తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 180
రేకు: 0180-01 సామంతం సం: 02-397 అంత్యప్రాస
పల్లవి:
ఇందుకా కోరి పుట్టె యిట్టిబదుకు
పొందుల శ్రీహరితోడిపొత్తుల మాబదుకు
చ. 1:
బడబాగ్ని ఆఁకటిబారిఁబడ్డ బ్రదుకు
పడఁతులకూటములఁ బడ్డ బదుకు
వొడలి తోలినెమ్ముల వొడగట్టే బదుకు
బడిఁ బుణ్యపాపాలపై తరవు బదుకు
చ. 2:
నాలుక గడచితేను నరకపు బదుకు
మూలమలమూత్రాల మూటగట్టే బదుకు
కాలము నడిసి వూర్పుగాలిఁబుచ్చే బదుకు
పాలుమాలే యింద్రియాల పంగెమాయె బదుకు
చ. 3:
ఇంపు సుఖదుఃఖాల యెండనీడ బదుకు
మంపుఁ గామక్రోధాలమాటు బదుకు
జంపుల శ్రీవేంకటేశుశరణు చొరఁగ నేఁడు
సొంపు లిన్నిటా నాకు సుఖమాయ బదుకు
రేకు: 0180-02 రేవగుప్తి సం: 02-398 అంత్యప్రాస
పల్లవి:
నీ వెరఁగనిది లేదు నీయాజ్ఞ మోచితి నింతే
నీవాఁడ నింతె హరి నే ననఁ జోటేది
చ. 1:
కన్నుల కెందైనఁ జూపుకలది భావము
యెన్నఁగ నాయందుఁ బాప మెంచఁ జోటేది
విన్ననై చెవుల కింపు వినుట స్వభావము
పన్నిన కర్మాలు నన్నుఁ బైకొనఁ జోటేది
చ. 2:
నాలికకుఁ జవియైతే నమలుటే సహజము
నాలి అభోజ్యపునింద నాకుఁ బనేమి
మూల వాసనగొనేది ముక్కుకు సహజము
జోలిబంధములు నన్నుఁ జుట్టఁగఁ జోటేది
చ. 3:
కాయము కాయముపొంతఁ గరఁగుటే ఆగుణము
సేయని చేఁతలు నాపైఁ జెప్పఁ జోటేది
యీయెడ శ్రీవేంకటేశ యిన్నిటిలో నన్నుఁ బెట్టి
పాయక నాలో నుందువు పట్టఁగఁ జోటేది
రేకు: 0180-03 లలిత సం: 02-399 వైష్ణవ భక్తి
పల్లవి:
ఇదివో వున్నార మింతట నంతట
వెదకి కదియకుమీ విష్ణుని మాయ
చ. 1:
హరిదాసులము హరికింకరులము
కరివరదుని డింగరులము
యిరవెఱిఁగితిననక యెఁఱగననక
సరి మాగురుతిది సర్వేశు మాయ
చ. 2:
హితులము శరణాగతులము కేశవ-
వ్రతులము వైష్ణవమతులము
గతి నినుఁ బాసితి కడు నిఁక మామీఁద
తతి దయమరవకు దైవము మాయ
చ. 3:
శ్రీవైష్ణవులము శ్రీవేంకటపతి
భావింప నితని పరికరము
యీవలనావల నిహపరములకును
తోవ దొలఁగుమీ తొలిఁదొలి మాయ
రేకు: 0180-04 రామక్రియ సం: 02-400 శరణాగతి
పల్లవి:
ఇంతకంటేఁ దగుబంధు లింక నున్నారా
యెంత సేసినా నీకు నెదురాడేనా
చ. 1:
కోపగించి చంకబిడ్డఁ గోరీ తల్లి డించితేను
పైపైనే పడుఁగాక పాసిపొయ్యినా
వోపక నానేరముల కొగి నీవు వేసరితే
నీపాదాలే గతిగాక నే మానేనా
చ. 2:
చదివించే అయఁగారు జంకించి చూచితేను
వొదిగి చదువుఁగాక వోపననీనా
యెదుటి గుణములకు నెంత నీవు దొబ్బినాను
యిదె నీకే మొక్కుదుఁగా కింక మానేనా
చ. 3:
చెక్కు మీటి పాలు పెంచినదాది వోయఁగాను
గక్కన మింగుటగాక కాదనీనా
యిక్కడ శ్రీవేంకటేశ యిటుల రక్షించఁగ
నిక్కి నే మెరతుఁగాక నే మానేనా
రేకు: 0180-05 మంగళకౌశిక సం: 02-401 సంస్కృత కీర్తనలు
పల్లవి:
తే శరణ మహం తే శరణ మహం
శైశవకృష్ణ తే శరణం గతో౽స్మి
చ. 1:
దశవిధావతార ధర్మరక్షకమూర్తి
దశమస్తకాసురదశన
దశదిశాపరిపూర్ణ తపనీయస్వరూప
దశావరణ లోకతత్వాతీత
చ. 2:
సహస్రలోచన సంతతవినుత
సహస్రముఖశేషశయనా
సహస్రకరకోటిసంపూర్ణతేజా
సహస్రారదివ్యచక్రాయుధా
చ. 3:
అనంతచరణ సర్వాధారాధేయ
అనంతకరదివ్యాయుధా
అనంతనిజకల్యాణగుణార్ణవ
అనంత శ్రీవేంకటాద్రినివాసా
రేకు: 0180-06 శంకరాభరణం సం: 02-402 అధ్యాత్మ
పల్లవి:
అదియే విష్ణుపదము ఆతుమకు నెలవు
అదే జననకారణ మాకాశపదము
చ. 1:
మంచిమాఁటలైనాఁ గానిమాటలైన నొకచోట
ముంచిముంచి యాకాశముననే యణఁగును
యెంచరాని నిట్టూర్పు లెన్ని వొడమినాను
అంచల నణఁగిపోవు నాకాశమును
చ. 2:
చూపులెంత దవ్వైనా సూర్యచంద్రులఁ దాఁకి
ఆపొంతనే యణఁగు నాకాశమునను
రూపుల మైనీడలును రుచులఁ గాలత్రయము
పైపైనే యణఁగును బహిరాకాశమున
చ. 3:
యిలఁ జీఁకటి వెలుఁగు యెండ నహోరాత్రాలఁ
గలసి మెలఁగు నాకాశతత్వమున
చలువై శ్రీవేంకటేశు సాకారనిరాకారా-
లలరి వెలుఁగుచుండు నంతరాకాశమున