తాళ్ళపాక పదసాహిత్యం/మొదటి సంపుటం/రేకు 95

వికీసోర్స్ నుండి


రేకు: 0095-01 లలిత సం; 01-471 అంత్యప్రాస


పల్లవి:
ఎక్కెఁగా రాఁగా రాఁగా యిందాఁకాఁ దగులు
యిక్కువ శ్రీహరిమాయ నింకనెంతో తగులు

చ.1:
తెగనికర్మమునకు దేహము దగులు
తగినదేహమునకు తరుణితో తగులు
సాగిసి యారెంటికి సుతు లొక్కతగులు
అగడాయఁ గనకము అన్నిటితో తగులు

చ.2:
యింతటిసంసారికి యిల్లొక్కతగులు
బంతికి నందు గలిగె పాఁడిపంట తగులు
చెంత నీలంపటానకు క్షేత్రము తగులు
సంతగూడేదాసదాసీజనులెల్లా దగులు

చ.3:
మొదల జీవుం డొక్కఁడే మోపులాయఁ దగులు
వదలనిబంధములు వడ్డివారెఁ దగులు
వుదుటిహముఁ బరము నొక్కయందె తగులు
అదె శ్రీవేంకటపతి యంతరాత్మ తగులు


రేకు: 0095-02 గుండక్రియ సం: 01-472 వైరాగ్య చింత


పల్లవి:
ఎవ్వరివాఁడో యెఱఁగరాదు
అవ్వలివ్వలిజీవుఁ డాటలో పతిమే

చ.1:
ధర జనించకతొలుత తనుఁ గానరాదు
మరణమందినవెనక మఱి కానరాదు
వురువడిదేహముతో నుండినయన్నాళ్లే
మరలుజీవునిబదుకు మాయవో చూడ

చ.2:
యిహములో భోగించు నిందుఁ గొన్నాళ్లు
మహిమ పరలోకమున మలయుఁ గొన్నాళ్లు
తహతహలఁ గర్మబంధములఁ దగిలినయపుడే
అహహ దేహికిఁ బడుచులాటవో బదుకు

చ.3:
సంతానరూపమై సాగు ముందరికి
కొంత వెనకటిఫలము గుడువఁ దాఁ దిరుగు
యింతటికి శ్రీవేంకటేశుఁడ డంతర్యామి
బంతి నితనిఁ గన్నదుకువో బదుకు


రేకు: 0౦95-03 శంకరాభరణం సం: 01-473 దశావతారములు


పల్లవి:
ఎంత భక్తవత్సలుఁడ విట్టుం డవలదా
వింతలు నీసుద్దులెల్లా వినఁబోతే నిట్టివే

చ.1:
యిల నసురారియనేయీబిరుదు చెల్లె నీకు
బలివిభిషణాదులపాలికే చెల్లదు
కెలసి అవులే నీవు గెలుతు వెందరినైనా
తలచి చూడ నీదాసుల కోడుదువు

చ.2:
యిందరిపాలిటికిని యీశ్వరుఁడ వేలికవు
పందవై యర్జునుబండిబంట వైతివి
వందనకు నౌలే దేవతలకే దొరవు
అందపునీదాసులకు నన్నిటా దాసుఁడవు

చ.3:
కడుపులో లోకముకన్న తండ్రి విన్నిటాను
కొడుకవు దేవకికిఁ గోరినంతనే
తడవితే వేదములు తగిలేబ్రహ్మమవు
విదువనిమాకైతే శ్రీవేంకటాద్రిపతివి


రేకు: 0095-04 సాళంగనాట సం: 01-474 రామ


పల్లవి :
రాముఁడిదే లోకాభిరాముఁ డితఁడు
గోమున పరశురాముకోప మార్చెనటరే

చ. 1:
యీతఁడా తాటకిఁ జించె యీపిన్నవాడా
ఆతల సుబాహుఁ గొట్టి యజ్ఞముఁ గాచె
చేతనే యీకొమరుఁడా శివునివిల్లు విఱిచె
సీతకమ్మఁ బెండ్లాడె చెప్పఁ గొత్త గదవె

చ. 2:
మనకౌసల్యకొడుకా మాయమృగము నేసె
దనుజుల విరాధుని తానే చెఱిచె
తనుమాడె నేడుదాళ్లు తోడనే వాలి నడఁచె
యినకులుఁ డితఁడా యెంతకొత్త చూడరే

చ. 3:
యీవయసుతానే యాయెక్కువజలధి గట్టి
రావణు జంపి సీత మరలఁ దెచ్చెను
శ్రీవేంకటేశుఁ డితఁడా సిరుల నయోధ్య యేలె
కావున నాటికి నేడు కంటి మిట్టె కదరే


రేకు: 0095-05 లలిత సం; 01-475 అధ్యాత్మ


పల్లవి:
ఏమి సేసినా నీరుణ మెట్టు వాసును
కామితఫలద వోకరుణానిధి

చ.1:
చేరి కర్మములు నన్ను చెఱవట్టుకుండగాను
పేరువాడి వచ్చి విడిపించుకొంటివి
సారె తగవట్టె కాదా శక్తిగలవారెల్లా
నారయ దీనులఁ గంటే నడ్డమై కాతురు

చ.2:
అరులు పంచేంద్రియము లందు నిందుదియ్యఁగాను
వెరవుతోడ వెనక వేసుకొంటివి
పరగ నట్టేకాదా బలువులైనవారు
అరయఁ బేదలకైన ఆపద మానుతురు

చ.3:
పలుజన్మములే నన్ను పరి అరికట్టుకోఁగా
తొలగదోసి నాకు దోడైతివి
యెలమి శ్రీవేంకటేశ యిల శూరులైనవారు
బలుభయ మిందరికిఁ బాపుచుందురు


రేకు: 0095-06 ముఖారిసం: 01-476 ఉపమానములు


పల్లవి:
దైవము పుట్టించినట్టి తన సహజమే కాక
కోవిదునికైనా జాలిగుణ మేల విడుచు

చ.1:
ఆరయఁ బంచదార సద్దుక తినఁబోతే
చేరరాని ముష్టిగింజ చేఁదేల మాను
సారమైన చదువులు సారె సారెఁ జదివినా
గోరపు దుష్టునికి కోపమేల మాను

చ.2:
నివ్పు దెచ్చి వొడిలోన నియమానఁ బెట్టుకొంటే
యెప్పుడును రాఁజుఁగాక యిది యేల మాను
ముప్పిరిఁ బాతకుఁడైన మూఢుఁడెన్ని యాచారాలు
తప్ప కెంతసేసినాను దయ యేల కలుగు

చ.3:
యింటిలోనఁ గొక్కు దెచ్చి యిరవుగఁ బెట్టుకొంటే
దంటయై గోడలు వడఁదవ్వ కేలమాను
గొంటరై శ్రీవేంకటేశుఁ గొలువకుండినవాఁడు
తొంటి సంసారవుఁగాక దొర యేఁటి కౌను