తెలుగువారి జానపద కళారూపాలు/కురవల కురవంజి

వికీసోర్స్ నుండి

కురవల కురంజి

ఆయా రాజుల కాలాల్లో ఎన్నో కళలు అభివృద్ధి చెందాయి. అయితే నాటినుంచి నేటిదాకా ఏదో ఒక రూపంలో కురవంజి కళారూపం బ్రతికే వుండి. ముఖ్యంగా ఈ నాడు తమిళనాడులో జీవించే వుంది. ఆ మాటకొస్తే ద్రావిడ సీమ లన్నిటిలోనూ ప్రాముఖంలోకి వచ్చింది. ఇక ఆంధ్ర దేశంలో సొదెమ్మో సోదె అంటూ వచ్చే ఎరుకల వారిలో కురవంజి జీవిత రేఖలు కనిపిస్తూ వున్నాయి.

కురవంజి ఒక జానపద దృశ్యకావ్యం. కురవంజి అంటే, ఎరుకలసాని, పూర్వం ఈ ఎరుకలసాని సంఘంలో ఎక్కువ పలుకుబడి సంపాదించుకుంది. ఆ నాడు విజయనగర రాజుల కాలంలోనూ ఎరుకలసాని ఎంతో ప్రాముఖ్యత వహించింది. ఈ ఎరుకలసాని వినోద కాలక్షేపానికీ యదాలాపంగా ఆటలు పాటలు జోడించి ప్రారంభించిన కళారూపం కురవంజి.

అసలు అర్థం:

కురవంజి అనగా ఒక నృత్య విశేషంతో కూడిన అడుగు. అడవులలో నివసించే కురవలనేవారి అడుగు కాబట్టి, దానిని కురవంజి అని కూడ పిలుస్తూ వచ్చారు. గంతులూ, చిందులు, గొండ్లి, అంజె అనేవి నృత్య విశేషానికి సంబందించిన పర్యాయపదాలు.

కురవంజి కళారూపం ఆటవికులది. మానవుల అడవుల్లో నివసించే కాలంలో ప్రచారంలో కొచ్చిందీ కళారూపం. ఆనాటికీ ఈ నాటికీ పుణ్యక్షేత్రాలుగా వున్న సింహాచలం, దేవాలయంలోనూ, మంగళగిరి నృసింహ దేవాలయంలోనూ, విజయవాడ కనకదుర్గ దేవాలయం వద్దనూ, శ్రీ శైల మల్లిఖార్జున దేవాలయం వద్దనూ, తిరుపతి కొండమీదా సంవత్సరం పొడుగునా యాత్రా వుత్సవాలు జరుగుతూ వుండేవి. దేశం నలుప్రక్కల నుండీ, స్వామి దర్శనార్థం యాత్రికులు వచ్చి పోతూవుండేవారు.

వినోద ప్రదర్శనగా కురవంజి:

ఇలా వుత్సవాలకు వచ్చిన యాత్రికుల వినోదార్థం ఆటవికులైన కురవలు, వినోద ప్రదర్శనలు ఇస్తూ వుండేవారు. ఈ వినోదాన్ని యాత్రికులు ఎంతగానో మెచ్చుకుని వారికి మంచి మంచి బహుమతులను దానం చేసేవారు.

ఏ మాత్రం నిర్మాణ పటుత్వంలేని అడుగులనే ప్రారంభదశలో ప్రారంభించినా క్రమేపీ వారి ఆడుగులకు ప్రేక్షకులు అమిత వుత్సాహాన్నిచ్చిన తరువాత కురవంజి అడుగు ఒక కళారూపంగా ఆభివృద్ధి చెందింది.

కురవంజులు వేషధారణలో అడవిజంతువుల రక రకాల చర్మాలూ, నెమలి ఈకలూ, పందిముళ్ళు, కోరలూ, పులిగోళ్ళూ, ఎలుగుబంటి వెంట్రుకలూ మొదలైన వాటిని ధరించి నృత్యాలు చేస్తూ వుండేవారు.

ప్రారంభ దశలో కాలికి వచ్చిన చిందులు తొక్కి నోటికి వచ్చిన పాటలు పాడి ఆడినా, క్రమేపీ ఒక విశిష్ట రూపాన్ని పొందింది కురవంజి. ఏయే క్షేత్రాల్లో వారు యాత్రికుల వినోదార్థం ప్రదర్శనాలు ఇస్తూ వుండేవారో, ఆ యా పుణ్యక్షేత్రాల మహోత్సవాలను గురించి , కథలల్లి వాటిని ఒక కళారూపంతో చెప్పి,యాత్రికుల్ని ముగ్దుల్ని చేసేవారు. ఇలా ఈ వినోద కాలక్షేపంలోనే రక్తికి రక్తి, భక్తికి భక్తిగా శివలీలలూ, విష్ణుకథలూ చెపుతూ వీనులకూ, కనులకూ విందు చేసేవారు. ఈ విధంగా కురవంజులు చక్కని ఇతివృత్తాలను కథలుగా తీసుకుని వాటిని గేయాలుగా వ్రాయించి, వాటికి క్రమమైన అడుగుల నమర్చి, కురవంజి అడుగును క్రమేపీ ఒక కళారూపంగా ఆభివృద్ధిలోకి తెచ్చారు. ఇలా యాత్రా స్థలాలల్లో పుట్టి పెరిగిన ఈ కొరవంజి కళారూపమే క్రమేపి దేశం నాలుగు మూలలకూ వ్వాపించింది. ఈ కురవంజి కళారూపం ఒరవడినే జక్కుల వారనే (యక్షులు) కళావంతులు మొదలైన వారు కూడ ప్రదర్శనాలను ప్రారంభించారు.

కొత్త రూపానికి, కొత్త కళాకాంతులు:

ఇలా కురవంజి అడవుల నుండి పుణ్యక్షేత్రాలకూ, క్షేత్రాల నుండి ప్రజా సామాన్యంలోకీ ప్రచారం పొంది, క్రమేపీ దేవోత్సవాలలోను ప్రవేశం సంపా

దించి గ్రామ జాతర్లలోనూ, ఘనత గడించి, రాజసభల్లోనూ ప్రవేశం సంపాదించి, ప్రాపకం పొంది ప్రదర్శింపబడింది. ఈ కళారూపాన్ని అడవి జాతులవారి తరువాత అభివృద్దిలోకి తెచ్చినవారు జక్కుల వారు. వీరి నృత్యం కంటే గేయానికి, గానానికి, వచనానికి ప్రాముఖ్య మివ్వడం వల్ల అవి యక్షగానరూపంలో అభివృద్ది పొందాయి.

ప్రాథమిక దశలో కురవంజి ఒక క్రమం లేకుండా ప్రదర్శిపబడేదని వినికిడి. కథలో వచ్చే అన్ని పాత్రలకూ ఒక్కడే నిర్వచనం రాను రానూ నాటకాల్లోని నాందీ ప్రవస్తావన, సూత్రధారుడు, నటి, నర్తకి విటుడు, విదూషకుడు, చేటకుడు, మాదిరి, సింగీ సింగడూ వచ్చి పురుష పాత్రలకు సింగడూ, స్త్రీ పాత్రలకు సింగీ ప్రాతినిధ్యం వహించేవారు. ఈ పాత్రల మధ్య ప్రేక్షకులను నవ్వించేందుకు తోలుబొమ్మ లాటలో జుట్టు పోలిగాడి మాదిరి - కొంటె కోణంగి ఒకడు ప్రవేశించి _ సింగీ సింగని మధ్య చెణుకులు వేస్తూ_ ఇద్దరి మధ్యా కయ్యాలు పెంచి పరిష్కరించేవాడు.

ఇలా కురవంజి కళారూపం క్రమానుగతంగా పరిణామం పొందింది. కురవలు ఈ కళారూపాన్ని ఏదో వినోదం కొరకు ప్రారంభించినా క్రమేపీ ఇది వారి జీవనోపాధికి తోడ్పడింది. ఏ క్షేత్రంలో వారి కార్యక్రమం వుంటుందో ఆ యా యాత్రా స్థలం యొక్క పవిత్ర కథల్నీ, గాథల్నీ ఆశువుగా చెప్పి వారు యాత్రికుల్ని ముగ్దుల్ని జేసేవారు.

ద్రావిడ కళారూపం:

ఇలా పరిణామం పొందిన కురవంజి కళారూపం, ఈ నాడు మన ఆంధ్ర దేశపు ప్రదర్శనాలలో మచ్చుకు కూడా కనిపించక పోయినా, ఇది సోదె చెప్పేవారిలో కొంచెం మిగిలి వుంది.

కాని దక్షిణ దేశంలో "కొఱత్తి యాట్టమ్", కన్నడ దేశంలో "కొఱవంజి" , తెలుగు దేశంలో "కురవంజి ఎరుకలసాని" అని ప్రచారం పొందింది.

ఆంధ్రదేశంలో జీవ కొరవంజి రామమోహన కొఱవంజి,జానకీ నుభోల్లాస కొఱవంజి అనే నాటకాలు ప్రచారంలో వున్నాయి. శుకసప్తతి కథలు వ్రాసిన కదిరీపతి ఒక రాజుగారిని దర్శింప వచ్చిన కొఱవంజిని జూచి,

ఇరుకువలి గుబ్బచన్నుల - యఱుకుజవరా లొకొర్త 'ఎఱుకోయవ్వా,
యెఱుకో'యని తన చందం - బెఱుకవడంగా హజార మెలమిం గదిసెన్.

అప్పుడప్పుడంతుక తెఱం గమ్మహేంద్రుండు పరిచారికా జనంబులవలన విన నవధరించి సమ్ముఖమునకు రావించిన,

నవరని వని వన్నెఱవిక పిక్కటిలంగ గులుకు పాలుబ్బు గుబ్బలు చెలంగ
ముంజేతులను ముఖాంబుజమున నొక వింత పొలుపు దెల్పెడు వచ్చబొట్టు లెసగ
గుఱుమాపు పయ్యెంటచెఱగులో నిడుకొన్న ముద్దుబల్కుల చిన్నిబుడత డమర
దరతరంబులనుండి తమ ఇంట వెలయు పుత్తడి పైడిబుట్ట మస్తమున వెలుగ
బొమలసందున నామంబు, భూతి పూత-నెన్నొసట, బుక్కిట విడెంబు, కన్ను గొనల
గాటుక రహింప వచ్చి యా క్ష్మాతలేంద్రు - చరణముల కోరగా మొక్కి చక్కనిల్చి.

అని ఈ విధంగా ఆ నాటి ఎఱుకలసాని వేషధారణను వర్ణించాడు.

1.ఇది దారికట్టు మొనక-ట్టిది కాంతావశ్యకర మిది నీమది కిం
పొదవించు నో నరేశ్వర-పదిలంబని తెల్పి కొన్ని బదనిక లొసగెన్

2.తలపున నిది గారడమని-తలపకుమా, సింగడల్ల తఱిగొండదరిన్
దలమోచి తెచ్చినవి ఇవి తలనుంచుము పసిడితాయెతల నుంచి నృపా.

అని ఈ విధంగా ఎఱుకలసాని విద్యలను వర్ణించాడు. ఇంకా ఎఱుకలవారి పుట్టు పూర్వోత్తరాలను గురించి వెంకటరాయ కవి వ్రాసిన లేపాక్షి జలక్రీడల్లో ఈ విధంగా వర్ణించాడు.

...అఖిల భూతముల - తెరగెల్ల భంగులు తెల్లంబుగాను
ఎఱుక గల్గినవార మాటకు మమ్ము
యెరుకల వారని యందురే చెలియ

అంటూ తనకు వచ్చిన విద్యలన్నింటిని వివరిస్తుంది.

కురవంజి నేర్చిన విద్యలు:

స్తంభన, వశీకరణ, ఆకర్షణ, ఉచ్ఛాటన, విద్వేషణ, వ్యోమగమన, పరకాయ వ్రవేశాది విద్య లెరుంగుదునే యవ్వా, పరమంత్ర, పర యంత్ర, భేదంబు లెరుగుదునే యవ్వా, "అశ్వలక్షణ" "గజలక్షణ" "రత్నలక్షణ" "స్త్రీ లక్షణ" "పురుషలక్షణ" "సాముద్రిక లక్షణంబు" లెరుంగుదునే యవ్వా అంటుంది.

ఉత్తమ ఔషధాలు అమ్మటమే కాకుండా కురవంజి చేతులు చూచి భవిష్యత్తు కూడ చెపుతుంది. తన వేష మహిమవల్ల నైతేనేమి, తన మాటల చమత్కారం వల్ల నైతేనేమి భూత భవిష్యత్ వర్తమానాలను కరతలామలకం చేసుకున్న తన ప్రజ్ఞ వల్ల నైతేనేమి ఈ కురవంజి తెలుగు వాఙ్మయంలోనే కాకుండా ద్రావిడ భాషలన్నిటి లోనూ శాశ్వత స్థానం సంపాదించుకుంది.

తెలుగు ప్రబంధాలలో అక్కడక్కడ కొరవంజి రచనలు కనిపిస్తాయి. కొన్ని యక్షగానాలలో కొరవంజి పాత్రలేదు. కొరవంజి పాత్ర ప్రవేశం గల యక్షగాన రచనకు ...కొరవంజి అనే పేరని (ఆంధ్ర వాఙ్మయ సూచికి తెలియ జేస్తూ వుంది.)

పార్వతీదేవే కొరవంజి:

కొరవంజి కేవలం వినోదం కల్పించడానికి మాత్రమే కాక కథా నిర్వహణానికి ఎంతగానో తోడ్పడుతుంది. సంస్కృత నాటకాల్లో విదూషకుని మాదిరే, యక్షగానాల్లో వున్న ఈ కొరవంజి తెలుగు కృష్ణలీలలు మొదలైన యక్షగానాల్లో చల్లమ్మే గొల్లది ఈ కొరవంజి లాంటిదే నంటారు. చింతాదీక్షితులు గారు, వారి ప్రజావాఙ్మయంలో, భామాకలాపంలో గొల్లది ఏ విధంగా వేదాంతోపన్యాసం చేసి ప్రజలను ఎలా అలరిస్తుందో ఆ విధంగానే కొన్ని యక్షగానాల్లో కొరవంజి పూర్తిగా వేదాంత బోధే చేస్తుంది.

ఇంతకీ యక్షగానాల్లో వేషం వేసుకునివచ్చే కొరవంజి మామూలు ఎరుకలసాని కాదని పెద్దల నిర్వచనం. పార్వతీ పరమేశ్వరుల విలాసార్థం కిరాతక వేషం ధరించిన విధంగా, పార్వతీదేవే కొరవంజి వేషం ధరించి యక్షగానాల్లో వినోదం కల్పిస్తూ వుంది. మన తెలుగు కొరవంజి నాటకాల్లో వర్ణిచబడ్డ ఎరుకలసాని ఎటువంటిదో, దాని చాకచక్యం ఎటువంటిదో, దాని మాటల చాతుర్యం ఎటువంటిదో గోకులపాటి కూర్మనాథ కవి రచించిన మృత్యుంజయ విలాసం ద్వారా తెలుసుకోవచ్చు.

కొరవంజే శివుడు:

పార్వతి శివుని గూర్చి తపస్సు చేస్తుందనీ, శివుడు సమాధిలో వుంటాడనీ, మన్మథుడు తపోభంగం చేసి దగ్దమై పోతాడనీ, పార్వతిని హిమవంతుడు తీసుకు పోతాడనీ, అప్పుడు శివుడు విరహ వేదనను భరించలేక, పార్వతిని చూడాలని తహ తహ లాడతాడనీ, అందుకోసం తాను కొరవంజి వేషం వేసుకుని పార్వతి దగ్గరకు వెళ్ళి ఎరుక చెపుతాడనీ, ఇలా వేషం ధరిస్తాడనీ వివరించబడింది.

ముక్కున బలు కెంపు ముక్కెర చెలగ
పెక్కు రత్నము పూస పేర్లు చెన్నొంద
సిరమున రత్న భాసిత పాత్ర బూని
యరుకతయై వచ్చె హిమశైలమునకు.

ఎరుకలసాని ప్రవేశం ఈ విధంగా సాగుతుంది.

ఎరుకసాని వచ్చె ఎరుకనుచు "అను "
ఎరుకలసాని వచ్చె నెరుకో ఎరుకో యెరుకో యనుచు "ఎరు "

మురిపెంపు నడకలతోడ, ముంగురు లల్లాడ సరసంపుమాటల - చతురతో - శిరమున నవరత్నఖచితమైన బుట్ట పెట్టి మెఱుపు వలెను మేను మెఱయగను వచ్చి తన గొప్ప చెప్పుకుంటుంది.

ఆటతాళం

సరసిజ భవురాణి, పరిణయమౌటమా యెరుకదు కాదటవే -
తరుణి మదికి నేదార్కాణగా జెప్పి తగు కోర్కెలందెదనే - యోదేవీ
"యెరుక గలవారు గల రెందరైన మా సరివత్తురే, రమణి

అని. అందుకు సమ్మతించిన పార్వతీదేవి.

ద్విపద

అంగద యా మాట లాలించి వేడ్క
బంగారు చేటలోపలి ముత్తియములు
మమ్మారు తన కరాంబుజమున బట్టి
సమ్మతిపాలందేశం బుజమున నిలిపి
మ్రొక్కి యిట్లనె జిత్తమున దలపోసి
మిక్కిలి కంటి సామికిని నామీద
నెన్నడు దయవచ్చు నెపుడు పెండ్లాడు
నెన్నడు నాకోర్కె లీడేరు ననుచు
చేతి ముత్తియములు చేటలో బోసి
నాతి యందిచ్చెను నను మోముతోడ.

భవిష్యత్తు చెప్పే ఎరుకలసాని:

ఆ తరువాత ప్రార్థన చేసి ఎరుకలసాని ఈ విధంగా భవిష్యత్తు చెపుతుంది.

అదో దేవి యొక్క తలంపు చేసినావు, యొక్క కోరిక కోరినావు, యొక దొడ్డ మేలడిగి నావు. అది కాయో పండో, కల్లో నిజమో, అవునో కాదో, చేకూడునో, చేకూడదో యని వెనుక ముందు తొక్కిస లాడుతున్నావు.

ఇదిగో నీయెదలో తలంపు యెన్నాళకంటె వకటే, రెండే, మూడే. వకటంటే వకయేడు గాదు. రెండంటే రెండేళ్ళు కావు. మూడంటే మూడేండ్లు కావు. శ్రీఘ్రంబె, ఇంతలోనే చేకూడుతున్నది.

ఇంకదాపేల, కోడేగాడితో తక్కిర బిక్కరలాడు కుంటా కులకనున్నావె, అప్పుడు నన్ను మెచ్చేవే కోర్కె లిచ్చేవే " అంటూ తన స్వరూపాన్ని ఈ విధంగా వెల్లడిస్తుంది.

నీకు నాథుడ నయ్యెదనని యిప్పుడిచ్చటనే
యున్నాడు, నీపై చాల దయ వచ్చింది
శీఘ్రంబె పెండ్లియాడు, నీ కోర్కె చేకూరు
నమ్ము నా బుట్ట తోడని నమ్మించి చెప్పిన.

ద్విపద

అంత నయ్యింతి యంతంతన రాని
సంతోషమంది యాశ్చర్యంబు నొంది
ఎరుకలసాని గాదెన్న నా పాలి
హరకృపామూర్తియై యవతరించినది.

కథా నిర్వహణకూ, వినోదం చేర్చడానికీ ఈ కొరవంజి ఏ విధంగా తోడ్పడిందో తెలుసుకోవచ్చు.

అలాగే మన్నారు దాస విలాసం:

రంగాజమ్మ వ్రాసిన, మన్నారు దాసవిలాస నాటకంలో__

దరువు

చెలువు మన్నారుదాసు పై వలపు నుప
లేక, కలవరింపుచు నున్న కాంతి మతికి
దలచిన తలపెల్ల దార్కాణగా దెల్ప
నలచెంగమ్మ యెరుక చెలువయై వచ్చె.

అని పాడుతూ, ఈ కలికి తలంచిన తలంపు నిజముగా బలుక వయ్య, నిక్కముగా బలుకవయ్య, తార్కాణముగా బలుకవయ్య, అంటూ__

అమ్మా యమ్మ, అమ్మా యమ్మ శెయి సూపు
శెయి సూపు శెయి సూపవే.
సూడకనే శెప్పే గురి ఊంకొని
వినవేమండి, కండ్లంటే తోడు, కడు
పంటే కొడుకు, కంటంటే మగండు.
వొండే రెండే వొండు.......
అతండే వితము వాడంటా అడిగేవే

......అయితే తెలిపేను వినవే దుండీ

వేయూరు వెలమల వెలయుచు దక్షిణ
నాయకుండని మించి నలువొండు వాడు
అతడె నీపతి యగు నందుకు తార్కాణ
యితవైన నెచ్చలి యిదిగో వచ్చితినే.

అని పలికి ఈ కలికి చిలుకల కొలికి చేత, సకల బహుమతులు చెంది నిజ మందిరంబు సేరె.

లేపాక్షి జలక్రీడ:

అలాగె వెంటకరాయకవి వ్రాసిన లేపాక్షి జలక్రీడలనే నాటకంలో ఎరుకల వారి పుట్టు పూర్వోత్తరాలు వర్ణించబడ్డాయి.

అఖిల భూతముల తెరగెల్ల
భంగులు తెల్లంబుగాను
ఎఱుక గల్గిన వారమౌటకు మమ్ము
యెరుకలవారని యందురే చెలియ.

అని వివరిస్తుంది.

తులాభారం:

యక్షగానంలో కురవంజి పాత్ర ఎటువంటిదో, తులాభారం అనే యక్ష గానంలో ఎరుకల వేషం యొక్క వర్ణన ఈ విధంగావుంది.

బ్రహ్మసమ్మతిని యా భారతీదేవి
యెరుకల వేషంబు యింపుగా దాల్చి
భామను చూడంగ భామిని వచ్చె.

కురుజంపె

జిలుగు బంగారు చీర తెల్లని జారు కుచ్చులు
మెరయగా గరిమతో గుత్తంపు చం
దురు కావి రవికయు దొడగుచూ
వచ్చె నెరుకత అహహా॥

చొక్కమగు రత్నములు జెక్కిన
బుట్ట శిరసున బెట్టుకోని
కుందనపు కట్ల మర వేసిన
కురచ బెత్తము చేతబట్టుకు ॥వచ్చె॥

ఫాలమున నసియాడు అలమేల వంక
పామిట బొట్టుతో సోగ కన్నులు వాలు
చూపులు వైడూర్య పచ్చా బొట్టుతో ॥వచ్చె॥

అందమలారగ యెడమ మూపున ఆడశిశువును గట్టుకూ మందయావల తోటి వీథులు మళ్ళీ మళ్ళీ దిరుగుచే వచ్చె...అని వివరించాడు తులాభారంలో పేరు తెలియని కవి.

ఏనుగులూరి పాపరాజు:

యక్షగానంలో కురవంజి ఎలాంటి పాత్ర వహించిందో, ఏనుగులూరి పాప రాజు వ్రాసిన రుక్మాంగద చరిత్ర యక్షగానంలో, మోహిని విరహబాధ పడుతూంటే నీరజగర్భుని పనుపున గారవమున యోగమాయ, ఎరుకత వేషంతో ఎలా వచ్చిందో ఈ విధంగా వివరించబడింది.

అంగన!నాదు పేరు కొరవంజి యటందురు, నాదు సావియున్
సింగడు, తావు ద్రోణగిరి సేదు, జనుల్కొనియాడ నెప్పుడున్
పొంగుచు సోదె చెప్పి వర భూషణముల్ కొని వార్తకెక్కె మా
బంగరు పల్లెవాని మీది బాయక నమ్మిన వార మెయ్యెడన్

అని ఎరుక చెపుతుంది.

ఈ విధంగా కొరవంజి నాటకాలలో ఎరుకల వారిని గురించి ఎన్ని ఉదాహరణలనైనా ఇవ్వవచ్చును.

ఈనాడు ఆంధ్రప్రదేశంలో ఏ ఒక్క కొరవంజి నాటకమూ ప్రదర్శింప బడటము లేదు. కాని ఎరుకలపాట మాత్రము ఏకపాత్రగా "సోదెమ్మ సోదో" అంటూ ఈ నాటికి తన సహజ వేషధారణతో గ్రామాల్లో కనిపిస్తూ స్త్రీలకు సోదె చెపుతూ వుంది. ఎఱుకల సానులు సోదె చెప్పే విధానం అద్భుతంగా వుంటుంది. సోదె విన్న ప్రతివారికి ఈ విషయం విదితమే.