తెలుగువారి జానపద కళారూపాలు/విజయనగరరాజుల కళా విన్నాణం
విజయనగరరాజుల కళా విన్నాణం
కాకతీయ రాజ్య పతనానంతరం ఆంధ్రదేశమంతా మహమ్మదీయ దండ యాత్రలకు లొంగి పోయే ప్రమాదం ఏర్పడింది. ఈ మహమ్మదీయ దండ యాత్రల్ని జయ ప్రదంగా ప్రతిఘటించి, ఆంధ్ర దేశాన్ని మాత్రమే కాక, దక్షిణ హిందూ దేశాన్నంతా ఒకే తాటిమీద నడిపిన ఘనత హంపీ విజయనగర రాజులులకు దక్కింది.
హంపీ విజయనగర రాజ్యాన్ని స్థాపించిన హరి హర రాయలు, బుక్కరాయలు దక్షిణ హిందూ దేశంలోని ఆంథ్ర కర్ణాటక తమిళ ప్రాంతాలన్నిటినీ ఒకే సామ్రాజ్యం క్రింద వ్యవస్థీకరించి నప్పుడే మహమ్మదీయుల దండ యాత్రల్ని జయ ప్రదంగా ప్రతి ఘటించగలమని గ్రహించారు. ఈ ముస్లిం దండయాత్రల వల్ల నానా హింసలూ అనుభవిస్తున్న ప్రజలు కూడ ఈ ప్రయత్నాన్ని బలపరిచారు.
- హరిహరుని హంపి:
విజయ నగర సామ్రాజ్య సంస్థాపకులైన హరి హరి హర రాయలు, బుక్క రాయలు అన్నదమ్ములు, ప్రతాపరుద్రుని బందువులు. ప్రతాప రుద్రుని అస్థానంలో వున్న ప్రధానోద్యోగులు. కాకతీయరాజ్య పతనానంతరం వీరిద్దరూ ఆనెగొంది వెళ్ళారు. ఆంధ్ర కన్నడ సరిహద్దులలో మధ్య భాగంలో విద్యానగర పట్టణాన్ని హరిహరరాయలు స్థాపించాడు. ఈ సామ్రాజ్యాన్ని కన్నడ సరిహద్దులలో , తుంగభద్రానదీ తీరంలో సహజ రక్షణ కుపయోగపడే అహ్నేక కొండల వరుసల మధ్యభాగంలో విద్యానగర పట్టణాన్ని హరిహర రాయలు స్థాపించాడు. ఈ సామ్రాజ్యస్థాపనకు మాధవవిద్యారణ్యస్వామి కూడా సహాయపడ్డాడు. హిందూ సంస్కృతీ, మతమూ రక్షింపబడాలనే ఆశయంతో విజయనగర సామ్రాజ్యం స్థాపన 1336 రో జరిగింది. ఈ సామ్రాజ్యం వర్థిల్లిన కాలాన్ని మూడు దశలుగా విభజించవచ్చు.
(1)1336 నుండి 1480 వరకు ప్రథమదశ. ఈ దశలో విజయనగర రాజ్యం కన్నడ, తమిళ ప్రాంతాలనూ, రాయలసీమనూ ఆక్రమించుకున్నది.
(2) 1480 నుండి 1550 వరకూ ద్వితీయ దశ. ఈ దశలో తెలంగాణ మినహా ఆంధ్రదేశమంతా కృష్ణదేవరాయల పరిపాలన క్రింద వుంది.
(3) 1550 నుండి 1650 వరకూ మూడవదశ. ఇది పతనావస్థకు సంబంధించన కాలం.
- తలవంచని వీరులు:
కృష్ణదేవరాయల మరణానంతరం 1565 వరకూ విజయనగర సామ్రాజ్యం మహోజ్వలంగా సాగి చివరకు తళ్ళికోట యుద్ధంలో దెబ్బతింది. దక్కను సుల్తానులందరూ ఏకమయ్యారు. రామరాజును చంపి అతని సైన్యాన్నంతా చెల్లాచెదరు చేసివేశారు. అయినా విజయనగర సేనల బలాధిక్యత ఏమాత్రం క్షీణించక తిరుమల దేవరాయల నాయకత్వాన పెనుగొండను రాజధానిగా జేసుకొని రాజ్య పరిపాలన సాగించారు. అతని అనంతరం శ్రీ రంగరాయలు దుర్బలుడవడం వల్ల రాజధానిని తిరుపతి దగ్గర వున్న చంద్రగిరికి మార్చుకున్నాడు. ఈ విధంగా క్రీ.శ. 1630 తరువాత విజయనగర సామ్రాజ్యం అంతరించింది. విజయనర సామ్రాజ్యాన్ని పరిపాలించిన అనేక మంది లలితకళలను ఎంతగానో పోషించారు.
- విదేశీయులు మెచ్చిన విజయనగరం:
హంపి విజయనగరం ఒక కళాకేంద్రంగా వికసించింది. 15, 16 వ శతాబ్దాలలో, విజయనగర సామ్రాజ్య పరిపాలనాకాలంలో ఇతర దేశాలనుంచి వచ్చిన అనేక మంది రాయబారులూ, వ్వాపారులూ, యాత్రికులూ ఈ విజయనగరాన్ని దర్శించారు. విజయనగరం కళా వైభవాలను గూర్చీ, శిల్పకళా వైదగ్ధ్యాన్ని గూర్చీ వారి వారి దినచర్య పుస్తకాలలో ఉదాహరించుకున్నారు. పీట్రోడెల్టా అనే పోర్చుగీసు దేశస్థుడు విజయనగరాన్ని దర్శించాడు. ఈ వివరాలను కలకాత్తా వాస్తవ్యుడు బి.జి.పాల్ .195(?)4లో 'సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ ఇన్ విజయనగర' అనే గ్రంథంలో ఈ క్రింది విధంగా వివరించాడు.
- కోలాహలంగా కోలాటాలు
ర్నవమి రోజున తుంగభద్రా తీరంలో జరిగేవి. ఆ వుత్సవాలలో ఆయన ఒక కోలాట నృత్యాన్ని చూశాడట. అది విజయనగరం రాజవీధిలో వూరేగింపులో అది మేళాల కోలాహలంతో నిండివుందట. జనసమ్మర్థంతో వీథి అంతటా త్రొక్కిసలాటగా వుందట. ఊరేగింపు సాగిపోతూ వుండగా, ఒక వినోద కార్యక్రమం తరువాత మరో వినోదానికి సంబందించిన సమూహాలు వస్తూండేవట. ఇంతలో ఒక కోలాట బృందం వచ్చేదట. అందరి చేతుల్లోనూ వివిధ రంగులతో చిత్రించబడిన కోలాట కఱ్ఱలున్నాయట. తలగుడ్డలతో సకల వర్ణశోభితంగా రంగుల రంగుల ఈకెలు ధరించి వారు చూడ సొంపుగా వున్నారట. బృందానికి హంగుగా జంత్ర వాద్యాలు మ్రోగుతూ వుండగా లయప్రకారం బృందమంతా పాట పాడుతూ, మధ్య మధ్య 'కోలే. కోలే' అనే కేకలతో అడుగు వేశారట. కోలె కోలే అంటే ఆయనకు ఏమీ అర్థం కాలేదట. కాని అది ఒక అందమైన మాటై వుండవచ్చని సూచించాడు.
- అబ్దుల్ రజాక్ చెప్పిన అద్భుత విషయాలు:
ఇమ్మడి ప్రౌఢ దేవరాయలు క్రీ.శ. 1423, క్రీ.శ. 1446 వరకూ రాజ్య పరిపాలన చేశాడు. విజయనగరాన్ని పరిపాలించిన సంగమ వంశరాజులలో ప్రౌఢ దేవరాయలు అగ్రగణ్యుడు. ఈయన కాలంలోనే విజయనాగర రాజ్యం మహోన్నత స్థితికి వచ్చింది. ఈయన ఆస్థానం లోనే శ్రీనాథ మహాకవికి కనకాభిషేకం జరిగింది. ఈయన కాలంలో 1443 లో అబ్దుల్ రజాక్ విజయనగరాన్ని చూడ వచ్చి ఆ పట్టణ వైభవాన్ని, ప్రౌడదేవరాయల మహోన్నత స్థితిని వర్ణించాడు. ఆయన పారసీక దేశంనుండి వచ్చాడు.
విజయనగర రాజభవనంలో దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగినట్లు అబ్దుల్ రజాక్ వర్ణించాడు. అంతేగాక ఆ మహోత్సవ సమయంలో అద్భుత నాట్య ప్రదర్శనాలు జరిగినట్లు పేర్కొన్నాడు. ఆ మహోత్సవాలు జరిగే స్థలానికి, మంటపాలకు నడుమ చక్కగా తీర్చిన ఖాళీస్థలం కలదట. అందు గాయకులు గానంచేశారు. కథకులు కథలు చెప్పారట. గాయకురాండ్రలో చాలమంది యవ్వనంలో వున్న కన్యకలేనట. వారి బుగ్గలు చంద్రుని వలె వుండి, వారి ముఖార విందాలు వసంతాన్ని అతిశయించిన శోభతో వెలుగొందుతున్నాయట. వారు ధరించిన దుస్తులు సొగసుగా వున్నాయట. వారి రూపాలు, క్రొత్తగా వచ్చిన గులాబి పువ్వుల్లాగ, మనసుకు అమితానందాన్ని కలిగించాయట.
వారు రాయల కభిముఖంగా వున్న తెరమరుగున కూర్చుండి వున్నారట. మండపం రంగు రంగుల దీపాలతో చిత్రవిచిత్రంగా నగిషీ చెక్కబడిన చలువరాతి స్తంభాలతో వుందట. దానికి ముందు మిలమిల మెరుస్తూన్న ఒక తెర వుందట. మండపానికి ఎదుట వున్న తొమ్మిదంతస్తుల మేడలోని ఏడవ అంతస్తులో మహారాజు కూర్చొని చూస్తున్నాడట. తెర కదిలి రెండు భాగాలుగా విడిపోయిందట. వెంటనే ఆ సుందరాంగులు అత్మలు ఆనందపరవశమయ్యేటట్లు, లలిత విన్యాసాలతో నృత్యం చేయడం ప్రారంభించారని, ఆ నటుల గాన మాధుర్యం, నటనా సౌందర్యం ఆస్వాదించి చూసి విస్తుపోయారని, ఒడలు మైమఱచినట్లయిందని వివరించాడు.
- పగటివేషాలతో పగను సాధించారు:
మొదటి దేవరాయలు (క్రీ.శ. 1406 - 1422) విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన రోజులలో పెరిస్తా అనే మహమ్మదీయ చరిత్రకారుడు విజయనగర రాజుల నాటక కళా ప్రాముఖ్యాన్ని, రాజకీయమైన ఒక అపూర్వ సంఘటననూ గురించి గ్రంథస్థం చేశాడు. వివరాలు ఈ క్రింది విధంగా వివరించాడు.
ముగదల్లు రాయచూర్లపై ఆధిపత్యాన్ని గురించి అనాదినుంచీ విజయనగర రాజులకు, మహమ్మదీయులకు తీవ్రయుద్ధాలు జరుగుతూ వుండేవి. విజయనగర రాజులకు కళలపట్ల గల కాంక్షను ఆసరాగా తీసుకుని మహమ్మదీయులు ఒక చక్కని ఉపాయం అలోచించారు.
విజయనగరం వారి నాటకాలలో నటించే వేశ్యల్ని లోబరుచుకుని, ఆ వేషాలు తామే ధరించుకుని కోటలో ప్రవేశించారు. నాటక ప్రదర్శనంలో ఒక సన్నివేశంలో కత్తియుద్ధం కూడ వుందట. తరుణం వచ్చిన వెంటనే ఈ వేషధారులు బూటకపు నటనకు స్వస్తి చెప్పి ప్రత్యక్ష హత్యాకాండకు వుపక్రమించి ప్రేక్షకులుగా కూర్చున్న రాజకుంటుంబాన్ని వధించి కోటను వశపరుచు కున్నారట. శ్రీకృష్ణదేవరాయలు 1513లో జైత్రయాత్రలను ముగించుకుని వచ్చిన తరువాత మహర్నవమి దిబ్బను నిర్మించాడు. ఇది ఒక బ్రహ్మాండమైన కట్టడం. ఈ సింహాసన వేదిక మీద రాయలు ఆసీనుడై దసరా వేడుకలను తిలకించేవాడు. ఈ వుత్సవం సెప్టెంబరు నెలలో (ఆశ్వయుజ మాసంలో) తొమ్మిది రోజుల పాటు జరుగుతుండేవి. ప్రభువులు, సామంత రాజులు, దండనాయకులు, రాణివాస స్త్రీలు, దేశంనాలుగు చెరగుల నుంచీ వేలాది ప్రజలు ఈ వేడుకలను చూడడానికి వస్తూవుండే వారని విదేశ యాత్రికుడైన న్యూనిజ్ తెలియ జేస్తున్నాడు.
- మహర్నవమి దిబ్బమీద మహానాటకాలు:
విజయనగర వైభవాన్ని దర్శించ వచ్చిన విదేశ యాత్రికులలో ఒకడైన పేయస్ తాను రచించిన వృత్తాంతంలో నాటి నాట్యశాలను గురించి మిక్కిలి ప్రశంసించాడు. నర్తనశాల సుధీర్ఘమైంది. కాని అంత వెడల్పైనది కాదు. దాని ఇరుప్రక్కలా శిల్పరమణీయమైన శిలా స్థంభాలున్నాయట. ఆస్తంభ పలకాలు మీద నాట్యాంతంలో వుండవససిన సరియైన తీరులతో నాట్య కత్తెల రూపాలు చెక్కబడి వున్నాయట. నృత్యం అభ్యసించే వారు నృత్యాంతంలో తాముండవలసిన వైఖరిని మరిచిపోయిన యెడల ఈ శిల చిత్రాలను చూచి దానిని జ్ఞప్తికి తెచ్చుకునేవారట.
ఇంకా నర్తనశాల చివరి భాగంలో వివిధ చిత్రాలతో కూడిన ఒక ఏకాంత స్థలముందట. అక్కడ నృత్యానంతరం అలసట తీర్చుకొనడానికి నాట్యకత్తెలు తమ శరీరాలను, కాళ్ళను చక్కజాపి సడలించు కోవడానికై వ్రేలాడేవారట. శరీరం అన్ని వంపులూ అవలీలగా తిరగటానికి అనువుగా ఇక్కడ అభ్యాసం చేసే వారట.
వేరొక ప్రక్కన ప్రదర్శనాన్ని దర్శించడానికి వచ్చిన రాజు కూర్చునే ప్రదేశంమీదా, నేలమీదా, గోడలమీదా, బంగారు రేకులు తాపబడి ఉన్నాయట. గోడ నడిమి భాగంలో, పన్నేండ్ల బాలిక ప్రమాణం కలిగిన ఒక సువర్ణ విగ్రహం వుందట. ఆ విగ్రహం చేతులు నాట్య కత్తెకు నాట్యాంతంలో వుండవలసిన తీరులో వున్నాయట.
- వైభోగం ఒలికే భోగం మేళాలు:
ఫేయస్ ఇంకా ఇలా వ్రాశాడు. భోగం స్త్రీలకు రాజభవనాలలో నిరాఘాటంగా ప్రవేశముండేదట. హజారరామాలయంలో వివిధ భూషణాలతో మురుస్తూ వున్న సానులను స్థంభాలపై తీర్చి దిద్దారట. వాటిని చూడగా కొంత మంది బిఱ్ఱులాగులు తొడిగి వాటిపై లంగాలను కట్టారట. దేవీ నవరాత్రులలో ప్రతి ఉదయం, భువనవిజయంలో, రథోత్సవాలు అన్నిటిలోనూ, దేవాలయాలలో ప్రతి శనివారమూ వారు నృత్యం చేయవసలిన వారై యున్నారట. నృత్యం నేర్పే గురువులకు రాయల వారు కొన్ని ఇనాములు ఇచ్చి యున్నారట.
- వసంతోత్సవ వైభోగం:
నేటి హోలీ పండుగను రాయల కాలంలో వసంతోత్సవమని పిలిచేవారని మొదటి దేవరాయల కాలంలో విజయనగరం వచ్చిన నికోలో కాంటి ఉదాహరించాడు. ఆయన దానిని గురించి ఈ విధంగా వర్ణించాడు. వసంతోత్సవ దినాలలో వీథుల్లో ఎరుపురంగు నీరు ఉంచేవారట. వీథులలో వచ్చి పోయే వారందిరిపైనా ఎవరు బడితే వారు రంగు నీరు చల్లుతుండేవారట. చివరకు రాజు కానీ, రాణి కాని, అదారిన వెళ్ళితే చాలు అందరిపైనా ఈ వసంతం వర్షించిందన్నమాటే. ఈ వసంతోత్సవ కాలంలో అన్ని ప్రాంతాలనుండి కవులను రప్పించి వారి కవితలు విని ఆనందించి వారికి బహుమానాలు ఇస్తూ వుండేవారని ఆ పట్టణ వైభవాన్ని పరిపరి విధాల వర్ణించాడు.
- కోలాటపు కోలాహలం:
కృషి చేసేవారట. అంతేకాక తమ పిల్లలకు పది సంవత్సరాల ముందు నుంచే నృత్య విద్యను నేర్పేవారట.
మాయల్ అనే ఆయన విజయనగరం లోని ఒక నాట్య శాలను గురించీ, నర్తకులు తమ అంగసౌష్ఠవాన్ని పెంపొందిచుకోవడానికి ప్రతి రోజు చేసే అభ్యాస పరిశ్రమల్ని గురించి "దిఫర్గాటన్ ఎంఫైర్" అనే గ్రంథంలో ఉదహరించాడు.
- ప్రయోగం పసగడితేనే రంగంపై రాణింపు:
నాటక ప్రయోగం విషయంలోఆనాటివారు ఎంతటి శ్రద్ధాసక్తుల్ని కనబరిచారో గంగాధర కవి రచించిన " గంగాదాస ప్రతాపవిలాసం" అనే నాటకంలో వివరించ బడింది.
బొంబాయి రాష్ట్రంలోని పాంచమహల్ మండలంలోనున్న 'పావగడ' రాజ్యానికి ప్రభువైన గంగదాసు దిగ్విజయం దీని ఇతివృత్తం.
గంగాదాసు గంగాధర కవిని కోరి వ్రాయించుకున్న నాటకం ఇది. దానిని రంగ ప్రయోగం చేయించుకోవాలని అతనికి అమితమైన ఉబలాటం. అందుకు సమర్థుడైన ప్రయోక్త కోసం గంగాదాసు వెతికిస్తునాడట. ఆ వార్తను విజయనగరం సంస్థానంలో వున్న ఒక నటుడు విని, నేను ఆ నాటకాన్ని ప్రయోగం చేస్తానని తన ప్రభువైన మల్లికార్జునుడికి విన్నవించగా ఆ ప్రభువు అతణ్ణి బహుమాన పురస్పరంగా పావగడకు పంపించాడట.
రంగ ప్రయోగం ఒక విశిష్ట శిల్పమనీ, ఉత్తమ నాటక రచనలు వున్నప్పటికీ ప్రయోగ శిల్పం తెలిసిన సమర్థులే గనక లేకపోతే అవి రంగస్థలం మీద రాణించడం కష్టసాధ్యమనీ ఆ కాలం వారు పూర్తిగా గుర్తించారనడానికి ఇది చక్కని నిదర్శనం.