తెనుగు తోట/ఆవాహన

వికీసోర్స్ నుండి

తెనుగు తోట


ఆవాహన

మధుర మధుమాస సాంధ్యయామములలోన
ఇసుక పడకల బడి యిం పయి ప్రవహించు
ఏటివంచల దిరుగాడ నిచ్చగింతొ?
దివ్య మగు మల్లెపూల పందిళ్ల పజ్జ
చీర యొడి బట్టి మొగ్గలు చిదుపు చిన్ని
కన్నియల ముద్దునడకల గాంక్షపడెదొ ?

మండు టెండల నావులు మ్రానినీడ
మోము లెత్తుక రోమంథముల నొనర్ప;
కొమ్మపై నిల్చి పిల్లనగ్రోవి నూదు
గొల్లచిన్న వానిని జూడ నుల్లసింతొ?

పరువపు జిగుళ్లు నిండారు వటమహీజ
సాంద్ర శాఖల శీతలచ్ఛాయ క్రింద
స్విన్న నయనము లలసత చివురువోయ
నిలచిన కురంగకన్య ముద్దులను వలతొ !


తెనుగు తోట

నిత్యవర్చస్వినీ! లేఖినీ! త్వదీయ
చిరరహస్య సంకల్పమ్ము లెఱుగ లేను.

కన్నె మెడలకు బూసిన గంద మట్లు
సొన తొరగి చాఱ లయిన రుచుల్ సెలంగె,
పండుచివురులు కాసులదండ లయ్యె
గొమ్మలకు మోహఋతు లాంఛనము లెసఁగ;

మంజులధ్వన్యనురంజిత కుంజకులము
అభినవానంద మధుమనోహర లతాంత
ములను నవనవలాడు నో ముద్దుకలమ!

కవిసికొను ననుకూల వాయువుల కెల
కంచె లడ్డములై విభంగము లొనర్చు?

వ్రతు లయిన మాధుకర కుమారకుల మీద
సరిపడనిపూల్ విసర వనస్పతుల కేల

పెండ్లి పాటలు పాడెడు భృంగపుత్రి
నేమిటికి ముద్దిడవు లేఖినీమతల్లి!