ప్రాంతంలో మాత్రం కనిపిస్తాయి. శాసన భాషా పరిణామం 165

పై సంశ్లిష్టరూపొల్లో 5.47 ఇ (2) తప్ప మిగిలినవన్నీ క్రియావిశేషణాల పైన సర్వనామాలుచేరగా ఏర్చడినవే కాబట్టి అవి కర్తృస్థానంలోనూ క్రియాస్థానం లోనూ వస్తాయి. ఈ క్షేత్రం అపహరి౦చినవారు పంచమహాపాతకాలున్ను చేసిన వారు (SII 6.242.24. 1427) మొ.వి.

5.50. కాలబోధకాలు కానటువంటి సమాపకక్రియలైన వ్యతిరేకార్థకక్రియలు, విధ్యర్థకక్రియలు మున్నగువాటి విషయంలో విశేషాలేమీ లేవు. కాని సంశ్లిష్ట విధ్య ర్థక క్రియారూపాల విషయంలో కొన్ని విశేషాలున్నాయి. ఈ సంశ్లిష్ట విధ్యర్థక క్రియలు తద్ధర్మక్రియావిశేషణాలకు -అదిచేరగా ఏర్పడుతాయి. తద్ధర్మార్థక క్రియా విశేషణాలు, నాల్గు రకాలు. కాబట్టి నాలుగురకాల క్రియావిశేషణాలపై -అది చేర్చగా విధ్యర్థక క్రియారూపా లేర్పడుతాయి: వాటిలో (1) పోయినది (SII 10.87.97.97) నడుపునది (పై. 4.1104.6).(2)కొనెడిది (పై. 10.421.94), పొందిడిది (పై 5.194. 14). పొందేఢి > పొందిడి వంటిమార్చు గతయుగంలోనే క్వాచిత్కంగా కనివిస్తుంది, (3) రక్షించేది (NI 2.28 A. 15), ఎత్తేది (SII 10.334.90) వంటి రూపాలు పూర్వయుగంలో బహుళ ప్రచారంలో ఉండేవి. ఈ యుగంలో అవధరించిది (SII 4.981.5.1518), శావసేనిది. (పై. 10,747.17,1574) వంటి రూపాలు తరచుగా కనిపిస్తున్నాయి. ఇట్టి రూపం పూర్వయుగంలో ఒక్క చోట మాత్రం కనిపిస్తుంది. పెట్టేది (SII. 10.884, 92). ఇదిగాక ఈ యుగంలో అవధరించేది. (తె.శా.1.156.14) రూపాలు కూడా క్వాచిత్కంగా కనిపిస్తాయి.

'అసమాపక క్రియలు

5.51. చేదర్ధక క్రియలు : చేదర్థకరూపాలు పూర్వయుగంలో ప్రాతిపదికకు -ఇనన్, -ఇనాన్ చేరగా అయ్యేవి. -వచ్చు -వచ్చినన్, _వచ్చినాను. -ఇతేను లేక -తేను కూడా గతయుగంలో క్వాచిత్కంగా కనిపించాయి. కాని ఈయుగంలో -ఇ తేను, -తేను రూపాలే చాలా ప్రబలంగా కనిపిస్తాయి. వేస్తేను (SII 5.26,3, 1412), కొటితే (పై. 5. 1812.9,1599), అంపితేను (పై. 10.751.10,1592), దయచేస్తేను (పై. 10.751.22. 1592), భిలమైపోతేను.(ఫై.10. 739.7,1583), విన్నపంచేస్తేను (పై. 10.745.25,1580), -ఇనాన్ చేరినవి కూడా కనిపిస్తాయి. తప్పినాను (SII 4.981.5,1518), విఘ్నము చేశినాను (పై. 10.785.17, 1521) మొ.వి. 166 తెలుగుభాషాచరిత్ర

5.52. క్రియాప్రాతీపదికకు ఆత్మార్థకబోధకంగా -కొను చేరడం సాహిత్య భాషలో చూస్తున్నాం. ఇట్టిచోట్ల -క చేరడం నేటి వ్యావహారికభాషలో సహజం. ఇట్టి -క చేరిన రూపాలు ఈ యుగపుభాషలో క్వాచిత్కంగా కనిపిస్తాయి. ఆచంద్రార్కము చేసుక (SII 5.80.16,1410). చేసుక (NI 3. పొదిలి 34.18, 1588). చేయు, పోయు మొదలగు యకారాంత ప్రాతిపదికలకు చేసికొను, పోసికను మొదలగు రూపాలే సారస్వతభాషలో ఉంటాయి. కాని ఈ యుగపు శాసనాల్లో చేసుకొని (SII 4.709. 84, 1558) వంటి రూపాలు క్వాచిత్కంగా కనిపిస్తాయి.

5.53. శత్రర్దక రూపొలు : శత్రర్థకరూపాలకు -చున్ ప్రత్యయం చేరడ౦ తెలుగుభాషలో పూర్వయుగం దాకా కనిపించింది. ఈ -చున్ ఈ యుగంలోనూ క్వాచిత్కంగా కనిపిస్తుంది. చేయచుం (SII 10,737.41,1520). కాని -తు లేక -తున్ను ఈ యుగంలో ప్రచురంగా కనిపిస్తుంది. పృథ్వి రాజ్యం చేస్తుండి (SII 4.800,11.1513), మళివస్తున్ను (పై. 6.1310.11,1599), రాజ్యంపాలిస్తున్ను (పై 10.751.17.1592), విచ్చేస్తున్ను (తి.తి. దే.శా.3.68.1, 1514), మొ.వి.

విశేషణాలు

5.54. త్రికంలో ఒకటియైన'ఆ' రూపం దానియొక్క, దానికి సంబంధించిన, ఆతనియొక్క, ఆతనికి సంబంధించిన మొదలైన అర్థాలలో కూడా వాడబడుతుంది. మిఱుత వెలుగడంవండను ఖ 1న 10ను ఆ పేరటిపట్టు (SII.5. 145. 16, 1419). కంచుల బళ్యమున్ను ఆ కుడుకాను (పై 5.47.17, 1424), ఆ మీంది నిలువు మంటపమున్న (పై. 5.86.25,1422) , అల్లాడ రెడ్డిగార్కిని అ కుమారులు కుమారయ్యం గార్కిని (పై. 5.104.5,1428). వీరభద్రయ్యంగారున్ను ఆదేవులు అనతల్లెంమంగారున్ను (పై. 5.108.7, 1528), చిత్రపు భీమన్నాను ఆ మల్లన్నాను (పై. 5.47.7,1424) మొ.వి. ఇట్టివి వూర్వయగంలో కూడా క్వాచి త్కంగా కనిపిస్తాయి.

5.55. -ము వర్ణానికి -వు-, -ంపులు రావడం పూర్వయుగం చివరిదశలోనే విరివిగా జరిగింది. ఈ యగంలోనూ దీని వాడుక విరివిగా కనిపిస్తుంది. ఉత్తరపు దిక్క: (SII. 5.789.226,1518), మధ్యాహ్నపు అవసరానను ( పై. 5.118. 11, 1488), నారికేళపుంగాయలు (పై. 4.702.138, 1438) మొ.వి. శాసన భాషా పరిణామం 167

5.56. ఉదంతస్త్రిసమంపైన ద్రుత్వం రావడం పూర్వయుగంలో లాగానే జరుగుతుంది. క౦చుం బళ్యము (SII 5.47.17,1424), కంచుంబ్రతిమ (పై. 5.1185,8 1460), కంచుంబుత్తడి (పై. 5.1175.14,1419). వీటి సామ్యంచేత ఊరుంగాయెలు (పై. 4.981.7, 1518) వంటి రూపాల్లోనూ అనుస్వారం కనిపిస్తుంది.

5.57. వైభాజిక ప్రత్యయం : పూర్వయుగంలో -చేసి, -ఏసి రూపాలు రెండు కనిపించాయి. కాని చివరిదశలో -ఏసి మాత్రం కనిపించింది. ఈ యుగంలో -ఏశి మాత్రం కనిపిస్తుంది. పుట్టె౦డేశి (SII 5.26.7, 1412). మొ.వి. సి > శి మార్చు చాలా ప్రబలంగా ఉండటంచేత -ఏశి అని సాధారణంగా కనిఫిన్తుంది.

5.58: పరిమాణార్థంలో 1. -ఎండు/-ఎడు. 2. -అండు/-అడు చేరినట్లు పూర్వయుగంలో చూశాం. అందు రెండోది వికాఖ- శ్రీకాకుళం ప్రాంతంలోనే ప్రచార౦లో ఉండేది. మొదటిది మిగతా ఆంద్రదేశంలో బహుళ ప్రచారంలో ఉండి రానురాను విశాఖ-శ్రీకొకుళం ప్రాంతానికి పాకుతూ ఉండేది. ఈ యుగంలో ఈ రెండురకాలైన ప్రత్యయాలూ విశాఖ-శ్రీశాకుళం ప్రాంతంలో ప్రచారంలో ఉన్నాయి. పుట్టెడు ఈ క్షేత్ర (SII 6.868.44 1487), అడ్డడు (పై. 8.1070.9.1420), రెండూ విశాఖ జిల్లాలోనివే. ఔపవిభక్తికరూపాలతోడి సామ్యం వల్ల -డుకు బదులు -టి కొన్నికొన్ని చోట్ల కనిపిస్తుంది. అడ్యంటి లెక్కను ( SII 5.1180.10,1402), తూమింటి సమస్య (NI 2. కందుకూరు 88.15, 1526). మొ వి.

5.59. సంఖ్యకు పూరణార్థకంలో పూర్వయుగంలో -అగున్, -అవున్, -అవన్ మాత్రం ఎక్కువ ప్రచారంలో ఊన్నట్లు చూశా౦. -ఓ ఒక్కటి మాత్రం కనిపించింది. కాని ఈ యుగంలో ఓ కూడా చాలా ప్రచారంలోకి వచ్చింది. నాల్గో భాగమున్ను (SII 4.669.86,1546), రెండోమేళం. (పై. 6.702.149,1548) మొ.వి.

క్రియావిశేషణాలు :

5.60. భూతకాల క్రియావిశేషణాల్లోమా, భవిష్యత్క్రియావిశేషణాల్లోనూ పూర్వయుగానికి ఈ యుగానికి తేడా ఏమీలేదు. వర్తమాన క్రియావిశేవణాల్లో శాసనాల్లో అరుదుగా ఉంటాయి. కాని తద్ధర్మార్థక క్రియావిశేషనాల్లో పూర్వ యుగంలో 168 తెలుగు భాషా చరిత్ర

నాల్గురకాలైన వాటిని చూశా౦. వచ్చువాండు, వచ్చేడివాండు, వచ్చెవాండు, వచ్చివా౦డు. ఆ నాల్గూ ఈ యుగంలో కనివిస్తున్నాయి గాని ఈ యుగంలో -ఇ, -ఏ ల తోడి రూపాలే విరివిగా కనిపిస్తాయి. Ø-తోడివి చాలా అరుదు, -ఎడి తోడివి క్వాచిత్కంగా ఉంటాయి. ఈ -ఎడి తరుచుగా -ఇడి అయిపోయింది.

(అ) _ఎడి/-ఇడి : సిద్ధ (సాధ్యంబు) లనియెడి అష్ట భోగస్వామ్యాలు (SII 4.800.22.1518), యేలెడికాలమందు (పై. 10.579. 7,1413), దేవరం గొలి చిడిసానులు (పై. 6.668 15, 1437) మొ.వి.

(ఆ) -ఏ/-ఎ = తోటజేశె తోంటబంటు (SII 5.24.19, 1884), బొమ్మ విహళ్లి అనే గ్రామము (పై. 4.789.150, 1518), వుండే అట్టుగానున్ను (పై. 4.780.208, 1518), చెల్లె చతుశ్శీమలూను (పై. 4.800.20,1518, 6.695.2,1519), నడరే భోగబిహాణం (పై. 6.695.3, 1519) మొ.వి. అనుధాతువుకు 'నే' అనే విశేషణ రూపం కనిపిస్తుంది. తిరుపతినే ఊరి ఉత్తరాన (పై. 5.102.4, 1442).

(ఇ) -ఇ ఇది గుంటూరు- తూ. గోదావరి మధ్యలో విరివిగా కనివిస్తుంది. విశాఖలో క్వాచిత్కంగా కనిపిస్తుంది.

శ్రీబ్రు౦దావనం సేసి భావనకు (SII 5.104.18, 1428) తూ. గోదావరి,

కల్యాణ మవధరించ్చియ్యప్పటికి (పై. 5.118.50, 1416), తూ.గోదావరి,

ఆ తోంట సేసి వల్లలసేటి గుండాయ (పై. 5.145,11,1418) ప.గోదావరి,

చెల్లివచ్చి క్షేత్రము (పై. 4.772,8,4497) కృష్టా,

దేవరకు కట్టించి బద్రం (పై. 4.778.6, 1488) కృష్ణ,

సింగవరము అని అగ్రహారమున్ను (పై. 4.789.152,1518) కృష్ణ,

ప్రతిష్టచేశి కాలమందు (పై. 4.686.17, 1580) గుంటూరు,

వగరికి పెట్టి కట్నములు కానికలు (పై. 4.699.24, 1546) గుంటూరు,

వెల్లిగండ్లు అని గ్రామము (పై. 4.702.107, 1518) గుంటూరు,

సేవచేసి అందుకై (పై. 6.1088.10, 1459) విశాఖ,

తారు పాలింపి దేశాలంగల (పై. 6.1168.12 1422) విశాఖ.

ఈ యుగంలో విశాఖకు దక్షిణంలో కోస్తాజిల్లాలో -ఇ, -ఎ ప్రత్యయాలు తప్ప తక్కినవీ అరుదు. శాసన భాషా పరిణామం 169

వాక్యాలు

5.61. శాసనభాషలోని వాక్యాల్ని స్థూలంగా రెండు రకాలుగా చెప్పవచ్చు. 1. సామాన్యవాక్యం. 2. సంశ్లిష్టవాక్యం. సామాన్య వాక్యాల్ని రెండుగా చేయవచ్చు. 1. క్రియాసమాపకం, 2. విశేషణసమాపకం.

5.62. క్రియాసమాపక వాఖ్య౦. ఇందులో ఒక సమాపకక్రియ తప్పని సరిగా ఉంటుంది. దానికి కర్త్రు పదం ప్రథమావిభక్తిలో ఉంటుంది. ద్వితీయాది విభక్తులతోడి నామపదాలు కూడా అయా సందర్భానికి తగినట్టు రావచ్చు. భావయ ప్రసాదించిరి (SII 5.26.7,1412), మల్లసానమ్మ సమర్చించెను (పై. 584.27, 1494) మొ.వి. పై వాక్యాల్లో భావయ, మల్లసానమ్మ కర్తలు. ప్రసాదించిరి, సమర్చింపెను క్రియలు. యీ మండపము నరహరి నేనింగారి. పంపున కిరిలేంక శిరిగిరి నేండు గట్టించెను (పై. 5. 133.7, 1416). ఈ వాక్యంలో కట్టించెను క్రియ, ఈ మండపము కర్మ కిరిలంక శిరిగిరి నేండుకర్త. నరహరి నేనింగారి పంపున _తృతియావిభక్తితోడి పదబంధం. కర్తలోపించికూడా వాక్యం రావచ్చు. ఉగ్రనిచింగబోఇని కొడుక పోలబోఇని గోచరవెటితిమి (SII 5.6,1445).

పై విషయాల్లో సాహిత్యభాషకూ, శాసనభాషకూ వ్యత్యాసం ఏమీ లేదు. కాని కర్తకు సమాపక క్రియకు గల సంబంధం విషయంలో కొన్ని వ్యత్యాసాలు కనిపిస్తాయి. సాహిత్యభాషలో కర్త ఏ పురుషలో ఉంటుందో క్రియకూడా ఆ పురుషలోనే ఉంటుంది. శాసనాల్లో ఆలాంటి వాక్యాలు ఉంటాయి. కాని అక్కడక్కడ శాసనాల్లో కర్త ప్రథమపురుషలోనూ క్రియ ఉత్తమపురుషలోనూ కనిపిస్తాయి. కొటికలపూండి గంగయ్యను కాని పాపకామినేండున్ను...సమర్చణ చేస్తిమి (SII 5.48.11.19,1450). ఇందు గంగయ్య, కామినేండు కర్త్రు శబ్దాలు. సమర్పణచేస్తిమి సమాపక క్రియ. ఇలాంటి వాక్యాలు శాననాల్లో ఉన్నాయి. కాని ఇట్టివి భాషలో వ్యవహారంలో ఉన్నట్లు చెప్పలేము. శాసనాలు వ్రాసేటప్పుడు పేరు చెప్పాలి కాబట్టి కర్త పేరు చెప్పి ఆ కర్తకు సంబంధించిన క్రియ ఉత్తమపురుషంలో వ్రాయబడ్డదేమో !

కర్త గౌరవార్థరూపంలో ఉన్నా సమాపకక్రియ ఏకవచనంలో ఉండవచ్చు. నరహరిం నేనింగారు. ..కల్యాణమండపం గట్టించెను (SII 5.188.12-16,1410), వీరనంగారు... ధారవోశి సమర్పించెను (పై. 5.48.10-17,1458)మొ.వి. 170 తెలుగు భాషా చరిత్ర

5.63. విశేషణనమాపకవాక్యం: ఇందులో సమాపకక్రియకు బదులు విధేయ విశేషణం ఉంటుంది. ఉదా: ఇయ్యవనరం ఆచ౦ద్రార్కస్థాయి. (SII. 5.5.14,1404). ఇందు ఇయ్యవసరం కర్త. దీనికి అచంద్రార్కస్థాయి విధేయవిశేషణమవుతుంది. ఇలాంటి వాక్యాల్లోనూ ద్వితీయాదివిభక్తి ప్రత్యయాల తోడి నామపదాలు సంధర్భానుసారం రావచ్చు. కర్తలోపించవచ్చు. ధర్మం పాలించి వారికి దాసిదాసిని (SII 4.772.19,1437). ఈ వాక్యంలో దాసిదాసిని అనేది విధేయ విశేషణ౦, కర్తయైన నేను పదం ఇందు లోపించింది.

విధేయవిశేషణస్థానంలో సంశ్లిష్టసమాపకక్రియకూడ రావచ్చు. అబ్బన ఆ చ౦ద్రార్కమును గుగ్గిలము జరపంగలవాడు (SII.5. 129.7, 1422). చారిత్రకంగా ఇట్టి సంశ్లిష్టసమాపక రూపాలు మొదట విధేయవిశేషణంగా ఉండినట్టు చెప్పవచ్చు. తర్వాత ఇది సామాన్యసమాసక క్రియలాగానే ప్రయోగంలోకి వచ్చినట్టు తెలు స్తుంది. ఈ రూపం ఎప్పటిదాకా విధేయవిశేషణంగా ఉండి ఎప్పటినుండి సమాపకక్రియగా మారింది అని చెప్పడం చాలా కష్టం, కాని శాసన ప్రయోగాల్ని ఈ కిందివి గమనించవచ్చు.

సాధారణ౦గా శాసనభాషలో భూతకాలవిషయాల్ని చెప్పవలసి వచ్చినపుడు సామాన్యసమాపకక్రియనూ, భవిషద్విషయాన్ని చెప్పవలసి వచ్చినప్పుడు సంశ్లిష్టసమాపక క్రియనూ వాడటం తరుచుగా కనిపిస్తుంది. వర్తమానవిషయం శాసనాల్లో అట్టే కనిపేంచదు. ఊదా: పొందూరి నాగరాజు. .. క్రయముగొని పెట్టెను. ఆక్షేత్రము అనుభవించి వారణాశి మారనంగారి కొఢుకు అబ్బన ఆ చంద్రార్కమును గుగ్గిలము జరపంగలవాడు (SII 5.129. 1422). ఇట్టి పద్ధతి పూర్వయుగంలోనూ ప్రచారంలో ఉన్నట్టు గమనింపవచ్చు. ఇలా భవిష్యత్ కాల సూచక సంశ్లిష్టసమాషకక్రియలు స్తామాన్యసమాపక క్రియలలాగానే వర్తిస్తాయి. కాని భూతకాల సంశ్లిష్టసమాపకక్రియారూపాలు శాసనాల్లో తరుచుగా విధేయవిశేషణాల్లాగా వర్తిస్తాయి. క్వాచిత్యంగా సమాపకక్రియల్లాగ వర్తిస్తాయి.

యీ ధర్మము యిట్ట పాలింపక ముందటికి యెవ్వరు దప్పినాను పంచమహాపాతకాలుంన్ను చేసిన పాపానం బోఇవారు.(SII 10. 586.21,1448), ఇందు పోఇనాఋ అను భూతకాల సంశ్లిష్టసమాపక రూపం విధేయవిశేషణంగా వాడినట్లు శాసన భాషా పరిణామం 171

గుర్తించవచ్చు. ఈ క్షేత్రం అపహరించినవారు పంచ మహాపాతకాలున్ను చేసిన వారు (SII 6.242.24,1447), ఇందు అపహరించినవారు కర్తృస్థానంలోను, చేసిన వారు విధేయవిశేషణ స్థానంలోనూ ఉన్నాయి.

మాకినటి...కోహలి సమర్పించినాడు (SII 5.1229.7-8,1495), ఇందు సమర్పించినాడు రూపం కేవలం సమాపకక్రియగానే ప్రయోగింపబిడ్డది. కర్త ఏకవచన౦లో ఉన్నా గౌరవార్థం క్రియ బహుత్వంలో ప్రయోగించడం ఈయుగపు శాసనాల్లో క్వాచిత్కంగా కనిపిస్తుంది. ఇకై౦కర్యం శృంగారరాయండు ఆచంద్రార్కముగాను అవదరించువారు (SII 5.102.12,1442). యికై౦కర్యం శ్రింగార రాయండు ఆ చ౦ద్రార్కముగాను అవధరి౦చువారు (పై.5.108.16-19,1408). పై వాక్యాల్లో శృ౦గారరాయండు ఒక దేవతపేరు. కర్త ఏకవచనంలో ఉంది. అవధరించువారు అనే క్రియ గౌరవార్థంగా బహుత్వంలో వాడబడి ఉంది.

సంశ్లిష్ట వాక్యం

5.64. సామాన్యవాక్యం ప్రధానంగా ఉండి అది ఆధారంగా ఒకటన్నా ఉపవాక్యం ఉంటే అట్టిదాన్ని సంశ్లిష్టవాక్య౦ అనవచ్చు. యీ ధర్మానకు యవ్వరు తప్పినాను, గంగలోను గోవు బ్రాహ్మణవధ చేసిన పాపానం బోఉవారు (SII 4.981.5.1518). ఇందు "యీ ధర్మానకు యవ్వరు తప్పినాను” ఉపవాక్యం, మిగిలింది ప్రధానవాక్యం..

పై వాఖ్యాన్ని యత్తదర్థక వాక్యం అనవచ్చు. ఈ యత్తదర్దక వాక్యాల్లో సాధారణంగా ఎవరు..వారు.. అని ఉంటుంది. కాని యీ యుగపు శాసనాల్లో ఎవరు అని ప్రశ్నార్థకశబ్దం కనిపిస్తుంది. కాని వారు అని తదర్ధకశబ్దం లేకే వాక్యం ముగింపబడుతుంది. ఎవ్వరేనేమి ప్రతిపాలించక విఋద్ధంగా నాడిరా గోహత్యా బ్రహ్మహత్యాదిపాతకాలు చేసిన పాపాలం బొంది ఆరవయివేలే౦డ్లు మహారౌరవాది నరకాలం గూలువారు (SII 5.87, 1494), ఘడియారం బ్రాహ్మల గోత్రాలకు వ్రిత్తిపన్ను పరచుం ఎవ్వరు గొనం దలచిన బ్రాహ్మనిం జంపిన దోషానం బోవారు (పై.5.10,1404), ఎవ్వరు విరోధించినా మహాపాతకాల పడువారు (పై. 5.29,1402). ఎవ్వరు శబ్దం బహువచనరూపంగాను, ప్రధానవాక్యంలోని క్రియ ఏకవచనంలోనూ ఉండే వాక్యం ఈ యుగపుశాసనాల్లో ఒక్కచోట కనిపిస్తుంది. ఎవ్వరు అపవారించినా దోషాన పోవువాCడు (SII 5.204.15, 1423). 172 తెలుగు భాషా చరిత్ర

సంకీర్ణ౦

5.65. కర్తృషష్టి క్రియావిశేషణాలకు కర్త నేటి వ్యావహారికభాషలో ప్రథమావిభక్తిలోనే ఉంటుంది. కాని ప్రాచీనకాలంలో షష్టీవిభక్తి విపుల ప్రచారంలో ఉండేది. ఉదా. రాముని చేసినపని మొ.వి. గతయుగం శాసనాల్లో ఇట్టి కర్తృషష్టి చాలా విరివిగా ప్రయోగంలో కనిపించింది. కాని ఈయుగంలో ఇట్టివి చాలా అరుదు. [త]మ శే [శి]న సుకృతాలు (SII 5.10 13,1404) మొ.వి. చాలా స్వల్పంగా కనిపిస్తాయి. ఇలాంటిచోట్ల ప్రథమవాడడం ఈయుగంలో తరచుగా కనిపిస్తుంది. జన్యావుల కసవానాఇనింగారు చేయించిన వరుపుంబని (పై.10.580.8. 1414), మొ.వి.

5.66. ఏవార్థంలో తెలుగుభాషలో-ఆ ప్రత్యయం మాత్రమే 12వ శతాబ్దిదాకా ప్రచారంలో ఉండేది. 12వ శతాబ్ధినుండి “ఎ” లేక “ఏ” ప్రారంభమై 1వ శతాబ్దిలోగా ఇవిబాగా ప్రచారంలోకి వచ్చాయి. ఈ యుగంలో-అ ప్రత్యయం దాదాపు వ్యవహారంలో లేదనవచ్చు. ఎ ఏలు పూర్తి వ్యవహారంల్లోకి వచ్చినట్లు చెప్పవచ్చు. తమ మాతాపితాళ్లనుతానే వధించిన దోషానపోవువారు (SII 6.219.25, 1494), సూరనంగారే కట్టించినారు (పై. 5.36.25, 1422).మొ.వి.

సముచ్చయార్థంలో ఈ యగంలో అకారాంత శబ్దాలకు దీర్ఘం, దానితర్వాత -ను ప్రత్యయమూ, ఇకారాంత౦ తర్వాత న్ని ప్రత్యయమూ, ఉకారాంతం తర్వాత -న్ను ప్రత్యయమూ బాగా ప్రచారంలోకి వచ్చాయి. కొమ్మనాను... ప్రోలున్ను .. నందిన్ని... (SII 5. 38-67.10,1414) మొ. వి.

ఙ్ఞాపికలు

1. M. Kandappa Chetty. A Study of 11th century Inscriptional Telugu. SUVOJ. Tirupati 1964,pp 33-40.

2. నాహిండు (SII 110.321.9,1248), రాయబోహిడి (పై. 5.54, 8, 1298) మొ. వాటిలో యా > యి > హి కావడం గుర్తింంవచ్చు. (చు§ 5, 16)

3. ఎం. కందప్పశెట్టి, 11 వ శతాబ్ది వర్తమావ క్రియలు భారతి. సెప్టెంబరు 1968.

  • శాననాలు పూర్వయగంలో ఉపయోగించినవన్నీ ఈ యుగంలోనూ ఉపయోగించబడ్డాయి. అవిగాక తిరుమల-తిరుపతి దేవస్థానం శాసనాలు (తి.తి.దే.శా) కూడా ఈ యగానికి పనికి వచ్చినాయి.