తెలుగువారి జానపద కళారూపాలు/పలనాటి వీర విద్యావంతులు
పలనాటి వీర విద్యావంతులు
ఆంధ్ర దేశంలో పలనాడును గురించి, పలనాటి వీరులను గిరించీ వారి వీర చరిత్రను గురుంచి వారి పౌరుషాలను గురించీ తెలియని వారెవరూ లేరు. అది అన్నదమ్ముల మధ్య చెలరేగిన పోరాట గాథ. విశిష్ఠ మైన రెండు మతాల మధ్య చెలరేగిన స్పర్థ. అదే శైవ, వైష్ణవాల మధ్య వచ్చిన సంఘర్షణ, సామాజికి సాంఘిక న్యాయాల మధ్య జరిగిన విప్లవాత్మక
పోరాటం. పౌరుషాలకు నిలయం పలనాటి భారతం ఆ వీరగాథల్నీ ప్రచారం చేసే వారే వీర విద్యావంతులు.
ఈ నాటికీ వీర గాథల్ని చెప్పే వీర విద్యావంతులు గుంటూరు జిల్లాలో చెపుతూనే వున్నారు. వీరు గాక వీరశైవమతానికి చెందిన పిచ్చుకుంటుల వారూ, కాటమరాజు ఖడ్గ తిక్కన కథలు చెప్పే కొమ్మువారు కూడా ఈ వీరకథల్నీ గానం చేస్తున్నారు.
- శ్రీనాథుని వీర చరిత్ర:
ఎవరు కథలు చెప్పినా అందరూ శ్రీనాథుడు వ్రాసిన పల్నాటి వీర చరిత్రనే ఇరవై అయిదు భాగాలుగా రోజుల తరబడి చెపుతూ వుంటారు.
అయితే ఆ వీరుల పౌరుషాలను వల్లిస్తూ చిలువలు పలువలు కల్పించి మరి కొన్ని గాథల్ని కూడ ప్రచారం చేశారు. అలా శ్రీనాథుని చరిత్రను ఆధారం చేసుకుని కొండయ్య కవి మరికొన్ని గాథలను కూడా రచించి ప్రచారంలోకి తెచ్చినట్లు చెపుతారు.
అయితే కొన్నికథలు ఈనాటికీ కొన్ని కంఠస్థంగా వున్నవీ, తాళపత్ర గ్రంధాలలో వున్నవీ కూడా వున్నాయి. అయితే వీటినన్నిటినీ ఒక చోటుకు చేర్చే ప్రయత్నం జరగక పోయినా, అక్కిరాజు ఉమాకాంతం గారు ప్రథమంలో బాలచంద్రుని కథను ప్రచారంలోకి తీసుక వచ్చారు. ఆ తరువాత పింగళి లక్ష్మీకాంతం గారు మరికొన్ని గాధల్ని వెలుగులోకి తెచ్చారు. అలాగే కాటమరాజు కథల్ని, పరిశోధించిన డా॥ తంగిరాల సుబ్బారావు గారు కూడా ఇరవై అయిదు కథల్ని వెలుగులోకి తెచ్చారు. అలాగే ముదిగొండ వీరభద్రకవి గారు వీర భారత గ్రంధంలో అనేక గాథల్నీ వర్ణించారు. ఇక మద్రాసు ప్రాచ్య లిఖిత గ్రంధాలయంలో పల్నాటి వీరచరిత్రకు సంబంధించిన వివరాలు కొల్లలుగా దొరుకుతాయి.
- కన్నమదాసు వారసులే కథకులు:
సంప్రదాయంగా ఈ వీర గాధల్ని ప్రచారం చేసేవారు, వీర విద్యావంతులైన మాల కన్నమదాసు కులానికి చెందిన వారు చెపుతారు. ఇది వారి పారంపర్య హక్కుగా భావిస్తారుట: బ్రహ్మనాయుడు మాల కన్నమదాసుని చేరదీసి కులమత భేదాలు లేవని చాపకూటి సిద్ధాంతాన్ని అమలుపర్చాడు; అందువల్ల పల్నాటి వీర గాథల్ని ప్రచారం చేయడానికి బ్రహ్మనాయుడు, మాలలనే ఆదేశించాడనే కథ ప్రచారంలో వుంది. ప్రచారానికి నిదర్శనం ఈనాటి వీర విద్యావంతులే.
గతించిన చరిత్రలో కాకతీయుల కాలంలో ఓరుగల్లు వీథుల్లో పల్నాటి వీరగాథల్ని చెప్పినట్లూ, వారుపయోగించిన వాయిద్యాలను గురించీ, వాటి ఉధృత ధ్వనులను గూర్చీ క్రీడాభిరామంలో ఉదహరించబడింది.
- వీర పూజతో వీరుల దినోత్సవం.
పలనాడులో ప్రతి సంవత్సరం కారెంపూడిలో నాగులేటి ఒడ్డున, బాలచంద్రుని గుడివద్ద వీరుల దినోత్సవం జరుగుతుంది. ఈ వుత్సవానికి పలనాడులో నున్న ప్రజలందరూ తిరునాళ్ళలా తరలి వస్తారు. ఈ వుత్సవం దాదాపు ఇరవై రోజులు జరుగుతుంది. ఈ నాటికీ పలనాటి వంశీకులమని చెప్పుకునే వీర విద్యావంతులు ఆ వీరుల్ని, ఆ వీర గాథల్నీ తలచుకుని పులకించిపోతారు. వీరపూజ చేస్తారు. సాంబ్రాణి ధూపంతో వివిధ వాయిద్యాల ధ్వనుల హోరులో పూనకం తెప్పించుకుని గణాచారులై ఉగ్రులై పోతారు. పొరుషంతో వూగిపోతారు. వారి వారసులుగా దుఖిస్తారు. చివరి రోజున పలనాటి యుద్ధానికి కారకులైన నాగమ్మ పాత్రను వేషంగా ధరింపచేసి కారెంపూడి వీధుల్లో వెంటబడి తరుముతారు. అలా ఊరి బయటి వరకూ తరిమి నాగమ్మ శిగను కత్తిరించి నానా తిట్లూ తిట్టి పరాభవిస్తారు. అలా వారికున్న కక్షనంతా తీర్చుకుంటారు.
వీరుల దినోత్సవం జరిగినంత కాలం ఎక్కడెక్కడి వీర విద్యావంతులు, కారెమపూడికి తరలివచ్చి, కారెమపూడిలో కథలు చెపుతారు. నాగావళిలో స్నానం చేసి బాలచంద్రుని గుడి ముందు 'బాలుడో, చెన్నూడో' అంటూ అరుస్తూ వారి వారి మొక్కుబడులు తీర్చు కుంటారు.
వారి వీరావేశాన్నంతా వివిధ వాయిద్యాల ధ్వనులలో వెల్లడిస్తారు. ఆ సమయంలో ప్రతివాడు ఒక వీరుడై పోతాడు. ఉత్సవానికి వచ్చిన ప్రజలందరూ తన్మయులై పోతారు. ఇలా వీర విద్యావంతులు ఈ నాటికి పలనాటిలో కొనసాగిస్తున్నారు.
- వీర విద్యావంతుల వేష ధారణ:
పల్నాటికి చెందిన వీర విద్యావంతులు చెన్నుని దర్శనానికి చెందిన హరిజనులని, పల్నాటి వీరకథాచక్రాన్ని పాడతారనీ ఈ పాడటంలో వీరజోడు (పంబల జోడు) దాని మీద రెండు గంటలు. తిత్తి, తాళం, కత్తి, డాలు ఉపయోగిస్తారని ప్రధాన కథకునితో పాటు ముగ్గురు వంతలు ఉంటారని, ప్రధాన కథకుడు పల్నాటి వీరుడులాగా వేషం వేసుకుంటాడనీ, ఇతడు పన్నెండు బిరుదులు ధరించాడనే విషయం వుందనీ, డా॥ తంగిరాల వెంకటసుబ్బారావు గారు రాష్ట్ర స్థాయి జానపద కళోత్సవాల సంచికలో వివరించారు. అంతే కాక కాశి కోక, తలగుడ్డ, కలికి తురాయి. వెండి రేకుతో చేయబడిన ఉమ్మాహో పిట్ట, చంద్రవంక, అందె, కత్తి, డాలు, వీర జోడు, తిత్తి, తాళం, బొడ్దు గంట, బంజా గుడ్డ, డాలుకు బదులుగా కొందరు పిడికత్తిని పుచ్చుకుంటారు. దీనిని అమజాల అంటారు.
- విలక్షణమైన ఎన్నో హంగులు:
పెద్ద కత్తిని అడ్డ కత్తి అంటారు. కుడి చేతిలో అడ్డకత్తి, ఎడమ చేతిలో అమజాల, కుడికాలికి బిరుదు అందె, పన్నెండు మూరల తలగుడ్డ,
తలగుడ్డలో కలికి తురాయి,కాలికి కుడి ప్రక్క చంద్ర వంక, ఉమ్మాహు పిట్ట, మెడ క్రింద కుడివైపున వున్న రొమ్ముకు తురుమణి (తెలుపు మధ్య ఎరుపు) ఎడమ వైపున రొమ్మున జంజెం గుడ్డ (తెలుపు ఎరుపు రెండు రంగులతో ఏడు మూరలుంటుంది , షరాయి, జంజెము, బొడ్డు గంట, త్రికోణాకారంలో వుండే గుడ్డ, దీని చుట్టూ పూసల మధ్య గంట కట్టబడి వుంటాయి. ఇదీ కథకుని వేషం.
ఇలా పన్నెండు బిరుదులు ధరించి కత్తి తిప్పుతూ వీరావేశంతో కథను పాడుతూ వుంటే, నాటి పల్నాటి బాలచంద్రుడు దివి నుండి భువికి దిగివచ్చినట్టుగా వుంటుందట.
వంతల్లో ఒకడు వీర జోడు వాయిస్తాడు. రెండవాడు తిత్తి పడతాడు. మూడవ వాడు తాళం కొడుతూ ఆఁకొటతాడు. ఈ వీర కథా గానంలో కొంత అభినయం, నాట్యం మిళితమై నడుస్తాయి. కథకుడూ, వంతలూ, అందరూ నిలబడే పాడతారు. పల్నాటి వీర కథలని రాత్రి వేళ వెన్నెల్లో పాడతారే గానీ, దీప కాంతిని ఉపయోగించరట. ఈ ఆచారం ఎందుకు వచ్చిందో తెలియదంటారు డా॥ తంగిరాలవారు.
- ఉత్తేజకర ప్రదర్శనం:
వీరగాథల్ని వీర విద్యావంతులు అనర్గళంగా చెపుతారు. కథాప్రారంభంలో కులదైవమైన మాచర్ల చెన్న కేశవుని ప్రార్థిస్తారు. ఆ తరువాత కథలో వచ్చే వీరులందర్నీ, పేరు పేరునా స్మరిస్తారు. ముఖ్యంగా అంకాళమ్మను ప్రార్థిస్తారు.
వీర గాథలన్నీ వీర రస ప్రధానమైనవి. కథకులు వీరావేశ పరులైన ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తారు. యుద్ధ రంగ భట్టాలలో భయానక బీభత్స రసాలు ఎంతో ప్రాముఖ్యాన్ని వహిస్తాయి. కథకుడు కథా సన్నివేశాలలో పలనాటి పౌరుల పౌరుషాన్ని మన కళ్ళ ముందు ప్రత్యక్షం చేస్తాడు. ముఖ్యంగా సాత్విక అంగికాభినయాలతో సన్ని వేశాన్ని బట్టి నృత్యాన్ని కూడ అభినయిస్తారు. రంగ స్థలాన్నంతా దద్దరిల చేస్తారు.
వీర విద్యావంతులు రాష్త్రంలో మరొక చోట ఎక్కడా కనిపించరు. స్థానిక గాథలకే పరిమితమైన కళారూపమిది. ఈనాడు వారి వారి ఆర్థిక పరిస్థితుల ననుసరించి సాంప్రదాయకమైన వేషధారణతో కథలు చెప్పలేకపోతున్నారు. నానాటికీ వీర విద్యావంతుల కళ హీనస్థితిలో పడి పోతూ వుంది. దానిని పునరుద్ధరించాల్సిన అవశ్యకత ఎంతో వుంది.