Jump to content

తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 157

వికీసోర్స్ నుండి

రేకు: 0157-01 బౌళి సం: 02-269 అధ్యాత్మ

పల్లవి: సత్యము సేయఁగవచ్చును సర్వేశ్వర యీమాటకు
నిత్యము నీవే యెఱుఁగుదు నేనేమి నెఱఁగఁ జుమీ
    
చ. 1: సులభుఁడవౌదువు వొకమరి చూడఁగ దుర్లభుఁడవౌదువు
తలఁపింతువు మఱపింతువు తగఁ బ్రాణములోనుండి
పలికింతువు అక్షరముల పరగ నవే వ్రాయింతువు
వెలయఁగ నీవే వెలిగా వేరొకటి నేఁ జేయఁ జుమీ

చ. 2: వొనరఁగఁబూజలు గొందువు వొక్కొకపరిమానుదు వటు
కను మూయింతువు నిదురలఁ గడు మేల్కొలుపుదువు
ఘనముగ నజ్ఞానిఁ జేతువు కరుణతో జ్ఞానిఁ జేతువు
ననుఁ బుట్టించితి నీవే నా కాపని గాదు సుమీ

చ. 3: నాలో నుందువు వొకపరి నగి శ్రీవేంకటగిరి నుందువు
పాలింతువు లాలింతువు భవ మీడేరింతువు
పోలింప సంసారిఁ జేతువు భువి నీదాసునిఁ జేతువు
కాలముఁ గర్మము నీవే కపటము నే నేరఁ జుమీ

రేకు: 0157-02 రామక్రియ సం: 02-270 అద్వైతము

పల్లవి: వారి వారి భాగ్యములు వ్రాసి వున్నవి నొసళ్ల
ధీరతతో నేది మేలో తెలుసుకోరో

చ. 1: అట్టే కొందరు మతము లన్నియు నేకమని
పట్టవర్ధనము నెత్తిఁ బెట్టి చూపిరి
జట్టిఁ గొందరు జీవులు జంగమే లింగముగాని-
పుట్టుగెల్లా భస్మమని పూసుక చూపిరి

చ. 2: కొంద రేమియును లేదు కొట్టఁగొన లయమని
అంది వట్టి లలాటశూన్యము చూపిరి
కందువఁ గొందరు లక్ష్మీకాంతుఁ డంతరాత్మయని
ముందే నామము శ్రీచూర్ణమునుఁ బెట్టి చూపిరి

చ. 3: చెలఁగి దిష్ట మిపుడు శ్రీవేంకటేశుఁడు
అలమేలుమంగపతియై యున్నవాఁడు
యిలవీర నీదాసుల కిట్టి భాగ్యరేఖలు
వలసినవారికెల్లా వ్రాసినాఁడితఁడు

రేకు: 0157-03 లలిత సం: 02-271 వైరాగ్య చింత

పల్లవి: విచార మెన్నఁడు లేదు వీరిడి జీవులకును
పచారించేరు బ్రదుకు బ్రహ్మనాటనుండియు

చ. 1: పొద్దువొడచుటయును పొరిఁ గూఁగుటయె కాని
అద్దుకొని మిగులఁగ నందేమి లేదు
వొద్దికఁ బుట్టుటయును వుడుగఁ జూచుటె కాని
కొద్దితోడఁ గాలమేమి గురియై నిలువదు

చ. 2: అన్నము భుజించేదియు నాఁకలి గొనేదెకాని
యెన్నికకుఁ జెప్పిచూప నేదియు లేదు
ఇన్నిటఁ దిరిగాడేది ఇంటికి వచ్చేదే కాని
పన్ని తననిలుకడ భావించ లేదు

చ. 3: జవ్వనము మోఁచేదియు సరి ముదుసేదే కాని
తవ్వి కట్టుకొనే దేది దాఁచే దేది
నవ్వుతా నలమేల్మంగనాయక శ్రీవేంకటేశ
రవ్వల నీ వేలికవు రక్షించు మిఁకను

రేకు: 0157-04 శంకరాభరణం సం: 02-272 భక్తి

పల్లవి: ఇంతకంటె నేమిసేసే మిదే మా మానసపూజ
సంతతము నీవు తొల్లే సర్వసంపన్నుఁడవు

చ. 1: అంతర్యామివైన మీకు నావాహనమదివో
అంతటా విష్ణుఁడ మీకు నాసనము వేసినది
పంతపుఁకోనేరే మీకుఁ బలుమారు నర్ఘ్యము
చెంతనే గంగాజలముచల్లే మీకుఁ బాద్యము

చ. 2: జలధు లన్నియును నాచమనియ్యము మీకు
అల యా వరుణజల మిదియే స్నానము
వలనుగా మీమహిమలే వస్త్రాభరణములు
అల వేదములే మీకు యజ్ఞోపవీతము

చ. 3: ఇరవుగఁ గుబ్జ తొల్లిచ్చినదే మీకు గంధము
ధర మాలాకారుని పూదండలే మీకు పువ్వులు
ఉరుగతి మౌనుల హోమమే మీకు ధూపము
తిరమైన మీకు రవితేజమే దీపము

చ. 4: నానామృతములే మీకు నైవేద్యతాంబులములు
పూనిన భక్తి షోడశోచారములు
ఆనుక శ్రీవేంకటేశ అలమేల్మంగపతివి
తానకపు జపములే తగ మీకు నుతులు

రేకు: 0157-05 శ్రీరాగం సం: 02-273 రామ

పల్లవి: రాజీవనేత్రాయ రాఘవాయ నమో
సౌజన్యనిలయాయ జానకీశాయ

చ. 1: దశరథతనూజాయ తాటకదమనాయ
కుశికసంభవయజ్ఞగోపనాయ
పశుపతిమహాధనుర్భంజనాయ నమో
విశదభార్గవరామవిజయకరణాయ

చ. 2: భరితధర్మాయ శూర్పణఖాంగహరణాయ
ఖరదూషణాది రిపుఖండనాయ
తరణిసంభవసైన్యదక్షకాయ నమో
నిరుపమమహావారినిధిబంధనాయ

చ. 3: హతరావణాయ సంయమినాథవరదాయ
అతులితాయోధ్యాపురాధిపాయ
హితకర శ్రీవేంకటేశ్వరాయ నమో
వితతవావిలిపాటి వీరరామాయ

రేకు: 0157-06 లలిత సం: 02-274 వైరాగ్య చింత

పల్లవి: భోగము నేను నీకు భోగివి నీవు
శ్రీగురుఁడ విన్నిటాను చిత్తగించు నన్నును

చ. 1: చక్కని జన్మపు సంసారవృక్షమునకు
పక్కున(వ) ఫలము నీవు భావించగా
మక్కువఁ గర్మమనేటి మత్తగజమునకును
యెక్కిన మావటీఁడవు యెంచఁగ నీవు

చ. 2: నెట్టన దేహమనేటి నిర్మలరాజ్యమునకు
పట్టమేలుచుండిన భూపతివి నీవే
దిట్టమైన చిత్తమనే తేజిగుఱ్ఱమునకు
వొట్టుక రేవంతుఁడవు వుపమింప నీవు

చ. 3: సంతతమైన భక్తిచంద్రోదయమునకు
రంతులఁ జెలఁగు సముద్రమవు నీవు
చెంతల శ్రీవేంకటేశ జీవుఁడనే మేడలోన
అంతర్యామివి నీవు అంకెలఁజూచినను