Jump to content

తిక్కన సోమయాజి/ఆఱవ యధ్యాయము

వికీసోర్స్ నుండి


ఆఱవ యధ్యాయము

కాటమరాజ మనుమసిద్ధిరాజుల యుద్ధము

ఖడ్గతిక్కన విక్రమ పౌరుషాదులు.

మనుమసిద్ధిరాజు మరణకాలమునాటికిఁ బాకనాడును మాత్రము పరిపాలించు చుండెను. మనుమసిద్ధివలనఁ బొందిన యైశ్వర్యమును మాత్రమేగాక కవితిక్కన గణపతిదేవచక్రవర్తివలన నెనిమిదియూళ్లను విశేషమైన యైశ్వర్యమును బడసి యుండెను. అయినను గడవఱకుఁ గవితిక్కనయు, ఖడ్గతిక్కనయు మనుమసిద్దిరాజు విశ్వాసమునకుఁ బాత్రులై యొప్పి యుండిరి. ఖడ్గతిక్కన తనకృతజ్ఞతను మఱువక కడపట మనుమసిద్దిరాజునకును కాటమరాజునకును జరిగినయుద్దములో వీరశయనము గాంచెను. ఈవిషయము కాటమరాజుకథవలన మనకు వ్యక్తమగుచున్నది. విద్యావితరణ పౌరుషాదులయందుఁ గవితిక్కన యెంతప్రఖ్యాతుఁడో వీర్యవితరణపౌరుషాదుల యందు ఖడ్గతిక్కన యంతప్రఖ్యాతుఁడుగ నుండెను. ఇతని మరణకాలమునఁ దల్లిదండ్రులు వృద్ధులై సజీవులుగ నున్నట్లే గనంబడుచున్నది. ఆడువారిలోఁ గాని మగవారిలోగాని కొట్టరువు వారికుటుంబమునఁ బిఱికితన మనుమాట వినరాదనుటకు. ఖడ్గతిక్కననుగూర్చినకథయె సాదృశ్యముగా నున్నది. ఆకథనే నేనిచట సంగ్రహముగాఁ దెలుపుచున్నాఁడను.

పసులమేపుబీళ్లనిమిత్తమై కాటమరాజునకును మనుమసిద్దిరాజునకును వివాదము పొసఁగి మహాయుద్ధము జరిగినటులు గాటమరాజుకథవలనఁ దెలియుచున్నది. పుల్లరి యిచ్చుపద్దతి పై గాటమరాజు తనపసులను మనుమసిద్దిరాజు మేతబీళ్లలో మేపుకొని యక్కడఁ దనకోడెదూడలలో నేదోనష్టము సంభవించినదన్న కారణమునఁ పుల్లరి నీయక యెగఁ గొట్టెను. దాని పై మనుమసిద్దిరాజు పసులఁ బోనీయక యాటంకపఱచెను. ఉభయులయుద్ధమున కిదిముఖ్య కారణము. ఈ యుద్ధకథనము ద్విపదలో రామరావణయుద్ధముగ వర్ణింపఁ బడినది. మనుమసిద్ది రావణుఁడుగఁ బోల్పఁ బడియెను. కాటమరాజుతండ్రి పెద్దిరాజు. వానితండ్రి వల్లురాజు. ఇతఁడాత్రేయగోత్రోద్భవు లైన యాదవులసంతతిలోని వాఁడుగఁ జెప్పఁ బడియెను. వల్లురాజు కనిగిరిసీమలోనియాలవలపాడున కధిపతిగనుండెను. కాటమరాజు కనిగిరిలోని యెఱ్ఱగడ్డపాడున కధిపతిగ నుండెను. ఒక సంవత్సరమున దేశమున ననావృష్టి సంభవించెను. యాదవు లనంబడుగొల్లవాం డ్రెల్లను దమతమపసులమందలను దోలుకొని దక్షిణమునకువచ్చి మనుమసిద్దిరాజుయొక్క పసులబీళ్లను గొన్నిటిని పుల్లరికిఁ గైకొని పసులను మేపుకొని పుల్లరి చెల్లింపకయె వెడలిపోయిరి. అందుపై మనుమసిద్దిరాజునకుఁగోపము వచ్చి తిక్కనాదిమంత్రివర్గముతో నాలోచించి అన్నంభట్టను బ్రాహ్మణుని కాటమరాజుకడకు రాయబారినిగాఁ బంపిరి. కాటమరాజు పైనిజెప్పినకారణమును బురస్కరించుకొని పుల్లరి నీయక తగవులు పెట్టెను. అన్నంభట్టుప్రయత్నము నిష్క్రయోజన మయ్యెను. అతఁడు తిరిగివచ్చి యాసమాచారమంతయు మనుమసిద్ధిరాజునకు నివేదించెను. మనుమసిద్ధిరాజున కాగ్రహమువచ్చి కాటమరాజును దండించి పుల్లరి గైకొని కార్యమును సాధించుకొని రమ్మని ఖడ్గతిక్కనను నియమించెను. అప్పుడు రాజునాజ్ఞ శిరసావహించి సైన్యములను సమకూర్చెను. తిరునామాలతిప్పరాజు. శ్రీకంఠరాజు, పెదనేగిచొక్కరాజు, పెదవరదరాజుఁ అర్లుకొండ అచ్చిరాజు, ఆదివన్నెమన్నెరాజు, గయికొండగంగరాజు, ఉర్లకొండసోమన్న , ఉదయాద్రి ఉమ్మయ్య, చెన్నపట్టణము చంద్ర శేఖరుఁడు, దేవముని వెంగళయ్య, పట్టుకోట బసవరాజు, కాళహస్తి పాపతిమ్మరాజు, వెలకంచి వెంగళపతిరాజు, ప్రభగిరిపద్మశేఖరుఁడు, మొదలుగాఁగల యోధవరు లనేకులు మనుమసిద్దిపక్షమునఁ దోడ్పడ నేతెంచిరి. ఈ యోధులకందఱకు నాయకుఁడై ఖడ్గతిక్కన సిద్దిరాజు సేనలను నడిపించుకొని కాటమరాజుపై దండెత్తి పోయెను. మనుమసిద్ధితనపైదండెత్తిరా నున్నాఁడని ముందుగాఁ దెలిసికొని కాటమరాజు సయితము సైన్యములను సమకూర్చుకొని సిద్ధముగా నుండెను. పల్నాటిప్రభు వయిన పద్మనాయఁడును, పల్లికొండప్రభువయిన చల్లాపిన్నమనాయఁడును, దొనకొండ అయితమరాజు ఎఱ్ఱయ్య, భట్టావులరాజు, కరియావులరాజు, వల్లభన్న, నాచకూళ్లనాయఁడు, నేతిముద్దయ్యనాయఁడు, పాచయ్యనాయఁడు, ముమ్మయ్యనాయఁడు, పుత్తమరాజు మొదలుగా గొందఱుయోధులును గాటమరాజునకుఁ దోడ్పడ వచ్చిరి. ఈ సేనకంతకును, చిన్నమనాయని మంత్రియు నారాధ్య బ్రాహ్మణుఁడునగు బ్రహ్మరుద్రయ్య నాయకుఁడై యెదురుగాఁ బోయి పాలేటియొడ్డుననున్న పంచలింగాలకొండకడ నెదుర్కొనియెను. అప్పుడుభయపక్షముల వారికిని ఘోరమైన యుద్ధముజరిగినది. తుదకుఁ దిక్కన సైన్యమంతయు హతముకాఁగా నతఁడొక్కఁడును వీరాధి వీరుఁడై రణరంగమున నిలువఁబడి యుండుటను జూచి ప్రతిపక్షయోఁధుడైన పిన్నమనాయఁడుచూచి,

"కం. పోరునిలుపు మోయిభూసురోత్తముఁ డ
     సరిగాదు మాతోడ సమరంబుఁ జేయ
     అగ్రజుల్ మీరు యాదవులము బేము
     ఉగ్రము మామీద నుంపంగ రాదు."

అని పలికె నఁట, అందుపైని తిక్కన తనతోనున్నసైన్యమంతయు నాశమయి నందులకుఁ జింతించి మరల సైన్యమును గొని వచ్చి యుద్ధము చేసెదం గాకయని గుఱ్ఱమును ద్రిప్పుకొని పురంబునకు వచ్చెనఁట. పౌరజనంబులు పరాజితుఁడై పారి వచ్చిన తిక్క యోధునిగాంచి పకపకనవ్వువారును, కేరడమ లాడువారును నై భయభక్తులువిడిచి వర్తించి మనస్సునకు జింతఁ గలిగించిరి. పౌరజనంబులు మాత్రమె గాదు. ఇంటికిఁ బోయినతోడనే వృద్దుఁడై మంచమునఁ బడియున్నతండ్రి సిద్ధనామాత్యుఁడు సయితము కోపము దెచ్చుకొని,

"సీ. రణరంగమున మోహరంబులు పొడఁగని
             ప్రాణంబు దాఁచిన పందగజనభు
    విజయాధిపునిదాడి వెనుకొని తిరుగక
             వెస దప్పివచ్చిన దిగ్గజంబ
    పోరఁ జాలక యోడి మారుమాటల మాని
             మంచాన కొఱఁగిన మత్తగజమ
    పెనుపల్లిచెఱువులో బిరుదు లన్నియు రొంపి
             గ్రుంగంగ వచ్చిన కుంజరంబ

ఆ. నేఁడు మొదలుచేసి నెల్లూరిసీమలోఁ
    బ్రగడతనము మాని మగిడి తఱలఁ
    బూరి గఱచి తిక్క! భూతంబుసోకిసఁ
    బాఱువానిరీతిఁ బంద వైతి."

అని యుపాలంభ మొనర్చె నఁట. అంత తిక్కయోధుఁడు తండ్రి పోటుమాటలకు సైరించి స్నాసమునకుఁ బోఁగా వీరపత్నియు, వీరమాతయు నగుభార్యచానమ్మ స్త్రీల కుంచినట్లుగా రహస్యస్థలమున నీళ్లబిందె నుంచి దానికి నులకమంచమును చాటుపెట్టి దానిమీఁదఁ బసపుముద్ద యుంచెనఁట. తనభార్య చెయ్దమును జూచి సిగ్గుపడి తిక్కన ఖేదపడుచుండఁగాఁ జూనమ్మ భర్తను జూచి,

"క. పగఱకు వెన్నిచ్చినచో
    నగరే నినుమగతనంపునాయకు లందున్
    ముగురాడువార మైతిమి
    వగపేటికి జలక మాడవచ్చినచోట౯."

అని యెకసక్కెము లాడె నఁట. తరువాత స్నానముచేసి భోజనముసకుఁ బోయి భుజింపునపుడు వీరమాతయగు ప్రోలమ్మ కుమారునకు అన్నములోఁ బాలుపోయునప్పుడు పాలు విఱిగిపోవఁగా నామె సయితము పరిహసముగా,

"క. అసదృశముగా వరివీరులఁ
    బసమీఱఁగ గెలువలేక పందక్రియ న్నీ
    వసి వైచి నిఱిగివచ్చినఁ
    బసులు న్విఱగినవి తిక్క ! పాలు న్విఱిగె౯."

అని పలికె నఁట. ఇఁకఁ జెప్పఁ దగిన దేమున్నది. ఏఁబ దేండ్లు నిండిన యాయోధవరునకు నాపలుకు లెల్లను ములుకులై నాట మానాభిమానములు ముప్పిరిగొనఁ దాను జేసినపనికిఁ బశ్చాత్తప్తుఁడై 'నన్నుఁ బిఱికిపందనుగా వీరుదలంపు చుండిరి. ఈసారి మరలఁ బోయి శాత్రవులను మార్కొని జయము గొందును. ఆయ్యది సంప్రాప్తముగాదేని ప్రాణం బుండుదనుకఁ బోరాడి వీరస్వర్గంబు నైనఁ జూఱఁ గొందు. మానాభిమానములు గలశూరుఁ డిట్టిరోతబ్రదుకుఁ బ్రదుకం జాలఁడు' అని తలపోసుకొని యెవరెన్ని విధములవారించినను వినక సిద్దిరాజు నొడంబఱిచి కావలసినసైన్యములం గొని సంగరోత్సాహియై పోయి శాత్రవులను మార్కొని ప్రచండమైనయుద్ధము చేసెను. ఆతని యుద్ధక్రమము నిట్లొకకవి యభివర్ణించి యున్నాఁడు.

"చ. పదటున వాజి రాహుతులపై దుమికింపుచుఁ దిక్కఁ డార్చిన౯
     బెదరి పరిభ్రమించి కడుఁబిమ్మట వీరులు భీతచిత్తులై
     యదెయదె డాలు వాల్మెఱుఁగు లల్లవె యల్లదె యాతఁడంచన౯
     గొదుకక యాజిచేసె రిపుకోటుల కందఱ కన్నిరూపులై."

ఇట్లే పూర్వము బ్రాహ్మణుఁ డగునండూరి కొమ్మనామాత్యుడు క్రొత్తచర్ల (కొచ్చెర్ల కోట) పరిసరభూములందుఁ గటకరాజుతోఁ బోరాడి చూపినయుద్ధకౌశలమును మంచనకవి తనకేయూర బాహుచరిత్రమునందు,

సీ. నెలకట్టెవాటునఁ జెలఁగి రెంటిని మూఁటిఁ
          గూడ గుఱ్ఱంబులు గుదులుగ్రుచ్చు,
   బ్రతిమొగం బగునరపతుల కత్తళమునఁ
          గడిమ మై వీపులవెడలఁ బొడుచుఁ,
   బందంపుగొఱియలపగిది నేనుంగుల
          ధారశుద్దిగ ససిధార దునుముఁ,
   అదియించుఁ బగిలించుఁ జేతులతీటవో
          వడిగాండ మేసి మావతులతలలు,

గీ. తలపుడికి వ్రేసి మావంతుతలలు శత్రు
   రాజశిరములు ద్రొక్కించు రాఁగెఁ దిరుగ
   నాగె నుబ్బెడు తనవారువంబుచేత
   మహితశౌర్యుండు కొమ్మనామాత్యవరుఁడు."

అని మిక్కిలి మనోహరముగా వర్ణించి యున్నాఁడు. ఆకాలమునం దిట్లే బ్రాహ్మణమంత్రివర్యులు రాజ్యతంత్రమునందే గాక యుద్ధతంత్రము నందును బ్రవీణులై యుండి రనుట కిట్టిదృష్టాంతముల నెన్నియైన యాంధ్రచరిత్రము నుండియు, సారస్వతము నుండియుఁ జూపఁ గలము.

ఇట్లు ప్రచండవిక్రమార్కుఁడై ఘోరసంగ్రామంబున శత్రుసేనను మార్కొని పీనుంగుపెంటలు గావించుచు రణకేళి సల్పుచుండ యాదవవీరులును వెనుదీయక మహోదగ్రులై తిక్కనసైన్యము పైఁబడి కత్తులఁ గఠారుల నీటెలం బొడిచి చక్కాడుచుఁ బెద్దకాలంబు పోరాడ నుభయసైన్యంబు లం బెక్కండ్రు వీరభటులు నేలం గూలిరి. అంతటఁ బిన్నమనాయఁడు ఖడ్గతిక్కనను సమీపించి "ఓవిప్రోత్తమా! యుద్ధముచేయుట బ్రాహ్మణునకుఁ బాడి గాదు. మిమ్ముం జంపిన మాకు బ్రహ్మహత్యాదోషంబు వాటిల్లు ననినామనంబు తల్లడిల్లు చున్నది. తొలంగుట మీకును మాకునుగూడ శ్రేయస్కరం బనియూహింతు” నని గొంతెత్తి గంభీరవాక్యములు పలుకఁ దిక్కనయుఁ “ఓ నాయఁడా! రణశూరుఁడవై బ్రాహ్మణక్షత్రియుండ నగు నాతోడ యుద్ధముసేయఁ జాలక పందక్రియ ధర్మ పన్నంబు లేల చదివెదవు? వానిం గొన్ని నేనెఱుంగుదుం గాని, వీరుండ వౌదువేని కదలక నిలుచుండి యుద్ధముచేసి చెతనయ్యెనేని నా ప్రాణంబులు గొని విజయపతాక మెత్తుము. కాదేని శరణుజొచ్చి మాపుల్లరి మాకుం బెట్టుము." అని 'హెచ్చరింపఁ బిన్నమనాయఁడు బ్రహ్మహత్యాదోషమునకు వెఱచి యేమిచేయుటకును జేతులును గాళ్ళు నాడక నిచ్చేష్ఠితుఁడై చూచుచుండ, వానిమంత్రి బ్రహ్మరుద్రయ్య యచటికేతెంచి "తిక్కన నేఁ దలంపడి పోకార్చెద నీవటుండు"మని తన ప్రతివీరునిపై హయమును బఱపి యుద్ధము చేయఁగా నిరువుర గుఱ్ఱంబులు నీటెపోటుల నేలం గూల నిరువురును గత్తులు దూసి “హరహరా" యని యభిమన్యులక్ష్మణకుమారులవలె ద్వంద్వయుద్ధముసకుఁగలియంబడి యుభయ సైన్యంబులవారును నివ్వెఱపడి చూచుచుండఁ బెద్దయుం బ్రొద్దు పోరాడి తుదకు నేల కొఱంగిరి. ఆపాటుంగని తిక్కనసైనికులు హతశేషులైన వా రీక్రిందివిధముగాఁ జెప్పుకొని యేడ్వసాగిరఁట,

"సీ. ధైర్యంబు నీమేనఁ దగిలియుండుటఁ జేసి
           చలియించి మందరాచలము తిరిగె,
    గాంభీర్య మెల్ల నీకడనయుండుటఁ జేసి
           కాకుత్థ్సుచే వార్థి కట్టువడియె,
    జయలక్ష్మి నీయురస్థ్సలినె యుండుటఁ జేసి
           హరి పోయి బలిదాన మడుగుకొనియె,
    నాకార మెల్లనీయందె యుండుటఁ జేసి
           మరుఁడు చిచ్చునఁబడి మడిసి చనియెఁ,

గీ. దిక్క దండనాథ దేవేంద్రపురికి నీ
   వరుగు టెఱిఁగి సగము తిరుగు టుడుగు
   నబ్ధి కట్టువిడుచు నచ్యుతు కొదమాను
   మరుఁడు మరలఁగలుగు మగలరాజ."

అని తనసైనికు లెల్ల హాహాకారములు సేయుచుండఁ బ్రాణ ములు దేహమును విడిచిపోయినవిధము నాకవివర్యుఁడే యిట్లు చెప్పి యున్నాఁడు.

"సీ. నందిని బుత్తెంచె నిందుశేఖరుఁడు నీ
            వన్న యేతెమ్ము తారాద్రికడకు
    గరుడుని బుత్తెంచె నరహరి రావయ్య
            వడి సిద్ధతిక్క! కైవల్యమునకు
    హంసను బుత్తెంచె నజుఁడు నీడకు ను
            భయకులమిత్ర రా బ్రహ్మసభకు
    నైరావతముఁ బంపె నమరేంద్రు డిప్పుడు
            దివముస కేతెమ్ము తిక్కయో ధ,

గీ. యనుచు వేఱువేఱ నర్థితోఁ బిలువంగ
   వారు వీరు గూడ వచ్చి వచ్చి
   దివ్యయోగి యైనతిక్కనామాత్యుండు
   సూర్యమండలంబుఁ జొచ్చి పోయె."

మఱియును విక్రమసింహపుర నివాసులైన పౌరులెల్లరును ఖడ్గతిక్కనమరణవార్తను విని తాము వానిని బరిహసించి యపచారము చేసినందులకుఁ బశ్చాత్తప్తు లగుచు నాతనిగుణగణంబులు దలపోసికొని దుఃఖాక్రాంతచిత్తులై,

"ఉ. వెన్నెలలేని రాత్రియు రవిప్రభలేనిదినంబు నీరులే
     కున్న సరోవరంబు కడు నొప్పగుదీపములేక యున్నయిల్లు పై
     విన్న 'దనంబు నొందె మనవిక్రమసింహపురంబు చూడఁగాఁ
     బున్నమచంద్రుఁబోలు మనపోలమతిక్కఁడు లేమినక్కటా!

అని పరిపరివిధముల విలపించి రఁట. ఆహా! వీరవర్వులయు కవివర్యులయు చావు లెవ్వరికి నేడ్పుఁ బుట్టింపవు? తరువాత మనుమసిద్ధియు సైన్యసమేతముగాఁ గాటమ రాజుపై డండెత్తిపోయి యుద్ధముచేసి వీరస్వర్గమును జూఱఁ గొనియెను. అటుపిమ్మట దానుబొందినగాయములవలనఁ గాటమరాజుగూఁడ స్వర్గస్థుఁ డయ్యె నఁట. పుల్లరినిగూర్చినయుద్ధ మీవిధముఁ బర్యవసిత మయ్యెను. మనునుసిద్ధి స్వర్గస్థుఁడైనపిమ్మట నీదేశమును గాకతీయాంధ్ర చక్రవర్తిసైన్యాధిపతి యగుదాదినాగన్న నాగదేవమహారా జనునామముతో గొంతకాలము పరిపాలించెను.