Jump to content

తెలుగువారి జానపద కళారూపాలు/ఫకీరు వేషాలు

వికీసోర్స్ నుండి

ఫకీరు వేషాలు

ఫకీర్లు ముస్లిం కులంలో ఒక తెగ. వీరు ముఖ్యంగా ముస్లిములనే యాచిస్తారు. ప్రత్యేకంగా వీరు ముస్లిములనే యాచిస్తారు. గనుక, ముస్లిములు వీరిని ఆదరిస్తారు.

అల్లాను సంస్మరిస్తూ, అల్లాకెనాం జపిస్తూ ఇంటింటికీ తిరుగుతూ, ముస్లిములను ఆశీర్వదిస్తారు. కళారూపాలన్నీ ప్రథమంలో ఒకందుకు ఏర్పడినా తరువాత అవి వివిధ రీతులుగా ఎలా పరిణామం చెందాయో ఈ ఫకీరు వేషాలు కూడా అంతే.

వీరు ఒక పెద్ద కంజీరాను చేతిలో ధరించి, తలకు పెద్ద తలపాగా చుట్టీ, మెడలో ఫకీరు పూసలు ధరించి, పొడుగాటి లాల్చీలను ధరించి, మొలకు గళ్ళ లుంగీలను ధరిస్తారు. ప్రతి జట్టుకూ ఇద్దరు ముగ్గురు వుంటారు. మధ్యలో పాటకుడు పాట పాడుతూ వుంటే మిగిలిన ఇద్దరూ అల్లాకేనాం అంటూ వంత పలుకుతారు.

ఉదాహరణకు:

పాడి పంటల్ సల్ గుండాలి.............॥అల్లాకేనాం॥
తల్లి పిల్లల్ సల్ గుండాలి ................."
తల్లి కొడుకుల్ సల్ గుండాలి ..............."
హిందూ ముస్లిం లంతా .................."
వారు హేకం కావాలండి................॥అల్లాకేనాం॥

అంటూ పాడుతూ, మధ్య మధ్య రక్తి కొరకు కర్రతో చేయబడ్డ, ఒక రకమైన కిర్రు శబ్దం వచ్చే, దానిని చేతిలో ధరిస్తారు. హైస్కూలు కాలేజీ విద్యార్థులు వారి వారి వార్షికోత్సవాలలో ఈ కళారూపాన్ని ప్రదర్శిస్తూ వుంటారు. ఈ కళారూపాన్ని ఆంధ్రప్రజా నాట్యమండలి, హిందూ మత సామరస్యం కొరకు ఉపయోగించి ఆంధ్ర ప్రజలలో విశేషంగా ప్రచారం చేశారు.