తిట్ల జ్ఞానము - దీవెనల అజ్ఞానము/నీ తలపండు పగల

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

నీ తలపండు పగల

పూర్వము జంబుకేశ్వరుడను ఒక మహర్షి ఉత్తరదేశమున హిమాలయ ప్రాంతములో నివసిస్తుండెను. ఆయన చాలా గొప్ప జ్ఞాని. యోగపురుషుడని తెలిసి అనేకమంది ఆయన వద్దకు వచ్చి కొందరు జ్ఞానమును ఆశించగ, కొందరు ప్రపంచవిషయములను అడుగుచుండిరి. ప్రపంచవిషయములకు ఏమాత్రము విలువివ్వని జంబుకేశ్వరముని జ్ఞాన జిజ్ఞాసులను తన వద్దయుంచుకొని మిగత వారిని అక్కడినుండి పంపి వేయుచుండెను. జ్ఞానము మీద ఆసక్తి కల్గిన వారిని కూడ ఎన్నో కష్టములకు గురిచేసి అన్నిటికి ఓర్చుకొని తన సేవ చేసిన వారికి మాత్రము జ్ఞానమును బోధించుచుండెను. జ్ఞానమును బోధించిన తర్వాత దాని ప్రకారము నడుచుకోని వానిని తిరిగి వెనకకు పంపుచుండెను. ఆయన దగ్గర జ్ఞానము తెలుసుకొనుటకు చాలామంది ప్రయత్నించుచుండినప్పటికి ఆయన శిక్షణకు చాలామంది నిలువజాలకుండిరి. జంబుకేశ్వర మహర్షి గురువులందరికంటే గొప్పవాడని, ఆయనవద్ద గొప్ప జ్ఞానము కలదని తెలిసినవారు కొందరు దక్షణదేశము నుండి బయలుదేరిపోయారు. వారిలో ఇద్దరు ఒక ఇంటినుండి బయలుదేరిన అన్నదమ్ములుండిరి. హిమాలయములలో జంబుకేశ్వరమునిని చేరుకొన్న దక్షణదేశస్థులు కొందరు చివరి వరకు నిలువలేకపోయారు. జంబుకేశ్వరుడు చెప్పు జ్ఞానము గొప్పదే, పెట్టు పరీక్షలు గొప్పవే. ఆయన పెట్టు జ్ఞాన సంబంధ పరీక్షలలో వారిగుణములు బయటపడడము వారికి అక్కడ స్థానము లేకుండపోవడము జరిగినది. చివరకు అన్నదమ్ములు మాత్రము గట్టిగ నిలువగలిగినారు. వారిలోనున్న పట్టుదలకు జంబుకేశ్వరు నికి సంతోషము కల్గినది. ఇద్దరు భక్తులలో పెద్దవాడు చిన్నవానికంటే ఎక్కువ జ్ఞానాసక్తి కల్గియుండడము గ్రహించిన జంబుకేశ్వరుడు ఒకరోజు అతను పాద నమస్కారము చేసుకొన్నపుడు "నీ తలపండు పగలనాని" అని దీవించాడు. ఆ దీవెనలోని భావము సోదరులకిద్దరికి అర్థము కాలేదు. అయినప్పటికి పెద్దవాడు గురువుమీద గొప్పనమ్మకము గలవాడు, కావున ఆయన ఏమిచెప్పిన అది నాకు శుభమును కల్గించునదే అయిఉండుననుకొన్నాడు. చిన్నవాడు మాత్రము ఇదేదో అశుభమును కల్గించుమాటని అనుకొన్నాడు. వారి మనసులోని ఉద్దేశములను గ్రహించిన జంబుకేశ్వరుడు ఒకరోజు ఇద్దరిని పిలచి నేను దీవించిన దీవెనను గురించి ఒకరు మంచిభావము కల్గియుండడము, మరియొకరు చెడు భావము కల్గి యుండడము నాకు తెలిసినదని చెప్పాడు. ఈ విధముగ మీ మనస్సులలో ఉండడము వలన కొంతకాలమునకు అశుభమును శంకించినవారు అజ్ఞానములో పడి, మాయప్రేరణతో నానుండి దూరమై పోవుటకు అవకాశము గలదు. కావున మీకు తెలియని నా వాక్కును గురించి మీకు వివరముగ తెలియజేయదలచుకొన్నాను అని ఇలా చెప్పసాగాడు.


మేము చెప్పుమాటలను కనిపించు ప్రపంచ అర్థముతో మరియు కనిపించని దైవ అర్థముతో రెండురకముల చూచుటకు అవకాశముగలదు. జ్ఞాని జ్ఞానవిధానముతో, అజ్ఞాని ప్రపంచవిధానముతో అర్థము చేసుకొనుచుందురు. మీలో ఒకరు ప్రపంచార్థముతో చూచుట వలన నామాట చెడుగా అర్థమైనది. ఒకరు జ్ఞానార్థము తెలియకున్నను నా మీదున్న గొప్పభావముతో మంచిగానే ఊహించుకొన్నాడు. ఊహ నిజము కావచ్చును అబద్దముకావచ్చును. కావున ఖచ్చితముగ తెలిసినదని చెప్పలేము. మరియొకరికి తల ముక్కలైపోవునట్లు శపించానని అర్థమైనది. ఆ విధముగ అర్థమగుట వలన జ్ఞానమునకే దూరమగుటకు అవకాశము గలదు. ఒకరికి దీవెనేమోనని మరియొకరికి దూషణగ అర్థమగుటకు పూర్వమున్న జ్ఞానము నేడు లేకపోవడమే కారణము. పూర్వము "నీ తలపండు పగలనాని" అనుమాట సంపూర్ణ దీవెనగ ఉండెడిది. ఈ వాక్యము దీవెనగ ఎట్లుండెదిదో వివరించి తెలిపెదను. పండు అనగ తినుటకై పరిపక్వమునకు వచ్చిన ఫలము అని అర్థము. పండులో తిని అనుభవించుటకు కావలసిన పదార్థము కనిపించక నిలువయుండును. అలాగే తలలో కంటికి తెలియకుండ కర్మయను పదార్ధము అనుభవించుటకు తయారు గనున్నదను భావముతో కర్మను తలపండు అనెడివారు. ఒక పండు చెక్కు చెదరకుండ మరియు శుభ్రముగ ఉన్నపుడు తినుటకు యోగ్యముగ ఉండును. పండుకు రంద్రములు పడికాని, లేక పండు చీలిపోయి అందులోనికి దుమ్ముధూళి పోయి, క్రిమికీటకములు చేరినపుడు తినుటకు యోగ్యముగ లేకుండా వృథా అయిపోవును. అలాగే కర్మఫలము కూడ జ్ఞానమను పురుగుచే తొలచబడినపుడు, గురుదీవెన అనెడి చీలిక ఏర్పడినపుడు అది చెడిపోయి కర్మఫలము అనుభవించుటకు యోగ్యముగ లేకుండపోవును. కర్మఫలము లేనపుడు మానవునికి ముక్తి లభించునని తెలిసిన పెద్దలు తమకు ప్రియమైన జ్ఞానశిష్యులను "నీ తలపండు పగలనాని" అని దీవించెడివారు. కర్మయను పండు పగిలిపోయి నశించి పోవలెనని, దానివలన ముక్తి కలుగవలెననుట మంచి శుభమైన ఉద్దేశము, కావున ఈ మాటను దీవెన అనుట సమంజసము. అజ్ఞానము తో అర్థము చేసుకోలేక అశుభమైన తిట్టుగ అను కోవడము అసమంజసము. ప్రతి మాటను జ్ఞానవివరముగ యోచించినపుడే అందులోని సారాంశము అర్థమగును" అని చెప్పిన జంబుకేశ్వరుడు దీవెనను దూషణగ అర్థము చేసుకొన్న చిన్న శిష్యుని గురించి యోచించి అతనిలో ఇంకా జ్ఞానము వృద్ది కావలసివుందని అనుకొన్నాడు. అతనికి కూడ జ్ఞానము సంపూర్ణముగ కల్గి జ్ఞానములోని సూక్ష్మమైన అర్థములను గ్రహించునట్లు చేయాలనుకొన్నాడు.

-***-