తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 183

వికీసోర్స్ నుండి


రేకు: 0183-01 లలిత సం: 02-415 అద్వైతము

పల్లవి:

దోమటి నింతెరఁగరా తొల్లిటివారు
వామదేవవసిష్ఠవ్యాసాదులు

చ. 1:

తానే దైవమైతే తపమేల జపమేల
పూని సారెఁ బూజించే పూజలేల
కూను వంగి యింటింటఁ గోరనేల వేఁడనేల
యీనెపాన లోకమెల్లా నేలరాదా తాను

చ. 2:

తగఁ దా స్వతంత్రుఁడై తే దరిద్రదుఃఖములేల
నొగిలి వ్యాధులచేత నొవ్వనేల
నగుఁబాటులైన జననమరణములేల
ముగురువేల్పులదండ మొనచూపరాదా

చ. 3:

శ్రీవేంకటేశుఁడే శేఖరపు దైవమని
సావధానుఁ డితనికి శరణుచొచ్చి
భావములోపలఁ దనపాపబంధములఁ బాసి
తావుల నాతనికృప దండ చేరరాదా


రేకు: 0183-02 గుండక్రియ సం: 02-416 శరణాగతి

పల్లవి:

అవియు నాకుఁ బ్రథమాచార్యులు
తవిలి యీనెపము మిముఁ దలఁపించుఁగాన

చ. 1:

ధనవాంఛ మతిలోనఁ దగిలినప్పటివేళ
దనుజారి మీమీఁద దలఁపు గలుగు
పొనిగి భయదుఃఖములఁ బొరలినప్పటివేళ
పనివూని మీమీఁది భక్తి గలుగు

చ. 2:

చెలఁగి పాపములు మించినవేళ హరి మీ-
నలువు నామోచ్చారణంబు గలుగు
బలిమి భవరోగముల బడలినప్పటివేళ
వలుమారు మీసంప్రార్థనలు గలుగు

చ. 3:

ఇన్నిటాఁ దొలఁగి మిము నెరిఁగి కొలిచినవేళ
మన్ననల పరిణామంబు గలుగు
వున్నతపు శ్రీవేంకటోత్తముఁడ మిము నెదుటఁ
గన్న యీవేళ సౌఖ్యంబులే కలుగు


రేకు: 0183-03 లలిత సం: 02-417 వైష్టవ భక్తి

పల్లవి:

ఈతని మరచివుంటి మిన్నాళ్లును
యీతల నేఁడెచ్చరించె నీతఁడే పో విష్ణుఁడు

చ. 1:

తల్లియై పోషించు తండ్రియైరక్షించు
వుల్లపు బంధువుఁడై వొడ లరయు
మెల్లనె దాతై ఇచ్చు మెలుఁతయై యాదరించు
యెల్లవిధబంధువుఁడు యీతఁడే పో విష్ణుఁడు

చ. 2:

యేలికయై మన్నించు నిష్టుఁడై బుద్ధి చెప్పు
చాలుమానిసియై యంచలఁ దిరుగు
బాలుఁడై ముద్దుచూపు ప్రాణమై లోన నుండు
యీలాగుల బంధుఁ డీతఁడే పో విష్ణుఁడు

చ. 3:

దేవుఁడై పూజగొను ద్రిష్టిగోచరమై
శ్రీవేంకటాద్రిమీఁద సిరు లొసగు
తావై యెడమిచ్చు తలఁపై ఫలమిచ్చు
యీవల నావల బంధుఁడీతఁడేపో విష్ణుఁడు


రేకు: 0183-04 లలిత సం: 02-418 అధ్యాత్మ

పల్లవి:

వీదిలోన నదేకదే విష్ణుపదము
ఆదెసనే పాయకుండు నాధిమూలము

చ. 1:

చూచేటి చూపులకును సూటియైన మొదలేదో
యేచి వినుకలిమర్మ మెందు దాఁకీనో
వాచవిచవులు చూచే వంటశాల చోటేదో
ఆచాయనే వుండు నాదిమూలము

చ. 2:

పూఁప తలపోఁతలకు పుట్టినయి ల్లది యేదో
పైపై నూర్పులు నిలువఁగఁ జోటేదో
మాపులు నిద్రించువేళ మరచేటి చోటేదో
ఆపొరుగుననే వుండు నాదిమూలము

చ. 3:

నేరిచిన విద్యలెల్లా నించి దాఁచేచోటేదో
కోరని యానందముకొన యేదో
ఆరయ శ్రీవేంకటేశుఁ డాడనే పాయక వుండు
ఆరితేరి నాతఁడీతఁ డాదిమూలము


రేకు: 0183-05 బౌళి సం: 02-419 భగవద్గీత కీర్తనలు

పల్లవి:

దేహి నిత్యుఁడు దేహము లనిత్యాలు
యీహల నా మనసా యిది మరవకుమీ

చ. 1:

గుదిఁ బాతచీర మాని కొత్తచీర గట్టినట్టు
ముదిమేను మాని దేహి మొగిఁ గొత్తమేను మోచు
అదనఁ జంపఁగ లేవు ఆయుధము లీతనిఁ
గదిసి యగ్నియు నీరు గాలియుఁ జంపఁగలేవు

చ. 2:

యీతఁడు నరకువడఁ డీతఁ డగ్నిఁ గాలఁడు
యీతఁడు నీట మునుఁగఁ డీఁతఁడు గాలిఁబోఁడు
చేతనుఁడై సర్వగతుండౌ చెలియించఁ డేమిటను
యీతల ననాది యీతఁ డిరవు గదలఁడు

చ. 3:

చేరి కానరానివాఁడు చింతించరానివాఁడు
భారపు వికారాలఁ బాసినవాఁడీ యాత్మ
ఆరయ శ్రీవేంకటేశు నాధీన మీతఁడని
సారము దెలియుటే సత్యం జ్ఞానము


రేకు: 0183-06 బౌళి సం: 02-420 గురు వందన, శరణాగతి

పల్లవి:

హరి సేవొకటే యనంతము
గురుబోధలకును కొలఁదే లేదు

చ. 1:

తలఁచిన కొలఁదే తనలో భావము
నిలిపిన కొలఁదే నేమము
పలికిన కొలఁదే పరమగు సత్యము
యిల నెవ్వరికిని యెక్కుడు లేదు

చ. 2:

జరిపిన కొలఁదే సకలాచారము
నెరపిన కొలఁదే నిజకీర్తి
తిరము సేయుకొలఁదే ధర్మంబును
యిరవుగ నందుకు నెక్కుడు లేదు

చ. 3:

సేసినకొలఁదే చేకొను కర్మము
రోసిన కొలఁదే రుచివిరతి
ఆసల శ్రీవేంకటాధిపు శరణను
దాసుడే యెక్కుడు తప్పే లేదు