Jump to content

తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 154

వికీసోర్స్ నుండి

రేకు: 0154-01 బౌళి సం: 02-252 అద్వైతము

పల్లవి: పురుషుండని శృతి వొగడీనట ఆ పురుషుఁడు నిరాకారమట
విరసవాక్యము లొండొంటికి నివి వింటే నసంబద్ధములు

చ. 1: మొగమున బ్రహ్మలు మొలచిరట ఆ మూరితి అవయవరహితుఁడట
తగు బాహువులను రాజులట ఆ తత్వమే యెంచఁగ శూన్యమట
పగటున తొడలను వైశ్యులట ఆ బ్రహ్మము దేహము బయలట
అగపడి పాదాల శూద్రులట ఆతని రూపము లేదట

చ. 2: తన వందనమునుఁ గలదట దైవము తనుఁ జూడఁ గన్నులు లేవట
తన విన్నపమునుఁ జేయునట ఆతనికిని వీనులు లేవట
తన యిచ్చినదే నైవేద్యంబట దైవము నోరే లేదట
తన యిచ్చేటి ధూపంబును గలదట దైవము ముక్కును లేదట

చ. 3: అంతాఁ దానే దైవమటా యజ్ఞము లొరులకుఁ జేయుటట
సంతతమునుఁ దా స్వతంత్రుఁడటా జపముల వరముల చేకొంటట
చింతింపఁ దానే యోగియటా చేరువ మోక్షము లేదట
పంతపు శ్రీవేంకటపతిమాయలు పచారించిన వివియట

రేకు: 0154-02 శంకరాభరణం సం: 02-253 అద్వైతము

పల్లవి: ఏకాత్మవాదులాల యిందు కేది వుత్తరము
మీకు లోకవిరోధ మేమిటఁ బాసీనయ్యలాల

చ. 1: పాప మొక్కడు సేసితే పాపులే యిందరుఁ గావలదా
యేపున వొకరిపుణ్య మిందరికి రావలదా
కోపంచి యొక్కఁ డసురైతే కోరి యిందరుఁ గావలదా
చూప దేవుఁడొక్కఁడైతే సురలిందరుఁ గావలదా

చ. 2: వొకఁ డపవిత్రుఁ డైతే నొగి నిందరుఁ గావలదా
వొకఁడు శుచై వుండితే వోడ కిందరుఁ గావలదా
వొకని రతిసుఖమంటి యిందరును వొనరఁ బొందవలదా
వొకని దుఃఖ మందరు వూరఁ బంచుకోవలదా

చ. 3: ఆకడ నొకఁడు ముక్తుఁడయితే నందరునుఁ గావలదా
దీకొని యొకఁడు బంధుఁడయితే యిందరుఁ గావలదా
చేకొని శ్రీవేంకటేశుఁ జేరి దాసులయి యుండేటి-
లోకపు మునులనుఁ దెలుసుకోవలదా

రేకు: 0154-03 శంకరాభరణం సం: 02-254 గురు వందన, నృసింహ

పల్లవి: దేవుఁడుగలవారికి దిగులుఁ జింతయు లేదు
శ్రీవిభుఁడే అన్నిటా రక్షించుఁ గనక

చ. 1: యేలికగల బంటుకు యేవిచారము లేదు
వోలి మగఁడుగలాలికి వొప్పమి లేదు
పోళిమిఁ దండ్రిగల పుత్రుని కంగద లేదు
మేలుగాఁ బండిన భూమికిఁ గరవు లేదు

చ. 2: బలముగల రాజుకు భయమేమియు లేదు
కలిమిగలవాని కక్కర లేదు
యిల నాచారవంతుని కేపాపమును లేదు
తలఁపు బుణ్యముగల‌ ఆతనికిఁ జేటు లేదు

చ. 3: గురువుగలవానికిఁ గొఱఁత యేమియు లేదు
పరముగలవానికి భ్రాంతులు లేవు
యిరవై శ్రీవేంకటేశుఁ డిన్నిటా మాకుఁ గలఁడు
అరయ దాసులము మా కడ్డాఁకే లేదు

రేకు: 0154-04 కేదారగౌళ సం: 02-255 శరణాగతి

పల్లవి: కమలారమణ నీకల్పితపుమానిసిని
తమితోడ నాదిక్కు దయఁ జూడవే

చ. 1: ఆరీతి బ్రాహ్మణుఁడ ననుటేకాని దేహము
కోరి యాచారమునకుఁ గొలుపదు
పేరు వైష్ణవుఁడననే పెద్దరికమే కాని
సారమైన మనసులో జ్ఞానమే లేదు

చ. 2: చదివితిననియెడి చలపాద మింతే కాని
అదన నందులోని ‌అర్థ మెఱఁగ
పదిరిసంసారమనే బహురూపమే కాని
చతురుఁదనాన నందు సమర్థుఁడఁ గాను

చ. 3: దేవ మీభక్తుఁడననే తేజ మొకటె కాని
చేవమీర నినుఁ బూజించ నేరను
శ్రీవేంకటేశ నీచేతిలోనివాఁడ నేను
భావించి మఱి యేపాపము నెఱఁగను

రేకు: 0154-05 కాంబోది సం: 02-256 వైరాగ్య చింత

పల్లవి: ఇన్నాళ్లు నందునందు నేమి గంటివి
అన్నిటా శరణు చొచ్చి హరి నిన్నుఁ గంటిని

చ. 1: అంగనల పసఁజిక్కి అలయికలే కంటి
బంగారువెంటఁ దగిలి భ్రమ గంటిని
ముంగిటిక్షేత్రాలంటి ముంచి వెట్టిసేయఁ గంటి
అంగపు నన్నే చూచి అంతరాత్మఁ గంటి

చ. 2: చుట్టాలఁ జేరి చూచి సుద్దులవావులు గంటి
మట్టులేని వయసుతో మదము గంటి
వట్టికామములుసేసి వరుస మాయలు గంటి
పట్టి నారాయణాయని భక్తి నిన్నుఁ గంటిని

చ. 3: వింతచదువులవల్ల వేవేలుమతాలు గంటి
సంతకర్మములవల్ల సాము గంటిని
యింతట శ్రీవేంకటేశ యిటు నాజీవభావము
చింతించి అందులోన నీ శ్రీపాదాలు గంటి