తిట్ల జ్ఞానము - దీవెనల అజ్ఞానము/నీవు నాశనమైపో

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

నీవు నాశనమైపో

ఎవరైన ఆడవారు పోట్లాడుకొనేటపుడు "నీవు నాశనమైపోనాని" అని ఎదుటివారిని అనడము ఆక్కడక్కడ వినియే ఉందుము. నేడు ఈ వాక్యము శత్రువును దూషించునపుడు అనుటకు తిట్టుగ వినియోగించు చున్నప్పటికి ఇది పూర్వకాలము తిట్టుగ కాకుండ దీవెనగ ఉండెడిది. పూర్వము ఈ వాక్యము దీవెనగ ఎట్లుండెడిదో విశధీకరించుకొందాము.


పూర్వము అవినాశ్‌ అనబడు ఒక శిష్యుడు గురువువద్ద జ్ఞానము తెలుసుకొనుచుండెను. ఒక దినము సాయంకాలము ప్రక్కనేవున్న నది ఒడ్డున ఇసుక తిన్నెమీద గురువు కూర్చొని ఉండగ ఆయన ముందర కొందరు శిష్యులు కూర్చొని ఉండిరి. అందులో అవినాశ్‌ అను శిష్యుడు కూడ కూర్చొని ఉండెను. అవినాశ్‌ కొత్తగ వచ్చిన శిష్యుడు కావున మిగత శిష్యులకు కూడ అతని పేరు తెలియునట్లు నీ పేరేమిటి అని అవినాశ్‌ను గురువుగారడిగారు. అపుడు అతను నాపేరు అవినాశ్‌ అని తెలిపాడు. ఆ పేరు విని చిరునవ్వు నవ్వుకొన్న గురువు ఈ పేరులోని అర్థము తెలుసా అని మిగతావారినడిగాడు. అపుడు వారిలో కొందరు తెలియునని, అవినాశ్‌ అంటే నాశనము లేనివాడని అర్థము చెప్పారు. తర్వాత గురుశిష్యుల మధ్య కొంతసేపు సంవాదము జరిగినది. ఆ సంభాషణలో మొదట గురువు ఇలా అడిగాడు.


గురువు : ఈ పేరు ఇతను పుట్టిన తర్వాత పెట్టినదా లేక ముందునుంచి ఉన్నదా?

శిష్యులు : ఈ పేరు పుట్టిన తర్వాత పెట్టినదే స్వామి.

గురువు : పుట్టిన తర్వాత వెంటనే పెట్టలేదు కదా! పుట్టిన కొన్ని రోజుల తర్వాత పెట్టిన పేరు కదా!

శిష్యులు : అవును స్వామి

గురువు : పేరు పెట్టకముందు ఇతని పేరునేమని చెప్పాలి?

శిష్యులు : మొదట జీవుడని తర్వాత అవినాశ్‌ అని చెప్పాలి.

గురువు : అవినాశ్‌ అనునది శరీరమునకు పెట్టిన పేరే కదా! జీవునకు సరిపోవునా?

శిష్యులు : శరీరమునకు సరిపోదు స్వామి. జీవునకు సరిపోతుంది.

గురువు : శరీరమునకు ఎందుకు సరిపోదు?

శిష్యుడు : శరీరము కొంతకాలముండి నశించి పోవునదే కదా! నశించి పోవునది శరీరము. శరీరము నశించినప్పటికి నశించకున్నది జీవుడు, కావున జీవునకు అవినాశ్‌ అన్న పేరు సరిపోవును. కాని శరీరమునకు ఆ పేరు సరిపోదు.

గురువు : భగవద్గీతలో జీవుడు నశించువాడే అని చెప్పారు. అలాంటపుడు ఆ పేరు జీవునికి కూడ సరిపోదు. జీవుడు కూడ నశించువాడే. శరీరము మరణముతో నశిస్తున్నది. మరణములో జీవుడు నశించడను మాట వాస్తవమే. మరణించిన తర్వాత జీవుడు మరొక శరీరమును ధరించి సజీవునిగానే ఉండును. ఆయుస్సు అయిపోతే శరీరము నశించును. కర్మ అయిపోతే జీవుడు నశించుననునది సూత్రము. కర్మ అయిపోయినపుడు జీవునికి నాశనము తప్పదు, కావున అవినాశ్‌ అనుపేరు అర్థము ప్రకారము జీవునికి కూడ వర్తించదు.


ఈ విధముగ గురువు దగ్గర ఆత్మజ్ఞానము తెలుసుకొంటున్న శిష్యులు కొన్ని సంవత్సరములకు పరిపూర్ణ జ్ఞానులై గురుసేవ సక్రమముగ చేయుచుండిరి. శిష్యులు జ్ఞానమునందు ఆసక్తి కల్గియుండి జ్ఞానమును తెలుసుకోవడము మరియు వారు శ్రద్ధగ సేవలు చేయడమును గమనించిన గురువు సంతోషించుచుండెను. ఇలా కొంత కాలము గడువగ ఒకనాడు అవినాశ్‌ అను శిష్యుడు భక్తి శ్రద్ధలతో గురువు పాదాలకు సమస్కరించు సమయమున గురువుగారు ఒక దీవెనను తననోటినుండి పలికెను. ఆ దీవెన విన్న మిగత శిష్యులందరు ఆశ్చర్యపోయారు. ఆ సమయములో తమకు కల్గిన ఆ ఆశ్చర్య విషయమును గురించి గురువుగారిని అడుగలేదు. తమలో తాము ఆ విషయమును కొన్ని రోజులు చర్చించుకొన్నారు. చివరకు గురువుగారు ఇచ్చిన దీవెన తప్పని తలచి, ఆ సంశయము గురువుగారే తీర్చవలెనని ఈ విధముగ అడిగారు.


శిష్యులు : స్వామి మాకొక సంశయము చాలా రోజులనుండి పీడించు చున్నది. ఆ సంశయమునకు మీరే జవాబు చెప్పగలరని వినయముగ అడుగుచున్నాము.

గురువు : మీ జ్ఞానమునకు అర్థముగాని సంశయమేమిటి?

శిష్యులు : అవినాశ్‌కు మీరు ఇచ్చిన దీవెనయే మాకు అర్థముకాలేదు స్వామి.

గురువు : అందులో అర్థము కానిదేమున్నది?

శిష్యులు : మీరు అవినాశ్‌ను దీవిస్తూ "నీవు నాశనమై పోనాని" అన్నారు. మరణముతో జీవుడు నాశనము కాడు. కర్మ అయిపోయినపుడే నాశనమగు నని చెప్పారు. కర్మఅనుభవించనిదే పోదు. లేక యోగము చేయనిదేపోదు. అటువంటపుడు మీమాట జరుగునా అన్నదే సంశయము.

గురువు : కర్మ విషయములో మీరు చెప్పిన పద్ధతి సరియైనదే. కాని మరొక పద్దతి కూడ కలదు. జ్ఞానాగ్ని అమితముగనున్నవారు వారి సంకల్పము చేత ఎదుటివాని కర్మను కాల్చవచ్చును. ఆ విధముగ సంపూర్ణ యోగులై బ్రహ్మర్షి హోదా కల్గినవారు మాత్రము చేయగలరు. కర్మ లేకుండపోతే జీవుడు నశించి పరమాత్మగ మారగలడు. అవినాశ్‌ను నేను దీవించడములో అదే అంతరార్థము గలదు. అవినాశ్‌ అంటే నాశనములేనివాడని అర్థము కదా! అపేరు సార్థకమగునట్లు అతడు జీవునిగకాక నాశనములేని దేవునిగ మారిపోవలెనని, జీవాత్మవైన నీవు నశించి పోవాలని దీవించాను.

శిష్యులు : మీరు దీవించిన తర్వాత కూడ అవినాశ్‌ మోక్షము పొందక దైవత్వములో కలిసిపోక మాతో సమానముగ జీవిస్తున్నాడు కదా! దీవెనలోని అర్థము జీవుడు నశించి దేవుడు కావలెననే కదా! అది ఇంతవరకు జరుగలేదు కదా!

గురువు : ఇపుడు వెంటనే జరగలేదను మాట వాస్తవమే. పెద్దల దీవెన వెంటనే ఎందుకు జరగలేదు? ఎప్పుడు జరుగును? అను ప్రశ్నలకు జవాబులు తెలియాలంటే దీవెనలను గురించి పూర్తి వివరముగ తెలియ వలెను. దాని విషయమునే ఇపుడు సవివరముగ తెలిపెదను వినండి. దీవెననే మరియొక పేరుతో ' ఆశీర్వాదము ' అని అందురు. ఆశీర్వాదము ఎవరైన ఇయ్యవచ్చును. కాని నెరవేరునది ఒక్క బ్రహ్మర్షులైన వారి దీవెన మాత్రమేనని తెలియాలి. బ్రహ్మర్షులు దీవించిన ఆ దీవెన ప్రారబ్ధకర్మ మీద మాత్రము పనిచేయదని తెలియవలెను. ప్రారబ్ధము పుట్టుకతో మొదలై చావుతో అయిపోవును. అందువలన ఏ దీవెనైన ఆ జన్మ అయిపోయిన తర్వాతనే పనిచేయును. సర్వాధికారియైన భగవంతుని శరీరమునుండి వచ్చు పరమాత్మ దీవెన తప్ప ఇతరులెంతవారైన ఇచ్చు దీవెన తర్వాత జన్మలో జరగవలసిందే. కావున ఇపుడు నేనిచ్చిన మాట ప్రకారము అవినాశ్‌ తర్వాత జన్మలో మోక్షము పొందుటకు తగిన జ్ఞానశక్తికల్గి నాదీవెన నెరవేరును. ఈ పద్ధతి తెలిసి పూర్వము దీవించెడివారు. ఇపుడు తెలియని దానివలననే మీరు ప్రశ్నించారు. ఇంకా తెలియనివారు మరియు స్థూల శరీరమునే తామనుకొనువారు దీవెనలోని అర్థమును స్థూలమునకే వర్తింపజేసుకొని "నీవు నాశనమై పోనాని" అను దీవెనను తిట్టుగ భావించుకొని "నేను చనిపోవాలని దూషిస్తున్నావా" అంటున్నారు. స్థూల సూక్ష్మముల వివరము తెలియనపుడు, ఆత్మల వివరము తెలియనపుడు, జ్ఞాన సముపార్జన లేనపుడు దీవెనలు తిట్లుగ, తిట్లు దీవెనలుగ అర్థమగును. అందువలన "నీవు నాశనమై పోనాని" అను దీవెన నేటి కాలమునకు దూషణగ మారినది.

-***-