తిక్కన సోమయాజి/ఏడవ యధ్యాయము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


ఏడవ యధ్యాయము

నిర్వచనోత్తర రామాయణము.

మేరులెత్తినను సరేశ్వరువర్తనము రత్నాకరవేష్టితావని వినంబడదని యెఱింగినవాఁడుగాన తిక్కనకవిచేఁ గృతినొందవలయు ననుకోరికగలవాఁడై మనుమసిద్ధి యొకనాఁడు తిక్కనమనీషిం బిలువ నంపించి 'నిన్నుమామాయని నేను బిలుచుచున్నందుకు నీవు నాకు భారతీకన్య నొసంగ నర్హుఁడవైయున్నాఁడ' వనిపలికెను. ఆపలుకు తనమనస్సున కింపు పుట్టించె నని,

"క. ఏ నిన్ను మామ యనియెడు
    దీనికిఁ దగ నిమ్ము భారతీకన్యక నా
    కీ నర్హుఁడ వగు దనినను
    భూనాయకుపలుకు చిత్తమున కింపగుడున్".

అను పద్యముమూలమునఁ దిక్కన తేటపఱచి యున్నాఁడు. దీనినిబట్టి తిక్కనకవికి మనుమసిద్దిరాజునకుఁ గృతి నొసంగుకోరిక యదివఱకు లేదనియు నతఁడు పలికిన చమత్కారపుం పలుకు మనస్సున కానందము గలిగించుటచేతఁ గృతి నిచ్చినట్లును స్ఫురించుచున్నది. ఇట్లు మొదట సమ్మతిలేకయున్నను మనుమసిద్ధికులశీల స్వరూపాదులం దలంచుకొని నప్పు డయ్యవి సయుక్తికముగా నాతం డర్హుం డనిబోధించిన మనస్సు సమాధానపఱచుకొని కృతియిచ్చి నట్లు నిర్వచనోత్తరరామాయణములోని,

"సీ. సకలలోకప్రదీపకుఁ డగుపద్మినీ
            మిత్రవంశమున జన్మించె ననియుఁ
     జూచిన మగలైనఁ జొక్కెడు నట్టి సౌం
            దర్యసంపద సొంపు దాల్చె ననియు
     జనహృదయానందజననమై నెగడిన
            చతురతకల్మి నప్రతిముఁ డనియు
     మెఱసి యొండొంటికి మిగుల శౌర్యత్యాగ
            విఖ్యాతకీర్తిచే వెలసె సనియు

     వివిధవిద్యాపరిశ్రమవేది యనియు
     సరసబహుమానవిరచితశాలి యనియు
     మత్కృతీశ్వరుఁ డగుచున్న మనుమనృపతి
     సుభగుఁ గావించుటకు సముత్సుకుఁడ నైతి.”

అనుపద్యమువలనఁ దెల్ల మగుచున్నది. కావున ధనాపేక్షచేతఁ దిక్కన మనుమసిద్ధిరాజునకుఁ గృతి నొసంగి యుండలే దనుట స్పష్టము. ఏసంవత్సరమునఁ దిక్కన నిర్వచనోత్తర రామాయణమును రచించి మనుమసిద్దిరాజున కంకితముచేసెనో నిశ్చయముగాఁ దెలుపుట కాధారములేదుగాని భారతరచనకుఁ బూర్వము బహుసంవత్సరములకు, అనఁగా ముప్పదిసంవత్సరముల వయస్సులోపలనేరచించి యుండు నని స్పష్టముగాఁ జెప్పవచ్చును. అప్పటి కీకవిసత్తమునికీర్తి విద్వల్లోక మంతటను వ్యా పించి యుండలేదని చెప్పవచ్చును. మఱియును నతఁడు శ్రౌతస్మార్త క్రియాతత్పరుఁడై యున్నను క్రతుదీక్షను బూనియాచరించు నంతటి కర్మకుఁడుగా నున్నటులు గనుబట్టఁడు. భారత గద్యములోవలె 'బుధారాధన విరాజి తిక్కన సోమయాజిప్రణీతం'బని వ్రాసికొన్నట్లుగా వ్రాసికొనక నిర్వచనోత్తరరామాయణము గద్యలో 'బుధారాధనవిధేయ తిక్కన నామధేయప్రణీతం' బనిమాత్రము వ్రాసికొని యుండుటచేతనప్పటికిఁ గ్రతువులాచరించి యుండలేదని యూహింప వలసివచ్చుచున్నది. ఇది ప్రధమకావ్వ మగుటచేతనే కాఁబోలు 'నూత్నసత్కవీశ్వరులను భక్తిఁగొల్చి మఱివారికృషన్ గవితావిలాసవిస్తర మహనీయుఁడ నైతి నని తన వినమ్రభావముఁ దేటపఱచి యున్నను,

“చ. పలుకులపొందు లేక రసభంగము సేయుచుఁ బ్రాతవడ్డమా
     టల దమ నేర్పుచూపి యొకటన్ హృదయం బలరింపలేక, యే
     పొలమును గాని యెట్టిక్రమమున్ దమమెచ్చుగ లోక మెల్ల న
     వ్వులఁ బొరయన్' జరించుకుకవుల్ ధర దుర్విటు లట్ల చూడగన్."

అని కుకవినిరాసనమున కెడమిచ్చెను. అయిననిం దాతఁడు స్వాతిశయభావమును జూపక కుకవులమార్గమును మాత్రము నిరసించెను. ఇట్లు కుకవులమార్గమును నిరసించుటతో మాత్రము తృప్తి నొందియుండక తరువాతితెలుఁగుకవులకు నుపయుక్తములై సూత్రప్రాయములుగా నుండునట్లు,

"కం. తెలుఁగుకవిత్వముఁ జెప్పన్
     దలఁచినకవి యుర్థమునకుఁ దగమా
     టలు గొని వళులుం బ్రాసం
     బులు నిలుపక యొగిని బలిమిపుచ్చుట చదురె.,

"క. అలవడ సంస్కృతశబ్దము
    తెలుఁగుపడి విశేషణంబు తేటపడం గాఁ
    బలుకు నెడలింగవచనం
    బులు భేదింపమికి మెచ్చు బుధజనము కృతి౯."

"గీ. ఎట్టికవి కైనఁ దనకృతి యింపుఁ బెంపఁ
    జాలుఁ గావునఁ గావ్యంబు సరసులైన
    కవుల చెవులకు నెక్కినఁ గాని నమ్మఁ
    డెందు బరిణతిగలుగు కవీశ్వరుండు."

అనుపద్యములను జెప్పి సత్కవీంద్రమార్గమును గూడఁ దెలిపియున్నాఁడు. మఱియు నుత్తరరామాయణము రచించుటకుం గలకారణ మీవిధముగాఁ జెప్పి యున్నాడు.

"క. ఎత్తఱినైనను ధీరో
    దాత్తగుణోత్తరుఁడు రామధరణీపతి స
    ద్వృత్తము సంభావ్య మగుట
    నుత్తరరామాయణోక్తియుక్తుఁడ నైతి౯."

తిక్కన తననిర్వచనకావ్యములోని కవిత్వరీతి పండితుల కానందకరమై యుండు ననిసూచించుటకో యనఁ గవిత్వపద్దతి యిట్లుండవలయు నని యీక్రింది పద్యములలోఁ దనప్రతిజ్ఞావాక్యములనుగూడ నుడివి యున్నాఁడు.

"ఉ. జాత్యనుగామి నొప్పయినసంస్కృత మెయ్యడఁ జొన్ప వాక్యసాం
     గత్యము సేయుచో నయినగర్వముతోడుగఁ జెప్పి పెట్ట దౌ
     ర్గత్యముఁ దోపఁ బ్రాసముప్రకారము వేఱగునక్షరంబులన్
     శ్రుత్యనురూప మంచు నిడ శూరుల కివ్విధ మింపుఁ బెంపదే."

"క. లలితపదహృద్యపద్యం
    బు లనపదార్థంబు ఘటితపూర్వాపరమై
    యలతియలంతి తునియలుగ
    హలసంధించిన విధంబు నమరగ వలయు౯."

ఇట్లు తిక్కన కుకవినిందను జేసియు, సత్కవీంద్రమార్గమును దెలిపియు, కవిత్వపద్దతినిగూర్చి ప్రతిజ్ఞావచనములను బలికియును సంతృప్తినిఁ బడయఁ జూలక తనకావ్యము స్వగుణముచేతఁ గాకపోయినను తనతాత యైనమంత్రి భాస్కరుని సారకవిత్వముచేతనైనను లోక మాదరించు నని యీ క్రిందిపద్యములోఁ జెప్పి యున్నాఁడు.

"గీ. సారకవితాభిరాము గుంటూరిభుని
    మంత్రిభాస్కరు మత్పితామహునిఁ దలఁచి
    యైన మన్ననమెయి లోక మాధరించు
    వేఱ నాకృతిగుణములు వేయు నేల?"

మొదట మనుమసిద్ది తన్నుమామా యని పిలుచుచున్నందులకుఁ గృతి నిమ్మని యడుగుటయు, అతనిపలుకుఁ దనకునింపు పుట్టించుటయు, తరువాత మనుమసిద్ది కులశీలరూపస్వభావాదులు దలపోసికొని కృతి నొందుట కర్హుండని మనస్సు సమాధానపఱచు కొనుటయు, కుకవినిందఁ జేసియు, కావ్యరచ నావిధానమును దెలిపియు, సత్కవీంద్రమార్గమును సూచించియు, ఉత్తరరామాయణమును రచించుటకుఁ గల కారణమును వ్యక్తీకరించియు, కవిత్వపద్ధతిని గూర్చి ప్రతిజ్ఞావాక్యములను నుడివియుఁ దృప్తిం గనఁజూలక లోక మెట్లాదరించునో యన్న సంకోచము పీడింపఁ దనతాతయైన మంత్రి భాస్కరుని సారకవిత్వ మహిమము నైనఁ దలంచి మన్ననమెయి లోకమాదరించునని సమాధానము చెప్పుకొని తృప్తిగాంచుటయు మొదలగు వానిని బరిశీలించిన పక్షమునఁ దిక్కన రచించినకావ్యములలో నిదిప్రథమకావ్య మని తప్పక స్పురింపఁ గలదు.

తిక్కన తనతాతయైనమంత్రిభాస్కరుని గ్రంథములం బేర్కొన కుండుట మిక్కిలిశోచనీయమైన విషయముగా నున్నది. ఇట్లే మనుమసిద్దిరాజు తండ్రియైన తిక్కరాజునకుఁ గవిసార్వభౌమ బిరుదాంకముగల దని చెప్పినాఁడుగాని యాతఁడు రచించినగ్రంథము లెవ్వియో దెలిపినవాఁడు గాఁడు. నిర్వచనోత్తరరామాయణమును గూర్చి యాంధ్రకవుల చరిత్రమునం దిట్లున్నది.

"తక్కిన తెనుఁగుపుస్తకములవలెఁ గాక రమువంశాదికావ్యముల వలె దీని నీకవి నడుమనడుమ వచనములుంచక సర్వమును పద్యములుగానే రచియించెను. ఈతఁడు రచించిన భారతమువలె నీయుత్తరరామాయణ మంత రసవంతముగాను ప్రౌఢముగాను లేక పోయినను, పదివాక్యసౌష్టవము గలిగి మొత్తముమీద సరసముగానే యున్నది. ఇది బాల్యమునందు రచియింపఁ బడినదగుటచే నిట్లుండి యుండును. ఈగ్రంథమునందు పదకాఠిన్యమంతగా లేకపోయినను బహుస్థలములయం దన్వయ కాఠిన్యము గలదు. ఇందలికథ సంస్కృతములో నున్నంతలేక మిక్కిలి సంగ్రహపఱుపఁబడినది. శైలి పలుచోట్ల నారికేళపాక మనియే చెప్పవచ్చును. అందుచేతనే యీగ్రంథము భారతమువలె సర్వత్ర వ్యాపింప కున్నది. ఇతఁడు పదియాశ్వాసముల గ్రంథము వ్రాసినను పుస్తకమును మాత్రము ముగింప తేదు. రామనిర్యాణ కథను జెప్పుట కిష్టములేక గ్రంథపూర్తి చేయలేదని పెద్దలు చెప్పుదురు. తరువాతఁ గొంతకాలమునకు మిగిలిన భాగము నేకాశ్వాసముగా రచియించిన జయంతిరామభట్టు తిక్కనసోమయాజి మనుమరాజున కిచ్చినట్టుగా సరాంకితముచేయక తాను జేసిన కడపటి యాశ్వాసమును భద్రాద్రి రాముని కంకితము చేసెను."

నిర్వచనోత్తర రామాయణము పదవాక్యసౌష్టవము గలిగి మొత్తముమీఁద సరసముగానే యున్న దని యొప్పుకొనుచు నాంధ్రకవి చరిత్రకారుఁడు తిక్కనకృతభారత మంత రసవంతముగాను ప్రౌఢముగాను లేదనుటవింతగా నున్నది. దీనికిఁ గారణము బాల్యమునందు రచించుటయఁట. పదకాఠిన్యము లేదఁటగాని యన్వయకాఠిన్యము గలదఁట. ఇందలికథ సంస్కృతములో నున్నంతలేక మిక్కిలి సంగ్రహపఱుపఁబడుటయుఁ శైలి పలుచోట్ల నారికేళపాకముగా నుండుటయు నీగ్రంథము భారతమువలె సర్వత వ్యాపింప కుండుటకుఁ గారణములఁట. ఇదియంతయు భ్రాంతిమూలము. ఈ గ్రంథమును భారతముతోఁ బోల్ప సరికాదు. తిక్కన వ్రాసినయవతారిక వీరిభ్రాంతికిఁ గారణ మైనట్లు గన్పట్టుచున్నది. ఇది ప్రథమ కావ్వమగుటచేత తిక్కన పీఠికలోఁ బలుపోకలఁ బోయెనుగాని మఱియొండు గాదు. ఇది బాల్యము వీడి యౌవనము ప్రవేశించిన తరువాత వ్రాసిన ప్రౌఢకావ్యమెగాని యప్రౌఢకావ్యముగాదని పీఠికలోని విషయములే వేనోళ్ళఁ జాటుచున్నవి. వివిధవిద్యాపరి శ్రమవేదియైన ప్రభువు (కృతిపతి) అప్రౌడుఁడైన యొకబాలకవిని 'మామా' యని పిలుచుటయుఁ బిలుచు చుండెఁ బో 'మామా' యనుచున్నందుకుఁ గృతి నిమ్మని యడుగుటయు సంభవము గాదు. వేయు నేల? నిర్వచనోత్తర రామాయణములోని యవతారికయే మిక్కిలి ప్రౌఢముగా నున్నది. అవతారికలోనే యింతప్రౌఢిమను జూపఁగలిగినవాడు బాలకవి యెట్లగును? ఇతఁడు,

"క. వచనము లేకయ వర్ణన
    రచియింపఁగఁ గొంతవచ్చుఁ బ్రౌఢులకుఁ గథా
    ప్రచయము పద్యములన పొం
    దుచితముగఁ జెప్ప నార్యు లొప్పిద మనరే.”

అనుపద్యమును వ్రాయుటయే వచనము లేకుండ వర్ణనసేయుట ప్రౌఢకవిలక్షణముగా భావించె ననుటకు నిదర్శనముగా నున్నది.

మఱియును 'అమలోదాత్తమనీష, నేనుభయకావ్య ప్రౌఢిశిల్పమునం బారగుఁడం గళావిదుఁడ' నన్నపలుకు ప్రౌఢకవి నోటనుండి వినంబడునుగాని యప్రౌఢుఁడగు బాలకవి నోటనుండి వినంబడునా? ఉత్తరరామాయణము రచించుటయందుఁ దిక్కనయుద్దేశము సరసమైన కావ్యమును వ్రాసి మనుమసిద్ధికిఁ గృతినొసంగవలయు ననియెగాని మక్కికి మక్కిగా సంస్కృతమునకు సరియైనతెలుఁగు చేయవలయుననిగాదు. అందుకొఱకే తిక్కనకథను సంస్కృతములోనుండి గొన్నిమార్పులతోఁ దీసికొని యనుచితములుగాఁ దోచినవానిని ద్రోసిపుచ్చి యుచితములనితోఁచిన వానిలోఁ గొన్నిటిని పెంచి కూడ వ్రాసెను. నిర్వచనోత్తర రామాయణములోని కొన్ని ప్రౌఢభాగము లన్వయ కాఠిన్యములుగఁ గన్పట్టవచ్చును. అక్కడక్కడ కొన్నిపద్యములు చూచిన శైలి నారికేళపాకముగాఁ గన్పట్టవచ్చును. కాని గ్రంథమును సాంతముగాఁ జదివినవారికి శైలి ద్రాక్షాపాకమును గదళీపాకము నై ప్రౌడముగానే కన్పట్టుచుండును. ఈకావ్యమునందు రామనిర్యాణకథను జెప్పుటకు భీతిల్లి తుదియాశ్వాసమును విడిచిపెట్టె ననికొందఱుపెద్దలు చెప్పుదు రని యట్లు భావించుట తగునా? అట్లయ్యెనేని తిక్కనసోమయాజి భారతములో స్వర్గారోహణపర్వములోఁ గృష్ణనిర్యాణమును, అటుపిమ్మటఁ బాండవులలోకాంతర గమనమును జెప్పుటకు నేల భీతిల్లి విడిచి పెట్టలేదు? తుదియాశ్వాసము విడిచిపెట్టుటకు మఱియొకకారణ మేదియైన యుండవలెనుగాని యిది కారణముగాదు. ఆతుదియాశ్వాసమును దెనిగించిన జయంతిరామభట్టయినను తాను దానిని తెలిగించుటకుఁగారణమును జెప్పినవాఁడు గాఁడు. కొన్నివిషయములలోఁ బాపరాజకవికృత మైనయుత్తర రామాయణమున కన్న రసపుష్టి కలదిగా నున్నది. ఇదిభారతము వలెఁ బ్రౌఢముగా లేకపోవుటచేతనే సర్వత్రవ్యాపింపకున్నదట. అట్లయినయెడల నత్యుత్తమకావ్యము లనియాంధ్రకవిచరిత్రకారునిచేఁ బొగడ్తలు గాంచినయుత్తరహరివంశాది కావ్యములు సర్వత్ర వ్యాపింప కుండుటకుఁ గారణమేమి? పంచమవేద మని పూజింపఁ బడెడు భారతమునకుఁ గలవ్యాప్తి యీనిర్వచనకావ్యమునకే గాదు మఱి యేకావ్యమునకును రాదు. మనయాంధ్రదేశములో భారత భాగవతరామాయణములకుఁ గలవ్యాప్తి యేయుత్తమకావ్యములకుఁ గలదు? కవితారచనమునకు నేనియమములను విధించెనో యానియమములను బాటించియే తిక్కన తననిర్వచనోత్తరరామాయణమును బ్రౌఢముగా రచించి వాసికెక్కినాఁడు. అందువలననే దీనిని రచించిన స్వల్పకాలములోపలనే యాంధ్రప్రపంచమునఁ గవితాసామ్రాజ్య పీఠము నథిష్టించి జగత్పూజ్యుఁ డయ్యెను. ఈనిర్వచనోత్తరరామాయణము రంచిచునాటికిఁ దిక్కన శివభక్తి పరాయణుఁడై యుండెను గాని తరువాత యద్వైతవాది యై యభేద వాదమును బోషించెను.