Jump to content

తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 153

వికీసోర్స్ నుండి

రేకు: 0153-01 నాట సం: 02-246 హరిదాసులు

పల్లవి: పొరి నీకును విఱిగిపోయిన దానవులు
బిరుదులుడిగి వోడబేహారులైరి

చ. 1: మకుటాలు దీసి జటామకుటాలు గట్టుకొని
వెకలి రిపులు మునివేషులైరి
మొకములను సోమపు మొకములు వెట్టుకొని
అకటా కొందరు రిపు లాటవారైరి

చ. 2: పేరులు విడిచి సంకుఁబేరులు మెడ వేసుక
సారెకుఁ గొందరు శివసత్తులైరి
బీరపుసాములు మాని పెద్దగడసాము నేర్చి
తోరపుఁ బగతులెల్లా దొమ్మరులైరి

చ. 3: నాదించ వెఱచి సింగినాదా లూదుకొంటాను
సోదించేరటాఁ గొందరు జోగులైరి
యీ దెస శ్రీవేంకటేశ యిన్నియు మాని కొందరు
దాదాత నీశరణని దాసరులైరి

రేకు: 0153-02 కాంబోది సం: 02-247 వైరాగ్య చింత

పల్లవి: ఐనట్టయ్యీఁ గాక హరికల్పితము లివి
మానేటి వేఁటివో మానని వేవో

చ. 1: వొక్కరు తలఁచినట్టు వొకరి తలఁపు రాదు
పక్కన నందరికి బహుభావాలు
అక్కట మొద లొకటి అనలుఁ గొనలు వేరు
యెక్కడని తగిలేది యేమిసేసేది

చ. 2: పొరుగువాని చేఁత ఆపొరుగువాఁడు మెచ్చఁడు
నరుల కర్మములు నానావిధాలు
గరిమ నన్నమొక్కటే కడుపుతనివి వేరు
కరుణించౌనన నేవి కావన నేవి

చ. 3: కడఁగి దరిద్రునిమాట కలవాని కింపుగాదు
బెడఁగు జీవుల పొందు పెక్కురీతులు
కడు శ్రీవేంకటేశుఁ డొక్కఁడు జగత్తులు వేరు
వొడిఁగట్టుకొనే దేది వొల్లననే దేది

రేకు: 0153-03 నాట సం: 02-248 నృసింహ

పల్లవి: నిండె నిన్నిచోటులను నీమహిమలే
అండనే మొక్కేము నీకు నాదినారసింహా

చ. 1: కూరిమి యిందిరమీఁద కోపము అసురమీఁద
తారుకాణ నవ్వు దేవతలమీఁదను
ఆరీతి నీకొలు విట్టే అహోబలముమీఁద
నారుకొనె నీనేరుపు నారసింహా

చ. 2: కరుణ ప్రహ్లాదమీఁద గన్నులు దిక్కుల మీఁద
సరిచేతులు పేగుల జంధ్యాలమీఁద
గరిమ నీనటనలు ఘనప్రతాపముమీఁద
తిరమాయ నీకోరిక దివ్యనారసింహా

చ. 3: శాంతము లోకముమీఁద శౌర్యము శత్రులమీఁద
కాంతులెల్లా తనదివ్యకాయముమీఁద
చింతదీర వినోదము శ్రీవేంకటాద్రిమీఁద
సంతతమై నీకుఁ జెల్లె జయనారసింహా

రేకు: 0153-04 సాళంగనాట సం: 02-249 హనుమ

పల్లవి: అన్నిటా నీ పెంపు వింత హనుమంత నీ-
వున్న చోటు నిశ్చింతమో హనుమంత

చ. 1: రాముని సేనలఁగాచి రావణు గర్వమడఁచి
ఆముకొన్న బలవంత హనుమంతా
గోమున జలధి దాఁటి కొండతో సంజీవి దెచ్చి
ధీమంతుడఁవైతివింత దివ్య హనుమంత

చ. 2: చుక్కలు మొలపూసలై సూర్యమండలము మోఁచె
అక్కజపు నీ రూపంత హనుమంత
చొక్కమై మీరుండఁగాను సుగ్రీవాదులకెల్లా
అక్కర లేదించుకంతా హనుమంతా

చ. 3: జంగచాఁచి చేయెత్తి సరిఁ బిడికిలించుక
అంగము నిక్కించితెంత హనుమంత
రంగగు శ్రీవేంకటాద్రి రాముని దేవి కిచ్చితి-
వంగులియ్యక మొక్కంత హనుమంతా

రేకు: 0153-05 రామక్రియ సం: 02-250 నృసింహ, హనుమ

పల్లవి: మగటిమిగల హనుమంతరాయ
దిగువపట్టణములోని దేవ హనుమంత

చ. 1: చక్కఁగాఁ దోఁక చాఁచి జంగవెట్టి చేచాఁచి
అక్కజపు ప్రతాపపు హనుమంతుఁడా
రక్కసులఁ దునుమాడి రాముని దేవులకు
దిక్కై వుంగరమిచ్చిన దేవ హనుమంత

చ. 2: కీలుగంటు వేసుకొని కెరలి పిడికిలించి
ఆలకించేవు దిక్కులు హనుమంతుఁడా
నేలకు మింటికి మేను నిండఁ బెరిగి యక్షుని
తీలు పడఁగొట్టినట్టి దేవ హనుమంతుఁడా

చ. 3: తమితోడ దాసులను తప్పక కాచేనని
అమర నభయమిచ్చిన హనుమంతుఁడా
జమళి శ్రీవేంకటేశు సరస వూడిగానకు
తిమురుచు నుండేయట్టి దేవ హనుమంతా

రేకు: 0153-06 శ్రీరాగం సం: 02-251 వైరాగ్య చింత

పల్లవి: ఏమి చెప్పేదిది యీశ్వరమాయలు
దీము ప్రతిమకును త్రిజగము గలిగె

చ. 1: మలమూత్రంబుల మాంసపుముద్దకు
కులగోత్రంబుల గుఱి గలిగె
తొలులు తొమ్మిదగు తోలుఁదిత్తికిని
పిలువఁగఁ బేరును బెంపునుఁ గలిగె

చ. 2: నెత్తురునెమ్ముల నీరుబుగ్గకును
హత్తిన కర్మము లటు గలగె
కొత్తవెంట్రుకల గుబురుల గంతికి
పొత్తుల సంసారభోగము గలిగె

చ. 3: నానాముఖముల నరముల పిడుచకు
పూనిన సిగ్గులు భువిఁ గలిగె
ఆనుక శ్రీవేంకటాధిపుఁ డేలఁగ
దీనికిఁ బ్రాణము తిరముగఁ గలిగె