తెలుగువారి జానపద కళారూపాలు/మాల జంగాలు
స్వరూపం
మాల జంగాలు
మాల జంగాలనే పంచాలవారు మన బుర్రకథలనే ప్రత్యేక ఫక్కీలో చెపుతారు. వీరి తంబురా నెమలి ఈకలతో అలంకరింపబడి వుంటుంది. వీరి చేతి వుంగరాలతో తంబురా బుర్రను తాళ ప్రకారం మీటుతూ కథ చెపుతూ వుంటారు. ముఖ్యంగా వీరి కథలు కరుణరస ప్రధానమైనవి. వీరి ప్రదర్శనాలు సాయంత్రం ప్రారంభమై తెల్ల వార్లూ జరుగుతూ వుంటాయి. వీరు చెప్పే కథా సాహిత్యం ఎటువంటిదో మనకు తగిన ఆధారం గ్రంధారూపంగా లభించదు. వీరి వాయిద్యాలలో డోలు ప్రసిద్ధి చెందిన వాయిద్యం. ఇంకా వీరు ఉపయోగించే వాయిద్య విశేషాలలో ముఖ్య మైనది "జమలిక". దీనినే జవనిక, జముకు అని పిలవడం కూడా కద్దు. వీరి మరొక వాయిద్యం తుడుం కొమ్ము. వీరిని కొన్ని ప్రాంతాలలో రోజ వారని కూడా పిలుస్తూ వుంటారు.