Jump to content

తెలుగుతల్లి/సంపుటము 1/నవంబరు 1937/మధుపానము

వికీసోర్స్ నుండి

మధుపానము.*[1]

కుమారి బి.పి. సుశీలాబాయి.

మధువనగా మత్తును గలిగించు ఘనద్రవ పదార్ధము. వైను, విస్కీ, బీరు మొదలగునవి యితరదేశములనుండి మనదేశమునకు దిగుమతియగుచున్నవి. సారాయి, బ్రాంధి, కల్లు, పొగాకుతో చేయబడు చుట్టలు, బీడీలు, సిగరెట్టులు, నస్యము, గంజాయి మొదలైనవి మనదేశములో ఉత్పత్తియగుచున్న మధు ద్రవ్యములు.

ఇది సంసార దు:ఖములను, కష్టములను, దేహపరిశ్రమను, మనోవ్యాకుల మును బోగొట్టునను తలంపుతో పుచ్చుకొనుచున్నారు. ఇంకను సంతోషము, ధైర్యము, బలము, మొదలగునవి యిచ్చునని పుచ్చుకొనుచున్నారు. ఈ మధు పానము దుష్టప్రయత్నమునకు, సాధుహృదయమును కఠినహృదయముగ మార్చుటకు, హింసాగుణమును వృద్ధిపఱచుటకును సహాయకారి యగుచున్నది. సాధుహృదయమును కఠినపఱచు స్వభావమున కుదాహరణముగా రెండుపాత్ర లను తీసికొని యొక దానియందు సారాయియు మఱొకదానియందు నీరును పోసి రెండుపాత్రలలోను కోడిగ్రుడ్ల జెనలను వేసిన సారాయిలోవేసినజెన రాయివలె గడ్డకట్టును. ఈవిధముననే యనేకులు తమ మృదువైన హృదయములను సుర లో నానబెట్టుకొని కఠినులగుచున్నారు.

జీవమును జంపుశక్తి గలదనుట కుదాహరణముగా రెండుపాత్రలను తీసికొని వానియందుకూడ సారాయి, నీటిని పోయుదము. రెండుపాత్రలలోను కప్పలను వేయుదము. సారాయిలో వేసినకప్ప వెంటనే చనిపోవును. దీనివలన చాల మంది ప్రజలు తమ ఆయుష్కాలము నంతయు సారాయిలో నానవేసికొని నశించుచున్నారని తెలియుచున్నది.

వేశ్యల యిండ్లకు పొవుటకు, జూదమాడుటకు, అల్లరి, హత్యలు చేయుటకు మధుపానము మూలాధారముగ నున్నది. ఈదురబ్యాసమువలన కలహములకు కారణములేర్పడి సర్కారువారివద్ద గ్రుద్దులు, తన్నులు మొదలగు అవమానకరములగు శిక్షలకు పాలగుచున్నారు. అనేక విధములగు క్షయ, బుద్దిమాంద్యము మొదలగు రోగములతొ బలహీనులై జనులు చనిపోవుచున్నారు

మధుపాన దురభ్యాసము దురదృష్టవశమున ధనవంతుల యిండ్లలో ప్రస్తుత నాగరికతతొగూడి యెక్కువగా అలవడియున్నది. ఈపానము రక్తనాళములగుండా దేహమంతయు ప్రవహించి గుండె కొట్టుకొనుదానికంటె యెక్కువగా కొట్టుకొనుచుండుటచే మనుజు డేమిచేయుటకు దోపక యందరిని తన్నుచు తిట్టుచుండును.

కొందఱు బీదవారలైనను అప్పుచేసి మధువునుద్రావి, ద్రోహికి ఉపకారి యగపడినంత తాజేసిన పాపములెల్ల ప్రత్యక్షమగునట్లు ఋణదాతయగపడగనే తనయప్పు వడ్డితో కూడ కనుల గట్టినట్లుండుటవలన కొన్ని సమయములలో తాము ఆత్మహత్య చేసికొనుటయేకాక ఋణదాతలను చంపుటకుకూడ ప్రయత్నింతురు. కాబట్టి మధుపాన మెంత కఠిన దుష్టకార్యములకైనను దారి తీయుచున్నది. కొందఱు బీదవారు తాము సంపాదించు డబ్బంతయు మధుపాన మునకు వెచ్చించి యింటిలో నుండివారిని పస్తువేయుచుందురు. కొంతమంది జనులు కుటుంబములతో గూడ త్రాగి యప్పులపాలై నిలువనీడకు యల్లాడు చున్నారు.

పొగాకుతో చేయబడు వస్తువులన్నింటిలో నూటికి నూరుపాళ్లు విషమున్న దని యొక శాస్త్రజ్ఞడు వ్రాసియున్నాడు. చుట్టలు త్రాగుటవలన చూపుకనబడదని మనవారికి తెలిసియు దానిని మానరు. ఒక కవి మధ్యపానము చేయువారిని వర్ణించుచు ఇట్లు వ్రాయుచున్నాడు.

       సీ|| లక్షాధిపతులెల్ల - భిక్షాధిపతులైరి
                  మధ్యపానముయొక్క - మహిమవలన!
             సుజ్ఞానపరులెల్ల - రజ్ఞానపరులైరి
                  మధ్యపానముయొక్క - మహిమవలన !

    భీమబలాఢ్యులు -పీన్గులైనిలిచిరి
            మధ్యపానముయొక్క - మహిమవలన !
   గౌరవార్హులు తామ - గౌరవపరులైరి
             మధ్యపానముయొక్క - మహిమవలన !

గీ|| ఎట్టిసుఖముల నేనియు - నీయలేని
     కల్లుద్రావుటమాని - సుఖంబులొంది
     యాయురారోగ్య భోగ భా - గ్యములతోడ
     భరతమాతను సేవించి - వరలుడయ్య||

దేవదాసు నాటకములో ప్రాణములు గోలుపోవుటకు మద్యపానమే కారణము గా నుండెను. సతి లీలావతి యను ప్రదర్శనములోకూడ మద్యపానమువలన వారనుభవించిన కష్టములు చెప్పనలవి గాకున్నవి. కనుక దేశక్షేమమునకై యిటువంటి ప్రదర్శనములను ప్రదర్శించువారికి మనమెంతయు కృతజ్ఞలము. మధువును ఇంత యమితముగా మన సహోదరులు త్రాగుటకు మన హిందూ దేశమందు ఈత, టెంకాయ, తాటిచెట్లు ఎక్కువగా పెరుగుటయే. ప్రధానమంత్రి గౌ|| సి. రాజగోపాలచారిగారు సేలం జిల్లాలో మధుపాన నిషేధ శాసనమును అమలుపఱచిరి.

మధుపాన నిషేధమునుగూర్చి బైబిలులో త్రాగుబోతులు పరలోక రాజ్యము నకు అర్హులు కానేరరనియున్నది. పంచంహాపాతకములలో నొకటిగా బేర్కొన్న నీమధ్యమును త్రాగకూడదని మనపెద్దలు వక్కాణించుచున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ మంత్రులు మధుపాన నిషేధమును ఎటులైనను సాధింపబూనుకొని యుండుట వలన దేశము బాగుపడగలదని నమ్ముచున్నాను.

  1. *మదరాసు బాలికా కళావిజ్ఞాన ప్రదర్శనమున బహుకృతి వడసిన వ్యాసము.