తెలుగువారి జానపద కళారూపాలు/కోటప్పకొండ ప్రభల విన్యాసం

వికీసోర్స్ నుండి

కోటప్పకొండ ప్రభల విన్యాసం


గుంటూరు జిల్లా నర్సారావు పేటకు దగ్గరగా వున్న కోటప్ప కొండ, శైవక్షేత్రమైన పుణ్య క్షేత్రం. ప్రతి శివరాత్రికీ బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతుంది. తిరుపతి కొండకు వెళ్ళి మ్రొక్కులు తీర్చుకున్నట్లే ఇక్కడ కూడ వేలాది మంది మ్రొక్కులు తీర్చుకుంటారు. ఎవరికి వారు మ్రొక్కులు తీర్చుకోవడానికి వస్తూ పెద్ద పెద్ద ప్రభలను కట్టి వాటిని ఎంతో అందంగా అలరించి ఒకరిని మించి ఒకరు పోటీలు పడి ఈ ప్రభలను నిర్మిస్తారు.

ముద్దుల ఎద్దుల అలంకారం:

ప్రభల బండ్లకు కావలసిన ఎడ్లను ఎంతో ముద్దుగా పెంచుతారు. అందు కోసం వాటికి మంచి తిండి తయారుచేస్తారు. బిడ్డలను సాకినట్లు సాకుతారు. వాటికి మెడలో మువ్వల పట్టెడ, గంటల పట్టెడ, మూతికి అందమైన శికమార్లు, నడుంకు తోలు బెల్టు, ముఖానికి వ్రేలాడే కుచ్చులు, కొమ్ములకు రంగులు, కాళ్ళకు గజ్జెలు, వీపుమీద రంగు రంగుల గుడ్డలు అలంకరిస్తారు. ప్రభలు బయలుదేరి వస్తూవుంటే ఈ ఎడ్ల సౌందర్యాన్ని చూడడానికి జనం మూగుతారు. ప్రభలు వారి వారి శక్తి కొలది పెద్ద పెద్ద ప్రభలను తీసుకు వస్తారు. ఆ ప్రభలను రంగు రంగుల గుడ్డలతో, రంగుల కాగితాలతో, ఫోటోలతో అలంకరిస్తారు. శక్తి కలవారు జనరేటర్ పెడ్డి ప్రభలకు ఎలెక్ట్రిక్ బల్బులను అమర్చుతారు.

ప్రభల విన్యాసం:

అలంకార శోభితమైన ఈ ప్రభలు వూరేగింపుగా బయలుదేరితే, మ్రొక్కుబడులున్న వారు భక్తి శ్రద్ధలతో ప్రభ ముందు నడుస్తారు. ప్రభ ముందు తప్పెట వాయిద్యాన్ని గమకాలతో సాగిస్తూ వుంటే వాయిద్యానికి తగినట్టుగా బండికి కట్టిన ఎద్దులు ఠీవిగా నడుస్తూ వుంటే, అలంకరించిన మువ్వల, గజ్జల, గంతల మ్రోతలు తాళానికి అనుగుణంగా మ్రోగినట్లుంటుంది. ఉత్సాహంతో ఠీవిగా నడిచే ఎద్దులు అప్పుడప్పుడు రంకెలు వేస్తూ వుంటే , సంగీత శాస్త్రంలో ఎద్దు వేసే రంకెను, సప్త స్వరాలలో రెండవది అయిన (రిషభం) అని నిర్ణయించారని కీ॥శే॥ డా. కే.యన్. కేసరి గారు వారి చిన్ననాటి ముచ్చట్ల గ్రంధంలో ఉదహరించారు. రిషభ స్వరం ద్వారా వీర రసం, అద్భుత రసం, రౌద్ర రసం వెలువడతాయని వివరించారు.

కోడె గిత్తలతో నడుప బడే ఈ ప్రభలను నడిపే వారు యుక్త వయస్సులో వున్న యువకులు, చెర్నాకోలను చేతిలో ధరించి తలకు మంచి తలపాగాను అందంగా చుట్టి ఆహ హై చోచో అంటూ ఎడ్లను అదిలిస్తూ కోర మీసం దువ్వుతూ చలాకీగా ఎడ్లను తోలుతూ వుంటే పౌరుషంతో కోడె గిత్తలు ముందుకు సాగిపోతాయి. ఇలా బయలు దేరిన ప్రభల బండ్లు ఆయా గ్రామలగుండా ప్రయాణించేటప్పుడు గ్రామస్థులు ఎదురు వచ్చి స్త్రీలు కడవలతో వార పోయగా, పురుషులు కత్తి చేత బట్టి, దండకాలను చదువుతారు. ఇలా చదివేవారు జంగాలు,ఆరాధ్య బ్రాహ్మణులు.

శరభ శరభ:

శైవులు, వీర శైవులు పలు సందర్భాలలో దక్షయజ్ఞ దండకం చదివినట్లె

ఇక్కడా చదువుతారు. ఇలా చదివేటప్పుడు ఖడ్గధారులు ప్రభ ముందు నిలబడి వెనకకూ ముందుకు నడుస్తూ ఎగిరెగిరి గంతులు వేస్తూ పరవళ్ళు

త్రొక్కుతూ వుంటే పక్క నున్న వాళ్ళు బుంజ వాయిద్యాన్ని, తప్పెట వాయిద్యాన్ని వాయిస్తూ, కొమ్ము బూరగాలనూ, కాహళాలనూ ఊది దండక చదువరిని వుత్తేజ పరుస్తారు.