తెనుగు తోట/తెనుగు తోట

వికీసోర్స్ నుండి

తెనుగుతోట

1

నిదురనెలతలు వచ్చిరి నిదుర లేప,
భద్రభామలు దరిసిరి పాట బాడ,
తెలియరాని చక్కిలిగింత లలమ నొడల
మేలుకొలిపెడు పవనుడు బాలుడట్ల;
నవకపు టుషన్సు చిద్రుపలు కవిసికొనెడు
పొడుపుమలపైకి నూగెడు ప్రొద్దుపాప
నుయ్యెలల పైడిత్రాళ్ళన నొదిగి యొదిగి;
రాలు సురపొన్నపూవులు రాసులట్లు,
మధువు చిందుచున్నది సుకుమార లతల,
కొమ్మ లొక క్రొత్తరుచి సరసమ్ము లయ్యె;
వృద్ధతరులు లేమోకల పెంపు జూచి
యభినవ వికాస దీపన మభినయించు;
తిన్ననిపథంబు బట్టె యాత్రిక జనంబు
లేచి రా వమ్మ ! మా తల్లి ! లేచి రమ్ము


తెనుగుతోట


2

మబ్బులే లేవు చూడు! విమానవీథి,
ఆశ లాకూతసీమల నంట నల్లె!
తేఱి యున్నది జీవనపూర మెల్ల,
క్రమ్మి యున్న ది నూత్న రాగము భువిని,
క్రొత్త మంగళతోరణాల్ గునిసియాడ
కోకిలకుమార మంగళోక్తులు ధ్వనించె;
లలితపల్లవ లక్ష్మి తాండవము లాడ,
పసపు బూపిండి కడ లెల్ల విసరుచుండ
నవనవ కుతూహల ప్రసూనములు పూచె;
చీకటి ముసుంగు ద్రోసి హసించుచున్న
దదిగొ! మంచులతెరలకు నవల నిలిచి
యొక పవిత్ర తేజోబింబ ముజ్జ్వలముగ;
చూడ బోవుచు నున్నారు తోడి చెలులు,
ఆలసించిన నిలువరు హర్ష వశలు,
ముందుబోయిన నంద రో సుందరాంగి!
లేచి రా వమ్మ ! మా తల్లి! లేచి రమ్ము !


తెనుగుతోట

3

క్రొత్తగా బెండ్లి యైన లేగుబ్బెతలును,
నిన్న మొన్న నీడేరిన కన్నియలును,
పరికిణీ లింక విడువని బాలికలును,
గడుసునెఱజాణ లగు ప్రోడ పడతుకలును,
కలరు కలరు వారలలోన గన్నతల్లి !
వేఱు వేఱు తోటల కేగు వార లయిన
కలికి ! యెఱుగనివారలు గారు నీకు;
దశదిశల నంట బ్రాకవే తరుణశాఖ
లెససి యొక తరువునకు బుట్టినవ యేని;
పూచు పూవుల గుత్తులై కాచుపండ్ల
గర్భబాంధవ్య సామ్యముల్ గానబడవె?
భయపడంబోకు, ముందంజ బాయ జనదు,
తోడి బిడ్డల సావాస మీడ దగదు,
వినబడు నుషఃకలాపకీర్తనలె కడల,
పొడుచుచుండె తేజఃకళాపుంజ మెదుర
లేచి రా వమ్మ ! మాతల్లి ! లేచి రమ్ము !


తెనుగు తోట


4

మేలుకొలుపులు మెల మెల్ల నాలకించి
నిదుర లేచిరి నీసాటి నెలత లెల్ల;
కంటికిని మింటికిని సూత్ర కాండ మట్టు
లఖిల భూగోళ బహిరంతరాళ నిబిడ
మయిన యొక కాంతి వారల నలమికొనియె;
వింత వింతలు సుమ్మి ! యా కాంతి రుచులు;
మండుచున్నవి యొకట ప్రచండముగను
అణగియున్నవి యొకచోట నబ్ధిమాద్రి ,
కించి దుష్ణప్రభల నింపు గెరలు నొకట
వెన్నెలలె పండుచున్నవి వేఱుచోట
భిన్న మైన ఏతత్కాంతి బింబ కలల
జూచుచున్నారు విబ్రమచోద్యములను;
పోవ నుంకింతు రా పుణ్యమూర్తి కడకు,
తల్లి బిడ్డల భావబంధములు పెనగ
లేచి రా వమ్మ! మాతల్లి ! లేచి రమ్ము !


తెనుగు తోట

5

తల్లిపాల్ ద్రావకుండ బందాలబడిన
వత్సములు లాగులాడెడు పాలకొఱకు
ఆలకొట్టాల పెండెము లవల నెట్టి
మెడలవేసిన పలుపులు విడువ రమ్మ.
తల్లిపాలు ద్రావిన మహోత్సాహపూర్తి
బెనగి చెల్లాట లాడెడు పెంపు మిగుల
నిరుగు పొరుగు లేగల క్రీడ లరయ వమ్మ !
బువ్వదుత్త నెత్తిన బెట్టి నవ్వుకనుల
రవిక దొడుగని గొల్లకుఱ్ఱది యొకర్తు
పోవుచున్నది పొం దైన ముద్దునడల,
కలికి యొడిసెల వలెవాటుగాగ దాల్చి
పిఱుదు లసియాడ జీర రాపిళ్ళు పెరయ
కాపుగూతురు పొలములు కావ నేగు
చిన్ని బంగారు పూసల చెండ్లవంటి
జొన్నకంకులు పండిన సొగసుచేల
ఎక్క డెక్కడ నుండియో చక్క వచ్చి
వ్రాలుచున్నవి పిట్టలు వేలు వేలు;
లేచి రా వమ్మ ! మాతల్లి ! లేచి రమ్ము.


తెనుగు తోట


6

చదివిన పురాణపంక్తులే చదివికొనుచు
స్నాతకుం డై నవిద్యార్థి చాయ జూడు;
పడుచు మగబిడ్డ యనియెడు భ్రమను తల్లి
తోట కంపుచు నున్న దెందులకొ గాని,
యెఱుగ డా చిన్నవా డామె హృదయసరణి:
లేతతులసీదళాలు చేసేత గిల్లి
నింపి కొనివచ్చు మృదుపత్ర సంపుటమ్ము;
చంపకము లెత్తికొని పోవు చతురవరుల,
తేనె వంచుక పోయెడు మౌనపరుల,
పత్రముల నూడ్చుకొనెడి యుపాయమతుల,
కంచె దీసి త్రోవలు సేయు వంచకులను,
తెలియగా లేడు తోట నేవలన గాచు
లేచి రా వమ్మ ! మాతల్లి ! లేచి రమ్ము !


తెనుగు తోట

7

వదలు బంగారు బాణాలు బాలభాను
డడరి యాశావృతము లైన యెడల నెల్ల,
పూచియున్నవి పూవు లపూర్వముగను,
నిండియున్నది మధు వందు నిర్మలముగ,
సుమములను గూర్ప యోగ్య మౌ సూత్రములను
వంచి పూరింప కలధౌత పాత్రికలును,
సేకరింపగ వలె సుమీ చిన్నితల్లి !
ఇంత పూనవకము వాడనీయరాదు,
మధువునకు నూత్న పాత్ర లమర్పవలయు,
శోషితనుమాళి నిర్జీవ రూషితంబు,
ఒలికిపోయిన మధువు పుత్రులకు గాదు !
పరులు సొరకుండ గంచె గాపాడవలయు
చేరిన యనుంగులను బద్ధగౌరవమున
తోటమాలులగాజేసి తోడుకొనుము,
కలికి ! తోట యందమునకుఁ గట్టుబడిన
నమ్మియుండకు గాపుదనంబు మాని;


తెనుగు తోట


కలకల కషాయ మాధురీ విలసనముల
నాడు నీబిడ్డపులుగుల నరయ వమ్మ;
లేచి రా వమ్మ ! మాతల్లి ! లేచి రమ్ము !


తెనుగు తోట

8

వీనులకు ముద్దుగొలుపు నవీనమధుర
సుస్వరమ్ములు పాడెడు సొనలు నేడు,
మొలక లెత్తెడు ప్రక్కల మోహనముగ
నవతృణాంకుర జీవరత్నాలశయ్య;
భూసతి ప్రసూతివేదనమును గ్రహించి
చదువుచున్నార లరుణ ప్రసన్నసూక్తు
లార్ద్రవర్చస్విజనము లాద్యంతములును;
సత్వసంయమ గీతా ప్రసన్న వాణి
నధ్యయనవేళ బసిపట్టి యాలకించి
యంత లంతల జేరె విహంగసమితి;
మోస లెత్తుపైరులు మేసి పోవకుండ
కణుపువిడిచెడు నందాక గాపువెట్ట
వలయు, వలయు ప్రయత్నాల మెలగరమ్మ!
అక్కచెల్లెండ్ర రాగము లతిశయింప
తల్లి తోటల గాపాడ వెళ్ళ రమ్మ!
లేచి రా వమ్మ! మాతల్లి! లేచిరమ్ము!


తెనుగు తోట


9

కిన్నెరలు బాడుచున్నవి గీతములను,
కప్పురంపు దుమారముల్ గుప్పినటుల
బదిదెసల గప్పుకొనె గాఢపరిమళంబు,
పూత బడియె నశేష భూమీతలంబు
తరుణ తరుణం బయిన యొక యరుణకళను;
సుభగతాంబూల రాగ మంచును వచింతు
రెల్ల పడుచులు వయసు పింపిళ్ళు గూయ,
వెన్నెలకరుళ్ళు నిండారు వీధినదుల
పొడుపు నవ్వుల నావలు నడుప వత్తు
రింటి నింటికి జేరువ నింపు దొరయ;
సరస కౌతుక గీతాప్రసాద మొక డె
కలద యా నౌకయందు గావలసి నంత,
పిలిచి యిండ్లిండ్లకును పంచిపెట్టుచుంద్రు,
వలద నెడివార లెవ్వ రవ్యక్త మతులు,
ఆదరింపని వా రెవ్వ రాడువాండ్రు,
లేచి రా వమ్మ ! మాతల్లి రమ్ము.


తెనుగు తోట

10

దధిమథన మోహన ధ్వనుల్ మధురముగను
శ్రవణముల కుత్సవము జేయు సమయ మయ్యె
ఔషసి కలాప మేమఱ నగునె తల్లి !
ముసుగునం బడి యున్నది మోహవీణ
చిరనిరాదరణాహతి జెడియె నేమొ?
తలచి తాచి స్పృశించి తల్లలిత లలిత
సుశ్రుతిస్వీయ సామ్రాజ్య శోభ నింత
క్రొత్తలకు రుచి సూపించి హత్తవమ్మ; ,
పలుకుబడి యింపు, సన్నంపు టెలుగు కళుకు,
కలదు కల దెందు లేదని కలయ జూచి
చేతబెట్టితి నీ వీణ జిన్నదాన!
పాడితివి కొన్ని నా ళ్లతిస్వాదువుగను
లోక దుర్ల భమోహన పాకఫణితి
రాగరసబంధురం బైన రమ్యగీతి;
చంపకంబులు గురియ నచ్చరకొలంబు,
ఆట వెలదులు పారవశ్యంబు గొలుప,
అలరి మత్తేభలక్ష్మి కుంభాభిషేక
హృద్య సౌవర్ణ కలశము లెత్తి పట్ట,


తెనుగు తోట


పెరిమ బెరయంగ గరువంపు బిరుదుటందె
లడుగు దమ్ముల రారాజు లందగింప,
నిడుముత్యాలశాలల నీటు సూపి
వాసి జూరాడినట్టి నీభాగ్య మేది?
లేచి రావమ్మ! మాతల్లి! లేచి రమ్ము!


తెనుగు తోట

11

నీటు గులుకు రాజుల చేతి నిమ్మపండు
నీ సొగసు నిట్లు కను మాయ నిదురబుత్తె ?
లేచి యిపు డిప్డె నెలకూన లీల జూచు
నదిగొ! సాటికన్నెల కయి యన్నికడల;
ఎచటనున్నారు? లేరు లే రిచట వారు,
ముందు బోయిరి సుముహూర్తమునకు జేర.
చిన్నవోయిన మొగముతో గన్నె యదిగొ?
నిదుర లేవని మతికి నిందించి కొనుచు
ప్రసవపేటిక నావల బాఱవైచి
వంచుచున్నది భ్రూలతావదనములను,
చెదరి జాఱెడి యభిమాన చేల మైన
జక్క నొత్తక నిలచిన సకియ గనుము;
క్షీణకౌతుక యయిన ఆ చిన్నదాని
సోలి పోనీదు తల్లి నీలాల వంటి
పెన్నెరులు మోముతేట గప్పికొనకుండ
కౌగిటం గ్రుచ్చి తల్లిరో కాలుకదిపి
సూటిగా పొమ్మటంచును తోటదారి
చూపు చున్నది సుత నిక్కి సూచుచుండ,
లేచి రా వమ్మ! మాతల్లి! లేచి రమ్ము!


తెనుగు తోట


12

అలల రాయంచ లూగు నొయ్యార మరసి
చల్లుచున్నాడు కుంకుమాక్షతలు తరణి,
కడలు నిండ తటాయించి తొడరి పాఱు
విమల జీవనదీప్రవాహమును గనుము,
పోవుచున్నది యం దొక్క పూలనావ,
పడుచు లిరువురు పాటలు పాడి కొనుచు
నడుపు చున్నారు నావ నెంతయొ ప్రయాస
నెక్కడికి బోవువారొ యూహింపవమ్మ !
కడలికన్నెల మోసముల్ గడవబెట్టి,
సుడులు గుండములును గలచోట్లు వదలి,
ఎదురుగాలికి నేర్పుతో నెదురు నడపి,
పోటుపాటు వేళ లెఱింగి పాటవమున
నడుపవలె సుమ్మి యా పూలనావ వారు;
పడుచు లెఱుగ లే రుత్సాహవశత బెరసి,
సొగసు చెక్కిళ్ళు చిన్నా రిసుళ్ళు దిరుగ
మాటి మాటికి నవ్వు నా నీటులాడి,
కనుల యనురాగపులకల గౌగిలించు


తెనుగు తోట

నాపె నెడనెడ కోమలు డాదరమున
వెలుగు గాడ్పులు కసటుగా వీచె నేని
నావలో బూలు శోషిల్లి నవయ గలవు.
మాతృపూజాముహూర్త మేమఱిరొ యేమొ
లేచి రా వమ్మ ! మాతల్లి ! లేచి రమ్ము !


తెనుగు తోట


13

నిర్మలకుటుంబ సుపయస్వినీమతల్లి
కానల దనంత బెరిగిన కసవు మెసవి,
ప్రేమదుగ్ధమ్ము ముప్పూట బిదుక దేల ?
పాలు ద్రావ బూజించెడి బ్రాహణులను,
మాంసము భుజింప ఖండించు హింసకులును,
ఒక్క టయి యేల గోవుల నుండనీరు
పుట్టి పెరిగిన గోష్ఠభూముల సుఖాన !
స్వాతిముత్యాల చిప్పల స్వచ్ఛ మయిన
ముత్తియము లుదయింప వేమో కుమారి !
ప్రణయరస కణములు రాలి రాలకుండ
తొణకు లాడెడు స్నిగ్ధయామినులు గడచె;
మలయ పవను డెడారుల గలసినటుల
స్వాదురాగతరంగ మనాదరమున
కోనలను లంకలను గయిగొనునె శాంతి ?
లేచి రా వమ్మ ! మాతల్లి ! లేచి రమ్ము!


తెనుగు తోట

14

ఏతములు ద్రొక్కి దొరువు నీ రెత్తు వార
లన్యరతు లైరి ప్రాల్మాలి యక్కటక్కట!
పచ్చిక గుబుర్ల ముత్యాలకుచ్చు లొలయ
సకల తరుమూలములకును జలము పోవు
తోటకాల్వలు తడిలేక బీటవాఱె,
అల్లు లేక యధోగతి యందు గ్రుంగి
జాతి మాఱిన నిమ్న సంజాత మెల్ల
తాక రాదని విడిచిరి దైన్యమునకు,
పరిమళములకు వెలియైన ప్రాణలతలు
జీర్ణమయినతోటల కాపు పూర్ణమగునె?
అడ్డమైన చెట్టులనీడ లవల బోవ
వెలుగు బ్రసరించ వలయు వివేకశీల!
ప్రేమవృత్తికి జండాల భేదమేల?
బ్రాహ్మణాగ్రహారము నందు బవలు రేలు
విసరు పవనుండు కడజూతివీటియందు
తాక లేక వీచునె పక్షతంత్రజడిమ ?
అచ్చపుబతి వ్రతను శిరసావహించి


తెనుగు తోట


చ్యుతయశస్వినిపయి నల్క సూపగలవె
సువిమలము లైన భానుభానువులు తల్లి !
లేచి రావమ్మ ! మాతల్లి ! లేచిరమ్ము !


తెనుగు తోట

15

గౌతమీసాంద్ర వీచికా జాతపూత
వాతపోత శీతల సముపాంతమందు
తరుణ వంశజాతముల సుస్వరము లెన్నొ
నవ్యముగ నుదయించుచున్నవి కుమారి !
కృష్ణవేణీ సరిత్కూల రేఖలందు
బ్రొద్దు తిరుగుడు పువు లభిముఖము లయ్యె,
స్నానములు సేసి, ప్రణయదుగ్ధములు ద్రావి,
పూలతోరమ్ములు ధరించి, పూర్ణ భక్తి
బూజ కరిగిరి ఋషికుల పుత్రులెల్ల !
పూల పిండి పాదులలోన బ్రోగు జేసి
రంగు లీను నారతిపళ్లెరమ్మునందు
పూలు తాంబూలములు నుంచి పోవుచుండి
రకలుషవిముగ్ధ లగు కుమారికలు తల్లి ?
లేచి రా వమ్మ ! మాతల్లి ! లేచిరమ్ము


తెనుగు తోట


16

తోటనడుమన తేట పన్నీటికొలకు
కలగి కశ్మల మయ్యె దుష్కాలనిహతి,
పూచు చిన్నారి తామరపూల పైన
బాలభానుని రక్తి యభావమయ్యె;
క్రొత్తచెలు వీను కవటాకు పొత్తు లెన్నొ
కీలికీలల గప్పికో బాలు వడియె;
పూయవలసిన మొగ్గలు పూయకుండ
రాలు చున్నవి తేనెకన్నీళు లొలుక;
పూర్ణరసవతి కాని లేమొగ్గకన్నె
నేల బాధించెడి మిళింద బాలకుండు?
ఋతువిహిత ధర్మములు స్ఖలద్గతుల జెడిన
కడుపు గోతల పాపముల్ కట్టి కుడుపు,
మహితకాసారశుచి కసుమాల మయిన
జీవనం బేమిటికి సరసిజదళాక్షి !
లేచి రా వమ్మ! మాతల్లి! లేచి రమ్ము?


తెనుగు తోట

17

లలిత సిందూర గౌరవాలంకృత మగు
నిలయ శేఖరముల రమణీయ తరుణ
తరణి కిరణతోరణ పంక్తు లరయ నయ్యె,

వన్నె వన్నెల సొగసులు బలుపు లొలయ,
తీర్చి దిద్దిన కనుముక్కు తీరు గులుక,
వయసునాజూకు, నడకల వాలకంబు,
అందముల కందములు వెట్టు చందములును,
పంజరంపు నిర్బంధాల పాలుసేయు
శుకకుమారీ కులమ్ములన్ జూడ వమ్మ !

కాంత కలకంఠ సారస్య మెంతయున్న,
ఇం పయిన రూపురేక ల వెన్నియున్న,
పంజరంబుల బంధింప బడినవఱకు
శూన్య గృహదీపికలయట్లు శోభ లిడవు;

చెఱలువిడిపించి తోటల స్వేచ్ఛ గాగ
తిరుగ బంపుము చిలుక ముద్దియల, అల్ల
మోహన వనాంతరముల భోగపదవి


తెనుగు తోట


నలరుచున్న చిత్రగ్రీవములను గనవొ !
లేచిపోవుట కలవాటు లేని సొగసు
పసపుపిట్టల కీపాప బంధమేల?
లేచి రా వమ్మ ! మాతల్లి ! లేచిరమ్ము!


తెనుగు తోట

18

నిండుగృహ దీర్ఘికల నున్న నీరజముల
కడుపు చల్లనిపంట నా వెడలుచున్న
మదవదళికుల సంతాన ముదయగీతి
బాడుచున్నది కర్ణోత్సవముగ నిపుడు;

రవికిరణరాగ పులకిత రభస యయిన
లసదుషఃకన్య లజ్జావిలాస వశత
జాఱు రక్తాంబరము మడు పార విప్పి
కప్పికొన జూచెడిని నలంకారసరణి;

తెరలు ద్వారాల కింక బంధింప నేల ?
దరియ వచ్చెను శుభముహూర్తక్షణంబు,
పోయి రింతకె కొంద ఱుపాయమతులు
బింబసందర్శన కుతూహలంబు కలిమి,
పరవశాదరు లయిన యావయసు చెలులు
దరిసియుందు రీ సరికి యాత్రాస్థలంబు
లేచి రా వమ్మ ! మాతల్లి ! లేచి రమ్ము !


తెనుగు తోట


19

వెన్నెలలు నిద్ర వోయెడు వేళ లయ్యె,
ఉదయసామ్రాజ్య విభవముల్ వదల లేక
మంచులగుడారముల తోడ మలగిపోవు
తారకాసంతతులు కాలధర్మనియతి;

కలికి ! ప్రాచీకుమారికా కంఠమందు
మలయు కుంకుమపూవుల మాల లనగ
సొం పొలుకు చున్నయవి యుదయంపు రుచులు;
ఆడ నున్నార లొక బంతులాట నేడు
తోటలకు మధ్య నున్న సయ్యాట బయల,

నడువ మెత్తని పచ్చిక పడకలందు
నావరించిన చెట్లచాయలకు గ్రింద
విసరి విడుతురు బంతి నావేశ మొలయ;

సాటికన్నెలలో వన్నె జాఱకుండ,
చీర సింగారముల సిగ్గుచెదరకుండ,
లలిత కంఠాభరణముల్ తొలంగ నీక,
కన్నె మరియాద లెందును గలగ నీక,
వక్రమార్గాలి బంతిని వదలబోక,


తెనుగు తోట

సరసగతుల పందెపుచెండు దొరలదన్ని,
వెనుక ముందైన కన్యల ననుగు జెలిమి
తోడ రా బిల్చి గెలుపాట లాడవలయు,
లేచి రా వమ్మ ! మాతల్లి ! లేచి రమ్ము!


తెనుగు తోట


20

పచ్చిపగడాలు దండలు గ్రుచ్చికొనుచు
మమత మునుకొను ప్రాతఃకుమారి తోడ
చూడ వేంచేయు భానుడు శోభ లెసగ
కాంచనద్వార దేహళీ ఘటిత మయిన
లలితసింహాసనమ్ము నలంకరించు;

కానరాని మహర్షి లోకమ్ము లెల్ల
బలవదాశీర్వచో ముఖలలితు లగుచు
ఆట లాడిన పడుచుల నాదరించి
దర్శనం బీయగలరు వాత్సల్యరక్తి;

కందుక క్రీడ కాయత్తకాంక్ష లయిన
పూర్ణనియతలు ఇపుడిప్డె పోయినారు,
లేచి రావమ్మ! మాతల్లి! లేచిరమ్ము!


తెనుగు తోట

21

దీప్తమార్గ విశాలప్ర దేశమందు,
తోట బయళుల నడుమ బాహాట మైన
ద్వార మున్నది సుమ్మి! యందాలతల్లి!
త్రోవలన్నియు గలియు ప్రాక్తోరణమున
కలదు అపరంజిరెక్కల తలుపుజంట,
మూసియున్నారు పూజా ప్రపూత మతులు
తోట లాధీన మెడలిన నాటనుండి;
కాంచుచుందురు చిత్రలోకమ్మునందు
కళ్లెములు లేని సమదకంఖాణ ఘోర
ధావనాపాతబీభత్సదర్శనముల
క్షోభలో జిగీషాదోషచోదనమ్ము ;
వీణలెల్ల ననంత కళ్యాణగీతి
భువన సంమోహనములుగా మ్రోయ దగిన
దివ్యసమయములను గాని తెఱువరవ్వి;
ద్వారబాంధవి యప్రమాదము వహించె;
లేచిరావమ్మ! మాతల్లి! లేచిరమ్ము!


తెనుగు తోట


22

శుచి యయిన దోయిళుల బట్టి సొనలనీరు
వదల బోవుచున్నార లావలిమహర్షు,
లాయత కుతూహలంబున నాట లాడి
జయము గానము జేయు యుష్మత్పవిత్ర
మంత్ర పుష్పోక్తి యీలోన మౌనిజనుల
కర్ణపూర్ణోత్సవము జిలుకంగ వలయు;

మిమ్ము గ్రమ్మిన నూత్న రాగము కళలు
మీరు పాడిన మంగళామేయగీత
లవ్వలి పవిత్రబింబము నంద గలవు,

రాగమయ మైన జీవనభోగ మరసి
బంధమోక్షణ చక్రవిభ్రమణ మనుచు,
మధురవకుళ ప్రసవ నూత్న మధు వటంచు,
పాలు నెత్తురుగా భ్రమపడితి మనుచు,
నీరు పా లంచు దెలియగా నేర మనుచు,
త్రొక్కు లాడుచు దిగ్ర్భాంతి దూగువేళ;


తెనుగు తోట

ద్వారపాలిక భాగ్య కవాటములను
తెఱువ గల దవశ మ్మగు పరవశమున; ;
లేచి రా వమ్మ! మాతల్లి! లేచి రమ్ము!


తెనుగు తోట


23

దివ్యసంతతి కెలన భక్తిన్ భజింప
ప్రేమసామ్రాజ్యపాలనా ప్రీణ యగుచు
నిండు గొలువు తీర్చెడి రమణీయమూర్తి,
రాజరాజేశ్వరి కుమారరక్తి మధుర,
స్తన్యమోహాంధ యగుచు సాక్షాత్కరించు;

అరసి యర్చింపు మాజగదంబనపుడు
స్నేహదీపము వెలిగించి చిత్రపీఠి,
పసుపు గుంకుమ పూవులు కొసరి చల్లి,
చిన్ని కర్పూరహారతి చేతబట్టి
పాడవమ్మ! తెనుగుబాణి భ్రమయజగము

తన్మయస్తవమధు నివేదనముకలన
బరవశప్రసన్నావధిఁ బడయుబ్రకృతి;

తత్తదవ్యయశుభముహూర్తంబునందు
'ఆంధ్రకళ్యాణ' మనుచు బ్రహాండమెల్ల
తానమాడు నపర్యుషితంపు శ్రుతిని ;
ఆదరమున తథాస్తుతథా స్తటంచు


తెనుగు తోట

ఋషులు ఋషిపత్నులును వచియింపగలరు ;

ఆంధ్ర బాలకు పూర్ణ కళ్యాణ మవును
నిదుర లేవమ్మ ! మాతల్లి నిదుర లెమ్మ !




ఈ కావ్య సర్వస్వామ్యములు గ్రంథకర్తవి

ఆంధ్రగ్రంథాలయ ముద్రాక్షరశాల: బెజవాడ