తిమిరలత తారకా కుసుమముల దాల్ప

వికీసోర్స్ నుండి


తిమిరలత తారకా కుసుమముల దాల్ప

కర్కశ శిలయు నవజీవ కళల దేర

మ్రోడు మోక చివురు లెత్తి మురువు సూప

జగమునిండ స్వేచ్ఛాగాన ఝరుల నింతు.


క్రౌర్య కౌటిల్య కల్పిత కఠిన దాస్య

శృంఖలములు తమంతనె చెదరి పోవ

గగనతలము మా ర్మోగగ కంఠ మెత్తి

జగమునిండ స్వేచ్ఛాగాన ఝరుల నింతు.


చిత్త మానందమయ మరీచికల సోల

హృదయ మానంద భంగమాలికల దేల

కనుల నానంద జని తాశ్రుకణము లూర

జగమునిండ స్వేచ్ఛాగాన ఝరుల నింతు.


యుగయుగంబుల నీశ్వరయోధు లగుచు

స్వేచ్ఛకై ప్రాణసుమము లర్పించువారి

అమల జీవిత ఫలము ధన్యతను గాంచ

జగమునిండ స్వేచ్ఛాగాన ఝరుల నింతు.


భయము గలిగించు కష్టాతపంబు మరచి

కరము కలగించు వంత చీకట్లు మరచి

విశ్వమే పరవశ మయి వెంట బాడ

జగమునిండ స్వేచ్ఛాగాన ఝరుల నింతు.