తెలుగువారి జానపద కళారూపాలు/గొరగ పడుచుల గొండ్లి నృత్యం

వికీసోర్స్ నుండి

గొరగ పడుచుల గొండ్లి నృత్యం


వీరు మైలార దేవర వీర భటుల
గొండ్లి యాడించు చున్నారు
గొరగ పడుచు నాడుచున్నది
చూడు మూర్థాభి నయము
తాను నెట్టి క శీలంత గాని లేదు.. ( క్రీడాభిరామం)

కాకతీయుల కాలంలో గొండ్లి అనే కుండలాకార నృత్యం ద్వారా బతకమ్మ, బొడ్డెమ్మల వుత్సవాల సమయాల్లో పిల్లన గ్రోవు లూదుతూ, ఆటలు, ఆడుతూ కుండలాకార నృత్యాలు చేసినట్లు మనకు ఆధారాలు కనిపిస్తున్నాయి. దీనిని బట్టి గొండ్లి నృత్యాలు అనాదిగా మన సంస్కృతితో సంబంధమున్నట్లు తెలుసు కోవచ్చును.

భిన్నాభిప్రాయాలు:

గొండ్లి నృత్యాన్ని గూర్చి పండితుల్లో వివిధ అభిప్రాయలున్నట్లు నాటరాజ రామకృష్ణగారు జానపద కళల ప్రత్యేక సంచికలో వివరించారు.

గొండ్లి అనేది కుండలాకారంగా చేయబడే నృత్యమనీ, అది కుండలి నృత్యమనీ కొందరు పండితుల అభిప్రాయాలను వెల్లడించారు.

అయితే నందికేశుడు తన భరతార్ణవంలో శుద్ధ, దేసి, పేరిణి, ప్రేంకణం, కుండలి, దండిక, కలశములనే సప్త దేశి తాండవ రీతుల్ని గూర్చి వివరించాడు.

అందులో "కుండలి" నృత్యాన్ని గురించి పరిశోధించినట్లైతే అది శాస్త్రీయ కరణాంగహార చారీ భేదాలతో కూడిన నృత్యంగా తెలుస్తూంది. అంతే గాక అది కుండలాకారం చేయబడే నర్తనం కాదు, బృంద నర్తనం అసలే కాదనీ, ఏక పాత్ర నృత్య కేళిక విధానం కుండలి అని అంటారు రామకృష్ణగారు.

కుండ నృత్యంలో, నారాయణ కరణము మత్తల్లికాచారి __ లక్ష్మీ శతాళంతో ప్రదర్శిత మౌతుంది.

గొండ్లి, గోడులు:

గొండ్లి అంటే అది గోండులచే చేయబడే నృత్యంగా పేర్కొన్నారు. గోండులు అతి ప్రాచీనమైన తెగకు సంబంధించిన వారు. వీరిది ప్రాచీనమైన సంస్కృతీ వికాసం గల నాగరికత, వీరు అడవులలో నివసించే జాతి. వీరిలో రాజ గోండులు ముప్పై ఆరు సంస్థానాలను స్థాపించుకుని "చత్తీసుఝడ్" పేరుమీద రాజ్యపాలన చేశారు.

ఆ ప్రాంత మంతా ఈ నాటికిమధ్య ప్రదేశ్ లో ఛత్తీస్ ఝడ్ గా పిలువబడుతూ వుంది. ఆంధ్ర దేశాన్ని ఆనుకొని వున్న ప్రాంతాలైన, చాందా, సిరువంచా, బస్తర్ మొదలైన సంస్థానాలను రాజ గోండులు పాలించారు. ఆనాడు ఆంధ్ర దేశాన్ని పారిపాలించిన రాజులకూ, వారికీ సన్నిహిత సంబంధాలుండడం వల్ల గోండులలో వున్న నృత్త రీతులు ఆంధ్ర దేశంలో కూడ ప్రచారమయ్యాయి. పల్లెల్లో నివసించే గోండులు ప్రదర్శించే నృత్యాలన్నిటిలోనూ, ఖర్మ నృత్యం చాల ప్రాముఖ్యం వహించిందట.

ఖర్మ నృత్యం:

ఖర్మ నృత్యమంటే వర్షరుతువు ప్రారంభమయ్యే రోజుల్లో పంటలు బాగా పండాలని రైతులు చేసే ధర్తీమాత ఆరాధనా నృత్యమిది.

ఖర్మ నృత్యంలో బాగా చిగురించిన విప్పకొమ్మను తీసుకువచ్చి, ఒక కొత్త గుడ్డలో వుంచి వారి వారి ఇళ్ళలో వుంచుతారు, వారు అనుకున్న రోజున పెద్ద పండుగ చేస్తారు. అందరూ ఆనందంగా విందు భోజనాలు చేస్తారు. తరువాత, జంత్ర వాయిద్యాలు, మృదంగ శబ్దాలు మ్రోగు తుండగా, స్త్రీలూ పురుషులూ కలిసి ఆ విప్ప కొమ్మల చుట్టూ తిరుగుతూ, ప్రేమ గీతాల్నీ, ప్రకృతి రామణీయక గీతాల్నీ పాడుతూ అద్భుతంగా నృత్యం చేస్తారట. దీనిని వారు ఖర్మనృత్య మంటారు. ఇది ఒక్క గోండులే గాక, ఇతర అడవి జాతుల వారు కూడ ముఖ్యమైనదిగా ఎంచి నృత్యం చేస్తారు. ఈ విధంగా నృత్య గీతాలతో "ఖర్మ వృక్షాన్ని ఆరాధించి భగవంతుని సంతోష పెడితే పంటలు దండిగా పండు తాయని వారి విశ్వాసం.

బృంద నృత్యం

ఇది కేవలం బృందనృత్యం, స్త్రీలు, పురుషూ కలిసి చేసే నృత్యమిది. ఈ నృత్యం 'చతురశ్ర' 'తిశ్ర' ఏక తాళ గతిలో చేయ బడుతుంది.

వీరి గీతాలు కొన్ని అధ్యాత్మిక పరంగానూ కొన్ని ప్రణయ గీతాలు గానూ, మరి కొన్ని హాస్యరస ప్రాధాన్యత కలిగినవి గానూ వుంటాయి. వారి పాటలీ విధంగా వుంటాయి.

నీ శరీరమును చూచి పొంగకయ్యా
అది ఒకారోజు పైకి పోవాల్సిందేగా
నీ తల్లి దండ్రీ చుట్టములు, బంధువులు
అందరిని విడిచి పోవాలి
నీ యింటిలో నున్న లక్షల ఆస్తిని గూడా
మరణ కాలంలో వదలి పోవాలి.

ఇంకా ఈ విధంగా__

వాద్యములు పలుకుతున్నాయి
ఆ సంగీతాన్ననుసరించి పాదము భూమిపై
నృత్యమాడుతూంది
విడాకులిచ్చిన స్త్రీకి ఒక పైసా
ఉంపుడు గత్తెకు రెండూ, కానీ
అన్నె పున్నెము లెరుగని అబలకు
ఎన్నో వేల మంచి శబ్దములు గల బంగారు నాణెములు.

గోండలీల, గొండ్లి నృత్యము:

గోండలీ తెగకు చెందిన వారు మహారాష్ట్రంలో చాల మంది వున్నారు. నృత్యం చేయడమే వీరి ముఖ్య వృత్తి.

గోండలీలు ఆంధ్ర్రదేశంలో జంగం వారి వంటి వారు. పెళ్ళి మొదలైన శుభ కార్యాలలో గొండ్లిని ప్రదర్శిస్తారు.

నృత్యం చేసే వారి వేష ధారణ, పాదాల వరకూ బుడుగుగా వున్న ఒక కుచ్చుల అంగర కాను గవ్వలతో చేయబడిన ఒక మాలను ధరించి కాళ్ళకు గజ్జెలు కట్టీ తలకు మార్వాడీ తలపాగ చుట్టి కథా నాయకుడు తయారైతే మిగిలిన ముగ్గురూ అతనికి వంతగా నిలబడతారు. అందులో ఇద్దరు చెరో ప్రక్కన వుండి మృదంగాన్ని వాయిస్తే...మూడవ వ్వక్తి వెలుగు కోసం దివిటీ పట్టుకొని నిలబడిన వ్వక్తి విదూషకుడుగానూ, అవసరమైతే వేషధారిగాను సహకరిస్తాడట. వీరు భవానీ స్తోత్రం ప్రారంభంతో నృత్యాన్ని ప్రారంభిస్తారు. ప్రారంభానికి ముందు ఒక బల్లపైన గోధుమలు పరచి, దానిపైన నీళ్ళతో నిందిన ఒక చెంబును కొబ్బరి కాయ పెట్టి దానిని కలిశంగా తయారు చేసి ఆ కలిశాన్ని భవానీ దేవి రూపంగా ఎంచి నృత్యం పూర్తి చేస్తారు. నృత్యానంతరం కొబ్బరి కాయ కొట్టి అందరికీ ఫలహారంగా ఇస్తారు.

ప్రజారంజకమైన ప్రదర్శనం:

ముఖ్యంగా వీరిని పెళ్ళి మొదలైన శుభ కార్యాలకు ఆహ్వానిస్తారు. ఒకోసారి కేవలం, వినోద కాలక్షేపంగా కూడా ప్రదర్శనం ఇస్తారు. ఈ ప్రదర్శనంలో ప్రధాన కథకుడు ముందు వెనుకలకు నడుస్తూ నృత్యం చేస్తూ కథను సాగిస్తాడు. వాద్యకులు అతన్ని అనుసరిస్తూ, కథకుని

రాజా గోండ్

కష్టంలో పాలు పంచు కుంటూ, మధ్య మధ్య హాస్య చలోక్తులను విసరుతూ ప్రజలకు విసుగు లేకుండా వారిని అలరిస్తాడు. ఈ నృత్యం అధ్యాత్మిక సంప్రదాయానికి చెందిన తాండవ నృత్య రీతి అంటారు. నటరాజ రామకృష్ణ, వీరి నర్తన తీరుకు ఒక ఉదాహరణ.

గొండ్లి నృత్యం తీరు:

నృత్య కథా ఇతివృత్తం అధ్యాత్మిక ప్రబోధానికి సంబంధించింది. నే నెవర్ని ఎక్కడ నుండి వచ్చాను. ఈ పరమ రహస్యం ఇంత వరకూ ఎవరూ తెలుపరైరి. అంటూ__

నర్తన గీతం:

తల్లీ తండ్రీ - అక్క తమ్ముడు - వీరంతా మాయ
వీరంతా నావారేనని తలచి స్వార్థంకోసం
జీవితం వృథా పుచ్చుకున్నాను
విషయ వాంఛ నరకానికి మొదటి మెట్టు
మానవుడు ఏ కారణం లేక దానిలో
చిక్కు కున్నాడు __ ఓయీ నరుడా|
నీ గురువుని తలుచుకో (అంటే జ్ఞాన మిచ్చే వాడని అర్థం)

గొండ్లి, గోండలీ, నృత్యాలనబడేవి మధ్య ప్రదేశ్ మహారాష్ట్రాలలో ప్రదర్శింప బడుతున్న, మూడు రాష్ట్రాల సరిహద్దులూ, అరణ్య ప్రాంతాలవడం, అడవి జాతుల గిరిజనులు ఇరుగు పొరుగు సంబంధాలూ, బాంధవ్వాలూ, రాకపోకలతో, తెలుగు దేశంలో కూడ సరిహద్దు ప్రాంతాలలో, గోండ్లి, గోండలీ నృత్యాలు జీవించి వున్నాయి. గొండ్లి నృత్య కథా ఇతి వృత్తాలను బట్టి చూసినా ప్రదర్శించే ప్రదర్శన విధాన్నాన్ని చూసినా తెలుగు నాట ప్రదర్శింప బడే, బుర్ర కథా, పంబ కథా, జముకుల కథా, ఒగ్గు కథా మొదలైన కథల బాణీలో వుంది... ఇది కేవలం జానపద నృత్యం అంతేకాదు. గిరిజనుల నృత్యం కూడా, గొండ్లి నృత్యం... శైవ సంప్రదాయాన్ని ప్రచారంలోకి తీసుకు వచ్చింది. మహారాష్ట్రంలో కూడా, ఈ నృత్యాన్ని దేవీ స్తోత్రంగా చేస్తున్నారు.

ఇక గోండుల ఖర్మ నృత్యం గిరిజనుల్లో తప్పా, జానపద నర్తకుల, నర్తన రీతుల్లో మనకు ఎక్కడా కనిపించదు... జంగం


కథా, గొండ్లి ఒకే రకమైన కళారూపంగా వర్థిల్లి వుండ వచ్చని నటరాజ రామకృష్ణగారు అభిప్రాయ పడుతున్నారు.

ఈ నాటికీ గోండు జాతి నృత్యాలు:

ఈనాటి తెలంగాణాలో కేసలాపురం భీమదేవు దేవాలయం గోడు జాతికి సంధించినది. ఇక్కడ గోండు జాతివారు గొప్ప జాతర జరుపుతారు. జాతర వుష్య మాసం తరువాత ప్రారంభమౌతుంది. పదిహేను రోజుల పాటు జరుగుతుంది.

వేలాది గోండు జాతి ప్రజలు గుమికూడతారు. ఈ వుత్సవంలో పాల్గొన డానికి గోండు కవులూ, వాయిద్య కారులూ, పాటకులూ అందరూ హాజరయి ప్రధాన వాయిద్యాలను వాయిస్తూ వుండే పాట కాండ్రు భక్తి గీతాలు పాడతారు.

ఈ వుత్సవాలలో వివాహమైన పెండ్లి కూతుళ్ళు, ప్రధాన పాత్రలు వహిస్తారు. విగ్రహం ముందు నిలబడి రాత్రి తెల్లవార్లూ తన్మయీ భావంతో వివిధ రకాలైన నృత్య ప్రదర్శనాలు జరుపుతారు. ఈ ప్రదర్శనలకు గోండు ప్రజలే కాక ఇతర కులాలకు చెందిన వారు కూడ హాజరై ఆనందిస్తారు.