తెనాలి రామకృష్ణకవి చరిత్రము/పురాణశ్రవణము

వికీసోర్స్ నుండి

23 పురాణ శ్రవణము

రాయ లొకనాడు 'రామకృష్ణకవీ ! నెల్లూరు నెజజాణల నెప్పుడైన జూచితివా?' అని ప్రశ్నించెను. 'చూడకేమి' ప్రభూ! ఒకసారి జూచితిని గాని నాకు సంతృప్తిగలుగునట్లు ఎవతెకైన దగిన ప్రాయశ్చిత్తముం జేయవలయునని చిరకాలమునుండి కోరికగలదు. తమ సెలవైనచో నొకసారి యాసింహపురికరిగి, నాకోరిక దీర్చుకొని వత్తును' అనగా రాయ లంగీక రించెను.

రామకృష్ణుడు నెల్లూరుకుబోయి చిత్రాంగి యను వేశ్వ మిక్కిలి పాండిత్యము గలిగినదై , యెటువంటి దిట్టలగు పండితులు వచ్చినను ఓడించుచుండెననివిని, యామెను జూడబోయెను.

రామకృష్ణకవిని నారోవెలఁది యర్ఘాసనమిచ్చి, గౌరవించి, 'మీరు పురాణముం జెప్పగలరా ? ఎన్నివిధముల బురాణములు చెప్పగలరు? ' అని యడుగ నాతడు 'చిత్రాంగీ ! నేనష్టాదశపురాణముల నభినయానభివార్ధ తరన్యాసాకాశాలంబన ప్రత్యక్షవిధానములతో జెప్పుదును.' అనగా నామె 'అట్లయినచో నేటిరాత్ర భోజనానంతరము రండు కొంతసేపు కులాసాగా కాలక్షేపము జేయుదము' అనెను.

రాత్రి భోజనానంతరము రామకృష్ణకవి చిత్రాంగియింటికి వెళ్ళెను, ఆమె 'కవిగారూ ! రామాయణములోని సుందరకాండము బహు రసవంతమైన ఘట్టము కావున నాఘట్టమును బ్రత్యక్షపురాణముగ జెప్పుడు' అనెను. అటులనేయని రామకృష్ణకవి 'హనుమంతుడు మహేంద్రపర్వతము నారోహించె' నని మంచమునెక్కెను. 'అటనుండి మైనాక శైలముపైకి దుమికె'నని మఱొకమంచముపైకి దుమికెను, 'లంకలో బ్రవేశించి లంకిణి నిట్లేకొట్టె'నని చిత్రాంగిని గొట్టెను. 'పిదప లంక కగ్నిముట్టించె'నని యా వెలయాలి చీర లన్నిటిపై నూనిపోసి యంటించి 'వాయుసూనుడు సముద్రములో మంటల నార్చుకొనె'నని నూతికడకుబోయి స్నానముచేసి, తనయిల్లంతయు నట్లు చిందరవందర చేసినందుల కలోయని యేడ్చుచున్న యావేశ్య వంక చూచి 'దీనినే ప్రత్యక్షపురాణమందురు. తెలిసినదా' అని వెడలిపోయెను. చిత్రాంగి రోదసీకుహరము ప్రతిధ్వనించునట్లు విలపించును దిన్నగా న్యాయాధికారికడకు బోయి ఫిర్యాదుచేసెను. రామకృష్ణకవివెళ్ళి, న్యాయాధికారికి యదార్ధమంతయు విన్నవించెను న్యాయాధికారి 'చిత్రాంగీ! నీవట్లుకోరుట నిజమేయగుచో నాతడట్లు జేయుటలో దప్పేమియును లే'దని మందలించి పంపెను.

రామకృష్ణకవి ! విజయనగరమునకు దిరిగివెడలి, రాయలను సందర్శించినంతనే, రాయలు 'కవిచంద్రమా; నెల్లూరు నెరజాణల సౌందర్యమును వర్ణింపుము' అని యడుగ, రామకృష్ణు డిట్లాశువుగా బద్యమును రచించి, చదివెను-

సీ. మొలక చీఁకటి జల జల రాల్పగరాదె
              నెరులు మించిన వీరి కురులయందు
    కెరలించి యమృతంబు గిలకొట్టగారాదె
              ముద్దుచూపెడి వీరిమోములందు
    పచ్చబంగారు కుప్పలు సేయగారాదె
              గబ్బుమీరిన వీరి గుబ్బలందు
    పండువెన్నెలతేటఁ బ్రభవింపగారాదె
              నగవు గుల్కెడి వీరి మొగమునందు

గీ. నౌర! కరవాడిచూపుల యాఘళంబు
    బాపురే! భూరికటికటీ భార మహిమ
    జలు మదగజగమనలక్షణములౌర
    నేర్పుమించెదరప్పురి వారసతులు,