తిక్కన సోమయాజి/రెండవ యధ్యాయము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search




రెండవ యధ్యాయము

తెలుఁగు చోడరాజులు

కొట్టరువు భాస్కరమంత్రి తనయులలో మూఁడవవాఁడగు సిద్దన తిక్కభూపాలునకు మంత్రిగను సేనాపతిగ నుండెననియును, కొంతకాలము గడచిన పిమ్మట మంత్రిభాస్కరుని నాలుగవ కుమారుఁ డగు కొమ్మన దండనాథుఁడు గుంటూరు సీమనుండి నెల్లూరునకు వచ్చి కాపురముండెననియును మనము తెలిసికొని యున్నారము. తిక్కరాజు విక్రమసింహపుర మను బిరుదునామముచేఁబ్రసిద్ధిగాంచిన. నెల్లూరు ముఖ్యపట్టణముగాఁ జేసికొని తనరాజ్యమును గాంచీపురమువఱకును వ్యాపింపఁ జేసి నెల్లూరు, కడప, చిత్తూరు, చెంగల్పట్టు మండలములలోఁ జేరిన విశేషభూభాగమును బరిపాలించి ప్రఖ్యాతి కెక్కిన వాఁడు. ఇతఁడు తెలుఁగు చోడుల తెగలోని వాఁడు. తెలుఁగు దేశమునందలి చోడరాజులను తెలుఁగు చోడరాజు లనియును, తమిళ దేశమునందలి చోడరాజులను తమిళచోడరాజు లనియును, కన్నడదేశమునందలి చోడరాజులను కన్నడచోడరాజులనియును, ఇటీవలి చరిత్రకారులు వ్యవహారనామములను గల్పించి మూఁడు తెగలవారినిగా విభజించి యున్నారు. గాని మొదట వీరెల్లరు నొక్క తెగవారుగానే యుండి రని చెప్పవచ్చును. ఈసందర్భమునఁ దెలుఁగు చోడరాజుల చరిత్రమును జదువరు లెఱింగి యుండుట యత్యావశ్యకము గావునఁ బాఠకుల యుపయోగార్థము సంగ్రహముగా నిటఁ దెలుపుచున్నాఁడను.

తెలుఁగు చోడరాజులు సూర్యవంశపురాజు లైనట్లుగా నాంధ్రకవుల కావ్యముల యం దభివర్ణింపఁబడి యున్నారు విష్ణునాభికమలమున బ్రహ్మయు, వానికిఁ మరీచియు, వానికి గశ్యపుఁడును, వానికి సూర్యుఁడును, బుట్టిరఁట. [1]అట్టి సూర్యుని వంశమునఁ గరికాలచోడఁడు జనించి చోడరాజకుటుంబముల కెల్లను మూలపురుషుఁడై యొప్పెను. ఇతనితండ్రి జటచోడు డనియును, ఇతఁ డయోధ్యను బాలించె ననియును, ఇతఁడు కావేరినది కానకట్టకట్టించి గట్లుపోయించె ననియు, తెలుఁగు చోడుల శాసనములలో నభినర్ణింపఁ బడియుండెను. ఇతఁడు త్రిలోచనపల్లవుని జయించెననియును, కావేరినది కానకట్టకట్టిం చెననియు, తిక్కన సోమయాజి గూడ వర్ణించి యున్నాడు.[2] ఈకరికాలునకు మహిమానుఁడును, వానికిఁ గరికాలుఁడును, తొండమానుఁడును, దాసవర్మయు నను మూవురు కుమారులు గల రనియును శాసనములు దెలుపుచున్నవి. కరికాలునివంశమునఁ బిజ్జన జనించెను. ఇతనివంశము నుండి రెండు శాఖ లుద్భవించినవి. దాసవర్మ నుండి యొకశాఖ పుట్టెను. [3] కరికాలుని వంశమునఁ బుట్టిన దాసవర్మ మొదట పాకనాటి విషయమును జయించి పొత్తపి పట్టణమును రాజధానిగఁ జేసికొని పరిపాలించె నఁట. [4] ఈపొత్తపి రాజధానిగాఁ గలపొత్తపినాడును బరిపాలించిన చోడులను గూర్చి వివరముగాఁ దెలుపుట కిప్పుడు సాధ్యము గాదు. పొత్తపిచోడుఁ డనునది పెక్కండ్రురాజులకు బిరుదువాచకముగా నుండెను. ఈపొత్తపినాటిని బరిపాలించిన దాసవర్మ సంతతి వారు కమ్మనాటి లోనికొట్యదొనను రాజధానిగఁ జేసికొని పరిపాలించిరి. [5] వీరిచరిత్ర మిచటఁ దెలుపుట యనవసరవిషయము గావున విరమించు చున్నాఁడను. దాసవర్మకు మధురాపట్టణమును జయించుటచేత మథురాంతకుఁ డనుబిరుదము లభించె నఁట. ఈ మథురాంతకుని పేరును తిక్కన తననిర్వచనోత్తర రామాయణమున నుదాహరించియుండ లేదు. విక్రమసింహపురి చోడులలోఁ బెక్కండ్రు మథురాంతక పొత్తపిచోడుఁ డనుబిరుదు నామమును దమపేరులకుఁ జేర్చుకొని శాసనములలో వ్రాయించు కొనుచు వచ్చిరి. తిక్కనసోమయాజి మధురాంతక పొత్తపిచోడునిఁ బ్రశంసింపకపోయినను బిజ్జననుమాత్రము నిర్వచనోత్తరరామాయణమున నభివర్ణించి యున్నాడు. [6] "ఈ బిజ్జలరాజు 1150 మొదలు 1162 సంవత్సరము వఱకు రాజ్యము చేసిన (చాళుక్య) త్రైలోక్యమల్లుని సేనాధిపతిగా నుండి, 1162 వ సంవత్సరమున కళ్యాణపురాధీశ్వరత్వమును తానే యపహరించి, లింగాయతమతమును స్థాపించిన బసవేశ్వరుని తోఁ బుట్టు వగుపద్మావతి యొక్క చక్కఁదనమునకు మక్కువ గొని యామెను వివాహమాడి తనమంత్రినిగాఁ జేసికొన్న యూబసవేశ్వరునిచేతనే చంపఁబడెను.” అని, నెల్లూరి మనుమసిద్ధి రాజుయొక్క పూర్వకుఁ డైన బిజ్జనయే చాళుక్యబిజ్జలుఁ డని యభిప్రాయపడి శ్రీవీరేశలింగము పంతులుగారు తమ యాంధ్రకవుల చరిత్రయం దట్లు వ్రాసి యున్నారు.[7]ఈబిజ్జన సూర్యవంశ్యుఁడు. కళ్యాణపురాధీశ్వరుఁ డైనబిజ్జలుఁడు చంద్ర వంశ్యుఁడు. కావున వీరిరువురకు నేవిధ మైనసంబంధమును లేదు. తిక్కన యీబిజ్జనను

"చ. పరుషపరాక్రముం డగుచుఁ బల్లవువీట నుదగ్రు లైన ప
     న్నిరువురు నాతనిం గలయ నెన్ని యనర్గళమత్సరంబు మై
     మురరిపుసన్ని భుండు పదుమువ్వుర గండడగంగఁ బెట్టెఁ దా
     బిరుదు వెలుంగ బిజ్జఁ డరిభీకరభూరిభుజాబలంబునన్."

అని యభివర్ణించి యున్నాఁడు.

ఈబిజ్జన ఊజ్యపురియందు, శిఖరమున గరుడవిగ్రహము గలిగి యుండు నట్టి విజయస్తంభము నొకదాని నిర్మించె నని యొక శాసనమున లిఖియింపఁ బడియెను.[8] ఈబిజ్జనవంశమునందే మనుమసిద్దిరాజు జనించి విశ్రుతిఁగాంచెను. ఇతఁడు చాళుక్య చోడచక్రవర్తి యైన మూఁడవకులోత్తుంగ చోడునకుఁ గప్పము చెల్లించెడు సామంతుఁడై పండ్రెండవ శతాబ్ద్యంతమునను, పదుమూడవ శతాబ్దప్రారంభమునను గావలి మొదలుకొని కాంచీపురము వఱకుఁ గలదేశమునంతయుఁ బరిపాలించి నట్లుశాసనములం బట్టి దెలియుచున్నది. ఇతఁడు శాసనములలో సల్లసిద్ధిరాజని వ్యవహరింపఁ బడియెను. ఇతనికి మిక్కిలి పరాక్రమవంతుఁ డైన తమ్ము సిద్ధిరా జనుతమ్ముఁ డొకఁడు గలఁడు. వీని శాసనములు నెల్లూరు, చిత్తూరు, చెంగల్పట్టు ముండలములలో బెక్కులు గానంబడుచున్నవి. మనుమసిద్దిరాజు మొదట విక్రమసింహపురము నందుగాక వల్లూరుపట్టణము రాజధానిగఁ జేసికొని మార్జవాడి (మహారాజపది) రాజ్యమును బరిపాలనముసేయుచుఁ గాంచీపురము పై దండెత్తిపోయి యా రాజువలనఁ గష్పము గైకొనుచుండె నని దెలియుచున్నది. క్రీ.శ. 1196 వ సంవత్సరమునకుఁ దరువాత త్రిభునన వీరదేవుఁ డైన మూఁడవ కులోత్తుంగు డసమానమైన గజబలంబుతోడ గాంచీపురముపై దండెత్తివచ్చి వీరకృత్యము లనేకములను గావించి విరోధులయినరాజుల నెల్లరను జయించి కాంచీపురమును జొచ్చి క్రోధాగ్ని చల్లాఱినవెనుకఁ గాంచీపురము మొదలుగ నుత్తరభాగము నంతటను గప్పము విధించి సామంతనృపతుల నుండి గైకొనుచుండెను[9] ఈ మనుమసిద్ది రాజుసకుఁ దిక్కరాజు జనించెను. శ్రీకాళహస్తిదేవుఁడు తిరుక్కాళత్తి దేవుఁ డని


' ద్రావిడదేశమున వ్యవహరింపఁ బడుచుండెను. తిరుక్కాళత్తి శబ్దమె తెలుఁగులో తిక్కన యని వ్యవహరింపఁ బడుచున్నది. కావున, తిక్కన యనునది శ్రీకాళహస్తి దేవుని నామమే గాని మఱి యన్యము గాదు. పరాక్రమవంతుఁ డైన తిక్కభూపతి తెలుఁగుచోడులలో సుప్రసిద్ధుఁడు. ఇతఁ డసహాయశూరుఁడై బాల్యముననే యుద్ధములను జేసి విజయములను బొందుచు వచ్చె ననుటకు దృష్టాంతములు గలవు. ఇతఁడు శైశవము నందే వెలనాటి ప్రభువైన పృథ్వీశ్వర మహారాజుతో యుద్ధముచేసి రణరంగమున వానిమస్తకమును ద్రుంచి దానితోఁగందుక క్రీడ గావించి నాఁ డని తిక్కన తన నిర్వచనోత్తర రామాయణమున,

"ఉ. కేశవసన్నిభుండు పరిగీతయశోనికి చోళతిక్కధా
     త్రీశుఁడు కేవలుండె, నృపు లెవ్వరి కాచరితంబు గల్గునే,
     శైశవలీల నాఁడు పటుశౌర్యధురంధరబాహుఁ డైన పృ
     థ్వీశనరేంద్రుమస్తకము నేడ్తెఱఁ గందుక కేళి సల్పఁడే"

అను పద్యములో నభివర్ణించి యున్నాఁడు. ఈషృథ్వీశ నరేంద్రుఁడు మనుమ గొంకరాజునకు జయాంబికయం దుద్భవించి రాజరాజ చాళుక్యచోళ చక్రవర్తికిఁ బ్రతినిధి యయు సర్వస్వతంత్రుఁడై వేంగీదేశమును బరిపాలించు చుండెను. కాఁబట్టి పృథ్వీశ్వర రాజు పండ్రెండవ శతాబ్ద్యంతమున నుండె ననుటకు సందేహము లేదు. తనతండ్రి మనుమసిద్దిరాజునకుఁ బిమ్మట తిక్కరాజు విక్రమసింహపురమునఁ బట్టాభిషిక్తుడై మూఁడవ కులోత్తుంగ చోడునకు లోఁబడి యున్నవాఁడు నటించినను స్వతంత్రుఁడై పరిపాలనము చేసెను. తిక్కరాజు మూడవ కులోత్తుంగచోళుని గడపటి కాలమున మాత్ర ముండి యతని మరణానంతరము స్వతంత్రుఁడయినట్లు గన్పట్టు చున్నది.

ఇతఁడు స్వతంత్రుఁ డైనవెనుక చోడసింహాసనమునపై చాళుక్యచోడులలో మూఁడవరాజరాజున కును మూఁడవరాజేంద్ర చోడునకును తగవులు గలిగి పరరాజుల సహాయమును గోరి యిరుపక్షములవారును బోరాడుటచేత గాంచీపురము పల్మాఱు సంక్షోభమున కాకర మగుచు వచ్చెను. కర్ణాట దేశమును బరపాలించు వీరసోమేశ్వరుఁడు (హోయిసలరాజు) రాజేంద్రచోడునిపక్షమును, మన యీతిక్కభూపాలుఁడు రాజరాజుపక్షమును బూని యుద్ధములు చేయుచువచ్చిరి. కర్ణాటవీర సోమేశ్వరుని తోబుట్టువుకుమారుడును, (మేనల్లుఁడు) పాండ్యమండలాధిపతియు నగు రెండవ మారవర్మ సుందరపాండ్యుఁడును, మహాబలి పురాధీశ్వరుండును, పల్లవరాజు నగుకొప్పరిం జింగదేవుఁడును (మహారాజసింహుఁడు) అనగా ద్రావిడులుఁ గర్ణాటులు నొక్కవంకను, తెలుఁగుచోడు లొక్కవంకను జేరి ఘోరయుద్దములు జేసిరి. ఈ యుద్ధములలో మొదట తిక్కరాజునకే విజయము గలిగెను. తిక్కభూపాలుఁడు కదనరంగమున శత్రువుల నోడించి రాజరాజచోడుని సింహాసనము నందు నిలిపి చోడస్థాపనాచార్యబిరుదమును బొంది యవక్రలీలను గాంచీపురమును గూడఁ బరిపాలించెను. ఈవిషయమునే తిక్కనసోమయాజి తననిర్వచనోత్తర రామాయణముస,

“మ. కమలాప్తప్రతిమానమూర్తి యగు నాకర్ణాటసోమేశు దు
     ర్దమదోర్గర్వము రూపుమాపి నిజదర్పంబుం బ్రతిష్ఠించి లీ
     లమెయిం జోళుని భూమిపై నిలిపి చోళస్థాపనాచార్య నా
     మము దక్కంగొని తిక్కభూవిభుఁడు సామర్థ్యంబు చెల్లింపఁడే?"

అనుషద్యములో స్పష్టముగా వివరించి యున్నాఁడు.

కేతనకవికూడ తనదశకుమారచరిత్రమున సవతారికలో

"సీ. బలిమిచేఁ బృథ్వీశువసుధేశు తలఁ ద్రుంచెఁ
             గటకసామంతుల గర్వ మడచెఁ
    గాళవవిభు నహంకారంబు మాన్పించెఁ
             బాండ్యునిచేతఁ గప్పంబుఁ గొనియె
    ద్రవిడమండలికు లందఱఁ చక్క గెలిచి చో
             డని నిజరాజ్య పీఠమున నిలిపె
    వెఱుకుమన్నీల నివ్వెఱ పుట్టఁగా నేలె
             వైరివీరుల నామలూరు నోర్చె
    యోధ హరిరాయ పెండ రుభయకటక
    వీరుఁ డభినవభోజుఁ డాకారమదనుఁ
    డవనిభారధౌరేయమహాత్మవిజిత
    దిక్కరీంద్రుఁడు ఘనచోళతిక్కనృపతి."

అనుపద్యమునఁ దిక్కరాజు పృథీశ్వరరాజు తలఁ ద్రుంచె నని చెప్పి యున్నాఁడు. కాంచీపురములోని అరుళాళప్పెరుమాళ్ళ యాలయములో క్రీ. శ. 1233-34-గవ సంవత్సర మున నీతిక్కనృపతి పేరిట నొకదానశాసనము గానం బడుచున్నది. కావున నంతకుఁ బూర్వమె యీయుద్ధము జరిగి యుండునని యూహింపఁ దగును. ఈకారణముననే తిక్కరాజనేకులతో యుద్ధములు చేసి విజయములను బొంది ప్రఖ్యాతి కెక్కెను. దీనిని గూఁడ తిక్కనసోమయాజి తననిర్వచనోత్తర రామాయణమున,

"సీ. లకుమయ గురుములూరికి నెత్తి వచ్చిన
           గొనఁడె యాహవమున ఘోటకముల
     దర్పదుర్జయు లగు దాయాదనృపతుల
           ననిలోనఁ బఱపఁడే యాగ్రహమున,
     శంభురాజాది ప్రశస్తారి మండలి
           కముఁ జేర్చి యేలఁడే కంచి పురము,
     జేధి మండలము గాసిగఁ జేసి కాళవ
           పతి నియ్యకొలుపఁడే పలచమునకు

గీ. రాయ గండగోపాలు నరాతిభయద
   రాయ పెండారబిరుదాభిరాము నుభయ
   రాయగండాంకు ఖండియరాయుఁ దిక్క
   ధరణివిభుఁ బోలరాజుల కరిది గాదె"

అనుపద్యములో శంభురాజాది శత్రువులను జయించి కాంచీపురమును బాలించె నని తెలియఁ జేసి యున్నాఁడు. తిక్కరాజు పూర్వులు శైవమతావలంబకు లయినను తిక్కరాజు మాత్రము వైష్ణవభక్తుఁడై తనరాజ్యములోననేక విష్ణ్వాలయములను స్థాపించి వైష్ణవమతమునకుఁ బోషకుం డైనటులు గనం బడుచున్నది. "ఎవ్వఁడు శ్రీవరదరాజస్వామి చరణసరోరుహములను బూజింపుచున్నాఁడో అతఁడే నాకుఁ దల్లియుఁదండ్రియు, గురువును, ధనమును, పుత్త్రుఁడును మిత్రుఁడు నగుచున్నాఁ" డనిచెప్పి అరుళాళప్పెరుమాళ్ళ దేవాలయములో నొకశాసనమున వ్రాయించుట యే యిందుకు దృష్టాంతము. ఇతఁడు వైష్ణవమ తావలంబకుఁ డయినను పరమతసహనము గలిగి యుండి నట్లే గానం బడుచున్నాఁడు. తిక్కన సోమయాజి మూఁడవ పెద్దతండ్రి యగుసిద్ధనామాత్యుడు. తిక్క రాజునకు మంత్రిగనుండి యతనిమరణానంతరముఁ గూడఁ గొంతకాలము వఱకు జీవించి యుండి నట్లు గనంబడుచున్నది. తిక్క రాజునకు గరికాలభూవిభుఁ డనినామాంతరముగలదనియు, ఇతఁడు విద్వాంసుఁడై , కవిసార్వభౌమ బిరుదమును వహించి యుండె ననియుఁ గూడ నిర్వచనోత్తర రామాయణములో

"సీ. భృత్యానురాగంబు పెంపుఁ జెప్పఁగ నేల
            పరివారసన్నాహ బిరుదు గలుగ,
     వందిప్రియత్వంబు వర్ణింపఁ గానేల
            పాఠకపుత్రాఖ్య పరగు చుండ
     సకలవిద్యాపరిశ్రమముఁ దెల్పఁగ నేల
            కవిసార్వ భౌమాంక మవనిఁ జెల్ల,
     సుభగతామహిమఁ బ్రస్తుతి సేయఁగా నేల
            మన్మథనామంబు మహిమ నెగడ,

గీ. నుభయబల వీరుఁ డను పేరు త్రిభువనములఁ
   బ్రచురముగఘోరబహుసంగరముల విజయ

లక్ష్మీఁ జేకొను బాహుబలంబుసొంపు
పొగడ నేటికిఁ గలికాలభూవిభునకు."

అనుపద్యములోఁ దెలుప బడియున్నది. తిక్కనకవి తిక్కరాజును సకల విద్యాపరిశ్రమముగలవాఁ డనియు, కవిసార్వభౌమబిరుదముచే నొప్పినవాఁడనియు, వర్ణించియున్నాఁడె కాని యీతఁడు రచించినగ్రంథము లెవ్వియో పేర్కొన్నవాఁడు గాఁడు.

సిద్ధనామాత్యునితమ్ముఁ డైన కొమ్మనామాత్యుఁడు తిక్కనసోమయాజి బాలుఁడైయుండగనే స్వర్గస్థుఁ డయ్యెననితలంపవలసి యున్నది. తిక్కన తనమూఁడవ పెద్దతండ్రి యగు సిద్ధనామాత్యుని కడనే యుండి వేదశాస్త్రాదివిద్యల నభ్యసించిపెద్దవాఁడై మహాపదవి, నదిష్ఠించినట్లు తోఁచు చున్నది. తిక్కరాజునకు రాయగండగోపాలుఁ డనుబిరుదనామము గలదు. ఈతిక్కరాజు క్రీ. శ. 1250 వఱకును బరిపాలనముచేసెను. ఇతనివెనుకఁ గుమారుఁడు మనుమసిద్ధి రాజ్యమును బొందెను.

  1. "ఉ. అంబుజనాభునాభి నుదయంబయి వేధ మరీచిఁ గాంచెలో
         కంబుల కెల్లఁ బూజ్యుఁ డగు కశ్యపుఁ డాతనికి౯ జనించె,వి
         శ్వంబు వెలుంగఁ జేయఁగ దివాకరుఁ డమ్ముని కుద్బవించె వా
         నింబొగడం జతుశ్శ్రుతులు నేరక యున్నవి నాకు శక్యమే."
                                          (తిక్కననిర్వచనోత్తర రామాయణము)

  2. "శా. చేసేతం బృథివీశు లందుకొనఁ గాశీసింధుతో యంబుల౯
         జేసెన్ మజ్జన ముంగుటంబున హరించెం బల్లవోర్వీశును
         ల్లాసం బొందఁగ, ఫాలలోచనము లీలం గట్టెఁ గానేరి, హే
         లాసాధ్యాఖిల దిఙ్ముఖుండుకరికాల క్ష్మావిభుం డల్పుఁడే!?"
                                                (నిర్వచనోత్తర రామాయణము)

  3. Annual Report, on Epigraphy for 1809. Nos, 183 & 205. ఆంధ్రుల చరిత్రము, రెండవభాగము, రెండవప్రకరణము చూడుడు.
  4. పొత్తపి యనునది. కడపమండలములో పుల్లంపేట తాలూకాలోని టంగటూరునకు సమీపమునం దున్న పోతపి యనుగ్రామమే గాని మఱి యన్యము గాదు.
  5. ఈ కొట్యదొనపట్టణ మిపుడు గుంటూరు మండలము లోని నరసొరాపుపేటకు సామీప్యము నందు కొణిదెన యనునామము తోఁ బరగుచున్నది,
  6. చ. అతనికులంబు నందు నవతారి యుగాంతకృతాంతమూర్తి య
       ప్రతిమన దాస్యతావిభవభాసి విలాసరతీశుఁ డప్రత
       ర్కిత వివిధావధాన పరికీర్తిత నిర్మల వర్తనుండు సం
       శ్రితనిధి ఫుట్టె బిజ్ఞన యశేషధరిత్రియు నులసిల్లగన్.

  7. కందుకూరి వీరేశలింగ కవికృతి గ్రంథములు, సంపుటము, 10 భాగము 1, పేజీ 47, (1911-వ సంవత్సర ముద్రితగ్రంథము.)
  8. కోయంబుత్తూరు మండలములో కొల్లేగాలము అను స్థలమునకు 18 మైళ్ళదూరమున నున్న ఉజ్జపురమే ఊజ్యపుర మని డాక్టరు లూడర్సు గారు నిర్ధారణ చేసి యున్నారు. అయినను నెల్లూరిమండలములో సుళ్లూరుపేట డివిజనులో ఉచ్చూరు. ఆనెడిగ్రామ మొకటి కలదు. ఇచ్చటి యఱవశాసనములలో ఈగ్రామము ఉచ్చియూ రనివాడఁ బడి యున్నట్లుగా శాసనపరిశోధకులు వ్రాయుచున్నారు.
  9. South Indian Inscriptions vol iii. p. 218.