తెనాలి రామకృష్ణకవి చరిత్రము/అయిదువేలు
చుండును. ఒకనా డామె యంగడికిబోయి కోడిపెట్ట నొక దానింగొని కుక్కగొలుసు మఱొక కేలంబూని వచ్చుచుండెను. రామకృష్ణు డామార్గముననే పోవుచు తన కెదురైన మొల్లనుజూచి, పరిహాసపూర్వకముగా 'మొల్లా! రూపాయిచ్చెద గుక్కనిచ్చెదవా, పెట్ట నిచ్చెదవా? యనెను. ఆ వ్యంగ్య సంభాషణకు గుపితయయ్యు పరమ శాంతస్వభావి యగు మొల్ల 'రామకృష్ణకవీ! నీవేమి యీయఁబూనినను నీకు నేనమ్మనుకదా!' యనెను. రామకృష్ణుడు సిగ్గుపడి యారోజు నుండియు నామెయందు మాతృభావము గల్గియుండెను.
28 అయిదు వేలు
రాయలు కవులందరకు మాసవేతన మిచ్చుచుండెను. రామకృష్ణకవికూడ యదేవిధమున మాసవేతనము నొందుచు బిల్లలు కలవా డగుటచే నా ధనముతో గడుపుకొనజాలక యిబ్బంది పడుచుండెను. ఎట్లయిన రాయలునుండి ధనము స్వీకరింపవలయునని రామకృష్ణు డుపాయముల నూహింపసాగెను. తుదకొక చక్కని యుక్తి నాలోచించి, భార్యాపుత్రులకుజెప్పి, రాయలకడ కరిగెను. రాయలు సంతోషాన్వితస్వాంతుడై యున్నతఱి రామకృష్ణుడు సమీపించి, మహారాజా ! నాగుండెలు నిరంతరము నగ్నిహోత్రముచే దహింపబడినట్టుమండిపోవుచున్నవి. ఇక నేనెంతో కాలము బ్రతుకను. నాకు జాలమంది పిల్లలు కలరు. నేను మరణించినచో వారిపాట్లు వర్ణించుట కా యాదిశేషునికైన నలవికాదు, జ్యోతిష్కులుకూడ నిక నెంతోకాలము బ్రతుకవనిరి. నాకు జాల బెంగగానున్నదనెను. రాయలు దయార్ద్రహృదయుడు. రామకృష్ణుని వాక్యములకు జూలినొంది. 'కవిచంద్రమా ! ధనార్జనాసక్తులగు జ్యోతిష్కులమాట పాటింపరాదు. నీవట్టి బెంగలతో క్రుంగిపోకుము. 'మనోవ్యాధికి మందు లేదుకదా ! యను సూక్తి నెరుంగవే? ఒక వేళ నీవు మృతి నొందుటయే తటస్థించినచో నీ భార్య కయిదువేల దీనారముల నంపె దను, చాలునా?' యనెను. రామకృష్ణుడు మిక్కిలి సంతసించి వెడలిపోయెను.
వారమురోజులు కడచెను. రామకృష్ణుడు తన బందుగుల జూచుటకయి కలుబరిగె నగరమునకు బోయెను. వెళ్ళిన నాలుగు రోజులకు ఆ బంధువునికడనుండి పెద్దన్న , పింగళిసూరన్న మున్నగు కవుల యింటికి రామకృష్ణుడు జ్వరపీడితుడై మరణించెనని లేఖలు వచ్చెను. నగరమంతయు క్షణములో నావార్త వ్యాపించెను. అట్టి హాస్యగాడు దొరకడని వర్తకులనిరి. 'మంచిస్నేహితుని, కవిని, గోల్పోయితి' నని రాయలు కన్నీ రువిడిచి వెంటనే అయిదువేల దీనారములను రామకృష్ణుని భార్యకంపెను. పదునైదు దినములు గడచెను. రామకృష్ణకవి కలబరిగె నగరమునుండి తిరిగివచ్చి, యాస్థానమునకు జనెను. రాయలు, తక్కుంగల వారు 'ఇదియేమిచిత్రము? నీవు మృతినొందితివని లేఖవచ్చెగదా?' యనిరి. రామకృష్ణుడు 'అవును, నేను మృతినొందినమాట వాస్తవమే కాని యమధర్మ రాజు 'ఇది యేమి! వీనికింకను గొంతకాలము గడువున్నదని 'ఓరీ! మీ రాయలవారు నీ భార్య కయిదువేల దీనారములంపినారు. ఆ ధనమును సుఖముగా ననుభవించిర 'మ్మనగా దిగిగివచ్చితిని' అనెను.
'ఆహా! అటులనా! ఈఅయిదువేల దీనారముల బొందుట కెత్తిన గొప్పయెత్తు'అని రాయలు మందహాస మొనరించెను.
29 మామిడి పండ్లు
రాయలతల్లి నాగాంబ మరణించుటకు బూర్వము రాయలను బిలిచి 'నాయనా! నాకు మామిడిపండ్లు తినవలయునని యున్నది.' అనెను. వెనువెంటనే రాయలు ఎంతఖరీదైనను సరే ఎచ్చటనున్నను సరే ఎన్నిదొరికిన నన్ని మామిడిపండ్లను గొనిరండు' అని భటులను నల్దెసలకంపెను. తిరిగి తిరిగి భటులు ఫలముల గొనివచ్చునంతలో నాగాంబ యసువుల బాసెను. తనతల్లి యవసానదశలో గోరినకోరిక