Jump to content

తాళ్ళపాక పదసాహిత్యం/మొదటి సంపుటం/రేకు 79

వికీసోర్స్ నుండి


రేకు: 0079-01 రామక్రియ సం: 01-376 వైరాగ్య చింత


పల్లవి:
నీయాజ్ఞ దలమోచి నీ దేహధారి నైతి
యీయేడ గోవిందుఁడ నే నీడేరేదెట్లో

చ.1:
తనువు వేసరినాను తలఁపు వేసరదు
ధనముగడించెడితరితీపున
చెనకి మగఁడు విడిచిన మామ విడువని-
పనియాయ హరి నాబదుకుజాడ యెట్లో

చ.2:
పాయము ముదిసిననాను భావము ముదియదు
వేయైనా సంసారవిషయాలను
వోయయ్య కలివోసినావుట్లదిక్కు చూచేది
మాయదాయ నిఁక నామనసుజాడెట్లో

చ.3:
కడలేనినావిధులు కన్నులారఁ జూచి నీవు
నడుమ శ్రీవేంకటేశ నన్ను నేలితి
నొడుగులు దప్పినాను నోముఫలము దప్పని-
అడియాల మబ్బె నాకు నానతిచ్చి తెట్లో


రేకు: 0079-02 భూపాళం సం; 01-377 మేలుకొలుపులు


పల్లవి:
మేదిని జీవులఁగావ మేలుకోవయ్యా
నీదయే మాకెల్ల రక్ష నిద్ర మేలుకోవయ్యా

చ.1:
తగుగోపికల కన్నుఁదామరలు వికసించె
మిగుల సూర్యనేత్రుఁడ మేలుకోవయ్యా
తెగువ రాక్షసులనే తిమిరము విరియఁగ
నెగడిన పరంజ్యోతి నిద్ర మేలుకోవయ్యా

చ.2:
ఘనదురితపు నల్లఁగలువలు వికసించె
మినుకు శశివర్దుఁడ మేలుకోవయ్యా
పనివడి వేదాలనే పక్షులెల్లాఁ బలుకఁగ
జనక యాశ్రితపారిజాత మేలుకోవయ్య

చ.3:
వరలక్ష్మికుచచక్రవాకము లొండొంటి రాయ
మెరయు దోషారహిత మేలుకోవయ్యా
పొరసి నీవు నిత్యభోగములు భోగించ
నిరతి శ్రీవేంకటేశ నేఁడు మేలుకోవయ్యా


రేకు: 0079-03 లలిత సం: 01-378 అంత్యప్రాస


పల్లవి:
ఆతుమ సంతసపెట్టుటది యెఱుక, తా-
నేతెరవు నొల్లకుండు టిదియే యెఱుక

చ.1:
ముంచినబంధములలో ముణుఁగుడువడక తా-
నంచల విడఁదన్ను టది యెఱుక
చంచలపువిషయాల సగ్గుడుముగ్గుడుగాక
యెంచిఁ హరిఁదలపోయు టిదియే యెఱుక

చ.2:
పాయనియర్ధములకు బంటుబంటై తిరుగక
ఆయతమై మోసపోని దది యెఱుక
పాయపుఁగామినులతోఁ బలుమారుఁ జేయుపాందు
హేయమనితలపోయు టిదియే యెఱుక

చ.3:
థరమీఁదఁగల ప్రాణితతుల నొప్పించక
ఆరయఁగ సముఁడగు టది యెఱుక
గరిమల శ్రీవేంకటపతిదాసుఁడై
యిరవొంద సుఖించు టిదియే యెఱుక


రేకు: 0079-04 రామక్రియ సం; 01-3/9 అథ్యాత్మ


పల్లవి:
ఇందిరా నాయక యిదివో మాపాటు
చెంది నీవే గతి చేకొనవయ్యా

చ.1:
తీసీఁ గోరికతీదీపు లొకవంక
లాసీ సంసారలంపటము
మూసీఁ గర్మము మునుకొని పరచింత
సేసేదేమిఁకఁ జెప్పే దేమి

చ.2:
వంచీ నాసలు వలసినచోటికి
పొంచీ దుర్గుణబోగములు
ముంచీ యౌవనమోహాంధకారము
యెంచేదేమి సోదించేదేమి

చ.3:
యెఱిఁగీఁ జిత్తము యించుకించుక నిన్ను
మఱవనినీపైభక్తి మతినుండఁగా
నెఱి శ్రీవేంకటపతి నీవే కాతువుగాక
వెఱచి నేఁజేసే విన్నపమేమి


రేకు: 0079-05 రామక్రియ సం: 01-380 నామ సంకీర్తన


పల్లవి:
నారాయణాయ నమో నమో నానాత్మనే నమోనమో
యీరచనలనే యెవ్వరు దలఁచిన యిహపర మంత్రములిందరికి

చ.1:
గోవిందాయ నమో నమో గోపాలాయ నమో నమో
భావజగురవే నమో నమో ప్రణవాత్మనే నమో నమో
దేవేశాయ నమో నమో దివ్యగుణాయ నమో యనుచు
యీవరుసలనే యెవ్వరు దలఁచిన యిహపరమంత్రము లిందరికి

చ.2:
దామోదరాయ నమో నమో ధరణీశాయ నమోనమో
శ్రీమహిళాపతయే నమో శిష్ట రక్షిణే నమో నమో
వామనాయ తే నమో నమో వనజాక్షాయ నమో నమో
యీమేరలనే యెవ్వరు దలఁచిన యిహపరమంత్రము లిందరికి

చ.3:
పరిపూర్ణాయ నమో నమో ప్రణవగ్రాయ నమోనమో
చిరంతన శ్రీ వేంకటనాయక శేషశాయినే నమోనమో
నరకధ్వంసే నమో నమో నరసింహాయ నమో నమో
యిరవుగ నీగతి నెవ్వరు దలఁచిన యిహపరమంత్రము లిందరికి


రేకు: 0079-06 లలిత సం: 01-381 శరణాగతి


పల్లవి:
అంతర్యామీ అలసితి సాలసితి
యింతట నీ శరణిదె చొచ్చితిని

చ.1:
కోరిన కోర్కులు కోయని కట్లు
తీరవు నీవవి తెంచక
భారపుఁ బగ్గాలు పాపపుణ్యములు
నేరుపులఁ బోనీవు నీవు వద్దనక

చ.2:
జనుల సంగములఁ జక్కరోగములు
నిను విడువవు నీవు విడిపించక
వినయపు దైన్యము విడువని కర్మము
చనదిది నీవిటు సంతపరచక

చ.3:
మదిలో చింతలు మయిలలు మణుఁగులు
వదలవు నీవవి వద్దనక
యెదుటనేఁ శ్రీవేంకటేశ్వర నీవదె
అదనఁ గాచితివి అట్టిట్టనక