Jump to content

తెలుగువారి జానపద కళారూపాలు/గంట జంగాలు

వికీసోర్స్ నుండి

గంట జంగాలు

శైవ, వీరశైవ మతానికి చెందిన వీరముష్టులూ, జంగాలూ, వారి వారి కళారూపాలే కాకుండా ఒంటరిగా జంగం దేవర వేషంలో ఇంటింటికీ తిరిగి వ్యాచిస్తూ వుంటారు. సాంబసదాశివ సాంబ సదాశివ, శంభో శంకర అంటూ శంఖాన్ని పూరిస్తూ, నందిమకుటంగా గల గంటను వాయిస్తూ, బసవ పురాణంలోని బసవేశ్వరుని సూక్తులను సోదాహరణంగా ఉదహరిస్తారు.

బసవేశ్వరుడుగా వేషధారణను తీర్చి దిద్దుకుంటారు. వారిలో ఎంతో పూజ్యభావం గోచరిస్తుంది. పైనుంచి క్రిందికి అంగరఖాను తొడుగుతారు. తెల్లని తలగుడ్డనూ చుడతారు. మెడకు పొడవాటి అంగ వస్త్రాన్ని ధరింస్తారు. ముఖానికి గంభీరంగా విభూతి రేఖలను దిద్దుతారు. గంట వాయిస్తూ, శంఖం పూరిస్తూ వచ్చే గంట జంగాన్ని సాక్షాత్తు బసవేశ్వరుడని ఊహించి ఇంట్లో వారంతా భిక్షను వేస్తారు. భిక్షను స్వీకరిస్తూ మంత్రాన్ని ఉచ్చరిస్తూ విభూతి నిస్తారు. శంభో శంకర అంటూ, గంట చుట్టూ ఒక పుల్లను త్రిప్పుతూ ఓంకార నాదాన్నీ పలికిస్తారు. పిన్నలూ, పెద్దలూ అందరూ పూజ్య భావంతో విభూతిని స్వీకరిస్తారు. ఈ రకంగా గంట జంగాలు వీర శైవ మతాన్ని ప్రబోధించే ప్రచారకులుగా జీవిస్తూ ఊరూరా తిరుగుతూ వుంటారు.