తెనాలి రామకృష్ణకవి చరిత్రము/జననము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఓం

అవిఘ్నమస్తు

శ్రీరామాయనమః

తెనాలి రామకృష్ణకవి చరిత్రము

జననము

తెనాలి రామకృష్ణకవిపేరు వినని యాంధ్రుడుండడు. ఈకవి కృష్ణామండలములోని తెనాలి యను యగ్రహారమున జన్మించెను. ఈతనితల్లి లక్ష్మమాంబ తండ్రి రామయామాత్యుడు. యాజ్ఞవల్క్య బ్రాహ్మణుడు. కౌండిన్యసగోత్రుడు. రామకృష్ణకవి తన్నుఁ గూర్చి పాండురంగ మహత్మ్యమునం దిట్లు వ్రాసికొనియున్నాఁడు.

క. నను రామకృష్ణకవిఁ గవి
   జనసహకారావళీవసంతోత్సవ సూ
   క్తినిధిఁ బిలిపించి యర్హా
   సనమునఁ గూర్చుండబనిచి చతురత ననియెన్.

సీ. నలుదెఱంగుల కావ్యనవసుధాధారల
               ఘనుఁడా వాశువునందుఁ గరముమేటి
    నఖిల భూమీపాల కాస్థానకమలాక
               రోదయతరుణ సూర్యోదయుఁడవు
    శైవవైష్ణవ పురాణావళీ నానార్థ
               రచనాపటిష్ఠైక రమ్యమతివి
    లౌకికవైదికలక్షణ చాతుర్య
               ధైర్యప్రభారూఢ కార్యచరణుఁడ

గీ. నాంధ్రభూమీ కుచాగ్రహారాభమైన
    శ్రీ తెనాల్యగ్రహార నిర్ణేతవగ్ర
    శాఖ కాకోకిలమవీవు సరసకవివి
    రమ్యగుణకృష్ణ రామయ రామకృష్ణ

క. కౌండిన్యసగోత్రుఁ డవా
   ఖండలగురువిభుఁడ నఖిల కావ్యరససుథా
   మండనకుండలుఁడవు భూ
   మండల వినుతుఁడవు లక్ష్మమావర తనయా.

క. యశము కలిగించు నీమృదు
    విశదోక్తులఁ బౌండరీకవిభుచరితుఁ జతు
    ర్దశభువన వినుమతముగ శుభ
    వశగతి నాపేర నుడువు వరతత్త్వనిధీ.

ఉ. స్కంధపురాణ వీరనిధికౌస్తుభమై ప్రభవించు దేవకీ
    నందను సత్క థోద్యమ్ము నవ్యకవిత్వకళాకలాపమన్
    కుందనమున్ ఘటించు, కడుఁగొత్తగు సొమ్మొనరించి విష్ణు సే
    వందిలకించు నప్పరమవైష్ణవకోటి నలంకరింపుమా.

మ. ఉదయంబస్తవగంబు సేతువు హిమవ్యూహంబునుం జుట్టిరా
     విదితంబైన మహిన్మహాంధ్రకవితా విద్యాబలప్రౌఢి నీ
     కెదు రేరీ సరసార్దబోధఘటనా హేలాపరిష్కార శా
     రదనీరూపము 'రామకృష్ణకవిచంద్రా! సాంద్రకీ ర్తీశ్వరా!

తెనాలిరామకృష్ణకవి క్రీ. శ. 1505 సం|రమునకుఁ బూర్వము వాఁడని చరిత్ర వాకొనుచున్నది. శ్రీకృష్ణదేవరాయల యాస్థానమునఁ "బేరుగన్న యష్టదిగ్గజముల నీతఁ డొకడని చెప్పుదురు. అల్లసానిపెద్దన, నందితిమ్మన, అయ్యలరాజు రామభద్రుఁడు. ధూర్జటి కాకమాను రామరాజ భూషణుడు, ప్రౌఢకవి మల్లన్న, పింగళి సూరన్న తెనాలి రామకృష్ణకవి—వీ రష్టదిగ్గజములని, కీర్తి గాంచిరి.


2 బాల్య ము

రామకృష్ణకవి బాల్యావస్థలో నున్నపు డపరిమితముగ నల్లరి సేయుచు తలిదండ్రులమాట పాటింపక తిరుగుచుండెను. ఈతఁడొకనాఁడు కొందరు బాలురతోకలిసి యాటలాడు చుండగా, నామార్గమున బోవుచుండిన సిద్ధుడొకఁడాగి, రామకృష్ణుని ముఖమువంక తదేకదృష్టిగఁజూచి, రమ్మని పిలచి యిట్లనెను ఓ బాలుడా! నాతో దూరము వత్తువేని నీకుమేలు కలిగించెదను,

రామకృష్ణుఁ డాసిద్ధునియెడల గౌరవయుక్తుఁడై యనుసరించెను. కొంతదూరము గొనిపోయి యాసన్యాసి, ఓ బాలుడా నీ ముఖమున నసాధారణమగు తేజముప్రస్ఫుటమగుచున్నది. నీకు గాళికామంత్రము నుపదేశింతును. భక్తి, ముక్తుడవై , దేవి యాలయమునకు బోయి గర్భగుడిలో గూర్చుండి, జపింపుము, నీకు మేలు కలుగును. అనియొకమంత్రము నుపదేశించి వెళ్ళెను.

రామకృష్ణుడు నిర్భయచిత్తుడై "కాళికాలయమునకు బోయి యేకాగ్రచిత్తముతో నామంత్రమునుజపింపగా, దేవి సంతుష్టినొంది సాక్షాత్కరించెను. దయార్దహృదయమై దేవిప్రత్యక్షమైనంత నే రామకృష్ణకవి భక్తి యుక్తుఁడై ధ్యానించుటకుమారు ఫక్కుననవ్వెను. కాళికాదేవి యాగ్రహమునొంది “ఏమిరా' నన్ను చూచి నవ్వెదవు అని గర్జించెను. భయభక్తులు తన్ను ముప్పిరిగొన నాతడు 'అమ్మా! నన్ను క్షమింపుము నేను నీదాసుడను, నీరూపము చూడగానే నా చిత్తము సందేహాయత్తమైనది” అనెను.


This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after sixty years counted from the beginning of the following calendar year (ie. as of 2020, prior to 1 January 1960) after the death of the author.


This work is also in the public domain in the U.S.A. because it was in the public domain in India in 1996, and no copyright was registered in the U.S.A. (This is the combined effect of India's joining the Berne Convention in 1928, and of 17 USC 104A with its critical date of January 1, 1996.)