తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 179
రేకు: 0179-01 సాళంగనాట సం: 02-392 అంత్యప్రాస
పల్లవి:
జీవుని కేకాలము శ్రీహరి చేరువబంధువుఁడీతఁడు
భావములోపలి పెరరేపకుఁడై భక్తి చేకొనును యీతఁడు
చ. 1:
పరమున నిహమున వెంటవెంటనే పాయని బంధువుఁడీతఁడు
ధరఁ దనుఁదలచిఁన మారుకు మారై తా రక్షించును యీతఁడు
విరివిగ నింద్రియవిషయభోగముల విందులు వెట్టును యీతఁడు
వురుగతిఁ జిత్రపురూపుల దేహపుటుడుగర లిచ్చును యీతఁడు
చ. 2:
వడిఁ గలకాలము యిరువదియొక్కటవావుల బంధువుఁడీతఁడు
బడిబడిఁ జైతన్యంబై యిన్నిటఁ బనులకు నొదగును యీతఁడు
జడిగొని యేకాంతలోకాంతమై మతిసంగతి నాప్తుఁడీతఁడు
పొడలుచు వైదికలౌకికముల నొకపొత్తున గుడుచును యీతడు
చ. 3:
ఘననిధినిక్షేపములిచ్చేటి వుపకారపుబంధువుఁ డీతఁడు
అనయము వెరవకుమని యేకాలము నభయం బొసగును యీతఁడు
ననిచిన శ్రీవేంకటేశ్వరుఁడై యిటు నాపాలఁగలుగు నీతఁడు
పనివడి అరులను సూడువట్టి కడుఁ బగసాధించును యీతఁడు
రేకు: 0179-02 బౌళి సం: 02-393 వేంకటగానం
పల్లవి:
ఎంత మాత్రమున ఎవ్వరు దలఁచిన అంతమాత్రమే నీవు
అంతరాంతరములెంచి చూడఁ బిండంతే నిప్పటి యన్నట్లు
చ. 1:
కొలుతురు మిము వైష్ణవులు కూరిమితో విష్ణుఁడని
పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మంబనుచు
తలఁతురు మిము శైవులు తగిన భక్తులును శివుఁడనుఁచు
అలరి పొగడుదురు కాపాలికులు ఆదిభైరవుఁడనుచు
చ. 2:
సరి నెన్నుదురు(???) శాక్తేయులు శక్తి రూపు నీవనుచు
దరిశనములు మిము నానావిధులను తలఁపుల కొలఁదుల భజింతురు
సిరుల మిమ్మునే యల్పబుద్ధిఁ దలచినవారికి నల్పంబవుదువు
గరిమల మిమునే ఘనమని తలఁచిన ఘనబుద్ధులకు ఘనుఁడవు
చ. 3:
నీవలనఁ గొరతే లేదు మరి నీరుకొలఁది తామెరవు
ఆవల భాగీరథి దరిబావుల ఆజలమే వూరినయట్లు
శ్రీవేంకటపతి నీవైతే మముఁ జేకొనివున్న దైవమని
యీవల నే నీ శరణనియెదను యిదియే పరతత్త్వము నాకు
రేకు: 0179-03 సాళంగం సం: 02-394 అధ్యాత్మ
పల్లవి:
నీవే మూలమువో నేరిచిన పెద్దలకు
దేవుఁడు నీయందులోనే తిరమాయ నిదివో
చ. 1:
బాపురే వో దేహమా బాపురే వో నీవు
వోపి నేఁ బెట్టినకొద్ది నుందువుగా
రూపు నీవు గలిగితే రుచులెల్లఁ గానఁ గద్దు
చాపలాన ధర్మములు సాధింపఁగలదు
చ. 2:
మెచ్చితి నోమనసా మెచ్చితివో నీవూ నా-
యిచ్చకొలది నెందైనా నేఁగుదువు గా
అచ్చపు నీకతమున నవుఁగాము లెంచఁ గద్దు
పచ్చిగా యేముర్తినైనా భావించఁగలదు
చ. 3:
మేలు మేలు నాలికె మేలు మేలు నీవు
వోలి యేమాటకునైనా నొనరుదుగా
చాలి నీవు మెలఁగంగ చదువు చదువఁ గద్దు
పోలించి శ్రీవేంకటేశుఁ బొగడఁగఁగలదు
రేకు: 0179-04 లలిత సం: 02-395 శరణాగతి
పల్లవి:
హరి నీవే బుద్ధి చెప్పి యాదరించు నామనసు
హరి నీవే నాయంతర్యామివి గాన
చ. 1:
వసముగాని కరివంటిది నామనసు
యెఁసగి సారెకు మదియించీఁ గాన
పొసఁగఁ బాదరసముఁబోలిన నామనసు
అసము దించక సదా అల్లాడీఁ గాన
చ. 2:
వడి నడవుల చింకవంటిది నామనసు
బడిబడిఁ బట్టబట్ట బారీఁ గాన
కడఁగి విసరు పెనుగాలివంటిది మనసు
విడువక కన్నచోట విహరించీఁ గాన
చ. 3:
వరుస నిండుజలధివంటిది నామనసు
వొరసి సర్వము లోనై వుండీఁ గాన
గరిమ శ్రీవేంకటేశ కావవే నామనసు
సరి నీయానతి నీకే శరణనీఁ గాక
రేకు: 0179-05 బౌళి సం: 02-396 శరణాగతి
పల్లవి:
జలజనాభ హరి జయ జయ
యిల మానేరము లెంచకువయ్యా
చ. 1:
బహుముఖముల నీప్రపంచము
సహజగుణంబుల చంచలము
మహిమల నీ విది మరి దిగవిడువవు
విహరణ జీవులు విడువఁగఁగలరా
చ. 2:
పలునటనల యీప్రకృతి యిది
తెలియఁగఁ గడునింద్రియవశము
కలిసి నీ వందే కాఁపురము
మలినపు జీవులు మానఁగఁగలరా
చ. 3:
యిరవుగ శ్రీవేంకటేశుఁడ నీమాయ
మరలుచ నీవే సమర్థుఁడవు
శరణనుటకే నే శక్తుఁడను
పరు లెవ్వరైనాఁ బాపఁగఁగలరా