తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 138
రేకు: 0138-01 దేసాళం సం: 02-160 దశావతారములు
పల్లవి: వారిదేపో జన్మము వడి నిన్నుఁ దెచ్చిరి
భారతరామాయణాలై పరగె నీకథలు
చ. 1: భువిమీఁద రావణుఁడు పుట్టగాఁగా రాముఁడవై
తవిలి యిందరికిఁ బ్రత్యక్షమైతివి
వివరింప నంతవాఁడు వెలసితేఁగా నీవు
అవతార మందితే నిన్నందరునుఁ జూతురు
చ. 2: రమణఁ గంసాది యసురలు లూటి సేయఁగాఁగా
తమిఁ గృష్ణావతార మిందరి కైతివి
గములై యంతటివారు గలిగితేఁగా నీవు నేఁడు
అమర జనించి మాటలాడుదు విందరితో
చ. 3: యెంత వుపకారియో హిరణ్యకశిపుఁడు
చెంత నరసింహుఁడ నీసేవ యిచ్చెను
యింతట శ్రీవేంకటేశ యిన్ని రూపులును నీవే
పంతాన నీశరణని బ్రదికితి మిదివో
రేకు: 0138-02 సామంతం సం: 02-161 భక్తి
పల్లవి: ఊరకైతే నిన్నుఁ గాన మొకకారణానఁ గాని
పూరిజీవులము, నీవు పురుషోత్తముఁడవు
చ. 1: అసురలు భువిఁ బుట్టుటది వుపకారమే
అసురలు బాధింతు రమరులను
పొసఁగ వారికిఁగాను పూనుకవచ్చి నీవు
వసుధ జనించితేను వడి నిన్నుఁ గందుము
చ. 2: అడరి ధర్మము చెడి యధర్మమైనా మేలు
వెడఁగు మునులు విన్నవింతురు నీకు
తడవి ధర్మము నిల్ప ధరణిఁ బుట్టుదు నీవు
బడి నిన్ను సేవించి బ్రదుకుదు మపుడే
చ. 3: నీకంటే మాకుఁ జూడ నీదాసులే మేలు
పైకొని వారున్నచోటఁ బాయకుందువు
చేకొని శ్రీవేంకటేశ చెప్పఁగానే వారిచేత
నీకథలు విని విని నే మీడేరితిమి
రేకు: 0138-03 సాళంగనాట సం: 02-162 దశావతారములు
పల్లవి: పేరు నారాయణుఁడవు బెంబాడిచేఁతలు నీవి
నోరు మూసుకున్నఁ బోదు నున్నని నీసుద్దులు
చ. 1: వేసులు మాకుఁ జెప్పె విన భారతముగాఁగ
మోస నీపాలముచ్చిమి మొదలుగాను
రాసికెక్క శుకుఁడు రవ్వగాఁ బొగడఁ జొచ్చె
ఆసలఁ బరకాంతల నంటిన నీసుద్దులు
చ. 2: రంతున వాల్మీకి చెప్పె రామాయణము గాను
సంతగాఁ దాటకాదులఁ జంపినదెల్లా
అంతకముందె నారదుఁడవి దండెమీటి చెప్పె
యింతటా వేఁటాడి జీవహింసలు సేసినది
చ. 3: వేడుక నజుఁడు చెప్పె వేదముగా నీవు దొల్లి
వోడక మీనై కొన్నాళ్లుండితివంటా
తోడనే సప్తరుషులు తొల్లియునుఁ జెప్పిరదె
యీడనే శ్రీవేంకటాద్రి నిరవైతి వనుచు
రేకు: 0138-04 గుండక్రియ సం: 02-163 వైరాగ్య చింత
పల్లవి: దేహ మిది యొకటే దేవుఁడ నీవొకఁడవే
యీహల రెంట దెప్పర మిదివో మాబదుకు
చ. 1: రాతి రొక్కలోకము రవ్వపడెఁ గలలోన
ఘాతలఁ బగలొక్కలోకము వేగితే
యీతల రెప్పలే మరఁ గిందుకు నందుకుఁ జూడ
యేతుల రెంట దెప్పర మిదివో మాబదుకు
చ. 2: సతి కాఁగిలొకటే జవ్వనపుఁగాఁక రేఁచు
సుత కాఁగిలొక వేరేసుఖమై తోఁచు
మతిలోని మరఁ గింతే మగువలే యిద్దరును
ఇతవై రెంట దెప్పర మిదివో మాబదుకు
చ. 3: దైవమా నిన్నాతుమలోఁ దలఁచి యానందింతు
పూవుల నిన్నుఁ బూజింతు పొంచి వెలిని
శ్రీవేంకటేశ నీసేవలోని మరఁ గింతే
యీవల రెంట దెప్పర మిదివో మాబదుకు
రేకు: 0138-05 రామక్రియ సం: 02-164 అంత్యప్రాస
పల్లవి: చాటెదనిదియే సత్యము సుండో
చేటులేదీతని సేవించినను
చ. 1: హరినొల్లని వారసురలు సుండో
సుర లీతని దాసులు సుండో
పరమాత్ముఁడితఁడె ప్రాణము సుండో
మరుగక మఱచిన మఱి లేదిఁకను
చ. 2: వేదరక్షకుఁడు విష్ణుఁడు సుండో
సోదించె శుకుఁడచ్చుగ సుండో
ఆదిబ్రహ్మగన్నాడతఁడు సుండో
యేదెస వెదికిన నితఁడే ఘనుఁడు
చ. 3: యిహపర మొసఁగను యీతఁడె సుండో
వహి నుతించెఁ బార్వతి సుండో
రహస్యమిదివో రహి శ్రీవేంక
మహీధరంబున మనికై నిలిచె
రేకు: 0138-06 కేదారగౌళ సం: 02-165 కృష్ణ
పల్లవి: మీరు సాక్షి మీరు సాక్షి మే మేమీ ననలేము
చేరి చూడరమ్మ వీని చెల్లుబడి యమ్మా
చ. 1: పిన్నవాఁడు నిద్ర వోఁగ పెనచి కూఁకటతోడ
పన్ని లేఁగతోఁకఁగూడ బంధించి కట్టె
వున్నతిఁ దొలఁగ వాని వొళ్లెల్లా దోఁగిపోయ
కన్నెలార యీకృష్ణుఁ గంటిరటరమ్మా
చ. 2: లేఁగల నన్నిటి నేము లేవక తొల్లె విడిచె
మూఁగి ఆవులుఁబేయలు మొగిఁ గలయ
అఁగి పట్టఁబోతేను అప్పుడే తా గడె వెట్టి
రాఁగతనాన నున్నాఁడు రాచబలువమ్మా
చ. 3: వారము నేసేమనుచు వడి నింటివార మెల్లా
కూరలు పాశాలు దొంతిఁ గూడఁబెట్టితే
ఆరగించ వేలుపుల అలికి పూసి కుడిపీ
కూరిమి శ్రీవేంకటాద్రి గోవిందుఁ డమ్మా