తిమ్మరుసు మంత్రి/దశమ ప్రకరణము
దశమ ప్రకరణము.
తిమ్మరుసు పరిపాలనము.
ఏనాఁడు సాళువనరసింహధరాతలేంద్రుడుఁ విజయనగరమునఁ బట్టాభిషిక్తుడయ్యెనో ఆనాఁడు మొదలుకొని నలువది సంవత్సరముల కాలమును తిమ్మరుసు విజయనగరంబునఁ గడపెను. సమకాలికులలో నాతనితో సమానుఁడగు ప్రతిభాశాలి దక్షిణహిందూస్థానమునఁ గానరాఁడు. దక్షిణహిందూస్థానమునమాత్రమేగాదు, భరతఖండమునఁ గూఁడఁ గానరాఁడని చెప్పవచ్చును. కరాటసామ్రాజ్య మనియెడు నీహైందవసామ్రాజ్యముయొక్క కీర్తి ఖండాంతరములఁ గూఁడ వెలయునట్లు చేసెను. రాజకుటుంబములలో జన్మించినకలహములనడంచి, అసమర్థులను వెనుకకు నెట్టి సమర్థులను ముందుకుఁ గొనివచ్చెను. తన కాలమునఁ దనకోరిక ననుసరించి నల్వురను పట్టభద్రులను గావింపవలసివచ్చినను రాజధానీ నగరమున నెట్టి విప్లవమును జనింపకుండఁచేసి నగరమును గాపాడిన మహానీయుని కాలమున నెంతయభివృద్ధి కలిగినదన్నను వింతయేముండును ? బలాడ్యుడయిన శత్రురాజులను జయించి రాజ్యము విస్తరింపఁజేసెను. సామ్రాజ్యమధ్యమున జనించిన రాజద్రోహకరములయిన కార్యముల నన్నిఁటిని సడంచివై చెను. సామ్రాజ్యమునకు తోడుపడిన సామంతరాజును కప్పములు సరిగాఁ జెల్లించినట్లు కట్టుదిట్టము లను గావించెను. సైన్యముల విషయమై జరిపిన సంస్కరణ మిదివఱకే తెలిపియున్నాఁడను. సైన్యములఁ బరీక్షించి సైన్యాధిపతులకు సైనికులకుఁ బహుమానము లిచ్చుటకు విజయదశమి యుక్తమైన దినముగఁజేసెను. తిమ్మరుసు సమర్ధులని తోచినప్పుడు బ్రాహ్మణులకు సయితము సైన్యాధిపత్యము లొసంగుచు వచ్చెసు. ఈసామ్రాజ్యమున బ్రాహ్మణులతో తిమ్మరుసునకుఁ దరువాత మహాసేనాధిపతిగా నున్నవాఁడు రాయసము కొండమరుసు (కొండమరాజు). శ్రీకృష్ణదేవరాయని పూర్వదిగ్విజయ యాత్రఁలోగూడ నుండుటయేగాక అదిల్‌సాహపై దండెత్తిపోయినపుడు లక్షసైన్యమున కధికారియై యాతని వెంటఁ బోయి తురుష్కులతో యుద్ధముచేసెను. తిమ్మరుసు తమ్ముఁడగు గోవిందరాజుగూడ కొండమరుసువంటివాఁడే. ముప్పదివేల సైన్యమున కధికారియై కృష్ణరాయని వెంటఁబోయి తురుష్కులతో యుద్ధముచేసి ఖ్యాతిఁ గాంచినవాఁడే. తిమ్మరుసు కొడుకు గోవిందరాజుకూడ దండనాధుఁడుగ నుండెను. అల్లసాని పెద్దిరాజు (పెద్దయ్యంగారు లేక పెద్దనామాత్యుఁడు), నంది తిమ్మనామాత్యుఁడు, కవులుమాత్రమేగాక మండలాధిపతులుగఁ గూడ నుండిరి. తిమ్మరుసు మేనల్లుండ్రను గూర్చి వ్రాసియే యున్నాను. ఈవిజయనగర సామ్రాజ్యము ప్రతిష్ఠాపింపఁబడినది. మొదలుకొని తుదికాలమువఱకు బ్రాహ్మణులవలనఁగూడ బెంపఁబడినదనుటలో సందేహము లేదు. ఈ సామ్రాజ్యముయొక్క ప్రతిరాజ్యాంగ శాఖయందును బ్రాహ్మణ ప్రాబల్య మెంతకలదో యాకాలమునాటి శాసనములును, వాజ్ఞ్మయమును బరిశీలించిన వారికి బోధపడకమానదు. ఈసందర్భమున శ్రీకృష్ణదేవరాయనికి బ్రాహ్మణులయందెంత విశ్వాసముగలదో యాతనిచే రచింపఁబడిన 'ఆముక్తమాల్యద' యను ప్రబంధము నందలి యీక్రింది పద్యములను బట్టి మనము తెలిసికొనవచ్చును.
కం|| దుర్గములాప్త ద్విజవర
వర్గమునకే యిమ్ము : దుర్గవత్తత్తతిక
త్యర్గళధరాధి రాజ్య వి
నిర్గత సాధ్వసత పొడమవిలుపకు కొలదిన్."
(ఆ. ఆ. 4. ప. 207)
"దుర్గములను నీకాప్తులయిన బ్రాహ్మణులకిమ్ము, వారి మీదికి నెట్టి శత్రువులు వచ్చినను వారిని నిర్భయులై తెగటార్చుటకు వారికి నీయనర్గళాది రాజ్యమువలన ఆదుర్గములందు వలసిన సేనాదులను సమృద్ధిగా నుంపుము; అల్పముగా నుంపకుము; లేదా, వారికి రాజ్యగర్వముచేత నీయెడలంగూడ భయము తప్పునట్లు సైన్యాధికమును ఎక్కువగా ఇయ్యకుము"
- (వేంకటరాయశాస్త్రి కృతసంజీవనీ వ్యాఖ్య. )
"ఆ. ఆనభిజాతుఁ గేకటాలయు నశ్రుతు,
నలుకమాని బొంకు పలుకువాని,
నాతతాయి, గడును నన్యదేశ్యు. నధర్ము.
విడుము విప్రునేల వేడితేవి." (ప. 209)
"నీ దొరతనము నీకే ఉండవలయునని కోరెదవేని బ్రాహ్మణునైనను, నీచకులజుఁడు, బోయలనడుమ జీవించు వాఁడు, గురుశుశ్రూష చేయనివాఁడు. అనృతవాది, చంపనుద్యుకుఁడు, తప్పుచేసియు అలుకనివాఁడు, పరదేశాగతుఁడు, అధర్మపరుఁడు, అగువానిని చేర్పకుము.” (అదేవ్యాఖ్య.)
"తే. బాహుజాంఘ్రిజముఖి విడంబనకు నయిన
గొలిచి మనువిప్రధర్మంబు దెలిసియైనఁ
బూని సంకటముల నిల్చుఁగానఁ దఱచు
బ్రాహ్మణునిఁ బ్రభుఁజేయుట పతికి హితము."
(ప. 217)
“రాజు బ్రాహ్మణుని గొప్ప యధికారమునందు నియమించుకొనుటచేత మేలొందును; ఏలయన బ్రాహ్మణుఁడు తాను సంకటములలో నిలువక తప్పినచో తన్ను క్షత్రియ శూద్రాదులు పరిహసింతురనియు, తనవలె రాజులకడదొరలై సేవించు నితరబ్రాహ్మణుల వర్తనము జూచి దాని నవలంబించియు, సంకటములయందు పూనికతో నిలిచి వానిని తొలగించును. (అదేవ్యాఖ్య.)"
ఈపై భావప్రకటనము శ్రీకృష్ణదేవరాయనికి తిమ్మరుసు మంత్రియొక్క ఋజువర్తనమును బరీక్షించుటవలననే కలిగినదని మనము తలుపవచ్చును. ఇట్టి విశ్వాసము కృష్ణరాయని కుండుటచే సమర్థులయిన బ్రాహ్మణులాకాలమున నుత్తమాధికార పదవులనుగూడఁ బడయుటగూడ దటస్థింపుచు వచ్చెను. తిమ్మరుసు రాజ్యపాలనము వహించినది మొదలుకొని మహాసేనాధిపత్యములు, మండలాధిపత్యములు, తెలఁగువారికే లభించుచుండెను. తిమ్మరుసు కాలమునాటినుండియు సామ్రాజ్యమునఁ బలుకుఁబడి తెలుఁగువారికే యెక్కువగ నుండెను. విస్తీర్ణమునఁ బెఱిఁగినది సామ్రాజ్యము మాత్రమేగాక రాజధానీ నగరముగూడ నానాముఖములఁ బెఱిఁగినది. నాగలాపురము మొదలగునవి నూతనముగాఁ గట్టఁబడినవి. మంచిభాట లేర్పడినవి. నగరమునకు మంచినీటి వసతి యేర్పఱచఁబడినది. మహానగరమంతయు జనవృదియు, వస్తుసమృద్ధియు, గలిగి వఱలుచుండెను. నగరాకృతిని వీక్షించినప్పుడును, నగరైశ్వర్యమును దలపోసికొన్నప్పుడును, పాశ్చాత్యులకు సయితము దిగ్భ్రమను బుట్టించి ప్రపంచమున నిట్టి మహానగరమును నెందును జూడలేదని యచ్చెరువందునట్లుగా నుంచెను. తిమ్మరుసునకు సమకాలికులయిన పోర్చుగీసు చరిత్రకారు లెందఱో యామహానగరవైభవమును గన్నులారఁగాంచి యిట్టినగరము ప్రపంచమున లేదని యభివర్ణించి యున్నారు. అట్టి వర్ణనముల సామ్రాజ్య చరిత్రమునఁ బాఠకులు పఠింపఁగలరని యిందు వ్రాయ విరమించినాఁడను.
ఇట్టి మహానగరమునఁ బౌరజనుల మాన ప్రాణ ధనాధులకు నెట్టి యుపద్రవముఁ గలుగకుండఁ బండ్రెండువేల యారక్షకభటసైన్యముతో నొక నగరపాలకుఁడు నగరాధ్యక్షుఁడుగా నియమింపఁబడియెను. ఇతఁడిప్పటి పోలీసు కమిషసరువంటి వాఁడు. ఈనగరాధ్యక్షుని కార్యాలయము టంకశాలకు నెదు రుగ నుండెను. ఒక్కొక్క భటునకు నెలకు ముప్పది పణముల జీత మీయఁబడుచుండెను. వీరికగు ఖర్చుమొత్తమునంతయు జారస్త్రీలపై విధింపఁబడిన పన్నులనుండి గైకొని వ్యయపెట్టు చుండిరి. అమ్మహానగరమున సప్తప్రాకారములమధ్య నెచ్చోట బందిపోట్లుగాని, దోపిడిలుగాని, ప్రమాదములుగాని, దొంగతనములుగాని, హత్యలుగాని, మఱి యేవిధములయిన యల్లరులుగాని జరుగకుండ జూచు బాధ్యతయును, సాలీనావృత్తాంతమును దప్పక సామ్రాజ్యాధిపతికిఁ బంపుచుండు బాధ్యతయును వహించి నగరాధ్యక్షుఁడు నగరమును బహుజాగరూకతతోఁ బరిపాలించుచుండును. అందువలన నేరములు బహుస్వల్పముగ జరుగుచుండెను. ఇప్పటివలెగాక యాకాలమందు దొంగతనము మొదలగు నేరములకు బహుక్రూరములగు శిక్షలు విధింపఁ బడుచుండుటయుఁగూడ నాకాలమున దొంగతనములు స్వల్పముగ నుండుటకు ముఖ్యకారణమని తలంపవచ్చును. దొంగతనము వృతిగఁజేసికొని బ్రదుకునట్టివాఁడు పట్టుబడినప్పుడు తప్పక కాలో చేయో పోఁగొట్టుకోవలసిన వాఁడగును. ఆకాలమున నేరములకు శిక్షలు మాత్రము బహుక్రూరములుగానే యుండెడివని చెప్పవచ్చును. దొంగతనము పెద్దదిగానున్న యెడల మరణశిక్ష యనగా గొడ్డలితో తల నఱుకఁబడుటయే తటస్థించును. అవివాహితలైన కన్యలనుగాని, వివాహితలయిన సాధ్వీమణులనుగాని చెఱచినవానికి మరణదండన విధించుచుండిరి. సామంతుఁడైనవాఁడు రాజుపైఁ దిరుగఁబడి యుద్ధముచేయు వాఁడైనయెడల వానిచర్మ మొలిపించఁబడును. నీచజాతివాఁ డైనయెడల నెట్టినేరము గావించినను వానితల సంతబజాఱులో నరికివేయఁ బడుచుండెను.
నేరములు చేసిన వారలకు విధింపఁబడెడి శిక్షలు క్రూరములుగాఁ గన్పట్టినను యుక్తాయుక్తవిచక్షణ లేకుండ గ్రుడ్డిగా విధింపఁబడుచుండ లేదనుటకుఁ బ్రబలసాక్ష్యము గలదు.
మఱియు తిమ్మరుసు ప్రోత్సాహము మూలముననే నూతనములయిన దేవాలయములును, మందిరములును, పట్టణములును, కాలువలును ప్రతిష్ఠాపింపఁబడి శిల్పకళలభివృద్ధిఁ గావింపఁ బడియెను. సామ్రాజ్యమున భూమియంతయుఁ గొలతవేయఁబడినది. సుంకములు గొన్ని మాన్పింపఁబడినవి. పూర్వము వివాహముపై సుంకము వేయుచుండిరి. ఇతఁడట్టి సుంకములను మాన్పించెను. దొరతనమువారి ద్రవ్యముతోఁ బ్రజోపకారములయిన కార్యము లనేకములు నెఱవేర్పఁబడినవి. ఇతని కాలమున సంస్కృతాంధ్ర కర్ణాటభాష లభివృద్ధి గాంచినవి. ఆంధ్రమునకు గౌరవము హెచ్చినది. ఇతఁడు దేవాల లయములకును విద్వాంసులయిన బ్రాహ్మణులకు భూదానములను బెక్కులను గావించుటయేగాక కృష్ణరాయనిచేతఁగూడ ననేక దానములను జేయించెను. మఱియు శైవమని, వైష్ణవమని భేదమునెంచక శివాలయములకుఁ విష్ణ్వాలయములకును సమముగా దానధర్మములను జరుపుచు వచ్చెను. ఈతని మార్గమునే యవలంబించి కృష్ణరాయఁడుకూఁడ తనయాముక్తమాల్యద యందు వీరవైష్ణవుఁడై వైష్ణవ మతపక్షపాతము నెంతచూపించినను కార్యాచరణమున సమభావముతోనే ప్రవర్తించెను. శైవులను, వైష్ణవులను సమదృష్టితోనే జూచెను. వీరినిమాత్రమేగాదు. జైనులపట్లగూడ సహనమువహించి జైనపండితులఁగూడ నాదరించుచు వచ్చెను. ఇట్లు హిందూ జైనమతములు మాత్రమేగాక క్రైస్తవ మహమ్మదీయ మతములుగూడ వ్యాప్తములగు చున్నను తిమ్మరుసు మంత్రి శత్రుత్వమును బూనియుండలేదు. తన సైన్యములోఁ గొందఱు మహమ్మదీయులనుగూడఁ జేర్చుకొని వారి యుపయోగార్థము విజయనగరమున నొక మసీదునుగూడఁ గట్టింపించి యిచ్చెను. అందువలన తిమ్మరుసు కాలమున రాజ్యపరిపాలనము సర్వజన సమ్మతమై యుండెను. పాశ్చాత్యులైన పోర్చుగీసువారితో నెప్పుడును విరోధము పెట్టికొని యుండలేదు.
గోవాపరిపాలకులను గారవముతోఁ జూచుచువచ్చెను. ఆబాలవృద్ధులు తిమ్మరుసునకు వినయవిధేయులై వర్తించిరి. విదేశములతోడి వ్యాపారము విస్తరింపఁజేయబడినది. సామ్రాజ్య విభవమపారమైయుండెనని పాశ్చాత్యుల వర్ణనములనే ప్రత్యక్ష సాక్ష్యముగాఁ జూపవచ్చును. ఏసమయమునందయినను అవసరమైనయెడల ఇరువదిలక్షలసైన్యమును సమకూర్చుట కనువు గల్పించెను. వేయునేల? తిమ్మరుసుమంత్రిలేనియెడ కృష్ణదేవ రాయలు లేఁడని తలంపవలసినదే. కృష్ణదేవరాయని రక్షించినవాఁడు తిమ్మరుసు ; కృష్ణదేవరాయనికి రాజ్యమిప్పించినవాడు తిమ్మరుసు ; కృష్ణదేవరాయని దిగంతవిశ్రాంతయశస్కుని గావించినవాఁడు తిమ్మరుసు ; అట్టితిమ్మరుసు తెలుఁగుదేశమునఁ బుట్టినవాని కెవ్వనికిఁ బూజ్యుఁడుగాక యుండును ?
అంత్యదశ
శ్రీకృష్ణదేవరాయనికి వాంఛలన్నియుఁ దీఱినవెనుక నొకదుర్బుద్ధిపుట్టెను. తాను బ్రదికియుండఁగాఁ దనకుమారుఁడు పట్టాభిషిక్తుఁడు గావలయునని తలంచెను. తనమరణానంతరము తన తమ్ముఁడుగాని, తనయన్నకొడుకుగాని తన కొడుకును దఱిమివేసి సింహాసన మాక్రమించుకొందురన్న భయము జనించెను. తిమ్మరుసుగాని, తిమ్మరుసుతమ్ముఁడుగాని వానిబంధువర్గముగాని తనకుమారునకుఁ దోడ్పడ కున్నయెడల రాజ్యము తనకుమారునకుఁ దక్కదను సందేహముపుట్టెను. తిమ్మరుసునెడ నిర్హేతుకముగా నవిశ్వాస మంకురించెను. దేశమంతయుఁ దిమ్మరుసుపలుకుఁబడిలోనుండెను. తిమ్మరుసుబంధువులు, మిత్రులు ననేకలు గొప్పపదవులలోనుండిరి. వారి ప్రాపులేకున్నఁ దనకొడుకు పట్టాభిషిక్తుఁడగుట సంభవింపదని తలపోసెను. ఇట్లు తలపోసినకొలది ననుమానపిశాచము హృదయమును నానావిధముల బాధింపమొదలుపెట్టెను. ఇట్లు తలపొసి తలపోసి యొకనిశ్చయమునకు రాఁగలిగెను. ఇట్లు కుటిల బుద్ధిగలవాఁడై బాలుఁడైన తనకుమారునికి దాను బ్రదికియుండఁగానే పట్టముగట్టి, వానిపేరిట దానే పరిపాలనము చేయవలయునని యూహించెను. ఆబాలునిపేరు తిరుమలరాయలట! కృష్ణరాయనికి మువ్వురో నల్వురో దేవేరులు గలరు. ఈతిరుమలరాయలు వారిలో నేదేవికి జనియించెనో తెలియదు. కృష్ణరాయనికి బుత్రికాసంతానమెగాని పుత్ర సంతానమున్నట్లు ఆంధ్రవాఙ్మయమునఁగాని మఱియేవాఙ్మయమునఁగాని గానరాదు. తుదకీబాలుని 1524 వ సంవత్సరములో సింహాసన మెక్కించి తాను ప్రధానామాత్యుఁడై కార్యనిర్వాహకర్తగ తిమ్మరుసు నేర్పరచి పరిపాలనము చేయనారంభించెనఁట ! తిమ్మరుసు కుమారుఁడు గోవిందరాజునకు సేనాధిపత్య మొసంగెనఁట ! ఎనిమిది మాసములు సామ్రాజ్యమునం దంతటను మహోత్సవములు సలుపఁబడెనఁట! తానొకటి తలంచిన దైవము వేఱొకటి తలంచెను. ఆకస్మికముగా నొక్క నాఁడేదో జాడ్యమంకురించి యాబాలరాజు మృతినొందుట సంభవించెనఁట ! ఇంకేమున్నది? రాయనికి పర్వతము బ్రద్దలై తలపైఁ బడినట్లు తోఁచెను. అతఁడు దురంతసంతాపముచే దురపిల్లుచుండగా తిమ్మరుసుకొడుకు తనకుమారునికి విషము పెట్టించి చంపించెనన్న దుర్వార్తయొక్కటి రాయనిచెవినిఁ బడియెనట ! అతఁడాదుర్వార్త నిశ్చయమనినమ్మి క్రోధావేశ పరవశుఁడై తిమ్మరుసు తనకుఁజేసిన యుపకృతులనన్నిటిని మఱచిపోయి యాతని, దళవాయియైన యతనిపుత్రుని గోవింద రాజును, నగరాధ్యక్షుఁడయిన యతనితమ్ముని గోవిందరాజును, వారి బంధువులను, తదితర ప్రభువరులను, దండనాధులను నెల్లవారిని రప్పించి కొలువుదీర్చి తిమ్మరుసు మొగముగాంచి యిట్లని పలికెనఁట!
"నిన్ను ప్రాణమిత్రునిగా నెప్పుడును జూచుకొనుచున్నాను. నీవు నాకిచ్చిన యీరాజ్యమున కంతకును నీవేపాలకుఁడవుగా నుంటివి. అయిన నందులకు విశ్వాసముఁ జూపఁజాలను. ఎందుకన నీకు విధ్యుక్తమైన కార్యమును నేఱవేర్చుట యందు మాకుఁ బ్రతికూలముగా వర్తించితివి. నీప్రభువగు నాయన్నగారు నానేత్రములను తీయించి వేయవలసిపదని నీకాజ్ఞ చేసినప్పుడు వారియాజ్ఞకు నీవు లోఁబడవలసినవాఁడవై యుండియు నాయనయాజ్ఞను జెల్లింపలేదు. ఆతనికి విధేయుఁడవునుగాలేదు. మీదుమిక్కిలి మేకకన్నులుపెఱికించి తెప్పించి చూపి మోసపుచ్చినాఁడవు. అందువలన నీవును నీతనయులును రాజుద్రోహులైరి. ఇప్పుడు నాతనయునకు విషముపెట్టి చంపినారని తెలిసినది. అందుకొఱకే మిమ్ములను జెఱసాలలో ఖైదీలనుగాఁ జేసెద" నని చివాలునలేచి వారలంబట్టుకొని తనకును తనరాజ్యమునకు నేయపాయముఁ గలుగకుండ బోర్చుగీసు వారిని తోడ్పడుమని ప్రార్థించెనఁట !
ఇట్లు తిమ్మరుసు తమ్మునితోడను కొడుకుతోడను బట్టువడి చెఱసాలం ద్రోయంబడియెనఁట ! కాని త్రిమ్మరుసు కొడు కెట్లో చెఱసాలనుండి తప్పించుకొని పోయి తసబంధువగు నొక దుర్గాధ్యక్షుని కడకుఁబోయి సైన్యములం గూర్చుకొని రాయనితో యుద్ధము చేయుటకు సంసిద్ధపడియెనఁట ! తరువాత రాయ లసంఖ్యాకములగు సైన్యములను బంపఁగా రాయల సైన్యములకును తిమ్మరుసు కొడుకు గోవిందరాజునకును గొప్ప యుద్ధము జరిగిన వెనుక గోవింద రాజు శత్రువుచేఁ జిక్కెనఁట! అంత నా శత్రువు వానిని బట్టుకొనివచ్చి రాయనికి నోప్పగించె నఁట : కృష్ణదేవరాయఁడు క్రూరుఁడై కృతఘ్నుఁడై తరువాత వారికన్నులను దీయించివేసెనఁట ! ఆవృద్ధబ్రాహ్మణుఁడు చెఱసాలలో మూఁడుసంవత్సరము లుండి స్వర్గస్థుడయ్యెనఁట!
ఇట్టి విషాదకధనమును వ్రాసి విన్పించినవాఁడు కృష్ణరాయని కొల్వుననున్న “సన్నీజ్ " అను పోర్చుగీసు చరిత్రకారుఁడు. ఇతఁడు 1520 మొదలు 1540 వఱకు నిరువది సంవత్సరముల కాలములోఁ బలుతడవులు విజయనగరమున సందర్శింపుచుండెనని తెలియుచున్నది. ఇతఁడు దక్క మఱియే పోర్చుగీసు చరిత్రకారుఁడుగాని, ఏ మహమ్మదీయ చరిత్రకారుఁడుగాని, ఆంధ్రకవులు గాని, కర్ణాటకకవులు గాని, మఱియెవ్వరుగాని యట్టికథనమును బేర్కొనియుండలేదు. ఇంతయ గాక గృష్ణరాయలు మృతినొందునాటికి నాతనికిఁ బదునెనిమిది మాసముల శిశువగు నొకకుమారుఁ డుండెననిగూడ నితఁడు వ్రాసియున్నాడు. ఈ సన్నీజు వ్రాఁతనుబట్టి కృష్ణరాయనికి నిర్వురు పుత్త్రులున్నట్టు మనకు స్పష్టమగుచున్నది. కాని తిమ్మరుసుగాని కుమారుఁడు గోవిందరాజుగాని రాయనికుమారుని విషప్రయోగము గావించి చంపుటకుఁ దగుకారణము గానరాదు.
గోవిందరాజు సేనాధిపత్యమొసంగి తన్నాదరించి గౌరవించి గొప్పపదవికిఁ గొనివచ్చిన ప్రభువునెడ విశ్వాసములేక ప్రభుపుత్రునకు విషప్రయోగము చేసెననుమాట యెంత విశ్వాసపాత్రమో దురూహ్యమైనవిషయము. తిమ్మరుసునకు విరోధులగువారు వీరిపై నీదోషమారోపించి యుండవచ్చును, ఈకథయె నిజమైన యెడల తిమ్మరుసు శత్రువులకు, తిమ్మరుసు నెడఁ గలుగుపగఁ దీర్చుకొనుటకు మంచియవకాశము గలిగినది. 1525 మొదలుకొని 1530 వఱకును రాజకుటుంబములో సంభవించిన కలహముల మూలమున సామ్రాజ్యమున విప్లవములు పుట్టి యెట్టెట్టిదుర్ఘటనలను జనింపఁజేసియుండెనో వాని వివరములను దెలిసికొన్నయెడల మన మిందలి సత్యాసత్యములను దెలిసికొనఁగలుగుదుము. తిమ్మరుసుగాని వాని కుమారుఁడు గాని కృష్ణరాయని కుమారునికి విషముపెట్టించి చంపించుటకుఁ గారణమేమై యుండును? రాయల యనంతరము రాజ్యము రాయని వంశమువారికి గాక వాని ప్రతిపక్షమువారికి సంక్రమింపఁ జేయవలయుననిగదా యట్టి దుర్మార్గమున కొడిగట్టుట సంభవించును ? ఎవరా ప్రతిపక్షమువారు ? వాని సోదరులయిన అచ్యుతదేవరాయలును, రంగరాయలును, సోదరపుత్త్రుఁడయిన నరసింహరాయలును. కృష్ణరాయలు సింహాసనమెక్కినప్పుడు వీరలు మూవురును జంద్రగిరిదుర్గమునందు చెఱనుంచఁబడి యుండిరి. వారి పక్షమును బూని తిమ్మరుసు, రాజ్యమును కృష్ణరాయని యనంతరము వాని సోదరుడైన అచ్యుతదేవరాయనికిఁ జెందింపఁ జేయవలయుని తలంచి యుండినఁగదా రాయని పుత్త్రునిఁ జంపించుట ! సామ్రాజ్యములో సర్వాధికారములను వహించియున్న తిమ్మరుసేమి భాగ్యమును మూటకట్టుకోవలయునని తన చెప్పుచేతలఁ బ్రవర్తించుచున్న విశ్వాసపాత్రుఁడగు కృష్ణరాయని కాదని ఖైదులో నున్నవాని పక్షమును బూని చక్రవర్తి కమారునకు విషముపెట్టించి చంపించునంతటి దుష్టకృత్యమునకుఁ గడంగి తన ప్రాణముమీదికీ నాపదలు దెచ్చికొన సాహసించును? ప్రతిభావంతుఁడై యొక మహాసామ్రాజ్యమును జనరంజకముగాఁ బరిపాలించుచున్న తిమ్మరుసువంటివానిని బుద్దిహీనుఁడని తలంప నవకాశము గలదా ? లేదు. ఇతఁడు తన యాముక్తమాల్యదలోని నాలుగవ యాశ్వానములో యామునప్రభు రాజనీతిఘట్టములో :-
"చ. చదివి యధర్మభీతి నృపశాస్త్రవిధిజ్ఞతల న్వయస్సు డె
బ్బదిటికిలోను నేఁబదికి బాహ్యమునై యరుజస్వపూర్వులై
మదమఱి రాజు ప్రార్ధన నమాత్యతగైకొని తీర్చిపారువా
రొదవిననంగముల్మిగుల నూర్జితమౌటకుఁ బూటపాలదే. "
“విద్యనేర్చి, యధర్మమువలని వెఱపుతోడను, రాజనీతివిధానముయొక్క ఎఱుకకలిమితోను గూడియుండి, ఏఁబదింటికి పైఁబడి డెబ్బదింటికి లోఁబడిన వయస్సుగలవాఁడై , ఆరోగ్యవంతులయిన పూర్వులుగలవాఁడై , అహంకారమును బోవిడిచి, రాజుయొక్క ప్రార్థనముమీఁద మంత్రిపదమును గై కొని, రాచకార్యములు నెఱవేర్చెడి బ్రాహ్మణులు దొరికినయెడ రాజ్యంగము లెంతయు బలపడునట్టి వగుటకు నొక్కపూట చాలదా" అను నర్థమిచ్చునట్టి పద్యమును జెప్పినది తిమ్మరుసువంటి ప్రతిభావంతుఁడైన బ్రాహ్మణమంత్రి విగ్రహమును వీక్షింపుచుఁ జెప్పిన పద్యమె యని బాలుఁడు సయితము గ్రహింపఁగలఁడు. శుక్రనీతి, చాణక్యనీతి, కామందకనీతి మొదలగువానిలోఁ జెప్పఁబడిన రాజనీతినిబట్టి యేబదింటికి బుద్ధి చక్కగాఁ బరిపాకముఁజెంది డెబ్బదింటివఱకుఁ బటిమగలిగి యుండునని గ్రహింపఁ గలిగిన కృష్ణదేవరాయలు తిమ్మరుసునెడ నిట్టి నిందారోపణ కెట్లొడిగట్టవలసివచ్చెనా యని యొకింత సంశయము కలుగ వచ్చును. ఈ “సన్నీజు" అను పోర్చుగీసుదేశస్థుఁడు చెప్పిన కథనము యధార్ధమును దెలుపున దగు నేని నిట్లు జరిగి యుండవచ్చును.
ఇంతకుఁ బూర్వము తన యన్నగారగు వీరనరసింహరాయలు తన యవసానకాలమునఁ దన కుమారునికే రాజ్యమును జెందింపఁ జేయవలయునన్న తలంపుతోఁ గృష్ణరాయనిఁ జంపి వాని నేత్రములను గొనితెచ్చి చూపవలసినదని తన మంత్రియగు తిమ్మరుసున కాజ్ఞనిచ్చినపుడు తిమ్మరుసట్టి దుర్మార్గమున కొడిగట్టక చావనున్న నాతని సంతృప్తి పఱచుటకై కృష్ణరాయని దాచివుంచి మేక కన్నులను జూపించి యుండవచ్చును. కృష్ణరాయలను మృత్యువాతనుండి తప్పించి నరసింహరాయల కుమారుఁడు పసిబాలుఁడగుటచేత సామ్రాజ్యభారము నిర్వహింపఁగలవాఁడు యౌవనప్రాదుర్భావముతో నొప్పుచుండిన కృష్ణరాయలే సమర్థుఁడైనవాఁడని యెంచి కృష్ణరాయనిఁ బట్టాభిషిక్తుని గావించియుండిన మాట సత్యమె. ఇట్టిపని ప్రధానామాత్యుఁడు నిర్వర్తింపవలసిన విధ్యుక్తధర్మములోనిదే కాని యన్యముగాదు. ఇదియంతయు జ్ఞప్తియదుంచుకొనియె తన యన్నవలెనె తాను తన సవతిసోదరుల జెఱలో నున్నవారినిఁ గడతేర్చినయెడల సామ్రాజ్యము తన కమారునికే యుండఁగలదని తలపోసి తన మనోభిప్రాయమును దన కాప్తుఁడైన తిమ్మరుసునకుఁ దెలియఁజేసి యుండును. అందుల కాతఁ డొడంబడక తన యన్న తన్నుఁ జంపుటకుఁ బ్రయత్నింపఁ దన్ను రక్షించిన విధానమును జెప్పి యాతని మందలించి యాదుష్కార్యమునుండి తొలఁగించి యుండును. ఇంతియ గాక చేఱలోనున్నవారి రక్షణభారమును దాను వహించి వారిని చెఱనుండి విడిపించి యుండును. అందువలన నాతనికి గొప్ప యనుమానమును భయమును బుట్టి తాను బ్రదికి యుండఁగానే తన కుమారునకుఁ బట్టముఁగట్టి వానికి వయస్సు వచ్చువఱకుఁ దానే పరిపాలనము చేయుచుండవచ్చు ననికొనియెను. తన కుమారునికై తాను సింహాసనమును విడిచిపెట్టి 1524 సంవత్సరమున వానిని బట్టాభిషిక్తుని గావించి సామ్రాజ్యమునంతటను దెలియుటకై యెనిమిది మాసముల వఱకు సామ్రాజ్యమునం దంతటను మహోత్సవములు జరిపించుచుండె నఁట. 1525 సంవత్సరములోఁ గృష్ణరాయనికి చాల జబ్బుచేసి మంచమెక్కుట సంభవించెను. శా. శ. 1446 (గతించిన) తారణనాను సంవత్సర మార్గశిర శుద్ద 2 శనివారమునాఁడు (1525) కృష్ణరాయని కుమారుఁడగు తిరుమలదేవరాయని పేరిట శాసనములో కోనప్పనాయకుఁడను నొకానొకభృత్యుఁడు దేవరాయనికి గంగోదక మిచ్చినట్లు చెప్పబడి యుండుటచేత నితఁడు చావునకు సిద్ధమయ్యెనని తలంపవచ్చును. కాని చావలేదు. మఱికొంతకాలము బ్రదికియుండెను. ఇంతలో నాతని దురదృష్టవశమున నాకస్మికముగాఁ గుమారునకు జబ్బుచేసి మృతినొందుట సంభవించెను. తిమ్మరుసు శత్రువులగువారు తిమ్మరుసో వాని కుమారుఁడో కృష్ణరాయని కుమారునకు విషముపెట్టి చంపించినారను ప్రవాదమును బుట్టించి లోకమున వ్యాప్తి నొందింపసాగిరి. అట్టి ప్రవాద మానోట నానోటఁబడి యయ్యది క్రమముగా రాయల చెవులఁబడి యాతని కున్మాదము పుట్టించి యుండును.
అట్టి యున్మాదావస్థయందుండినప్పుడే యిట్టివైపరీత్యము జరిగియుండును. ఇట్లు తన మనోభీష్టమునకు భంగము కలుగు టయు, తాను ప్రేమించిన కుమారుఁ డాకస్మికముగా మృతి నొందుటయు, తనప్రాణములను గాపాడి తన్ననేకముధముల రక్షింపుచు సామ్రాజ్యమిప్పించి యింతయభివృద్ధికిఁ దెచ్చిన ప్రాణదాతను మంత్రిపుంగవుపట్ల కృతఘ్నుఁడై సుఖపడవలసిన వార్ధక్యమునఁ గన్నులుతీయించి హింసించుటయు మొదలగునవన్నియుఁ గలిసి ధురంతపరితాపమును గలిగించి యారోగ్యమును జెఱచుచుండుటచేత మొలకెత్తినజాడ్యము కుదుటఁబడక మఱింతవృద్ధియై రాజ్యపరిపాలనమును గూర్చి నూతసములయిన మార్పులను గావింపవలసి వచ్చెను. కృష్ణదేవరాయ లేసంవత్సరమున మృతినొందెనో సరిగా గుర్తించి చెప్పుట సాధ్యముగాక యున్నది. ఇతని వెనుక నీసామ్రాజ్యమును పరిపాలించుటకు వారసు లిర్వురుసోదరులును (అచ్యుతరాయలు, రంగరాయలు) అన్నకుమారుఁడు (నరసింహరాయలు) ను, పదునెనిమిది మాసముల వయస్సుగల శిశువు కృష్ణరాయని కుమారుఁడును గలరని సన్నీజు వ్రాసియున్నాడు. నన్నీజు ముగ్గురు సోదరులని వ్రాయుట పొరపాటు. ఇర్వురేగాని ముగ్గురుకాదనుట స్పష్టము. కృష్ణరాయలు తన మరణమునకు ముందు జబ్బుపడి జాడ్యముద్రేకించి యుండుటచేత నింకఁదాను బ్రదుకనని నిర్ధారణము చేసి యొక మరణశాసనము వ్రాయించెననియు, శిశువైన తన కుమారుని, తక్కినవారిని విడిచి, తన సోదరులలోఁ బెద్దవాఁడయిన అచ్యుతరాయలనే తనవెనుకఁ బట్టాభిషిక్తునిగాఁ జేయ వలసినదనియు వ్రాయించి యున్నాఁడనియుఁ దెలిపియున్నాడు. చెన్నపురి ప్రాచ్యలిఖితపుస్తక భాండారమునను స్థానికచరిత్ర వృత్తాంతములుగల సంపుటములలో నొకదానియం దుదాహరింపఁబడిన పద్యములోఁ గృష్ణరాయలు శా. శ. 1442 నగు తారణసంవత్సర జ్యేష్ట శు. 2 భానువారమునాఁడు స్వర్గస్థుఁడయ్యెనని తెలుపబడియున్నది. ఆకాలమునాటి శాసనములను బరిశోధించినచోఁ గృష్ణరాయలు 1529 వఱకు బ్రదికియున్నట్టు దెలిపెడు శాసనములు పెక్కులు గన్పట్టుచుండుటచేఁ గొందఱీ పద్యమును గల్పనగా భావింతురు.
తనచే విరచింపఁబడిన "అచ్యుతరాయాభ్యుదయ" మను కావ్వమునందు రాజనాథడిండిమభట్టను కవీంద్రుడు తిరుపతిలోని శ్రీవేంకటేశ్వరస్వామివారి సాన్నిధ్యమందు అచ్యుతదేవరాయనికిఁ దొల్తఁ బట్టాభిషేకముఁ జరిగినట్లుగాఁ దెలిపియున్నాఁడు. కాళహస్తిపుణ్యక్షేత్రమున నొకశాసనములో శా. శ. 1452 అగు విరోధనామసంవత్సర కార్తీక బహుళ గురువారమునాఁడు (21 అక్టోబరు 1529) అచ్యుతదేవరాయలు విజయనగరసామ్రాజ్యమునకుఁ బట్టాభిషిక్తుఁడై నటుల దెలుపఁబడినది. అచ్యుతదేవరాయలను దనమరణానంతరము సామ్రాజ్యాభిషిక్తుని గావింపవలసినదని కృష్ణరాయలు మరణశాసనరూపమున నాజ్ఞాపించినపుడు 1526 లో రాజధానీనగరమునకు దూరముగానున్న తిరుపతిలో శ్రీవేంకటేశ్వరసన్నిధానమునందు మొదటను, 1529 లో కాళహస్తిలో కాళహస్తిదేవుని సన్నిధానమున రెండవమాఱును రెండుతడవులేల పట్టాభిషిక్తుఁడు గావలసి వచ్చెను? అచ్యుతరాయలు రాజధానీనగరమైన విజయనగరమునకు రప్పింపఁబడకుండుటకుఁ గారణమేమి? తనకు పదునెనిమిది మాసముల కుమారుఁడుండఁగా వానివిడిచి తనరాణులను, సుప్రసిద్ధుఁడైన తనజామాత ఆర్వీటిరామరాజును కాదని తాను సింహాసనమెక్కినది మొదలుకొని యప్పటివఱకుఁ బదునాఱుసంవత్సరములకాలము చంద్రగిరిదుర్గములో ఖైదులోనుంచిన యచ్యుతరాయల నొక్కమాఱుగా నౌదార్యబుద్ధితో దనయనంతరము పట్టాభిషిక్తునిఁజేయవలెనని తనమరణశాసనములో వ్రాయించినట్టు వ్రాసినచరిత్రకారుఁడే కృష్ణరాయలమరణాంతరము "సాల్వని" అనునాతడు రాజ్యమునకంతకుమంత్రియై చంద్రగిరిదుర్గమునుండి యచ్యుతరాయలు విజయనగరమునకు వచ్చువఱకును రాజ్యపరిపాలనముఁ జేసెననికూడ వ్రాసినాఁడే.
పోర్చుగీసుచరిత్రకారుఁడయిన నన్నీజుచే, బేర్కొనఁబడిన “సాల్వనీ" మంత్రి 'సాళువతిమ్మరుసు' మంత్రియని భ్రమింపరాదు. ఏమన నాతఁడు చెఱలోనుంపఁబడి కన్నులఁ పెఱికింపఁబడినవాఁడని వ్రాసినదీ చరిత్రకారుఁడేయైనప్పుడు “సాల్వనీ” మంత్రి తిమ్మరుసని యెట్లర్థముచేసికొనఁగలము ? అతఁడు మఱియొకఁడై యుండవలయునుగదా. ఈసందర్భమున నీతనిచరిత్రము నొకించుక దెలుపవలసియున్నది. ఇతఁడుకాంచీపురవాస్తవ్యుఁడయిన తాళువకుళిందభట్టరను బ్రాహ్మణుని కుమారుఁడు. చెల్లప్పయను పేరుగలవాఁడు. ఇతఁడు శాసనములలో వీరనరసింగనాయకుఁడనియు, సాళువదండనాయకుఁ డనియు వ్యవహరింపఁబడుచువచ్చెను. ఇతఁడు కృష్ణరాయనికి ముందునుండియు సామ్రాజ్యమున నొకయధికారపదవిలోనుండి క్రమముగాఁ బైకివచ్చినట్లుగన్పట్టుచున్నది. వీనిశాసనములు 1510 నుండి 1531 వఱకు గన్పటుచున్నవి. ఇతఁడు 1510 లో మధురమండలములోని తిరుపత్తూరు ప్రాంతప్రదేశమున కధికారిగానుండి తరువాత 1515 నుండి చోళరాజ్యమున కంతకును బ్రభువై తరువాత దక్షిణదేశమునకుఁ బ్రతినిధిపాలకుఁడై విజయనగరసామ్రాజ్యమునఁ బేరుప్రఖ్యాతులు గలిగిన మహాసామంతులలో నొక్కఁడుగానుండెను. ఇతఁడు కృష్ణదేవరాయలు బ్రదికియున్నంతవఱకు పరమవిశ్వాసముతో నాతనిసేవించి యుండినవాఁడు. ఈతనిరాజ్యమునుండి కోట్లకొలదిద్రవ్యము సామ్రాజ్యమునకు పరుమానముగాలభించు చుండెను. ఇతఁడు అచ్యుతరాయలకు మొదట విజయనగర సింహాసన మధిష్టింపఁజేయునంతవఱకుఁ బట్టుకొమ్మగానుండి తదనంతర మొకసంవత్సరములో గర్భశత్రువుగా మాఱిపోయి యటుపిమ్మట చక్రవర్తిపై తిరుగుబాటుచేసి మహాఘోరయుద్ధములుసలిపి పరాజితుఁడైనవాఁడు. అళియరామరాయలకుఁ బ్రతిస్పర్థిగ నిలువఁగలిగిన మహావ్యక్తిగాని సామాన్యవ్యక్తికాఁడు. ఎంతోబలము, పలుకుబడిగలవాఁడగుటచేతనే అచ్యుతదేవరాయలు వీనిఁజేఁబట్టెను. అచ్యుతరాయలీతని ప్రాపును నమ్ముకొనియె తిరుపతిలోను, కాళహస్తిలోను రెండుమాఱులు పట్టాభిషిక్తుఁడై తానే విజయనగరసామ్రాజ్యాధిపతినని ప్రకటింపఁగలిగినవాఁడు. ఇందుచేతనే నెల్లూరుమండలములోని కమ్మరపూడిలోని యొకశాసనములో శా. శ. 1448 అగు పార్ధివసంవత్సరములో అనఁగా 1526 సంవత్సరములో అచ్యుతదేవరాయలు విజయనగరమున వజ్రసింహాసనమధిష్ఠించి సామ్రాజ్యపరిపాలనము చేయుచున్నట్లే తెలుపఁబడినది. ఇంతియగాక మైసూరుమండలములోని సిద్లఘట్టతాలూకాలోని వెరూసుపేటగ్రామములోని యొకశాసనములో శా.శ. 1450 అగు సర్వధారిసంవత్సరములో అచ్యుతదేవరాయలు చక్రవర్తివహించు "మహారాజాధిరాజ రాజపరమేశ్వరేత్యాది బిరుదావళితోఁ బ్రంసింపఁబడియుండుటయేగాక విజయనగరమందుండి సామ్రాజ్యపరిపాలనము చేయుచున్నటే తెలుపఁబడినది. ఈసంవత్సరము 1528 కాని 1529 సంవత్సరములో అచ్యుతరాయలు చెల్లప్పనే వీరనరసింగరాయనాయక సాళువ దన్నాయకరుని పుణ్యముకొఱకు తిరువాగిత్తీసుపురములోని ఉడైతంబిరానారు దేవాలయమునకు "పనైత్తాంగవ్ " అను గ్రామమును దానము చేసినట్లుగా ఉరత్తూరుశాసనమునఁ దెలుపబడినది. రాజు పుణ్యముకొఱకు నౌకరు దానముచేయుట కొంచెము విరుద్దముగఁ గన్పట్టకమానదు. అందులో విజయనగరసామ్రాజ్యసార్వభౌముఁడై యుండిన అచ్యుతదేవరాయలంతటివాఁడు తనకుమ్రొక్కి నమస్కరించెడి సామంతుని పుణ్యముకొఱకు దేవునకు నొకగ్రామమును దానముచేయుట విరుద్దముగాఁ గన్పట్టదా ! సాళువతిమ్మరుసుమంత్రి శ్రీకృష్ణదేవరాయలను సామ్రాజ్యాధ్యక్షునిగాఁ జేయుట కెట్లుతోడ్పడియెనో అట్లే అచ్యుతరాయలను విజయనగరసామ్రాజ్యాధ్యక్షునిగాఁ జేయుటకు నీసాళువచెల్లప్పభట్టనే వీరనరసింహమంత్రి తోడ్పడియెనని మనము భావింపఁగలిగినయెడ నిందు విరుద్దముగాఁ గాన్పించునదేమియుఁ గన్పట్టదు. కృష్ణదేవరాయలు 1526 మరణించినను 1529 లో మరణించినను ఉరుత్తూరుశాసన సంవత్సరమునాటికి (1529) అచ్యుతదేవరాయనికి విజయనగరమునఁ బ్రవేశించుటకవకాశము చిక్కియుండలేదనుట నిశ్చయము. అందుకై సాళువనరసింగరాయనాయకుని ప్రాపుననేయుండి రాజధానీనగరమగు విజయనగరము నాక్రమించుకొని యందలి వజ్రసింహాసనమునగూరుచుండి పట్టాభిషిక్తుఁ డగుటకు దృఢప్రయత్నమునుగావింపుచుండెనని తలంచుటలో వ్యతిక్రమమేమియుఁ గన్పట్టదు.
ఇందు కింకొక దృష్టాంతమును జూపెదను. కన్నడదేశమున సొరాబు తాలూకాలోని యొకశాసనములో దానకర్త “అచ్యుతరాయల పాలనము సామ్రాజ్యమున సుస్థిరముగా నుండవలయునని కోరుచు దానము చేసి యుండెను. ఇయ్యది 1529 లోనిది. ఈశాసనకాలమునాటికి అచ్యుతరాయల పట్టాభిషిక్తత స్థిరపడియుండ లేదనుట స్పష్టము. అచ్యుతరాయలఁగూర్చిన పైసందర్భ విషయము లిట్లు ఘోషిం పుచుండగా 1526.27 సంవత్సరములో అనఁగా శా.శ. 1448 సరియగు వ్యయనామ సంవత్సర వైశాఖశుద్ధ పూర్ణిమనాఁడు విజయనగరమున వజ్రసింహాసనారూఢులయిన మహారాజాధిరాజ రాజపరమేశ్వర బిరుదాంచితులై ఆరవీటి రామరాయలచే నమలనేని కుమార పెదబుచ్చినాయనిం గారొక కౌలుపొందినట్టొక శాసనములోఁ దెలుపఁబడినది. ఈశాసనమునఁ బేర్కొనఁబడిన రామరాయలే అళియరామరాయలు. ఇతఁడు కృష్ణరాయని యల్లుఁడనుట స్పష్టము. ఈశాసనమునుబట్టి 1526 - 27 సంవత్సరములనుండి అళియరామరాయలు రాజధానీనగరమగు విజయనగరమునుండి సామ్రాజ్య పరిపాలనము చేయుచుండెననుట స్పష్టము. ఇంతియగాక మహమ్మదీయ చరిత్రకారు లై కకంఠ్యముగా కృష్ణదేవరాయల మరణానంతరము శిశువుగా నున్నవాని కుమారుని పట్టాభిషిక్తుని గావించి ఆళియరామరాయలే సామ్రాజ్యపరిపాలనమునకుఁ బూనుకొనియెనని వ్రాసియుండిరి. కాని అచ్యుతదేవరాయల ప్రశంస చేసినవారుకారు. ఇట్లు విజయనగర సామ్రాజ్యమును వశముఁ జేసికొనుటకై రెండు పక్షము లేర్పడినవి. అచ్యుతదేవరాయల బావమఱదులయిన సలకము పెదతిమ్మరాజును, సలకము చినతిమ్మరాజును, మహాపరాక్రమవంతుఁడయిన సాళువ వీరనరసింగరాయనాయకుఁడును మఱికొందఱు మండలాధిపతులును అచ్యుతరాయల పక్షమునను, అళియరామరాయలును వానిసోదరులు తిరుమలదేవరాయలును, కృష్ణదేవరాయల రాణు లును, మఱికొందఱు మండలాధిపతులును కృష్ణదేవరాయల కుమారుఁడని చెప్పఁబడెడి శిశువు పక్షముననుండి కృష్ణరాయలు మృతిజెందిన వెనుక 1530 సంవత్సరమువఱకుఁ దగవులాడుచు నుభయపక్షములవారు తమ పక్షములను బలపఱచుకొనుచుండిరని మాత్రము విశదపడకమానదు. కృష్ణరాయలు చనిపోవునపుడు తన తరువాత అచ్యుతదేవరాయలను బట్టాభిషిక్తుని గావించి తాను యువరాజుగానుండి సామ్రాజ్యపరిపాలనమునందు తోడ్పడుచుండవలసినదని రామరాయల కాజ్ఞాపించెనని పెనుగొండ కైఫియతునందుఁ దెలుపఁబడినది. పోర్చుగీసు చరిత్రకారుఁడైన ఫాదిరీక్వెరోజను నాతఁడు తానువ్రాసిన సింహళవిజయమను చరిత్రమునందు వ్రాసిన వ్రాతఁపై కైఫియతునందలి యభిప్రాయమునే బలపఱచుచున్నది. మఱియు నీతఁడు కృష్ణరాయని యాజ్ఞను శిరసావహించి రామరాయలు ప్రవర్తించెననియు, అందు కాతఁడు చూపిన దయకు సంతోషించి తనతోఁ గలిసి రాజ్యమును బరిపాలించుట కంగీకరించె సనియు, ఆదోషమువలన రామరాజు నే నిజమైన రాజుగా లోకము గ్రహించుటయు, హక్కు కలిగియున్న రాజగు అచ్యుతదేవరాయలను లోకము గ్రహింపలేకపోవుటయు సంభవించి అందుకు ప్రతిఫలముగాఁ దగు శిక్ష నాతఁ డనుభవించే ననియు వ్రాసియున్నాఁడు. కాని 1530 సంవత్సరములో విజయనగరమున అచ్యుతదేవరాయలు నిజముగాఁ బట్టాభిషిక్తు డగువఱకు వీనికిని రామరాయలకును మైత్రి కుదురలేదు. అచ్యుతదేవరాయల పక్షమువారయిన వాని బావమఱదులు సలకము పెదతిమ్మరాజు, సలకము చిసతిమ్మరాజును చోళరాజ్యాధిపతిగనుండి అచ్యుతదేవరాయకిఁ బరమమిత్రుఁడుగా నుండిన సాళువ వీరనరసింగరాయని సహాయముతో నసంఖ్యములగు సైన్యములతో విజయనగరముపై దాడిసలిపి రామరాయాదులను రాజధాని నగరమునుండి పాఱఁద్రోలిన వెనుకనే అచ్యుతదేవరాయలను చంద్రగిరినుండి రప్పించి వానిని విజయనగరమున బట్టాభిషిక్తుని జేయుటయు, సాళువ వీరనరసింగరాయని ప్రధానమంత్రిగా నియమించిన వెనుకనే అచ్యుతదేవరాయలు రామరాయలతో మైత్రిచేసికొని పాదిరీక్వెరోజు వ్రాసిన చందమున జరిగియుండునుగాని కృష్ణదేవరాయలు 1529 వఱకు బ్రదికి యుండెనని చెప్పెడి విషయములు విశ్వాస పాత్రములుగాఁ గన్పట్టవు. 1526 సంవత్సరములోనే కృష్ణదేవరాయలు మృతినొంది యుండుటయే సత్యమగునుగాని యాతఁడు 1530 బ్రదికియుండెననుట విశ్వాసపాత్రముకాదు. అంతవరకు నతఁడు బ్రదికియున్నయెడలను, అతఁడు తనవెనుక నచ్యుతదేవరాయలను బట్టాభిషిక్తుని జేయవలసినదని యాజ్ఞాపించినపుడును, అచ్యుతదేవరాయలు తిరుపతి కాళహస్తులలో రెండుసారులు పట్టాభిషిక్తుఁడగుటకుఁ బ్రమేయము గానరాదు. కృష్ణరాయలు వెంటనే అచ్యుతదేవరాయలను తన దగ్గఱకు రప్పించుకొని తన సంరక్షణమున నుంచుకొనియే యుండును. అట్టి పనిచేసి యుండలేదు. అళియరామరాయలు కృష్ణదేవరా యలు వహించు బిరుదములను 1526 - 27 సంవత్సరములోఁ దానే వహించి రాజైనటుల ప్రకటించుకొని యుండుట సంభవింపదు. కనుక కృష్ణదేవరాయలు 1526 లోనే మృతిఁబొంది యుండుటయే సత్యము కావలయును. కృష్ణరాయలు 1526 లో మృతిఁబొందినను అళియరామరాయాదు లావిషయము గోప్యముగానుంచి అచ్యుతదేవరాయనికిఁగాని వాని పక్షమువారికిఁ గాని 1530 వఱకు విజయనగరమునఁ బ్రవేశము కలుగనీయక యుందురు. అందువలన వానికిఁ బ్రతిపక్షులగువారు, వాని మృతిని వెల్లడించి అచ్యుతదేవరాయనికిఁ దిరుపతి కాళహస్తులలోఁ బట్టాభిషేక కార్యమును బట్టుదలతో జరిపియుందురు. ఇట్టి తగవులాట సమయమున విజయనగర సామ్రాజ్యము తెఱువఁబడిన యిల్లువలె నుండును. ఇట్లుండుటచేతనే యీయదను గనుపెట్టి యుత్తరమున గోలకొండ సుల్తాను, ఒడ్డె రాజగు ప్రతాపరుద్రగజపతి విజయనగర సామ్రాజ్యముపై దండయాత్రలు సాగించిరి. ఈసందర్భమున అల్లసాని పెద్దనామాత్యుని చాటు పద్యముగూడ ప్రబలసాక్ష్యము గానున్నది. ఒడ్డెరాజగు ప్రతాపరుద్రగజపతి విజయనగరముపై దండెత్తి వచ్చినప్పుడు పెద్దన్న చెప్పిన పద్య మిట్లున్నది.
"సీ. రాయరావుతుగండ రాచయేనుఁగు వచ్చి
యారట్లకోన గోరాడునాఁడు
సంపెటనరపాల సార్వభౌముఁడువచ్చి
సింహాద్రిజయశిలఁ జేర్చునాఁడు
సెలగోలుసింహంబుచేరి ధిక్కృతి గంచు
తల్పులఁగరుల డీకొల్పునాఁడు
ఘనతరవిర్భర గండపెండరమిచ్చి
కూఁతురాయలకును గూర్చునాఁడు
గీ. ఒడలెఱుంగవొ చచ్చితో యుర్విలేవొ
చేరఁజాలక తలచెడి జీర్ణమైతొ
కన్నడంబెట్లు చొచ్చెదు గజపతీంద్ర!
తెఱుచినిలు కుక్కచొచ్చిన తెఱగు తోప. "
కృష్ణదేవరాయలు లేకపోవుటవలనను, ఈపోరాటముల మూలమునను తెఱచిన యింటివలె రాజ్యమున్నదను భావమును వెల్వరించెను. ప్రతాపరుద్రగజపతి దండెత్తివచ్చుటకుఁ బూర్వముననే నెల్లూరుమండల ప్రాంతప్రదేశమునంతయు నందు ముఖ్యముగా చంద్రగిరిరాజ్యమును, ఉదయగిరి రాజ్యమును అచ్యుతదేవరాయల వశమై యుండుటచేతను సాళువ వీరనరసింగరాయని సాహాయ్యముతో సైన్యముల సమకూర్చుకొని పోయి అచ్యుతదేవరాయలు ప్రతాపరుద్రగజపతి నెదుర్కొని గొప్పయుధ్ధముచేసి యోడించెను. అచ్యుతరాయల యాస్థానకవి యగు తారకబ్రహ్మరాజీయ గ్రంథకర్త రాధామాధవీయకవి గూడ నీవిజయమును దెలుపుచు నుత్కల ప్రభువుపట్ల నొకించుక దయను జూపెనని తెలిపియున్నాఁడు. ఈయుద్ధము 1529 లో జరిగియుండవచ్చును గాని యీదండయాత్ర సలుపుటకు ప్రతాపరుద్రగజపతికిఁ గొంతకాలము పట్టియుండును. ఈయుద్ద మెప్పుడు జరిగినను అచ్యుతదేవరాయలు విజయనగరము ప్రవేశింపక మునుపే జరిగియుండును. కనుక కృష్ణదేవరాయలు 1526 లోనే మృతిఁనొందె ననుట విశ్వాసపాత్రమయిన విషయము. సాళువ వీరనరసింగరాయమంత్రిపుంగవుని సహాయ్యముతో అచ్యుతదేవరాయల బావమరదులు సలకము పెదతిమ్మరాజు, సలకము చిన్నతిమ్మరాజు విజయనగరముపై దండెత్తి వచ్చినపుడు రామరాయలును, వాని సోదరులును విజయనగరమును విడిచి పోయి యాదవాని దుర్గమును జేరవలసినవారైరి.
ఇట్లు అళియరామరాయల సోదరులు విజయనగరమును విడిచి పలాయనులయిన వెనుక సలకము సోదరులును, వీరనరసింగరాయలును చంద్రగిరి దుర్గమునుండి అచ్యుతదేవరాయలను రప్పించి వానిని విజయనగరమునఁ బట్టాభిషిక్తునిగావించి అనేక హరిదానములను బ్రాహ్మణులకును, దేవాలయములకును జేసి యుండిరి. ఆవెంటనే అచ్యుతదేవరాయలు తనకింత మహోపకారమును గావించిన వీరనరసింగరాయలను బ్రాహ్మణమంత్రికిఁ ప్రధానామాత్యపదవి నొసంగెను. ఇట్లొక సంవత్సరము జరిగిన వెనుక అచ్యుతదేవరాయలు బలాఢ్యుడయిన అళియరామరాయలతో విరోధముగా నుండుట యపాయకరమని యెంచి తనతోగూడ అళియరామరాయలు పరిపాలనము చేయుటకు సమ్మతించి వానితో రాజీ చేసికొని వానిని విజయనగరము నకు రప్పించుకొనియెను. రామరాయ లేమిబోధించెనో కాని సంవత్సరకాలము గడచిన తరువాత ప్రధానామాత్యుఁడు వీరనరసింగరాయలు చేసినకార్యములన్నిటిని తారుమాఱుచేసి వానిని తుదకు ప్రధానామాత్యపదవినుండి తప్పించి యథాస్థానమునకు బంపించెను. తరువాత నచ్యుతదేవరాయల కతఁడొక గొప్ప శత్రువై చాల బాధలు కలుగఁజేసెను. దక్షిణదేశమున గొప్ప తిరుగుబాటు సంఘటింపజేసెను.
ఈపై విషయములన్నియుఁ గృష్ణదేవరాయలమృతికిఁ బూర్వమునందును బరమందును జరిగినవిగా నున్నవి. కృష్ణదేవరాయలు తన యవివేకమువలనఁ దన యవసానకాలమంతయు దుఃఖప్రదముగాఁ జేసికొని స్వర్గస్థుఁడై పోయెను. 1526 వ సం|| రము మొదలుకొని తిమ్మరుసుయొక్కఁగాని వాని సంతతివారియొక్కగాని వారిబంధువులయొక్కగాని చరిత్రముగాని విజయనగరసామ్రాజ్యచరిత్రమున వినంబడదు. ఈకడపటి వృత్తాంతము నొక్క సన్నీజు మాత్రమే పేర్కొని యుండెనుగాని మఱియే చరిత్రకారుఁడును విజాతీయులలోఁగాని స్వజాతీయులలోఁగాని పేర్కొన్నవారు గానంబడరు. ఇందలి నిజమేమో లోక మెఱుంగదు. ... రియదృష్ట మట్లున్నది.
సంపూర్ణము.
- ___________