Jump to content

తెలుగువారి జానపద కళారూపాలు/దండిగా ప్రచారమైన దండా గానం

వికీసోర్స్ నుండి

దండిగా ప్రచారమైన దండా గానం

దండా గానమనేది ఇతర ఆంధ్ర జిల్లాలలో ఎక్కడా ప్రచారంలో లేక పోయినా తెలంగాణా ప్రాంత పల్లె ప్రజలలో మాత్రం బాగా ప్రచారంలో వుంది.

దండా గానమనేది అల్లాకేనాం అంటూ పాడే ఫకీర్ల పాటకన్నా కొంత భిన్నంగా వుంటుందనీ, అందులో ఉరుదు పదాలు, ఉరుదు భాషోచ్ఛారణా తక్కువగా వుంటుందనీ జయధీర్ తిరుమల రావు గారు తమ ప్రజా కళారూపాల గ్రంధంలో వివరిస్తూ, ఈ పాటల్లో మొత్తం తెలంగాణాలో జరిగిన వీరోచిత పోరాటాల చరిత్ర వస్తుందనీ, ఐతే నైజాంలో ముఖ్యంగా పోలీసు చర్య తరువాత ప్రజాజీవితంలో వచ్చిన మార్పుల్నీ వారి ఆశయాలనూ, అభిశంసలను ఈ గానంలో ప్రతి బింబించారనీ వ్రాశారు.

ఫకీర్ల పాటల్లో కనిపించే సాధారణ పదాలు ఇందులో వుండవు. అయితే తెలంగాణా ప్రజా పోరాట కాలంలో దీనిని ఒక పెద్ద కళారూపంగా మలిచారు. అలాగే పారంపర్యంగా వస్తున్న దండా గాన కళా రూప స్వభావాన్ని కొంత మార్చటం కూడా జరిగిందంటారు తిరుమల రావుగారు.

పాటల్లో ప్రజలను ఉత్తేజ పర్చటానికి మీసాన్ని మెలివేయటం ఆవేశంతో హావభావాలను చూపించడం జరుగుతుంది.

కళారూపంలో తెచ్చిన మార్పు:

ఫకీరు పాటలకు ప్రధానమైన 'అల్లాకేనాం' అనే పల్లవినే ఈ పాటల్లో పరిహరించారు. ఉరుదు భాష ఉచ్ఛారణను తీసి వేశారు.

అందువల్ల ఈ దండా గాన కళా రూపాన్ని, అమ్ములు ధరించిన కోయ వేషాలతో ప్రదర్శించారని సుద్దాల హనుమంతు తెలిపారు.

దీనిని ప్రదర్శించటానికి ఇద్దరు వ్వక్తులుంటే చాలు. వారు ఎర్రని లుంగీలు ధరించి నల్ల బనీన్లు తొడుక్కుని మోకాలి వరకు వ్రేలాడే పంచెను నడుముకు కట్టి, కోర మీసాలు ధరించి మెడలో ఫకీరు పూసల దండను వేసుకుంటారు. ఎర్రని రిబ్బన్ తలకు కట్టుకుంటారు. ముంజేతికి ఇత్తడి గాజులు ధరించి చేతిలో ఒక పొట్టి కర్రను దండంగా ఉపయోగించి, గాజులున్న చేతితో పట్టుకుని ఆ కఱ్ఱతో గాజులను తాళంగా కొడుతూ లయ తప్పకుండా ఒకరి తరువాత ఒకరు గానం సాగిస్తారు.

కుడిచేతితో గాజులు కొడుతూ ఏడమ చేతితో రుమాలును వూపుతూ, అదే చేతితో మీసాన్ని మెలివేస్తూ, ప్రజలను ఉత్తేజపరుస్తూ, ఉత్సాహపరుస్తూ పాటలను పాడుతారు. లేదా అమ్ములు ధరించి కోయవేషంతో ప్రదర్శిస్తారు.

సుద్దాల హనుమంతు విజయ గీతం:

సుద్దాల హనుమంతు ఈ దండాగానాన్ని దీర్థంగా నాటి పరిస్థితులను వివరిస్తూ విజయ గీతం వ్రాశాడు. ఆ గీతంలోని ముఖ్య విషయాలను ఇక్కడ వివరిస్తున్నాను.

ఓ భారతీయులార మీరు బాగ వినరండీ
భారత కాంగ్రెసు రామరాజ్య మిదండీ
నేవాలుగాను వ్రాసితి నొక పూట వినండీ

అంటూ చెప్పే విషయాలు అపార్థం చేసుకోరనీ, నిజాన్ని తెలుసుకోమని, వేష భాషలను చూచి మోస పోవద్దనీ, ప్రజా ప్రభుత్వం వస్తుందనీ, కలలు గన్న ప్రజలు కడగండ్లు చూడండంటూ.

పందొమ్మిది వందల నలుబది ఏడాగష్టు నా
ప్రజలెల్లరూ ద్వేషించేటి బ్రిటిషు పాలనా
కోటాను కోట్లు ప్రజలు తిరుగుబాటు కతనా
ఖ్యాతిగను రాజ్య మప్పగించిపోయిరిగానా


అంటూ పరాయి పాలన పోయి కాంగ్రెసు ప్రభుత్వం వచ్చిందనీ, ప్రజలందరూ సంతోషించారనీ, ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసి గనుల సంపదను వెలికి తీసి ప్రజలందరికీ తిండీ బట్టా, వుండటానికి ఇల్లూ, దున్నటానికి భూమి, ప్రజలందరికి సకల సౌకర్యాలు చేకూరతాయని ఆశించారు. అంటూ

అధికారములో కొచ్చిన నెహ్రూ ప్రభుత్వమూ
విధి తప్పి నడవ సాగెనూ దినదిన ప్రమాణమూ
ఐదేళ్ళు గదువవచ్చెను ప్రతి అంశములోనూ
బీదల హక్కుల నన్నిటి బూడిదలో త్రొక్కెనూ

అంటూ నెహ్రూ ప్రభుత్వమూ, ఆ ప్రభుత్వ తాబేదారులూ ప్రజల ఆశలను అడియాసలు చేశారంటూ.

దిన దినం ప్రజల జీవిత మతిభారమయింది
ధనవంతుల భూస్వాముల దోపిడి పెరిగింది
అసాధ్యమైన నిరుద్యోకత అధిక మయ్యింది.

కర్మాగారములందే పదిలక్షల మంది
కార్మికుల జీవితాల విలువ తగ్గి పోయింది
నిరుపేద గణము ఆత్మహత్యలకు గురి అయింది

అని చెపుతూ

తిన తిండి లేక ప్రజలు కష్ట స్థితి కొచ్చారు
న్యాయమైన హక్కుల కోసం పోరాడుతున్నారు
పోలీసుల దౌర్జన్యంతో ప్రజలను వీరూ
బలవంతముతో నోరు మూయించగలిగారూ.

అని అంటూ 1948 సెప్టెంబరు లో నైజాంలో క్రూర రజాకార్లను అణుస్తామంటూ తెలంగాణా అంతా భారత సైన్యాన్ని దించారు. మత పిశాచంతో కొంతమంది హతమై పోయారనీ, రజాకార్ల నాయకులైన రజ్వీ సయదద్భుల్ రహమాన్ ఇస్మాయిల్ మొదలైన కసాయి వాళ్ళందరూ పాకిస్థాన్ చేరిన తరువాత ఏ కమ్యూనిష్టులైతే రజాకారుల్ని అణచారో ఆ కమ్యూనిస్టుల్ని నెహ్రూ ప్రభుత్వం ఎలా అణచిందీ సుద్దాల హనుమంతు తన విజయ గీతం ద్వారా వివరించాడు.