తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 104
రేకు: 0104-01 పాడి సం: 02-019 భగవద్గీత కీర్తనలు
పల్లవి: తెలిసితే మోక్షము తెలియకున్న బంధము
కలవంటిది బదుకు ఘనునికిని
చ. 1: అనయము సుఖమేడ దవల దుఃఖమేడది
తనువుపై నాసలేని తత్త్వమతికి
పొనిఁగితేఁ బాపమేది పుణ్యమేది కర్మమందు
వొనర ఫలమొల్లని యోగికిని
చ. 2: తగిన యమృతమేది తలఁపఁగ విషమేది
తెగి నిరాహారియైన ధీరునికిని
పగవారనఁగ వేరి బంధులనఁగ వేరీ
వెగటు ప్రపంచమెల్ల విడిచే వివేకికి
చ. 3: వేవేలువిధులందు వెఱుపేది మఱుపేది
దైవము నమ్మినయట్టి ధన్యునికిని
శ్రీవేంకటేశ్వరుఁడు చిత్తములో నున్నఁవాడు
యీవలేది యావలేది యితనిదాసునికి
రేకు: 0104-02 భైరవి సం: 02-020 వైరాగ్య చింత
పల్లవి: నీదాస్యమొక్కటే నిలిచి నమ్మఁగలది
శ్రీదేవుఁడవు నీచిత్తము నాభాగ్యము
చ. 1: అనుష్ఠానములు గతియని నమ్మి చేసితినా
తనువిది మలమూత్రములప్రోగు
జనులలో నుత్తమపుజన్మమే నమ్మితినా
వొనరఁ గర్మమనే వోఁదానఁ బడినది
చ. 2: చదువుల శాస్త్రముల జాడలు నమ్మితినా
పొదలిన మతముల పోరాట మది
మదిమది నుండిన నామనసే నమ్మితినా
అదియును నింద్రియాల కమ్ముడువోయినది
చ. 3: పుత్రదారధనధాన్యభూములు నమ్మితినా
పాత్రమగు రుణానుబంధము లవి
చిత్రముగ నన్నుఁ గావు శ్రీవేంకటేశ నీవే
పత్రపుష్పమాత్రమే నాభక్తియెల్లా నీకు
రేకు: 0104-03 మలహరి సం: 02-021 అంత్యప్రాస
పల్లవి: కంచూఁ గాదు పెంచూఁ గాదు కడుఁబెలుచు మనసు
యెంచరాదు పంచరాదు యెట్టిదో యీమనసు
చ. 1: పట్టఁ బసలేదు చూడ బయలుగాదీమనసు
నెట్టనఁ బారుచునుండు నీరూఁ గాదీమనసు
చుట్టిచుట్టి పాయకుండుఁ జుట్టమూఁ గాదీమనసు
యెట్టనెదుటనే వుండు నేఁటిదో యీమనసు
చ. 2: రుచు లెల్లాఁ గానుపించు రూపు లేదు మనసు
పచరించు నాసలెల్లాఁ బసిఁడి గాదీమనసు
యెచటాఁ గరఁగదు రాయీఁ గాదు మనసు
యిచటా నచటాఁ దానే యేఁటిదో యీమనసు
చ. 3: తప్పక నాలోనుండు దైవముఁ గాదు మనసు
కప్పిమూఁటగట్టరా దు గాలీఁ గాదు మనసు
చెప్పరానిమహిమలశ్రీవేంకటేశుఁ దలఁచి
యిప్పుడిన్నిటా గెలిచె నేఁటిదో యీమనసు
రేకు: 0104-04 గుజ్జరి సం: 02-022 ఉపమానములు
పల్లవి: కలదిదివో సుఖము గలిగినను గర్భము నిలువక మానునా
మలసి కామ్యకర్మములకుఁజొచ్చిన మగుడఁ బుట్టువులు మానునా
చ. 1: పరగ నింద్రజిత్తుఁడు హనుమంతుని బ్రహ్మాస్త్రంబునఁ గట్టి
అరయ నందుపై మోకులు గట్టిన నలబ్రహ్మాస్త్రము వదలె
పరిపరివిధముల నిటువలెనే హరిఁ బ్రపత్తి నమ్మిన నరుఁడు
తిరుగఁ గర్మమార్గమునకుఁ జొచ్చిన దేవుఁడు దనవాత్సల్యము వదలు
చ. 2: అలరిన సంసారభ్రమ విడిచి యడవిలోన జడభరతుఁడు
తలఁపుచు నొకయిఱ్ఱిఁ బెంచినంతనే తనకును నారూపు దగిలె
ములుగుచు లంపటములు దెగ విడిచి మోక్షము వెదకెడి నరుఁడు
వలవని దుస్సంగతులు పెంచినను వాసన లంటక మానునా
చ. 3: అటుగన తాఁ బట్టిన వ్రత ముండఁగ నన్యమతము చేపట్టినను
నటనల నెందునుఁ బొందక జీవుఁడు నడుమనె మోరుఁడైనట్లు
తటుకస శ్రీవేంకటపతి నొక్కని దాస్యము భజియించిన నరుఁడు
ఘటనల నాతని కైంకర్యములకు కడుఁబాత్రుఁడు గాక మానునా
రేకు: 0104-05 శ్రీరాగం సం: 02-023 అధ్యాత్మ
పల్లవి: చెల్లఁబో యీజీవు లిలఁ జేసిన పాప మెంతో
వుల్లమున నున్న హరి వూరికే దవ్వాయ
చ. 1: కన్నచోటనే హరి కలఁడన్నవారికి
విన్నచోటనే విష్ణుడు వివేకులకు
వున్నతిఁ గొలువలేక వొద్దనుండఁగాఁ గొందరు
మిన్నుమీఁద వెదకేరు మితిమీఱఁ జదివి
చ. 2: పట్టినదే బ్రహ్మము పరమార్థవేత్తలకు
తిట్టులోనా దైవము దివ్యులకును
ముట్టి చేత మొక్కలేరు ముందటనే వుండఁగాను
బట్టబయలు పాకేరు బహుకర్మవిదుల
చ. 3: ఊపిరిలో దేవుఁడున్నాఁడు యోగీంద్రులకు
దాపున నున్నాఁడు హరిదాసులకును
యేపున శ్రీవేంకటేశు నేచి శరణనలేక
చాపలాన వెదకేరు సకలదేవతల
రేకు: 0104-06 లలిత సం: 02-024 అన్నమయ్య స్తుతి
పల్లవి: శరణంటి మాతని సమ్మంధమునఁ జేసి
మరిగించి మము నేలి మన్నించవే
చ. 1: సకలవేదములు సంకీర్తనలు చేసి
ప్రకటించి నినుఁ బాడి పావనుఁడైనఁ-
అకలంకుఁడు తాళ్లపాకన్నమాచార్యుల
వెకలియై యేలిన శ్రీవేంకటనిలయ
చ. 2: నారదాది సనకసనందనాదులవలె
పేరుపడి నిన్నుఁ బాడి పెద్దలైనట్టి
ఆరీతిఁ దాళ్లపాకన్నమాచార్యుల
చేరి యేలినయట్టి శ్రీవేంకటనిలయ
చ. 3: సామవేదసామగాన సప్తస్వరములను
బాముతో నీసతి నిన్నుఁ బాడినయట్టి
ఆముకొన్న తాళ్లపాకన్నమాచార్యుల
వేమరు మెచ్చిన శ్రీవేంకటనిలయా