Jump to content

తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 156

వికీసోర్స్ నుండి

రేకు: 0156-01 శంకరాభరణం సం: 02-263 శరణాగతి

పల్లవి: నీచిత్తము నాభాగ్యము నే నెంతటివాఁడను
యేచి నీవు రక్షించేదే యెక్కుడుపుణ్య మింతే

చ. 1: పాటించి నీభావము పట్టవశమా తలఁచి
మేటి నామనసు నీకు మీఁదెత్తు టింతే
నూటికైన నీనామము నుడుగఁగ వశమా
మాటలు నీసెలవుగా నుట్టుపెట్టుటింతే

చ. 2: వేవేలైన నీకథలు వినఁగ నాతరమా
సోవగా వీనులు తావు చూపుట యింతే
దేవ నీసాకారము ద్రిష్టించ నావశమా
పావనముగా నందులోఁ బనిగొను టింతే

చ. 3: గట్టిగా నిన్నుఁ బూజించఁ గమ్మటి నావశమా
నెట్టిన నామేను నీకు నేమించు టింతే
పట్టపలమేల్మంగపతివి శ్రీవేంకటేశ
జట్టిగొనుకొరకు నీశరణను టింతే

రేకు: 0156-02 గౌళ సం: 02-264 హరిదాసులు

పల్లవి: నమ్మవలెఁగాని యెన్నఁడు సందేహము లేక
యిమ్ముల దేవుఁడు వరమిచ్చు టేమరుదు

చ. 1: మగనిపై బత్తిసేసి మంచిలోకా లెక్కేరట
తగుదండకోల వట్టి తత్త్వగతి గనేరట
పగటున నొకవేరు వట్టి పాముఁ బట్టేరట
తగిలి హరిదాసులు ధన్యు లౌ టేమరుదు

చ. 2: యేలికెకు ధనమిచ్చి హితభోగా లందేరట
కేలఁ గత్తివూని పగ గెల్చేరట
గాలి లోలోఁ బూరించి ఘనసిద్ధు లయ్యేరట
యేలీల హరిదాసులు యీడేరు టేమరుదు

చ. 3: దిక్కుల యజ్ఞాలు చేసి దివిజు లయ్యేరట
మొక్కి విప్రుల నర్చించి ముంచి సిరు లందేరట
పక్కన నలమేల్మంగపతి శ్రీవేంకటేశ్వరుఁ
జక్కనఁ గొల్చిన దాసులు జ్ఞాను లౌ టేమరుదు

రేకు: 0156-03 ముఖారి సం: 02-265 శరణాగతి

పల్లవి: నీకేల యీగుణము నీ వేమి గట్టుకొంటివి
యీకడ లాలించితే మే మిటు నిన్ను గొలుతుము

చ. 1: మాటలకు లోఁగాని బ్రహ్మమనంటా దాఁచి దాఁచి
మాటాడకుండేవు సుమ్మీ మాతో నీవు
నీటున మనసులో నిలుపరానివాఁడనంటా
పాటించి మాకుఁ బొడచూపకుంటే గతి యేది

చ. 2: శ్రుతులకుఁ బట్టరాని చోద్యపు బ్రహ్మమనంటా
మతకానఁ జిక్కక మానేవు సుమ్మీ
పతివి నీ గంభీరము బయటఁబడీ నంటా
అతిగోప్యాన ని న్నది యెట్ఱెఱిఁగేము

చ. 3: మాయవన్నుకొనిన వుమ్మడిబ్రహ్మమనంటా
యేయడనైననా భ్రమయించేవు మ్మీ
పాయపు టలమేల్మంగపతివి శ్రీవేంకటేశ
యీయెడ నీశరణంటి మిన్నిటా మమ్మేలుమీ

రేకు: 0156-04 దేసాక్షి సం: 02-266 అద్వైతము

పల్లవి: కోటానఁ గోట్లాయ కోరికెలు జన్మములు
కూటువ గూడి రాట్నపుగుండ్ర లైనారయ్యా

చ. 1: మిన్ను పైనున్న జీవులు మన్నుపైఁ బ్రవేశించి
అన్నద్వారమున దేహము మోఁచి
మున్నిటి దానఫలా లిమ్ముల భుజించి యప్పటి
తిన్నని కర్మములు గాదెలఁ బోసేరయ్యా

చ. 2: యిరవు మఱచి మఱి యెరవులకాఁపిరేల
సురలు నరులమంటాఁ జొక్కిచొక్కి
సొరిది లోకములెల్లాఁ జొచ్చి కాలగతులను
పొరి నాయుష్యము గొల్చిపోయుచున్నారయ్యా

చ. 3: దండగాఁగఁ దిరుమలకొండయెక్కి సుజ్ఞానులు
పండిన మనసుతోడ బత్తినేసి
అండనే శ్రీవేంకటేశు నలమేల్మంగనుఁ గొల్చి
నిండునిధానములై నిల్చినారయ్యా

రేకు: 0156-05 భూపాళం సం: 02-267 అధ్యాత్మ

పల్లవి: మొదలనే యెచ్చరికెతో మోసపోక యేపొద్దూ
వెదకి హరికథలే వినుచుండవలయు

చ. 1: వెలఁదుల సుద్దులు వీనులను వింటేను
పెలుచుఁజూపులఁ జూడఁ బ్రేమ వుట్టించు
మలసి యాచూపులు మనసునఁ దగిలించు
తలఁపు మాటాలాడఁ దమిరేఁచును

చ. 2: మగువలతోడుత మాటలాడ దొరకొంటే
నగినగి సంసారాలనంటు గల్పించు
తగిలిన నవ్వులు తనువులు సోఁకింపించు
మిగులాఁ దనుసోకులే మించి వలపించును

చ. 3: సతులతో మోహము సంపదలు పోరించు
అతిసంపదలు దేహి నజ్ఞానిఁ జేయు
తతి నలమేలుమంగపతి శ్రీవేంకటేశుఁడే
గతియని కొలిచితే ఘనునిఁగా జేయును

రేకు: 0156-06 ముఖారి సం: 02-268 వైరాగ్య చింత

పల్లవి: ఇందువల్ల నేమిగద్దు యినుపగుగ్గిళ్లింతే
యిందిరారమణు సేవే యిరవైన పదవి

చ. 1: సతులతో నవ్వులు చందమామగుటుకలు
మతితలపోఁత లెండమావులనీళ్ళు
రతులతో మాటలు రావిమానిపువ్వులు
తతి విరహపుకాఁక తాటిమావినీడ

చ. 2: లలనల జవ్వనాలు లక్కపూసకపురులు
నెలకొని సేసే బత్తి నీటిపై వ్రాత
చెలువపు వినయాలు చేమకూరశైత్యాలు
కొలఁదిలేని ననుపు గోడమీఁది సున్నము

చ. 3: పడఁతుల వేడుకలు పచ్చివడఁగండ్ల గుళ్లు
కడుమోవితీపు చింతకాయకజ్జము
బడి నలుమేలుమంగపతి శ్రీవేంకటేశ్వరుఁ-
డడరించిన మాయలు అద్దములో నీడలు