తిట్ల జ్ఞానము - దీవెనల అజ్ఞానము/దీర్గాయుస్మాన్‌ భవ

వికీసోర్స్ నుండి

దీర్గాయుస్మాన్‌ భవ

"దీర్గాయుస్మాన్‌ భవ" అను దూషణ దీవెనగ మారినది. "దీర్గాయుస్మాన్‌ భవ" అనగ నీవు చాలకాలము బ్రతకమని లేక నీకు చాలా ఆయుస్సు కలగవలెనని దీవించడముకదా! ఇందులో చెడుఏముంది? ఇపుడిది దీవెనగనే కనిపిస్తున్నది కదా! పూర్వము దూషణగ ఎట్లుండెడిదని కొందరికి అనుమానము రావచ్చును. "దీర్గాయుస్మాన్‌ భవ" అన్న మాట పూర్వము పెద్దల దృష్ఠిలో ఎలా దూషణగ ఉండెడిదో వివరించుకొని చూస్తాము.


పూర్వము ఒక గురువు ఎంతో కష్టపడి జ్ఞానబోధ సాగించుచుండెను. గురువు ధనికుడుకానందువలన ఇతరుల దగ్గర ధనమును వడ్డీకి అప్పుగతీసుకొని దానిని వినియోగించి జ్ఞానప్రచారము చేయుచుండెను. ఆ గురువు దగ్గర లెక్కాచారి అను ఒక భక్తుడు చేరాడు. అతను వ్యాపారము చేసి డబ్బు సంపాదించడమే కాక సంపాదించిన సొమ్మును వడ్డీకి అప్పులిచ్చి కూడ సంపాదించడము అతని పని. గురువుగారికి డబ్బు అవసరము కదా! ఆయనకు అప్పుగ డబ్బులిస్తే జ్ఞాన విషయములో సహాయపడినట్లు ఉంటుంది, సులభముగ వడ్డీ కూడ వస్తుంది. రెండు రకములుగ లాభమే ఉంటుందనుకొన్నాడు. వ్యాపారస్తుడు కావున జ్ఞానము దగ్గర కూడ వ్యాపారదృష్ఠే ఉండెడిది. గురువుగారు జ్ఞాన ప్రచారనిమిత్తము ఇరువది మంది శిష్యులతో సహా పర్యటించవలెనను కొన్నాడు. ఆ పర్యటనకు ఒక లక్షరూపాయలు అవసరమైనాయి. గురువు గారు ఆ లక్షరూపాయలు అప్పుచేసి తర్వాత తీరుస్తామనుకొన్నాడు. విషయము తెలిసిన లెక్కాచారి నా స్నేహితుని దగ్గర డబ్బులున్నాయి, అతనిని అడిగి నూటికి రెండురూపాయల వడ్డి ప్రకారము లక్షరూపాయలు అప్పు తెస్తానన్నాడు. అట్లేకానిమ్మని గురువుగారు ప్రాంసరినోటు కూడ వ్రాసిచ్చాడు. నోటుకూడ స్నేహితుని పేరుమీదనే వ్రాయించుకొన్నాడు లెక్కాచారి.


గురువుగారు ఆరునెలల కాలము తన జ్ఞానప్రచారము సాగించి ఉన్నడబ్బులన్ని అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత తన పొలము పనుల మీద దృష్ఠిసారించాడు. ఒక రోజు గురువుగారి దగ్గరకు లెక్కాచారి వచ్చి ఆరునెలల కొకమారు వడ్డికట్టునట్లు ఒప్పుకొన్నానని, దానిప్రకారము ఆరునెలలు గడచినది కావున ఇపుడు అతనికి వడ్డికట్టవలెనని చెప్పాడు. ప్రపంచ విషయములలో ఎక్కువ జోక్యములేని గురువుగారు ఆ మాటకు సరె అన్నాడు. గురువుగారి దగ్గర డబ్బులేని దానివలన అతనికిచ్చు వెయ్యిరూపాయలు కూడ అప్పు చేయాలనుకొన్నాడు. ఆ విషయము తెలిసిన లెక్కాచారి వెయ్యిరూపాయలు ప్రస్తుతము వేరేవాని దగ్గర వడ్డీకి తెస్తాను తర్వాత ఇవ్వవచ్చునన్నాడు. అలాగే తెమ్మన్నాడు గురువుగారు. లెక్కాచారి ప్రస్తుతము వెయ్యిరూపాయలు ఆదుకొన్నట్లు చేసి గురువుగారి వద్ద అభిమానము సంపాదించవలెననుకొన్నాడు. గురువుగారికి ఈ విధముగ మూడు సంవత్సరముల కాలము ఆరునెలలకొకమారు చక్రవడ్డీ పడినది.


గురువుగారు కూడ సాధారణ జీవాత్మయే, కావున ప్రపంచములో అప్పుడప్పుడు అక్కడక్కడ మోసపోవలసి వస్తుంది. జీవాత్మగ మోసపోయిన గురువుగారు ఒక రోజు యోగసమయములో ఆత్మగ మారిపోయాడు. తన శరీరములోని ఆత్మగ మారడమేకాక సర్వశరీరములోని ఆత్మగ కూడ మారిపోయాడు. అపుడు లెక్కాచారి శరీరములోని ఆత్మకూడ ఆయనే కావున లెక్కాచారి శరీరములో జరిగిన గుణముల పనులన్ని తెలిసాయి. లెక్కాచారి శరీరములో ఆత్మ అన్నిటిని చూస్తు సాక్షిగ ఉన్నది కావున అన్ని విషయములు గురువుగారికి తెలిసిపోయాయి. తన డబ్బు ఇచ్చి తన స్నేహితునిదని చెప్పడము, ఆరునెలలకొకమారు చక్రవడ్డీ లాగడము తెలిసిన గురువుగారు జ్ఞానము యొక్క విలువ లెక్కాచారికి, మిగత భక్తులకు తెలియాలనుకొన్నాడు. తర్వాత కొంతకాలమునకు గురువుగారి జ్ఞానము తెలియుట వలన శిష్యులు గురువుకు ఎంతో ఋణపడి ఉంటారని, ఆ ఋణము అన్నిటికంటే పెద్దబాకీ అని, గురు ఋణము తీర్చుటకు ఎన్ని జన్మలైన చాలవని చెప్పాడు. ఆ మాటవిన్న లెక్కాచారి గురువుగారికి మేము బాకి ఉన్నట్లు నోటు వ్రాసివ్వలేదు కదా! ఆయన చెప్పు జ్ఞానమునకు మేమెలా బాకీ పడుతాము. పైసా ఖర్చులేకుండ నోటితో చెప్పు మాటలకు మేము బాకీ పడడము లెక్కాచారములేని మాట అనుకొన్నాడు లెక్కాచారి. లెక్కాచారికి అన్ని కనిపించు లెక్కాచారములే తెలియును, కనిపించని లెక్కాచారములు తెలియవు. అతని మనోభావమును గ్రహించిన గురువుగారు అతని అజ్ఞానానికి నవ్వుకొన్నాడు.


గురువు అనుకొంటే ఇటైన పంపగలడు అటైన పంపగలడు. గురువు అనుకొంటే మోక్షమునకైన పంపగలడు లేక జన్మలకైన పంపగలడు. గురువుగారు చెప్పెడిది అందరికి వర్తించు జ్ఞానబోధయే. నూటిమందికి జ్ఞానమును బోధించినప్పటికి అది కొందరికి మోక్షదారి, కొందరికి జన్మల దారి చూపగలదు. వినెడి మనిషి భావాన్నిబట్టి జ్ఞాన ప్రభావముండును. అందువలన "నీవు జ్ఞానము ఎడల సిగ్గుపడితే నీయెడల జ్ఞానము కూడ సిగ్గుపడునని" పెద్దలన్నారు. జ్ఞానము యొక్క లెక్కాచారము తెలియక జ్ఞానమువద్ద మోసము చేసిన లెక్కాచారికి జ్ఞానము కూడ మోసమే చేసింది. అదెలాగనగా! ఒక రోజు గురువుగారికి శిష్యులందరు నమస్కారము చేయుచుండిరి. ఆ సమయములో లెక్కాచారి తాను కూడ గురువు ముందర వంగి నమస్కారము చేసాడు. ఆ సమయములో గురువుగారి నోటినుండి ఒక మాట బయల్పపడినది. ఆమాట విన్న లెక్కాచారి తెలియక సంతోషపడినాడు. డబ్బు విషయములో తన పని తెలియక గురువుగారు సంతోషపడినాడులే అనుకొన్నట్లు, పలికిన పలుకు విషయము తెలియక సంతోషపడి పోయాడు. తాను తెలిసి మోసము చేసిన, తెలియకనే తాను మోసపోయినట్లు లెక్కాచారికి తెలియలేదు. ప్రపంచ విషయములలో అతి తెలివి ఉపయోగించు లెక్కాచారికి జ్ఞానములో కనిపించని ఫలితము తెలియకుండపోయినది. అంతకు గురువుగారి నోటినుండి వచ్చిన మాటేమిటి అంటే, అదియే "దీర్గాయుస్మాన్‌ భవ". దీర్గాయుస్మాన్‌ భవ అనుమాట నిజముగ చెడును సూచించు దూషనే అయినప్పటికి అతనికది దీవెనగానే కనిపించినది. నేను డబ్బిచ్చిన దానివలననే నన్ను దీవించాడనుకొన్నాడు. అక్కడ కూడ లాభమే వచ్చిందనుకొన్నాడు. జీవితములో జ్ఞానము తెలిసినప్పటికి అది తనకు ఉపయోగపడలేదు. ఎంత జ్ఞానము తెలిసిన అతడు జ్ఞానమునకెంత విలువిచ్చాడో, జ్ఞానము కూడ అతనికి అంతే విలువిచ్చినది. ఆ జన్మ అయిపోయిన తర్వాత మరుజన్మ లభించు సందికాలము సెకండ్ల కాలమే ఉండును. ఆ కొద్ది కాలములోనే జీవితమునకు సంబంధించిన ప్రారబ్ధము ఏర్పడును. అపుడు గురువుగారు పలికిన పలుకు యొక్క సారాంశము ప్రకారము సంచితకర్మనుండి ప్రారబ్ధమగును. గురువుగారి శాపము ప్రకారము ఆ క్రొత్త జన్మలో దీర్గాయుస్సు ఏర్పడినది.


తర్వాత జన్మ పురుషజన్మే కల్గడము మరియు ఆచారి కులములోనే పుట్టడము విశేషము. పోయిన జన్మలో బంగారు ఆభరణముల పనిచేయగ ఈ జన్మలో రాతి ప్రతిమలను చేయుపని కల్గినది. యుక్తవయస్సు తర్వాత శిల్పాచారియైన లెక్కాచారి యాబైసంవత్సరములకే చూపులోపము వలన పనిచేయలేక పోయెను. పనిచేయగల్గిన కొడుకులు సంపాదించలేదని తండ్రిని చులకనగ మాట్లాడజొచ్చిరి. ఐదు సంవత్సరముల తర్వాత మధుమేహ (సుగర్‌) వ్యాధితో ఆహారము కడుపునిండ తినకూడని పరిస్థితి ఏర్పడినది. తిన్న కొద్ది ఆహారము కూడ రుచిలేని తిండి. కాఫీలు తాగకూడదు. మత్తు పాణీయములకు అలవాటుపడ్డ దానివలన తాగకుండ ఉండలేడు. ఇలా యాబెైఐదు సంవత్సరములకే జీవితము దుర్భరముగ తోచినది. అరవై సంవత్సరములకు సుగర్‌ వ్యాధివలన ఒక కాలును తీసివేయడము జరిగినది. కుంటి బ్రతుకు మరీ దుర్భరమైనది. కొన్నాళ్ళకు కొడుకులు కోడల్లు ఇంటిలోనికి రానివ్వక ఇంటిబయటే ఉంచిరి. వాళ్ళు పెంచుకొను కుక్కనైన అప్పుడప్పుడు ఇంటిలోనికి రానిచ్చిన తనను మాత్రము రానివ్వకుండిరి. ఇలా కుక్కకంటే హీనముగ తనవారు చూడగ, శరీరము అశుభ్రతలో పందికంటే హీనముగ తయారైనది. 70 సంవత్సరముల వయస్సుకు శరీరము నరముల బలములేక మూత్ర విసర్జనకు పోకమునుపే గుడ్డలోనికి మూత్రమురావడము వలన ఆ వాసనకు సాటిమనుషులు తనవద్దకు పలకరించను కూడ రాకుండిరి. ఇటువంటి బ్రతుకు శత్రువుకు కూడ కలుగకూడదని తనకు మరణమొస్తే మంచిదని తలచుచుండెను. అందరు బ్రతికేదానికి దేవున్ని కోరుతుంటే తాను మాత్రము చచ్చేదానికి దేవున్ని కోరుచుండెను.


ఆచారి వయస్సు 80 సంవత్సరములైనది. వృద్దాప్యమంటే ఏమిటో, అనారోగ్యమంటే ఏమిటో బాగా అర్థమైనది. చివరికి జీవితమంటే ఏమిటో అర్థమైనది. మానవునికంటే పశు, పక్షుల జన్మలే మేలనిపించింది. ఈ విధముగ బ్రతకలేక చావురాక దినమొక యుగముగ గడుపుచున్నపుడు వారి ఇంటికి ఒక స్వామీజీ వచ్చాడు. కొడుకుల ఆహ్వానము ప్రకారము ఇంటికి వచ్చిన స్వామీజీ గొప్ప జ్యోతిష్యుడు కూడా. ముఖము చూచినంతనే జరిగినది జరుగబోవునది చెప్పగల దిట్ట. ఆ స్వామీజీ విషయము తెలుసుకొన్న లెక్కాచారి స్వామి బయటికి పోవునపుడు ఆయన కాళ్ళను గట్టిగ పట్టుకొని నేను తొందరగ చనిపోవునట్లు దీవించమన్నాడు. ఎందుకని స్వామి అడుగగ, వృద్దాప్యము చాలా దుర్భరమైనదని తాను బ్రతకలేకున్నానని, నేనుండి చేయునదేమి లేదని, చస్తామనుకొంటే చావురావడములేదని, నాకు కావలసినది చావు కావున అది వచ్చేటట్లు ఈ శరీరము వీడిపోయేటట్లు దీవించమన్నాడు. అందులకు ఆ స్వామి నవ్వి "మానవ జీవితము కొంతకాలమే అందమైనదని తర్వాత దుర్భరమైనదని తెలియక, పోయిన జన్మలో పరమార్థమును బోధించిన గురువుకే మోసము చేశావు. ధనము విలువ తప్ప జ్ఞానధనము విలువ తెలియని నీకు ఆ గురువుగారు ఇచ్చిన దీవెనయే నీపాలిటి శాపమైనది. ఆ దినము నీకు దీవెనగ అర్థమైన అది నీకు దుశ్శకునమే. దైవజ్ఞానమునకు విలువివ్వక జీవితములో ధనమునకే విలువిచ్చి గురువునే మోసగించిన నీకు 'దీర్గాయుస్మాన్‌ భవ' అని శపించడము జరిగినది. ఆ వాక్కు ఫలితమే ఎంతరోగమున్న సంపూర్ణముగ నూరు సంవత్సరములు బ్రతుకవలసి ఉన్నది. ఇదియే నీ భవిష్యత్తు" అని చెప్పాడు. ఆ మాటతో లెక్కాచారికి పోయిన జన్మ లెక్కాచారమేమిటో తెలిసినది. తనకు పరిష్కారమే లేదా అని స్వామీజీని అడిగాడు. దానికి స్వామీజీ "నీకు వాక్కు ఇచ్చినవాడు సామాన్యుడు కాడు. సాక్షాత్తు భగవంతుని మాట అది, కావున దానికి పరిష్కారమే ఉండదు. సాటిమనిషిగ కనిపించినందువలన ఆనాడు ఆయనమాటలను లెక్కించక ఆయనను గురించి ప్రక్కన హేళన మాట్లాడుకొన్నందుకు రోగము వచ్చింది. ఆయన వద్దకు భక్తితో పోవు వారిని చూచి వీరంతా మోక్షానికి పోయేవాళ్ళని అసూయతో మాట్లాడినందుకు నీవు ఎక్కడ పోకుండ కాలుపోయినది. గురువుగారి జ్ఞానమును తెలిసి విలువివ్వక పోవడము వలన నీకు స్వంత కొడుకు కోడళ్ళ వద్దనే విలువలేకుండ పోయినది. గురువుకే అబద్దము చెప్పి డబ్బు విషయములో మోసము చేసినందుకు నీవు సంపాదించిన డబ్బును నీవు అనుభవించేదానికి లేకుండ ఏమిలేనివానికంటే హీనముగ బయటపడి ఉన్నావు. ఇంత జరిగిన దైవజ్ఞానము కావాలనుకోక చావు కావాలనడము మూర్ఖత్వము కాదా! చావు నీ ఇష్టాయిష్టముల మీద ఆధారపడి ఉండదు. కావున అది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది" అని చెప్పి వెళ్లిపోయాడు.


దీనిని బట్టి చూస్తే 'దీర్గాయుస్మాన్‌ భవ' అను మాట దీవెనవలె ఉన్నప్పటికి అది దీవెనకాదు దూషణయేనని తెలియుచున్నది. అట్లే నీవు నాశనమైపోనాని అనుమాట దూషణవలె ఉన్నప్పటికి అది దూషణకాదు దీవెనయేనని తెలియుచున్నది. అందువలన తిట్లలో జ్ఞానము, దీవెనలలో అజ్ఞానమున్నదని తెలుపుచున్నాము. తిట్లు దీవెనలను రెండురకములు ఉన్నప్పటికి దీవెనరూపములో చెడును సూచించు తిట్లు, తిట్ల రూపములో మంచిని సూచించు దీవెనలుగలవని తెలియుచున్నది. ఇపుడు తిట్ల రూపములోనున్న దీవెనలను వివరించుకొందాము.

-***-