Jump to content

తిక్కన సోమయాజి/మూడవ యధ్యాయము

వికీసోర్స్ నుండి


మూడవ యధ్యాయము.

తిక్కన జన్మాదికము.

తిక్కనజన్మస్థానముగాని, జన్మసంవత్సరముగాని మనకుఁ దెలియరాదు. తిక్కన కొమ్మనామాత్యునకు సదాచారసంపన్నయు, సుగుణశీలయు, మహాపతివ్రతయు నైన అన్నమాంబగర్భమున ఒకశుభముహూర్తమున జనించెను. ఇట్టి సుపుత్రుఁడు తమకు జనించినందులకుఁ బరమానందమును బొందుచు, దల్లిదండ్రులు జాతకర్మప్రముఖ సంస్కారంబులు యథావిధిగా నెఱవేర్చి తిక్కన యని శ్రీకాళహస్తిదేవుని తెనుఁగుపేరు పెట్టిరి. తిక్కనసోమయాజితండ్రియును, దాతయును గుంటూరివిభులుగా నున్నట్లు నిర్వచనోత్తర రామాయణా వతారికయును, ఆంధ్రమహాభారతము లోనివిరాటపర్వావతారికయును దెలుపుచున్నందునఁ దిక్కన జన్మస్థానము గుంటూరై యుండు నని యూహించుట కెక్కువ హక్కుగలదు గాని గుంటూరే జన్మస్థాన మనినిర్దేశించుటకు బలవత్తర మగురుజు నంతకంటె నధికము గానరాదు. ఆకాలమునఁ దల్లిదండ్రులు దమకొమాళ్ళకుఁ దిక్కన యనినామకరణముఁ జేయుట కాళహస్తిసమీపమండలవాసులలోఁ గానంబడునుగాని, గుంటూరు మండలవాసులలో నంతగాఁ గానంబడదు. ఆహేతువుచేత తిక్కన జన్మస్థానము కాళహస్తికి సామీప్యమున నుండు నెల్లూరే యనుట కెక్కువహక్కు గలదు గాని నెల్లూరే జన్మస్థాన మని నిర్దేశించుటకు బలవత్తరమగు రుజు వంతకంటె నధికము గానరాదు. అయినను తిక్కన జన్మస్థాన మిదియని సహేతుకముగా నిర్ధారించుటకుఁ జాలినంతలిఖితమూలము లభ్య మగునంతవఱకును జన్మస్థాన మిదమిత్థ మని నిశ్చయింపఁ జూలను. కాని తిక్కనసోమయాజి నిజస్థానము నెల్లూరని ఘంటాపధముగఁ జాటవచ్చును. తిక్కనజన్మస్థాన మెద్దియైనను తిక్కన వాసస్థలము నెల్లూరు కాదను వాదము గూడఁ గలదు. ఆవాదమునుగూడ విమర్శింతము. ఇట్టివాదము 'కవిజీవితము' లనుగ్రంథమునందుఁ గానంబడు చున్నది. అం దిట్లున్నది.

"నెల్లూరుప్రభుఁ డగుమనుమసిద్ధిరాజు పేరిట సోమయాజి తననిర్వచనోత్తరరామాయణము కృతియిచ్చుటం జేసియు, భారతము హరిహరనాధుని పేరిటఁ గృతియిచ్చుటచేతను నీతఁడు. నెల్లూరు వాసస్థుఁ డనువాడుక కల్గినది. ఇందు మొదటిగాథను బట్టి అక్కడ నివాసము స్థిఱపఱుప వీలు లేదు. ఫూర్వము కవీశ్వరులు దేశదేశములు తిరిగి, ఎక్కడరసికు లగు ప్రభువు లుందురో అక్కడఁ గొన్నిదినంబు లుండి యాప్రభుని కొకకృతి యిచ్చి బహుమతుల నంది మరల స్వస్థలమునకుఁ బోవుచుండు నాచారము గలదు. అటులనే సోమయాజియుఁ జేసి యున్నాఁడని అతని రెండవగ్రంథమగుభారతములో మనుమసిద్ది యాస్థానములోని వాడ నని యుచ్చరింపఁ బడకపోవుటచేత నిస్సంశయముగాఁ జెప్ప నొప్పియున్నది. ఇఁకరెండవ శంకకు సమాధాన మెట్లన్న భారతములో స్మరింపఁబడిన హరిహరనాధుఁ డు అర్చావతారరూపుఁ డై నెల్లూరున వేంచేసియున్న హరిహరనాథుఁడు కాక కేవలమును నద్వైతుల కుపాస్యుం డగు హరిహరులకు నధినాథుఁ డగునద్వయ నిర్గుణబ్రహ్మ మని భారతములోని యాశ్వాసాద్యంతపద్యముల నద్వైతశాస్త్రసంప్రదాయమునఁ జూచిన స్పష్టము కాఁగలదు. కావున భైరెండు యుక్తులును సోమయాజి నెల్లూరుపురవాసి యని చెప్పుటకుం జాలవు. భారతరచనాపూర్వకాలములో సోమయాజి కాశీయాత్రఁ జేయుచుఁ గాశినుండి యీగ్రంథరచనకు వచ్చి యున్నాఁడనిచెప్పెడు సంప్రదాయజ్ఞవాక్య ముభయపక్షములలో నిర్బాధకమే అయి యున్నది."

కవి జీవిత గ్రంథకారుని పైవాక్యములను మనమంతగాఁబాటింప వలసినపని లేదు. నెల్లూరుమండలచరిత్రమును గూర్చికాని కేతన కవికృతమై తిక్కనకంకితము గావింపఁబడిన దశకుమారచరిత్రమును గూర్చి గానితెలియనికాలమున నా గ్రంథకర్త యట్లువ్రాసి యుండెను. ఎక్కడ రసికులగు ప్రభువులుందురో అక్కడఁ గొన్నిదినంబు లుండి యాప్రభుని కొక కృతి యిచ్చి బహుమతుల నంది మరల స్వస్థలమునకుఁబోవు నట్టియాచారముగల కవులసంఘము లోనివంటి వాఁడుగాక తిక్కనకవి ప్రభుకోటిలోఁ జేరిన వాఁడై యున్నవాఁడు. తిక్కనకవి మాత్రుఁడేగాఁడు. మంత్రియు సేనాపతియుఁ గూఁడ నై యున్నవాఁ డని దశకుమార చరిత్రావతారిక వలన స్పష్ట మగుచున్నది. ఇంతియగాక కర్మకుఁడై బహువిధయాగము లనేకము లొనరించుటయు, అగ్రహారములు మొదలగువాని నొసంగి కవిపండితకోటిని సన్మానించుటయు మొదలుగా గలవానిని పరిశీలించినప్పుడు తిక్కన నెల్లూరుపురవాసి కాఁడని యెవ్వనికి సందేహము జనింపఁ గలదు? మహాభారతాంధ్రీకరణమునకై తిక్కన సోమయాజి కాశినుండి వచ్చినాఁ డని చెప్పెడు కథ పుక్కిటి పురాణముగాని విశ్వాసపాత్రము కాదు. మనుమసిద్దిరాజు పేరుగాని, నెల్లూరు పురనామముగాని యాంధ్రీకృత భారతమునఁ గానరాకపోయినను తిక్కన నెల్లూరు పురవాసి కాఁడని చెప్పుట సాహస మనిపించుకొనును. తిక్కన వానినుదాహరింప కుండుటకు వేరుకారణములు గలవు. అయ్యవి క్రమముగా బోధపడఁగలవు. వేయునేల? అభినవదండినా వినుతిగాంచిన కేతనమహాకవి తనదశకుమార చరిత్రములో "కొట్టరువు తిక్కనామాత్యునకు నిజస్థానంబగు విక్రమసింహపురం బభివర్ణించెద" నని

"సీ. కరిఘటానిలయంబు తురగజన్మస్థలి
           సంభటనివాసంబు సుకృతకర్మ,
    కర్మఠద్విజగణాకరము రాజన్యవం
           శావాస మర్యవర్యాశ్రమంబు
    కర్ష కా గారంబు కవిబుధసదనంబు
           సుందరీ శృంగార మందిరంబు
    ధనధాన్యసంగ్రహస్థానంబు ధర్మద
           యాచార విద్యావిహారభూమి

    తైలఘృతలవణాది సద్ద్రవ్యపాల
    మమలబహువిధ రత్నరత్నాకరంబు
    మధురజలపూర కాసారమండలంబు
    నాగవిక్రమ సింహాఖ్యనగర మొప్పు.”

అను పద్యమును జెప్పి నెల్లూరును వర్ణించినదానిఁ జూపుటకంటెఁ దిక్కన నెల్లూరుపురవాసి యనుటకు వేఱొండురుజువు మఱి యేమికావలయును?

తిక్కనబాల్యదశ. వేదవిద్యాభ్యసనము.

ఈమానవ ప్రపంచమునందు ధర్మోపదేష్టలై విఖ్యాతిఁగాంచిన మహాపురుషులలో స్వప్రజ్ఞలను జూపి యడ్డంకుల నెల్లఁగడచి యున్నతపీఠముల నధిష్టించిన వారిలోననేకులు బీదల యిండ్లనేజనించిరి. మనతిక్కనామాత్యునివలేఁ బుట్టుకతోడనే ప్రాభవము గలిగి పుట్టిన యదృష్టశాలి లోకములో నూటికిఁ గోటికి నెక్కడనేని నొక్కఁడు గలఁ డేమో? ప్రాభవము గలిగిన ప్రభువంశమున జనించి ప్రతిభాశాలి యై యాంధ్రప్రపంచ మజ్ఞానాంధకారమునఁ బడి కన్నుఁగానక తడుపుకొనుచు తపించుచున్న కాలమున జ్ఞానతేజస్సును బఱపి సముద్దరించి యానందాబ్ధి నోలలాడింతు నని ప్రతిజ్ఞాదీక్షను వహించి సార్థక జన్ముఁ డైనధన్యుని బాల్యదశ యిట్టిదనితెలుపు లిఖితమూల మేదియును నేడు ప్రత్యక్షముగా నెదుట గానరాకున్నను బరిశ్రమఁ జేసిన ధీవిశారదులకుఁదెలియకపోదు. అక్షరాభ్యాస సంస్కారానంతరమునఁ దిక్కనఁ వేదాదిసమస్త విద్యాభ్యాస విభాసి యగుచు ననుదిన ప్రవర్థనంబుఁ జెందెనని కేతనకవీంద్రుఁడు వాక్రుచ్చియున్నాడు. లౌకికాధికార దూర్వహులైన శ్రీమంతులయింటఁ బుట్టియుఁ దిక్కనవైదిక విద్యాభిలాషి యై విద్యాభ్యాసమునకు దొరకొనుటకు హేతు వేమి యైయుండునని కొందఱచ్చెరువు నొందవచ్చును. తిక్కనపూర్వులు తరతరముల నుండియు వైదికవిద్యలను వైదికానుష్ఠానములను విడిచిపెట్టక భక్తితో ననుష్ఠించుచు వచ్చిరి. అందువలనఁ దిక్కనతండ్రి యగుకొమ్మనామాత్యుడు పవిత్రశీలుఁడై సొంగోపాంగముగ వేదముల నభ్యసించెను. అయిన నతఁడు దండనాధుఁడుగ నుండుట కియ్యని యడ్డుపడలేదు. ఆకాలమునఁ దిక్కనయు, 'అవశ్యంపితురాచార'మ్మని తనతండ్రిమార్గమునే యధికశ్రద్ధాభక్తులతో ననుసరించి ధన్యుఁ డయ్యెనుగాని మఱియొండు గాదు. "ఉదాత్తవేదవిద్యా ప్రతిపాలకుఁడు, సకలవిద్యా కళాచణుఁడు, వేదత్రిత యాత్మకుఁడు, వేదాదిప్రకట వివిధ విద్యాభ్యాసాపాదిత మహత్త్వుఁడు, ఉదాత్తశ్రౌతస్మార్త కర్మతత్పరమతి, సకలాగమార్జతత్త్వవిచారోదారుఁడు, యాగ విద్యాభిరాముఁడు, వేదోదితకర్మవ్రతుఁడు, నానావేదవేదాంగ తత్త్వజ్ఞుఁడు, తతనయసువచస్సమగ్రతాచతురాస్యుఁడు, అని తరగమ్య వాఙ్మయ మహార్ణవవర్తన కర్ణధారుఁడు' అను విశేషణములతోఁ గేతనకవి తిక్కన నభివర్ణించి యుండుట చేతను, మఱియు నింక నిట్టివే యనేక కారణములచేతను సాంగోపాంగముగ వేదముల నభ్యసించి తిక్కన సమకాలమువారిచే వాక్పతినిభుఁ డనికొనియాడఁ బడు చుండె నని మనము నిస్సంశయముగా విశ్వసింప వచ్చును. దీనిని బట్టి తిక్కన , పినాకినీ నదీతటమున గురుకులంబున శ్రద్ధాభక్తులతో గురువులకు శుశ్రూషలు గావింపుచుఁ గ్రమశిక్షణము గలిగి వేదాధ్యయనముగావించె నని మనకుఁ దేటపడక మానదు, ఆగర్భ శ్రీమంతుఁ డై పుట్టియు నిజకులాచారధర్మరక్షణాభినిరతీ గలిగి బీదబ్రాహ్మణబాలురతోఁ గలిసి విద్యాభ్యాసముఁ జేయుట గౌరవలోపముగా నెంచుకొనక తానెంత యైశ్వర్యవంతుఁ డైనను విద్యాసముపార్జనము లేకయున్నఁ దన జీవితము లోకములో వన్నెకెక్కి పరమార్థమును బొందఁజాల దనితలంచి తన పూర్వులవలెనే తానును వేదాదిసమస్తవిద్యాభ్యసనము చేయవలయు నని తిక్కన సంకల్పించుకొని గురుకులంబుఁజేరి తొలుత వేదాధ్యయనముఁగావించి నట్లు స్పష్టముగాఁ గనంబడుచున్నది. స్వధర్మము నతిక్రమింపక నడచుకొనెడు వర్తనము బాల్యమునందే తల్లిదండ్రుల నుండి తిక్కన గ్రహించెను. మహత్తరమైన మనోరధసృష్టి బాల్యమునందే యంకురించి నందునఁ దత్పోషణార్థము తిక్కన దీక్ష వహించి కృషి సలిపెను. పితృమాతృభక్తి విశేషముగాఁ గలవాఁ డౌట చేతఁ బెద్దలయెడ వినయవిధేయత లనుజూపుట సంభవ మయ్యెను. నిరంతరమును గురుసాన్నిధ్యమున నుండి వేదాధ్యయనము సలుపుటచేత వినయ విధేయతలు మాత్రమెగాక యోపికయు, శాంతమును, ప్రస్పుట మైనవాక్కును సంపాదించుకొనఁ గలిగెను. వైదికవిద్యాభిలాషి యై పినాకినీనదీతటమున గురుకులంబున. గురుసాన్నిధ్యమున వేదాధ్యయనము సేయునాఁడు శుచి వ్రతుఁడై యుండక మానఁడు. ఎప్పుడు విద్యార్థి శుచివ్రతుఁడై విద్యాభ్యాసము చేయునో అప్పుడే వాని తేజస్సు బహిర్వ్యాప్తినిజెందు చున్నది. ఉపనయనానంతర మీతఁడు కనీసము పదునాఱు సంవత్సరము లైనను బ్రహ్మచర్య వ్రతముఁ బూని యుండినఁ గాని సాంగోపాంగముగ వేదముల సభ్యసించుట సాధ్యము గాదు. తిక్కన నేర్చిన విద్యలను బట్టిచూడ నిర్మలమైనమనోవృత్తిగలిగి గురుకులంబున శౌచవ్రతుఁ డై నిర్మల వాయువులను బీల్చుచు, నిర్మలోదకంబుల స్నానమును జేయుచు, నిర్మలజలంబులం ద్రావుచు, పరిపక్వ పదార్థములనే భుజింపుచు బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠుఁడై , పవిత్రశీలుఁ డై బహుసంవత్సరములు పరిశ్రమ చేసియు నతఁ డారోగ్యవంతుఁడును దృఢగాత్రుఁడు నై యున్నట్లే తోఁచును. ఆరోగ్యవంతుఁ డై తిక్కన వైదికవిద్యలనే గాక లౌకికవిద్యలనుగూడ నభ్యసించెను. 'నీతిచాణక్యుఁ డనియును, సామాద్యుపాయవిదుఁ డనియును, నీతినిపుణమతి జితపురుహూతామాత్యుఁ డనియును, అమరసచివదూయోపహారుఁ డనియును, కేతన ప్రశంసించి యుండుటచేతఁ దిక్కన దండనీతి మొదలగువాని నభ్యసించి నీతిశాస్త్రపారంగుం డయ్యె నని తెలియుచున్నది. "తిక్కచమూపా, తిక్కదండాధీశా" అనిపేర్కొనియుండుటచేతఁ గూడ నీతఁడు మనుమసిద్దిరాజుకడ మంత్రిమాత్రుఁడు మాత్రమె గాక సైన్యాధిపతిగ గూడ నుండినటులు వేద్య మగుచున్నది. ఇతఁ డిట్లు ముప్ప దేండ్లువచ్చువఱకు వేదంబులు, వాదంబులు, వీణాది వాద్యంబులు, ఆగమములు, ఆలేఖ్యకర్మంబులు, మంత్రతంత్రంబులు, మందులు, మాయలు, సింధురగంధర్వ శిక్షణములు ధర్మార్థ కామశాస్త్రములు జ్యోతిషము, కవితయు, కావ్యనాటకములు, కథలు, పురాణములు, ఆయుధనైపుణము, అంజనము మొదలుగాఁగల సమస్తవిద్యల సమస్తకళల నభ్యసించి మహామహోపాధ్యాయుఁ డై బ్రవర్తింపు చుండెను.

తిక్కనరూపము

తిక్కనచరిత్రమును జదివెడువారును, వినెడువారును, తిక్కనరూప మెట్లుండు నా యని తలపోయనివా రుండరు. తిక్కనరూపమును జిత్రించుటకుఁ దగినసాధనము లంతగాఁ గానరావు. తిక్కన కంకితముగావింపఁబడిన దశకుమార చరిత్రములో కేతనకవి కొన్ని వర్ణనములను జేసి యున్నాఁడు. కాని వానిని గొంద ఱవిశ్వాసకు లతిశయోక్తులక్రిందను ద్రోసి పుచ్చినను గొంతవఱకు తిక్కనచిత్రపటమును లిఖియించుటకుఁ దోడు సూపక మానవు. తిక్కనమహనీయుని చిత్రపటమును జిత్రించుటకుఁ దొలుతఁ బ్రయత్నించిన యొక విద్యాధికుఁ డైన బుద్ధిశాలి వాక్యములనే నీదిగువ నుదాహరించు చున్నాఁడను.[1] "తిక్కన కృతి నందిన దశకుమారచరిత్రము నందుఁగూడ నీయంశమును గూర్చి విపులంబుగ నేమియు వ్రాయఁబడ లేదు. సాధ్యమైనంత దనుక దానినే సహాయముగాఁగొని కొంత విచారింప నుద్యమించుచున్నాడను, అయిన దశకుమారచరిత్రము గృతి యిచ్చినకావ్యంబుగాన నందుఁ గృతిపతిని వాడుకరీతిఁ బ్రౌడోక్తుల నగ్గించి యుండునని కొందఱాక్షేపింతురు గాఁబోలు. అందులకు సమాధానము చెప్పెద వినుఁడు. కేతన యందఱివలె గేవలధనాశచే నంకిత మొనర్చినవాఁడు గాఁడు.

అట్టి యాశయుండినపక్షమున మనుమసిద్ధికే యొనర్చి యధికధన మార్జించి యుండును. తిక్కన యనన్య విద్యాపాండిత్యాదులయందుఁ దనకున్న యభిమానాతిశయంబుఁ బట్టియు నట్టిమహనీయుండు ప్రశంసించినం గాని తన సెప్పు కవిత్వము సార్థకత నొంద దనుతలంపునను నతఁడు కృతి యిచ్చంగాని వేఱుగాదు. "కవిత సెప్పి యుభయకవిమిత్రు మెప్పింప, నరిది బ్రహ్మకైన నతఁడు మెచ్చఁ బరఁగ దశకుమారచరితంబు సెప్పినఁ ప్రోడనన్ను వేఱ పొగడ నేల" ఆనుపద్యం బీయర్థమ సూచించు చున్నయది, అదియునుంగాక తిక్కన యట్టిజ్ఞానసంపన్నునకు లేనిపోని స్తోత్రపాఠంబు లుపాలంభరూపంబు లై జుగుప్సాజనకంబు లగుంగాని సంతోషదాయకంబులు గానేరవు. ఇక మనయుపక్రమిత విషయమునకుం బోదము. దశకుమారచరిత్రమునందు గేతన "కనకగిరితటీసంకాశ వక్షస్థలీభాగునకు” అని నుడివి యున్నాఁడు. పద్యప్రారంభమే యిట్లుంటచే మనము యతిప్రాసములకై తెచ్చిపెట్టుకొన్నది. యనఁ గూడదు “శ్రీ రమణీరమణీయమహోరస్థలి విజితకాంచనోర్వీ ధరవిస్తారిత బలుండు" అని యీయంశమునే కేతన మఱియొకచో వ్రాసి యున్నాఁడు. ఏతదాక్యద్వయంబు పరస్పరబలీయము లై నెగడు చున్నవి. వీనిచేఁ దిక్కన పీనంబును విస్తారంబు నగు వక్షంబు గలవాఁ డనుట వ్యక్తము. కృతిపతి యందలి యీవిశేషంబు సూచించు నిమిత్తంబుననే కేతన తనప్రథమ నాంధ్ర పద్యము నందు:

“ఉ. శ్రీరమణీ గృహాంగణము చెన్ను వహింప నలంకరింపఁగాఁ
    దోరణముం బ్రదీపమును దోహలి యై యొడఁగూర్చె నాదగం
    జేరి యురంబు నందుఁ దులసీవనమాలయుఁ గౌస్తుభంబు నొ
    ప్పారగ నుల్లసిల్లు హరి యున్నమ తిక్కని ధన్యు జేయుతన్"

అని హరి యురంబు వర్ణించి యున్నాడు. మఱియొకచో "కల్పక పరాభవకరణ ధురీణదీర్ఘ బాహుం డెలమిన్" అని చెప్పఁ బడియుండుటచేఁ దిక్కన యాజానుబాహుం డని స్ఫురించు చున్నది. వెండియు నొకచోట "జలజసుభగనేత్రుం" అని పద్యప్రారంభమున నుండుటచే మనోజ్ఞము లైనవిశాల నయనంబులు గలవాఁ డనుట ద్యోతక మగుచున్నది. తిక్కన ప్రతీకంబులఁ గూర్చి యింతకన్న మఱేమియుఁ గేతన సెప్పఁడయ్యె. “వియస్మణితేజుఁడు, అతిదినకరతేజుండు, మార్తాండసమానతేజుఁడు, నిజప్రభాదూషితవాసరేశుఁడు, పవిత్రమూర్తి" అనునట్టి విశేషంబు లచ్చ టచ్చటఁ బ్రయోగింపఁబడి యున్నవి. వీనిచేఁ బ్రకాశించు నగరుణరుచి గలవాఁ డని తేలుచున్నది. దీర్ఘబాహుఁ డని తొల్లి వాకొనియుండుటచే దాని కనురూపంబుగ నున్నతకాయుం డనుట తెల్లము. మఱియుఁ దిక్కన యతని పితృపితామహులవలె సైన్యాధిపతి, ఈవిషయము 'తిక్కదండా దీశా, తిక్క చమూపా' అని కేతన వాడియుండుసంబుద్దులచేఁ దేట పడును. వాహినీ పతిత్వమున కున్నతకాయులే యర్హు లనుట ప్రసిద్ధము. కాఁబట్టి తిక్కన కేవలకుబ్జుండుగాక మనుజసామాన్యమైన శరీరపరిమాణంబు గలిగి యుండె ననుట స్పష్టమగు చున్నది. ఇప్పుడు మనకుఁ దిక్కన విశాలవక్షుఁ డనియు, దీర్ఘబాహుఁ డనియు, విశాలనేత్రుఁ డనియు, నతితేజస్వి యనియు నేర్పడెను. అతఁ డతిసుందరమూర్తి యని కేతన ప్రత్యా శ్వాసాద్యంత పద్యమునందును నుడివి యున్నాఁడు.

“తనదుర్వారతరప్రతాపమునఁ జిత్రస్నేహముల్ గట్టి నే
 యు నితం డెట్టినిదగ్దుఁడో తలఁపుఁ డోహొ యంచు లోకంబు గో

సనపుచ్చం గరమొప్ప దర్పకుఁడు రాజ్యత్సుండరాకారు శో
భనసంపన్నుఁ గృతీశ్వరుం బ్రచుర సౌభాగ్యాన్వితుం జేయుతన్."

అని కవులలో నంతగా వాడుకలేని మన్మధుని వర్ణించు నొక యీశీరర్థక పద్యమునే వ్రాసి యున్నాఁడు.

ఇట్లు బుద్ధివైశారద్యు లైనకృష్ణరావుగారు తిక్కన సుందరాకృతినిజిత్రించి యాంధ్రప్రపంచమునకు వంద్యు లగుచున్నారు.

  1. ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక, (విరోధికృన్నామ సంవత్సరము 1911) 149 పేజీ, మ-రా-రా-శ్రీ జె. కృష్ణరావు, బి.ఏ., బి.ఎల్ , గారిచే వ్రాయబడిన 'తిక్కన సోమయాజి చరిత్రము' అను శీర్షికఁగల వ్యాసమునుండి గ్రహింపఁబడినది.)