తెనాలి రామకృష్ణకవి చరిత్రము/పింగళి సూరన్న

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

నైనకద్దా? యనెను. వికటకవి 'ప్రభూ! తామనుగ్రహించి, మంత్ర మూలమున మంగలిని బ్రాహ్మణునిగా జేయుటలేదా? అదివిచిత్రము కాదా మంగలి ద్విజుండగుటయే తటస్థించునేని యీ శునకము తప్పక గోవగును సందియము లే'దనెను,

తన యవివేకమును దెలియజేయుటకే రామకృష్ణు డిట్టి పన్నాగము బన్నెనని గ్రహించి, రాయలు మంగలిని పిలిచి 'ఓయీ! నీవు బ్రాహ్మణ్యము నెట్లును బొందజాలవు నీకు వలయునది మరేదియైన గోరుకొనుము' అని చెప్పి, యంతఃపురమునకు బోయెను.


22 పింగళి సూరన్న

రామకృష్ణకవి రాయలు తదితరులు నాస్థానమున నుండగా యొకనాడు 'భార్య సద్గుణవతియైనచో బురుషునకు బ్రసిద్ది--మంచి బేరువచ్చునుగదా! యనెను, పింగళసూరన్న 'ఆహా! ఎంతగొప్పగా సెలవిచ్చినావు? భార్యగుణవతియైయుండి భర్త దుర్మార్గుడైనచో, భర్తకు గీర్తియెట్లు కలుగును? ఇరువురును గూడ సద్గుణశాలురై యున్నచో గీర్తికలుగుట వాస్తవము' అనెను----

'అవును నీవు రాఘవపాండవీయములో వ్రాసికొనినట్లు చెప్పుచుందువు. నీకవిత్వమునే బలపరచుకొనుచుందు' వని రామకృష్ణుడనగా, రాయలు “దానికిని దీనికిని సంబంధ మేమున్న?' దనెను, రాసుకృష్ణకవి 'ఆర్యా! ఇదిగో యీతడు వ్రాసిన పద్యము.

సుతుని దౌష్ట్యముచే, బలాత్కారముచే ధృతరాష్ట్రుడుకుమారుని మార్గమునే యనుసరించినను, సతియగు గాంధారి సౌజన్యము వలననే కీర్తి కాముడయ్యెను. 

'క . సుబల తనయ గుణమహిమన్
     బ్రబలి తసకుధారధర్మ పాలనలీలన్
     సొబగొంది వన్నె దేఁగా
     విబుధ స్తుతుఁడవ్విభుండు వెలసెన్ ధరణిన్ .

తన్నారీతి నాక్షేపణం బొనర్చినందున గ్రోధంబునుజెంది, పింగళి సూరన్న యింటికిజనెను. భార్యభోజనమునకు లెమ్మని బ్రతిమాలినను లేవక పింగళి సూరన్న రామకృష్ణుపై గోపముకొలదినొక పద్యము నిట్లు వ్రాయఁబూ నెను—

క. 'తెనాలి రామకృష్ణుఁడు
    తిన్నాడుర తట్టడంత--

ఇకమీద నాతనికేమియు స్ఫురింపనందున భోజనము చేసి పిదప వ్రాయదలంచి, స్నానార్ధము తుంగభద్రకరిగెను. తనపై గోపగించి వెళ్ళినందున ముక్కో పియగు సూరన్న భోజనము చేసినాడో లేదోయని రామకృష్ణుడు సూరన్న గృహమున కరిగి చావడిలో నున్న తాటియాకుం దిలకించి, తనపైవ్రాసిన యర్థభాగము జదువుకొని, మిగిలిన రెండుపాదములను బూర్తిచేసి వెడలిపోయి, పెద్దనాదికవుల గొనివచ్చెను, ఆసమయమునకు సూరన్న భోజనము చేయుచుండుటచే పెద్దన తాళపత్రముం దిలకించి యందఱు నాలకించునట్లు చదివెను.

'క. తెనాలి రామకృష్ణుఁడు
    తిన్నాడుర తట్టెడంత తియ్యనిబెల్లం
    బెన్నఁగ మన పింగళ సూ
    రన్నకు నోరంత పేడయై పోయెనురా'

అందఱును నవ్విరి. పెద్దన “సూరన్న ముక్కోపి యగుట నిటు వ్రాసినాఁడు అనెను. సూరన్న రామకృష్ణుఁడు వ్రాసిన మిగతపాదములకు గినియక నవ్వి యూరకుండెను.