తిట్ల జ్ఞానము - దీవెనల అజ్ఞానము/నీ ఆకు చినగ

వికీసోర్స్ నుండి

నీ ఆకు చినగ

ఇదే విధముగ పూర్వము దయతో దీవించిన దీవెన మరొకటి గలదు. అదియే "నీ ఆకు చినగనాని" ఈ మాటలో పూర్వపు జ్ఞానుల ఉద్దేశమేమిటో వివరించుకొందాము. కొన్ని వేలు వందల సంవత్సరముల పూర్వము వ్రాయుటకు కాగితములులేని కాలములో ఆనాడు వ్రాతను తాటి ఆకులమీద వ్రాసెడివారు. వ్రాత అనునది ఆకులమీదనే ఉండెదని అప్పటికాలములో అందరికి తెలియును. జీవుని కర్మకూడ లిఖించబడి ఉన్నదని, కర్మవ్రాత తెల్లటి పత్రము మీద వ్రాయబడినదని పూర్వము పెద్దలు చెప్పెడివారు. తాటి ఆకుమీద బయటి వ్రాతలు వ్రాయబడినట్లు లలాట పత్రము మీద కర్మవ్రాతలు గలవని, దానిప్రకారమే జరుగునని అనాటి జ్ఞానుల ఉద్దేశముండెడిది. కర్మవ్రాత లేకుండ పోతే దేవునియందైక్యమగుదురని చెప్పెడివారు. కర్మ వ్రాతలేకుండ పోవాలంటే కర్మ లిఖితమే కాకూడదని, కర్మలిఖితము కాకుండ ఉండవలెనంటే కర్మ వ్రాయబడు పత్రమే ఉండకూడదని ఆనాటి వారి భావము. అందువలన తమశిష్యులను దీవించునపుడు కొందరు గురువులు దీవెనగ "నీ ఆకు చినగనాని" అనెడివారు. తమ శిష్యులకు కర్మలేకుండపోయి మోక్షము లభించవలెనను ఉద్దేశముతో నీ ఆకు చినగనాని అని శుభము కల్గునట్లు చెప్పుచుండిరి. కర్మవిముక్తిగావించు అర్థములలో నీ ఆకు చినగనాని అనుమాట దీవెనలలో చేరియున్నది. నేటికది మిగత దీవెనలవలె అర్థము తెలియకుండ పోయి చివరకు తిట్లలోనికి చేరిపోయినది. కొందరు అజ్ఞానులు నీ ఆకు చినగనాని అని శాపనార్థముగ దూషించుకొనుట పల్లెప్రాంతములలో చూస్తునే ఉన్నాము.

-***-