తాళ్ళపాక పదసాహిత్యం/రెండవ సంపుటం/రేకు 103
రేకు: 0103-01 శుద్ధవసంతం సం: 02-013 అధ్యాత్మ
పల్లవి: చీ చీ వివేకమా చిత్తపు వికారమా
యేచి హరిఁ గొలువక హీనుఁడాయ జీవుఁడు
చ. 1: బతికేనంటాఁ బోయి పయిఁడి వుచ్చుక తన-
పతి యవసరములఁ బ్రాణమిచ్చీని
బతు కందులోన నేది పసిఁడి యెక్కడ నుండు
గతి హరిఁ గొలువక కట్టువడె జీవుఁడు
చ. 2: దొడ్డవాఁడనయ్యేనని దొరలఁ గొలిచి వారి-
కడ్డము నిడుపు మొక్కు నతిదీనుఁడై
దొడ్డతన మేది యందు దొర యాడనున్నవాఁడు
వొడ్డి హరిఁ గొలువక వోడుపడె జీవుఁడు
చ. 3: చావనేల నోవనేల సారెఁ గిందుపడనేల
యీవల శ్రీవేంకటేశుఁడింట నున్నాఁడు
దేవుఁ డాతఁడే నేఁడు తెలిసి కొలిచేఁ గాని
భావించ కిన్నాళ్ళదాఁకా భ్రమఁబడె జీవుఁడు
రేకు: 0103-02 రామక్రియ సం: 02-014 కృష్ణ
పల్లవి: అనుచు నిద్దరునాడే రమడలవలెనే
మొనసి యివెల్లాఁ జూచి మ్రొక్కిరి బ్రహ్మాదులు
చ. 1: రాముఁడ పండ్లు నాకు రండు వెట్టరా
యేమిరా యిట్లానె నాకు యిత్తువా నీవు
ప్రేమపుతమ్ముఁడఁ గాన పిన్ననే నీకు
యీమాట మఱవకు యిందిరాకృష్ణుఁడా
చ. 2: యెక్కిన వుట్టిపై నన్ను నెక్కించరా వోరి
వుక్కునఁ బడేవు రాకు వద్దురా నీవు
పక్కున మొక్కేరా నీపయిఁడికాళ్ళకు వోరి
అక్కతోఁ జెప్పేఁ గాని అందుకొనే రారా
చ. 3: యెవ్వరు వొడవో సరి నిటు నిలుతమురా వోరి
నివ్వటిల్ల నీవింత నిక్కవొద్దురా
రవ్వల శ్రీవేంకటాద్రిరాయఁడనేరా అయితే-
యివ్వల నీకంటేఁ బెద్ద యిది నీ వెఱఁగవా
రేకు: 0103-03 ధన్నాసి సం: 02-015 అధ్యాత్మ
పల్లవి: పెట్టిననీ వెఱుఁగుదు పెనుదిక్కు
జట్టిగా శ్రీహరి నీకు శరణు చొచ్చితిమి
చ. 1: కర్మమూలమైనట్టి కాయము మోచి నేను
కర్మము విడువఁబోతే కడుసంగతా
మర్మ మెఱిఁగిన నీవే మాయలఁ గట్టుండఁగాను
పేర్మి నే విడువఁబోతే బిగియదా కట్టు
చ. 2: బంధమూలమైనట్టి ప్రపంచమందునుండి
బంధముఁ బాసేనంటేఁ బాసునా అది
అంధకారమైనట్టి అజ్ఞానానఁ దోసితివి
అంధకారమున వెలుఁ గరసితేఁ గలదా
చ. 3: నిచ్చలు నీసంసారపు నీరధిలోన మునిఁగి
చొచ్చి వెళ్లి చేరేనంటేఁ జోటు గలదా
యిచ్చట శ్రీవేంకటేశ యిహమందే పరమిచ్చి
అచ్చు మోపి యేలఁగా నే నన్నియుఁ దెలిసితి
రేకు: 0103-04 ముఖారి సం: 02-016 వైరాగ్య చింత
పల్లవి: వెనకేదో ముందరేదో వెఱ్ఱి నేను నా-
మనసు మరులు దేర మందేదొకో
చ. 1: చేరి మీఁదటిజన్మము సిరులకు నోమేఁ గాని
యే రూపై పుట్టుదునో యెఱఁగ నేను
కోరి నిద్రించఁ బరచుకొన నుద్యోగింతుఁ గాని
సారె లేతునో లేవనో జాడ దెలియ నేను
చ. 2: తెల్లవారినప్పుడెల్లా తెలిసితిననేఁ గాని
కల్లయేదో నిజమేదో కాన నేను
వల్ల చూచి కామినుల వలపించేఁ గాని
మొల్లమై నామేను ముదిసిన దెరఁగ
చ. 3: పాపాలు చేసి మఱచి బ్రదుకుచున్నాఁడఁ గాని
వైపుగఁ జిత్రగుప్తుడు వ్రాయు టెఱఁగ
యేపున శ్రీవేంకటేశు నెక్కడో వెతకేఁ గాని
నాపాలిదైవమని నన్నుఁ గాచు టెఱఁగ
రేకు: 0103-05 మలహరి సం: 02-017 అధ్యాత్మ
పల్లవి: అంతరుమాలినయట్టి అధములాల
పొంత సంతకూటమి పొరిచూపు గాదా
చ. 1: కనక మిత్తడితోడ కలయ సరిదూఁచితే
అనువవునా అది దోషమవుఁ గాక
ఘనుఁడైన హరితోఁ గడుహీనదేవతల
ననిచి సరివెట్టితే నయమవునా భువిని
చ. 2: పట్టభద్రుఁడు గూర్చుండే బలుసింహాసనముపై
వెట్టిబంటుఁ బెట్టేవారు వెఱ్ఱులేకారా
గట్టిగా శ్రీహరితోడ కలగంపదేవతలఁ
బెట్టి కొలుచుట విందువెట్టి పగగాదా
చ. 3: కొంచక సింహముండేటి గుహ నుండవచ్చునా
పొంచి నక్కలకెల్ల బొక్కలే కాక
అంచెల శ్రీవేంకటేశుఁ డాత్మలోనే వుండఁగాను
కొంచపుదైవాల పలువంచలనే కాక
రేకు: 0103-06 దేవగాంధారి సం: 02-018 వేంకటగానం
పల్లవి: కల్లమాడ దొడ్డముద్ర కటకటా
చెల్లుబడి కల్లలు చెప్పేరు లోకులు
చ. 1: యిప్పుడేలే బ్రహ్మదేవుఁడిట్టే వుండఁగ మీఁదటి-
వొప్పగు బ్రహ్మపట్టము వొకరికి వెచ్చపెట్టి
అప్పటి మూఁడుమూర్తులయందులో నీతని సరి-
చెప్పఁబొయ్యే రీమాట చెల్లునా లోకులకు
చ. 2: కైలాసము రుద్రుఁడుగల బ్రహ్మాండకోట్లు
పోలించి విష్ణుఁడు కడుపున నించుకుండఁగాను
చాలి మూఁడుమూర్తులలో సరి యీతఁ డంటాను
కూళలై యాడేరు గాక కూడునా లోకులకు
చ. 3: ఘనుఁ డీతనిపాదము గడిగె బ్రహ్మదేవుఁడు
మునుముట్టి శిరసున మోఁచె శివుఁడు
వొనర మూఁడుమూర్తులం దొకఁడు శ్రీవేంకటేశుఁ-
డనుమాట యిది తగవవునా లోకులకు